ఎక్కడి నుంచి ఎక్కడి దాకా? – 20 నుంచి 26 భాగాలు ( సమాప్తం )

26( గత వారం తరువాయి )

 20

కొద్దిగా కళ్ళు తెరిచాడు రామం.. రెండ్రోజుల తర్వాత అప్పుడే స్పృహలోకొచ్చి..

అపోలో హాస్పిటల్‌.. హైద్రాబాద్‌.

బయట ఎడతెగని వర్షం.
రాష్ట్రం అట్టుడికి పోతోంది. ఇరవైమూడు జిల్లాల జనసేన కార్యాలయాల దగ్గర వేలకొద్ది ప్రజలు. టి.వి. చానళ్ళన్నీ బ్రేకింగు న్యూస్‌.. ఎప్పటికప్పుడు రామం ఆరోగ్య పరిస్థితిపై బులిటిన్లు. భారతదేశంలో ‘ప్రక్షాళన’ పేరుతో ఆరంభమైన ఈ వినూత్న అహింసాయుత వైవిధ్య ఉద్యమాన్ని పరిశీలించేందుకు, విశ్లేషించేందుకు జాతీయ, అంతర్జాతీయ టి.వి చానళ్ళుకూడా హైద్రాబాద్‌లో మకాం వేశాయి.

అంతకుముందు రోజే రామం కోరికగా క్యాథీ, డాక్టర్‌ గోపీనాథ్‌, మూర్తి, శివ ఒకేమాటగా.. ‘వ్యక్తులు ముఖ్యంకాదు.. ముందుకుపోవడం, యుద్ధం చేయడం, పోరాటాన్ని కొనసాగించడం.. అవిశ్రాంతంగా లక్ష్యంవైపు  పయనించడం.. యివే ముఖ్యం’ అని భావించి రామం హాస్పిటల్లో ఉన్నా… యథావిధిగా ముందే వేసుకున్న ప్రణాళిక ప్రకారం అన్ని జిల్లా కేంద్రాల్లో ‘ప్రక్షాళన” మూడవ విడత కార్యక్రమం జయప్రదంగా నిర్వహించబడింది. అన్ని కేంద్రాల్లో రిటైర్డ్‌ ఆడిటర్స్‌, ఇన్‌కంటాక్స్‌, సేల్స్‌టాక్స్‌ ఆఫీసర్స్‌, కొందరు మాజీ ఎస్పీలు, యిదివరకు ప్రభుత్వంలో పనిచేసి అన్ని రూల్స్‌ సమగ్రంగా తెలిసిన సెక్రటరీ స్థాయి ఉద్యోగులు.. తమతో చాకుల్లాంటి, దేశంపట్ల, సమాజంపట్ల తమ బాధ్యతలనెరిగిన మెరికల్లాంటి, క్రీమ్‌వంటి యువకులు తోడుగా.. చేతిలో ‘సమాచార చట్టం’ ప్రకారం సంపాదించిన సర్టిఫైడ్‌ కాపీలను జతచేసి.,
శక్తి నిత్యమూ, సత్యమూ, నాశనంలేనిదీ ఐనట్టే.. అందరికీ చెందిన గాలి, భూమి, నీరు, నిప్పు, ఆకాశం వంటి సహజవనరుల ద్వారా ఉత్పత్తిగా, సేవగా, వస్తువుగా.. చివరికి డబ్బుగా మారిన సంపద.. అంతిమంగా సమాజానికి చెందాలి. సమంగా అందరికీ పంచబడాలి. కాని అందరికీ చెందాల్సిన సామాజిక సంపద అనేక అక్రమ మార్గాలద్వారా కొందరి.. అంటే దేశంలోనే ఓ ఏడెనిమిది శాతం మంది గుప్పిట్లలో బందీ ఐ ఉంది. అందరికి చెందవలసిన ప్రజలఉమ్మడి సంపద కొందరి దగ్గర్నే గుప్తమై ఉండడం సహజన్యాయానికి విరుద్ధమైంది కాబట్టి.. దాన్ని ప్రజలే విముక్తం చేస్తున్నారు.
ఆ క్రమంలో.. జనసేన రహస్య సమాచార సేకరణ బృందాలు అన్వేషించి సంపాదించిన అవినీతి సంపాదన, లంచాలద్వారా కూర్చుకున్న నల్లడబ్బు గల అనేకమంది ఉన్నతస్థాయి ప్రభుత్వాధికారులు, రాజకీయ నాయకులు, కార్పొరేట్‌ సంస్థలవాళ్ళు, బ్రోకర్లు, కన్‌సల్టెంట్స్‌, కన్‌స్ట్రక్షన్‌ కంపెనీలు.. వీళ్ళ గత ఐదు సంవత్సరాలుగా ఇన్‌కంటాక్స్‌ డిపార్ట్‌మెంట్‌కు సమర్పించిన రిటర్న్స్‌, ఎలక్షన్‌ కమీషన్‌కు లిఖితపూర్వకంగా యిచ్చిన సమాచారం.. ఒక్కొక్కరిపేర ఉన్న బినామీ ఆస్తుల వివరాలు.. అన్నీ జతచేసి ప్రజల సమక్షంలో దాడులు నిర్వహించి నిగ్గుతేల్చాల్సిందిగా ప్రజల పక్షాన ప్రజలు ఋజువుల్తో సహా కంప్లెయింట్‌ చేయడమే.. వాటిపై చర్య తీసుకోకుండా ఎగవేసేందుకు వీల్లేకుండా కాపీ టు కలెక్టర్‌, కాపీ టు చీఫ్‌ సెక్రటరీ, కాపీ టు గవర్నర్‌.. కాపీ టు.. ఇన్‌కంటాక్స్‌ డిపార్ట్‌మెంట్‌, గవర్నమెంటాఫ్‌ ఇండియా.. బృందాలు బృందాలుగా చేసిన కంప్లెయింట్లను కార్యరూపంలోకి తెచ్చేదాకా డే టు డే ఫాలోఅప్‌.. ఎవర్నీ నిద్రబోనిచ్చేది లేదు.. తాము నిద్రపోయేది లేదు.
పరిస్థితి ఏమైందంటే.. ‘జనసేన’ వెంటపడ్తే..ఒక ఆల్సేసియన్‌ కుక్కలమంద వెంటపడి తరిమినట్టే.. చంపవు.. విడిచిపెట్టవు. సాధారణ ప్రజలకుమాత్రం ఒక సుదీర్ఘ చీకటి తర్వాత.. కొత్త ఉషోదయం.
మొత్తం నాల్గువేల ఆరువందల ముప్పయి రెండు కేసులు.

