వందేళ్ల కిందటి తెలుగు మహిళ తిరుగుబాటు

venuరాని ‘సమయం’లో సమ్మె చేసి ఉద్యోగం పోగొట్టుకుని ఆరునెలలు నిరుద్యోగం చేసి, చివరికి బెంగళూరు ఇన్ స్టిట్యూట్ ఆఫ్ సోషల్ అండ్ ఎకనమిక్ చేంజ్ (ఐసెక్) లో రిసర్చ్ అసిస్టెంట్ గా చేరడం నా జీవితంలో ఒక పెద్ద మలుపు. ఇరవై రెండు సంవత్సరాల కింద జరిగిపోయిన ఆ మార్పు అనేక కారణాల వల్ల ఒక్క క్షణం కింద జరిగినంత బలంగా మనసు మీద ముద్ర వేసుకుంది. ఐసెక్ లైబ్రరీ, అక్కడి మేధో వాతావరణం, స్నేహబృందం గొప్ప వరాలు. ప్రత్యేకించి ఆ లైబ్రరీ మహా ఖజానా. అప్పటికి విని మాత్రమే ఉండి, చూసే అవకాశం కూడ దొరకని ఎన్నో పుస్తకాలు అక్కడ చేతికందాయి. అప్పటికి కొనుక్కోలేని పుస్తకాలెన్నో ఎంతో కొంత సంపాదనవల్ల, ఐసెక్ లో విద్యార్థులకు, ఉద్యోగులకు చౌకగా ఫొటోకాపీయింగ్ సౌకర్యం ఉండడం వల్ల, సొంతానికి సంపాదించుకోగలిగాను. అక్కడ అట్లా దొరికిన విలువైన పుస్తకాలలో ఒకటి ‘ది రివోల్ట్ ఆఫ్ సుందరమ్మ’.

అప్పటికే రాజకీయాభిప్రాయాలవల్ల పరిచయస్తుడు, ఐసెక్ లో పబ్లికేషన్ అసిస్టెంట్ కె జి వాసుకి నేనక్కడ చేరిన రెండు నెలల లోపలే హఠాత్తుగా “డు యు నో సుందరమ్మ?” అని అడిగాడు. ఎవరా సుందరమ్మ అని ఎదురు ప్రశ్నించాను. అంతటి సుప్రసిద్ధ తెలుగు వ్యక్తి తెలియని నా అజ్ఞానానికి ఆయన చాల ఆశ్చర్యపోయాడు. “దేరీజ్ ఎ రేర్ బుక్ కాల్డ్ రివోల్ట్ ఆఫ్ సుందరమ్మ ఇన్ అవర్ లైబ్రరీ. దటీజ్ ఎ సెంచురీ ఓల్డ్ బుక్. యు డోంట్ నో అబౌట్ హర్” అని నా అజ్ఞానానికి జాలిపడుతూ, బైటికి ఇవ్వని, పరిమిత చలామణీకి మాత్రమే అనుమతించే ఆ పుస్తకం నాకిచ్చాడు. ఆ పుస్తకాన్ని రెండు దశాబ్దాల వెనుక చదివినప్పుడు ఎంత సంభ్రమాశ్చర్యాలకు గురయ్యానో, ఇవాళ చదివినా అట్లాగే ఉంది. ఆ పుస్తకం వంద సంవత్సరాల కిందటి తెలుగు సమాజ శకలం ఒకదాన్ని సజీవంగా చూపుతుంది. మన గతం గురించి చెప్పే ఆ పుస్తకానికి వర్తమానంలో కూడ ఎంతో ప్రాసంగికత ఉంది.

2014-04-02-257

ఆ పుస్తకంలో పొదిలి, పెదారికట్ల, రాజుపాలెం అనే మూడు గ్రామాల పేర్లున్నాయి. వీటిలో మొదటి రెండూ ప్రస్తుత ప్రకాశం జిల్లా గ్రామాలు. ఇంటిపేర్లతో సహా దాదాపు పది, పదిహేను మంది మనుషుల వివరాలున్నాయి. హిందూ కుల మత దురాచారాల పీడనలో మగ్గిన ఒక స్త్రీ తిరుగుబాటు గాథ అది. ఇష్టానికి వ్యతిరేకంగా, అసలు ఇష్టాయిష్టాలు తెలియని బాల్యంలో నాలుగు రెట్ల వయసున్న మేనమామతో పెళ్లి జరిగి, రెండో భార్యగా వెళ్లి, పదమూడేళ్లు నిండకుండానే కూతురికి జన్మనిచ్చి, ఆ కూతురికి కూడ బాల్య వివాహం చేయబోతుంటే తిరగబడిన స్త్రీ గాథ అది. ఆ స్త్రీ క్రైస్తవమతంలో చేరడమే తిరుగుబాటుగా రచయిత్రి చేసిన నిర్ధారణను పాఠకులు అంగీకరించవచ్చు. అంగీకరించకపోవచ్చు. కాని పదహారు అధ్యాయాల పుస్తకంలో క్రైస్తవం గురించి మాట్లాడినవి మూడు నాలుగు అధ్యాయాలు మాత్రమే. మిగిలిన అధ్యాయాలన్నీ హిందూ కుల మతాచారాలు, బ్రాహ్మణులు తమ భుక్తికోసం సృష్టించిన ఆచారవ్యవహారాల విధినిషేధాలు ఒక స్త్రీని ఎట్లా పీడించగలవో, ఎంత వేదనకు గురి చేయగలవో చూపేవే.

