గిరిక-అద్రిక: వడ్లగింజలో బియ్యపుగింజ

Kalluri Bhaskaram-pic-a.prabhakar rao (10)

గిరికకు ఉద్దేశించిన వసురాజు వీర్యాన్ని యమునానదిలో చేపరూపంలో ఉన్న ఒక అప్సరస తాగింది. గర్భం ధరించి మత్స్యరాజును, మత్స్యగంధిని ప్రసవించింది! ఇప్పటి భాషలో చెప్పుకుంటే, అప్సరస తన గర్భాన్ని వసురాజుకు అద్దెకిచ్చి SurrogateMother పాత్రను నిర్వహించిందన్నమాట. ఈవిధంగా వసురాజు పిల్లలకు తల్లి అయ్యే అవకాశాన్ని గిరిక కోల్పోయింది. ఇక్కడే తమాషా ఉంది. కథకుడు అసలు రహస్యాన్ని తన పిడికిట్లో ఉంచుకుని దానిని మూయడానికి ఎంత ప్రయత్నించినా అతని వేళ్ళ సందుల్లోంచి అది జారిపోతూనే ఉంది. వసురాజు పిల్లలకు తల్లి అయ్యే అవకాశం నిజంగా గిరిక కోల్పోయిందా? లేదు…ఆమే వసురాజు పిల్లల్ని కన్నది. కావాలంటే, గిరిక అనే పేరునూ, అప్సరసకు గల అద్రిక అనే పేరునూ పక్క పక్కన పెట్టి చూడండి…రహస్యం తెలిసిపోవడం లేదా?! గిరిక అన్నా, అద్రిక అన్నా ఒకటే అర్థం. గిరి, అద్రి ఒకదానికొకటి పర్యాయపదాలు! శతాబ్దాలుగా మహాభారతాన్ని పఠన, పాఠన, ప్రచారాలలో ఉంచిన పండితులు ఎవరూ ఇంతవరకు ఈ మర్మాన్ని గమనించినట్టు లేదు. ఈ కథను ఇలా de-code చేసినట్టు లేదు. అది ఆశ్చర్యమే. గిరిక, అద్రిక అనే పేర్లలో ఉన్న ఈ సామ్యం ఈ కథకు మాత్రమే పరిమితమైన చిన్న రహస్యం అనుకునేరు, కాదు. చిన్నదిగా కనిపించే ఈ నామసామ్యం మహాభారత కథకుడి మొత్తం వ్యూహాన్నే బట్టబయలు చేస్తోంది. ఇలా రహస్యగోపనానికి ప్రయత్నించడం, లేదా విఫలయత్నం చేయడం కథకుడి వ్యూహంలో భాగమని గుర్తించినప్పుడు, అనేక ఉదంతాలకు సంబంధించిన చిక్కుముదులు విప్పడానికి ఈ గ్రహింపు ఎంత తోడ్పడగలదో ఊహించుకోవచ్చు. అలాగని, ఈ ఒక్క ఆధారాన్నీ పుచ్చుకుని ప్రతిచోటా యాంత్రికంగా ఈవిధమైన రహస్య గోపన సూత్రాన్ని అన్వయిస్తానేమో నన్న అపార్థం ఎవరూ చేసుకోవద్దు. చిక్కుముడిగా కనిపించే ప్రతిచోటా కథకుడు కావాలనో, అప్రయత్నంగానో కొన్ని ఖాళీలను వదిలేసి వాటిని పూరించుకునే అవకాశాన్ని మనకు ఇవ్వనే ఇచ్చాడు.

మహాభారతంలో ప్రధాన కథ అయిన కురు-పాండవుల కథ వాస్తవంగా ఆదిపర్వం, తృతీయాశ్వాసంలో ప్రారంభమవుతుంది. అంతకుముందు రెండు ఆశ్వాసాలూ పాండవుల ముని మనవడైన జనమేజయుని సర్పయాగంతో ముడిపడినవి.

తృతీయాశ్వాసంలోని కురు-పాండవుల కథ కూడా ఉపరిచరవసువు కథతో ప్రారంభమవుతుంది. అతనికి సత్యవతి జన్మించడం గురించి, సత్యవతికి వ్యాసుడు జన్మించడం గురించి చెబుతుంది. వ్యాసుడు మహాభారత కథకుడే కాక, కురు-పాండవ వంశాన్ని నిలబెట్టినవాడు కూడా. వ్యాసుడి పుట్టుక గురించి చెప్పిన తర్వాత మహాభారత యుద్ధం అసలెందుకు జరిగిందో కథకుడు చెబుతాడు. ఆ తర్వాత దేవతలు, దానవులు, మొదలైనవారి అంశలతో కురు-పాండవవీరులు పుట్టి యుద్ధం చేశారని చెబుతాడు. ఆవిధంగా యుద్ధానికి, కురు-పాండవుల పుట్టుకకు అతి మానుష కారణాన్ని ఆపాదిస్తూ అదొక దైవనిర్ణయంగా చిత్రిస్తాడు. ఆ తర్వాత దేవదానవ ముఖ్యుల పుట్టుక ఎలా జరిగిందో చెబుతాడు. ఆ తర్వాత యయాతి మొదలైన కురు-పాండవ వంశ ప్రముఖుల గురించీ, వంశకర్తల గురించీ చెప్పుకుంటూ వెడతాడు.

