ఒకే కథలో ధ్వనిస్తున్న రెండు గొంతులు

ఓల్గా
ఓల్గా

king samvarna

తపతి-సంవరణుల కథను మరీ లోతుగా అక్కర్లేదు, పై పైనే పరిశీలించండి…కొన్ని సందేహాలు కలుగుతాయి.

ఉదాహరణకు, తపతి కనుమరుగయ్యాక సంవరణుడు మూర్చితుడై పడిపోయాడు, మంత్రి అతన్ని వెతుక్కుంటూ వచ్చాడు, ఉపచారాలు చేశాడు, సంవరణుడు అక్కడే ఉండిపోడానికి నిశ్చయించుకుని మంత్రిని, పరివారాన్ని పంపేశాడు. ఆ తర్వాత వశిష్టుని తలచుకున్నాడు.

సాధారణబుద్ధితో చూద్దాం. నిజానికి  సంవరణుడు వశిష్టుని తలచుకో నవసరమే లేదు. మంత్రితో వశిష్టునికి కబురు పెడితే చాలు. వాస్తవంగా అదే చేసి ఉంటాడు. కానీ కథకుడు ఇక్కడ సంవరణునికో, లేదా వశిష్టునికో, లేదా ఇద్దరికీనో ఒక మహిమను, మాంత్రికతను ఆపాదిస్తున్నాడు. అలా ఆపాదించడం అతనికి ఇష్టం!

కాకపోతే, ఆ ఆపాదించడం కూడా, అది  ‘ఆపాదన’ అనే సంగతి తెలిసిపోయేలా చేస్తున్నాడు.  ఆ తర్వాత వశిష్టుడు పన్నెండు రోజులకు సంవరణుని దగ్గరకు వచ్చాడని చెప్పడం ద్వారా కూడా అది ఆపాదన అనే సంగతి తెలిసిపోతూ ఉండచ్చు.

వశిష్టుడు వచ్చాడనీ, సంవరణుడు తపతి మీద మనసు పడిన సంగతిని యోగదృష్టితో తెలుసుకున్నాడనీ కథకుడు చెబుతున్నాడు. ఇక్కడ యోగదృష్టి అవసరమా? ఎందుకంటే, తను తపతి మీద మనసుపడి ఆమెను పెళ్లాడదలచుకున్నాడు కనుక, అది జరిగేలా చూడడం కోసమే కదా వశిష్టునికి సంవరణుడు కబురుచేసింది? వశిష్టునికి ఆ విషయం తన నోటితోనే చెప్పి ఉండాలి కదా? వశిష్టుడు యోగదృష్టితో చూసి మరీ ఆ విషయం తెలుసుకోవలసిన అవసరం ఏముంది? ఏముందంటే, అలా చెప్పడం కథకునికి ఇష్టం!

ఆ తర్వాత చూడండి…వశిష్టుడు అప్పటికప్పుడు బయలుదేరి సూర్యమండలానికి వెళ్ళాడు. సంవరణుడు తలచుకోగానే పన్నెండు రోజులకు అతని దగ్గరకు వశిష్టుడు వెళ్లాడని చెప్పిన కథకుడు, ఆయన సూర్యమండలానికి ఎన్ని రోజుల్లో వెళ్లాడో, ఎలా వెళ్లాడో చెప్పలేదు. కానీ తిరుగు ప్రయాణంలో మాత్రం, నిమిషానికి మూడువందల అరవైనాలుగు యోజనాల దూరం ప్రయాణించే సూర్యరథంలో తపతిని వెంటబెట్టుకుని వశిష్టుడు సంవరణుని దగ్గరకు వచ్చాడని చెప్పాడు. వెళ్ళేటప్పుడు అవసరం లేకపోయిన సూర్యరథం, వచ్చేటప్పుడు ఎందుకు అవసరమైందనే ప్రశ్న ఇక్కడ రావడం సహజమే. వశిష్టుడు వెళ్ళేటప్పుడు ఎలా వెళ్ళినా, వచ్చేటప్పుడు మాత్రం సూర్యుడు అతని మీద గౌరవంతోనే కాక, తన హోదాకు తగినట్టుగా తన రథమిచ్చి కూతురితోపాటు పంపించాడా? లేక, వెళ్ళేటప్పుడు వశిష్టుడు తన మంత్రశక్తితో వెళ్ళినా, వచ్చేటప్పుడు తపతి కూడా తన వెంట కూడా ఉంది కనుక, ఆమెకు ఆ మంత్రశక్తి లేదు కనుక సూర్యరథంలో తిరిగి వచ్చాడా? అదే అయితే, సూర్యుని కూతురికి మంత్రశక్తి లేదని ఎలా అనుకోవాలి? లేక, పెళ్లి కూతురు కనుక ఆమెను రథంలో పంపించాలని సూర్యుడు అనుకున్నాడా? ఈ ప్రశ్నలకు సమాధానాలు దొరికే అవకాశం లేదు. అసలిలాంటి ప్రశ్నల జోలికి వెళ్లకుండా సింపుల్ గా చెప్పుకుంటే, వశిష్టుడు నిముషానికి మూడువందల అరవై నాలుగు యోజనాల దూరం ప్రయాణించే సూర్యరథంలో తిరిగి వచ్చాడని చెప్పడం…కథకునికి ఇష్టం!

