శిల్పం మీద మరీ ఎక్కువ ధ్యాస పెడ్తున్నామా?!

2 (1)

ముందుమాట

ముచ్చటగా మూడో నెలలోకి వచ్చాక ఇప్పుడు ముందుమాటేమిటని ఆశ్చర్యపోకండి. మంచో చెడో మూడు నెలలు గడిచాయి. చాలా వరకు మా శ్రమని గుర్తించి వచ్చిన అభినందనలు, అడపాదడపా కథల గురించి విమర్శలు వచ్చాయి. మమ్మల్ని తిట్టే వాళ్ళు ప్రైవేటుగా తిట్టారు. కారణాలు రెండు – ఒకటి మేము చేస్తున్నది గడ్డిమేటలో సూదిని వెతకడమనీ, రెండోది చివరికి ఇది గొంగలిలో అన్నం తింటూ వెంట్రుకలు వచ్చాయని తిట్టుకునే పరిస్థితికి దారి తీస్తుందని. తెలుగు కథలో మంచి కథలు గగన కుసుమాలని చాలా మంది అభిప్రాయం. మేము ఆ అభిప్రాయాన్ని సగౌరవంగా తిరస్కరిస్తున్నామని చెప్పడానికే ఈ ముందుమాట.

విషయానికి వద్దాం. ఈ మూడు నెలలలో మేము చేతనైనంత వరకు అన్ని కథలు చదవాలనే ప్రయత్నం చేశాము. బ్లాగులు, ఒక ప్రాంతంలో మాత్రమే దొరికే పత్రికలు మినహాయించి అందిన ప్రతి కథా చదివాము. వీటిని ఏ ప్రాతిపదికన విశ్లేషించి, మంచి ముత్యాలను వెలికి తీయాలని అన్న విషయంలో మాలో మాకు చాలా చర్చలు జరిగాయి. అవగాహన కుదిరాక, ప్రతి కథని విశ్లేషించేందుకు వీలైయ్యేట్లుగా ఒక మూల్యాంకనా విధానాన్ని తయారు చేసుకున్నాం. సబ్జెక్టివ్ గా ఉండగలిగిన విషయాలని చర్చకు పెట్టి, తద్వారా ఆ అంశ ప్రభావాన్ని చాలా వరకు నియంత్రించే ప్రయత్నం జరుగుతూ వస్తోంది. ఆ వివరాలన్నీ మరోసారి చెప్పుకుందాం. ఈ మూడు నెలలలో మేము గమనించిన కొన్ని ముఖ్యమైన విషయాలు మననం చేసుకుందాం.

స్థూలంగా నూటాయాభై కథలు ప్రతి నెలా తెలుగుసాహిత్యంలో వచ్చి కలుస్తున్నాయి. ఏ రకంగా చూసినా ఇది చాలా ఆనందదాయకమైన సంఖ్య. అందులో పది మంచి కథలను వెతకటం మాకు ఏమంత కష్టం కూడా కావటంలేదు. ఇంకొంచెం ముందుకెళ్తే, మంచి కథలు కాకపోయినా మరో పది దాకా కథలలో ఏదో ఒక మంచి అంశం వుండటం వల్ల (వస్తువో, శిల్పమో మరొకటో) ఇక్కడ ప్రస్తావించగలిగినవిగా ఉంటున్నాయి. ఇక ఆ పైన ఇక మంచి కథ దొరకడం కష్టంగా వుంటోంది. మరో రకంగా చెప్పాలంటే నూటాయాభై కథలలో సుమారు పదిహేను నుంచి ఇరవై మంచి కథలు వస్తున్నాయి. (మంచి నిర్వచనం కాస్సేపు పక్కన పెడదాం). అయితే ఇవన్నీ అద్భుతమైన కథలేనా అంటే ఒప్పుకోవడం కష్టం. కొన్ని కథలు వస్తుపరంగా గొప్పవిగా వుండి శిల్పంలోనే, నిర్మాణంలోనో, సమకాలీనతలోనో కుదేలౌతున్నాయి.