కథ చెప్పడంలో కథకుడు మొదటినుంచీ ఒక వ్యూహంతో వెడుతున్నట్టు జాగ్రత్తగా పరిశీలిస్తే మనకు అర్థమవుతూ ఉంటుంది. ఆ వ్యూహం ఏమిటన్నది ప్రత్యేకంగా మరింత వివరంగా చెప్పుకోవలసిన విషయం. ఒకటి చెప్పాలంటే, కురు-పాండవుల ప్రధాన కథలోకి పూర్తిగా వెళ్లడానికి ముందు అన్ని కథలూ ప్రధానంగా స్త్రీ-పురుష సంబంధాల గురించి, పుట్టుకల గురించి, వంశాన్ని నిలబెట్టిన వారి గురించీ చెబుతాయి. చదువుతూ వెడుతున్నకొద్దీ అసలు వీటి గురించి ఇంతగా ఎందుకు చెబుతున్నాడనే అనుమానం కలుగుతుంది. ఆ అనుమానాన్ని తీర్చుకునే ప్రయత్నం మనల్ని అనివార్యంగా మాతృస్వామ్య, పితృస్వామ్యాలవైపు నడిపిస్తుంది. అందులో మాతృస్వామ్యం తాలూకు కథలను పితృస్వామికంగా మార్చే ప్రయత్నం కనిపిస్తుంది. ఎంత ప్రయత్నించినా కథకుడు మాతృస్వామ్య అవశేషాలను పూర్తిగా మరగుపరచలేకపోయిన సంగతీ తెలుస్తూ ఉంటుంది.

మహాభారతం ఎన్నో శతాబ్దాలుగా పఠన, పాఠన, ప్రచారాలలో ఉంది. వాటిని అలా ఉంచిన పౌరాణికులకు, సంప్రదాయ పండితులకు మనం ఎంతో రుణపడి ఉన్నాం. పురాణ, ఇతిహాసాలను వారు కాపాడుతూ వచ్చారు కనుకనే వాటి గురించి మనం చెప్పుకోగలుగుతున్నాం. మహాభారత వ్యూహాన్ని తమవైన పద్ధతులలో, పరిమితులలో వారు కూడా చర్చించి ఉండచ్చు. నా పరిశీలన, వారి పరిశీలన ఒకలాంటివే కాకపోవచ్చు. ఇది కేవలం వైవిధ్యానికి చెందినదే తప్ప వారి విద్వత్తును ప్రశ్నించే ప్రయత్నం ఎంతమాత్రం కాదు. అర్జునుడు యుద్ధం ప్రారంభించేముందు భీష్ముడు, ద్రోణుడు మొదలైన పెద్దలకు నమస్కార బాణాలు వేశాడని చెబుతారు. నేను చేసేది యుద్ధమనీ, నా దగ్గర బాణాలు ఉన్నాయనీ నేను అనుకోవడం లేదు కనుక పైన చెప్పిన పెద్దలకు నమస్కారం మాత్రమే చేసి ముందుకు వెడతాను.

***

వసువనే రాజు చేదిని పాలిస్తున్నాడు. అతను ఇంద్రుడితో సమానుడు. ఎంతో కీర్తిమంతుడు. అతను ఒక రోజు వేటాడడానికి అడవికి వెళ్ళాడు. అక్కడ ఒక మున్యాశ్రమంలోకి అడుగుపెట్టగానే అతనికి వైరాగ్యం కలిగింది. ఆయుధాలు విడిచిపెట్టేసి తపస్సు ప్రారంభించాడు. అప్పుడు ఇంద్రుడు అతని దగ్గరకు వచ్చాడు. ‘ఇంతకాలం దయతో ప్రజలను కాపాడుతూ, వర్ణ ధర్మాలను రక్షిస్తూ మచ్చలేని చరిత్రతో రాజ్యాన్ని పాలించావు. ఇప్పుడు రాజ్యాన్ని వదిలేసి తపస్సులో మునగడం నీకు తగదు. ఇప్పటినుంచీ నువ్వు నాతో స్నేహం చేస్తూ, నా దగ్గరకు వస్తూ పోతూ రాజ్యం చెయ్యి’ అన్నాడు.