కథకునికి ఇష్టం అన్నానా? చిన్న సవరణ. కథ వింటున్న శ్రోతలకూ అదే ఇష్టం. కథకుడు-శ్రోత ఇక్కడ ఒకరికొకరు పూర్తిగా అనురూపులు. అంటే ఒకరికొకరు అతికినట్టు సరిపోయేవారు. క్లుప్తంగా చెప్పాలంటే, తను తపతి మీద మనసుపడ్డాడని సంవరణుడు తన నోటితో వశిష్టుడంతటి వాడికి  చెబితే అది శ్రోతకు నచ్చదు. ఉప్పు కారం లేని వంటకంలా చప్పగా ఉంటుంది. కనుక వశిష్టుడు ఆ విషయాన్ని యోగదృష్టితో తెలుసుకున్నాడని చెబితేనే రంజుగా ఉంటుంది.

ఎలాగంటే…మహాభారతంలో అగస్త్యుడి కథ ఉంది. అగస్త్యుడు పరిసరాల పరిజ్ఞానం బాగా ఉన్నవాడు. దారీ తెన్నూ కనిపించని దుర్గమారణ్యాలు, ఆ అరణ్యాలలో ప్రమాదకరులైన తెగ జనాలు ఉండే ఆరోజుల్లో, అది చాలా విలువైన పరిజ్ఞానం. అగస్త్యుడు బహుశా వింధ్య దాటి దక్షిణాపథానికి వెళ్లడానికి అనువైన దారి కనిపెట్టిన ప్రథముడూ, లేదా ప్రముఖుడూ అయుంటాడు. అదే వింధ్యగర్వభంగం కథగా పురాణాలకు ఎక్కి ఉంటుంది. అగస్త్యుని పరిసరజ్ఞానాన్ని ధ్రువీకరించే మరో కథ కూడా ఉంది. అదేమిటంటే…కాలకేయులనే రాక్షసులు పగలు ‘సముద్రగర్భం’లో దాగి ఉంటూ రాత్రిపూట మున్యాశ్రమాలపై పడి విధ్వంసం సృష్టిస్తున్నారు. వాళ్ళ బెడద ఎలా వదిలించుకోవాలో తెలియక దేవతలు బ్రహ్మను ఆశ్రయించారు. అగస్త్యుని ప్రార్థించమని బ్రహ్మ చెప్పాడు. వారు అలాగే చేశారు. అప్పుడు దేవతలు, యక్షులు, సిద్ధులు, సాధ్యులు వగైరాలను అగస్త్యుడు వెంటబెట్టుకుని వెళ్ళి కాలకేయులుండే చోటు చూపించాడు. అప్పుడు దేవతలు వాళ్లపై దాడి చేసినప్పుడు కొందరు చనిపోగా కొందరు పారిపోయారు.

కథకుడు ఈ కథ చెబుతున్నాడనుకోండి.  కథ మాంచి పట్టు మీద ఉన్నప్పుడు, ‘అగస్త్యుడు కాలకేయులు ఉండే చోటు దేవతలకు చూపించా’డని మాత్రమే చెబితే శ్రోతలకు నచ్చదు. అందులో ఒక అద్భుతత్వం, ఒక వైచిత్రి, ఒక మహిమ ఉండాలి. అందులోనూ ఎవరి గురించి చెబుతున్నాడు? అగస్త్యుడంతటి వాడి గురించి! కనుక అందులో పైన చెప్పినవి తప్పనిసరిగా ఉండవలసిందే. అందుకే ‘అగస్త్యుడు ఏకంగా సముద్రజలాలనే తాగేశాడనీ, దాంతో కాలకేయులు బయటపడ్డారనీ’ కథకుడు చెబుతాడు. అప్పుడు శ్రోతలు ‘ఆహా’ అంటారు.

ఆదిమకాలంలో కవిత్వమైనా, కథ అయినా, పురాణమైనా ఏకకర్తృకాలు కావు; ద్వికర్తృకాలూ, బహుకర్తృకాలూ కూడా. అందులో స్థాయీభేదాలు కలిగిన శ్రోతలు కూడా భాగస్వాములుగా ఉంటారు. తమ స్పందనరూపంలో కథకుడి ఊహలోలేని అదనపు కల్పనలను, లేదా శైలినీ, భాషనూ కథకు జోడించే అనివార్యతను కల్పిస్తూ ఉంటారు. ఆవిధంగా కథకుడు ఒక్కోసారి అప్పటికప్పుడు కథను improvise చేసుకుంటూపోతాడు. ప్రారంభంలో తను అనుకున్న వస్తువూ, రూపమూ, శైలీ, శిల్పమూ, భాషా మొదలైనవి చివరికి వస్తున్నకొద్దీ మారిపోతాయి. మొదట్లో వాగ్రూపంలో ఉంటూ వచ్చిన పురాణ, ఇతిహాస కథలకు అనేక పాఠాంతరాలు, ఒకే కథకు భిన్న రూపాలు, ఉపకథలు వగైరాలు ఏర్పడడానికి ఇదే కారణం కావచ్చు.

