అమ్మా నాన్నా… కొన్ని అన్నం ముద్దలు!

Velturu2

Velturu2

1

తెలీదు ఎందుకో, అన్నం ముందు కూర్చున్నప్పుడు  కాశిరాజు గుర్తొస్తాడు కొన్ని సార్లు!

ఇంకా

 అసలు ఎప్పుడొచ్చిందో,  చెప్పా పెట్టకుండా ఎప్పుడేలా  పెట్టే బేడా సర్దుకెళ్ళి పోయిందో తెలియని యవ్వనమూ గుర్తొస్తుంది. నోటి దాకా వచ్చిన అన్నం ముద్ద ఇట్టే జారిపోతుందేమో అన్నట్టు  భయపెట్టే జీవితాన్ని గట్టిగా పొదివి పట్టుకోవాలనే పిచ్చి తపన గుర్తొస్తుంది.

చాలా చిత్రంగానే  వుంటుంది జీవితం మరి! దాటిపోయిన మజిలీలన్నీఅలా ఎలా జారిపోయాయా అని కలతబెడ్తాయి. కాని, కవిత్వమనే మాయా లాంతరు పట్టుకొని ఆ దాటిపోయిన వీధుల్లో గాలి కిన్నెర మీటుకుంటూ, సంచారం చేస్తూ పోతున్న వాణ్ని ఈ మధ్య చూసాను నేను! అతనేవో పాడుకుంటున్నాడు, వొక్కో సారి తనలో తానే మాట్లాడుకుంటున్నాడు. వొక్కో క్షణపు అసహనంలో పక్కన ఎవరితోనో కాసేపు తగువు పడి, ఆ తరవాత పిల్లాడిలాగా కావిలించేసుకుంటున్నాడు. చాలా సార్లు అతను నేనే అనే ప్రతిబింబం అనిపిస్తాడు అందరికీ!

అతన్ని మనమూ మన లోకమూ  కాశిరాజు అని పిలుస్తున్నాం ఇప్పుడు  ఇంకేమని  పిలవాలో తెలియక!!

 

2

కాశిరాజు కవిత్వం చదువుతున్నప్పుడు ఆకలీ, యవ్వనమూ – వీటి చుట్టూ తిరిగే ఏదో వొక తాత్విక గానం వినిపిస్తుంది. ఇతని వాక్యాల్లో వొక తెలివైన అమాయకప్పిల్లాడు వొక తలుపు రెక్క సగమే  తెరిచి చిలిపిగా చూస్తూ వుంటాడు; ఎదో reflexive mood (స్వానుశీలన)లోకి మనల్ని తీసుకెళ్తాడు. ఇప్పటి కవుల దాదాపు అందరి కవితల్లోనూ మామూలుగానే కనిపించే ఈ స్వానుశీలన లక్షణం  కాశిరాజులో మాత్రం అదే ప్రధానంగా కేంద్రీకృతమై వుంటుంది.

Reflexivity – అంటే  తన లోపలికి తను చూసుకోవడం మాత్రమే కాదు, తలుపు ఓరగా తెరచి బయటికి చూడడమే కాదు. బయటికి ఎంత దూరం వెళ్తామో లోపలికీ అంతే దూరం వెళ్ళడం – అసలు సిసలు Reflexivity. కాశిరాజు కవిత్వమంతా ఈ Reflexive అలల చప్పుడు! కేవలం లోపలి మనిషి(insider)గా వుండే మామూలు Reflexivity ని కాశి కవిత్వం ఛాలెంజ్ చేస్తుంది. ఇతని కవిత్వంలోని ఈ స్వానుశీలన స్వభావం కేవలం తననే కాదు, బయటి పాత్రల్ని కూడా ప్రేమగా చూస్తుంది.