ది రివోల్ట్ ఆఫ్ సుందరమ్మ ఒక స్త్రీ గురించిన పుస్తకం మాత్రమే కాదు. ఆ పుస్తక రచయిత్రి స్త్రీ, దాన్ని అంకితం ఇచ్చినది ఒక స్త్రీకి. దానిలో అద్భుతమైన చిత్రరచన చేసినది ఒక స్త్రీ. దానికి ముందుమాట రాసినది ఒక స్త్రీ. ఆ పుస్తక రచయిత్రి మాడ్ జాన్సన్ ఎల్మోర్ పుస్తకాన్ని తన తల్లికి అంకితం చేస్తూ “ఆమె నిరంతర భక్తి భావన, కఠినమైన విధి నిర్వహణ నన్ను ఎన్నో హిందూ గృహాలలోకి వెళ్లేలా చేశాయి. మొదటి చూపులో ఆ హిందూ గృహాలలో ఏ ఆకర్షణా ఉండదు. శనగకాయల లోపల గింజల లాగ అన్నీ ఒక్కలాగనే ఉంటాయి. ఆ ఇళ్లు ఆశ్చర్యకరంగా శుభ్రంగా ఉంటాయి గాని లోపలివారు మాత్రం విసుగెత్తించే ఏకరీతి జీవితం గడుపుతుంటారు. పవిత్రమైన కులం, బలమైన మతాచారాలు వాళ్ల కాళ్లూ చేతులూ కట్టేసి ఉంటాయి. ఆ నిస్సహాయమైన ప్రజలలో ఏ మార్పు కోసం ప్రయత్నించడమైనా నిరాశాజనకమైన పని అనిపిస్తుంది. కాని వారాలూ నెలలూ సంవత్సరాలూ వేగంగా, నేనసలు గుర్తించకుండానే గడిచిపోయి, ప్రేమాస్పదులైన, కృతజ్ఞతాబద్ధులైన, కష్టజీవులైన ఆ హిందూ ప్రజలు నా వాళ్లు అయిపోయారు. వారికి నా తల్లి విశ్వసించే భగవంతుడిని, సజీవమైన భగవంతుడిని తెలియజెప్పడంలో నేను అత్యున్నతమైన ఆనందాన్ని అనుభవించాను” అని చెప్పుకుంది. అలా మొదటి పేజీల్లో అంకితం లోనే హిందూ సమాజపు వికర్షణ గురించి, హిందూ సమాజాన్ని గానుగెద్దు జీవితానికి కట్టి పడేసిన కుల మతాచారాల గురించి ఆమె రాసిన మాటలు పుస్తకం ఉద్దేశానికి సూచికలు. అయితే ఆ అంకితంలోనే ఆమె హిందూప్రజల ప్రేమ, కృతజ్ఞతా భావాల గురించి కూడ రాసింది. క్రైస్తవ మత ప్రచారం సరేసరి.

2014-04-02-258

ది రివోల్ట్ ఆఫ్ సుందరమ్మ ఒక స్త్రీ గురించిన పుస్తకం మాత్రమే కాదు. ఆ పుస్తక రచయిత్రి స్త్రీ, దాన్ని అంకితం ఇచ్చినది ఒక స్త్రీకి. దానిలో అద్భుతమైన చిత్రరచన చేసినది ఒక స్త్రీ. దానికి ముందుమాట రాసినది ఒక స్త్రీ. ఆ పుస్తక రచయిత్రి మాడ్ జాన్సన్ ఎల్మోర్ పుస్తకాన్ని తన తల్లికి అంకితం చేస్తూ “ఆమె నిరంతర భక్తి భావన, కఠినమైన విధి నిర్వహణ నన్ను ఎన్నో హిందూ గృహాలలోకి వెళ్లేలా చేశాయి. మొదటి చూపులో ఆ హిందూ గృహాలలో ఏ ఆకర్షణా ఉండదు. శనగకాయల లోపల గింజల లాగ అన్నీ ఒక్కలాగనే ఉంటాయి. ఆ ఇళ్లు ఆశ్చర్యకరంగా శుభ్రంగా ఉంటాయి గాని లోపలివారు మాత్రం విసుగెత్తించే ఏకరీతి జీవితం గడుపుతుంటారు. పవిత్రమైన కులం, బలమైన మతాచారాలు వాళ్ల కాళ్లూ చేతులూ కట్టేసి ఉంటాయి. ఆ నిస్సహాయమైన ప్రజలలో ఏ మార్పు కోసం ప్రయత్నించడమైనా నిరాశాజనకమైన పని అనిపిస్తుంది. కాని వారాలూ నెలలూ సంవత్సరాలూ వేగంగా, నేనసలు గుర్తించకుండానే గడిచిపోయి, ప్రేమాస్పదులైన, కృతజ్ఞతాబద్ధులైన, కష్టజీవులైన ఆ హిందూ ప్రజలు నా వాళ్లు అయిపోయారు. వారికి నా తల్లి విశ్వసించే భగవంతుడిని, సజీవమైన భగవంతుడిని తెలియజెప్పడంలో నేను అత్యున్నతమైన ఆనందాన్ని అనుభవించాను” అని చెప్పుకుంది.

sundaramma-1 sundaramma-2 sundaramma-3 sundaramma-5 sundaramma-6 sundaramma-7 sundaramma-8 sundaramma-9 sundaramma-10 sundaramma-11 sundaramma-12 sundaramma-13 sundaramma-14

అలా మొదటి పేజీల్లో అంకితం లోనే హిందూ సమాజపు వికర్షణ గురించి, హిందూ సమాజాన్ని గానుగెద్దు జీవితానికి కట్టి పడేసిన కుల మతాచారాల గురించి ఆమె రాసిన మాటలు పుస్తకం ఉద్దేశానికి సూచికలు. అయితే ఆ అంకితంలోనే ఆమె హిందూప్రజల ప్రేమ, కృతజ్ఞతా భావాల గురించి కూడ రాసింది. క్రైస్తవ మత ప్రచారం సరేసరి.

