ధ్యానం

chinnakatha

చిన్నప్పుడు మా పక్కింట్లో బిఎస్సీ విద్యార్థి ఒకతను ఉండేవాడు. ‘అన్నయ్యా, అన్నయ్యా’ అంటూ చుట్టుపక్కల పిల్లలమందరం అతని వెనకాల తిరుగుతుండే వాళ్ళం.

ప్రతి ఆదివారం సాయంత్రం అన్నయ్య మమ్మల్నందర్నీ మా ఊరిని ఆనుకుని ప్రవహిస్తున్న యేటి ఒడ్డుకు తీసుకెళ్ళేవాడు. అక్కడ ఇసుకలో పిల్లమూకనంతా చుట్టూ కూర్చోపెట్టుకుని సైన్సుపాఠాలు, నోటిలెక్కలు, పొడుపుకథలు, వాళ్ళ కాలేజీ విశేషాలు చెప్తుండేవాడు.

ఉన్నంటుండి ఒకరోజు “అందరూ మాట్లాడకుండా పద్మాసనంలో కూర్చుని ధ్యానం చెయ్యండి. రోజూ కాసేపు ధ్యానం చేస్తే తెలివితేటలు, జ్ఞాపకశక్తి పెరుగుతాయి. బాగా చదివుకో గలుగుతారు” అన్నాడు అన్నయ్య.

“ధ్యానం అంటే ఏంటి?” అని అడిగాడొక పిల్లాడు.

“మెడిటేషన్” అన్నాడు అన్నయ్య.

“మెడిటేషనంటే?” అడిగిందింకో పిల్ల.

“ధ్యానం” అన్నాడో కొంటె పిల్లాడు.

అన్నయ్య వాడివైపు ప్రశాంతంగా ఒక చూపు వేసి “నిశ్శబ్దంగా కళ్ళు మూసుకుని కూర్చోవడం” అని చెప్పాడు. అందరం ఏం మాట్లాడకుండా ‘అన్నయ్య ఎప్పుడు కళ్ళు తెరవమంటాడా’ అని ఎదురుచూస్తూ కళ్ళుమూసుక్కూర్చున్నాం.

మళ్ళీ ఆదివారం అన్నయ్య మమ్మల్ని ఏటి ఒడ్డుకు తీసుకెళ్ళేలోపల మేం ఏ ఇద్దరం ఎప్పుడు కలిసినా ‘ధ్యానం చేసినప్పుడు ఎవరికి ఏం ఆలోచనలు వచ్చాయి?’ అన్న విషయమే మాట్లాడుకున్నాం. ఏతావాతా తేలిందేంటంటే ఒకడు అమ్మ చేసి దాచిపెట్టిన అరిసెలు అమ్మకు తెలీకుండా ఎట్లా తినాలా అని ఆలోచిస్తే, ఇంకొకడు మాయచేసి తన హోంవర్కు అక్కచేత ఎట్లా చేయించాలా అని ఆలోచించాడు. ఒక అమ్మాయి అమ్మ చెప్పే పని ఎట్లా తప్పించుకోవాలా అని ఆలోచిస్తే, ఇంకో అమ్మాయి తెల్లవారుజామున లేచి చదువుతున్నట్టుగా నటిస్తూ ఎట్లా నిద్రపోవాలా అని ఆలోచించింది.

అన్నయ్య మా ఊళ్ళో చదివు అయిపోయి పై చదువులకు వెళ్ళిపోయాక మా ఏటి ఒడ్డు సమావేశాలు ఆగిపోయాయి. మిగతావాళ్ళంతా ఏం చేశారో నాకు తెలీదుగానీ నేను మాత్రం ధ్యానం అంటే ఏంటో తెలుసుకోవాలని దృఢంగా సంకల్పించుకున్నాను.

కాలక్రమంలో ‘మెడిటేషన్’, ‘ధ్యానం’ అన్న పదాలు కనిపించిన ప్రతి పుస్తకం చదివేశాను కానీ ధ్యానమగ్నురాలిని కాలేకపోయాను.

