పాదాల క్రింద నలగని ఆకు – కుష్వంత్ సింగ్

Krish.psd
నేలమీద అడుగులు వేస్తుంటే దారి పొడువునా పచ్చ టి ఆకులు పరుచుకుని తమ పై నుంచి నడిచివెళతారా అని దీనంగా చూస్తున్నాయి. తెల్లవారు జాము చల్లటి గాలి తగులుతుంటే పై నుంచి పచ్చటి ఆకులు దీవిస్తున్నట్లు రాలిపడుతున్నాయి. తలపై, భుజంపై ఒక్కో ఆకు కన్నీటి చుక్కల్లా పడుతూ పలకరిస్తున్నాయి. తడి పచ్చికపై కూడా అవే ఆకులు.పూలు ఆకుల వర్షాన్ని ఆనందిస్తున్నట్లు తలలూపుతున్నాయి. నేలపై కాగితపుపూలు, పచ్చటి ఆకులు కలిసి మట్టిని ముగ్గుల్లా అలంకరిస్తున్నాయి. స్కూలుకు వెళుతున్న పిల్లల్నీ అవే ఆకులు పలకరిస్తున్నాయి.

అవును ఇది శిశిరం. ఆకులు రాలే కాలం. ఢిల్లీలో చిరుచలిని ఎండ వేడిమి పారదోలుతున్న సమయంలో కాలం మారుతున్నదన్న స్ప­ృహ వెంటాడుతోంది. మృత్యువు అందమైనదా? లేకపోతే ఈ ఆకులు, పూలు రాలిపోతూ విషాదానికి బదులు ఆనందాన్ని ఎందుకు కలుగచేస్తున్నాయి? బస్‌స్టాప్ వద్ద పడిపోయిన ఒక పెద్ద రావి ఆకును ఏరి ఒక స్కూలు పిల్ల పుస్తకంలో దాచుకుంది. కాళ్ల క్రింద, వాహనాల క్రింద ముక్కలయ్యే బదులు లేత అక్షరాల మధ్య తల దాచుకునే అదృష్టం ఆ ఆకుకు కలిగింది.

పాదాల క్రింద ఆకుల ధ్వనిని వింటూ, ఆలోచిస్తూ వెళుతుంటే మొబైల్‌లో అందిన సమాచారం మరో పండుటాకు రాలిపోయిందని. 99 ఏళ్ల వయస్సులో కుష్వంత్ సింగ్ మరణించడం ఒక అసహజమైన సంఘటన ఏమీ కాకపోవచ్చు. కాని ఆయన మరణంతో ఒక చరిత్రతో సంబంధం ఉన్న ఒక అత్యంత ముఖ్యమైన వ్యక్తి గతించినట్లయింది. లాల్‌కృష్ణ అద్వానీ, కుల్దీప్ న య్యర్, మన్మోహన్ సింగ్, కుష్వంత్ సింగ్ వీరందర్నీ ఒక చరిత్ర కలుపుతుంది. అది దేశ విభజనకు చెందిన చరిత్ర. వీరందరూ దేశ విభజనకు పూర్వం జన్మించారు. ఆ తరం పండుటాకులన్నీ ఒక్కొక్కటీ రాలిపోతున్నాయి. వీరందరిలో కుల్దీప్ నయ్యర్, కుష్వంత్ సింగ్ ప్రత్యేక తరగతికి చెందిన వారు. వారు విభజన విషాదాన్ని ప్రత్యక్షంగా చూసినవారు, వాటి గురించి రాసిన వారు. అందరికంటే 99 ఏళ్ల కుష్వంత్ సింగ్ సీనియర్. ఆయన కుల్దీప్‌లా కేవలం జర్నలిస్టు మాత్రమే కాదు, రచయిత, కవి హృదయం ఉన్న వ్యక్తి.