ఆపైన అతనికి దేవత్వం ఇచ్చాడు. బంగారాన్ని, రత్నాలను తాపడం చేసిన ఒక దివ్య విమానాన్ని; ఎలాంటి ఆయుధం నుంచి అయినా రక్షించగలిగిన, ఎప్పటికీ వాడని కమలాలతో కూర్చిన ఇంద్రమాల అనే హారాన్ని ఇచ్చాడు. దుష్టులను శిక్షించి శిష్టులను కాపాడగలిగిన ఒక వెదురుకర్రను(అంటే రాజదండాన్ని)ఇచ్చాడు.

వసురాజు ఇంద్రుడు చెప్పినట్టు తిరిగి రాజ్యపాలన ప్రారంభించాడు. ఇంద్రుడిచ్చిన విమానం ఎక్కి పైలోకాలకు వెళ్ళి, వస్తుండడంతో అతనికి ఉపరిచరవసువు అనే పేరు వచ్చింది. ఇంద్రుడి మీద భక్తితో అతను ఏటేటా ఇంద్రోత్సవం కూడా జరిపేవాడు. అప్పటినుంచీ రాజులు ఇంద్రోత్సవం జరిపే ఆనవాయితీ మొదలైంది.

ఇంద్రుడి వరంతో అతనికి బృహద్రథుడు, మణివాహనుడు, సౌబలుడు, యదుడు, రాజన్యుడు అనే అయిదుగురు కొడుకులు కలిగారు. వసురాజు ఆ అయిదుగురినీ అయిదు దేశాలకు రాజుల్ని చేశాడు. వారు వేర్వేరు వంశాలకు కర్తలయ్యారు. వసురాజు రాజర్షి అనిపించుకుంటూ రాజ్యం పాలిస్తుండగా…

అతని రాజధానికి దగ్గరలో శుక్తిమతి అనే నది ప్రవహిస్తోంది. కోలాహలుడు అనే పర్వతం ఆ నదిని కామించాడు. నదిని అడ్డగించి బలాత్కారం జరిపాడు. అప్పుడు వసురాజు తన పాదంతో ఆ పర్వతాన్ని తొలగించాడు. కోలాహలుని బలాత్కారం వల్ల శుక్తిమతి గర్భవతి అయింది. వసుపదుడు అనే కొడుకు,గిరిక అనే కూతురు కలిగారు. తనను అడ్డగించిన పర్వతాన్ని పక్కకు తప్పించినందుకు కృతజ్ఞతతో శుక్తిమతి తన కొడుకునూ, కూతురినీ వసురాజుకు కానుకగా ఇచ్చింది. వసురాజు వసుపదుని తన సేనానిగానూ, గిరికను భార్యగానూ చేసుకున్నాడు.

గిరిక ఋతుమతి అయింది. ఆమెకు మృగమాంసం తెచ్చిపెట్టమని పితృదేవతలు వసురాజుకు చెప్పారు. వసురాజు వేటకు వెళ్ళాడు. వెళ్లాడన్న మాటే కానీ, నిండు యవ్వనంలో ఉన్న గిరికే అతని ఊహల్లో ఉండిపోయింది. అనురక్తితో ఆమెను తలచుకుంటూ ఉండగా అతనికి స్కలనం అయింది. ఆ వీర్యాన్ని ఒక ఆకు దొప్పలోకి తీసుకుని, దానిని ఒక డేగ మెడకు కట్టి, దానిని తీసుకువెళ్లి గిరికకు ఇమ్మని చెప్పాడు. ఆ డేగ ఆకాశంలో పయనిస్తుండగా ఇంకో డేగ చూసింది. దాని మెడకు కట్టిన ఆకులో మాంసఖండం ఏదో ఉందనుకుంది. దానికోసం డేగను అడ్డగించింది. రెండింటి మధ్య యుద్ధం జరిగింది. అప్పుడు ఆ ఆకుదొప్ప చినిగిపోయి అందులోని వీర్యం యమునా నదిలో పడింది.