నూట అరవై పేజీల ఈ చిన్న పుస్తకంలో ప్రధాన కథ అయిన తెలుగు సామాజిక జీవన చిత్రణలో భాగంగా దాదాపు ఎనభై చిత్రాలు (అవి ఇండియన్ ఇంక్ డ్రాయింగ్ లు గాని, పెన్సిల్ స్కెచ్ లు గాని కావచ్చు) ఉన్నాయి. తెలుగు ప్రజల ఆచారాలు, వృత్తులు, మనుషులు, పెళ్లి, ఇళ్లు, దేవతా విగ్రహాలు, పశువులు, పంటలు, ప్రకృతి, పక్షులు, ఎడ్ల బళ్లు, చెప్పులు, గొడుగులు, చేతికర్రలు, కోకలు, పంచెలు, తినుబండారాలు, రుద్రాక్షమాల, శంఖం, తాయెత్తు, తాళపత్రాలు, సొరకాయ బుర్ర వంటి ఎన్నో సాంస్కృతిక విశేషాలు జీవం ఉట్టిపడుతూ కాగితం మీదికెక్కాయి, ఆ బొమ్మలు వేసింది గెర్ట్రూడ్ ఎచ్ బి హుకర్. ఆ పుస్తకానికి ముందుమాట రాసినది ఇవరయో శతాబ్ది తొలి దశకాలలో అమెరికాలో అత్యంత ప్రముఖ సంఘసేవకురాలు హెలెన్ బారెట్ మాంట్ గోమరీ. అలా ముగ్గురు అమెరికన్ స్త్రీలు పాలు పంచుకున్న, ఒక భారత, అందునా తెలుగు స్త్రీ గురించి రాసిన ఈ పుస్తకాన్ని 1911లో న్యూయార్క్ కు చెందిన ఫ్లెమింగ్ ఎచ్ రెవెల్ కంపెనీ అనే క్రైస్తవ పుస్తక ప్రచురణ సంస్థ వెలువరించింది. అప్పటికి నలభై సంవత్సరాలుగా పనిచేస్తున్న ఈ ప్రచురణ సంస్థ షికాగో, టొరాంటో, లండన్, ఎడింబరోలలో కార్యాలయాలతో పాశ్చాత్య ప్రపంచంలో అతి ప్రధానమైన క్రైస్తవ ప్రచురణ సంస్థగా ఉండేది. ఇప్పుడది బేకర్ పబ్లిషింగ్ గ్రూప్ లో ఒక భాగం.

 

ఒక అమెరికన్ రచయిత్రికీ, చిత్రకారిణికీ, సంఘసేవకురాలికీ, ప్రచురణకర్తకూ ఒకానొక తెలుగు స్త్రీ కథ వెలువరించవలసిన అవసరం ఏమి వచ్చింది? ఆ రచయిత్రి అమెరికన్ బాప్టిస్ట్ మిషన్ లో భాగంగా క్రైస్తవ మత ప్రచారానికీ, వైద్య సేవకూ, బహుశా మతాంతరీకరణకూ కూడ ప్రస్తుత ప్రకాశం జిల్లా, అప్పటి గుంటూరు జిల్లా గ్రామాలకు వచ్చింది. ఆమె జీవిత వివరాలు పుస్తకంలో ఎక్కడా లేవు గాని సుప్రసిద్ధ చర్చ్ సంగీతకారుడైన ఆమె కొడుకు రాబర్ట్ హాల్ ఎల్మోర్ జీవితచరిత్ర ప్రకారం, తల్లిదండ్రులు మాడ్ జాన్సన్ ఎల్మోర్, డా. విల్బర్ థియొడర్ ఎల్మోర్ రామపట్నం (రామయపట్నం) లో ఉండగా 1913లో ఆయన పుట్టాడని, 1915లో తల్లిదండ్రులు అమెరికాకు వెళ్లిపోయారని తెలుస్తున్నది. అమెరికన్ బాప్టిస్ట్ మిషన్ తరఫున ప్రజలతో సంబంధం పెట్టుకున్న మాడ్ ఆ ప్రజల జీవితాలను, హిందూ మతం కింద ఆ ప్రజలు, ప్రత్యేకించి స్త్రీలు అనుభవిస్తున్న వేదనను స్వయంగా చూసింది. ఆ వేదన నుంచి బైటపడిన ఒకానొక యువతి గాథను చాల ఉద్వేగభరితంగా ఈ పుస్తకంలో చిత్రించింది.

ఇది వాస్తవ గాథనా, కల్పిత గాథనా కచ్చితంగా తెలియదు. ఆ గ్రామాలకు వెళ్లి వంద సంవత్సరాల కింద ఇటువంటి ఘటన జరిగిందా అని పరిశీలించడానికి చేసిన ప్రయత్నం ఫలించలేదు. ఎంత ప్రయత్నించినా, మద్రాసు ప్రెసిడెన్సీలో క్రైస్తవ మతాంతరీకరణల చరిత్ర గురించి సవివరమైన పుస్తకం/కథనం ఒక్కటి కూడ దొరకలేదు. కాకపోతే క్రైస్తవంలోకి మారిన ఈ పుస్తక కథానాయకురాలి పేరు “వల్పుల” సుందరమ్మ కాగా, రామపట్నం థియొలాజికల్ సెమినరీలో రెవరెండ్ గా ఉండిన “వల్పుల” సి జాకబ్ 1909/10ల్లో దక్షిణాఫ్రికా వెళ్లాడని, ఆయన చరిత్ర తెలిసినవాళ్లు తనను సంప్రదించాలని ఇంటర్నెట్ మీద బ్రెండా ఫ్రాంక్నర్ 2013లో ఒక నోటీసు పెట్టారు!

అది నిజజీవిత గాథ అయినా కాకపోయినా, రచయిత్రికి ఆ నాటి తెలుగు సమాజంతోనూ, ఆచారాలతోనూ, హిందూ మత గ్రంథాలతోనూ తగినంత పరిచయం ఉందనడానికి పుస్తకంలో ఎన్నో అంతర్గత సాక్ష్యాలున్నాయి. బహుశా అందువల్లనే ఆ పుస్తకంలోని అనేక విషయాలు వర్తమానంలో కూడ ప్రాసంగికంగా ఉన్నాయి.

