భారతరత్న

drushya drushyam 29

అత్యంత సామాన్యమైన చిత్రాల్లో ఇదొకటి.
ఒక గుమస్తా దేశరాజధాని అయిన ఢిల్లీలో ఉదయాన్నే తన కార్యాలయానికి బయలుదేరుతున్నప్పుడు తీసిన ఫొటో.

ఇందులో ఏమీ లేదు.
నిజమే.

కానీ, ఇది పబ్లిక్ పరేడ్లో ప్రదర్శనకు పెట్టదగ్గ ఫొటో.
కానీ, ఏముందని పెడతారు?

నిజమే.
ఇందులో ఏమీ లేదు.
సామాన్యం. సాధారణత్వం.
అంతే.

నిజానికి మీరు కోటిరూపాయలు ఇవ్వండి. ముఖ్యమంత్రి చిరునవ్వులు చిందిస్తున్నప్పుడు చిత్రీకరించమనండి.  పారిపోతాను. ఒక కోటీశ్వరుడు ధీమగా తన సామ్రాజ్యం ముందు ఫోజు ఇస్తున్నప్పుడు తీయమనండి. అవకాశం ఉంటే చంపేస్తానుగానీ తీయను. పోనీ, రేపు తెలంగాణ జెండా పండుగ రోజు ఉద్యమ ఫలితంగా అధికారం చేబూనిన అధినేతను చిత్రీకరించమని అసైన్మెంట్ ఇవ్వండి. లాభం లేదు. చేతులు రావు.
క్షమాపణలు చెప్పి ఊరుకుంటాను.

ఇదొక చిత్రమే.
ఇదీ చిత్రమనే ఈ దృశ్యాదృశ్యం.

నిజం. సంబురంగా ఉన్నప్పుడు ఊరేగే మనుషులను చిత్రీకరించడం కన్నా ఆ సంబురానికి ముందర జీవితాన్ని చెప్పడం చిత్రం. ఆ మందరి కాలాన్ని పోరాటమయం చేసిన మానవుల గురించి రాగం తీయమంటే అది శ్రావ్యం, ఆనందదాయకం.

అంతెందుకు? ఒక పెళ్లి ఫోటో తీయడం కన్నా ఒక అమ్మాయి తన కలల్ని సఫలం చేయమని దేవుడి ముందు చేతులు జోడించిన దృశ్యం తీయాలనిపిస్తుంది. తలలో ఒక పువ్వు తురుముకుని, తప్పక తన ప్రార్థన ఫలిస్తుందని గిరుక్కున వెనుదిరిగేప్పుడు తీయాలనిపిస్తుంది. అంతేగానీ, తీయమంటే తీయడానికి వాళ్లు మనుషులైతే సరిపోదు. మాన్యులు కావాలి. నిర్మలం సామాన్యం అయి ఉండాలి. అంటే ప్రదర్శనకు పెట్టని సాధారణత్వం.

నిజమని నమ్మండి. నాలుగు స్తంబాలాటలో అన్నీ అధికారాన్ని కాపాడేవే అయినప్పుడు అందులో అనివార్యంగా తలదాచుకున్న వాళ్లను పురుగుల్లాగా తీయమంటే తీయడం కూడా అయిష్టమే.
హీరోల్లాగా తీయాలని ఉంటుంది.

తాము ఎటువంటి పరిస్థితిలోనైనా ఉండనీయండి, దైనందిన జీవితంలో ప్రతి క్షణాన్నీ సుందరమయం చేసుకునే ఎదురీతల జీవితాలను తీయడమే నిజమైన బుద్ది. సహ్రుదయత.
అంతేగానీ, తీయమంటే తీయడానికి ఇవి జీవనచ్చాయలా ఇంకొకటా?
జీవితాలు. రక్తమాంసాలతో, చీమూ నెత్తురుతో వెలిగే ఆత్మనిగ్రహాలు.