శ్రోతలు కూడా కథనంలో భాగస్వాములై కథ ఎలా ఉండాలో నిర్దేశించడం, ఆ శ్రోతలను రంజింప జేయడంలోనే తన అస్తిత్వం ఇమిడి ఉందని తెలిసిన కథకుడు వారి భాగస్వామ్యాన్ని ఆమోదించడం- నేటి సినిమాలకు అన్వయించి చూడండి.  ఒక సినిమా కథను తెరకు ఎక్కిస్తున్నప్పుడు, ఆ కథను ఏ తరగతి ప్రేక్షకులకు ఉద్దేశించారో ఆ తరగతి ప్రేక్షకులు అందులో భాగస్వాములుగా ఉంటారు. అయితే వెనకటి పురాణ కథకుడికీ, నేటి సినీ దర్శకుడికీ; అలాగే నాటి పురాణశ్రోతకూ, నేటి సినీ ప్రేక్షకుడికీ ఒక తేడా ఉంది: నాటి పురాణ కథకుడు, శ్రోత ఎదురెదురుగా, లేదా ఒకే గుంపులో భాగంగా ఉంటారు. అది ప్రత్యక్ష సంబంధం. నేటి సినీ ప్రేక్షకుడు దర్శకుడి ఊహలో ఉంటాడు. అది పరోక్ష సంబంధం. శ్రోతల అభిరుచిని బట్టి, డిమాండ్లను బట్టి పురాణకథను ఎప్పటికప్పుడు improvise చేసుకునే వెసులుబాటు నాటి కథకునికి ఉంటుంది. సినీ దర్శకుడికి అది ఉండదు. కాకపోతే శ్రోత/ప్రేక్షకుల భాగస్వామ్యం మాత్రం సమానం.

ఆదిమకాలంలో కవిత్వమైనా, కథ అయినా, పురాణమైనా ఏకకర్తృకాలు కావు; ద్వికర్తృకాలూ, బహుకర్తృకాలూ కూడా. అందులో స్థాయీభేదాలు కలిగిన శ్రోతలు కూడా భాగస్వాములుగా ఉంటారు. తమ స్పందనరూపంలో కథకుడి ఊహలోలేని అదనపు కల్పనలను, లేదా శైలినీ, భాషనూ కథకు జోడించే అనివార్యతను కల్పిస్తూ ఉంటారు. ఆవిధంగా కథకుడు ఒక్కోసారి అప్పటికప్పుడు కథను improvise చేసుకుంటూపోతాడు. ప్రారంభంలో తను అనుకున్న వస్తువూ, రూపమూ, శైలీ, శిల్పమూ, భాషా మొదలైనవి చివరికి వస్తున్నకొద్దీ మారిపోతాయి. మొదట్లో వాగ్రూపంలో ఉంటూ వచ్చిన పురాణ, ఇతిహాస కథలకు అనేక పాఠాంతరాలు, ఒకే కథకు భిన్న రూపాలు, ఉపకథలు వగైరాలు ఏర్పడడానికి ఇదే కారణం కావచ్చు. శ్రోతలు కూడా కథనంలో భాగస్వాములై కథ ఎలా ఉండాలో నిర్దేశించడం, ఆ శ్రోతలను రంజింప జేయడంలోనే తన అస్తిత్వం ఇమిడి ఉందని తెలిసిన కథకుడు వారి భాగస్వామ్యాన్ని ఆమోదించడం- నేటి సినిమాలకు అన్వయించి చూడండి. ఒక సినిమా కథను తెరకు ఎక్కిస్తున్నప్పుడు, ఆ కథను ఏ తరగతి ప్రేక్షకులకు ఉద్దేశించారో ఆ తరగతి ప్రేక్షకులు అందులో భాగస్వాములుగా ఉంటారు. అయితే వెనకటి పురాణ కథకుడికీ, నేటి సినీ దర్శకుడికీ; అలాగే నాటి పురాణశ్రోతకూ, నేటి సినీ ప్రేక్షకుడికీ ఒక తేడా ఉంది: నాటి పురాణ కథకుడు, శ్రోత ఎదురెదురుగా, లేదా ఒకే గుంపులో భాగంగా ఉంటారు. అది ప్రత్యక్ష సంబంధం. నేటి సినీ ప్రేక్షకుడు దర్శకుడి ఊహలో ఉంటాడు. అది పరోక్ష సంబంధం. శ్రోతల అభిరుచిని బట్టి, డిమాండ్లను బట్టి పురాణకథను ఎప్పటికప్పుడు improvise చేసుకునే వెసులుబాటు నాటి కథకునికి ఉంటుంది. సినీ దర్శకుడికి అది ఉండదు. కాకపోతే శ్రోత/ప్రేక్షకుల భాగస్వామ్యం మాత్రం సమానం.