ఆమధెప్పుడో మా ఊళ్ళో యోగా తరగతులు పెడుతున్నారనీ, ధ్యానం చెయ్యడం నేర్పిస్తారనీ తెలిసి ఆ తరగతులకి వెళ్ళాలని తెగ ఆరాటపడిపోయి, నన్ను చేర్చుకుంటారో లేదో అని కంగారుపడిపోయి, నానాతిప్పలూపడి సీటు సంపాదించి, అష్టకష్టాలూపడి కోర్సు పూర్తిచేశాక నాకర్థమైందేంటంటే అన్నయ్య ధ్యానం చెయ్యమన్నప్పుడు పిల్లలంతా కళ్ళు మూసుక్కూర్చుని చేసిన వెర్రిమొర్రి ఆలోచనలనే ధ్యానం అంటారని.

‘అయ్యో! అన్నయ్య చెప్పిన ప్రకారం మానకుండా ధ్యానం చేస్తూ ఉండుంటే పాతికేళ్ళనుంచి నేను ధ్యానం చేస్తున్నానని గొప్పగా చెప్పుకునేదాన్ని కదా’ అని కాసేపు బాధపడి, ‘సరే! అయిపోయిందేదో అయిపోయింది. యోగా తరగతుల్లో నేర్చుకున్న ధ్యానాన్ని మాత్రం వదలకూడదు’ అని నిశ్చయించుకున్నాను. అట్లా మనసులో వచ్చే ఆలోచనలని గమనిస్తూ కూర్చుంటే కాసేపటికి ఆలోచనలు ఆగిపోతునాయి. ‘అబ్బో! నేను ధ్యానం చెయ్యగలుగుతున్నాను ‘ అని సంతోషించేలోపల నాకు తెలిసిందేమిటంటే ధ్యానం చేస్తున్నాను అనుకుంటూ నేను కూర్చుని నిద్ర పోతున్నానని.

‘కూర్చుని నిద్రపోవడమేంటి ఛండాలంగా, హాయిగా పడుకుని నిద్రపోక’ అనుకుని ఆ ధ్యానాన్ని వదిలేశాక ఏ సంస్థ ధ్యానతరగతుల్ని నిర్వహించినా వెళ్ళడం, ‘ఇది నాకు కుదిరేది కాదు’ అనుకుని వదిలెయ్యడం నాకు అలవాటైపోయింది.

ఇప్పుడు మళ్ళీ ఇంకో కొత్త ‘స్కూల్ ఆఫ్ యోగా’ వాళ్ళ ధ్యానశిక్షణకి వెళ్ళబోతూ ‘ఇదే ఆఖరు, ఎట్లాగైనా దీన్ని సాధించాలి’ అని స్థిరంగా నిర్ణయించుకున్నాను. అనుకున్నట్టుగానే మొదటి రెండు రోజులు చాలా ఆసక్తికరంగా సాగిన శిక్షణ చివరిదైన మూడోరోజుకు చేరుకుంది. ఆరోజు పైనుంచి పెద్దగురువుగారు వచ్చారు ఉపన్యాసం ఇవ్వడానికి.

“ఆధ్యాత్మికత అంటే ఏమిటి?” అన్న ప్రశ్నతో క్లాసు మొదలయింది.

ఒక్కొక్కరు ఒక్కొక్కరకంగా సమాధానం చెప్పారు. ఆధ్యాత్మికత అన్న పదానికి చాలా నిర్వచనాలే వచ్చాయి కానీ గురువుగారికి ఏదీ నచ్చినట్టు లేదు. ఎవరేం చెప్పినా గురువుగారు “ఇంకా…ఇంకా…” అని అడుగుతూనే ఉన్నారు. ఇంకేం సమాధానాలు రాని దశ వచ్చాక ఒక పదేళ్ళ అమ్మాయి లేచి నిలబడింది.