కుష్వంత్ సింగ్ లాహోర్‌లో ఏడేళ్లు లా ప్రాక్టీసు చేశారు. విభజన తర్వాత కూడా అదే కొనసాగించి ఉంటే దేశంలో ప్రముఖ న్యాయవాదిగానో, న్యాయమూర్తిగానో కొనసాగేవారు. లండన్, పారిస్ తదితర నగరాల్లో రాయబార కార్యాలయాల్లో, యునెస్కోలో పనిచేసే అవకాశం కూడా ఆయనకు వచ్చింది. అదే కొనసాగించి ఉంటే ఆయనొక ప్రముఖ దౌత్యవేత్తగా మారి ఉండేవారు. ఆయన తండ్రి ఢిల్లీప్రభుత్వంలో ఉన్నతాధికారి. అనేక వ్యాపారాలున్నవారు. అందులో ప్రవేశించినా ఆయనొక ప్రముఖ వ్యాపారి అయ్యేవారు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఆయన ఇవన్నీ తృణీకరించి,రచయితగా, జర్నలిస్టుగా జీవితం కొనసాగించాలనుకున్నారు. జీవితాంతం తన రచనలపైనే బ్రతికారు. కవులు, కళాకారులు, రచయితల మధ్య జీవితాన్ని గడిపారు.

కుష్వంత్ సింగ్ రచనలు చాలా ఆలస్యంగా మొదలు పెట్టారు. లండన్‌లోని భారతీయ రాయబార కారాలయంలో పబ్లిక్ రిలేషన్ అధికారిగా ఉన్నప్పుడు ముల్క్‌రాజ్ ఆనంద్, రాజారావు, ఆర్.కె.నారాయణ్‌లను చదివిన తర్వాత తానెందుకు రాయకూడదని అనుకున్నాడు. మొదట రాసిన మార్క్ ఆఫ్ విష్ణు అనే చిన్న కథల సంకలనంతో ఆయన రచయితగా రంగప్రవేశం రాశారు. ఆ తర్వాత సిక్కుల చరిత్ర రాశారు. తర్వాత దాదాపు 40 ఏళ్ల వయస్సులో దేశ విభజనపై మొట్టమొదటి సంచ లన నవల ట్రైన్‌టు పాకిస్తాన్ రాశారు. అంతే, రచయితగా ఆయన స్థానం సాహిత్య ప్రపంచంలో స్థిరపడిపోయిది. ఆకాశవాణిలో విదేశీ సర్వీసెస్‌లో ఉన్న్పపుడు నిరాద్ సి చౌదరి, రుత్ జాబాల, మనోహర్ మల్గోంకర్ మొదలైన రచయితలతో పరిచయం ఆయనకు రచనపై ఆసక్తి కలిగించింది. అంతమాత్రాన కుష్వంత్ సింగ్‌కు అంతకుముందుసాహిత్యంపట్ల అభిరుచి లేదని కాదు. ప్రముఖ ఉర్దూకవి ఫైజ్ అహ్మద్ ఫైజ్ ఆయనకు లాహోర్ కాలేజీలో రెండేళ్ల సీనియర్. గాలిబ్ ఆయన అభిమాన కవి. మాటిమాటికీ ప్రముఖ ఉర్దూకవి ఇక్బాల్ కవిత్వాన్ని ఉటంకించకుండా కుశ్వంత్ సింగ్ ఉండలేరు.

