సామూహిక జ్ఞాపకంతో సాహిత్యానికి కొత్త ఊపిరి!

venu

“సాంఘిక చరిత్ర వ్రాయుట కష్టము. దీని కాధారములు తక్కువ. తెనుగు సారస్వతము, శాసనములు, స్థానిక చరిత్రలు (కైఫీయత్తులు), విదేశీజనులు చూచి వ్రాసిన వ్రాతలు, శిల్పములు, చిత్తరువులు, నాణెములు, సామెతలు, ఇతర వాజ్ఞ్మయములలోని సూచనలు, దానపత్రములు, సుద్దులు, జంగము కథలు, పాటలు, చాటువులు, పురావస్తు సంచయములు – ఇవి సాంఘిక చరిత్రకు పనికి వచ్చు సాధనములు” అని సాంఘిక చరిత్రకూ సాహిత్యానికీ మధ్య సంబంధాన్ని సురవరం ప్రతాపరెడ్డి ఒక కోణం నుంచి చెప్పారు. ఆయన 1940ల చివర ప్రారంభించిన ఆ కృషి ఆ తర్వాత ఏడు దశాబ్దాలకైనా అవసరమైన స్థాయిలో, సమర్థంగా కొనసాగలేదని, కొనసాగడం లేదని గుర్తించక తప్పదు.

సాంఘిక చరిత్రకూ సాహిత్యానికీ మధ్య సంబంధం గురించి లోతుగా ఆలోచించినకొద్దీ ఆశ్చర్యకరమైన, అద్భుతమైన సంగతులెన్నో కనబడతాయి. ప్రతాపరెడ్డి చూసినట్టుగా గత సాంఘిక చరిత్ర గత సాహిత్యంలో ప్రతిఫలించిన తీరును మాత్రమే కాదు, గత సాంఘిక చరిత్ర వర్తమాన సాహిత్యంలోకి ప్రవహించగల అవకాశాన్ని, గతంలోనైనా, వర్తమానంలోనైనా ఇటునుంచి అటుగా సాహిత్యం సాంఘిక చరిత్ర మీద వేయగల ప్రభావాన్ని చూస్తే చరిత్రకూ సాహిత్యానికీ కూడ ఎన్నో కానుకలు దొరుకుతాయి, గతం, వర్తమానం, నిన్నటి సాహిత్యం, ఇవాళ్టి సాహిత్యం అనే ఈ నాలుగు భుజాల చతురస్రం లోపల ఎన్నెన్ని పరస్పర సంబంధాలకూ సమ్మేళనాలకూ వియోగాలకూ మార్పులకూ చిక్కుముడులకూ పరిష్కారాలకూ వికాసానికీ అవకాశం ఉందో ఊహిస్తే నిజంగా దిగ్భ్రాంతి కలుగుతుంది.

సాంఘిక చరిత్రకూ సాహిత్యానికీ పరస్పర అన్యోన్య సంబంధం ఉందని గుర్తించి దానితో సవ్యంగా వ్యవహరిస్తే అటు చరిత్ర రచనా ఇటు సాహిత్యమూ కూడ విస్తృతినీ లోతునూ సంతరించుకుంటాయి. సాహిత్యం నుంచి సాంఘిక చరిత్రను తవ్వితీయడానికి ప్రతాపరెడ్డి చేసిన ప్రయత్నం గురించీ, దాన్ని కొనసాగించవలసిన అవసరం గురించీ మరోసారి మాట్లాడుకుందాం గాని, ఇప్పుడు చరిత్రనుంచి సాహిత్యం ఏమి తీసుకోవచ్చునో, తీసుకుంటే ఎట్లా సంపన్నమవుతుందో, తీసుకుంటున్నదో లేదో కొన్ని ఆలోచనలు పంచుకోవడానికి ప్రయత్నిస్తాను.