27
ఆ రోజు విప్లవించిన అహింసాయుత ప్రజాచైతన్య ప్రభంజనాన్ని మీడియా ఆకాశమంత విశాలంగా కథనాలు కథనాలుగా.. ప్రజల అభిప్రాయాలుగా, స్పందనలుగా, మేధావుల ప్రశంసలుగా.. కొందరు గుండాల పశ్చాత్తాపాలుగా ప్రసారంచేసి, ప్రచురించి ఎంతో ప్రాచుర్యం కల్గించాయి.
పరిస్థితి.. నిబద్ధత.. ఎవరికోసం ఏదీ ఆగదు. తీరం చేరేదాకా ప్రయాణం తప్పదు. కొనసాగింపేగాని విరామంలేదు.
వందల వేల సంఖ్యలో ‘రామం’ గురించిన ఎంక్వయిరీలు.. రాష్ట్రం నలుమూలల్నుండి.. ఇతర రాష్ట్రాల అభ్యుదయకాముకులనుండి, ప్రజాసంఘాలనుండి.
ఎప్పుడూ శక్తి ఒకచోట క్షిప్తమై ఉంటుంది. కాని ఒక వెక్టార్‌గా బాణంవలె, తుపాకీగుండువలె అనుసంధానించగలిగే కర్త ఒకరు కావాలి. రామం.. నాయకుడు.. ప్రజాశక్తిని ఒక నిశ్శబ్ద రక్తపాతరహిత ఉద్యమంగా రూపొందించి బ్రహ్మాస్త్రాన్ని చేసి సంధించిన సంధానకర్త. కర్త కర్మ క్రియ..అన్నీ.
యిప్పుడా నాయకుడెలా ఉన్నాడు. అసలా ‘అగ్ని’పై దాడి ఎలా జరిగింది.
పోలీసులు.. కుక్కలు.. అందరూ రంగప్రవేశం చేశాయి.
కాని.. జనసేన కార్యకర్తలు.. సుశిక్షితులు.. యోధులు.. కొత్తవాడ దాడి జరిగిన రెండుగంటల్లోనే శివనగర్‌లో పట్టుకున్నారు ఆ బాంబువేసినవాణ్ణి. ఆ వ్యక్తిని పోలీసుల అదుపులోకి ఇచ్చేముందు సరియైన పద్ధతిలో గూఢాచార కార్యకర్తలు విచారిస్తే.. అంతా బయటపడింది. దాదాపు ఐదు ప్రజాసంబంధమైన ప్రాజెక్ట్‌ల్లో పధ్నాలుగు వేలకోట్లు ప్రక్కదారి పట్టించి తింటున్న ఒక రాయలసీమ రాజకీయ నాయకుడు యిక తన దుశ్చర్యలన్నీ బట్టబయలైతాయని భయపడి, ‘జనసేన’ ఉద్యమం ఇంకా ఇంకా బలపడి వేళ్ళూని బలపడకముందే ఆదిలోనే తుంచేయాలని రామంను హతమార్చేందుకు యాభై లక్షల బేరాన్ని కుదర్చుకుని పంపగా వచ్చిన కిరాయిరౌడీ.. పేరు ఈరప్ప.. మొత్తం కూపీ బయటపడింది. ఆ నాయకుడెవడు. వాని చరిత్ర నేపథ్యం ఏమిటి.. వాని వెనుక ఉన్న తెరవెనుక గుండాలెవరు.. అంతా వెంటనే చర్యకొరకు రాయలసీమలోని ‘జనసేన’ కార్యాలయానికి ఆదేశాలు వెళ్ళాయి.
రామం కళ్ళు తెరిచి.. స్పృహలోకొస్తూ.. మెల్లగా చుట్టూ చూశాడు.
వర్షం చినుకుల చప్పుడు.
గదిలో.. క్యాథీ, డాక్టర్‌ గోపీనాథ్‌, శివ.. మూర్తిగారు.
”బాంబు పేల్చినవాడు పట్టుబడ్డాడు”అన్నాడు శివ ఆత్రంగా
”….” మౌనంగా శివవంక చూశాడు రామం నిర్మలంగా.. ప్రశాంతంగా.. ఆ చూపులనిండా కరుణ జాలువారుతోంది.
”పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు..రాయలసీమవాడు.”
”శివా.. వాణ్ణి వదిలేయమని నా తరపున ఒక ఆప్లికేషన్‌ తయారుచేయి ప్లీజ్‌”
”రామం.. మీరేమంటున్నారు. వాడు మిమ్మల్ని హతమార్చాలనుకున్నాడు”
”ఔను.. అందుకే వదిలేయమంటున్నాను”
”….” శివ అవాక్కయి శూన్యంగా చూస్తూండగా.,
గోపీనాథ్‌కు రామంలో పూర్తి పరిపక్వత చెందిన పరిపూర్ణ మానవుడు దర్శనిమస్తూండగా..,
”శివా.. అతను యిప్పటికే పశ్చాత్తాపపడ్తూంటాడు. విడిచిపెట్తే వాడొక వాల్మీకిలా పరివర్తన చెందుతాడు శివా.. నిజం.. ద్వేషానికీ, పగకూ శిక్ష ఎప్పుడూ పరిష్కారం కాదు. క్షమ ఒక్కటే అటువంటి వ్యక్తికి సరైన శిక్ష”
మూర్తిగారు ఆశ్చర్యంతో ఆనందపడిపోయాడు. తను ఇన్నాళ్లుగా జరిపిన ప్రపంచ తత్వవేత్తల, మహాపురుషులకు సంబంధించిన అనేక అధ్యయనాల్లో యింత పరిణతి కనిపించదు. రామం ఆయనకు ఓ కొత్తకోణంలో మహామనీషిలా కనబడ్డాడు మొదటిసారి.
ఈలోగా శివ చేతిలోని ‘జనసేన’కు సంబంధించిన హాట్‌లైన్‌ మొబైల్‌మ్రోగింది. వరంగల్లు జనసేన కేంద్రక కార్యాలయంనుండి..
”హలో..” అన్నాడు శివ ఏదో ముఖ్యవిషయమే ఐ ఉంటుందని ఊహిస్తూ,
‘ఆపరేటర్‌ పద్మజ.. హలోశివా.. అస్సాంనుండి అఖిల్‌ గొగోయ్‌ అనే సామాజిక ఉద్యమకారుడు రామంగారి ఆరోగ్యంగురించి వాకబు చేస్తున్నాడు. మనవలెనే సమాచారచట్టం ఆర్టిఐని ఆధారంగా చేసుకుని 2006 నుండి కృషిక్‌ ముక్తి సంగ్రామ్‌ సమితి అనే సంస్థను స్థాపించి ఎఫ్‌ సి ఐ గోదాములు, ప్రజాపంపిణీ వ్యవస్థపై చారిత్రాత్మకమైన పోరాటం చేస్తున్నాడు.. అతను..”
”కనెక్షన్‌ యివ్వు పద్మజా”
వెంటనే లైన్‌ రీ ఓపెనై అఖిల్‌ గొగోయ్‌ ట్రాక్‌లోకొచ్చాడు.
”గుడ్మార్నింగు.. హౌ ఈజ్‌ మిస్టర్‌ రామం.. జనసేన చీఫ్‌”
”గుడ్మార్నింగు సర్‌. హి ఈజ్‌ ఔటాప్‌ డేంజర్‌ నౌ.. ఆల్సో సేఫ్‌..”
”థాంక్‌గాడ్‌.. రామం వంటి వారు ఈ దేశానికి చాలా అవసరం.. మీ జనసేన గురించి మీడియాలో జాగ్రత్తగా గమనిస్తున్నాను. నేను ‘అగ్ని’ ఛానల్‌ చూస్తా. మేము యిక్కడ చేయలేని పనిని మీరు భారీఎత్తున చేపట్టి విజయం సాధిస్తున్నారు.. బెస్టాఫ్‌ లక్‌.. ఒకసారి రామం గారికివ్వండి” అన్నాడు అస్సామీ భాషలో-
శివ ఫోన్‌ను రామంకు అందించాడు.. యిచ్చి ”అఖిల్‌ గొగోయ్‌.. కె ఎమ్‌ ఎ స్సెస్‌ అస్సాం” అన్నాడు.
”గుడ్మాన్నింగు.. మిస్టయ్‌ గొగోయ్‌.”
”…..” అట్నుండి సంభాషణ జరిగి.,
”థాంక్యూ.. థాంక్యూ వెరీమచ్‌.. ఐ ఆల్సో విష్‌ ద బెస్ట్‌ ఇన్‌ యువర్‌ ఎండీవర్‌” అన్నాడు  రామం.
”యు ఆర్‌ ది హోపాఫ్‌ ది నేషన్‌.. మిస్టర్‌ రామం.. ప్లీజ్‌ టేక్కేర్‌..”