1970567_10152240904637088_1438515080_n
దాదాపు 20 ఏళ్ల క్రిందట ఎపి టైమ్స్ కోసం ఆయనతో కాలమ్ రాయించేందుకు వెళ్లినప్పుడు ఆయనతో వ్యక్తిగత పరిచయం ఏర్పడింది. అప్పుడప్పుడూ కొంతమంది సాహితీ మిత్రులను కూడా తీసుకువెళ్లేవాడిని. స్నేహపూర్వకంగా మాట్లాడినప్పటికీ డబ్బుల విషయంలో మాత్రం చాలా కరుకుగా ఉండేవారు. ఏ మాత్రం ఆలస్యమైనా ఆయన తిట్లను భరించాల్సిందే. అప్పటికే ఆయన జీవితంలో ఎన్నో పదవులు అనుభవించారు. ఇల్లస్ట్రేటెడ్ వీక్లీ సంపాదకుడుగా ఆయన తనదైన ముద్ర వేశారు. బంగ్లాదేశ్‌లో నరహంతకుడు టిక్కాఖాన్, పాక్ నియంత జియాఉల్‌హక్ మొద లైన వారి ఇంటర్వ్యూలు, కొన్ని పరిశోధనాత్మకమైన వ్యాసాల ద్వారా వీక్లీలో జర్నలిజంస్థాయిని ఆయన పెంచారు. వీక్లీ సర్క్యులేషన్ 80 వేలనుంచి 4 లక్షలు దాటేలా చూశారు. ఆ తర్వాత ఏ వీక్లీ అంత సంచలనం సృష్టించలేదు. అయితేనేం, వీక్లీసంపాదకుడుగా ఎమర్జెన్సీని నెత్తికెక్కించుకుని, సంజయ్ మారుతి కార్లఫ్యాక్టరీ గురించి సానుకూల వార్తలు రాసి తాను సర్కార్ పాదాల క్రింద తివాచీగా మారారు. దాని వల్ల ఇందిర రెండో సారి అధికారంలోకి వచ్చినప్పుడు ఆయనకు తొలుత నేషనల్ హెరాల్డ్ సంపాదక పదవి, ఆతర్వాత రాజ్యసభ సీటు, హిందూస్తాన్ టైమ్స్ సంపాదకుడి పదవీ దక్కాయి. మేనకాగాంధీ ఆధ్వర్యంలోని సూర్య పత్రికకు కూడా సంపాదకుడుగా కొన్నాళ్లు వ్యవహరించారు. పద్మభూషణ్  దక్కించుకున్నారు. ఆపరేషన్ బ్లూస్టార్‌ను విమర్శించి ఆయన తన పద్మభూషణ్ పురస్కారాన్ని తిరిగి ఇవ్వకపోతే, రాజ్యసభలో తనకు సీటు ఇచ్చిన కాంగ్రెస్‌నే తీవ్రంగా విమర్శించకపోతే కుష్వంత్ సింగ్‌ను ఏ పంజాబీ క్షమించి ఉండేవారు కాదు.

ఎన్ని కక్కుర్తి పనులకు పాల్పడితేనేం, కుష్వంత్ సింగ్‌లో అంతర్గతంగా రచయిత, కవి ఉన్నారని చాలా సార్లు రుజువైంది. దాని వల్లే ధిక్కార స్వరం ఆయనకు సహజసిద్ద లక్షణమైంది. తొలుత ఉన్నతపదవులను వదులుకుని కేవలంరచయితగా స్థిరపడాలనుకున్న కుష్వంత్ తర్వాత రాజీపడితేనేం, ఆ రాజీ గురించి ధైర్యంగా చెప్పుకున్న వ్యక్తి. హిందూమతతత్వాన్ని, గుజరాత్ అల్లర్లను, అద్వానీ రథయాత్రను తీవ్రంగా విమర్శించిన కుష్వంత్ జీవితపు విలువలను ప్రేమించారు. యదాలాపంగానైనా ధిక్కార స్వరాన్ని వినిపించకుండా ఉండలేకపోయారు. దేవుడి ఉనికిని, ఆత్మలను ప్రశ్నించకుండా ఉండలేకపోఆరు. గత ఆరుదశాబ్దాలుగా ఆయన ధారావాహికంగా ఏదో రాస్తూనే ఉన్నారు. వ్యంగ్యం, హాస్యం మేళవించినప్పటికీ ఆయన రచనల్లో కవిత్వం తొణికిసలాడుతుంది. ఆయన వ్యాసాల్లో స్వేచ్చా ప్రియత్వం స్పష్టంగా కనపడుతోంది. అందుకే ఫైజ్ లాంటి కవులు ఆయనకు ఆప్తబంధువులయ్యారు.

నా జైలు గదిలో కాంతి పేలవమై
రాత్రి ప్రవేశించినపుడు 
నీ నల్లటి కేశాల్లో నక్షత్రాలు
మెరుస్తున్నట్లనిపించింది. 
నన్ను కట్టేసిన గొలుసులు
కాంతిలో మెరిసినప్పుడు 
ఉదయపు కాంతిలో
నీ ముఖం వెలిగిపోవడాన్ని చూశాను..