ఉదాహరణకి ఈ పంక్తులు చూడండి:

వర్షం వచ్చిన జాడ ఆ వాన కళ్ళకి తెలీదు
అమ్మది ఆకాశమంత దుఃఖం.
అమ్మకల్లకి నాన్న ఉపనది
మా దాహాలు తీరడానికి వాళ్ళు దు:ఖాల్లా ప్రవహిస్తారని
మాకెవ్వరికీ తెలీదు.

 

అమ్మా నాన్న కాశిరాజు కవిత్వంలో తప్పక కనిపించే పాత్రలు. కాని, అవి కాశిరాజు అనే వ్యక్తి తత్వానికి సంబంధించినంత వరకూ అతని లోపలి పాత్రలు కూడా! వాళ్ళ గురించి మాట్లాడుతున్నప్పుడు కాశిరాజు ఎప్పుడూ తనలోపలికి వెళ్ళిపోయి, అలా తవ్వుకుంటూ కూర్చుంటాడు.  ఇది కవిత్వంలో చాలా  కష్టమైన విద్య. కవి చాలా ఉద్వేగ భారాన్ని మోస్తూ బాలన్స్ చేసుకోవాల్సిన సందర్భం. ఉద్వేగాన్ని కేవలం ఉద్వేగంగా కాకుండా, దాన్ని కాసేపు objective గా కూడా చూడగలిగిన నిబ్బరం వున్నప్పుడే పై వాక్యాలు వస్తాయి.

 

తన కవిత్వం చదివే  పఠితని  కూడా ఆ స్వానుశీలన మూడ్ లోకి తీసుకు వెళ్ళడం కాశి ప్రత్యేకత.  ఇతని వొక్కో కవితా చదివేటప్పుడు గుండె చప్పుడు కాస్త పెరుగుతుంది. చదవడం అయిపోయాక అసలే చప్పుడూ వినపడని నిశ్శబ్దంలోకి శరీరాన్ని బట్వాడా చేసి వచ్చినట్టు వుంటుంది. అందుకే, కాశిరాజు కవితని ఆగి ఆగి చదవాలి. అలా ఆగినప్పుడల్లా అతని వూరులాంటి మన ఊళ్లోకి, అతని అమ్మానాయన లాంటి మన అమ్మానాయనల దగ్గిరకీ, వాళ్ళతో తెగిపోతున్న మన “కమ్యూనికేషన్” లోకి, మనల్ని చుట్టేసి వూపిరాడనివ్వని నగరపు మాయలోకీ వస్తూ పోతూ వుంటాం. మన గురించి మనం ఆలోచించుకునే/ బాధ పడే వ్యవధి ఇస్తూ, వాక్యాల్ని కూర్చుతూ వెళ్తాడు కాశిరాజు. ఆ వ్యవధిలో అతను మనల్ని Reflexive గా మార్చి, తన అమ్మానాన్నా కథలో మనల్ని పాత్రలుగా ప్రవేశ పెడతాడు.

కాశిరాజు కవిత తెగిపోతున్న ఆ తొలి సంభాషణల  గురించి ఎప్పటికీ తెగని మనియాది. ఈ కవిత రాసిన శరీరం ఆ కవిత రాయడం ముగిసాక ఎలాంటి నిద్రలోకి వెళ్తుందో తెలీదు. ఆ నిద్రల్లో అతన్ని ఏ కలల సర్పాలు ఎలా చుట్టుకుపోతాయో తెలీదు. సగం మాత్రమే నిండిన అతని కడుపు ఎంత మారాం చేస్తుందో!

కాశిరాజు

కాశిరాజు

3

కమ్యూనికేషన్

ఇంతలేటైంది కదరా ఇంకా తినలేదా అని
అమ్మకి ఆకలైనట్టే అడుగుతావుంటే
ఓ దుఃఖపు జీర నా చెవికెలా చేరిందీ తెలుస్తూ ఉంది
దాన్ని నాదాకా మోసుకొచ్చిన ప్రేమది ఎన్ని సెకన్ల వేగమని
ఎవరినడిగితే తెలుస్తుంది