సాంఘిక చరిత్ర అంటే అక్షరాస్యులకు, విద్యావంతులకు ఒక ప్రచురిత పుస్తకం అనే పరిమిత అర్థమే స్ఫురించవచ్చు గాని, అక్షరాస్యులకూ, నిరక్షరాస్యులకూ, సమాజం మొత్తానికీ అది సామూహిక జ్ఞాపకంగా, తరతరాల వివేక సంచితంగా ఉంటుంది. నిజానికి సాంఘిక చరిత్రకు ప్రతాపరెడ్డి ప్రస్తావించిన పదిహేను ఆకరాలలో ఆరు మాత్రమే లిఖిత, అక్షర ప్రమాణాలు. మిగిలినవాటికి అక్షరాస్యతతో సంబంధం లేదు. ఆయన చెప్పినవాటికి గ్రామ గాథలు, జానపదగాథలు, వీరగాథలు, చిన్నపిల్లలకు చెప్పే కథలు, మాటలు, ఆచారాలు, ఊహల మీద, ప్రగల్భాల మీద నిర్మాణమై క్రమంగా వాస్తవమేమో అనిపించేలా పెరిగి మిగిలిపోయే భ్రమలు వంటి ఎన్నిటినో కూడ కలుపుకోవలసి ఉంది. అవి వస్తురూపంలో ఉన్నా, శబ్దరూపంలో ఉన్నా, అలవాటు రూపంలో ఉన్నా అటువంటి సాంఘిక చరిత్ర ఆకరాలన్నిటినీ గ్రహించడం, వాటిని విశ్వసనీయ, మానవీయ సన్నివేశాలలో అక్షరీకరించడం సాహిత్యానికి చాల ఉపయోగపడుతుంది. ఎందుకంటే అవన్నీ మానవ ఆలోచనా ప్రపంచంలో ఆయా సమాజాలలో సామూహిక జ్ఞాపకంగా నిలిచి ఉన్నాయి. ఒక రకంగా చూస్తే సామూహిక జ్ఞాపకం ఏ ఒక్క రచయితకూ ఆపాదించడానికి వీలులేని సామూహిక రచన అనుకోవచ్చు. సరిగ్గా సాహిత్యసృజనలో లాగనే సామూహిక జ్ఞాపకంలో కూడ జరిగినది జరిగినట్టుగా కాక, నివేదికగా కాక, వడకట్టిన, జల్లెడ పట్టిన, కాలక్రమంలో మార్పుచేర్పులకు గురైన జ్ఞాపకాల రాశిగా ఉంటుంది. దానిలో వాస్తవమూ ఉంటుంది, కల్పనా ఉంటుంది. విశ్వసనీయతా ఉంటుంది, ఐంద్రజాలికతా ఉంటుంది.

1891055_10202661894681481_1753979965_n

ప్రపంచంలో సుప్రసిద్ధమైన సాహిత్య రచనలు వేటిని పరిశీలించినా అవి ఈ సామూహిక జ్ఞాపకం మీద ఆధారపడ్డాయని అర్థమవుతుంది. నిజానికి మౌఖిక సాహిత్యం మొత్తానికీ దాదాపుగా సామూహిక జ్ఞాపకమే ఇతివృత్తం. ఆ సామూహిక జ్ఞాపకం మనిషిని ఎప్పుడైనా ఆకర్షిస్తుంది గనుకనే మౌఖిక సాహిత్యానికి ఆకర్షణ ఇప్పటికీ తగ్గలేదు. కాని రాజాస్థానాల సాహిత్యం, లిఖిత సాహిత్యం క్రమక్రమంగా ఈ సామూహిక జ్ఞాపకం నుంచి దూరమై వ్యక్తి ప్రధానంగా, వ్యక్తి జ్ఞాపకంగా పెరుగుతూ వచ్చాయి. ఇవాళ వ్యక్తి ప్రధానమైన ఆధునిక సమాజపు ప్రతిఫలనంగా ఆధునిక సాహిత్యం ఆ మేరకు సామూహికత నుంచి, ముఖ్యంగా ఇతివృత్తంలో సామూహిక జ్ఞాపకం నుంచి దూరమై మిగిలింది. సామూహిక జ్ఞాపకం ఇతివృత్తాన్ని స్వీకరించి దాని మీద అభివృద్ధి చేసే అవకాశం స్వాభావికంగానే కొన్ని ప్రక్రియలకు ఎక్కువా, కొన్ని ప్రక్రియలకు తక్కువా ఉన్నదనిపిస్తుంది. సామూహిక జ్ఞాపకాన్ని వినియోగించుకో గలిగిన శక్తి ఆధునిక ప్రక్రియలలో మిగిలిన ప్రక్రియల కన్న నవలకే ఎక్కువ ఉన్నదని అనిపిస్తుంది.