 

ఇప్పుడు మాంత్రిక శైలి దగ్గరికి మరోసారి వద్దాం. బక్కపలచని హీరోచేత దుక్కల్లా ఉన్న పదిమంది రౌడీలను ఒంటి చేత్తో చితకబాదించడం మన సాధారణ లాజిక్కుకు విరుద్ధమని సినీ దర్శకుడికి తెలుసు. అయితే, అలా తీసినప్పుడే సినిమా హాలు ఈలలతో దద్దరిల్లిపోతుందనీ తెలుసు. ఆవిధంగా సినిమా తీసేవాడికీ, ప్రేక్షకులకీ మధ్య ఒక కెమిస్ట్రీ ఉంటుంది. అదే కెమిస్ట్రీ పురాణకథకునికీ, శ్రోతకీ మధ్య కూడా ఉంటుంది. అత్యధిక సంఖ్యాకులైన ప్రేక్షకులు కోరుకునే సినిమా రూపం ముందు లాజిక్కులేవీ పని చేయవని సినిమా వాళ్ళకు ఎలా తెలుసో, అత్యధిక సంఖ్యాకులైన శ్రోతలు కోరుకునే పురాణ కథారూపం ముందు లాజిక్కులేవీ పనిచేయవని నాటి కథకునికీ బహుశా అలాగే తెలుసు. చెప్పొచ్చేది ఏమిటంటే, సినిమాకు ఒక నిర్ణీత శైలీ, రూపమూ ఎలా ఉంటాయో అలాగే పురాణ కథకూ ఉంటాయి. రెండింటిలోనూ ఒక మాంత్రిక శైలి సమానంగా ఉంటుంది.

ఒక మాంత్రిక శైలి రెడీమేడ్ గా ఎప్పుడైతే ఉందో, దానిని అనేక ఇతరవిధాలుగా కూడా ఉపయోగించుకోవచ్చు. ఉదాహరణకు, వాస్తవాన్ని కప్పి పుచ్చడానికీ, లేదా ఒక అసత్యాన్ని చలామణిలో ఉంచడానికీ కూడా ఉపయోగించుకోవచ్చు. అలాగే, ఒక నాయకునికి లేని సుగుణాలను ఆపాదించి ఆకాశానికి ఎత్తవచ్చు. ఇంకో నాయకునికి లేని లోపాలు ఆపాదించి పాతాళానికి పడదొక్కవచ్చు. రాజకీయనాయకులనే చూడండి, ఎన్నికలముందు ప్రజల సమస్యలనన్నింటినీ పరిష్కరించే మంత్రదండం తమ వద్ద ఉందని నమ్మించడానికి ప్రయత్నిస్తారు. ఎన్నికలై అధికారంలోకి వచ్చాక తమ దగ్గర మంత్రదండం ఏమీ లేదని చేతులెత్తేస్తారు.

ప్రస్తుత తపతి-సంవరణుల కథలో కథకుడు రెడీమేడ్ గా ఉన్న మాంత్రికశైలినే యాంత్రికంగా వాడుకుని ఉండచ్చు. లేదా తపతి పెళ్లాడబోయేది, పాండవుల వంశకర్తలలో ఒకడైన కురుని తండ్రి సంవరణుని కనుక, తపతి ఆదివాసీ గుర్తింపును మరుగుపుచ్చడానికి వాడుకుని ఉండచ్చు. లేదా వశిష్టుని మహిమను చాటడానికి వాడుకొని ఉండచ్చు. లేదా, తపతిని సూర్యుడి కూతురు అనడంలో సూర్యుడు అన్నది గణసంకేతం అని తెలియక సూర్యదేవుడి కూతురని చెప్పి ఉండచ్చు. ఒకవేళ తెలిసినా, పైన చెప్పినట్టు దానిని మరుగుపుచ్చడం అతని ఉద్దేశం కావచ్చు. అంతకంటే ముఖ్యంగా అతడు మాతృస్వామ్య సూచకమైన కథను పితృస్వామ్యానికి మార్చే కీలకమైన ప్రయత్నం చేస్తూ ఉండచ్చు.

ఇక్కడినుంచి మనం మానవ మహేతిహాసంలోని ఒక నిర్ణయాత్మకమైన మలుపులోకి అడుగుపెట్టబోతున్నాం. ఒకవేళ ఆ మలుపులో ఇంకా ముందుకువెళ్ళిపోతే, మళ్ళీ వెనక్కి రావడానికి ఎన్ని వ్యాసాల వ్యవధి పడుతుందో ఈ క్షణాన నా ఊహకు అందడం లేదు. పూర్తిస్థాయిలో అందులోకి వెడతానన్న హామీ కూడా ఇవ్వలేకపోతున్నాను. ముందుకు వెళ్ళడం గురించి కాసేపు మరచిపోయి ప్రస్తుతం ఆ మలుపు దగ్గరే ఉండిపోయి కొన్ని విశేషాలు చెప్పుకుందాం.