ఈ రోజుల్లో పెద్దవాళ్ళు పిల్లల్ని “మీలా మా కాలంలో మేం టీవీ లెరుగుదుమా? కంప్యూట ర్లెరుగుదుమా? సెల్ ఫోన్లెరుగుదుమా?” అంటూ సాధించే లిస్టుకి యోగాక్లాసుల్ని కూడా కలపాలని నిర్ణయించుకున్నా న్నేను ఆ పిల్లని చూశాక.

“మగవాళ్ళయితే కాషాయబట్టలు కట్టుకుని, గడ్డాలూ, మీసాలూ పెంచుకోవడం, ఆడవాళ్ళైతే కాసంత బొట్టు పెట్టుకుని, పట్టుచీరలు కట్టుకోవడాన్ని ఆధ్యాత్మికత అంటారు” అని చెప్పిందా అమ్మాయి.

ఆ మాటలకి ఉలిక్కిపడ్డ జనం గట్టిగా నవ్వడానికి భయపడి మూతులకి చేతులు అడ్డం పెట్టుకున్నారు. వాళ్ళని కళ్ళతోనే వారించి గురువుగారు ఆప్యాయంగా ఆ అమ్మాయి తల నిమురుతూ “అట్లా చెప్పావేంటమ్మా? నీ కెందు కట్లా అనిపించింది?” అని అడిగారు.

దానికా అమ్మాయి “టీవీల్లో అటువంటి వేషాల్తో కనిపించే వాళ్ళని ఆధ్యాత్మిక గురువులు అంటారు కదండీ! అందుకే అట్లా చెప్పాను” అందా అమ్మాయి.

తలకాయ అడ్డంగా ఊపి గురువుగారు అరమోడ్పు కన్నులతో “ఆధిదైన ఆత్మయొక్క కతే ఆధ్యాత్మికత” అంతూ ఎవ్వరికీ అర్థం కాని ఒక విచిత్రమైన నిర్వచనం ఇచ్చారు.

“ఆధి అంటే ఎవరండీ?” అని అడిగిందా అమ్మాయి.

గురువుగారు ఆ అమ్మాయిని కూర్చోమన్నట్టు సైగచేసి “టైం చాలా అయింది. ఇంకా మాట్లాడుకోవలసిన విషయాలు చాలా ఉన్నాయి.

ముందు అందరూ ఒక అరగంట ధ్యానం చెయ్యండి” అన్నారు.

కళ్ళు మూసుకుని ‘ఆధ్యాత్మికత’ అన్న పదానికి నాదైన నిర్వచనం తయారుచెయ్యలనుకున్నాను కానీ నా వల్లకాక ‘గురువుగారు తొందరగా కళ్ళు తెరవమంటే బాగుండు’ అనుకుంటూ కూర్చున్నాను.

ఎట్టకేలకు గురువుగారికి దయకలిగి “అందరూ మెల్లగా కళ్ళు తెరవండి” అన్నారు. ‘అమ్మయ్య’ అనుకుని కళ్ళు తెరిచి, ‘ఇంక ఇంటికెళ్ళండి’ అని ఎప్పుడంటారా అని ఎదురుచూస్తున్నాను.