మరి కొన్ని కథలు కేవలం పదాడంబరమూ, శైలీ, శిల్పాలమీద ఎక్కువగా ఆధారపడి, వస్తువును విస్మరిస్తున్నాయి. ఈ రెండవ రకం క్రమంగా పెరుగుతున్న ట్రెండ్ గా కనిపిస్తున్నప్పటికీ, ఇదో కొత్త మలుపుగా గుర్తించడానికి ఇంకొంచం సమయం పట్టవచ్చు. ఈ ట్రెండ్ మరీ ముఖ్యంగా వెబ్ పత్రికల్లో కనపడుతోంది. రైతులు, పిల్లలు వదిలేసిన తల్లిదండ్రులు, లాంటి కథాంశాలు ఇప్పటికీ కథలలో సింహభాగాన్నిఆక్రమిస్తున్నాయి. కానీ, చాలా కోణాల్లోంచి ఇప్పటికే చర్చించబడ్డ ఆ వస్తువుల్లోంచి ఎలాంటి నవ్యతనైనా రాబట్టడంలో మాత్రం ఎక్కువ కథలు విఫలమవుతున్నాయి. వాటితో పాటుగా మారుతున్న ప్రపంచ ఆర్థిక పరిస్థితులు, గ్లోబలైజేషన్/కన్సూమరిజం, అస్తిత్వవాదం, ఉద్యోగాలలో స్త్రీలు, కార్పొరేట్ ప్రపంచంలోని నీలి నీడలు – ఇలాంటి వైవిధ్యమైన, సమకాలీనమైన కథలు కూడా వస్తున్నాయి! ఆయా వర్గాల గొంతులు వినిపిస్తూనే ఉన్నాయి!

పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రుల పట్ల వాళ్ళ వృద్ధాప్యంలో సంతానం చూపే నిర్లక్ష్య ధోరణి కథా వస్తువుగా ఎక్కువ మంది రచయితలు/రచయిత్రులు స్వీకరించడం కనిపిస్తోంది. ఇంక రసం ఏ మాత్రం మిగలని ఈ చెరుకుగడని వదిలేసి కొత్త సమస్యల వైపు తెలుగు కథ దృష్టి సారిస్తే కథలకి మరింత వైవిధ్యం సమకూరుతుందేమోనని మా అభిప్రాయం. అలాంటి కథలే రాయాలనుకున్నా – కనీసం “పరువు” (వాణిశ్రీ, ఆంధ్రభూమి మాసపత్రిక, మార్చ్ 2014) లాంటి కథల్లో ప్రయోగించిన నవ్యతనైనా ప్రదర్శించగలగాలి.

చాలా కథలు పూర్తిగా అపరిపక్వ స్థాయిలో కనిపిస్తున్నాయి. అసలు ఇవి కథలేనా అని శంకించాల్సిన పరిస్థితి! వాటిని చదివిన పాఠకులుగా మా అభిప్రాయం లేదా అనుమానం – కొంత మంది రచయితలు/రచయిత్రులు కథ రాసిన వెంటనే పత్రికలకి పంపిస్తున్నారేమోనని. మా దృష్టిలో ఏ కథకూ మొదటి సారి రాసిన వెంటనే సమగ్ర స్వరూపం సిద్ధించదు. రాసిన తర్వాత రాసిన వాళ్ళే ఒకటికి రెండు సార్లు తమ రచనని తామే పాఠకులుగా మారి చదివితే రచనలో లోపాలు వాళ్ళకే స్ఫురిస్తాయి. ఒక అనవసరమైన వర్ణన, ఇతివృత్తానికి అనవసరమైన ఒక సంఘటన, చెప్పదలుచుకున్నదంతా చెప్పిన తర్వాత ముగింపు దగ్గరకొచ్చేసరికి అనవసరం అనిపించే పొడిగింపు – ఇలాంటివి. అవి సరిచేసి ప్రచురణకి పంపటం వల్ల మంచికథ రాసిన తృప్తి రాసినవాళ్ళకీ, చదివిన తృప్తి పాఠకులకీ కనీసం కొన్ని కథల విషయంలోనైనా పాఠకులకి దొరుకుతుంది.