”….” నిశ్చలంగా మొబైల్‌ను శివకు అందించాడు రామం.
”శివా.. మొన్నటి మన ‘ప్రక్షాళన’ జరిగిందా ముందే అనుకున్నట్టు”
”ఔను.. జరిగింది.”
”క్యాథీ… గోపీనాథ్‌ సార్‌.. నావల్ల మన కార్యకలాపాలేవీ ఆగొద్దు. మనవంటి సామాజిక ఉద్యమాల్లో ఒక నాయకుడు, అనేకమంది అనుచరులుండొద్దు.. ప్రతివ్యక్తీ ఒక స్వయంచోదిత నాయకుడుగా ఎదిగి ఎదురొడ్డి పోరాడాలి.. క్యాథీ మనం అనుకున్న ప్రోగ్రాం చెప్పవా ప్లీజ్‌” అన్నాడు రామం ఆమెవైపు చూస్తూ.
”మన కార్యాచరణ పథకంలో మనం ప్రధానంగా ఐదు థల్లో లక్ష్యాన్ని చేరుకుంటాం. అవి అవగాహన, ప్రక్షాళన, సంగ్రామం, పరిపాలన మరియు కొనసాగింపు. మనం గత మూడునెలలో నెలపదిహేను రోజులు అవగాహన పేరుతోలక్షలమందిని సంప్రదించి, అభిప్రాయాలు సేకరించి, డాక్యుమెంట్‌ చేసి ప్రజల్లో పౌరవిధులపట్ల, బాధ్యలపట్ల, హక్కులపట్ల, రాజ్యాంగం ద్వారా సంక్రమించిన అధికారాలపట్ల అవగాహన కల్పించి చైతన్యవంతులను చేశాం. దాదాపు నాల్గు లక్షలమందిని జనసేనలో చేర్పించి, లక్షమంది క్రియాశీల కార్యకర్తలతో ఒకటి, ప్రక్షాళన రెండు.. ప్రక్షాళన మూడు కార్యక్రమాలను అమలుచేస్తూ కాంట్రాక్టర్లరూపంలో ఉన్న రాజకీయ నాయకులపైన, యితర దుర్మార్గ బినామీ ఆపరేటర్ల మీద, పవర్‌ ప్రాజెక్ట్‌లు, ఇర్రిగేషన్‌ ప్రాజెక్ట్‌లు, రోడ్లు, వంతెనలు, నిర్మాణాలు.. వీటన్నింటిపై మొత్తం ఆరువందల నలభై ఎనిమిది కేసులను ముఖాముఖి ప్రజల సమక్షంలో నిలదీసి.. దాదాపు డెబ్బయిఎనిమిది వేల కోట్ల రూపాయల పాక్షిక దుర్వినియోగాన్ని కోర్టులద్వారా, లోకాయుక్త ద్వారా.. నైతిక విజయాలద్వారా ఆపి నిలదీశాం. దీంతో ప్రభుత్వ సూడో రాజకీయ యంత్రాంగమంతా తోకముడిచి కలుగుల్లోకి వెళ్ళిపోయింది. ప్రజలు యిప్పుడు నేయి హవిస్సుగా లభిస్తున్నప్పుడు ఎగిసెగిసిపడే యజ్ఞ అగ్నిజ్వాలల్లా చైతన్యంతో ధగధగలాడ్తున్నారు. యిక ప్రక్షాళన నాల్గు ఇంకో వారం తర్వాత ఉంది. ఆ థలో ఈ రాష్ట్రంలో పరిశ్రమలు ఎందుకు రావట్లేదు. ఉద్యోగాలు ఎందుకు రూపొందించబడట్లేదు. ప్రపంచీకరణ, గ్లోబలైజేషన్‌ నేపథ్యంలో బడాబడా వెధవలు ఎలా శాశ్వత ప్రకృతి వనరులను, మానవశక్తిని దోపిడీ చేస్తున్నారు. దేశీయ ఆదివాసీ, గిరిజన, అరణ్యప్రాంత తెగల ప్రజలు ఎందుకు అణగారిపోయి జీవిస్తున్నారు. వీరిపేర ప్రభుత్వాలు ఇంతవరకు ఎన్నివేల కోట్లను ఉపయోగించి, ఖర్చుపెట్టి అభివృద్ధి చేశామని చెప్పి.. ఎంత భోంచేశాయి.. యివన్నీ, వీటి చిట్టా విప్పవలసి ఉంది. వీటి సమగ్ర సమాచారం మన గూఢాచార, యువజన విభాగాలు సేకరిస్తున్నాయి. యిక ఆ తర్వాత అతి కీలకమైన సంగ్రామం ప్రారంభమౌతుంది. ఎప్పుడు ఎన్నికలొచ్చినా చైతన్యవంతులైన ప్రజలు యిక బెబ్బులులై విజృంభించి నేరచరితులు, గుండాలను, అవినీతిపరులైన రాజకీయ నాయకులను కనబడ్తే తరిమి తరిమికొడ్తారు. కలుషితమైన ప్రస్తుత వ్యవస్థ పూర్తిగా నిర్మలమై, స్వచ్ఛమై పారదర్శకమయ్యేదాకా మన ‘సంగ్రామం’ కొనసాగుతుంది. ఇది ఒక దీర్ఘకాలిక కార్యక్రమం.. నిరంతరమై, అవిశ్రాంతమై కొనసాగవలసిన ప్రాణక్రియ. ఒకసారి మన ‘జనసేన’ చేత ఆమోదముద్రను పొంది ఎన్నికైన ప్రజాప్రతినిధులు.. అధికారంతో సంబంధంలేని మన ‘జనసేన’ సూచించిన ఆదర్శపాలనను ఆరంభించిన తర్వాత.. పరిపాలనా విధానం.. జనాన్ని పూర్తిస్థాయి ఆత్మగౌరవంతో యాచకులవలెగాక ఆత్మాభిమానంతో బతుకగల నాణ్యమైన జీవితాలన్నందించే స్థాయిని, స్థితిని సాధించిన తర్వాత.. మార్గదర్శకాలను, ఆదేశాలను ఎప్పటికప్పుడు స్వార్థరహిత సలహాదారుల నేతృత్వంలో రాష్ట్రం సుభిక్షమై.. సుశాంతమై.. వర్థిల్లుతూంటే.. యిక ఆ స్థితియొక్క కొనసాగింపు..  ఓ నిరంతర నియంత్రణ క్రియ. నియంత్రణ లేకుంటే పాలనా వ్యవస్థ కుప్పకూలి పతనమైపోతుంది. భారతదేశం స్వాతంత్య్రం పొందిన తర్వాత పదేళ్ళకాలం రాజకీయ విలువలతో కూడిన సంస్కారవంతమైన వ్యక్తులే దేశపరిపాలనలో పాలుపంచుకున్నారు. తర్వాతనే ఎవరి నియంత్రణాలేక, అసమర్థతవల్లా, అధికార వ్యామోహం వల్లా నాయకులు నీచులైపోయారు. యివీ మన ప్రధాన కార్యక్రమాలు రామం..” క్యాథీ ఆగింది నెమ్మదిగా.
”ఇవేవీ ఎక్కడా ఒక్కశాతం కూడా డిరైల్‌ కావద్దు. నేను కోలుకునేదాకా.. మీరంతా మనం అనుకున్న ప్రకారమే కార్యక్రమాలను యథావిధిగా నడిపించండి.. నేనుంటా మీవెంట.. ఈ బెడ్‌పై నుండే..”
”యస్‌.. యస్‌..” అన్నారు గోపీనాథ్‌.. మూర్తి సాలోచనాగా..ఒకేసారి.
తర్వాత.. చుట్టూ నిశ్శబ్దం.
బయట వర్షం కురుస్తూనే ఉంది. ఎడతెరిపి లేకుండా.
”నాకు నిద్రొస్తోంది..” అన్నాడు రామం.. మెల్లగా కనురెప్పలను మూసుకుంటూ.
అది నిద్రకాదు.. యింతకుముందు డాక్టర్‌ యిచ్చిన ట్రాన్‌క్విలైజర్‌ అని గోపీనాథ్‌కు తెలుసు.
శివ, గోపీనాథ్‌, మూర్తి.. ఆ గదిలోనుండి బయటికి.. బాల్కనీలోకి నడిచారు.
క్యాథీ ఒక్కతే ఆ గదిలో మిగిలింది.
ఎందుకో ఆ క్షణం నిగ్రహించుకోలేని దుఃఖం ఆమెను ముంచేసింది. ఎక్కెక్కిపడి ఏడ్చింది మౌనంగానే.