దాదాపు ఎనిమిదేళ్ల బాలిక సుందరమ్మకు యాభై ఏళ్ల వయసున్న మేనమామతో పెళ్లి జరిపించడానికి తల్లి చేసిన రహస్య ప్రయత్నాలు, ఇద్దరు అన్నల వ్యతిరేకత, వారిని పొదిలి బజారుకు ధాన్యం అమ్ముకురావడానికి పంపించి, కూతురిని తీసుకుని తన తమ్ముడి ఇంటికి వెళ్లి, రహస్యంగా, బలవంతంగా పెళ్లి చేయడం, ఐదేళ్ల లోపే సుందరమ్మకు పాప పుట్టడం, భర్త చనిపోయి, దిక్కులేనిదైపోయిన సుందరమ్మ తల్లి తన కష్టాలకు, కూతురి కష్టాలకు తన కుల మతాచారాలే కారణమని గుర్తించి, మంచి మతం వైపు వెళ్లమని సుందరమ్మకు చెప్పి కన్ను మూయడం, సుందరమ్మ కొనసాగించిన అన్వేషణ, కూతురికి బాల్యం తీరకుండానే పెళ్లి చేయడానికి భర్త ప్రయత్నించినప్పుడు సుందరమ్మ తిరుగుబాటు చేసి ఇంటినుంచి పారిపోవడం, పొదిలి మిషనరీకి చేరి ఆశ్రయం కోరడం, వారు అప్పటి చట్టప్రకారం కూతురిని చేర్చుకోవడానికి వీల్లేదని చెప్పి, అప్పటికి ఆమెను మాత్రం తీసుకోవడం, గ్రామస్తులు మిషనరీ మీద దాడిచేసి వాదనకు దిగడం, సుందరమ్మ తన ఇష్టప్రకారమే అక్కడ ఉన్నానని చెప్పడం, రెండు సంవత్సరాల తర్వాత కూతురు కూడ ఆమెను చేరడం, మంచి మతం కోసం వెతుకులాటలో ఆమె క్రైస్తవాన్ని చేరడం, లేదా క్రైస్తవం ఆమెను చేరదీసుకోవడం – ఇదీ కథ

దాదాపు ఎనిమిదేళ్ల బాలిక సుందరమ్మకు యాభై ఏళ్ల వయసున్న మేనమామతో పెళ్లి జరిపించడానికి తల్లి చేసిన రహస్య ప్రయత్నాలు, ఇద్దరు అన్నల వ్యతిరేకత, వారిని పొదిలి బజారుకు ధాన్యం అమ్ముకురావడానికి పంపించి, కూతురిని తీసుకుని తన తమ్ముడి ఇంటికి వెళ్లి, రహస్యంగా, బలవంతంగా పెళ్లి చేయడం, ఐదేళ్ల లోపే సుందరమ్మకు పాప పుట్టడం, భర్త చనిపోయి, దిక్కులేనిదైపోయిన సుందరమ్మ తల్లి తన కష్టాలకు, కూతురి కష్టాలకు తన కుల మతాచారాలే కారణమని గుర్తించి, మంచి మతం వైపు వెళ్లమని సుందరమ్మకు చెప్పి కన్ను మూయడం, సుందరమ్మ కొనసాగించిన అన్వేషణ, కూతురికి బాల్యం తీరకుండానే పెళ్లి చేయడానికి భర్త ప్రయత్నించినప్పుడు సుందరమ్మ తిరుగుబాటు చేసి ఇంటినుంచి పారిపోవడం, పొదిలి మిషనరీకి చేరి ఆశ్రయం కోరడం, వారు అప్పటి చట్టప్రకారం కూతురిని చేర్చుకోవడానికి వీల్లేదని చెప్పి, అప్పటికి ఆమెను మాత్రం తీసుకోవడం, గ్రామస్తులు మిషనరీ మీద దాడిచేసి వాదనకు దిగడం, సుందరమ్మ తన ఇష్టప్రకారమే అక్కడ ఉన్నానని చెప్పడం, రెండు సంవత్సరాల తర్వాత కూతురు కూడ ఆమెను చేరడం, మంచి మతం కోసం వెతుకులాటలో ఆమె క్రైస్తవాన్ని చేరడం, లేదా క్రైస్తవం ఆమెను చేరదీసుకోవడం – ఇదీ కథ

పుస్తకంలో బ్రాహ్మణ, అస్పృశ్య కులాల గురించి స్పష్టమైన ప్రస్తావన ఉన్నప్పటికీ, ప్రధాన పాత్ర మధ్యంతర కులానికి చెందినదనే సూచన తప్ప స్పష్టత లేదు. అయినా మొత్తంగా సామాజిక, వ్యక్తిగత జీవితాలలో కుల, మతాల పాత్ర, ఆచార వ్యవహారాల పట్టు, ఆ ఆచార వ్యవహారాల పేరుతో సమాజం మీద బ్రాహ్మణుల ఆధిపత్యం గురించి పుస్తకం చాల సూక్ష్మమైన వివరాలు కూడ ఇస్తుంది. ప్రస్తుతం ఆధునికీకరణతో ఆ ఆచారాలు తగ్గాయని, బ్రాహ్మణుల పట్టు తగ్గిందని చాల మంది అంటారు గాని సామాజిక జీవితంలో కుల మతాల పట్టు ఇప్పటికీ తగ్గలేదు సరిగదా, పెరిగిందేమో కూడ. పాత ఆచారవ్యవహారాలలో కొన్ని అంతరించి పోయాయేమో, కొన్ని మారిపోయాయేమో గాని ఆ స్థలం లోకి కొత్త ఆచార వ్యవహారాలు, కొత్త మూఢనమ్మకాలు వచ్చి చేరాయి. హిందూ మతం, దానిలో అంతర్భాగమైన కులం నిరంతరం పునరుత్పత్తి అవుతున్నాయి. నిజానికి హిందూ మతం, దాని పవిత్ర గ్రంథాలలో చెప్పిన విషయాల ఆధారంగానే హింసనూ, అసమానతనూ సమర్థించే మతం. ఒక వర్గం ఉత్పత్తిలో భాగం పంచుకోకుండా ఉత్పత్తి ఫలితాలను అనుభవించడానికి భగవంతుడి ఆమోదం ఉందని చెప్పే మతం. పూర్వజన్మ దుష్కృతాల పేరుతో, పునర్జన్మ అవకాశాల పేరుతో ఇప్పటి దోపిడీ పీడనలను సమర్థించే మతం, నిర్దాక్షిణ్యమైన మతం. ఏ మాత్రం ఆలోచనాపరులైనా, సున్నిత, మానవీయ భావాలున్నవాళ్లయినా దాన్ని అసహ్యంచుకోకుండా, అవకాశం వస్తే దాని నుంచి బైటికి వెళ్లకుండా ఉండలేరు. ఇక స్వయంగా ఆ మతగ్రంథాలే, భగవానువాచ ప్రకారమే స్త్రీల మీదా, “నిమ్న” కులాల మీద అణచివేతను, నిమ్నత్వాన్ని సమర్థించినప్పుడు, ఆ స్త్రీలు, నిమ్నకులాలు దానిలో కొనసాగడానికి కారణమే లేదు. బైటికి పారిపోవడం ఎంతమాత్రమూ ఆశ్చర్యకరం కాదు.