ఇలా ఆలోచించినప్పుడు తెలుగు నవల ఎదగకపోవడానికి సామూహిక జ్ఞాపకం నుంచి, సాంఘిక చరిత్ర నుంచి దూరం కావడమే, తీసుకోవలసినంత తీసుకోకపోవడమే ఒక కారణం కావచ్చునా అని అనుమానం కలుగుతుంది. నవల మొత్తంగా చారిత్రక నవల కానక్కరలేదు, అప్టన్ సింక్లెయిర్ ను ఉదాహరణగా పెట్టుకుని రాశానని మహీధర రామమోహనరావు స్వయంగా చెప్పుకున్న చారిత్రక నవలల పరంపర లాంటిది కూడ అవసరం లేదు. వ్యక్తి ప్రధానమైన, కొన్ని పాత్రలే ప్రధానమైన ఏ ఇతివృత్తపు నవల అయినా సామూహిక జ్ఞాపకం దానికి జవసత్వాలను ఇవ్వగలుగుతుందని నాకనిపిస్తుంది. పాఠకులకు ఆ సామూహిక జ్ఞాపకంతో సంబంధం ఉంటుంది గనుక నవల వికసించడానికి మాత్రమే కాదు, పాఠకులు దానితో తాదాత్మ్యం చెందడానికి కూడ అది దోహదం చేస్తుంది.

సామూహిక జ్ఞాపకంలో మరొక అంశం కూడ అంతర్గర్భితంగా ఉంటుంది. ఎన్నో ఘటనలు, క్రమాలు జరిగి, ఆ ఘటనలు, క్రమాలు చరిత్రకు ఎక్కకపోయినా, గుర్తు లేకపోయినా, ఎక్కడా మౌఖికంగా గాని, లిఖితంగా గాని నమోదు కాకపోయినా వాటి అంతిమ ఫలితమైన ఒక అవగాహన, ఒక స్వభావం, ఒక అమూర్త భావన ఆ సమూహపు జ్ఞాపకంగా మిగిలి ఉంటుంది. ఒక సాహిత్య రచన ఆ స్వభావానికి సరిపోయే సన్నివేశాన్ని చరిత్రనుంచి తీసుకుని మెరుగుపెట్టినప్పుడు, లేదా ఊహాశాలితతో సృష్టించగలిగినప్పుడు ఆ సన్నివేశం నిజమైనా కాకపోయినా, పూర్తిగా కల్పనే అయినా పాఠకులు దాన్ని తమ సామూహిక జ్ఞాపకానికి ఒక నిదర్శనంగా, వ్యక్తీకరణగా చూస్తారు. తద్వారా అది పూర్తి కల్పనే అయినా విశ్వసనీయతను సంతరించుకుంటుంది. బి. ట్రావెన్, గాబ్రియెల్ గార్షియా మార్కెజ్, ఎడువార్డో గలియనో, ఇసబెల్ అయెండి, మాన్లియో అర్గెటా, ఎరియెల్ డార్ఫ్ మన్, చినువా అచెబె, గూగీ వా థియోంగో, బుచి ఎమిచిటా వంటి లాటిన్ అమెరికన్, ఆఫ్రికన్ రచయితల శక్తి తమ సమాజాలలోని సామూహిక జ్ఞాపకాలకు కళారూపం ఇవ్వడంలో, లేదా తమ రచనలలో ఆ జ్ఞాపకాలను సమర్థంగా వినియోగించుకోవడంలో ఉందనుకుంటాను.