21

‘శత్రుశేషాన్ని సమూలంగా ధ్వంసం చేయాలి. ఆ విషయంగా ఉపేక్ష అస్సలే కూడదు.’ అనేది ఎస్పీ విఠల్‌ సిద్ధాంతం.
మంత్రి మాధవయ్య హత్య.. కానిస్టేబుల్‌ హత్య.. తర్వాత ఒక అద్భుతమైన కథ.. హోంమంత్రి స్థాయిలో అంతా మర్యాదల అంగీకారాలు.. నానుండి.. నీకేంకావాలి..నీనుండి నాకేంకావాలి.. బేరసారాలు, లావాదేవీలు. ముఖ్యమంత్రిదాకా  ఒక రాయబారం – ఒక అవగాహన. చివరికి మంత్రి మాధవయ్య హత్యపై ఒక కమీషన్‌.. ఎంక్వయిరీ.. మంత్రి. కాబట్టి తొందరగా నివేదిక కావాలని ఆదేశం..
ఈ దేశంలో ప్రధానమంత్రి హత్య చేయబడ్తే పదేళ్లు.. ముఖ్యమంత్రి చచ్చిపోతే నిజంనిగ్గు తేల్చడానికి పదినెలలు పట్టే ‘రెడ్‌టేప్‌’ కాలంలో, వ్యవస్థలో.. ఎవని గోల వానిది.. ఎవని శ్రద్ధాసక్తులు వానివి. భారతదేశంలో పై తరగతి ఉద్యోగుల్లో పశువులకంటే ఎక్కువ అతిస్వేచ్ఛ, ఎవనిపై ఎవనికీ నియంత్రణలేని అరాచకత్వంతో నిండిన విచ్చలవిడితనం ఉందంటే.. ఆ బురదలో నివసిస్తున్నవాడికే ఈ దుర్గంధానుభవం అర్థమౌతుంది.
విఠల్‌ ఆరోజు రాత్రి చాలా ఆనందంగా ఉండి మధ్యవర్తిత్వం జరిపిన ముగ్గురు ఫ్రెండ్స్‌కు మద్యం, మగువలతో పోలీస్‌ గెస్ట్‌హౌజ్‌లో పోలీసుల పహరామధ్య పార్టీ యిచ్చాడు. మంత్రి మాధవయ్య హత్యను ఎంక్వయిరీ చేసిన వన్‌మ్యాన్‌ కమీషన్‌.. మంత్రిగారిని అతని దగ్గర అంగరక్షకుడుగా పనిచేస్తున్న మురళీధర్‌ అనబడే గన్‌మన్‌ ముఖ్యమంత్రి యొక్క వీరాభిమాని కావడంవల్ల, ఆరోజే ఉదయం మంత్రి మాధవయ్య ముఖ్యమంత్రిని విమర్శిస్తూ, తూలనాడ్తూ మీడియా ప్రతినిధుల సమావేశంలో ఆరోపించడంవల్ల మానసికంగా గాయపడి.. బాగా తాగిన మైకంలో అర్ధరాత్రి బాగా తాగిఉన్న మంత్రి మాధవయ్యను రివాల్వర్‌తో రెండుసార్లు తూటాలు పేల్చి హత్య చేశాడు. ఈ తతంగాన్నంతా తన కళ్ళముందు జరుగుతూండగా ప్రత్యక్షంగా చూస్తున్న ఎస్పీ విఠల్‌ తన విధినిర్వహణలో భాగంగా కానిస్టేబుల్‌ను అడ్డుకోబోయి విఫలుడై విధిలేని పరిస్థితుల్లో ఆత్మరక్షణార్ధం తన సర్వీస్‌ రివాల్వర్‌తో గన్‌మన్‌ మురళీధర్‌ను కాల్చవలసి వచ్చింది. అందువల్ల మురళీధర్‌ అనివార్యమై మరణించాడు. ఇదంతా ఒక అతి సహజ ఘటన. దీంట్లో ఎస్పీ విఠల్‌ ప్రమేయం అస్సలేలేదు. అతను పూర్తిగా నిర్దోషి.. అదీ సారాంశం.
ఎంక్వయిరీ కమీషనర్‌కు కోటి రూపాయలు ముట్టాయి.. మధ్యవర్తులిద్దరికి చెరో పది పదిలక్షలు. ఒకటి రెండు నెలల తర్వాత.. ముఖ్యమంత్రి సమక్షంలో జెంటిల్‌మన్‌ అగ్రిమెంట్‌.. మంత్రి తాలూకు బ్రతికున్న వారసులకు, తనకు.. బార్ల లెక్కలు, భూముల లెక్కలు, సెటిల్‌మెంట్ల అకౌంట్స్‌.,
రాజీకి రాకుంటే చచ్చినోడు ఎట్లాగూ తిరిగిరాడు.. కనీసం ఈ పరిష్కారం క్రింద ఇరవైరెండు కోట్లు పోతాయని చెప్పినమాట వినుడు. అంతేగాని ఎవడు వెధవ కాడు.. ఎవడూ గాజులేసూక్కుర్చోడు.
మంత్రిని చంపడం వల్ల వాడు లెక్కలు తప్పించి నొక్కేసిన డబ్బులోనుండి ముప్పయి రెండు కోట్లు తనకు లాభం.
మొత్తంమీద ఎస్పీ విఠల్‌ టైం బాగుండి హత్యవల్ల ఇబ్బడి ముబ్బడిగా కోట్ల కొద్ది రూపాయల లాభమే చేకూరింది. పైగా బోనస్‌ క్రింద వేరొక జిల్లాకు ట్రాన్స్‌ఫరై.. మళ్లీ కొత్త గడ్డిమైదానం.. పచ్చని తాజాగడ్డి. మళ్ళీ ఇష్టమున్నట్టు మేత.
కాని.,
ఆ రోజు.. ఆ వర్షం కురిసిన రాత్రి..హత్యచేయబడ్డ మంత్రిగారు బాగా తాగి, తనూ తాగి, తనతో షూట్‌ చేయబడ్డ గన్‌మెన్‌ మురళీధర్‌ కూడా బాగా తాగి.. అందరికందరూ తాగుడుమైకంలో పిచ్చిపిచ్చిగా ఓలలాడ్తున్న ఆ చీకటి రాత్రి.,
తను మంత్రిని కాల్చిచంపడం కిటికీలోనుండి ఆరోజు సెంట్రీ డ్యూటీలో ఉన్న కానిస్టేబుల్‌ రాములు చూశాడేమోనని అనుమానం విఠల్‌కు. అందుకే రాములును అప్పుడప్పుడు ఏదో ఒక నెపంమీద తన దగ్గర్కి రప్పించుకుని మాటల్తో పరీక్షించాడు. కాని అనుమానం బలపడ్తూనే ఏదీ స్పష్టంగా అర్దంగాక పిచ్చిపిచ్చిగా, చికాగ్గా ఉందతనికి.
మరి.. శత్రుశేషం.. సిద్ధాంత కింద రాములుగాణ్ణి శాశ్వతంగా లేపేస్తేమిటట.,
ఏమీలేదు.. లేపెయ్యొచ్చు సుళువుగా.
రాజు తల్చుకుంటే దెబ్బలక్కొదువా అన్నట్టు ఎస్పీ తల్చుకుంటే ఒక కాన్‌స్టేబుల్‌ను చంపడం కాలితో చీమను తాడించి చంపినంత సుళువు.
ఒక ఎన్‌కౌంటర్‌.. ఒక తుపాకీ శుభ్రం చేసుకుంటూండగా పొరపాటున తూటా పేలి ప్రమాదవశాత్తు దుర్మరణం.. డ్యూటీపై వెళ్తూండగా లారీకింద పడి పరమపదించెను.. ఇలాంటివి సవాలక్ష.,
కాని.. ఏది చేసినా.. పకడ్బందీగా, రంజుగా చేయాలని విఠల్‌ కోరిక.
అందుకే.. రాములును తనతోపాటే తనకు కొత్తగా పోస్టింగిచ్చిన జిల్లాకు ట్రాన్స్‌ఫర్‌ చేయించుకుని రప్పించాడు.
రేపు ఉదయం.. ఏడుగంటలకు సీక్రెట్‌ ట్రిప్‌.. ముత్తారం అడవుల్లోకి.. ఒక నక్సలైట్ల రహస్య స్థావర ఆచూకీ కోసం.. టాఫ్‌లెవల్‌ పర్సూఎన్స్‌లో.. ఎస్పీ తను.. డ్రైవర్‌ రాములు.. ఇద్దరే.. రహస్య పర్యటన.. అడవి లోపలికి.. మనుష్య సంచారమేలేని అడవి గర్భంలోకి.,
అక్కడ.. రాములు.. పరలోకగతుడగుట.,
శత్రుశేషం పూర్తిగా నిశ్శేషమై.. క్లీన్‌బౌల్డ్‌.. పరమపదసోపానం.
విఠల్‌ విస్కీ మత్తులో తన సరికొత్త ఉంపుడుగత్తె రాణీ పద్మజ కౌగిట్లో దొర్లుతూ.. రాములు కథను ఊహించుకుంటూ.. ఆమెతో.,
”రేపుదయం ఆరింటికి లేపాలి.. ఆరున్నరకు స్పెషల్‌ దౌరా.. ” అంటున్నాడు ముద్దముద్దగా.
అప్పుడు రాత్రి ఒంటిగంట పదినిముషాలైంది.
కానిస్టేబుల్‌ రాములుకు ఆశ్చర్యంగా, అదోలా, విచిత్రంగానే కాకుండా భయంగాకూడా ఉంది.
నక్సలైట్ల వేటకోసం కేంద్ర నిధులతో సమకూర్చుకున్న బులెట్‌ ఫ్రూఫ్‌ వాహనాల్తోసహా నిజంగా కొన్నవి కొన్ని, కొన్నట్టు కాగితాల్లో చూపించినవి కొన్ని. ప్రత్యేకంగా అడవులు, కొండల్లో పనికి వచ్చేవి కొన్ని.. అందులో ఒకటి.. ఎస్పీగారు తన యిష్టమొచ్చినపుడు టీ షర్ట్‌, స్పోర్ట్స్‌ ష్యూస్‌ వేసుకుని థర్డ్‌లేడీతో విహారశృంగారయాత్ర జరపడానిక్కూడ పనికొచ్చే ధగధగా నల్లనాగులా మెరిసే ర్యాంగ్లర్‌ జీప్‌.,
ఆ జీప్‌డ్రైవర్‌గా తను.. ప్రక్కసీట్లో ఎస్పీ విఠల్‌.. ఉదయమే నాల్గున్నర గంటలకు.. ఇద్దరే ఇద్దరు వర్షం వెలిసి చల్లగా ఈదురుగాలి వీస్తున్నవేళ బయల్దేరి.,
”మహాముత్తారం అడవుల్లోకి.. ” అన్నాడు జీప్‌ కదలగానే. అంతే యిక మాట్లాడ్డేదు ఎస్పీగారు ఇంతవరకు. మధ్య ఒకసారీ స్పీడ్‌పెంచి యింకా యింకా వేంగా పోనీ అన్నట్టు చూశాడంతే. గంటకు నూరుకిలోమీటర్లకన్నా ఎక్కువవేగంతో జీప్‌ గత మూడుగంటలు పరుగెత్తి పరుగెత్తి.. మహాముత్తారం అడవుల్లోకి ప్రవేశించి.. అరగంటగడిచి..,
మధ్య మధ్య అక్కడక్కడ పోలీస్‌పోస్ట్‌ల్లో రోడ్డుపైకి ఓ కానిస్టేబుల్‌ గన్‌తో సహా పరుగెత్తుకొచ్చి అతి వినయంగా సెల్యూట్‌ చేసి.. అంటే.. ఎస్పీ గారొస్తున్నట్టు కొంతమందికి సమాచారముందున్నమాట.
ఎస్పీ విఠల్‌ ప్రయాణిస్తున్న మూడుగంటల్లో ఎక్కువసేపు కండ్లమూసుకుని ధ్యానంలోఉన్నట్టు ఉండిపోయాడు. అతను ఏదన్నా సీరియస్‌గా ఆలోచిస్తున్నాడో, నిద్రపోతున్నాడో, ధ్యానముద్రలో ఉన్నాడో రాములుకు అర్ధంకాలేదు. ఏది చేస్తున్నా అతని శరీరంలోనుండి విస్కీవాసన, బట్టల పోలీస్‌ వాసన.. వెరసి ఖాకీ కంపుకొడ్తోంది. ఒక ఎలుగుబంటు ప్రక్కన భయం భయంగా తప్పనిసరి పరిస్థితుల్లో కూర్చున్నట్టు రాములు వణికిపోతూ గజగజలాడ్తూ వేగంగా, పదిలంగా జీప్‌ను నడిపిస్తున్నాడు.
అడవంతా నిశ్శబ్దంగా గంభీరంగా.. తపస్సు చేసుకుంటున్న ఋషిలా ఉంది.
ఎక్కడో అక్కడక్కడ కనబడ్డ చిన్న చిన్న ఆదివాసీ గ్రామాలు కనుమరుగైపోయి.. యిక అంతా అడవే. ఎక్కడా మానవ సంచారంలేదు.
”అడవంటే యిష్టమా రాములూ నీకు” అన్నాడు విఠల్‌.
మూడున్నర గంటల తర్వాత అతను మాట్లాడిన మొదటి మాట అది.
”ఔన్సార్‌..”
”చాలా యిష్టమా.. కొంచెం యిష్టమా”
”చాలానే యిష్టంసార్‌..”
‘ఊఁ.. నాక్కూడా అడవంటే చాలా యిష్టం నీకులాగానే”
రాములు మాట్లాడలేదు.. ఈ సంభాషణేమిటి అసంగతంగా అనుకున్నాడతను.
”ఔను రాములూ ఆ రోజురాత్రి.. వర్షం కురుస్తున్న రాత్రి.. వరంగల్లు గెస్ట్‌హౌస్‌లో..జ్ఞాపకముందా..” అన్నాడు సడెన్‌గా.
పోలీస్‌ బుద్ది, కుక్కబుద్ది ఒకటే.. వాసన చూడ్డం. ఐతే, వాడు కానిస్టేబులైనా ఎస్పీఐనా ఒకటే.