మతాంతరీకరణ చర్చ నిజానికి ఈ అంశం మీద, హైందవం నుంచి అత్యధిక సంఖ్యాకులను బైటికి తోసే స్థితి మీద జరగాలి. కాని ఇస్లాం, క్రైస్తవ మతాలలోకి మతాంతరీకరణకు ఆ రెండు మతాల బలప్రయోగమో, ప్రలోభమో కారణమని చర్చ జరుగుతున్నది. ఈ పుస్తకం తప్పనిసరిగా ఆ చర్చను మరొక కోణం నుంచి చూసే అవకాశం కలిగిస్తుంది. ముస్లిం పాలకులు హిందువులను బలప్రయోగం ద్వారా తమ మతంలోకి మార్చుకున్నారని, వలసవాద పాలకవర్గాలు హిందువులను ప్రలోభపెట్టి క్రైస్తవంలోకి ఆకర్షించాయని ఒక అభిప్రాయం బలంగానే ఉంది. కాని మతాంతరీకరణకు భయం గాని, ప్రలోభం గాని మాత్రమే కారణాలు కావు, హిందువులు తమ మతం నుంచి బైటికి పోవడానికి బైటి నుంచి ఆకర్షణ ఎంత కారణమో, అందుకు సమానంగానో, ఎక్కువగానో లోపలి నుంచి వికర్షణ కూడ కారణమవుతుందని ఒప్పుకోవాలి. హైందవంలోని దుస్సహమైన పరిస్థితి కల్పించిన భూమిక మీదనే ఇతర మతాల ఆకర్షణ లేదా బలప్రయోగం బలపడ్డాయి. ఈ పుస్తకం హైందవం తనలోంచి స్త్రీలను ఎట్లా నెట్టి వేస్తుందో చూపుతుంది.

ఇక చివరిగా తెలుగు సాహిత్యంలో ప్రచార సాహిత్యం అనే పేరుతో చిన్నచూపుకు గురవుతున్న సాహిత్యధార గురించి కూడ ఈ పుస్తకం కొన్ని ఆలోచనలను ప్రేరేపిస్తుంది. ప్రచార సాహిత్యం అనే మాట ద్వారా, ఆ సాహిత్యంలో సాహిత్యకత ఉండదని, దానిలో విశ్వసనీయ జీవిత చిత్రణ గాని, సాహిత్యానికి మౌలికమైన అనుభూతి సాంద్రత గాని ఉండవని, ప్రచార లక్ష్యంతో జీవితాన్ని, వస్తువును పలచబారుస్తారని, వక్రీకరిస్తారని ఒక అభిప్రాయం తెలుగు సాహిత్యంలో వంద సంవత్సరాలకు పైగా ఉంది. ప్రజా ఉద్యమాలు, ఉద్యమాలకు అనుబంధంగా సాహిత్యం పెరుగుతూ వచ్చిన కొద్దీ ఈ తప్పుడు అంచనా కూడ పెరుగుతూ వచ్చింది. మరొకవైపు ఆధునిక తెలుగు సాహిత్యమంతా స్పష్టమైన భావ ప్రచారం కోసమే జరిగింది. ఆమాటకొస్తే ప్రాచీన సాహిత్యంలో కూడ రాజాశ్రయం పొందినందువల్ల ఇవాళ్టికీ మిగిలిన సాహిత్యమంతా కూడ వర్ణాశ్రమ ధర్మ ప్రచారసాహిత్యమే. అయినా ప్రచార సాహిత్యం అంటే చిన్నచూపు కొనసాగుతున్నది. ఆ నేపథ్యంలో ది రివోల్ట్ ఆఫ్ సుందరమ్మ రచయిత అవగాహనను, మతాన్ని ప్రచారం చేయడానికి రాసిన పుస్తకమే అయినా, ఆ అవగాహనను వ్యతిరేకించేవారిని కూడ మెప్పించగల విశ్వసనీయ, ఉద్వేగభరిత జీవితచిత్రణ ఎలా చేయవచ్చునో చూపింది.

ఈ పుస్తకం చదవగానే, ఐసెక్ లైబ్రరీలో 1910ల నాటి దేశదేశాల సోషియాలజీ పత్రికలన్నీ ఉండేవి గనుక ఏమైనా సమీక్షలు వచ్చాయో వెతకడానికి ప్రయత్నించాను. అమెరికన్ జర్నల్ ఆఫ్ సోషియాలజీ తో సహా అక్కడ కనబడిన ఏ పత్రికలోనూ సమీక్షలు దొరకలేదు. కాని ఈ పుస్తకం వెలువడిన వెంటనే న్యూయార్క్ టైమ్స్ లోనూ, న్యూజిలాండ్ హెరాల్డ్ లోనూ వచ్చిన సమీక్షలు ఇప్పుడు ఇంటర్నెట్ పుణ్యమా అని దొరికాయి. ఆ సమీక్షలు కూడ చాల ఆలోచనాస్ఫోరకంగా ఉన్నాయి.