 

మార్చి కథలు

ఫిబ్రవరి నెలతో పోలిస్తే మార్చ్ నెల కొంతవరకు సంతృప్తికరంగా ఉంది. అయితే, బాగున్న కథలు మాత్రం పరిమితంగానే ఉంటున్నాయి. ముందుగా – టాప్ పది కథలలోకి దాదాపు చేరబోయి అడుగు దూరంలో ఆగిపోయిన కొన్ని కథలను గురించి –

ఒక ఆదివారం ప్లాట్ఫామ్ బెంచ్ మీద (స్వాతికుమారి బండ్లమూడి, ఈమాట), అనగనగా ఒక రాత్రి (పూర్ణిమ తమ్మిరెడ్డి, ఈమాట), మనిషివిత్తనం (వి. ప్రతిమ, చినుకు), నడుస్తున్న చరిత్ర (ఆదెళ్ళ శివకుమార్, గో తెలుగు 23 మార్చ్), పౌరుషం (సతీష్ పోలిశెట్టి, కినిగె పత్రిక) – ఈ ఐదు కథలలోనూ శిల్పపరంగానో, వస్తుపరంగానో చెప్పుకోదగ్గ విషయాలు వున్నాయి. మొదటి నాలుగు కథలలో శిల్పం చాలా గొప్పగా వున్నప్పటికి ఇతర విషయాలలో నిరుత్సాహపరిచాయి.

“ఒక ఆదివారం..” కథలో రచయిత్రి స్వగతం ఒక ప్రవాహంలా సాగిపోయింది కానీ ఆగి చూస్తే అందులో కథ చాలా పల్చగా వున్నట్లు తోచింది. అలాగే “అనగనగా..” కథలో కూడా ఒక ఫోక్ లోర్ లాంటి కథను అన్వయం చేస్తూ ఓ స్త్రీ కథ చెప్పే ప్రయత్నంలో కొన్ని విషయాలు స్పష్టపరచకపోవడం వల్ల కథ అసమగ్రంగా వున్నట్లు అనిపిస్తుంది. “నడుస్తున్న చరిత్ర” కథ చదవడానికి బాగున్నా దానిని కథగా అంగీకరించవచ్చా అన్నదే పెద్ద ప్రశ్న (ఇలాంటిదే “గింజలు” – ఆరి సీతారామయ్య, సారంగ 13 మార్చ్ కూడా) . ఆ ప్రశ్నపక్కనపెట్టి పరిశీలిస్తే ఎన్నెన్నో సంబంధిత సంఘటనలను తెచ్చి ఒకే కథలో పెట్టాలనుకోవడమనేది కధకు ఉండాల్సిన క్లుప్తత అనే స్ఫూర్తిని దెబ్బతీస్తుంది. “మనిషివిత్తనం” చాలా చర్చకు అవకాశం ఇచ్చే కథ. సంతానం కోరుకుంటున్న భర్త లోపాన్ని తెలుసుకోని, అందుకు అక్రమసంబంధం పెట్టుకోవడం కథాంశం. ఇందులో ఆ స్త్రీకి పరాయి వ్యక్తి పైన ప్రేమ వున్నట్లు చెప్పినా, ఒక సమస్యకి ఇలాంటి ఆమోదయోగ్యం కాని పరిష్కారం ఇవ్వడం సబబుకాదేమో ఆలోచించాల్సిన విషయం. ప్రేమ, నైతికానైతికాలు, జీవితం – ఇత్యాది విషయాలు కూడా కథలో సంతృప్తికరంగా చోటుచేసుకున్నట్లయితే, ఇది మంచి కథ అయి ఉండేది. అయితే ఈ కథను ద్వితీయ పురుషలో ప్రతిభావంతంగా రాయడం వల్ల పఠనానుభూతి బాగుంది. “పౌరుషం” కథ వస్తువు పరంగా బానేవున్నా, కొన్ని చోట్ల దారి తప్పటం, హడావిడి ముగింపు వల్ల అందుకోదగ్గ ఎత్తుకు ఎదగలేదు.

ఈ నెలలో వచ్చిన మంచి కథలు అన్నింటినీ కలిపి వ్యాఖ్యానం చేసే బదులు ఒక్కొక్క కథను విడిగా విశ్లేషించాలని అనుకున్నాము. విశ్లేషణ ఒక్కో కథకీ విడివిడిగా చేయడం వల్ల కథలు చదవదలచుకున్నవాళ్ళకి ఎక్కువ ఉపయోగకరంగా ఉంటుంది అని కొంతమంది పాఠకులు చేసిన సూచన మేరకు ఈ పనిని కూడా చేపట్టాం. ఈ పని చేస్తున్న మేము ముగ్గురం మేధావులమనో, గొప్ప విశ్లేషకులమనో కాక కాస్త తెలివిడి ఉన్న పాఠకుల చర్చలోని సారాంశాన్ని పొందుపరుస్తున్నామని ఈ వ్యాసం చదువుతున్న రచయితలు, పాఠకులు గుర్తించగలరు!