”జ్ఞాపకముంద్సార్‌.. మంత్రి మాధవయ్యగారు హత్యచేయబడ్డ రాత్రిగదా మీరంటూన్నది.”
”ఊఁ.. ” ఎస్పీ విఠల్‌ నిర్ధారించుకున్నాడు ఆ రాత్రి తను మంత్రిని చంపుతూండగా వీడు చూశాడని.
”నువ్వప్పుడు సెంట్రీడ్యూటిలో ఉన్నావా రాములూ”
”ఔన్సార్‌..”
వెంటనే ఎస్పీ విఠల్‌ నిర్ధారించుకున్నాడు యిక వీణ్ణి లేపేయాలని.
సరిగ్గా అప్పుడే గ్రహించాడు రాములు ఈ ఎస్పీగానితో ఏదో ప్రమాదం పొంచిఉందని.
”ఐనా మీరు మొన్నటి ఎంక్వయిరీ కమీషన్‌ రిపోర్ట్‌లో నిర్దోషని తేలిపోయిందిగదా సర్‌.. కంగ్రాట్స్‌ సర్‌” అన్నాడు రాములు.
”ఊఁ..”
వెంటనే ఒక మెరుపులా లీల జ్ఞాపకమొచ్చింది విఠల్‌కు. పాపం పుణ్యాత్మురాలు తనను కాపాడిందా గండంనుండి. ఎంక్వయిరీ కమీషన్‌గా వేసిన ఆ ఢిల్లీ బేస్ట్‌ రిటైర్డ్‌ డిజిపి లక్ష్మీనారాయణ సక్సేనా ముక్కూమొఖం తెలియదు తనకు. ” అమ్మా కాపాడని” వేడుకున్నాడు తను లీలను దీనంగా. ఎంత విస్తృతమైన పరిచయాలో, ఎన్ని గ్లోబల్‌ లావాదేవీలో లీలకు. క్షణాల్లో తనను ఢిల్లీ పిలిపించుకుని ఒక కోటి రూపాయలతో సక్సేనాతో డీల్‌ సెటిల్‌ చేసింది. తర్వాత్తర్వాత చచ్చిపోయిన మంత్రి పెళ్ళాన్ని, తనను హైద్రాబాద్‌ పిలిపించి మూడు ముక్కల్లో మూడువందల కోట్ల వ్యవహారాలను ఫటాఫట్‌ పంచి సరే అనిపించింది. తనుమాత్రం రెండు కేసులకూ కలిపి ఓ నాలుక్కోట్లు తీసుకుందంతే. డెడ్‌ చీప్‌. సెటిల్‌మెంట్లు చేయడంలో ఎవడు సాటొస్తాడు లీలకు. వినకుంటే వాడు లేచిపోయిండంతే. ఒకసారి ఓ కర్ణాటక పాలిటీషియన్‌ వినకుంటే వాన్ని చార్టర్డ్‌ ప్లేన్‌లో తీసుకెళ్లి హిందూమహాసముద్రం డీప్‌వాటర్స్‌లో పడేసొచ్చింది స్వయంగా. వాడింకా పోలీస్‌ రికార్డుల్లో అబ్‌స్కాండింగుగానే ఉన్నాడు. ఒక్క ఆడది.. వంద మగాళ్లకంటే ఎక్కువ.. రియల్లీ గ్రేట్‌ లేడీ.
విఠల్‌ చుట్టూ చూచి.. ఎక్కడా మానవ సంచారంలేదని పకడ్బందీగా నిర్ణయించుకుని.. బాగా దట్టమైన చెట్లు, పొదలు, తుప్పలు.. పక్కనే పెద్ద లోయ.. నదిపాయ ఉన్న కీలక ప్రాంతాన్ని ఎన్నుకుని..
”జీప్‌ ఆపు రాములూ” అన్నాడు మృదువుగా.
రాములు సాలోచనగా ఎస్పీగాడి దిక్కు చూచి.. జీప్‌కు బ్రేక్‌ అప్లయ్‌ చేస్తూ.. ఇప్పుడు నిరాయుధంగా ఉన్న తనను వీడు తను పిస్టల్‌తో కాల్చే ప్రయత్నం చేస్తే ఎలా తప్పించుకోవాలా అని మెరుపులా ఆలోచిస్తున్నాడు. ఏమీ తోచడంలేదు. మరోవైపు భయం ముంచుకొస్తోంది గుండెల్లోకి.. వణుకు..వణుకు.
అనివార్యమైనపుడు..జైల్లో ఉన్నవాడు వేలిగోటితో గోడను గీకిగీకి పొక్కచేసుకుని తప్పించుకుని పారిపోయిన ఉదంతం జ్ఞాపకమొచ్చింది రాములుకు.
”యిక్కడెక్కడో.. నక్సలైట్ల డంప్‌ ఉండాలి.. వెదుకుదాం.”
విఠల్‌ కిందికి దిగాడు. అటువైపు నుండి రాములుకూడా దిగి.,
”నువ్వటు పో.. నేనిటు చూస్తా..ఓ.కే..”
”యస్సార్‌..”
అక్కడ డంప్‌ లేదు పాడులేదని విఠల్‌కు తెలుసు.. కాని ఒట్టి బహానా.
అటుదిక్కు విఠల్‌ అడుగులో అడుగేసుకుంటూ కదిలాడు ఏదో వెదుకుతున్నట్టు.
అదేక్షణం.. విఠల్‌ వెళ్తున్న దిశకు వ్యతిరేకదిశలో రాములు బయల్దేరాడు మెల్లగా.. అతని ఒళ్ళు గజగజ వణికిపోతోంది.. ఏ క్షణాన్నైనా విఠల్‌ చటుక్కున వెనక్కి తిరిగి తనను రివాల్వర్‌తో కాలుస్తాడని ఊహిస్తున్నాడతను.. కాని ఎలా.
మెరుపులా.. ఏదో తోచి.. జరజరా వాలుగా ఉన్న పెద్ద మట్టిజాలుపై నుండి క్రిందికి జారాడు రాములు కావాలని..వేగంగా, బండరాయిలా జారుతూ జారుతూ వేగంగా వచ్చి వచ్చి.. ఒక మోదుగుచెట్ల తుప్పకు తట్టుకుని ఆగి.. పిర్రలు, చేతులు, కాళ్ళంతా గీరుకుపోయి..,
లేచి నిలబడి.,
పైకి చూశాడు రాములు.. ఎత్తుగా ఆకాశాన్ని తాకుతున్న పెద్దపెద్ద ఎత్తైన చెట్లు.. కింద ఒంపులో.. ఒర్రెలో తను. విఠల్‌ కనిపించడంలేదు.
ఇలాగే పారిపోయి తప్పించుకుంటే.,
”అరె రాములూ.. ఏడున్నవ్‌రా.” పైనుండి ఎస్పీగారి అరుపులు,.,
పైకి చూస్తూ వెనక్కి వెనక్కి నడుస్తున్న రాములు కాలికి ఏదో చల్లగా, నునుపుగా తాకి.. దిగ్గున ఉలిక్కిపడి.. ఆగి.,
కాలిదగ్గర.. తుపాకీ.. ఎ.కె. ఫిఫ్టీ టు.. నల్లగా త్రాచుపామువలె మ్యాగజైన్‌ లోడ్‌ చేసి.. రెడీ టు యూజ్‌ టైప్‌లో, చటుక్కున చుట్టూ చూశాడు.. ఎక్కడా ఎవరూ లేరు.
రాములుకు క్షణంలో అంతా అర్థమైంది. తను యిదివరకు నక్సలైట్ల కూంబింగు ఆపరేషన్స్‌లో పాల్గొన్న అనుభవం గుర్తొచ్చింది. మళ్ళీ చుట్టూ చూశాడు పరిశీలనగా.. అటుప్రక్క తుప్ప.. అప్పుడే కప్పినట్టు ఎర్రగా.. కొత్తగా మట్టి..పైన తుమ్మకొమ్మలను కప్పినట్టు పచ్చిపచ్చి.,
టకటకా తుమ్మకొమ్మలను జరిపి.. కప్పిన మట్టిని చేతివ్రేళ్ళతో పెకిలించి. తోడి ..చకచకా..ప్రాణభయం ఒకవైపు.. అనుకోని గగుర్పాటు కల్గించే సందర్భం మరోవైపు.. ప్రక్కన ఎ.కె ఫిప్టీటు తుపాకీ..కొండంత ధైర్యం..ఓ జానెడు లోతుపోగానే చేతికి తాకింది పెద్ద రేకు సందుగ. తుపాకీతో మట్టిని పెళ్ళగించి, అటుతోడి ఇటుతోడి.,
”అరే రాములూ.. ఏడ సచ్చినౌరా..” విఠల్‌ గొంతు.. దగ్గరైతోంది తనకు.
కరకరా ఎండిన ఆకులు బూటు కాళ్ళకింద నలిగి విరుగుతున్న చప్పుడు
హమ్మయ్య.. ట్రంక్‌పెట్టె మూత తెరిచాడు రాములు.. తెరిచి కొయ్యబారిపోయి.. కళ్ళప్పగించి.. గుండె చెదిరి.
అన్నీ వేయి రూపాయలనోట్ల కట్టలు.. భద్రంగా నింపి, పేర్చి.. ప్రక్కన కొన్ని గ్రేనైడ్స్‌. రెండు ఎ.కె ఫార్టీసెవెన్‌ గన్స్‌.,
”వీటిని తను చేజిక్కించుకంటే..”రాములు మెదడులో ఓ మెరుపు మెరిసి, జలదరింపు కలిగి., చుట్టూ చూశాడు.. ఆలోచన పదునెక్కుతోంది. క్షణంలో వందప్లాన్స్‌ రూపొంది, మలిగి..మళ్ళీ రూపొంది.. మళ్ళీ చచ్చి.. మొండి ధైర్యం తలెత్తుతోంది నిద్రలేస్తున్న బ్రహ్మరాక్షసిలా.
ఏదన్నా చేస్తే?.. ఈ డంప్‌లోని కోట్లకొద్ది డబ్బు తనదే.. పోలీసోళ్ళు ఎన్ని డంప్‌లను దొంగతనంగా దొంగల్దొంగలు ఊళ్ళు పంచుకున్నట్టు దోచుకోలేదు.. తనకిప్పుడు భగవంతుడు ఒంటరిగా దీన్ని చేజిక్కించుకునే అవకాశమిచ్చాడు ..కమాన్‌ కమాన్‌ క్విక్‌.. ఏదో నిర్ణయం తీసుకోవాలి రెప్పపాటులో .. అవకాశాలు మళ్ళీ మళ్ళీరావు.
వెనుకనుండి మెత్తగా బూట్ల చప్పుడు వినబడింది రాములుకు.
విఠల్‌.
పిలుస్తూ రావడం మానేసి.. హైడ్‌ అండ్‌ సీక్‌ టైప్‌లో దాడికి వస్తున్నాడు..
యిక ఒక్క లిప్తకాలం కూడా వృధా చేయలేదు రాములు. చేతిలోని ఎ.కె. ఫిఫ్టీ టు తో విఠల్‌ను దగ్గరగా పాయింట్‌ బ్లాంక్‌ రేంజ్‌లో తూట్లు తూట్లు కాల్చాడు వరుసగా దూసుకుపోయే బుల్లెట్లతో.
విఠల్‌ శరీరం క్షణాల్లో మాంసం ముద్దలుగా ఖండఖండాలై ఎగిరి..ఎర్రగా రక్తం.. మజ్జ.. ఎముకలు చిట్లి చిట్లి.. గాలిలోకి ఎగిరి ఎగిరి చెల్లాచెదరైపోయింది.
క్షణకాలం అడవి తుపాకీ గుళ్ళధ్వనితో దద్దరిల్లి.,
చెట్లపైనుండి పకక్షులు అదిరిపడి ఎగిరి.. ఆకాశంలోకి రెక్కలార్చి.. టపటపా టపటపా ,
మరుక్షణం.. మళ్ళీ భీకర నిశ్శబ్దం.
రాములు నిలబడ్డాడు అలాగే.. దృఢంగా.. స్థిరంగా.. ఒక చెట్టువలె. అతని తల దిమ్మెక్కిపోయింది.. తిమ్మిరి.. భయం.. దడ దడ.. ప్రకంపన.. సంతోషం.. తను బతికినందుకు. తనను చంపాలనుకున్నవాణ్ని తాను చంపినందుకు.
పైగా.. ప్రక్కన.. కోట్ల రూపాయలు..పిచ్చి ఆనందం. ఉద్విగ్నత.
క్షణకాలంలో తేరుకుని రాములు..షాక్‌లోనుండి బయటపడి.,
వంగి చకచకా ట్రంక్‌పెట్టెలోని వేయిరూపాయల కట్టలను బయటికి తోడుకుంటు పడేస్తూ చుట్టూ ఉన్న సర్వ ప్రపంచాన్ని మరచిన ఉన్మాదక్షణంలో.,
ప్రక్క సెలయేరు దాపుల్లోనుండి దూసుకొచ్చిన ఎ.కె. ఫార్టీసెవెన్‌ తుపాకీ గుళ్ళు రాములు శరీరాన్ని తుత్తునియలు చేసి ముక్కలు ముక్కలుగా గాల్లోకి విసిరేశాయి.
అడవి దద్దరిల్లంది.
అక్కడంతా చెల్లాచెదురుగా.. పచ్చని ఆకులపై ఎర్రగా చిక్కని రక్తం.. మాంసం ముద్దలు. నిశ్శబ్దం.
ఎక్కడా మనుషుల అలికిడిలేదు
ఐతే.. దూరంగా.. సెలయేటి ఒడ్డుమీద ప్రశాంతంగా గడ్డిమేస్తున్న పశువులమంద దగ్గరినుండి ఎవరో కాపరి వినిపిస్తున్న పిల్లనగ్రోవి ధ్వని మృదువుగా, లలితంగా.. తెరలు తెరలుగా అడవిలోకి ప్రవహించడం మొదలైంది.
అడవి తనను స్పర్శిస్తున్న పాటకు పులకించిపోతోంది పరవశించి.. వివశయై.