బ్రహ్మ శాపం వల్ల అద్రిక అనే అప్సరస చేపగా మారి యమునానదిలో తిరుగుతోంది. నదిలో పడిన వసురాజు వీర్యంలోని రెండు చుక్కలను ఆ అప్సరస తాగింది. దాంతో గర్భవతి అయింది. పదోమాసం రాగా ఒక జాలరి వలకు చిక్కింది. ఆ జాలరి కడుపు కోసి చూసేసరికి అందులో ఒక మగశిశువు, ఒక ఆడశిశువు కనిపించారు. ఆ శిశువులు ఇద్దరినీ ఆ జాలరి తీసుకువెళ్లి దాశరాజు అనే అతనికి ఇచ్చాడు. మనుష్య ప్రసవంతో శాపవిమోచనం అవుతుందని బ్రహ్మ చెప్పాడు కనుక అద్రిక వెంటనే చేప రూపం విడిచిపెట్టి దివ్యరూపం ధరించి దేవలోకానికి వెళ్లిపోయింది. చేప కడుపున పుట్టిన ఆ ఇద్దరికీ మత్స్యరాజు అనీ, మత్స్యగంధి అనే పేర్లు వచ్చాయి. మత్స్యరాజు మత్స్యదేశానికి రాజు అయ్యాడు. మత్స్యగంధిని మాత్రం దాశరాజు తన కూతురుగా చేసుకుని పెంచి పెద్దచేసి; ధర్మార్థంగా, అంటే ఎలాంటి ప్రతిఫలం తీసుకోకుండా యమునా నదిలో పడవ నడిపే పనిలో నియోగించాడు.

ఓ రోజున, వశిష్టుని మనవడు, శక్తి కొడుకు అయిన పరాశరుడు యమునానది పడవ రేవులో మత్స్యగంధిని చూశాడు…

ప్రస్తుతానికి కథను ఇక్కడ ఆపుదాం.

Ravi_Varma-Shantanu_and_Satyavati

***

వసురాజు చేదిని పాలించే రాజు అని తప్ప, సూర్యచంద్రవంశాలలో ఏ వంశానికి చెందినవాడో కథకుడు చెప్పలేదు. మహాభారతంలో చెప్పిన అనేకమంది రాజులతో పోల్చితే అతనంత ప్రసిద్ధుడుగా కనిపించడు. అతనొక చిన్న రాజు అనే అభిప్రాయమే కలుగుతుంది. అసలాలోచిస్తే, సత్యవతి అనే పేరు కూడా కలిగిన మత్స్యగంధి పుట్టుక గురించి చెప్పడమే కథకుని వ్యూహంలో ప్రధానం తప్ప, వసురాజు గురించి చెప్పడం కాదనిపిస్తుంది. మత్స్యగంధి గురించి చెప్పడానికే వసురాజును సృష్టించాడని కూడా అనిపిస్తుంది.

ఇంకోటి చూడండి…వసురాజు అడవికి వేటకు వెళ్ళాడు. అక్కడ ఒక మున్యాశ్రమంలోకి వెళ్ళగానే అతనికి వైరాగ్యం కలిగింది. అంతే, తపస్సు చేసుకుంటూ అక్కడే ఉండిపోయాడు. అప్పుడు ఇంద్రుడు వచ్చి, నువ్వు ప్రజలను, వర్ణధర్మాలనూ కాపాడుతూ రాజ్యం చేయాలి తప్ప ఇలా తపస్సు చేయడం తగదని చెప్పాడు. మరి కొన్ని రాజోచిత పురస్కారాలతోపాటు ఒక రాజదండాన్నీ చేతికిచ్చాడు. వసురాజు అంగీకరించి తిరిగి రాజ్యపాలన ప్రారంభించాడు.

వెంటనే మనకిక్కడ సంవరణుడు గుర్తుకు రావాలి. సంవరణుడు కూడా వేటకు వెళ్ళాడు. వసురాజును ‘తపస్సు’ ఆకర్షిస్తే, సంవరణుని ‘తపతి’ ఆకర్షించింది. రాజ్యాన్ని విడిచేసి ఆమె కోసం అక్కడే తపస్సు ప్రారంభించాడు. వశిష్టుడు వచ్చి వారిద్దరికీ వివాహం జరిగే ఏర్పాటు చేశాడు. సంవరణుడు ఆ తర్వాత తపతితో కాపురం చేస్తూ పన్నెండేళ్ళు అడవిలోనే ఉండిపోయాడు. రాజ్యంలో అనావృష్టి ఏర్పడడంతో వశిష్టుడు వచ్చి ఆ దంపతులను హస్తినాపురానికి తీసుకువెళ్లాడు. వారికి కురుడు పుట్టాడు.

మొత్తానికి రాజుకూ, అడవికీ ఏదో దగ్గరి సంబంధం ఉంది. ఇంకా వెనక్కి వెడితే పురూరవుడికీ అడవితో సంబంధం ఉంది. కొంపదీసి, అడవినుంచి, అంటే ఆటవిక తెగలనుంచి తొలి రాజులను సృష్టించలేదు కదా?!