అన్న ఫైజ్ అహ్మద్ కవితను కుశ్వంత్ ఆయన మరణానంతరం రాసిన వ్యాసంలో ఉటంకించారు. జైలు జీవితం తనను మళ్లీ ప్రేమలో పడేసింది.. అని ఫైజ్ అన్నట్లుఆయన పేర్కొన్నారు.

భింద్రన్ వాలే బృందం వెంటాడినా, 1984 లో జరిగిన సిక్కుల ఊచకోతలో రాజ్యసభ సభ్యుడుగా ఒక దౌత్యవేత్త ఇంట్లో తలదాచుకోవాల్సి వచ్చినా, మృత్యువుకు ఆయన ఎప్పుడూ భయపడలేదు. తన మృత్యువుపై తానే కథ రాసుకున్న వ్యక్తి కుశ్వంత్. మనిషి విశ్వాసానికి సంకేతాలు కావాలా? మృత్యువు సమీపించినప్పుడు అతడి పెదాలపై చిరునవ్వు చూడు.. అని ఇక్బాల్ రాసిన కవితను ఆయన అనేక సందర్భాల్లో ఉటంకించారు.

అవును.. కుశ్వంత్ రాలిపోయాడు. పండుటాకులా రాలిపోయాడు. ఉన్నట్లుండి ఒక సుడిగాలి ప్రవేశించింది. ఆ ఆకు నేలమీద పడీ పడగానే మట్టిని స్ప­ృశించి, గాలిలో తిరుగుతూ, తిరుగుతూ ఎక్కడికో అంతర్ధానమైంది. రాలిపోయాక కూడా పాదాలక్రింద నలిగి వ్రక్కలు కావాల్సిన ఆకు కాదది.

-కృష్ణుడు

రేఖాచిత్రం: శంకర్

Download PDF

5 Comments

  • gorla says:

    ‘‘ఆకులు, పూలు రాలిపోతూ విషాదానికి బదులు ఆనందాన్ని ఎందుకు కలుగచేస్తున్నాయి? బస్‌స్టాప్ వద్ద పడిపోయిన ఒక పెద్ద రావి ఆకును ఏరి ఒక స్కూలు పిల్ల పుస్తకంలో దాచుకుంది. కాళ్ల క్రింద, వాహనాల క్రింద ముక్కలయ్యే బదులు లేత అక్షరాల మధ్య తల దాచుకునే అదృష్టం ఆ ఆకుకు కలిగింది.’’
    ఈ పదాలు కృష్ణుడు మాత్రమే అనగలడా.? అనిపిస్తుంది. కుష్వంత్ సింగ్ గురించి చాలా వ్యాసాలు వచ్చినా తెలుగులో ఆయనకు దగ్గరగా పరిచయం ఉండి రాసిన జర్నలిస్టు వ్యాసం ఇది. మీరు ఈ వ్యాసంలో రాసిన కొన్ని వాక్యాలు మనిద్దరం ఢిల్లీ లోని గాలిబ్ సమాధి వద్దకు వెళ్లి సమాధిపై రాసిన ఊర్దు కవిత్వాన్ని చదవి మీరు నాకు వివరించిన సందర్భం గుర్తుకు వచ్చింది. ఇండియన్ జర్నలిజంలో కుష్వంత్ తీరు ఓ ప్రత్యేకత. అతి కొద్ది మంది నాయకులు, అతి తక్కువ మంది జర్నలిస్టుల జీవితాలు చూస్తే సాక్షాత్తూ చరిత్రతో సంభాషించినట్లే అన్పిస్తుంది. మీరురాసిన వ్యాసంలో కూడా చరిత్రతో కరచాలనం ఉంది. కుష్వంత్ రాతల్లోనే కాదే ఆయన గురించి మీరు రాసిన వ్యాసంలోనే కవిత్వం ఉంది. ఆర్థ్రతా ఉంది. కరువు జిల్లా పాలమూరు కృష్ణుడి రాతల్లో నిరంతరం నది కృష్ణా నీళ్ల నురగలు కన్పిస్తాయి. కృష్ణ పక్షానికి ధన్యవాదాలు సార్……….