***

తపతి-సంవరణుల కథను జాగ్రత్తగా చెవి యొగ్గి వినండి…అందులో మీకు ఒక గొంతు కాదు, రెండు గొంతులు వినిపిస్తూ ఉంటాయి.  ఆ రెండు గొంతులూ పక్క పక్కనే వినిపిస్తూ ఉంటాయి. ఆ గొంతుల్లో ఒక గొప్ప ప్రజాస్వామిక స్ఫూర్తి కూడా ఉంది. ఎలాగంటే, ఒక గొంతు ఇంకో గొంతును ప్రతిఘటించడంలేదు. నొక్కేయడానికి చూడడం లేదు. దేని మానాన అది తన కథను చెప్పుకుంటూ పోతోంది,

ఆ రెండు గొంతుల్లో ఒకటి కథకుడిది…ఇంకొకటి గంధర్వుడిది…

మామూలుగా అయితే, మొత్తం కథంతా కథకుడే చెబుతున్నాడనీ, గంధర్వుడి చేత చెప్పించడం కూడా కథకుడి వ్యూహంలో భాగమే ననీ అనుకుంటాం. కానీ ఎవరి కథనం వారిదే అయినప్పుడు ఆ అవకాశం లేదు. అంటే గంధర్వుడు పూర్తిగా కథకుడి చేతుల్లో లేడు. కథకుడు గంధర్వుడికి కొంత స్వేచ్ఛను అంగీకరించాడు. కనుక కథ చెబుతున్నది ఒకరు కాదు, ఇద్దరు! ఆ ఇద్దరి ప్రయోజనాలు వేరు. ఒకటి చెప్పాలంటే, తపతి సూర్యుని కుమార్తె అనడం ద్వారా సూర్యదేవుని వైపునుంచి, అంటే పురుషస్వామ్యం నుంచి చెప్పడం కథకుడు ఆశించే ప్రయోజనం. అర్జునునితో తను అన్న ‘తాపత్యవంశీకుడివి’ అనే మాటతో కథకు శృతి చేస్తూ తపతి వైపునుంచి, అంటే మాతృస్వామ్యం నుంచి కథ చెప్పడం గంధర్వుడు ఆశించే ప్రయోజనం. గంధర్వుడి వెర్షన్ కు కథకుడు కొంత అవకాశం ఇస్తూనే దానికి తన వెర్షన్ ను జోడించుకుంటూ వెడుతున్నాడు. ఈ ప్రక్రియ మనకు బుర్రకథ లాంటి ఒక కళారూపాన్ని గుర్తుచేస్తూ ఉండచ్చు. అయితే, బుర్రకథలో కథ చెప్పేవాడు ఒక్కడే ఉండి, వంత పాడేవారు ఇద్దరు ఉంటారు కనుక ఇది బుర్రకథ లాంటిది కాదు. ఇక్కడ ఇద్దరూ కథను చెబుతున్నారు. ఇది ఎలాంటి కళారూపమన్న సంగతి ఇప్పటికిప్పుడు చెప్పలేకపోతున్నాను.

మామూలుగా అయితే, మొత్తం కథంతా కథకుడే చెబుతున్నాడనీ, గంధర్వుడి చేత చెప్పించడం కూడా కథకుడి వ్యూహంలో  భాగమే ననీ అనుకుంటాం. కానీ ఎవరి కథనం వారిదే అయినప్పుడు ఆ అవకాశం లేదు. అంటే గంధర్వుడు పూర్తిగా కథకుడి చేతుల్లో లేడు. కథకుడు గంధర్వుడికి కొంత స్వేచ్ఛను అంగీకరించాడు. కనుక కథ చెబుతున్నది ఒకరు కాదు, ఇద్దరు!

ఆ ఇద్దరి ప్రయోజనాలు వేరు. ఒకటి చెప్పాలంటే, తపతి సూర్యుని కుమార్తె అనడం ద్వారా సూర్యదేవుని వైపునుంచి, అంటే పురుషస్వామ్యం నుంచి చెప్పడం కథకుడు ఆశించే ప్రయోజనం. అర్జునునితో తను అన్న ‘తాపత్యవంశీకుడివి’  అనే మాటతో కథకు శృతి చేస్తూ తపతి వైపునుంచి, అంటే మాతృస్వామ్యం నుంచి కథ చెప్పడం గంధర్వుడు ఆశించే ప్రయోజనం. గంధర్వుడి వెర్షన్ కు కథకుడు కొంత అవకాశం ఇస్తూనే దానికి తన వెర్షన్ ను జోడించుకుంటూ వెడుతున్నాడు. ఈ ప్రక్రియ మనకు బుర్రకథ లాంటి ఒక కళారూపాన్ని గుర్తుచేస్తూ ఉండచ్చు. అయితే, బుర్రకథలో కథ చెప్పేవాడు ఒక్కడే ఉండి, వంత పాడేవారు ఇద్దరు ఉంటారు కనుక ఇది బుర్రకథ లాంటిది కాదు. ఇక్కడ ఇద్దరూ  కథను చెబుతున్నారు. ఇది ఎలాంటి కళారూపమన్న సంగతి ఇప్పటికిప్పుడు చెప్పలేకపోతున్నాను.