సంవరణుడి కథలో కన్నా వసురాజు కథలో ఈ సందేహం మరింత గట్టిగా కలుగుతుంది. అంతవరకూ రాజ్యపాలన చేస్తున్న వసురాజు అడవికి వెళ్ళగానే హఠాత్తుగా వైరాగ్యం పొందడానికీ, ఆయుధాలు పక్కన పెట్టేసి తపస్సులో కూర్చోడానికీ బలమైన పూర్వరంగాన్ని కథకుడు కల్పించలేదు. ఇంద్రుడు వచ్చి అతనికి రాజదండంతో సహా వివిధ కానుకలు ఇచ్చిన తర్వాత అంతలోనే అతను వైరాగ్యాన్నీ, తపస్సునూ వదలుకుని తిరిగి రాజ్యపాలన ప్రారంభించాడనడం, అతన్ని చంచలమనస్కునిగా చూపుతోంది తప్ప అతని వ్యక్తిత్వాన్ని పెంచడం లేదు. ఈ రకంగా చూసినప్పుడు, అతన్ని ముందునుంచే రాజుగా చూపించడానికే ఈ బలహీన కల్పన అన్న అభిప్రాయం కలుగుతుంది. అంటే, అతను మొదటే రాజు కాడన్న మాట. ఆ అడవిలోని తెగకు అతను పెద్ద అయుండచ్చు.

ఇంద్రుడు వచ్చి అతనికి ఇతర రాజోచిత పురస్కారాలతోపాటు రాజదండాన్ని కూడా ఇవ్వడం -అతన్ని రాజుగా నియమించిన సంగతిని స్పష్టంగా చెబుతోంది. మొదట్లో రాచరికానికి ఇంద్రుడు ప్రతినిధి. అతడు ఇలా రాజుగా నియమించినవారు ఇంకా కొందరు కనిపిస్తారు. కనుక, ఇంద్రుడు నియమించేవరకూ వసురాజు రాజు కాడనుకుంటే, ఆటవిక తెగనుంచి ఒక రాజును సృష్టించారన్నమాట. వాస్తవానికి తెగ పెద్దకే రాజు అన్న పేరు కల్పించారన్నమాట. అంటే, తెగ పెద్ద అనే పదవిని సంస్కృతీకరించారన్నమాట.

అంతవరకూ రాజ్యార్హతలేని కులాలనుంచి, వృత్తులనుంచి రాజులను సృష్టించిన ఉదంతాలు మహాభారతంలోనే కోకొల్లలుగా ఉన్నాయి. దాని గురించి మరెప్పుడైనా చెప్పుకుందాం. ఈ కోణంలో వసురాజును రాజుగా నియమించడంలో విశేషం ఏమీ లేదు. అయితే, ప్రస్తుత కథకు వస్తే, ఇలా కొత్తగా రాజులను సృష్టించే ఆనవాయితీని ఉపయోగించుకుంటూ కథకుడు వసురాజును అనే పాత్రనే సృష్టించాడా అన్న అనుమానం కలుగుతుంది. అందుకు బలమైన కారణాలే ఉన్నాయి. అవేమిటంటే, కథకుడు మత్స్యగంధి అనే సత్యవతి పుట్టుక గురించి, ఆమెకు మహాభారతకర్త అయిన వ్యాసుడు పుట్టడం గురించి చెబుతున్నాడు. వీరిద్దరూ మహాభారతంలో ప్రముఖ పాత్రలు. కనుక వారి గురించి చెప్పడమే కథకునికి ప్రధానం. వసురాజు గురించి చెప్పడం కాదు. అంతేకాదు, సత్యవతి భవిష్యత్తులో శంతనుడు అనే భరతవంశపు రాజుకు భార్య కాబోతోంది. ఆమెకు ఆ అర్హత కల్పించాలంటే ఆమెను వాస్తవంగా ఒక రాజుకు పుట్టిన సంతానంగా చెప్పాలి!

అదీ సంగతి.

ఇంద్రుని సూచనపై ‘తిరిగి’ రాజ్యపాలన ప్రారంభించిన తర్వాత వసురాజుకు అయిదుగురు కొడుకులు కలిగినట్టు, వారిని అతడు అయిదు దేశాలకు రాజులను చేసినట్టు, వారు వేర్వేరు వంశాలను స్థాపించినట్టు కథకుడు చెబుతున్నాడు. ఆ తర్వాతే, శుక్తిమతి, కోలాహలుల ఉదంతం, వారికి వసుపదుడు, గిరిక కలగడం, వారిద్దరినీ శుక్తిమతి వసురాజుకు కానుకగా ఇవ్వడం, అతడు వసుపదుని సేనానిగానూ, గిరికను భార్యగానూ చేసుకోవడం గురించి చెబుతున్నాడు. దీనిని బట్టి గిరికకూ, వసురాజుకూ వయసులో చాలా అంతరం ఉందన్నమాట. వసురాజు పేరుతో, లేని ఒక రాజును సృష్టించడం మీదే దృష్టి పెట్టిన కథకుడు ఈ చిన్న అనౌచిత్యాన్ని విస్మరించి ఉండచ్చు.