చరిత్రనుంచీ, జీవితచరిత్రల నుంచీ కొన్ని ఉదాహరణల ద్వారా తెలంగాణ జీవితంలోని అటువంటి సామూహిక జ్ఞాపకాలు సాహిత్యానికి ఎంత మేలు చేయగలవో చూపడానికి ప్రయత్నిస్తాను. ఆధిపత్యం పట్ల ధిక్కారం, పోరాటం తెలంగాణ సామూహిక జ్ఞాపకంలో భాగం. కనీసం వెయ్యి సంవత్సరాల చరిత్రలో ఈ సామూహిక జ్ఞాపకాన్ని బలపరిచే నిదర్శనాలు ఎన్నో ఉన్నాయి. రుద్రమదేవి, ప్రతాపరుద్రుడు, పగిడిద్దరాజు, సమ్మక్క, సారలమ్మ, పాల్కురికి సోమన, పోతన, సర్వాయి పాపన్న, రాంజీ గోండు, తుర్రెబాజ్ ఖాన్, బందగీ, కొమురం భీం, చాకలి ఐలమ్మ, దొడ్డి కొమరయ్య, షోయెబుల్లా ఖాన్ వంటి అనేక చిహ్నాలు ఈ సామూహిక జ్ఞాపకాన్ని సృష్టించాయి, పునరుత్పత్తి చేశాయి. బలోపేతం చేశాయి. ప్రత్యక్షంగా ఈ ప్రతీకలను గాని, ఈ ప్రతీకల ద్వారా వ్యక్తమైన ధిక్కార భావనను గాని ఇతివృత్తంగా తీసుకునే సాహిత్యానికి తప్పనిసరిగా ఆదరణ ఎక్కువగా ఉంటుంది.

పైన చెప్పిన సామూహిక జ్ఞాపకపు ప్రతీకలన్నీ సుప్రసిద్ధమైనవే, ఇటీవలి కాలంలో మళ్లీ మళ్లీ స్మరణకు వచ్చినవే. కాని తెలంగాణ చరిత్ర సూక్ష్మంగా అధ్యయనం చేస్తున్నప్పుడు ఇటువంటి మరెన్నో ఘటనలు, పరిణామాలు, ప్రతీకలు ఉన్నాయని స్పష్టమయింది.

ఉదాహరణకు పాలకుర్తి గ్రామాన్ని తీసుకొండి. పాల్కురికి సోమన ఆ గ్రామం నుంచి వచ్చి శివకవిగా, ప్రచారకుడిగా, సామాజిక చింతకుడిగా తన కాలం కన్న చాల ముందుకు చూశాడు. మార్గ సంప్రదాయాన్ని ధిక్కరించి దేశి పద్ధతి చేపట్టాడు. ఉరుతర గద్య పద్యోక్తులను, సంస్కృత సమాస భూయిష్ట రచనను తిరస్కరించి జానుతెనుగులో, ద్విపదలో రచించాడు. అప్పటికి ఉన్న ఆనవాయితీని కాదని బసవపురాణం రాశాడు. జాతిభేదాన్ని, స్త్రీపురుష భేదాన్ని, కులగోత్రాలను, కలిమిలేములను గుర్తించని వీరశైవాన్ని అనుసరించాడు. ఆయన జీవితకాలంలో ఒక చాకలి స్త్రీకి శివదీక్ష ఇచ్చాడని ఆధారాలున్నాయి. అదే గ్రామంలో ఏడు వందల సంవత్సరాల తర్వాత ఒక చాకలి స్త్రీ దొరతనాన్ని ధిక్కరించడం సంబంధం లేనిదనీ, యాదృచ్ఛికమనీ అనిపించవచ్చు గాని నేను దాన్ని సామూహిక జ్ఞాపకపు పునరుత్పత్తి అనుకుంటాను. సోమన ధిక్కారం భాషలో, సాహిత్యంలో, సంస్కృతిలో, మతాచారాలలో జరిగితే, ఐలమ్మ ధిక్కారం భూమి మీద, శ్రమ ఫలితం మీద, అధికారం మీద, చట్టం మీద జరిగింది. ఈ రెండు ధిక్కారాలూ వేరువేరు అనుకునే దృక్పథం కూడ ఉంది గాని, నా ఉద్దేశంలో ఈ రెండూ పరస్పరాశ్రితాలు. సోమన ధిక్కారాన్ని బలోపేతం చేయగలిగిందీ, అర్థవంతం చేయగలిగిందీ, సుస్థిరం చేయగలిగిందీ ఐలమ్మ ధిక్కారమే. ఈ అన్యోన్య సంసర్గం, ఇంత సుదీర్ఘకాలపు కొనసాగింపు తప్పనిసరిగా సాహిత్యానికి అద్భుతమైన ముడిసరుకు అవుతుంది.