  • కె. కె. రామయ్య says:

    “ కుష్వంత్ సింగ్‌ రచయిత, కవి హృదయం ఉన్న వ్యక్తి… దాని వల్లే ధిక్కార స్వరం ఆయనకు సహజసిద్ద లక్షణమైంది. కుష్వంత్ సింగ్ జీవితపు విలువలను ప్రేమించారు. వ్యంగ్యం, హాస్యం మేళవించినప్పటికీ ఆయన రచనల్లో కవిత్వం తొణికిసలాడుతుంది. ఆయన వ్యాసాల్లో స్వేచ్చా ప్రియత్వం స్పష్టంగా కనపడుతోంది. ప్రముఖ ఉర్దూకవి ఫైజ్ అహ్మద్ ఫైజ్ ఆయనకు లాహోర్ కాలేజీలో రెండేళ్ల సీనియర్. గాలిబ్ ఆయన అభిమాన కవి. మాటిమాటికీ ప్రముఖ ఉర్దూకవి ఇక్బాల్ కవిత్వాన్ని ఉటంకించకుండా కుశ్వంత్ సింగ్ ఉండలేరు 99 ఏళ్ల వయస్సులో కుశ్వంత్ సింగ్ రాలిపోయాడు. పండుటాకులా రాలిపోయాడు . జీవితాంతం తన రచనలపైనే బ్రతికారు. కవులు, కళాకారులు, రచయితల మధ్య జీవితాన్ని గడిపారు. “ కవిత్వం ఆర్థ్రతా మేళవించి కుష్వంత్ సింగ్ గురించి తెలుగులో ఇంత మంచి వ్యాసం ఇచ్చిన పాలమూరు కృష్ణుడి గారికి ధన్యవాదాలు.

  • మంగు శివ రామ ప్రసాద్ says:

    కుష్వంత్ సింగ్‌ హృదయాన్ని ఆర్ద్రంగా కవితత్మకంగా ఆవిష్కరించినందుకు కృష్ణగారికి ధన్యవాదాలు. మనకున్న జాతీయ జర్నలిస్ట్ ల జాబితాలో కుష్వంత్ గారిది అగ్రాసనం. చాలా కాలం జాతీయ ఆంగ్ల దిన పత్రికలలో కుష్వంత్ కాలమ్ ‘ malice to one and all’ అత్త్యంత ప్రాచుర్యం పొందినది. పండుటాకు రాలడం ప్రకృతి ధర్మమే అయినా వ్యక్తి అస్తమయం అందునా ఒక మరుపు రాని అద్భుతమైన వ్యక్తి విషయంలో అది మరీ బాధాకరం.కృష్ణ పక్షంలోని పాదాల క్రింద నలగని ఒక ఆకుపై ఒక కన్నీటి బొట్టు. నిలిచిపోయిన ఒక కలం పాళీకి నివాళి..

  • krishnarao says:

    గోర్ల, శివరామయ్య, శివరామప్రసాద్ గార్లకు ధన్యవాదాలు-కృష్ణుడు

  • కొమ్మన రాధాకృష్ణ రావు says:

    కృష్ణా రావు గారూ .. మీరు జ్యోతిలో రాసింది చదివాను. ఇదీ చదివాను. వార్తాపత్రికల్లో వ్యాసానికి దీనికి ఉన్న అంతరం .. నాకు ఇలా అనిపించింది.. పత్రికలో వ్యాసం లాగూ చొక్కా వేసికొని రాసినట్టూ.. ఇది ఇలా రాయందే లాభం లేదు.. ఈ గుండె బరువు దించుకోవాలి.. పంచుకోవాలి అని ఉన్న వాళ్ళు ఉన్నట్టు రాసి .. మరీ,మరీ కళ్ళకద్దుకుని మా ముందు ఉంచారని ..కుశ్వంత్ తన తల్లి పోయినప్పుడు రాసిన వ్యాసం నాకు స్ఫురణకు వచ్చింది. ఆత్మకు లింగ భేదం లేదు. కుశ్వంత్‌కు, కృష్ణ రావు కు.. సహ్రుదయులకు అంతే…

ఒక వ్యాఖ్యను

Your email address will not be published. Required fields are marked *

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)