సరే, ఆ తర్వాత జరిగిన కథాక్రమాన్ని చూడండి. గిరికకు ఉద్దేశించిన వసురాజు వీర్యాన్ని యమునానదిలో చేపరూపంలో ఉన్న ఒక అప్సరస తాగింది. గర్భం ధరించి మత్స్యరాజును, మత్స్యగంధిని ప్రసవించింది! ఇప్పటి భాషలో చెప్పుకుంటే, అప్సరస తన గర్భాన్ని వసురాజుకు అద్దెకిచ్చి SurrogateMother పాత్రను నిర్వహించిందన్నమాట. ఈవిధంగా వసురాజు పిల్లలకు తల్లి అయ్యే అవకాశాన్ని గిరిక కోల్పోయింది.

ఇక్కడే తమాషా ఉంది. కథకుడు అసలు రహస్యాన్ని తన పిడికిట్లో ఉంచుకుని దానిని మూయడానికి ఎంత ప్రయత్నించినా అతని వేళ్ళ సందుల్లోంచి అది జారిపోతూనే ఉంది. వసురాజు పిల్లలకు తల్లి అయ్యే అవకాశం నిజంగా గిరిక కోల్పోయిందా? లేదు…ఆమే వసురాజు పిల్లల్ని కన్నది. కావాలంటే, గిరిక అనే పేరునూ, అప్సరసకు గల అద్రిక అనే పేరునూ పక్క పక్కన పెట్టి చూడండి…రహస్యం తెలిసిపోవడం లేదా?!

గిరిక అన్నా, అద్రిక అన్నా ఒకటే అర్థం. గిరి, అద్రి ఒకదానికొకటి పర్యాయపదాలు!

శతాబ్దాలుగా మహాభారతాన్ని పఠన, పాఠన, ప్రచారాలలో ఉంచిన పండితులు ఎవరూ ఇంతవరకు ఈ మర్మాన్ని గమనించినట్టు లేదు. ఈ కథను ఇలా de-code చేసినట్టు లేదు. అది ఆశ్చర్యమే. గిరిక, అద్రిక అనే పేర్లలో ఉన్న ఈ సామ్యం ఈ కథకు మాత్రమే పరిమితమైన చిన్న రహస్యం అనుకునేరు, కాదు. చిన్నదిగా కనిపించే ఈ నామసామ్యం మహాభారత కథకుడి మొత్తం వ్యూహాన్నే బట్టబయలు చేస్తోంది. ఇలా రహస్యగోపనానికి ప్రయత్నించడం, లేదా విఫలయత్నం చేయడం కథకుడి వ్యూహంలో భాగమని గుర్తించినప్పుడు, అనేక ఉదంతాలకు సంబంధించిన చిక్కుముదులు విప్పడానికి ఈ గ్రహింపు ఎంత తోడ్పడగలదో ఊహించుకోవచ్చు. అలాగని, ఈ ఒక్క ఆధారాన్నీ పుచ్చుకుని ప్రతిచోటా యాంత్రికంగా ఈవిధమైన రహస్య గోపన సూత్రాన్ని అన్వయిస్తానేమో నన్న అపార్థం ఎవరూ చేసుకోవద్దు. చిక్కుముడిగా కనిపించే ప్రతిచోటా కథకుడు కావాలనో, అప్రయత్నంగానో కొన్ని ఖాళీలను వదిలేసి వాటిని పూరించుకునే అవకాశాన్ని మనకు ఇవ్వనే ఇచ్చాడు.