అలాగే కడివెండి గ్రామాన్ని చూడండి. విసునూరు రామచంద్రారెడ్డి అధీనంలోని గ్రామంగా, కర్కోటకురాలని పేరు తెచ్చుకున్న ఆయన తల్లి స్వయంగా పాలించిన గ్రామంగా ఆ ఊరు సహజమైన ప్రతిఘటనను ప్రకటించింది. ఆ ప్రతిఘటన క్రమంలో తగినంత మిగులులేని గ్రామ రైతుల దగ్గరినుంచి బలవంతంగా వసూలు చేస్తున్న యుద్ధపు లెవీ, గుమ్ములు పొర్లిపారుతున్న దొర గడీకి ఎందుకు వర్తించదని ప్రశ్న తలెత్తింది. ఆ ప్రశ్న ఊరేగింపు రూపం ధరించింది. ఆ ఊరేగింపు మీద కాల్పులలో దొడ్డి కొమరయ్య మరణించాడు. ఆ తర్వాత ఆరు దశాబ్దాలకు అదే గ్రామానికి చెందిన పైళ్ల వెంకటరమణ గాని, ఎర్రంరెడ్డి సంతోష్ రెడ్డి గాని మరొక ఐదారుగురు గాని మరొక ప్రజావిముక్తి సమరంలో అటువంటి ప్రశ్నలే వేసి ప్రాణత్యాగాలు చేశారు. ధిక్కార, త్యాగ చరిత్ర ఆ గ్రామపు సామూహిక జ్ఞాపకంలో మాత్రమే కాదు, మొత్తంగానే ఈ ప్రాంతపు, తెలంగాణ సామూహిక జ్ఞాపకంలో, సాంఘిక చరిత్రలో భాగమైంది. ఇది సాహిత్యంలోకి అనువాదమైతే ఎంత రోమాంచకారి ప్రభావం కలగజేయగలుగుతుంది!

ఇలా వెతుకుతూ పోవాలే గాని, తెలంగాణ చరిత్ర నిండా, ఆమాటకొస్తే ఎక్కడైనా ప్రజల చరిత్ర నిండా ఎన్నెన్నో అద్భుతమైన ఘటనలు, పరిణామాలు దొరుకుతాయి. ఆ సామూహిక జ్ఞాపకాన్ని, సాంఘిక చరిత్రను తవ్వితీసి సాహిత్యరూపం ఇవ్వడం సాహిత్యకారుల బాధ్యతలలో ఒకటనుకుంటాను. ఈ తవ్వితీయడానికి గనులుగా ప్రతాపరెడ్డి చెప్పిన ఆకరాలు మాత్రమే కాదు, మరెన్నో ఆకరాలున్నాయి.