22

28

అర్ధరాత్రి దాటింది.
సువిశాలమైన ముఖ్యమంత్రి అత్యంత ఆంతరంగిక సమావేశ మందిరం. హాల్‌నిండా వెన్నెల నిండినట్టు, చల్లగా వసంతఛాయలు వ్యాపించి, గాలినిండా పారిజాత పరిమళం నిండి.. నిశ్శబ్దం ఎంతో మధురమై ధ్వనిస్తున్న వేళ..
ఇద్దరే వ్యక్తులు.
డెబ్బయ్యారేండ్ల ముఖ్యమంత్రి. ముప్పయిరెండేళ్ళ లీల.
సోఫాల్లో ఎదురెదురుగా.. మధ్య మౌనగంభీర అనిశ్చితి.
‘ఇంత’రాత్రి ముఖ్యమంత్రి గారు తననిలా ఏకాంతంగా, ఒంటరిగా ఎందుకు పిలిపించినట్టు. ఇది ఒక ప్రత్యేక రహస్య సమావేశం వలెనే ఉంది. లోపలికొస్తూంటే పి.ఎస్‌, సెక్యూరిటీ, స్టెనో.. ఇతరేతర ఇన్‌విజిబుల్‌ గార్డ్స్‌ ఎవరూ లేరు. ఒక్క బంట్రోతుమాత్రమే ఉండి రాగానే ‘ముఖ్యమంత్రి గారు మిమ్మల్ని ఈ హాల్లో కూర్చోమన్నారు’ అని ఈ హాల్లో కూర్చోబెట్టి వెళ్ళిపోయాడు. అంతే.. యిక ఏ ఇతర మానవ సంచారమూ లేదు.
ఎందుకిలా..
వ్చ్‌. అర్ధంకావడంలేదు.
ముఖ్యమంత్రి తనకు అత్యంత సన్నిహితుడు, మధ్య అత్యంత పరస్పర విశ్వసనీయుత కూడా ఉంది.. అనేకానేక కోటానుకోట్ల ప్రభుత్వ ప్రభుత్వేతర ఆర్థిక లావాదేవీలు తమ మధ్య ఉన్నాయి. వ్యాపారముంది. వ్యవహారముంది. వీటికి అతీతమైన ఇంకేదో వాత్సల్యంతో కూడిన, భాషకందని ఆత్మీయతకూడా ఉంది.
ఏమున్నా.. అతని సంస్కారంపట్ల, తెలివిపట్ల, వ్యవహార దక్షతపట్ల.. అన్నింటినీ మించి తనతో పనిచేస్తున్నపుడు చూపే హృదయస్పర్శపట్ల ఎంతో గౌరవముంది తనకు.
జీవితాన్ని చాలా లోతుగా, చాలా తరచి తరచి సూక్ష్మదర్శినిలో చూచినట్టు దర్శించిన వాడాయన. తన దాదాపు యాభై సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఎందరో కౌటిలుల్ని, వ్యూహకర్తలను, దార్శనికులను, ఉన్నతమైన వ్యక్తిత్వం గలవాళ్లను, పరమ దుర్మార్గులను, నీతిహీనులను, గుండాలను.. ఎందర్నో చూశాడు తను. అన్నింటినీ ఎదుర్కొని.. అందర్నీ తట్టుకుంటూ, భరిస్తూ..
తను వచ్చి సోఫాలో కూర్చున్న తర్వాత..పదినిముషాలు గడిచి..అప్పుడొచ్చాడాయన. అదే తెల్లని ధోతీ.. తెల్లని లాల్చీ.. అర్ధరాత్రి దాటినా ముఖంపై చెదరని చిర్నవ్వు. అలసటలేని గాంభీర్యం.
వచ్చి తన ఎదురుగా సోఫాపై మౌనంగా కూర్చుని,
అలా కూర్చునిపోయాడంతే చాలాసేపు.
ఐతే అతను వ్యాకులంగా ఉన్నాడు. అంతఃర్మథనంలో ఉన్నాడు. ఏదో లోలోపల ఘర్షణపడ్తున్నాడు.
”లీలా.. నువ్వు విజ్ఞురాలివి.. అనేక విషయాలు తెలిసిన దానివి. చిన్నవయసులోనే ప్రపంచాన్ని లోతుగా చదివినదానివి.. అందుకే నీతో మనసును పంచుకుందామనీ, బయటికి వ్యక్తీకరించలేని ఒక అంతర్గత మథనకు నిష్కృతిని అన్వేషిద్దామని..” ఆగిపోయాడు.
వత్తి అంటుకున్నపుడూ, ఆరిపోబోయేముందూ తెగుతూ మండుతూ, మండుతూ తెగుతూ తల్లడిల్లుతుంది కాసేపు. అలా ఉన్నాడతనప్పుడు.
”జీవితంలో ఎప్పుడూ అధికారంలో ఉండడమే విజయమనీ, విజయమే మనిషి ప్రతిభకు తార్కాణమనీ, విజయాన్ని సాధించే క్రమంలో రాజనీతి ప్రకారం ధర్మాధర్మ విచక్షణ అనవసరమనీ అనుకుంటూ వచ్చాను లీలా. ఐతే కొన్నిసార్లు విజయాలు సాధిస్తాం కాని నిజాకి ఓడిపోతాం.. అధికారంలో, కుర్చీలో ఉంటాం కాని వాస్తవంగా ఎవడికో బానిసగా, తోలుబొమ్మవలె ప్రవర్తిస్తూ జీవిస్తాం.. ఈ తేడా మనిషిని నిశ్శబ్దంగా ఒక లోహాన్ని ఆసిడ్‌ తిన్నట్టు తినేస్తూ మెల్లగా మరణం రుచిని చూపిస్తూంటుంది.. ఔనా..” అని ఆగి,
అతను తనతో తానే గంభీరంగా సంభాషించుకుంటున్నట్టు.. లేదా తనపై ఎంతో ఆత్మీయతతో కూడిన గౌరవంతో తనను తాను నివేదించుకుంటున్నట్టు.,
”మీకు తెలియందేముంద్సార్‌. వర్చువల్‌ రియాలిటీ, రియల్‌ రియాలిటీ అని రెండున్నాయి గదా. గెలుస్తాం కాని నిజానికి ఓడిపోతాం.. ఒక వస్తువు హర్రాజ్‌లో ఏదో క్షణికమైన ఆవేశానికి లోనై దాని వాస్తవ విలువకంటే ఎన్నోరెట్టు ఎక్కువపెట్టి దాన్ని స్వంతం చేసుకుంటాం. కాని తర్వాత తెలుస్తుంది దాని విలువ తక్కువని. అది గెలిచి ఓడడం. నీతిగా, నిజాయితీగా ఒక రోజంతా కష్టపడి వందరూపాయలే సంపాదించినా అదే పనిని అవినీతితో నిర్వహించి ఐదువందలు సంపాదించే వ్యక్తితో పోల్చుకుని ఆత్మతృప్తితో ఆనందపడడం ఓడి గెల్వడం వంటిది. ఇదొక ధర్మ మీమాంస..”
”’ఔను.. ధర్మం వేరు న్యాయం వేరుగదా..”
”ధర్మం కాలంతో పాటు మారనిది. శాశ్వతమైంది. న్యాయం మనిషి చేత నిర్వచింపబడేది, కాలంతోపాటు మారేది.”
”అధికారం.. వ్యామోహం.. శాశ్వతత్వం.. చరిత్ర.. వీటిని విస్తృతమైన అవలోకనలో దర్శించినపుడు.. మనిషి యొక్క దూరదృష్టి, పరిణతి, వికాసం నిజంగా ఎంత ఉదాత్తంగా ఉండాలి లీలా.. మనం ఆ కోణంలో చూచినపుడు ఎంత నీచంగా ప్రవర్తిస్తున్నామో అనిపిస్తోందప్పుడప్పుడు. ఒక విషయం చెప్తాను చూడు, 1776లో బ్రిటిష్‌ పాలనలో ఉన్న అమెరికాను యుద్ధంచేసి విముక్తంచేసిన తర్వాత జార్జ్‌ వాషింగ్టన్‌ తను తలచుకుంటే తనను తాను చక్రవర్తిగా ప్రకటించుకుని ఏకచ్ఛత్రాధిపత్యంగా యిష్టమున్నంతకాలం యిష్టమొచ్చినట్టు పరిపాలన కొనసాగించగలిగేవాడు. కాని ప్రజాపక్షపాతి ఐన దార్శనికుడు కాబట్టి ఆయన ఆ ఏకవ్యక్తి పాలనను వద్దని ప్రాతినిధ్య ప్రజాస్వామ్యాన్ని ప్రవేశపెట్టి, ఒక రాజ్యాంగాన్ని నిర్మించి, క్రమశిక్షణతో కూడిన అనేక నియంత్రణలతోపాటు అతిస్వేచ్ఛను పరిహరించే శాస్త్రీయ స్వాతంత్య్రాన్ని ప్రసాదించాడు. అందుకే ఒక ప్రపంచ అగ్రరాజ్యానికి ”జాతిపిత” కాగలిగాడు. రెండు వందల ఏళ్ళకు పైగా కాలం గడిచినా యింకా తరతరాలుగా అమెరికా ప్రజల హృదయాల్లో చెక్కుచెదరకుండా నిలిచిఉన్నాడు. అధికార వ్యామోహం గనుక వాషింగ్టన్‌కు ఉంటే చరిత్రలో యింత పవిత్రమైన స్థానం దక్కి ఉండేదికాదుగదా.. కుర్చీ.. సింహాసనం.. అధికారం.. యివి..”
ఒక తీవ్రమైన ఉప్పెనలో కొట్టుకుపోతున్న ఒట్టి అట్టపెట్టెలా అనిపించాడాయన ఆమెకాక్షణం.
”నిస్సందేహంగా జార్జ్‌ వాషింగ్టన్‌ చాలా గొప్పవాడే సర్‌. కాని చక్రవర్తిత్వాన్ని కాదని ఒక ప్రజాస్వామ్య దేశంగా అమెరికానుప్రకటించిన తర్వాత ఆయనే మొదటి, రెండవ అమెరికా అధ్యకక్షునిగా అధికార పగ్గాలను చేపట్టారు గదా.ఆ కోణంలో చూస్తే ఎప్పుడూ ఏ అధికారాన్నీ ఆశించకుండా ఒక రక్తపుబొట్టు కూడా చిందకుండా భారత స్వాతంత్య్రాన్ని సాధించిన గాంధీ సంగతి..ఈయనెంత గొప్పవాడు. స్వతంత్ర సాధన తర్వాత కూడా ఎన్నడూ ఏ పదవీ కోరుకోలేదే….
” ఆదే పొరపాటు జరిగింది లీలా. నీ వంటి పరిణతి గల ఆధ్యయనకారులు కూడా యిక్కడే హేతుబద్దంగా ఆలోచించడం లేదు…”
”ఎలా….”లీలా కంగుతుంది.
”అక్కడ వాషింగ్టన్‌ ప్రజాస్వామిక ఆమెరికాను ఏ రకంగా స్యప్నించాడో ఆ విధంగా అ దేశం యొక్క ఆకృతిని తీర్చిదిద్దేంకు స్వయంగా పూసుకుని పటిష్టమైన రాజ్యాంగాన్ని నిర్మింపజేసి, దాన్ని స్వయంగా తాను ఆమలు చేసి చూపించి ఒక దారి ఏర్పర్చి….. యిక ఈ మార్గంలో నడవండని చిటికెన ప్రేలును వెనక్కి తీసుకుని వెళ్ళి పోయాడు. అలాగే గాంధీ కూడా తన అద్భుతమైన సిద్ధాంతాలను రాజ్యాంగబద్దం చేసి, కుర్చీపై కూర్చుని ఆమలుచేసి చూపి విలువలతో కూడిన రాజకీయ సంస్కృతిని స్థాపిస్తే బాగుండేదేమో…ఆది జరుగలేదు కాబట్టి ఓ పదిరవై ఏండ్లు దాటక ముందే చూడు రాజకీయాలు బురదకుంటై, పందులు పొర్లాడే రొచ్చుగుంటై ఛండాలమైపోయింది.”
”……” లీల నిజంగా షాకైంది… నిజమేనా ఆని అన్పించిందామెకు.
గాంధీ… అనే జీవి ఒక్కడే… కాని వ్యక్తినిబట్టి ఒక్కొక్కరికి ఒక్కోరకంగా అర్థమౌతున్నాడు గదా.
”విలువల కోసం అధికారమా… అధికారంకోసం విలువల త్యాగమా, ఇదమ్మా అసలు ప్రశ్న ఈ రోజు” అన్నాడు ముఖ్యమంత్రి మళ్ళీ.
”నిస్సందేహగా అధికారంకోసమే విలువల విధ్వంసం నిర్లజ్జగా కొనసాగుతోంద్సార్‌ ఈ రోజు భారతదేశంలో..
ఈ దౌర్భాగ్య పరిస్థితి మారాలి లేకుంటే ఎవనికందిందివాడు అప్పులుతెచ్చి..పైనబడి లాక్కుని.. ఎగబడి గుంజుకుని దోచుకునే స్థితి ఏర్పడ్తుంది. విలువలకోసం మాత్రమే అధికారం ఒట్టి నామమాత్రంగా నిర్వహించబడే  చేష్ట కావాలి.”
”ఔనా..”
”ఔన్సార్‌ .. ” అంది లీల స్థిరంగా .. దృఢంగా ఖచ్చితంగా
”కదా .. అసలీ రామం ఎవడమ్మా”
లీల మాట్లాడలేదు.
అనుకోని ప్రశ్నకు ఉలిక్కిపడి.. తర్వాత ఆశ్చర్యపడి.. తేరుకుని,
”రామం అనేవాడు జనసేనను స్థాపించి కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాడు”
”…”
”రామం అనేవాడు .. నాలోకి నేను తొంగిచూచుకుని ఆత్మాన్వేషణతో పునర్విమర్శ చేసుకొమ్మని వేదిస్తున్నాడు..”
”…..”
”రామం అనేవాడు నా ఆత్మను ఒక గునపమై పొడిచి పొడిచి ప్రశ్నిస్తున్నాడు”
”……”లీల ఆవేశంగా మాట్లాడ్తున్న ముఖ్యమంత్రి ముఖంలోకి కొయ్యబారి చూస్తోంది.
”రామం అనేవాడు హిరణ్యకశిపుణ్ణి పరేషాన్‌ చేసిన ప్రహ్లాదునివలె వెంటాడ్తూ చాలా కలవరపెడ్తున్నాడు”
”……”
”రామం అనేవాడు దుర్మార్గులైన రాజకీయ నాయకులందర్నీ ఉచ్చలుపోయిస్తూ అంతరాంతరాల్లో వీడురా మగాడంటే..అని అన్పించుకుంటూ అందరిచేతా ప్రేమించబడ్తున్నాడు”
”…..” లీల ఆశ్చర్యంగానేఐనా.. ఆనందంగా ఆయనవంక చూస్తోంది.
”అసలు ఈ రామం ఎవడు..?” స్థిరంగా ఉంది ముఖ్యమంత్రిగారి గొంతు.
లీల లేచి నిలబడింది సోఫాలోనుండి.
యటికి నడవడం ప్రారంభిస్తూ.. ”రామం ఒక ఋషి” అంది స్పష్టంగా
బయటికొచ్చి కార్లో కూర్చుంటున్న లీలకు ముఖ్యమంత్రి తనను ఎందుకు పిలిపించుకున్నాడో అర్థంకాలేదు. కాని వచ్చి తను ఏమి నేర్చుకుందో మాత్రం స్పష్టంగా అర్థమైంది.