ఇంకాస్త వివరంగా చూద్దాం. అర్జునునితో నువ్వు తాపత్యవంశీకుడివి అనడం ద్వారా గంధర్వుడు తన వెర్షన్ కు ముందే శృతి చేశాడు. అసలు కథను మాత్రం కథకుడు తన వెర్షన్ తో మొదలుపెట్టాడు. అది: సూర్యుని ఉద్దేశించి సంవరణుడు తపస్సు చేయడం,  సూర్యుడు అతనిని మెచ్చి తన కూతురైన తపతిని అతనికే ఇవ్వాలని నిర్ణయించుకోవడం…ఇలా చెప్పడం ద్వారా కథకుడు అసలు కథకు పురుషస్వామ్యం అనే చట్రాన్ని ముందే తయారు చేసిపెట్టుకున్నాడు.

ఆ తర్వాత గంధర్వుడు తన వెర్షన్ ప్రారంభించాడు. ఆ ప్రారంభించడం కూడా కథకుని చట్రాన్ని తోసి రాజనేలా. ఈ వెర్షన్ ప్రకారం సంవరణుడు వేటకు వెళ్ళాడు. అక్కడ తపతి ఒంటరిగా కనిపించింది. ఆమె అలా ఒంటరిగా కనిపించిందంటే, వర్ణసమాజంలో లేదా మైదాన ప్రాంతాలలో నివసించే స్త్రీ మీద ఉండే నిర్బంధాలు ఏవీ ఆమె మీద లేవు. సంవరణుడు ఆమెపై మనసుపడ్డాడు. ఆమె కూడా అతని మీద మనసు పడింది. అదే ఒక ఆదివాసీ యువకుడైతే అతన్ని చేపట్టడానికి తపతికి ఎవరి అనుమతీ, ఎటువంటి అభ్యంతరాలూ ఉండనవసరం లేదు. కానీ సంవరణుడు సాయుధుడైన క్షత్రియుడు. ఆదివాసుల అస్తిత్వానికి అతడో పెద్ద ప్రమాదం. కనుక ఈ సంబంధానికి తపతి తండ్రి కాదుకదా, తపతి తెగ మొత్తం అంగీకరించే అవకాశం లేదు. తెగ మనిషిగా తపతి కూడా వెంటనే అవుననే అవకాశమూ లేదు. కనుక మధ్యవర్తి అవసరం.

ఆవిధంగా వశిష్టుని ప్రవేశం… గంధర్వుని వెర్షన్ ప్రకారం కూడా ఇక్కడ మధ్యవర్తిగా వశిష్టుని ప్రవేశం అవసరమే. ఆపైన ఒక మునిగానూ, బ్రాహ్మణునిగానూ వశిష్టుడు ఆదివాసుల మనసుకు ఎలాగూ దగ్గరివాడే. కనుక మునుల గురించి, వారితో తమ సంబంధాల గురించి చెప్పడం గంధర్వుడికి ఇష్టమే. పాండవుల వెంట పురోహితుడు లేని సంగతి గంధర్వుడు మొదటే ఎత్తి చూపాడు కనుక, పురోహితుడి అవసరం ఎలాంటిదో చెప్పడమూ అతనికి అవసరమే. అదే సమయంలో, మీరు తాపత్యవంశీకులని నొక్కి చెప్పడం బహుశా అంతకంటే ఎక్కువ ఇష్టమూ, అవసరమూ కూడా  కావచ్చు. ఎందుకంటే, కథకుడు పురుష స్వామ్యంవైపు కథ నడిపిస్తాడు కనుక తను యథాశక్తి మాతృస్వామ్యం వైపు నడిపించక తప్పదు.  అదీగాక, వశిష్టునికి కూడా మాతృస్వామ్యంతో సంబంధం ఉందనేది ఇక్కడ అదనపు సమాచారం. దానిలోకి ఇప్పుడు మనం వెళ్లద్దు.

కథకుడికీ వశిష్టుని ప్రవేశం అంగీకారమే. అయితే మధ్యవర్తిగా కాకపోవచ్చు. ఒక బ్రాహ్మణునిగానూ, మునిగానూ వశిష్టుని మహిమను చెప్పడం కథకునికి ఇష్టం. అలాగే, క్షత్రియునివైపునుంచి కథ చెప్పడం కూడా అతనికి ఇష్టమే. సంవరణుడు సూర్యునికోసం తపస్సు చేశాడని చెప్పడం, భూమండలంలో అంతటి వీరుడు లేడని చెప్పడం, సంవరణుడు తలచుకోగా వశిష్టుడు వచ్చాడని చెప్పడం అందులో భాగమే కావచ్చు. కథకుడు ఆ తర్వాత వశిష్టుడికి మహిమలు ఆపాదించుకుంటూ వెళ్ళాడు. గంధర్వుడికి అభ్యంతరం లేదు. కథకుడు తన వెర్షన్ ఎలా చెప్పుకుంటూ పోయినా, ‘తాపత్యవంశీకుడివి’ అంటూ తను చేసిన శృతికి అనుగుణంగా తపతి వైపునుంచి చెప్పడమే గంధర్వుడికి కావలసింది.