వరంగల్ లో భాగమైన వడ్డెపల్లి భూస్వామ్య కుటుంబం నుంచి వచ్చి సుప్రీంకోర్టు న్యాయమూర్తి దాగా ఎదిగిన పింగళి జగన్మోహన రెడ్డి తన ఆత్మకథలో ఒక ఉదంతం రాశారు. అది తన ముత్తాత కాలం నాటిదని, అందువల్ల దానిలో వాస్తవం ఎంతో చెప్పలేమని ఆయనే రాశారు. హనుమకొండలో ఇప్పటికీ రాగన్న దర్వాజ అనే పేరుతో ఒక ప్రాంతం ఉంది. ఆ రాగన్న జగన్మోహనరెడ్డికి పూర్వీకుడు. ఆ రాగన్నను హత్య చేసిన నేరం మీద ఒక వ్యక్తికి మరణశిక్ష విధించారట. ఆ శిక్ష అమలు చేయబోయే సమయానికి ఆ వ్యక్తి తమ్ముడు వచ్చి, ‘మా అన్న భార్యాబిడ్డలు ఉన్నవాడు. మరణశిక్ష అమలుచేస్తే వాళ్లు దిక్కులేనివారైపోతారు. నాకు వెనుకాముందూ ఎవరూ లేరు. అందువల్ల మా అన్నకు వేసిన శిక్షను నాకు బదిలీ చేసి, నన్ను ఉరితీయండి’ అని కోరాడట. నిజంగానే ఆ తమ్ముడికే శిక్ష అమలు చేశారట. వాస్తవం కల్పన కన్న అద్భుతంగా ఉంటుందనడానికి ఇంతకన్న నిదర్శనం ఉంటుందా?

తెలంగాణ చరిత్రకు సంబంధించి ఇటువంటి ఆశ్చర్యకరమైన, అద్భుతమైన ఘటనల వనరులలో ‘హైదరాబాద్ అఫెయిర్స్’ ఒకటి. అసలు ఆ ‘హైదరాబాద్ అఫెయిర్స్’ కథే తెలుసుకోవలసిన కథ. హైదరాబాదు రాజ్యంలో పందొమ్మిదో శతాబ్దం చివరిలో జరిగిన విశేషాలగురించిఅప్పటి పత్రికలలో వచ్చిన వార్తలన్నిటినీ నిజాం ప్రభుత్వంలో ఆర్థిక కార్యదర్శిగా ఉండిన మౌల్వీ సయ్యద్ మహదీ అలీ ‘హైదరాబాద్ అఫెయిర్స్’ పేరుతో పన్నెండో, పదమూడో పెద్ద సంపుటాలుగా సంకలనం చేసి 1880లలో ప్రచురించాడు. అవి ఫూల్ స్కేప్ సైజులో ఒక్కొక్కటి మూడు వందల పేజీల నుంచి తొమ్మిది వందల పేజీల దాకా ఉంటాయి. ఆ సంపుటాలు చదువుతుంటే నూట యాభై సంవత్సరాల వెనుకటి హైదరాబాద్ రాజ్యం, సమాజం, పాలన, సంస్కృతి కళ్లముందర కదలాడుతాయి. (అయితే దురదృష్టమేమంటే అన్ని సంపుటాలూ ఒక్కచోట ఇంతవరకూ నేను చూడలేకపోయాను. బ్యూరో ఆఫ్ ఎకనమిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ లోనూ, డిస్ట్రిక్ట్ గెజెటీర్స్ కార్యాలయంలోనూ చాల సంపుటాలు ఉండేవి. ఇప్పుడు మొదటి దాంట్లో అన్నీ లేవు, రెండో కార్యాలయమే లేదు. ఇక్కడ కనబడని సంపుటాలు కొన్ని నాకు యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా, బర్కిలీ గ్రంథాలయంలో కనబడ్డాయి గాని అవి ఫొటోకాపీ చేయించుకోవడం కుదరలేదు. ఆ తర్వాత చార్మినార్ దగ్గర ఒక అద్భుతమైన పాత పుస్తకాల ఫోటోకాపీల అమ్మకందారు దగ్గర ఆరేడు సంపుటాలు సంపాదించాను గాని అన్నీ దొరకలేదనే లోటు అలాగే ఉంది.) ఆ సంపుటాలు తెలంగాణ సాంఘిక చరిత్ర గురించి ఎన్నో అరుదైన, ఆశ్చర్యకరమైన విషయాలను, సాహిత్యంలోకి పరావర్తనం చెందగల, ప్రతిఫలించడానికి అవకాశం ఉన్న విషయాలను ఇస్తాయి. అవన్నీ ఏదో ఒక స్థాయిలో మన సామూహిక జ్ఞాపకంలో భాగమయ్యాయనే అనుకుంటాను. ఇక్కడ మచ్చుకు ఒకటి చెపుతాను:

కలకత్తా నుంచి వెలువడుతుండిన ఇంగ్లిష్ మన్ పత్రికలో 1859లో వచ్చిన వార్త ప్రకారం హనుమకొండకు పన్నెండు కోసుల దూరంలో రూపా అనే ఒక లంబాడీ పెద్ద మరొక తండా పెద్దతో వచ్చిన ఘర్షణలో ఆయననూ, ఆయన కుటుంబ సభ్యులనూ మొత్తం ముప్పైతొమ్మిది మందిని నరికేశాడట. ఆ నేరానికి నిర్బంధించి న్యాయస్థానానికి తీసుకొచ్చినప్పుడు, “నాకూ మా అన్నకూ తగాదా వచ్చి నేను ఆయనను చంపేస్తే విచారించడానికి మధ్యలో ఈ అదాలత్ ఎవరు? శిక్ష విధించడానికి సర్కారు ఎవరు? నేనేమన్నా సర్కారు సొమ్ము తిన్నానా? దోపిడీ చేశానా” అని అడిగాడట.

ఇది చదివినప్పుడు నాకు సరిగ్గా ఇటువంటి జ్ఞాపకాలనే లాటిన్ అమెరికన్, ఆఫ్రికన్ సాహిత్యకారులు ఎలా కాల్పనీకరించి, అద్భుతమైన దృశ్యాలుగా, ఆలోచనాస్ఫోరకమైన సన్నివేశాలుగా మలిచారుగదా అనిపించింది.

చిట్టచివరిగా, ఇవాళ తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ సందర్భంలో తెలంగాణ ప్రజల స్వాభిమానాన్ని వ్యక్తీకరించే సాహిత్య రూపాలు విరివిగా వెలువడుతున్నాయి. నిజానికి ప్రత్యేక రాష్ట్ర వాంఛ తెలంగాణ ప్రజల స్వాభిమాన కాంక్షకు ఒకానొక వ్యక్తీకరణ మాత్రమే. సాంఘిక చరిత్రలో కొంచెం వెనక్కి వెళితే, 1950లో రైతాంగ సాయుధ పోరాట ప్రాంతాలలో పర్యటించిన అమెరికన్ విలేఖరి తాయా జింకిన్ ఒక జీపు డ్రైవర్ మాటల్లో వెలువడిన ఆనాటి ఆకాంక్షను నమోదు చేసింది. నువ్వే ప్రభుత్వమైతే ఏం చేస్తావు అని ఆమె అడిగిన ప్రశ్నకు ఆ డ్రైవర్ “జనానికి బాగా అప్పులిస్తాను. బోలెడన్ని బళ్లూ ఆస్పత్రులూ కట్టిస్తాను. దున్నేవాడికే భూమి పంపిణీ చేస్తాను. ఉర్దూ రద్దు చేస్తాను. తెలుగువాళ్లను అధికారులుగా నియమిస్తాను. గ్రామాల రక్షణకు స్వచ్ఛంద సాయుధ దళాలను ఏర్పాటు చేస్తాను…” అన్నాడట. ఈ కోరికలలో రెండిటిని ఇప్పుడు సవరించుకోవలసిన అవసరం ఉందేమో గాని, మౌలికంగా మిగిలిన కోరికలకు కాలం చెల్లలేదు. ఆరున్నర దశాబ్దాల తర్వాత కూడ వాటిలో ఏ ఒక్కటీ తీరలేదు.