తడి ఆరని గొంతులకోసం ఒక ఆర్తిగీతం పాడే జయరాజును తీయమంటే తీయబుద్ధవుతుంది.
తరతరాల దైన్యాన్ని మానని గాయంలా రాజేసే గోరటిని తీయమంటే తీయాలనిపిస్తుంది.
సామాన్యం, సాధారణత్వం. ఇవే చిత్రాలుగా తీయబుద్ధవుతుంది.

+++

ఈ ఫొటో అట్లాంటిదే.
తీసి పెద్దది చేసి ప్రదర్వనకు పెట్టినపుడు ఎవరూ అభినందించలేక పోవచ్చు.
కానీ, అంతకన్నా పెద్దది జరుగుతుంది.

ఒకరోజు అదే జరిగింది. ఇటువంటిదే ఒక రిక్షాను ప్రదర్శించినప్పుడు ఒక దళిత కవి, విద్యార్థి సోదరుడు వచ్చి అడిగాడు, కావాలని! ‘అది మా నాయిన కష్టాన్ని గుర్తు చేస్తున్నది అన్నా, కావాలి’ అన్నడు. ఇచ్చి రుణం తీర్చుకున్న.

ఒక రకంగా తాను తన తండ్రిని గుర్తుచేసినందుకు తీర్చుకున్నరుణం కూడా అది.
అలాగే, తరతరాలుగా రిక్షాలో పయనించిన మానవజాతి రుణం అట్లా సులువుగా తర్చుకున్నతరుణం అది.
ఒక పరేడ్లో పెట్టే ఫొటో అట్లా ముందు ఒక ఇంటికైతే పంపిన తృప్తి నాది.

సామాన్యమైనదే తీయాలి. ప్రదర్శించాలి. మామూలు మనుషులనే తీయాలి. అప్పుడు తాను గొప్పవాడు అవుతాడు.
సామాన్యం అసామాన్యం అవుతుంది. ఇదంతా ఒక నిదానం. చినుకు చినుకు కురవడం. వర్షమే కురుస్తుందునుకుని భూమి తడిని ఆస్వాదించే అదృష్టం. ప్రతి దృశ్యాదృశ్యంతో.

+++

తీయబుద్ధవుతుంది.
సామాన్యుల జీవనచ్ఛాయలను తీసుకుంటూ పోయే ఒక పని అవిరళంగా జరగాలనీ, దాన్ని నిరాటంకంగా రాయాలనీ అనిపిస్తుంది.

ఈ ఫొటో చూడండి. చక్కగా ఉతికిన దుస్తులు. మల్లెపువ్వసొంటి అంగి. కాఖీ ప్యాంటు. నీట్ గా తుడిచిన సైకిలు. సీటు చెమటకు ఇబ్బంది పెట్టకుండా నిండుగా ఖర్చిఫ్ రక్షణ.  కోడలు ఉదయాన్నే లేచి మామయ్యకు సిద్ధంచేసిన లంచ్ బాక్సు. దాన్ని శ్రద్ధగా అమర్చుకున్న తీరు. భార్య తన అభిమానాన్ని ఏ మాత్రం ప్రదర్శనకు పెట్టకుండా తాను వెళుతుంటే అట్లా చూసి పంపడమూ ఉంటుంది, ఈ చిత్రానికి ముందు. అంతే. ఇక ఈ చిత్రం ఇట్లానే బయలుదేరుతుంది. చేతి గడియారం చూసుకుంటుంది. సమయం మించకుండా వెళ్లి తన పని తాను చేసుకుని మళ్లీ సాయంత్రం చిత్రంగా ఇంటికి తిరిగి వస్తుంది.
మళ్ళీ ఈ సైకిల్ చిత్రం రేపూ ఇట్లే పయణిస్తుంది. మళ్లీ గూటికి చేరుకుని విశ్రాంతి తీసుకుంటుంది.
ఇంత చిత్రజీవితం ఇంతే. మామూలే.