కాల్ కట్ చేస్తే

ఫోన్ టూ హార్ట్ , హార్ట్ టూ అమ్మా నాన్న
అన్న సంభాషణ సమాదైపోయి
రేపు చేయాల్సిన పనినంతా రివైండ్ చేసుకున్నా

దాహమైనట్టు అనిపించాక లెగాలని చూస్తే సహకరించని ఒళ్ళు
నీరసాన్ని బద్దకంగా చేసుకుని
బయట తినేద్దాం అని సర్ది చెప్పుకుంది

మెట్లుదిగి కాస్త ముందుకెళితే
ఆ మలుపు తిరిగాక ఉండే చపాతీలోడు సర్దేసుకున్నాడు.

నవ్వుకుని నేను పడుకుంటాననుకో పర్లేదు
అక్కడ మా అమ్మకి ఆకలేస్తేనో !

Reflexivity ప్రధాన లక్షణంగా వుండే కవితల్లో dialogue రూపంలో వ్యక్తం కావాల్సిన విషయాన్ని  monologue  కింద మార్చుకుంటాడు కవి. అంటే- బయటికి ఎంతకీ చెప్పలేని, ఎవరికీ చెప్పుకోలేని విషయాన్ని తనలో తానే చెప్పుకుంటూ వెళ్ళిపోతాడు. పైన చెప్పిన కవితలో ఈ కవి చేసిన పని అదే!

వొక మామూలు సంభాషణా వాక్యం- “ఇంతలేటైంది కదరా ఇంకా తినలేదా?”- అనే ఎత్తుగడలోనే కవి reflexive mood కి రంగం సిద్ధం చేసి పెట్టాడు. ఆ తరవాత చెప్పిన శారీరక మనఃస్తితులన్నీ ఆ mood కి భౌతిక ప్రతీకలు మాత్రమే!

ఈ కవితలో నిర్మాణపరంగా కవి వేసిన ఇంకో అడుగు: కవిత్వంలోకి కథనాత్మకత ప్రవేశపెట్టడం! తెలుగులో ఆరుద్ర, కుందుర్తి, శీలా వీర్రాజు, రంది సోమరాజు- మన తరంలో నందిని సిద్దా రెడ్డి, జూకంటి, కొన్ని కవితల్లో కొండేపూడి నిర్మల  కథనాత్మక కవిత్వం రాశారు. అవి దీర్ఘ కావ్యాలో, కవితలో అవ్వడం వల్ల వాటిల్లో కథ ప్రధానమై, కవిత్వం అప్రధానమైంది.

వాటికి భిన్నంగా కాశిరాజు చిన్న కవితలో కథనాత్మకతని తీసుకువచ్చాడు. అంటే, short narrative poem – చిన్న కథనాత్మక కవిత- అనే రూపానికి తనకి తెలియకుండానే నాంది పలికి, దాన్ని కొనసాగిస్తూ వస్తున్నాడు కాశి. దీర్ఘ కథనాత్మక కవితలకి భిన్నంగా ఈ తరహా కవితలో దీర్ఘమైన వర్ణనలు వుండవు. పాత్రలు బహిరంగంగా బాహాటంగా మాట్లాడుతూ కూర్చోవు. కథా, పాత్రలు రెండూ కవి అనుభూతిలో భాగమైపోతాయి, ఆ అనుభూతికి గోడచేర్పు అవుతాయి వొక విధంగా!

ఈ కవిత్వ నిర్మాణం సాధించడానికి కాశి వాక్యస్వభావాన్ని మార్చుకుంటూ వెళ్తున్నాడు. ఉప్పెనలాంటి వాక్యాలు వొకప్పుడు కవిత్వంలో బాగుండేవి. ఉదాహరణకి: శ్రీశ్రీ కవిత్వ వాక్యాలు సాధారణంగా వేగంగా ఉరవడిగా ప్రవహిస్తాయి. అలాంటి ధోరణి అలాగే కాకపోయినా వేర్వేరు రూపాల్లో ఇప్పటికీ వుంది. ఇప్పటి కవిత్వ వాక్యాలు సెలయేటి నడకలు అని నాకు అనిపిస్తోంది. ఆగిఆగి వెళ్తూ, తనని తానూ తరచి చూసుకునే reflexive mood ఆ నడకలో కనిపిస్తుంది.