29

23

”ఎందుకు..?”
”వ్చ్‌.. ఏమో..”
”ఎందుకో..?”
”ఏమో తెలియదు.”
”ఇంత అర్ధరాత్రి ఈ అత్యవసర పిలుపేమిటో.. మీకేమైనా తెలుసా”
”తెలియదు. మీకు తెలుసా”
”ఉహుఁ.. నాక్కూడా తెలియదు. వెరీ అర్జంట్‌ అంటే ఉన్నపళంగా వచ్చా. ఇంత రాత్రి నలభైమందికి అత్యవసర పిలుపు. పన్నెండు గంటల ముప్పయి నిముషాలకు.. ముఖ్యమంత్రి నివాసభవనంలోని కాన్ఫరెన్స్‌ హాల్‌లో.. అందరికీ ఆశ్చర్యం.. ఎందుకు.. ఎందుకు..?
అన్ని ప్రముఖ దినపత్రికల సంపాదకులకు మాత్రమే, అన్ని తెలుగు న్యూస్‌ చానళ్ళ అధిపతులకు, ‘జనసేన’ బాధ్యులు ముగ్గురు..రామం, డాక్టర్‌ గోపీనాథ్‌, క్యాథీ, హైకోర్ట్‌ చీఫ్‌ జస్టిస్‌..ఒకే ఒక లోక్‌సభ సభ్యురాలు, ఒక పౌర హక్కుల నేత, ఒక మానవ హక్కుల సంఘ నాయకుడు, ఒక యాభై తొమ్మిదేళ్ళ వయసున్న సీనియర్‌ ప్రిన్స్‌పాల్‌ సెక్రటరీ సుబ్బన్న ఐఎఎస్‌, అటార్నీ జనరల్‌, ఆంటీ కరప్షన్‌ బ్యూరో చీఫ్‌.. వీళ్ళు మొత్తం నలభైమంది.ఒక్క మంత్రి కూడా ఆ మీటింగుకు ఆహ్వానింపబడలేదు.
రాత్రి పన్నెండుగంటల ఇరవై నిముషాలైంది.
బయట చిక్కని చీకటి.. ముఖ్యమంత్రి కాన్ఫరెన్స్‌హాల్‌లో చిక్కని పాలవంటి వెలుగు.
ఒకటితర్వాత ఒకటి..మెత్తగా, మెల్లగా ఒక్కోకారు వచ్చి పొర్టికో ముందు ఆగి.., ఆహ్వానితుల్లో ఎవరో ఒకరు దిగి.. హడావుడిగా.. ముఖంనిండా మొలిచే ప్రశ్నతో లోపలికి నడుస్తూ,
బయట ఎక్కడా సెక్యురిటీ హంగామా లేదు.
ఉన్నత రాజకీయవర్గాల్లో వార్త ఎప్పుడూ అంటుకున్న పెట్రోల్‌ మంటే..ప్రాకిపోయింది. మనిషికి ఎప్పుడూ ఉత్సుకత అనేది నోట్లో నానని నువ్వుగింజ. బయటికి కక్కేదాకా కడుపుబ్బుతుంది.
దాదాపు నలభై రెండుమంది మంత్రుల ఇళ్ళలోని అందరి సెల్‌ఫోన్లు పరమబిజీగా ఉన్నాయి. ‘మంత్రులకు తెలియకుండా ముఖ్యమంత్రి నివాసంలో ఏమిటీ ఉన్నతస్థాయి సమావేశం.. ఎందుకు. ఏమిటి సంగతి.. ఏం జరుగబోతోంది..” అంతా టెన్షన్‌.
”కనుక్కునేదెలా..?”
ప్రయత్నించు ప్రయత్నించు.. నీకు తెలిస్తే నాకు చెప్పు.. నాకు తెలుస్తే నీకు చెప్తా.
ఈ లోగా ఢిల్లీకి కబురు.. అధిష్టానం పెద్దలకు..తాబేదార్లకు, పైరవీకార్లకు, బ్రోకర్లకు, ఏజంట్లకు.. సలహాదార్లకు అందరికి వాళ్ళవాళ్ళ మనుషులు హాట్‌లైన్లలో సమాచారం చేరవేసి ‘ఏమిటో’ కనుక్కుంటున్నారు.
అన్ని చోట్లనుండీ ఒకటే జవాబు ‘తెలియదు’ అని
సమయం పన్నెండూ ముప్పయి.
సెక్రటరీ రామలక్ష్మి వచ్చింది ముఖ్యమంత్రి గదిలోకి. అక్కడ ఆయన, అతని భార్య ఉంది. ఆమె డెబ్బయిమూడేళ్ళ వృద్ధాప్యంలో పండుపండిన గోగుబుట్టలా ఉంది.. నిండుగా, ప్రసన్నంగా ముఖ్యమంత్రి కూడా చాలా నిబ్బరంగా, తృప్తిగా.. ముఖంనిండా వెలుగుతో ఉన్నాడు.”సర్‌. అందరూ వచ్చార్సార్‌” అంది రామలక్ష్మి వినయంగా. ఆమెకు జరుగబోయేది చూచాయగా అర్ధమైంది. రేపు భారత రాజకీయ చరిత్రలో సంభవించబోయే పెనుసంచలనాన్ని అంచనా వేస్తోందామె. ఐతే ఆమె ఒక రకమైన లౌకికాతీత ఆనందాన్ని అనుభవిస్తూ ముఖ్యమంత్రి గారి ముఖంలోకి ప్రశంసాపూర్వకంగా చూచింది.
మాట్లాడకుండానే లేచి వెంట భార్యను తీసుకుని మౌనంగా కాన్ఫరెన్స్‌ హాల్‌లోకి నడిచాడు. అతని వెంట ఓ బరువైన తోలుసంచీని మోసుకుంటూ రామలక్ష్మి కూడా కదిలి,
హాలులోని వేదికపైకి ముఖ్యమంత్రి దంపతులు రాగానే గౌరవపూర్వకంగా అందరూ లేచి నిలబడ్డారు. దంపతులిద్దరూ వేదికపైకి చేరగానే చేతులు రెండూ వినమ్రంగా జోడించి అందరికీ నమస్కరించి వేదికపైనున్న రెండే రెండు కుర్చీల్లో ఆసీనులై,
హాల్‌లో ఒకే ఒక ఫోటోగ్రాఫర్‌ ఉండే విధంగా ఏర్పాటు చేయబడింది.
వేదికపై మీడియా మైక్రోఫోన్‌లున్నాయి.
అంతా నిశ్శబ్దం.. గంభీరం.. ఉద్వేగం.
అందరి ముఖాల్లోకి ఒకసారి కలియజూచి, ఆయన కళ్ళు ‘జనసేన’ సంస్థాపకుడు రామం కోసం వెదికాయి..కాని రామంపై కొద్దిరోజుల క్రితం వరంగల్లులో జరిగిన బాంబుదాడి జ్ఞాపకమొచ్చి., జనసేన తరపున వచ్చిన సిద్ధాంతకర్త గోపీనాథ్‌, క్యాథీ, ‘అగ్ని’ ఛానల్‌ అధినేత మూర్తి..ఇతర నిప్పువంటి వ్యక్తిత్వం గల పాత్రికేయులు..పత్రికా సంపాదకులు, టి.వి. సిఇఓలు, హైకోర్టు చీప్‌ జస్టిస్‌.. లోకాయుక్త.. అందర్నీ కళ్ళతో పలకరించి,
”మిత్రులారా.. డెబ్భై మూడేళ్ళ వయసులో.. నిజానికి ఏ రాజకీయనాయకున్నీ ఇన్నాళ్ళ దాకా పని చేయనివ్వద్దు.. ఈ పెద్ద వయసులో చాలా అలసటతో, బాధతో, దుఃఖంతో మీతో ఒక మంచి స్నేహితునిగా నా వ్యధను పంచుకోవాలని ఈ వేళగానివేళ మిమ్మల్ని యిక్కడికి రప్పించాను. మొదట అందుకు నన్ను క్షమించండి. దాదాపు యాభై సంవత్సరాలుగా ప్రజాజీవితంలో ఉన్నాను. చిన్నపిల్లాడిగా గాంధీ టోపిని నెత్తిపై పెట్టుకుని ఈ పవిత్ర మాతృభూమినే తలపై కిరీటంగా ధరించినంత ఆనందాన్ని పొందాను. ఒక్కోమెట్టు. ఒక్కో అడుగు.. ఒక్కో అధ్యాయం.. ఎందరో మహానుభావులు.. పుచ్చలపల్లి సుందరయ్యగారు, తరిమెల నాగిరెడ్డి, తెన్నేటి విశ్వనాధం, సురవరం ప్రతాపరెడ్డి, వందేమాతరం రామచంద్రరావు, చండ్ర రాజేశ్వర్రావు.. పార్టీలు ఏవైనా.. అందర్లోనూ మూలధాతువైన మానవతా విలువలు, దేశభక్తి, సామాజిక చింతన, ప్రజాసంక్షేమ పరితపన. బ్రిటిటిష్‌వాడు విడిచిపెట్టివెళ్ళిన ఈ భారతదేశంలో అవిద్య, నిరక్షరాస్యత, నిరుద్యోగం, అనారోగ్యం, పేదరికం, దరిద్రం.. ఇవే ఎక్కడ చూచినా.. వీటికితోడు మతకలహాలు.
పరిపాలన అనే ఫ్లైట్‌ టేకాఫ్‌ సరిగానే జరిగింది.
ప్రజాకవి శ్రీశ్రీ చెప్పాడు..కాదు హెచ్చరించాడు 1964లోనే,
”ఆకాశం అందుకునే ధరలొకవైపు
అంతులేని నిరుద్యోగ మింకొకవైపు-
అవినీతి, బంధుప్రీతి చీకటి బజారు
అలుముకున్న ఈ దేశం ఎటు దిగజారు-” అని
జాతీయభావం, దేశంపట్ల ప్రేమ, మాతృభూమిపట్ల మమకారం, పౌరునిగా సామాజిక బాధ్యత.. యివన్నీ క్రమంగా నశిస్తూ.. నిజంగానే అతివేగంగా ఈ దేశం దిగజారడం మొదలైంది.
నిజానికి నేనిప్పుడు మీతో మాట్లాడ్తున్నదంతా నా ఆత్మతో నేను జరుపుతున్న ఒక స్వగత సంభాషణ వంటిది.
కర్ణునిచావుకు కారణాలనేకం అన్నట్టు ఈ దేశం ఈ రకంగా పతనమై దిగజారిపోయేందుకు గల అనేక కారణాల్లో నాలాంటి సీనియర్‌ రాజకీయనాయకులు కూడా శల్యుని పాత్ర, శకునిపాత్ర, విభీషణుని పాత్ర యిలా అవకాశాన్ని బట్టి  కుర్చీకోసం, పదవులకోసం, అధికారంకోసం రాజీపడి.. తలవంచుకు నిలబడి.. తప్పులు చేసి.. తప్పువెనుక తప్పులు చేసి.. దుర్మార్గాన్ని ఎదిరించవలసివచ్చినపుడు ఎదిరించకుండా మౌనం వహించడం యుద్ధనేరం. మాట్లాడవలసివచ్చినపుడుమాట్లాడకుండా మిన్నకుండడం పరమ పాతకం. అలాంటి పాపాలు, నేరాలు నేను కూడా చాలానే చేశాను. యిప్పుడు నేనిలా మాట్లాడ్డం వృద్ధ నారీ పతివ్రత’ లాంటిదే. నాకు తెలుసు. కాని యిప్పటికైనా నేను చేసిన తప్పులకు చెంపలేసుకుని కన్‌ఫెస్‌ ఐపోదామనే.
వెనక్కి తిరిగి చూచుకుంటే.. నాపై నాకే అసహ్యమేస్తోంది. నేను మంత్రిగా ఉన్నప్పుడు అప్పటి ముఖ్యమంత్రులు చేస్తున్న అకృత్యాలనెన్నింటినో వ్యతిరేకించి ఎదిరించలేదు సరికదా, అమోదముద్ర వేశాను. బొక్కసంలో ఒక్క పైసా లేకున్నా ప్రజలకు పంచరంగలు కలలను చూపించాం. అధిష్టానం అడిగినా అడుగకున్నా నెలకింత అని కోట్లానుకోట్ల రూపాయలను కార్లలో పంపించాం. శాసనసభ్యులు ఎదురుతిరుగుతారనే భయంతో ఎవడేదికోరితే అది..రోడ్ల కాంట్రాక్ట్‌లు, పవర్‌ ప్రాజెక్ట్‌లు, సెజ్‌ల అలాట్‌మెంట్స్‌, ఇర్రిగేషన్‌ ప్రాజెక్ట్‌లు, మైన్‌ లీజులు, ఇసుక సీనరేజ లీజ్‌లు.. హార్బర్లు, సముద్ర జలాల అప్పగింత, అడవుల లీజ్‌, కొండల గుట్టల లీజ్‌లు.. ఎన్ని..ఎన్నెన్ని.
ఓట్లకోసం ఆర్థికంగా సాధ్యంకాని ఎన్నో ఉచితాలను ప్రకటించాం. బియ్యం, విద్యుత్తు, టి.విలు, ఫీజులు, పచ్చకార్డులు, ఆరోగ్యపథకాలు.. మాకు తెలుసు ఇవేవీ అమలు కావని. ప్రపంచబ్యాంక్‌ అప్పులు, ఐఎమ్‌ఎఫ్‌ అప్పులు, జపాన్‌లాంటి దేశాల పరస్పర వినియోగ ఆర్థిక సహకారాలు.. పబ్లిక్‌ బాండ్స్‌, ప్రజలనుండి అప్పులు.. ఎన్ని చేసినా తెచ్చిన బుడ్డపరకలాంటి అప్పును రాజకీయనాయకుల రూపంలో ఉన్న కాంట్రాక్టర్లందరూ జస్ట్‌ చప్పరించి సఫా చేయడమే. మరుక్షణమే మళ్ళీ మేతకు తయ్యార్‌.  ఈ నా ప్రక్క తోలుసంచీలో అన్ని వివరాలున్నాయి. తొంభైశాతం శాసనసభ్యులు, పార్లమెంట్‌ సభ్యులు, జిల్లాలలో కార్పొరేటర్లు.. అందరూ వాళ్ళ వాళ్ళ స్థాయినిబట్టి జాతీయ, రాష్ట్ర , జిల్లా స్థాయి కాంట్రాక్టర్లే. సిగ్గులేకుండా ప్రజలసొమ్మును, ప్రభుత్వ సొమ్మును భోంచేయడానికి అధికారపార్టీ, ప్రతిపక్షపార్టీ, వామపక్ష పార్టీ అన్న తేడాలేదు. అందరిదీ ఒకటే జాతి. వీళ్ళందరూ నా హయాంలో అడ్డమైన పనులను చేస్తూ నాతోకూడా చేయించినవారే. యిప్పుడు ప్రజాకర్షక పథకాలను ఓట్లకోసం ప్రవేశపెట్టిన భారతదేశంలోని ప్రతి రాష్ట్రప్రభుత్వం ప్రజలను బిచ్చగాళ్ళను చేయబోయి తామే ఓ పెద్ద బిచ్చగత్తె ఐ కూర్చుంది. చివరికి దక్షిణ భారతదేశంలోని రాష్ట్రాలన్నీ తాగుబోతుల దయతో, వాళ్ళు దానం చేస్తున్న ఎంగిలి సొమ్ముతో బతికి బట్టగడ్తున్నాయి. కాని ఈ నీటి బుడగ ఎన్నాళ్ళో నిలవదు. చితికి బ్రద్దలైపోద్ది.