ఒక జీవిత చిత్రణగా, ఒక పరాయిదేశపు స్త్రీ తెలుగు స్త్రీ జీవితం గురించి చేసిన ప్రకటనగా, హైందవ పీడన నుంచి మహిళా విముక్తికి ఒక మార్గాన్ని సూచించిన ప్రచార రచనగా, ఒక సామాజిక శాస్త్ర వివరణగా ‘ది రివోల్ట్ ఆఫ్ సుందరమ్మ’ కు ఆనాడు ఎంత విలువ ఉండిందో అంతకన్న ఎక్కువ విలువ ఇవాళ ఉంది.

-ఎన్. వేణుగోపాల్

Download PDF

16 Comments

  • మంజరి లక్ష్మి says:

    కథ, పరిచయం బాగున్నాయండీ. బొమ్మలు కూడా నిజమైన కధే అని నిరూపించేటట్లే ఉన్నాయి. ఎట్లాగైనా ఈ విదేశీయులకు కొంత పరిశోధనాత్మకంగా, రుజువులు చూపిస్తూనే రాసే శక్తి ఉంది. చివరి బొమ్మలో క్రింద పొయ్యి, పైన గోనెసంచీ, దాన్లో ఏదో ఉన్నట్లుంది. ఆ బొమ్మలో చూపించినదేమిటండీ?

  • N Venugopal says:

    మంజరి లక్ష్మి గారూ,

    కృతజ్ఞతలు. నిజమైన కథ కావచ్చుననే నా అభిప్రాయం కూడ. బహుశా 1890లలో జరిగి ఉంటుందేమో. కథలో అప్పటికే అస్పృశ్యులు క్రైస్తవంలో చేరారని ఉంది. వల్పుల సుందరమ్మ ఇప్పుడు చేరింది. కాని 1909/10 నాటికే వల్పుల జాకబ్ రెవరెండ్ అయ్యాడంటే వీటి మధ్య ఏదో సంబంధం ఉందని నా అనుమానం. చివరి బొమ్మ ఉన్న అధ్యాయంలో క్రైస్తవం గురించి మాట్లాడితే దయ్యం పట్టిందనుకుని, మాంత్రికులను పిలిచి, మనిషిని గోనె సంచిలో కట్టి, కింద మంటపెట్టి దయ్యాన్ని పారదోలడం గురించి ఉంది. ఆ బొమ్మ దానికి సూచన కావచ్చు.

    • మీరన్నది నిజం కాదు.చివరి బొమ్మలో వున్న అధ్యాయంలో సుందరమ్మ తల్లి తను యెంతగా దేవతలను , పూజారులను నమ్మిందీ , వారికి యెన్ని కానుకలను సమర్పించిందీ , దాని వలన తాను తన భర్త చేతిలో యెన్ని సార్లు దెబ్బలు తిన్నదీ చెపుతుంది.[Page 75].అంతేకాని క్రైస్తవం గురించి మాట్లాడినందుకు కాదు.

  • Thirupalu says:

    మంచి సమీక్ష చదివాము. దన్యవాధాలు. వంద సంవ్వత్సరాల క్రితం రివోల్ట ఆఫ్‌ సుందరమ్మ ఉండటం అహశ్చర్యంగా వుంది. దీన్ని హిందుత్వవాదులు క్రైస్తవ మిషనిరీలు హిందు మతాన్ని దుర్ప్రాచారానికి వాడుకోవడంగా అభి వర్ణించ వచ్చు. అందులో నిజమెంత అని అలోచించరు.

  • ఎస్.హరగోపాల్ says:

    సుందరమ్మ నిజమే కావాలి. అదెవరి కథయినా వందేళ్ళ కింద అంత విప్లవభావాలు కలిగివుండడమే కాదు. తిరుగుబాటు చేయడం చాలా గ్రేట్. ఆ కథ మీ వల్ల మేం తెలుసుకోగలిగినాం. మీకు మా కృతజ్ఞతలు.

  • అసమానతల, దురాచారాల సమాజంపై సుందరమ్మ 19వ శతాబ్ది చివరిలోనో, 20వ శతాబ్ది ఆరంభంలోనో చేసిన తిరుగుబాటు కథ నిజమైనా, కాకపోయినా, దానిని ఇప్పుడు పరిచయం చేసిన ఎన్. వేణుగోపాల్ అభినందనీయులు. ఇలాంటి మరుగునపడిన కథలెన్నో ఉన్నాయి. వాటిని వెలికితీయాల్సిన బాధ్యత పరిశోధక రచయితలదే.

  • ఎన్ వేణుగోపాల్ says:

    తిరుపాలు గారు,
    చల్లా శ్రీనివాస్ గారు,
    ఎస్ హరగోపాల్ గారు,
    బుద్ధి యజ్ఞమూర్తి గారు,

    ధన్యవాదాలు.

    దాదాపు ఇరవై ఏళ్లుగా రాద్దామనుకుంటున్న వ్యాసం, మతాంతరీకరణ చర్చ సందర్భంలో ఒకటి రెండు సార్లు మొదలుపెట్టి కూడ పూర్తి చేయలేకపోయిన వ్యాసం, అఫ్సర్ ఒత్తిడి వల్ల ఇన్నాళ్లకు బైటపడింది. నిజానికి ఇంకా రాయవలసింది ఎంతో ఉంది. పుస్తకంలో రచయిత్రి చేసిన వ్యాఖ్యలు, ఆమె నోట్స్ లో దాదాపు 30 పేజీలు చాల వివరంగా హిందూ మతగ్రంథాల నుంచి ఉల్లేఖనలతో స్త్రీలు హైందవాన్ని వదలడం ఎంత అనివార్యమో చూపింది. అదంతా రాయవలసే ఉంది. కాని కాలమ్ విస్తరభీతి (కాలమ్ వెయ్యి పదాలకు మించగూడదని ఒక సంప్రదాయం. ఐదువందాల పదాల కాలమ్స్ కూడ రాశాను) వల్ల పదిహేను వందల పదాల దగ్గర దీన్ని ఆపవలసి వచ్చింది. సామ్రాజ్యవాదానికి మద్దతుగా నిలుస్తున్న క్రైస్తవ మత ప్రచారం అనే విమర్శ రావచ్చుగాని ఆ పుస్తకపు చారిత్రక, సామాజిక, మత నేపథ్యం వివరిస్తూ అనువాదం చేస్తే బాగుంటుంది….