ఈ సెలయేటి రహస్యం తెలిసిపోయింది కాశికి!

* 
Download PDF

45 Comments

 • కూర్మనాథ్ says:

  కాశీ కవిత్వం చదువుతుంటే వాళ్ళ అమ్మా నాన్నా గురించి అనిపించదు మనకి. మీ, మా అమ్మా నాన్నల గురించి చదువుతున్నట్టు అనిపిస్తుంది.

 • renuka ayola says:

  కాశిరాజు కవిత్వం చదువుతున్నప్పుడు ఆకలీ, యవ్వనమూ – వీటి చుట్టూ తిరిగే ఏదో వొక తాత్విక గానం వినిపిస్తుంది. ఇతని వాక్యాల్లో వొక తెలివైన అమాయకప్పిల్లాడు వొక తలుపు రెక్క సగమే తెరిచి చిలిపిగా చూస్తూ వుంటాడు;

  మనసులోని నిజమైన అన్వేషణ కవిత్వం,అదే కాశిరాజు ప్రత్యేకత నాకుకాశీ రాజు కవిత్వంలో నిజాయతి కనిపిస్తుంది

  మీవెలుతురు పిట్టలు శీర్షిక చాలా బాగుంది అఫ్సర్ గారు…

 • రమణమూర్తి says:

  మంచి వ్యాసం, అఫ్సర్ గారూ!

  కాశిరాజు కవిత్వం చదవని వాళ్ళకి దాని పట్ల ఆసక్తినీ, ఇంతకుముందే ఎరిగున్నవాళ్లకి అనురక్తినీ కలిగించే వ్యాసం!

  కాశిరాజుకి శుభాకాంక్షలు!!

  • kaasi raju says:

   మనం కలిసింది మంచి సమయంలోనే రమణ మూర్తి గారు ! ఈ సారి మిమ్మల్ని పూర్తిగా ఉపయోగించుకుంటాను .

 • మణి వడ్లమాని says:

  మీవెలుతురు పిట్టలు మొట్టమొదటి వ్యాసం కాశిరాజుని గురుంచి అన్నప్పుడు నాకు ఆశ్చర్యం కలిగింది మొన్న నే మేమందరం కలిసినప్పుడు యెంత ఒద్దిక గా ఒక స్కూల్ విద్యార్ధి లా నమ్రతగా వున్న మన కాశిరాజు ను గురుంచా అని అఫ్సర్ గారు రాసిన వ్యాసం తప్పకుండా చదువరి లలో ఆసక్తి కలిగిస్తుంది

  “ఆకుకట్ట ఇప్పినట్టే అమ్మ గుండెని ఇప్పేస్తది
  గుబులు మూన నీట్లో గుచ్చి వరి నాటుతున్నట్టు
  ఓరోజంతా ప్రేమను దుఃఖంతో నాటేస్తది”

  గుండెల్ని ఇప్పే కవిత్వం కాశిరాజు

  • kaasi raju says:

   మణి వడ్లమాని గారు ! ” ఒక స్కూల్ విద్యార్ధి లా ” అని నన్ని అనేసి మళ్ళీ ఎనక్కి గెంటేసారు …. ఆరోజు మనమంతా కలిసినపుడు మీ అల్లరి కూడా నాకు నచ్చింది . తరచూ కలుస్తూ ఉందాం ! ధన్యవాదాలు