గతమూ వర్తమానమూ జ్ఞాపకమూ జీవితమూ కలగలిసిన సమాజం ఇది. ఈ చరిత్రనూ, సామూహిక జ్ఞాపకాన్నీ, ఊహనూ అద్భుతమైన సృజనగా రసాయనిక సంయోగం సాధించగల గాబ్రియెల్ గర్సియా మార్కెజ్ వంటి సృజనకర్త కోసం ఈ నేల ఎదురుచూస్తున్నదనుకుంటాను.

-ఎన్. వేణుగోపాల్

చిత్రం: అన్నవరం శ్రీనివాస్

Download PDF

2 Comments

 • prabhakara rao ch v says:

  నేటికి సంఘీక చరిత్ర పట్ల చరిత్రకారులకు గాని ఇతరులకు గాని స్పష్టమైన అవగాహనా లేదు. గతంలో కాకతీయ విశ్వవిద్యాలయం లో జరిగిన సెమినార్లో ( హిస్టరీ కాంగ్రెస్ లో భాగంగా) కూడా ఈ విషయం సీరియస్ గా చర్చించలేదు.
  నేటికి పత్రికలలో వచ్చే వార్తలే రేపటి చరిత్రగా మారనుంది. ప్రభుత్వపరంగా కాని విశ్వవిద్యాలయాల పరంగా కాని నిర్దిష్టమైన ప్రణాళిక తో నేటి చేరిత్రను మనం రూపొందిన్చుకోకుంటే మన భారత దేశ చరిత్రలా తలా తోక లేని విధంగా తయరవుతున్ధనడం లో సందేహం లేదు. శాస్త్రీయ దృక్పథంతో నేటి చరిత్రను బాద్యత గల రచయితలవేదికైనా చేపట్టాలి.

 • chandramouli raamaa says:

  వరంగల్ లో భాగమైన వడ్డెపల్లి భూస్వామ్య కుటుంబం నుంచి వచ్చి సుప్రీంకోర్టు న్యాయమూర్తి దాగా ఎదిగిన పింగళి జగన్మోహన రెడ్డి తన ఆత్మకథలో ఒక ఉదంతం రాశారు. అది తన ముత్తాత కాలం నాటిదని, అందువల్ల దానిలో వాస్తవం ఎంతో చెప్పలేమని ఆయనే రాశారు. హనుమకొండలో ఇప్పటికీ రాగన్న దర్వాజ అనే పేరుతో ఒక ప్రాంతం ఉంది. ఆ రాగన్న జగన్మోహనరెడ్డికి పూర్వీకుడు. ఆ రాగన్నను హత్య చేసిన నేరం మీద ఒక వ్యక్తికి మరణశిక్ష విధించారట. ఆ శిక్ష అమలు చేయబోయే సమయానికి ఆ వ్యక్తి తమ్ముడు వచ్చి, ‘మా అన్న భార్యాబిడ్డలు ఉన్నవాడు. మరణశిక్ష అమలుచేస్తే వాళ్లు దిక్కులేనివారైపోతారు. నాకు వెనుకాముందూ ఎవరూ లేరు. అందువల్ల మా అన్నకు వేసిన శిక్షను నాకు బదిలీ చేసి, నన్ను ఉరితీయండి’ అని కోరాడట. నిజంగానే ఆ తమ్ముడికే శిక్ష అమలు చేశారట. వాస్తవం కల్పన కన్న అద్భుతంగా ఉంటుందనడానికి ఇంతకన్న నిదర్శనం ఉంటుందా?
  వేణుగోపాల్ రాసిన ఈ ఉదంతం నిజంగానే నమ్మశక్యం కాకుండా ఉన్నా..మనిషికి అర్థంకాని కొన్ని అతీత సంవేదనల లోతులను తెలియజేస్తోంది.చట్టాలూ..వాస్తవాలూ ఎలా భిన్నిస్తాయో చెబుతోంది.
  సమాచారభరితంగా ఉన్న ఈ వ్యాసం ఉపయోగకరమైంది .

  -రామా చంద్రమౌళి ,వరంగల్.

ఒక వ్యాఖ్యను

Your email address will not be published. Required fields are marked *

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)