తపతి-సంవరణుల పెళ్లి గాంధర్వ విధానంలో కాక, పెద్దల అనుమతితో, పురోహితునిద్వారా మాత్రమే జరగడం కథకునికి ఇష్టం కనుక అలాగే జరిపించాడు. తపతి వైపునుంచి చెప్పే అవకాశాన్ని తనకు ఇచ్చాడు కనుకా, ఆ అవకాశాన్ని తను వినియోగించుకున్నాడు కనుకా, ఇక కథకుడు తన కథను ఎలాగైనా చెప్పుకోనివ్వండి…గంధర్వుడికి అభ్యంతరం లేదు. అయితే, చివరగా ఎదురయ్యే ఒక చిక్కు ప్రశ్న ఏమిటంటే, సంవరణుడు రాజుగా నిర్వర్తించవలసిన కార్యాలు, ధర్మాలు విడిచిపెట్టేసి తపతితో ఇష్టభోగాలు అనుభవిస్తూ అడవిలో (అత్తవారి ఇంట) ఉండిపోయాడనీ, దాంతో రాజ్యంలో అనావృష్టి ఏర్పడిందనీ కథకుడు చెబుతున్నాడు. ఇంతవరకు సంవరణునికి అనుకూలంగా జరుగుతున్న కథనంలో ఇక్కడికి వచ్చేసరికి అతనిపై ఒకింత నిష్ఠురం ధ్వనిస్తున్నట్టు లేదూ? ఒకింత ఏమిటి, ఎక్కువే ధ్వనిస్తున్నట్టుంది. సంవరణుడు రాచకార్యాలను, ధర్మాలను విడిచిపెట్టేసి తపతితో ఇష్టభోగాలలో మునిగి తేలుతూ ఉండడం, అక్కడ రాజ్యంలో కరవు కాటకాలు ఏర్పడడం సంవరణుడి వైపునుంచి జరిగిన సామాన్యమైన నేరమేమీ కాదు. అప్పుడు వశిష్టుడు అనావృష్టిని నివారణకు క్రతువులు జరిపి సంవరణుని దగ్గరకు వచ్చి భార్యాభర్తలు ఇద్దరినీ రాజధానికి తీసుకెళ్ళాడు. అప్పుడు అనావృష్టి తొలగిపోయింది.

ఆ తర్వాతే, ఆ దంపతులకు కురుడు పుట్టాడు!

ఇంతకీ పన్నెండేళ్ళు సంవరణుడు అడవిలోనే ఎందుకు ఉండిపోయాడు? వారికి పన్నెండేళ్ళ వరకూ ఎందుకు సంతానం కలగలేదు? ఈ పన్నెండేళ్లలో ఏం జరిగి ఉంటుంది?

సంతృప్తికరమైన సమాధానాలు వస్తాయా, రావా అనేది వేరే విషయం; కానీ ఇవి న్యాయమైన ప్రశ్నలు కావంటారా?

మిగతా విషయాలు వచ్చే వారం…

Kalluri Bhaskaram-pic-a.prabhakar rao (10)–కల్లూరి భాస్కరం 

 

Download PDF

7 Comments

 • మంజరి.లక్ష్మి says:

  సంవరణుని అత్తవారిల్లు సూర్యలోకం కదా! అడవిలో అత్తవారింట్లో ఉన్నాడని రాసారేమిటీ?

  • కల్లూరి భాస్కరం says:

   భలే ప్రశ్న వేశారు…పోనీండి, సంవరణుడు తపతిని అడవిలోనే చూశాడు కనుక, అక్కడే ఆమెను పెళ్లాడాడు కనుక, అక్కడే కాపురం చేశాడు కనుక అదే అత్తవారిల్లు అనుకుందాం.

 • N Venugopal says:

  భాస్కరం గారూ,

  చాల బాగుంది. ఎన్నో ఆలోచనలు ప్రేరేపించేలా ఉంది. సంవరణుడు స్థిర వ్యవసాయపు, ఆహారోత్పత్తి సంప్రదాయానికీ, తపతి ఆహారసేకరణ సంప్రదాయానికీ చెందినవారై ఉండి, వారి కలయిక వల్ల సంవరణుడు తన ఆహారోత్పత్తిని వదిలివేయడం, కరవుకాటకాలకు కారణమై ఉంటుందా? ఆహారసేకరణ దశలో ఉన్న గిరిజన తెగలను స్థిర వ్యవసాయంలోకి తీసుకురావడంలో పురోహితుల పాత్ర గురించి కోశాంబి రాసినది ఇక్కడ వశిష్టుడి మధ్యవర్తిత్వానికి వర్తిస్తుందా? లోతుగా చదవవలసిన కథ మీద లోతుగా ఆలోచించవలసిన వ్యాసం రాశారు. కృతజ్ఞతలు.