 • కాశిరాజు కవిత్వాన్ని చాన్నాళ్ళు గా పరిశీలిస్తున్నాను. రోజు రోజుకూ పదునెక్కుతూ, చిక్కబడుతూ ఉంది. ఇంతవరకూ నాకు తెలిసి తూగో జిల్లా యాసను కవిత్వంలో ఫుల్ లెంగ్త్ గా వాడుకున్న వారు లేరనే అనుకొంటాను. ఆ విషయంలో కాశి రాజు ని అభినందించాలి. స్థానీయతను ప్రతిబింబించటంలో ప్రాంతం, మాండలికం, వర్గం ల పాత్ర ముఖ్యమైనది. ఆ విషయంలో కాశి రాజుని అభినందించాలి ఎందుకంటే తూగో నుడికారాన్ని తెలుగు కవిత్వానికి చమ్కీలుగా అద్దినందుకు.
  మరొక విషయం కాశి రాజులో.
  అతనిలో కనిపించే ఆత్మీయత. చాలా ఓపికగా, ప్రేమతో, మాట్లాడే అతని మాటలు. తనుమనకిస్తున్న సమయాన్ని సంపూర్ణంగా మనకోసమే వెచ్చించే గుణం.

  చాలా వ్యాసాలు కవిని ఎక్కువ చెయ్యటమో తక్కువ చెయ్యటమో చేస్తాయి. కొన్ని వ్యాసాలు మాత్రం కవిని డిజిటల్ బాలెన్స్ లో వేసి తూస్తాయి.

  బొల్లోజు బాబా

  • kaasi raju says:

   డిజిటల్ బ్యాలెన్స్ … కొత్త లెన్స్ తో నన్ను చూసారు ! ధన్యుణ్ణి సారూ ! “అతనిలో కనిపించే ఆత్మీయత. చాలా ఓపికగా, ప్రేమతో, మాట్లాడే అతని మాటలు. తనుమనకిస్తున్న సమయాన్ని సంపూర్ణంగా మనకోసమే వెచ్చించే గుణం. ” అని అన్నందుకు మిమ్మల్ని సోమవారం కలుస్తాను. అంటే 21 ఏప్రిల్ రోజున …..మా వూరు నేరేడులంక లో సంబరం జరుగుద్ద్ది తప్పకుండా రావాలని కాశి సత్యనారాయణ గారి పిలుపు మీకు !… వాల్యూషన్లో బిజీగా లేకపోతే o రోజంతా మా ఊరిలోనే ఉందాం

 • చక్కని వ్యాసం, అభినందనలు కాశీ, మరన్నీ మంచి కవితలతో, ఇంకొన్ని రహస్యాలు శోధిస్తావని ఆశిస్తూ,. ధన్యవాదాలు అఫ్సర్ సర్.,

 • sailajamithra says:

  పుస్తక పరిచయం మెళకువలు ఒకవైపు, కవిత్వం లో సాంద్రత ఒకవైపు చూస్తుంటే సరికొత్త ప్రపంచం కనిపిస్తోంది . కాశీరాజు కవిత్వం. అఫ్సర్ గారి విపులీకరణ తో కలిసిన ఈ చోట తెలుగు కవిత్వం లో ఎన్నో విషయాలను తెలిపాయి . ధన్యవాదములు

 • గురూజీ.. ‘వెల్తురు పిట్టలు’లో మీరు పరిచయం చేసిన కాశిరాజు కవిత్వంలోని కొన్ని పంక్తులే ఇంత ఆర్తితో ఉంటే, ఆయన మొత్తం కవిత్వం ఇంకెంత ఆర్తిని పంచుతుందో అనిపిస్తోంది. కాశిరాజు కవిత్వం వెంటనే చదవాలనిపిస్తోంది.