“ఇప్పుడొక ముఖ్యమైన విషయం చెప్తాను, అందరూ జాగ్రత్తగా వినండి” అంటూ మళ్ళీ చెప్పడం మొదలుపెట్టారు గురువుగారు. “రాజధాని నగర పొలిమేరల్లో మనం ఒక పెద్ద ధ్యాన కేంద్రాన్ని నిర్మించుకో బోతున్నాం. ధ్యాను లెవరైనా అక్కడ ధ్యానసాధన చేసుకోవచ్చు. పదివేలు చందా ఇస్తే సంవత్సరానికి పదిరోజులు డార్మిటరీలలో ఉండే అవకాశం పొందుతారు. లక్ష రూపాయలు చందా ఇస్తే సంవత్సరానికి పదిరోజులు ప్రత్యేకగది వసతి కల్పిస్తాం. దూరప్రాంతాలనుంచి కానీ, విదేశాలనుంచి కానీ ఎప్పుడో ఒకసారి వచ్చేవాళ్ళకి రోజుకు వెయ్యి రూపాయల చెల్లింపుమీద ఎన్నిరోజులైనా ఉండడానికి వీలుగా అన్ని వసతులతో కాటేజీలు కట్టిస్తున్నాం. ధ్యానకేంద్ర నిర్వాహకులు నడిపే భోజన ఫలహారశాల లుంటాయి. చేతనయినవా ళ్ళెవరైనా హోటళ్ళు పెట్టుకుని నడుపుకోవచ్చు.ధ్యానకేంద్రం పరిసరాల్లో అందుబాటు ధరల్లో ఇళ్ళస్థలాలు దొరుకుతున్నాయి. అవి కొనుక్కుని ఇల్లు కట్టుకో గలిగితే అంతకంటే అదృష్టం మరొకటుండదు. శాశ్వతంగా అక్కడే ఉండిపోయి ధ్యానంలోని మాధుర్యాన్ని సంపూర్ణంగా ఆస్వాదించవచ్చు. ధ్యానంలో ఆసక్తి ఉన్న మీ బంధువులకు, స్నేహితులకు ఈ విషయాలు చెప్పి మన ధ్యానకేంద్రం అభివృద్ధికి ఇతోధికంగా తోడ్పడండి…” గురువుగారి ఉపన్యాసం కొనసాగుతోంది కానీ అక్కడితో నా బుర్ర పనిచెయ్యడం మానేసింది.

‘ఇకమీదట ఏ ధ్యానశిక్షణ తరగతులకి వెళ్ళకూడ’దని గట్టిగా ఒట్టు పెట్టుకుని అక్కడినుంచి బయటపడ్డాను.

Jyothi–పాలపర్తి జ్యోతిష్మతి

 

Download PDF

8 Comments

  • బావుందండి. హాయిగా నడిపించారు కథని. అభినందనలు

    • పాలపర్తి జ్యోతిష్మతి says:

      ధన్యవాదాలు రాధగారూ!

  • రాఘవ says:

    ఇలాంటి వేలంవెర్రుల వెనుక జనం పరుగులెత్తేలా చేస్తున్న భౌతిక పరిస్థితులేమిటి?….పునాదిలోకి వెళ్ళి విశ్లేషించే మరిన్ని మంచి మంచి కధలు మాకు బాకీ ఉన్నారు మీరింకా….-అభినందనలు.

  • వెల్లంపల్లి అవినాష్ says:

    ధ్యానం పేరుతోనో, ఆధ్యాత్మికత పేరుతోనో, మరో పేరు తోనో సాగుతున్న వ్యాపారాన్ని అద్భుతమైన హాస్యంతో చెప్పారు! చాలా బాగుంది! :)

  • Thirupalu says:

    బాగుందండి. అందరూ మీలా నిజాయితిగా ఒప్పుకోవటం లేదు. కొందరు ద్యానం లో పి హెచ్‌ డి సాదించా మంటారు. దేన్నొ చూశామంటారు. మీ అంత నిజాయితి గా చెపితే ఎంత బాగుండునో గదా?

  • Palaparthi Jyothishmathi says:

    అవినాష్ గారికి, తిరుపాలు గారికి ధన్యవాదాలు.
    రాఘవకి నా ప్రయత్నం నేను చేస్తానని మాటిస్తున్నాను.

  • Udayabhaskar Emani says:

    చాల బావుంది కథ. కొన్నేళ్ళ క్రితం వరుకు నేను కూడా రెండు మూడు సార్లు మెడిటేషన్ కోసం ట్రై చేసాను. నాకు ఇలాగే జరిగింది. కళ్ళు మూసుకుని ధ్యానం చేస్తుంటే ఏవోవో గత స్మ్రితులు. నేను జాబు లో జాయిన్ అయ్యి ఒక కూతురు పుట్టాక ధ్యానం చేద్దామని ( ఎవరో వాళ్ళు వీళ్ళు డాక్టర్స్ అనండి మరిఎవ్వరొ పెద్దలనండి) ప్రయత్నించ. కళ్ళు మూసుకుని ధ్యానం చేస్తుంటే నా స్కూల్ ఫ్రెండ్స్, కాలేజీ ఫ్రెండ్స్ లేక పొతే నేను క్రికెట్ అడ్డుకునే రోజుల్లో ఫ్రెండ్స్, నేను తిరిగిన వూర్లు, అవి ఏవి ఒకటని కాదు అన్ని గుర్తుకు వచ్చేవి. అన్ని సార్లు అంటే కాని కొన్ని వేరే విషయాలు. అవన్నీ తలుచుకుంటే ఆనందం వేసేది. ఉద్యోగ రీత్యా మా నాన్నగారికి త్రాన్స్ఫెర్లు ఉండేవి. ఒక వూరు విడిచి వెళ్ళిపోతే మల్లి ఆవూరుకి వెళ్ళే అవసరం రాదు. వుండేది కాదు. కాని మనసులో కలవాలి వున్నా కలవలేని పరిస్తితి. మామూలు పరిస్తితుల్లో తలచుకోలెం. ఈ ధ్యానం లో ఆ రోజులు అన్ని గుర్తుకొచ్చేవి. ఏమో ధ్యానం అంటే ఇలాగే ఉంటుందేమో. కాని ఈ కథ చదువుతూ వుంటే చాల హాయిగ అని పించింది. థాంక్స్ ఫర్ ఠిస్ క్యూట్ స్టొరీ. సంతోషంగా నవ్వుకున్నాను చాల రోజులు తర్వాత. మీరు మరిన్ని మంచి కథలు రాయాలని కోరుతూ…

    భాస్కర్

  • Udayabhaskar Emani says:

    చాల బావుంది కథ. కొన్నేళ్ళ క్రితం వరుకు నేను కూడా రెండు మూడు సార్లు మెడిటేషన్ కోసం ట్రై చేసాను. నాకు ఇలాగే జరిగింది. కళ్ళు మూసుకుని ధ్యానం చేస్తుంటే ఏవోవో గత స్మ్రితులు. నేను జాబు లో జాయిన్ అయ్యి ఒక కూతురు పుట్టాక ధ్యానం చేద్దామని ( ఎవరో వాళ్ళు వీళ్ళు డాక్టర్స్ అనండి మరిఎవ్వరొ పెద్దలనండి) ప్రయత్నించ. కళ్ళు మూసుకుని ధ్యానం చేస్తుంటే నా స్కూల్ ఫ్రెండ్స్, కాలేజీ ఫ్రెండ్స్ లేక పొతే నేను క్రికెట్ అడ్డుకునే రోజుల్లో ఫ్రెండ్స్, నేను తిరిగిన వూర్లు, అవి ఏవి ఒకటని కాదు అన్ని గుర్తుకు వచ్చేవి. అన్ని సార్లు అంటే కాని కొన్ని వేరే విషయాలు. అవన్నీ తలుచుకుంటే ఆనందం వేసేది. ఉద్యోగ రీత్యా మా నాన్నగారికి త్రాన్స్ఫెర్లు ఉండేవి. ఒక వూరు విడిచి వెళ్ళిపోతే మల్లి ఆవూరుకి వెళ్ళే అవసరం రాదు. వుండేది కాదు. కాని మనసులో కలవాలి వున్నా కలవలేని పరిస్తితి. మామూలు పరిస్తితుల్లో తలచుకోలెం. ఈ ధ్యానం లో ఆ రోజులు అన్ని గుర్తుకొచ్చేవి. ఏమో ధ్యానం అంటే ఇలాగే ఉంటుందేమో. కాని ఈ కథ చదువుతూ వుంటే చాల హాయిగ అని పించింది. థాంక్స్ ఫర్ ఠిస్ క్యూట్ స్టొరీ. సంతోషంగా నవ్వుకున్నాను చాల రోజులు తర్వాత. మీరు మరిన్ని మంచి కథలు రాయాలని కోరుతూ…
    భాస్కర్

Leave a Reply to Udayabhaskar Emani Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)