ముఖం లేదు ఎందుకూ అంటే ముక్కూమొహం తెలియకుండానే కోట్ల మంది మనకిట్లా కనిపిస్తారు, కార్యాలయాలకు వెలుతూ,  ఫ్యాక్టరీలకు పోతూ, భూమిని దున్నుతూ…అయినా ఈ మనిషి తనను తాను ప్రదర్శించుకోడు.

తానొక్కడే ఈ భూమ్మీద లేడు మరి! అందువల్లే తన మొహం అంత ముఖ్యం కాదనుకుంటాడు.
నేనూ అదే అనుకుంటాను. మొహంతో సహా చెప్పవచ్చు. కానీ, ఇది ఒక వ్యక్తి చిత్రం కాదు. సామూహిక వ్యక్తీకరణకు ఒక చిహ్నం. అందుకే తానూ, తన సైకిలూ, తన జీవన పయణం. ఉద్యోగ ధర్మం… అంతా ఒక చిత్రాచిత్రం. దృశ్యాదృశ్యం.
క్రమశిక్షణతో, నియమబద్ధంగా అంతా ఒక పద్ధతిలో జరిగిపోతూ ఉండే పరంపర చిత్రం.

+++

వీళ్లను “ఆమ్ ఆద్మీ’ అని చెప్పి ఒకరు తాజాగా రాజరికానికి వస్తరు. కానీ, విడిచిపెడతారు.
ఇంకొకరు “నమో ఛాయ’ అని బయలుదేరుతారు. రాజ్యానికి చేరుకుంటరు. కానీ, విడిచిపెడతరు.

ఇట్లా వచ్చిన వాళ్లు… పోయిన వాళ్లు ఉండనే ఉన్నరు.
కానీ, స్వాతంత్ర్యానంతరం ఇతడు మాత్రం తన మానాన తాను పనిచేసుకుంటూనే ఉన్నడు.
బహుశా ఓటు వేయడానికీ కూడా ఈయన ఇట్లే బయలుదేరుతాడు.

తెలుసు. ఏమీ కాదనీ తెలుసు.
కానీ, ఓపిగ్గా తన పయణాన్ని తాను చేబూనే మహానుభావులు వీళ్లు.
వీళ్ల చిత్రాలను తీసినందుకుగానూ నాకు “భారతరత్న’ ఎప్పుడొస్తుందో అప్పుడు నేను ఈ పని నిజంగానే మనేయాలి.
అంతదాకా విరామమెరగక నా కలం, కన్నూ పనిచేయవలసిందే.

నాలాగా ఎందరో, గుమస్తాలు. పాత్రికేయులు. కవులు, రచయితలు.
విజ్ఞులు. అందరికీ అభినందనలు.

~ కందుకూరి రమేష్ బాబు

ramesh

Download PDF

3 Comments

  • చక్కని ఛాయాచిత్రానికి అద్భుతమైన వ్యాఖ్యానం.
    “తాము ఎటువంటి పరిస్థితిలోనైనా ఉండనీయండి, దైనందిన జీవితంలో ప్రతి క్షణాన్నీ సుందరమయం చేసుకునే ఎదురీతల జీవితాలను తీయడమే నిజమైన బుద్ది. సహృదయత.”- సామాన్యులుగా సమాజం భావించే మాన్యులు!
    ~ కొల్లూరి సోమ శంకర్

  • aparna says:

    ఏవి మీ కాళ్ళు…ఒక్కసారి దణ్ణం పెట్టుకుంటా…!!

  • Radha says:

    మీ వ్యాఖ్యానాలు చాలా బావున్నాయి మంచి అనుభూతినిచ్చే కథల్లా. మధురాంతకం రాజారాం గారి కథ “పొద్దుచాలని మనిషి” కథ గుర్తొస్తుంది ఇది చదువుతుంటే. అభినందనలు.

Leave a Reply to Radha Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)