తప్పు – పి. రామకృష్ణ (ఆదివారం ఆంధ్రజ్యోతి, 2 మార్చ్):వివాహానికి ముందే శృంగారం వల్ల నెల తప్పిన ఒక స్త్రీ భావ సంచలనం. తప్పు జరిగింది. తప్పు ఏ పరిస్థితుల్లో జరిగిందో, అది జరిగాక అబ్బాయి ప్రవర్తనా, సంస్కారం ఏ పాటి ఉన్నాయో తనకి తెలుసు. ఈ ఆలోచనల్లోనే, ఆమెకు ఆ చిన్న ఇంట్లోనే రెండు ప్రపంచాలు ఉన్నట్టు అర్థమయ్యింది. “అడుసు తొక్కినప్పుడు కాళ్ళు కడుక్కోవాలిగానీ నరుక్కోకూడదు కదా!” అనే ఒక గొప్ప వాక్యంతో కథ ముగుస్తుంది. జ్యోతి పాత్ర అంతరంగ చిత్రణా, ‘ఆప్యాయతలు వెల్లివిరుస్తున్నాయి’ అనుకునే ఇంట్లో మనుషుల ఆలోచనల మధ్య వైరుధ్యాలూ ఇవన్నీ చాలా అద్భుతమైన స్థాయిలో చిత్రింపబడ్డ కథ. అయితే, ఇది ఎందుకో ఒక కథ రూపాన్ని సంతరించుకోలేకపోయింది. దీనికి కారణం – రచయిత ముగింపు వాక్యం మీదే ఆధారపడటం తప్పించి కథలోంచి ఏ విశేషమూ బయటపడకపోవడం కావచ్చు.

చెలికాడు – అలపర్తి రామకృష్ణ (స్వాతి వీక్లీ, 14 మార్చ్):ఉద్యోగం చేస్తున్న భార్య, ఉద్యోగం వదులుకున్న భర్త. ఈ పరిస్థితుల్లో భర్త చేసేవన్నీ పనికిమాలిన పనులలాగా, ఖర్చుదారీ వ్యవహారాల్లాగా, అతని ఆత్మవిశ్వాసం అనవసరమైన పొగరులాగా భార్యకి కనిపిస్తూ ఉంటాయి. కానీ అతను మాత్రం మారడు. అదే చిరునవ్వూ, అదే ప్రేమ, అదే నిజాయితీ, అదే కన్సర్న్. కథ చివర్లో అతనికి ఇంకొంచెం మంచి ఉద్యోగం రావడం అనేది కొంచెం నాటకీయమూ, కొంచెం యాదృచ్ఛికమూ అయినప్పటికీ – అతని పాత్రని చిత్రించిన తీరు మాత్రం ప్రశంసార్హం.

నమూనా బొమ్మ – బి. రమాసుందరి (తెలుగు వెలుగు, మార్చ్):“నీ మీద నేను జాలి పడగలిగిన పరిస్థితుల్లో నువ్వున్నంత కాలం నీ మీద నాకు అభిమానం ఉంటుంది. ఆ పరిస్థితుల్లోంచి నువ్వు ఏ మాత్రం ఎదిగినా నువ్వంటే ఏవగింపు కలుగుతుంది” – అన్న కోణాన్ని ప్రతిభావంతంగా ఆవిష్కరించిన కథ. సునిశితమైన పరిశీలన, కథనం మీద నియంత్రణం ఉన్న రచన. పాత్రల ప్రవర్తనలో అంతరార్థాన్ని సూచనప్రాయంగా చెప్పడం, భావాల్ని వ్యక్తీకరించడానికి వాడుకున్న వినూత్న ప్రతీకలు రచయిత్రి నేర్పుని తెలియజేస్తాయి. అయితే, కథ ముగిసిన తరువాత కూడా మరి కొంచెం సాగడం వల్ల ముగింపు బలహీనపడింది.