  • kaasi raju says:

   చదవచ్చు యజ్ఞమూర్తి గారు …
   http://godaari.blogspot.in/
   అన్న లింక్ దగ్గర నా బ్లాగ్ లో కొంత కవిత్వం లాంటిది ఉంది వీలైనపుడు చదవండి ! అలాగే వీలైతే మనం ఎపుడైనా కలుద్దాము

   • kaasi raju says:

    మీ బ్లాగ్ కూడా చూసాను మీరు బాగా దొరికారు నాకు ! ధన్యుణ్ణి సారూ

 • balasudhakarmouli says:

  కాశిరాజు కవిత్వంపై నిఖార్సైన విశ్లేషణ. చాలా ప్రశాంతంగా, సులువుగా చదువుకునేట్టు రాసుకుపోయారు గురువు గారూ ! కాశిరాజు కవిత్వాన్ని ఎలా చదవాలో.. మీ వ్యాసం తెలియజేసింది. కాశి కవిత్వాన్ని అంతటినీ అందరూ నిద్రించిన రాత్రి వేళ వొంటరిగా కూర్చుని చదువుకునే రోజు కోసం ఎదురుచూస్తున్నాను.

  • kaasi raju says:

   మౌలీ నవ్వొస్తుంది !
   “కాశి కవిత్వాన్ని అంతటినీ అందరూ నిద్రించిన రాత్రి వేళ వొంటరిగా కూర్చుని చదువుకునే రోజు కోసం ఎదురుచూస్తున్నాను.”

   నువ్వు ఆసిన్చినట్టే త్వరలో నీ ఉసురుపోసుకుంటాను సుమీ !

 • Radha says:

  ఎదుటి వ్యక్తి మనసులోంచి
  సూటిగా తాకిన అభినందన
  ‘చేతన’ ని కుదుపుతుంది
  ఎడతెగకుండా మాట్లాడుతున్న
  విదూషకుడు హఠాత్తుగా
  మౌనం వహిస్తాడు
  క్షణాల్లోంచి వింత వింత సుమాలు పూస్తాయి
  శరీరం ఎవరిదో అన్నట్లుగా ఉంటుంది
  ‘నా’ గురించి ఏవో వివరాలు అడుగుతున్న స్వరం
  ఎప్పుడూ మనసులో ప్రతిధ్వనిస్తూనే ఉంటుంది
  ఒక్క మనిషి చూపించిన అభిమానం
  దిగంతాలు దాటి జగమంతా విస్తరిస్తుంది
  మనుషుల మీద నమ్మకం
  మరోసారి మల్లెపువ్వులా గుబాళిస్తుంది

  కదా కాశీ…..
  కాశీ, అభినందనలు. ఒక గొప్పకవి నుండి అభినందనలు అందుకున్నందుకు మరోసారి అభినందనలు – రాధక్క

  • kaasi raju says:

   రాధక్క ఎప్పుడొస్తుందో అని వెయిటింగు నేను !

   ఒక్క మనిషి చూపించిన అభిమానం
   దిగంతాలు దాటి జగమంతా విస్తరిస్తుంది
   మనుషుల మీద నమ్మకం
   మరోసారి మల్లెపువ్వులా గుబాళిస్తుంది

   ఈ లైన్స్ నాకు పిచ్చగా నచ్చేసాయి ! మంచి కవిత అక్క

 • prasuna says:

  చాలా మంచి వ్యాసం అఫ్సర్ జీ. “తన కవిత్వం చదివే పఠితని కూడా ఆ స్వానుశీలన మూడ్ లోకి తీసుకు వెళ్ళడం కాశి ప్రత్యేకత. ……” చాలా కరెక్ట్ గా చెప్పారు.
  Reflexive mood లో వ్రాసే కవిత్వం గురించి మీరు చెప్పింది కూడా చాలా బావుంది.

 • narayanashama says:

  నిజమే కాశీ రాజు కవిత్వాన్ని చూస్తే ఒక్కోసారి కౌగిలించుకుని ఏడ్వాలని,ఓదార్చాలని అనిపిస్తుంది-అమాయకమైన వచనంతో ఎక్కడో ఓ సున్ని తత్వాన్ని స్పర్శిస్తాడు..కవిత్వానికి ఆయన ఎంచుకునే వాక్యనిర్మాణం, భాష,కథన పద్ధతి,ఇవన్ని ఒకింత కాశీరాజును ప్రత్యెకంగా నిలబెడతాయి..మీరు అతన్ని గమనించి రాయటం సంతోషంగా ఉంది