    • కల్లూరి భాస్కరం says:

      వేణుగోపాల్ గారూ..అభినందనలు. మీ పుస్తక పరిచయం, వ్యాఖ్యా రెండూ బాగున్నాయి. ఆలోచింపజేశాయి. బ్రిటిష్ ఇండియా నాటి మన సామాజిక చరిత్రను నమోదు చేసిన ఇలాంటి పుస్తకాలను అన్నిటినీ గుర్తించి సమీక్షిస్తే నేటి మన సమస్యల మూలాలు, రూపు రేఖలు ఎలా ఉన్నాయో, మన సమాజంలో ఎంత మౌలిక పరివర్తన వచ్చిందో తెలుస్తుంది. నా ఉద్దేశంలో చరిత్ర అవిచ్ఛిన్నం. అందుకే ఈ దేశపు వర్తమానంపై ఏ మాత్రం సాధికారంగా మాట్లాడాలన్నా సుదూరగతంలోకి వెళ్లవలసిందేనని నేను నమ్ముతాను. మన మతంలోని నిర్దాక్షిణ్యత గురించి, మతాంతరీకరణల గురించి మీ మాటలు చదివాక రాంభట్లగారు చెప్పిన విషయాలు గుర్తొచ్చాయి. బెంగాల్ లో ముస్లిం జనాభా పెరగడానికి నిర్బంధ మతాంతరీకరణలు కారణం కావు. హిందూ సమాజం చిన్న చిన్న పొరపాట్లకు కూడా నిర్దాక్షిణ్యంగా మతం నుంచి తరిమేయడమే కారణం. మరోసారి అభినందనలు.

  • ramesh kumar says:

    ఇది చదువుతుంటే ఒక్కటి అనిపించింది… బ్రాహ్మనిజం, క్యాపిటలిజం … ఈ రెండూ కూడా కాలానుగుణంగా తమ తమ రూపాలను, స్వభావాన్ని మార్చుకుంటూ జనాలను ఎలా పీడిస్తాయి అనేది …!!

  • N Venugopal says:

    ఈ వ్యాస పాఠకులతోనూ, సారంగ పాఠకులతోనూ ఒక గొప్ప సంతోష వార్త పంచుకోవడానికి….

    ఈ ముసిముసి వేకువన ఈ వ్యాసం చదివి పాండిచేరి నుంచి చరిత్ర అధ్యాపకులు బి. రామచంద్రారెడ్డి గారు ఫోన్ చేశారు. అభినందనలు సరే గాని, స్వయంగా ప్రకాశం జిల్లాకు చెందిన రామచంద్రారెడ్డి గారు గత శతాబ్ది తొలిరోజుల్లో క్రైస్తవ పాఠశాలగా రామయపట్నం ప్రశస్తి చెపుతూ రెండు పుస్తకాల రిఫరెన్స్ ఇచ్చారు. వాటిలో ఒకటి మద్రాస్ బిషప్ రైట్ రెవరెండ్ హెన్రీ వైట్ హెడ్ రాసిన ది విలేజ్ గాడ్స్ ఆఫ్ ఇండియా. మరొకటి, నేను ఎగిరి గంతేసిన పేరు — ద్రవిడియన్ గాడ్స్ ఇన్ మాడర్న్ హిందూయిజం. (రెండు పుస్తకాలూ నాకు వెంటనే ఇంటర్నెట్ మీద దొరికాయి!!) రెండో పుస్తక రచయిత ఎవరో తెలుసునా? విల్బర్ థియొడర్ ఎల్మోర్ – అవును పై పుస్తక రచయిత్రి భర్త. ఆయన పి ఎచ్ డి థీసిస్ అది. 1900 నుంచి ఇండియాలో ఉన్నానని, 1909-10లలో యూనివర్సిటీ ఆఫ్ నెబ్రాస్కా లో ఈ అంశం మీద పి ఎచ్ డి చేయాలని ఆలోచన కలిగిందని, 1911లో ఇండియా తిరిగి వెళ్లాక పరిశోధన సాగించానని, 1915లో వెలువడిన పుస్తకంలో రాశాడాయన….తీగ లాగితే ఎక్కడెక్కడి డొంకలు కదులుతాయో…..

    • B. Rama Chandra Reddy says:

      డియర్ వేణుగోపాల్ గారు
      ధన్యవాదాలు. నాకు తెలిసిన విషయాలు మీతో పంచుకున్నాను. అది మీకు ఉపయోగపడితే నాకన్నా సంతోషించే వాళ్ళు ఎవరు వుండరేమో.
      వేణుగోపాల్ గారు నా పేరు mention చేయడం నాకు గర్వంగా వుంది.

  • P. Jayaprakasa Raju says:

    The Revolt Of Sundaramma పుస్తకం నా వద్ద కూడా వుంది. నేను చదివాను. గతంలో హిందూమతంలొ అగ్రవర్ణాలవారు క్రింది కులాలవారిని అవమానపరిచి , అణగద్రొక్కి తమ చెప్పుచేతలలో వుంచుకోవడానికి దేవుని పేరిట చేసిన ఘోరక్రుత్యాలను రచయిత్రి చక్కగా record చేశారు. అవే బాధితులను అన్యమతం లోకి వెళ్ళడానికి దోహదం చేశాయనడం అక్షర సత్యం.
    యిందులో రచయిత్రి చేసిన కొన్ని వ్యాఖ్యలు ,కొత్త సంగతులు చూడవచ్చు.
    1 . సుందరమ్మ తల్లి తన చివరిరోజుల్లో కూతురుతో “It seems there are people, a long ways from here, who do not believe in Hinduism, or Mohammedanism, either. …..Promise me , Sundaree, that you will search for Him, in another religion.”[Page 82] అని చెపుతుంది. ఇది నిజంగా జరిగినదే అనుకుంటే సుమారు 1890 సంవత్సరంలోనే ఆమెకు ఇస్లాం మతం గురించి తెలియడం ఆశ్చర్యమే !
    2 . సుందరమ్మ తన కూతురును తన దగ్గరకు రప్పించుకునే ప్రయత్నంలో విఫలమయి బాధపడుతుంటే మిషనరీ పెద్దలు “We must ask God again to show us some way to teach Sundaramma that she must follow Him, even in the dark.”[page.127] అని అంటారు. కనుక యే మతం లో అయినా దేవుడి పేరు చెప్పి ప్రజలను మోసం చేయడమే అనిపిస్తుంది కదా! ప్రత్యేకించి ఒక మతాన్నే తప్పు పట్టాల్సిన అవసరం లేదనుకుంటా !!
    3 . రచయిత్రి ఒకచోట “Hinduus know nothing about physiology.”[Page. 151] అని అంటారు. బహుశా వైద్యం కొన్ని వర్గాల చేతిలోనే వుండి సామాన్యులకు తెలియకపోవడం వల్ల అలా అనుకొని వుంటారనుకుంటాను.
    4 . స్వామి వివేకానంద గురించి చేసిన వ్యాఖ్యలు కొత్తగా వున్నాయి.“Such ravings sound incredible.”[Page. 152] అని అంటారు ఆయన వుపన్యాసాల గురించి.
    5 . సుందరమ్మ తల్లి తను యెంతగా Priests కు నగలు, డబ్బు సమర్పించినా తను బాధలనుండి విముక్తి కాలేదని చెపుతూ , అలా చేయడం వల్ల తను తన భర్త చేతిలో చావుదెబ్బలు తిన్నానని చెపుతుంది. ఆ సందర్భంలో ఆమెను భర్త యెలా శిక్షించింది చిత్రరూపంలో చూపించారు రచయిత్రి.[Page 75.].
    మొత్తానికి ఈ పుస్తకం గురించి యిన్ని సంవత్సరాల తర్వాత వేణుగారి ద్వారా అందరకు తెలియడం చాలా బాగుంది. — పి. జయప్రకాశ రాజు.

  • manjari lakshmi says:

    పి. జయప్రకాశ రాజు గారు
    .
    మీరు 1వ పాయింటులో `…….. ఇది నిజంగా జరిగినదే అనుకుంటే సుమారు 1890 సంవత్సరంలోనే ఆమెకు ఇస్లాం మతం గురించి తెలియడం ఆశ్చర్యమే !’ అప్పటి కాలంలో ఇంకా ఆ ప్రాంతాలలో ముస్లిం మతంలోకి మారటమనేది లేదా! వాళ్ళ కసలు ఆ మతమే తెలియదా?
    మీరు చెప్పిన 2, 3 పాయింట్లు కుడా నిజమేననిపిస్తోంది. 5వ పాయింటులో priests అంటే హిందూ పూజారులనా. అంటే ఆమె భర్త గోతాములో పెట్టి క్రింద మంట పెట్టింది priests కు నగలు, డబ్బులిచ్చినందుకా! మరి వేణుగోపాల్ గారు వేరేగా చెప్పారు కదా!

    • నాకు తెలిసినంతవరకూ ఆ ప్రాంతం లో ఇస్లాం మతం గురించి ఆ కాలం లో తెలిసే అవకాసం లేదు. బహుశా రచయిత్రి తనకు తెలిసిన విషయం వ్రాసారేమో ! పుస్తకం లో 16 అధ్యాయాలు వున్నాయి. 9 వ అధ్యాయం లో ఈ చిత్రం వున్నది. పూజారులు అనే అర్థం. వారికి నగలు , డబ్బు యిచ్చినా కూడా తన బాధలు తీరలేదని బాధ పడుతుంటే భర్త దండించాడు..

  • N Venugopal says:

    పి జయప్రకాశ్ రాజు గారు,
    మంజరి లక్ష్మి గారు,

    1. గుంటూరు జిల్లా లోకి ముస్లింల ప్రవేశం పద్నాలుగో శతాబ్దిలో, కచ్చితంగా చెప్పాలంటే 1323లో కాకతీయ సామ్రాజ్యాన్ని మాలిక్ కాఫుర్ ఓడించిన తర్వాత మొదలయింది. 1458లో అది బహమనీ రాజ్యంలో కలిసింది గనుక ఆ ప్రభావం ఇంకా పెరిగి ఉంటుంది. ఆ తర్వాత మళ్లీ కొంతకాలం విజయనగర రాజ్యంలోకి చేరింది గాని 1579లో గోల్కొండ సుల్తాన్ కులీ కుతుబ్ షా కొండవీడును స్వాధీనం చేసుకుని దానికి ముర్తుజానగర్ అని పేరు కూడ మార్చాడు. ఆకాలంలో మతాంతరీకరణ జరిగే ఉంటుంది. ఆ ప్రాంతంలో ఎన్నో పాత ముస్లిం కట్టడాలు, గ్రామనామాలు ఉన్నాయి. అందువల్ల ఈ పుస్తక సమయానికి ఇస్లాం ప్రభావం ఉండే ఉంటుంది.

    2. మొదట ఆ బొమ్మ గురించి మంజరి లక్ష్మి గారు అడిగినప్పుడు నేను పుస్తకం చూడకుండా జ్ఞాపకం మీద రాశాను. ఇప్పుడు పుస్తకం చూస్తే, నేనప్పుడు రాసింది తప్పు అని తేలింది. క్షమించాలి. ఆ బొమ్మ దగ్గర ఉన్న సంభాషణల్లో తాను పురోహితులనూ, విగ్రహాలనూ గౌరవిస్తూ ఎంతో ఖర్చు పెట్టాననీ, అందుకు భర్త హింసించాడనీ సుందరమ్మ తల్లి అంటుంది. అప్పుడు బస్తాలో నిన్ను వేలాడదీసింది అందుకేనా అని సుందరమ్మ అడుగుతుంది.

ఒక వ్యాఖ్యను

Your email address will not be published. Required fields are marked *

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)