  • కల్లూరి భాస్కరం says:

   థాంక్స్ వేణుగోపాల్ గారూ…కరవు కాటకాలను మీరన్న కోణం లోంచి కూడా చూడచ్చు. నా ఉద్దేశంలో కథకునివైపు నుంచి అంతకన్నా ముఖ్యమైన ఒక అవసరానికి కరవు కాటకాలు ఒక నెపం మాత్రమే. అదెలాగో వచ్చే వారం రాయబోతున్నాను. ఇక, వశిష్టునితో ఆదివాసీ సంబంధాలు, కోశాంబీ పురోహితుల పాత్ర గురించి చెప్పిన దానిలో స్థూలంగా భాగమే.

 • Manohar Chenekala says:

  అంతా బాగానే ఉంది కానీ , వశిష్టుడికి మహిమలు ఆపాదించడమే కధకుడి ఉద్దేశ్యం అని ఎందుకనుకోవాలి. ఆయన బ్రహ్మర్షి. బ్రహ్మ మానసపుత్రుడు. ఆయనకి యోగ దృష్టి ఉండడంలో అసంబద్దం ఏమీ లేదే. పురాణ కధలు జరిగిన దాన్ని జరిగినట్టు చెపుతాయి. కధకుడు సంవరణుడి గొప్పతనాన్నే చెప్పాలనుకుంటే చివర్లో మీరన్నట్టు క్షామం గురించి చెప్పవలసిన అవసరం లేదు. అది చెప్పకుండా సంవరణుడి గొప్పతనాన్ని నిలబెట్టచ్చు. ఆద్యంతం తను గొప్పగా చెప్పిన సంవరణుడి పాత్రని ఒక్కసారిగా భార్యాలోలుడై రాజ్యాన్ని పట్టించుకోనంత దారుణ పాత్రగా ఎందుకు చెప్పాడు. కావ్యం కాబట్టి అతిశయోక్తి ఉండవచ్చు. కానీ అసలు కధే కట్టుకధ అనడం, కధకుడి మనస్సులో ఉన్నది ప్రజలమీద రుద్దడం కోసమే రాసాడు అంటే నమ్మడం కొంచెం కష్టం. మహిమలు ఆ కాలంలో ఉండి ఉండవచ్చు. రమణమహర్షి, చంద్రశేఖర పరమాచార్య వంటి వారిని మనం ఈ రోజుల్లో చూడలేదా, వారి మహిమలు తెలియనివా? అలాంటప్పుడు నిష్టా గరిష్ఠుడైన వశిష్టుడికి యోగదృష్టి ఉంటే అది కధకుడి కల్పన అయిపోతుందా? అలా అయితే కధకుడు తన హీరోని ఎలివేట్ చేసే విషయాలనే కాకుండా అతని నెగటివ్ పాయింట్స్ ని ఎందుకు చెప్తాడు?

  P.S: ఈ కధ గురించి నాకు తెలియదు, మీరు రాసిన దాని ఆహారంగా మాత్రమే చెప్తున్నాను.

  • కల్లూరి భాస్కరం says:

   థాంక్స్ మనోహర్ గారూ…వశిష్టుడు బ్రహ్మర్షి కాదనీ, ఆయనకు మహిమలు, యోగదృష్టి లేవనీ నేను అనలేదు. అది నా పరిశీలనలో భాగం కాదు. అలాంటివి అవసరం లేనిచోట వాటిని ప్రదర్శించినట్టు కథకుడు చెప్పాడని అన్నాను. అలా చెప్పడం కథకునికి ఇష్టం అన్నాను. అలా కథ చెప్పడం పురాణశైలి అన్నాను. అలాగే, అసలు కథే కట్టుకథ అని కానీ, కథకుడు తన మనసులో ఉన్నది ప్రజల మీద రుద్దడం కోసమే చెప్పాడని కూడా నేను అనలేదు. పైగా కథకుడు సొంతంగా ఆ కథను సృష్టించి చెప్పడం లేదు. ప్రచారంలో ఉన్న కథనే చెబుతున్నాడు. తనకు సంప్రదాయం నిర్దేశించిన పరిధిలోనే చెబుతున్నాడు. సంప్రదాయం అందించిన శైలిలోనే చెబుతున్నాడు. కొన్ని విషయాలు అతడు మరుగుపుచ్చినా, కొన్ని ఎక్కువ చేసి చెప్పినా అది సొంతంగా చేయడం లేదు. ఒక ఫ్రేమ్ లో భాగంగా చేస్తున్నాడు. ఆ ఫ్రేమ్ కూడా అతనే కల్పించింది కాదు. ఆ ఫ్రేమ్ ఏమిటనేది పరిశీలించడమే నా ప్రయత్నం.

 • ikkurthi narasimharao says:

  kalluri bhaskaram garu మీరు సంవరణుడు 12సo .rajyaniki vellakunda భారyato gadapataniki varshalu leka karuvu ravataniki sambandham emito vivariste baguntundi.prachina sahitya kadhakunde tholi ciny darsakuniki adiguruvu ani cheppakane chapparu.

ఒక వ్యాఖ్యను

Your email address will not be published. Required fields are marked *

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)