  • kaasi raju says:

   శర్మ గారూ ! మనం కౌగిలించుకున్నాం ఏడ్చాం ! “అమాయకమైన వచనంతో ” అనేసి బాగా దగ్గరైపోయారు

 • CHANDRA MOHAN REDDI says:

  కాసి గారి కవిత్వం లోని అంతరాన్తరాలను మానసిక సంఘర్షణను అఫ్సర్ గారు ఎంతో చక్కగా విశ్లేషించారు ధన్యవాదములు

 • Saikiran says:

  చాలా బాగా వ్రాసారండి. కాశీరాజుగారి కవిత్వం చదువుతుంటే మనని మనం తడుముకుంటున్నట్లు ఉంటుంది. భాషలోను, భావంలోను ఎటువంటి భేషజాలు కనిపించని కవిత్వం కాశీరాజు గారిది. కష్టజీవికి ముందు వెనుక ఉండేవాడే కవి అని శ్రీశ్రీ గారు చెప్పారు. అంటే కష్టజీవుల కన్నీళ్ళు కవిత్వం చేసేవాడు కవి అని అందరు దురభిప్రాయపడుతుంటారు. కానీ శ్రీశ్రీ చెప్పిన కవి అర్ధానికి కాశీరాజు సరిపోలుతారు. మొన్నీమధ్యే ఆయనతో మాట్లాడే భాగ్యం కలిగింది.

  • kaasi raju says:

   సాయి కిరణ్ గారూ మనం ఈ మధ్యే కలవడం సంతోషమే కాని నన్ను మన్నిచాలి నేను ఎపుడు ఎలా కలిసామో మరిచితిని ! ఈ పిలగాన్ని మన్నించి మీ పూతి పేరు తెలియజేయగలరు ఇంటి పేరుతో సహా ! నేను అలా త్వరగా గుర్తెట్టుకుంటాను…

 • బాగుంది

 • ఆర్.దమయంతి says:

  అక్కడ మా అమ్మకి ఆకలేస్తేనో..అన్నారే..
  చాలు. ఆ ఒక్క మాట.
  కన్న కడుపు నిండిపోతుంది.
  కవిత్వపు గుండె పొంగిపొర్లుతుంది.
  చాలా బావుంది వ్యాసం, – అఫ్సర్ గారు.
  మీకు, మన కాశీరాజు గారికి నా అభినందనలు.

 • kaasi raju says:

  ధన్యవాదాలు దమయంతి గారూ

 • కాశిరాజు గారూ !!
  చాలా అద్భుతంగా ఉంది !!

 • srinivasu Gaddapati says:

  తన కవిత్వం చదివే పఠితని కూడా ఆ స్వానుశీలన మూడ్ లోకి తీసుకు వెళ్ళడం కాశి ప్రత్యేకత.

 • వెంకట శ్యామ్‌సుందర్ M says:

  కాశీ….. ఆ గంగా నదిలా నువ్వూ ప్రక్షాళణ దిశగా పయనిస్తూ… అసంగమమై (సంగమమంటూ లేకుండా)… స్వచ్చమైన, తీయటి కవిత్వమై… నీ దరికి చేరే పాఠకుల కవితాతృష్ణను తీరుస్తూ నిరంతరం ప్రవహించే జీవనదివై … సాహితీనదానివై .. నువ్వు సాగిపోవాలని మనసారా ఆకాంక్షిస్తూ…. వెంకట శ్యామ్‌సుందర్ M.

  అయ్యబాబొయ్… నాకూ కవిత్వమొచ్చేస్తోంది కాశీ.. తప్పులుంటే బూతులు తిట్టుకోకండే ..ప్లీజ్.