ఈవిధంగా వసురాజు పిల్లల్ని కన్నది గిరికే అనుకున్నప్పుడు మధ్యలో అద్రిక అనే అప్సరస ఎందుకు వచ్చిందన్న ప్రశ్న వస్తుంది. సమాధానం స్పష్టమే. నదీ గణానికి చెందిన శుక్తిమతికీ, పర్వత గణానికి చెందిన కోలాహలుడికీ పుట్టిన గిరిక, తల్లిదండ్రులలానే ఒక నిమ్నజాతికి చెందినది. కానీ, ఒక భరతవంశ క్షత్రియుడు, పాండవుల ముత్తాత అయిన శంతనుడికి భార్య కాబోయే సత్యవతి పుట్టుక గురించి కథకుడు చెబుతున్నాడు. పైగా ఆ సత్యవతికే వ్యాసుడు జన్మించబోతున్నాడు. అటువంటప్పుడు సత్యవతి గిరిక సంతానమని చెప్పడం కథకునికి అభ్యంతరకరం కావడంలో ఆశ్చర్యంలేదు. శంతనుడి కాలానికి కూడా అది అంతే అభ్యంతరం అవునో కాదో, అనివార్యమై అతను ఆమెను చేపట్టాడో మనకు తెలియదు. వాస్తవంగా కథ కూర్చేనాటికి అది అభ్యంతరకరంగా మారి ఉండచ్చు. అందుకే, వసురాజును సృష్టించి రాచరిక వారసత్వాన్ని, అద్రిక అనే అప్సరసను సృష్టించి దైవసంబంధాన్ని సత్యవతికి ఆపాదించడం. ఈవిధంగా వసురాజును, అద్రికను పక్కకు తప్పించి చెప్పుకుంటే, గిరిక భర్త ఎవరై ఉండచ్చు? బహుశా మత్స్యగంధి లేదా సత్యవతిని పెంచి పెద్దజేసిన దాశరాజే!

కథకుడు సత్యవతికే కాక గిరికకూ, ఆమె సోదరుడు వసుపదుడికీ, సత్యవతి సోదరుడు మత్స్యరాజుకీ, చివరికి దాశరాజుకీ కూడా రాచసంబంధం కల్పించాడు చూడండి, క్షత్రియులతో చుట్టరికం కలిపించుకునేటప్పుడు అది అవసరమే. గిరిక వసురాజు భార్య అని చెప్పినా, మధ్యలో అద్రికను సృష్టించడం ద్వారా సత్యవతి మాత్రం ఆమె సంతానం కాదని చెప్పడానికి కథకుడు పన్నిన వ్యూహం, పేర్లలో ఉన్న సామ్యం ద్వారా బయటపడిపోయింది.

వచ్చేవారం వ్యాసుడి జన్మవృత్తాంతం గురించి….

 -కల్లూరి భాస్కరం

 

 

 

 

 

Download PDF

12 Comments

  • ఆర్.దమయంతి. says:

    ఆ దృశ్యాలన్నీ కళ్ళకు కట్టినట్టు చెప్పారు భాస్కరం గారు!
    శుభాభినందనలు.

  • raamaa chandramouli says:

    ఎన్నిసార్లు విన్నా,చదివినా తనివితీరని మహాద్భుతమైన ఇతిహాసం మన ‘మహాభారతం’.
    ఈ ఇతిహాస ప్రారంభ విశేషాల గురించి ఇప్పటి యువ పాఠకులకు అంతగా తెలియదు.ఆ ప్రస్తావనలతో ఆధునిక దృక్కోణం లో
    సాగిన ఈ విశ్లేషణ బాగుంది.
    కల్లూరి భాస్కరం గారికి అభినందనలు.
    -రామా చంద్రమౌళి,వరంగల్లు.

    • కల్లూరి భాస్కరం says:

      రామా చంద్రమౌళి గారూ…ధన్యవాదాలు.

  • ఆర్,దమయంతి. says:

    విశ్లేషించి చూస్తె అద్దె గర్భాలకు ఆనాడే బీజం పడింది అని తెలుస్తుంది..
    ఒక సామాన్య పాఠకుడు సైతం చదివి అర్ధం చేసుకునేలా వున్నప్పుడే ఎంత గొప్ప కావ్యానికైనా పూర్తీ సార్ధకత లభిస్తుంది. ఆశయం సిద్దిస్తుంది. ఇప్పుడు మీరు చేస్తున్న ప్రయత్నం కూడా అలాటిదే అని చెప్పక తప్పదు.
    అభినందనలు.

    • కల్లూరి భాస్కరం says:

      చాలా థాంక్స్ దమయంతి గారూ…ఈ కథలో ‘అద్దె గర్భం’, వీర్యం తాగినా గర్భం వస్తుందన్న అమాయకపు ఊహ ఫలితం కావచ్చు. అది శాస్త్రీయ పరిశోధనల ఫలితం కాదు. అయితే, ఒకనాటి అమాయకపు ఊహలు కూడా వైజ్ఞానిక పరిశోధనలకు ఆలంబనం అవడంలో ఆశ్చర్యంలేదు.