రచ్చబండ తీర్పు – డా. జి.వి. కృష్ణయ్య (చతుర, మార్చ్):మంచి కథ. నిడివి కొంచెం ఎక్కువేమో అన్న సందేహం వచ్చినా, కథ నడిపిన తీరు దాన్నిమర్చిపోయేలా చేస్తుంది. అట్టడుగు వర్గం మహిళని బలాత్కారానికి గురైతే, ఆ విషయం రచ్చబండకి రావడం కథాంశం.అది కేవలం “పిల్లల తప్పు” కింద భావించిన పెద్దలు ఓ అయిదువేలు నష్టపరిహారం ఇచ్చిన తీర్పుని గర్హిస్తూ బాధితురాలి భర్త “ఆ డబ్బు తీసుకొని మా ఆడోళ్ళ మానానికి వెలకట్టలేం. రేపొకరోజునమదమెక్కిన మగోడల్లా వచ్చి మా ఆడోళ్ళ రేటడుగుతాడు. అదింకా సిగ్గుమాలినతనం” అన్న మాటలు అన్యాయపు తీర్పుల్నీ, ఆడవాళ్ళంటే గౌరవంలేని పెద్దల్నీ, అలాంటి పెద్దలు నిర్వహించే రచ్చబండల్నీ – అన్నింటినీ ప్రశ్నిస్తాయి. రచయిత కథ నిడివి పట్ల ఇంకొంచెం శ్రద్ధ వహించగలిగి ఉంటే బాగుండేది.

బల్లిఫలితం – వేమూరి వెంకటేశ్వరరావు (ఈ మాట, మార్చ్): తెలుగులో అరుదుగా వచ్చే వైజ్ఞానిక కాల్పనిక రచన. ఇలాంటి కథలను మిగతా కథలను కొలిచినట్లు కొలిచి చూడలేము. సమకాలీనత, సామాజికత వంటి అంశాలు వుండకపోవచ్చు. కేవలం ప్రత్యేకంగా ప్రస్తావించాలి. కానీ ఈ కథ అలా చూసినా నిలబడుతుంది. సైన్స్ వెర్సస్ నమ్మకాల విషయంలో కథ ఎలా రాయబడాలో అలానే రాయబడింది – మంచి ఎత్తుగడ. బిగువైన కథనం. ముగింపులో చమత్కారం! గోపాలకృష్ణ వంటి అనవసరపు పాత్రలు, వివరాలను ఇంకొంచెం తగ్గించి ఉంటే కథలో గందరగోళం కొంచెం తగ్గి, చదువుకోవడానికి మరికొంచెం బాగుండేది.

పెద్దరికం అంటే – గంటి భానుమతి (ఆంధ్రభూమి మాస పత్రిక, మార్చ్): ఉరుకులు పరుగుల మధ్య తల్లిదండ్రుల దగ్గర్నుంచి సరైన అటెన్షన్ దొరకక ఏకాంతాల్లోకి దిగజారుతున్న కూతురి కథ. పిల్లల్లో ఆత్మవిశ్వాసం, సరైన దృక్పథం, ఉత్తరోత్తరా తల్లిదండ్రుల పట్ల గౌరవం ఇవన్నీ తల్లిదండ్రుల పెంపకంలో నుంచే వస్తాయి. ఇది ప్రస్తుత సమాజానికి చెప్పాల్సిన కథ. సమస్య మూలాల్లోకి వెళ్ళిన కథనం, ఒక అంగీకారయోగ్యమైన పరిష్కారం దిశగా కథ మళ్లింపు ప్రతిభావంతంగా వున్నాయి. నిడివి, తల్లి పాత్ర చిత్రణలో నాటకీయత మినహాయిస్తే ఇది మంచి కథ.

విషయవలయాలు – జి. ఉమామహేశ్వర్ (సాహిత్య ప్రస్థానం, మార్చ్): అర్థరాత్రి న్యూస్ ఛానల్లో ప్రసారమయ్యే అశ్లీల కార్యక్రమాలను చాటుగా చూసే కొడుకుని చూసి బాధపడే తల్లి కథ. చాలా సున్నితమైన, సమకాలీనమైన సమస్య. టీవీ ఛానెల్ వాళ్ళని ప్రమీల కలవటం లాంటి అనవసర సన్నివేశాలు నిడివిని పెంచాయి. ఇలాంటి కథలకు ప్రత్యేకంగా ముగింపు అంటూ ఉండదు కాబట్టి, కథ ముగిసే సమయానికి పైన చెప్పిన క్లుప్తతా రాహిత్యం వల్ల బలహీనపడి, మంచి వస్తువు అయివుండీ పాఠకుల మనస్సులో బలంగా నాటుకోదు.