 • వెంకట శ్యామ్‌సుందర్ M says:

  కష్టజీవుల కన్నీళ్ళు కవిత్వం చేసేవాడు కవి అని అందరు దురభిప్రాయపడుతుంటారు. కాదూ.. కష్టజీవికి ముందూ వెనుకా ఉండేవాడే కవి అన్న శ్రీశ్రీ గారి అభిప్రాయమేనా అభిప్రాయం కూడా. చాలామందిలో ఉండే ఈ దురదృష్టకరమైన దురభిప్రాయం పోవాలని కోరుకుంటున్నా.

 • కాశీ నిజంగా వెల్తురు పిట్టే.. అప్సర్ గారి ప్రయత్నానికి ఆనందిస్తూ.. సెలయేటి రహస్యం తెలియజెప్పినందుకు అభివందనాలు

 • సెలయేటి రహస్యం తెలిసిపోయింది కాశికి! మాకూన్.

 • ఎవరైనా కవిత్వం చదివే నలుగురు మిత్రులం కలిసి మాట్లాడుకుంటూ ఈమధ్య చదివిన కవిత్వవాక్యాలలో ఏది కదిలించింది అని అడిగినా అడగకున్నా కాశీరాజు పేరు రానిదే సంభాషణ ముందుకు కదలటంలేదు. పనులవత్తిడిలో తన కవిత్వ వ్యాసంగాన్ని సైతం పక్కన పెట్టిన కిరణ్ ఒక పంక్షన్ తర్వత అర్ధరాత్రి దాటేవరకూ కాశీకవిత్వంలోని ఆకట్టుకునే తనం ఏమిటి అనేది వివరిస్తూనే వున్నాడు. కాకపోతే అందరికీలాగానో నాక్కొంచెం ఎక్కువగానో కాశీ ఇంట్లో వ్యక్తి అనిపించడంతో ఏదైనా చెప్పాలంటే పొగడ్తలా అవుతుందేమో ననేదే భయం, ఈ పొగడ్తలలో పడి కాశీ పొరపాట్న బ్రాండ్ ఇమేజ్ లో దూకేస్తాడేమో ననేది మరోభయం.

  కానీ అప్సర్ సర్, చాలా తూకంతో కవి మనసుని మీ మాటల్తో ఒడిసి పట్టుుకున్నారు. మనసుల్ని గెలుచుకోవడం కవిగానే కాదు మనిషిగా కూడా తెలిసిన వాడు కాబట్టే కన్నీటి లోతుల్లోకూడా మునకేయకుండా ఈదగలుగుతున్నాడు. అతని కవిత్వం కంటే అమాకత్వం అందంగా వుంటుందో, అమాయకత్వానికంటే ఆప్యాయత బావుంటుందో తేల్చుకునేలోగానే ఒక వెచ్చటి కన్నీటి చుక్కై పద్యాన్ని ముగించేస్తాడు.

  మంచి భవిష్యత్తు నిర్మించుకుంటూ వెళ్తున్న కవికి మీ మాటలు, ఆత్మీయుల ఆశిస్సులూ కొండంత బలంకావాలని కోరుకుంటూ, కాశీ తరపున కూడా మీకూ పత్రికకూ మరోసారి ధన్యవాదాలు.

 • భానోజిరావు says:

  కవిసంగమంలో మొదటిసారి అతనుకవిత చదవగా విన్నాను.యాసని బట్టి తూగోజీ అని పట్టుకొన్నాను. కార్యక్రమానంతరం కలసి వివరాలు గ్రహించి.

  ఆ రోజురాత్రి అందరూ పడుకున్నతర్వాత కాశీరాజు తత్వాన్ని అదే కవిత్వాన్ని చదివాను. అమ్మ లేని నాకు అమ్మని చూడాలన్పించింది.

  వేరే గదిలో పడుకున్న నా భార్యని చూసి ఒచ్చి కన్నీటిలో పడవై పోయాను.

  కాశీని అమ్మ అనాలా నాన్న అనలా? వారిరువురు కలసి అన్నఅయ్యాడు.

 • అన్నోయ్ ఎప్పుడూ సిన్నోడు సిన్నోడే

ఒక వ్యాఖ్యను

Your email address will not be published. Required fields are marked *

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)