  • Radha says:

    ఆనాటి కథల్లో ఉన్న వర్ణ వివక్షను, పితృస్వామ్య వ్యవస్థను గురించి చూపడానికి మీరు చేస్తున్న విశ్లేషణ నిజంగా అభినందనీయం. చరిత్ర అన్నీ చెప్తుంది పరిశీలిస్తే. ధన్యవాదాలు.

  • attada appalnaidu says:

    భాస్కరం గారూ,నమస్తే.మీ పురా ‘గమనం’చదువుతున్నాను.ఇవి పుస్తకరూపములొ తెస్తున్నారా?అన్నీ ఒక్కస్సారి చదవాలని వుంది.చాలా గొప్ప పని చేస్తున్నారు,అభినందనలు.

    • కల్లూరి భాస్కరం says:

      చాలా థాంక్స్ అప్పల్నాయుడుగారూ…మీరు నా ‘పురా’గమనం వ్యాసాలను ఆసక్తిగా చదువుతున్నందుకు చాలా సంతోషం. ఈ వ్యాసాలు తప్పకుండా పుస్తక రూపంలో వస్తాయి. అయితే ఎప్పటికి అనేదే ప్రశ్నార్థకం. నేనింకా పూర్తిగా మహాభారతంలోకి అడుగుపెట్టానని అనిపించడం లేదు. మీ ప్రోత్సాహకర వ్యాఖ్యకు మరోసారి ధన్యవాదాలు.

  • శర్మ... says:

    చిన్న విన్నపం..
    ఆయన దాచ ప్రయత్నించింది లేదు..వ్రేళ్ళ జారినది లేదు…సంతాన
    సంకల్పం ఎవరు ముందు చేసారో వారి వంశంగానే పుట్టిన వారిని గ్రహించాలి తప్ప..మరేమీ కాదు…
    అలాగే మిగిలిన విదురుడు ఇత్యాదుల పుట్టుకల గురించి విశ్లేషిస్తే సులభంగా విషయాన్ని అవగతం చేసుకోవచ్చును అని నా అభిప్రాయం..
    నా దగ్గర కూడా బాణాలు లేవు అర్జునుడు,మీకు మల్లె కూడా..
    ఒక భాషాభిమానం తప్ప…
    మనసుకి ఏ మాత్రం బాధ కలిగించినా నన్ను క్షమించేదరుగాక!!!
    మీ కుమార దత్త శర్మ రేగిళ్ళ..
    7396469435

  • శిరీష says:

    సత్యవతిని రాజవంశం కు సంభందించిన వ్యక్తిగా చిత్రించే ఉద్దేశ్యం కథకుకునికి ఉన్నమాట నిజమే అయితే ….అతను సత్యవతిని ఉన్నత స్థానంలో చూపించేవారు కానీ సామన్య పడవ నడిపే వ్యక్తిగా చిత్రించే ప్రయత్నం చేసిఉండేవాడు కాదు కదా. దాసరాజు దత్తపుత్రిక అంటే మంచి పదవిలోనో లేక మంచి గుర్తింపు ఇచ్చిఉండవచ్చు .కానీ అలా కాకుండా ఓక పడవ నడిపే వ్యక్తిగా చూపించాడు అంటే కథకునికి సత్యవతినీ రాచ స్త్రీగానో లేక అడవితేగకు చేందిన స్త్రీగానో చూపించడం ముఖ్యఉద్దేశ్యం కాకపోయిఉండవచ్చు ..

    ఇక వసురాజు విషయానికి వస్తే వైరాగ్యం ఏలా వస్తుందో ఏందుకు వస్తుందో తేలీదు .. కృష్ణుడి గీతోపదేశం ద్వారా అర్జునుడు motivate అయినట్టు రాజ్యక్షేమం దృష్ట్యా తన తపస్సునీ త్యాగం చేసి ఉండవచ్చు …పైగా అతను రాజర్షి అని కథకుడు చేప్పాడు కనుక రాజ్యం చేస్తూ ఆంతరంగిక తపస్సు చేస్తూ ఉండవచ్చు …వైరాగ్యం వచ్చి కేవలం మానవజన్మ కర్తవ్యం దృష్ట్యా సంసారంలో ఉంటూ తామరాకు మీద నీటిబోట్టుల , భౌతికభోగాలను ఓంటికి పట్టించుకోని వారు తరచి చూస్తే నేటికీ కనపడతారు …ఉదా. తాడేపల్లి రాఘవనారయణ శాస్త్రిగారు మహనీయులు అలా జీవించిన ఆదర్శమూర్తి కదా !

    తప్పుగా అనిపిస్తే క్షంతవ్యురాలిని

    ఏందరో మహానుభావులు అందరికీ వందనములు

ఒక వ్యాఖ్యను

Your email address will not be published. Required fields are marked *

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)