 గౌతమి – రాధా మండువ (ఈ మాట, మార్చ్):తెలిసీ తెలియని వయసులో ప్రేమ-ఒక అమ్మాయి వైవాహిక జీవితంపై దాని ప్రభావం. ఇదీ వస్తువు. పాత్ర చిత్రణలో కథనంలో భాషా పరంగా ప్రతి వాక్యంలో రచయిత్రి ప్రతిభ కనపడుతోంది. కాకపోతే కథానాయక పిచ్చిదానిలా నటించడం, భర్త మితిమీరిన మంచితనం కథని వాస్తవానికి దూరంగా తీసుకెళ్తుంది. కథా రచనలో గుర్తించదగిన ప్రావీణ్యం ప్రదర్శించిన రచయిత్రి ఇతివృత్తంలో ఈ loose ends వైపు దృష్టి పెట్టివుంటే బాగుండేది.

సందల్ ఖోడ్ – ఇబ్రహీం(ఆదివారం ఆంధ్రజ్యోతి, 23 మార్చ్): కనిపించని గంధపుచెక్కని వెతకడం కథాంశం. అంతేనా అంటే అంతమాత్రమే కాదు. కుటుంబం కోసం అహర్నిశలూ శ్రమించే తల్లి, గుర్తించని తండ్రి, ఈ రెండూ గుర్తించిన కొడుకు. హృద్యమైన కథ, అందమైన కథనం, అమ్మ గొప్పదనాన్ని చాలా లలితంగా మరోసారి చెప్పిన సందర్భం. కుటుంబ సభ్యులందరికీ అహర్నిశలూ సేవ చేస్తూ తాను గంధపు చెక్కలా కరిగిపోతూ తన వాళ్ళకి జీవన పరిమళాలని అద్దిన తల్లి. తాను పగలంతా వెతికినా దొరకని గంధపు చెక్కని తన తల్లిలో కొడుకు చూసుకోగలగటం కథ ముగింపు. అనుభూతి ప్రధానమైన కథ అన్నది మామూలు సందర్భాల్లో ప్రశంస గానూ, నాలుగు కథల మధ్యనుంచి దాన్ని ఎన్నుకోవడానికి పరిమితిగానూ పరిణమిస్తుంది. అలాంటి పరిమితులు నిజానికి తాత్కాలికమే – కొన్నేళ్ళ తర్వాతయినా ఎవరైనా అమ్మ మీద మంచి కథని ఒకటి చెప్పండీ అంటే, మనం అందరం “ఇబ్రహీంగారు రాసిన సందల్‌ఖోడ్ ఉందండోయ్!” అని మనస్ఫూర్తిగా చెప్పేయవచ్చు!

ముసుగు వేయొద్దు మనసుమీద – కొల్లూరి సోమశంకర్ (కినిగే పత్రిక, మార్చ్): అరిచి చెప్పినంతమాత్రాన బలంగా చెప్పినట్టు కాదు. కథల విషయంలో అయితే, ఎంత చెప్పీ చెప్పనట్టుగా చెబితే, ఆ విషయానికి అంత పదును. ఈ సూత్రాన్ని చాలా ఎఫెక్టివ్ గా తన కథలో వాడిన రచయిత కొల్లూరి సోమశంకర్. నిరంతరం మారిపోతూ ఉన్న ఈ టెక్నాలజీ ప్రపంచంలో పాత తరానికి చెందిన కొందరు పరిగెత్తలేక, శక్తిసామర్ధ్యాలు లేక వెనకబడిపోవడం, ఉన్న ఉద్యోగం ఉంటుందా ఉండదా అన్న అనిశ్చితితో, అవమానంతో లోపల్లోపలే కుమిలి కమిలిపోవడం నేటి వాస్తవం. అలాంటి ఒక వర్గాన్ని పట్టుకోవడమే రచయిత వస్తువు పట్ల ప్రదర్శించిన ప్రతిభ. అంతే కాకుండా, ఆ వర్గ ప్రతినిధిని రోజువారీ కూలికి రకరకాల జంతువుల ముసుగులు వేసుకొని పిల్లలకి వినోదం కలిగించే వీరేశానికి పరిచయం చేసి, ఇద్దరి జీవితాల అనిశ్చితుల మధ్యా పోలిక తీసుకువచ్చి – జీవితం పట్ల ఉన్న ఆశ, పాజిటివ్ దృక్పథం జీవితాన్ని వెలిగించడానికి సరిపోతాయీ అన్న చిన్న సూచనతో కథ ముగించడం – చాలా బాగుంది. కథ చదివే పాఠకుడిలో సమస్య పట్ల సానుభూతి కలిగించే దిశగా ఎలాంటి వాక్యాలూ కనిపించవు. క్లుప్తత. ఒక్కరోజు సాయంత్రం జరిగే కథ. కథా ప్రారంభంలో అసంతృప్తితో పరిచయమయిన పాత్ర, “లైఫ్ అన్నాక ఫైట్ చేయాలి కదా” అని లైవ్లీగా మాట్లాడే వీరేశంల మధ్య భిన్నత్వం. పరిష్కారం దిశగా ఒక ఆశావహమైన ముగింపు. ఇవీ ఈ కథను నిలబెట్టిన అంశాలు.

ఈ మాసం ఉత్తమ కథగా ఎన్నుకోవడంలో “సందల్ ఖోడ్”, “ముసుగు వేయద్దు మనసు మీద” ఈ రెండింటినీ పరిశీలించాము. సమగ్రంగా జరిగిన చర్చలోని సారం స్థూలంగా చెప్పాలంటే – “సందల్ ఖోడ్” ఒక అనుభూతిని మాత్రమే ఇస్తే, “ముసుగు వేయద్దు..” ఒక ఆచరణీయమైన సందేశాన్ని ఇస్తోంది. అందువల్ల ప్రయోజనకరమైన కథాంశంతో, వస్తువు-శిల్పం-కథనాల మధ్య మంచి సమతుల్యతతో నడిచిన “ముసుగు వేయద్దు మనసు మీద” కథను ఈ మాసం ఉత్తమ కథగా నిర్ణయించాము.

 

ఉత్తమ కథ: ముసుగు వేయొద్దు మనసు మీద

రచయిత: కొల్లూరి సోమశంకర్

ప్రచురణ: కినిగే పత్రిక, మార్చ్-2014

 

సోమశంకర్ గారితో ఇంటర్వ్యూని తరువాతి భాగంలో ప్రచురిస్తాము!

 

కొసరు మెరుపు

పాతకథలని ప్రచురించే సంప్రదాయాన్ని తెలుగు వెలుగు, స్వాతి (మాస), గోతెలుగు.కామ్, విపుల వంటి పత్రికలు పాటిస్తున్నాయి. స్వాతి మాసపత్రికలో వచ్చిన “శత్రువు” (చలసాని ప్రసాదరావు),“గోతెలుగు.కామ్” 14.03.2014 సంచికలో వచ్చిన వెయిటింగ్ ఫర్ యాద్గిరి (భగవంతం) చదవదగ్గ కథలు. ఇవి కాక,మేఘాపహరణం (మాలతీచందూర్),మేలుమరువని కన్నీరు (కవికొండలవెంకటరావు),వారసత్వం (చొప్పదండి సుధాకర్),వెలుగు-నీడలు (ఇంద్రగంటిహనుమచ్ఛాస్త్రి),సుఖం (కె వి ఎస్ వర్మ) కథలు కూడా ప్రచురింపబడ్డాయి.

 

Download PDF

8 Comments

  • నా కథ “ముసుగు వేయద్దు మనసు మీద” మార్చి నెలలో ఉత్తమ కథగా ఎంపికజేసినందుకు సారంగకు, అఫ్సర్ గారికి, నడుస్తున్న కథ శీర్షిక నిర్వాహకులు శ్రీయుతులు రమణమూర్తి, చంద్రశేఖర్ రెడ్డి, అరిపిరాల సత్యప్రసాద్ గార్లకి నా కృతజ్ఞతలు.
    కొల్లూరి సోమ శంకర్

    • ఇది మరీ బాగుంది. కథలు రాస్తున్నవారందరికీ మేమే కృతజ్ఞతలు చెప్పాలి. మంచి కథలు రాసే మీలాంటి వారికి
      ప్రత్యేకంగా..!!

    • రమణమూర్తి says:

      ఉత్త కృతజ్ఞతలు సరిపోవు మాస్టారూ! మీరు ఇటువంటి మంచి కథలు మరిన్ని రాయాలి! :)

  • Radha says:

    థాంక్ యు అండీ. మీ సూచనలను స్వీకరిస్తూ మరిన్ని మంచి కథలు రాయాలని నన్ను కూడా పనిలో పనిగా దీవెంచెయ్యమని కోరుకుంటున్నాను.

  • yaji says:

    మీరు చేస్తున్నది చాలా కష్టమైన, thankless job. Please keep doing this. The quality of the article has already improved over the last 3 innings. Even if you don’t admit, it is indeed difficult to find a “good story” :) Imagination and story weaving and telling have taken a back seat. The few ones with imagination are often criticized for their lack of “సామాజిక స్పృహ” in the content they pick. Sad state of affairs!

    Can’t thank you enough for links to all the stories! This is the cake :)

  • ధన్యవాదాలు ఈ శీర్షిక నిర్వహకులు ముగ్గురికి :)

  • kathamurali says:

    మార్చ్ నెల ఫలితాలు వెల్లడించినందుకు అభినందనలు.

    ఇన్ని కథలు చదవడం ఆషా మాషీ కాదు.

    మీరు ఉత్తమ కథ అని ప్రకటించిన కథను చదివాను. good. కాని ముసుగు వేయొద్దు మనసు మీదా, బలె బలె మగాడివొయ్, సారొస్తారు ఇలాంటి టైటిల్స్ పెట్టిన కథలను best stories అనకూడదు. సొంత టైటిల్ పెట్టగలగాలి రచయిత. బతుకు- ఈ కథకు సరిపోయే పేరు. ఈ కథలో slang మాట్లాడుతున్న వ్యక్తి పేరుకీ మాట్లాడుతున్న slang కి సంబంధం లేదు. వీరేశం బ్రాహ్మణులు పెట్టుకునే పేరు. వీర్రాజు అటు వైపు దిగువ వర్గాల్లో పెట్టుకునే పేరు.

    ఒక ఆదివారం ప్లాట్ఫామ్ బెంచ్‌ మీద- ఈ కథను ఒక స్త్రీ రాసిందంటే విశ్వాసం కలగడం లేదు. ఇందులో ముఖ్యపాత్రకు తల్లి మీద ద్వేషం. భార్య మీద ద్వేషం. ప్రియురాలి మీద ద్వేషం. ఇతడి రాళ్ళు రప్పలు చూసి వుత్తరాలు రాసే `లేత కుర్రాడి` పై ఆసక్తి. అతని ప్రస్తావన వచ్చినప్పుడు ఈ మగపాత్ర టోన్ feminine గా మారిపోయింది యెందుకో. కథలో వాన పామును మెటఫర్ గా వాడారు. వానపాములు hermaphrodites— they carries both male and female sex organs. భార్య లేకుండా చూసుకొని ప్రతి ఆదివారం ప్లాట్ ఫాం మీద కూచుంటున్నది gender transformation కోసమా. మరో విషయం. కథలో `నీడనివ్వని యూకలిప్టస్ చెట్ల ఘాటు వాసనల్లో` అని రాశారు. అలా వుండదు. ఆకు తెంపి నలిపితే తప్ప వాసన రాదు. వాటి గురించి తెలిసి వాటి కింద కూర్చున్న పాఠకులు కూడా వుంటారు.

    • Thirupalu says:

      //రాస్తూ ఉంటాడలా. నన్నడిగి తెలుసుకోవాలని కాదు. అతను తెలుసుకుంది నిజమే అని నాతో చెప్పించాలనే కుర్రతనపు పట్టుదలతో. ఇలా స్టేషన్ బెంచ్ నుంచి అతనికి సమాధానం రాస్తే దాచలేనేమో ఏదీ. న్యూస్‌ని కూడా కవిత్వంలా రాయాలనుకునే ఆ లేత జర్నలిస్ట్‌కి. చెప్పేస్తానా అంతా?//
      ఇది ఫెమినిన్ తోన్ ?

Leave a Reply to రమణమూర్తి Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)