30
ప్రజల తరపున రాజ్యాంగ నిర్వచనం ప్రకారం ప్రభుత్వ అధికారుల పనితీరును, శాసనాల, విధానాల అమలును పర్యవేక్షించి తనిఖీ చేయవలసిన ప్రజాప్రతినిధులే అధికారులతో కలసిపోయి కంచే చేను మేసినట్టు, ఇంటికుక్కే ఇంటి యజమానిని కరిచినట్టు కుమ్మక్కయితే యిక ఏ రూల్సూ, ఏ నిబంధనలూ సమాజాన్ని భ్రష్టుపట్టడం నుండి కాపాడలేవు. ఈ రోజు..నావద్ద రికార్డులున్నాయి. ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో ఎనభైశాతం అవినీతి ఉంది. పర్సెంటేజ్‌లున్నాయి. కమీషన్లున్నాయి. దీనికి తోడు నాణ్యతలేక, ప్రమాణాలు పడిపోయి ప్రతి ప్రభుత్వ ఆఫీసులో పనికిరాని, పనిచేయరాని ఉద్యోగుల మెజారిటీవల్ల అసలు పరిపాలన స్తంభించిపోయింది. అంతా కాగితాలకే పరిమితమైన పని మాత్రమే మిగిలి ఉంది..నిజానికి ఎక్కడా ఏమి ఉండదు. వ్యవస్థ అంతా అసమర్థమై, నిర్వీర్యమై క్రమశిక్షణ పూర్తిగా లోపించింది.
ఎవడు ఎవనిమాట వినడు.. ఎవడు ఎవన్ని లక్ష్యపెట్టడు.. అతిస్వేచ్ఛ.. నిర్లక్ష్యం.. ఎదురుతిరుగుడు.
అనేక దేశాల్లో ఉన్నట్టు ”ఐ లౌ మై ప్రొఫెషన్‌” అనే తత్వమే యిక్కడ లేదు. అంకితభావం లేదు. ఇది ప్రజలసొమ్ముకదా మనం ప్రజలకు జవాబుదారులం కదా అన్న స్పృహ లేదు.
‘కుచ్‌తో భీ కరో.. బస్‌ పైసే కమావో” అనే కల్చర్‌ ప్రబలిపోయింది.
మిత్రులారా.. యిదంతా మీకు తెలిసిందే. కాని ఈ రోజు నా తప్పును నేను ఒప్పుకుని తలవంచుకుని ఈ వ్యవస్థ యికముందు యింకా యింకా పతనం చెందొద్దనీ, ఈ దురాగతాలకు కనీసం యికనైనా ఫుల్‌స్టాప్‌ పెట్టాలని, భావితరాలు ఈ పరమ దుర్మార్గ మృగతుల్య రాజకీయ నేరచరితుల చేతుల్లో బందీలై నష్టపోవద్దని క్షోభపడి క్షోభపడి, కొద్ది రోజులుగా అంతర్మథనం చెందీ చెందీ, ‘భయం’ అనే సంకెళ్ళను తెంచుకుని, నన్ను ఈ రాజకీయ బురద కంపునుండి విముక్తం చేసుకోడానికి భరించలేని ఆత్మక్షోభతో, దుఃఖంతో ఈ చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంటున్నాను. ఈ సందర్భంగా నా ప్రధానమైన కొన్ని నిర్ణయాలను బహిరంగంగా, నిస్సంకోచంగా మీముందు, మీరు సాకక్షులుగా ప్రకటిస్తున్నాను.
ఒకటి.. నేను నా ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయడంలేదు. నా నాయకత్వంలో పనిచేస్తున్న నాతోసహా చాలామంది అవినీతి మంత్రుల సవివరమైన, లంచగొండి పనితీరు నివేదికలను ఋజువుల్తో సహా గవర్నర్‌కు, రాష్ట్రపతికి సమర్పిస్తూ నా ప్రభుత్వాన్ని బర్త్‌రఫ్‌ చేసి ప్రజాస్వామిక విలువలను పునరుద్ధరించమని ప్రార్థిస్తున్నాను.
రెండు.. నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, యిదివరకటి ముఖ్యమంత్రుల హయాంలో కూడా నేను మంత్రిగా ఉన్నపుడు కలిపి.. గత పదిసంవత్సరాల అప్పులు, ఆస్తుల పట్టికలను, ప్రతి సంవత్సరం బడ్జెట్‌లో నలభై ఐదుశాతం ఋణాలు, వడ్డీచెల్లింపుల కిందనే ఖర్చుచేస్తున్నామనే భయంకరమైన సత్యాన్ని, గత ప్రభుత్వాల ద్రోహాన్ని అధికారిక శ్వేతపత్రంద్వారా ప్రజలకు తెలియజేస్తూ నన్ను క్షమించమని ప్రజలను వేడుకుంటున్నాను.
మూడు..ఈ తోలు సంచీలో ఉన్న నాల్గువందల అరవై నాల్గు కరప్టివ్‌ కేసులను..మంత్రులపైన.. శాసనసభ్యులపైన, ఉన్నత ప్రభుత్వాధికారులపైన, కార్పొరేట్‌ బ్రోకర్‌ కంపెనీలపైన, నగరాల్లో పెత్తనం చెల్లాయిస్తున్న మాఫియాలపైన ఆధారాలూ, నిరూపణలతో పాటు హైకోర్టుకు, లోకాయుక్తకు, మానవ హక్కుల కమీషన్‌కు ముఖ్యమంత్రిగా వీళ్ళందరిపై వెంటనే తగు విచారణ చేపట్టి చర్య తీసుకోవాలని అప్పీలు దాఖలా చేస్తున్నాను.
ఈ మొత్తం అవినీతి ఉదంతాల మొత్తం విలువ లక్షాయాభై రెండు వేల కోట్లు. మీకు ఇన్నాళ్ళబట్టి కరకరలాడే గంజిబట్టలవెనుక నవ్వు ముఖాల్తో కనబడ్డ అనేకమంది యొక్క నిజమైన అసలైన వికృతరూపం ఈ కేసుల్లో సవివరంగా ఉంది. వీటిని గత ఆరునెలల కాలంగా యింకా ప్రభుత్వంలో అవశేషంగా మిగిలి ఉన్న కొద్దిమంది నీతివంతులైన అధికారులతో సమగ్రంగా దర్యాప్తు చేయించి తయారు చేయించాను. వీటిమొత్తం విలువ రెండు సంవత్సరాల రాష్ట్ర బడ్జెటుకు సమానం.
నాల్గు..నాలో ఈ పశ్చాత్తాప బీజాన్ని నాటిన జనసేన వ్యవస్థాపకుడు శ్రీ రామంకు వ్యక్తిగతంగా నేను ఋణపడి ఉన్నాను. ఒక మొలకలా పుట్టి మహావృక్షమై విస్తరించిన ఈ ఆత్మప్రక్షాళన సంస్కృతి నిజంగా నన్ను ముగ్దుణ్ణి చేసింది. ‘జనసేన’ స్థాపన ఆలోచనే మంచిది. ఎటువంటి స్వార్థ చింతనాలేని నాయకత్వ విధానం కలకాలం వర్థిల్లుతుంది. భావితరాలకు ఆదర్శమౌతుంది. అందువల్ల ‘జనసేన’ సంస్థకు నా సకల స్థిరాస్తులన్నింటినీ విరాళంగా దాఖలు పరుస్తూ ఓ విల్లు రాశాను. దానిని స్వీకరించి ఈ నా పశ్చాత్తాపానికి నిష్కృతిగా ప్రాయశ్చిత్తం చేసుకునే అదృష్టాన్నీ ప్రసాదించవలసిందిగా రామంగారిని వేడుకుంటున్నాను.
మన భారతదేశ చరిత్రలో ముఖ్యమంత్రులను శాసన సభల్లో అభిశంసించిన సందర్భాలు కొన్ని ఉన్నాయి. కాని ముఖ్యమంత్రే తన సహచర మంత్రుల అధికారుల, ప్రజాద్రోహాల అవినీతిని బట్టబయలుచేసి కంప్లెయింట్‌ చేసిన ఉదంతాలు ఎక్కడాలేవు. ఈ సాంప్రదాయం నాతోనే మొదలౌతుంది. ఎవడో ఒకడు ఎప్పుడో ఒకప్పుడు పిల్లిమెడలో గంట కట్టాలి..తప్పదు.
నాకిక ఏ పదవిపైనా, అధికారంపైనా కాంక్షలేదు.
రేపు మతిచలించి ముఖ్యమంత్రిగారు పిచ్చిపిచ్చిగా ఏదేదో చేశాడని మొగుణ్ణి కొట్టి వీధిలో మెరమెరలాడే తరహా మా రాజకీయ సహచరులంటారు. అందుకే నేను మంచి స్వస్థతతో, స్పృహతో, జాగ్రదవస్థలో ఉండి ఈ ప్రకటన చేస్తున్నానని ప్రభుత్వ డాక్టర్‌తో ధృవీకరణ పత్రాన్ని జతచేస్తున్నాను.
ఈ సమావేశానంతరం.. గవర్నర్‌గారి అపాయింట్‌మెంట్‌ తీసుకున్నాను. వారిని కలిసి కాగితాలు అప్పగించి ముఖ్యమంత్రి నివాసంనుండి నిష్క్రమించి వానప్రస్తాశ్రమం.. నా స్వంత జిల్లా విజయనగరం వెళ్ళిపోతున్నాను.
మిత్రులారా.. యింతసేపు నన్ను ఓపిగ్గా విన్నందుకు.. నా వ్యథను పంచుకున్నందుకు వ్యక్తిగతంగా ధన్యవాదాలు.
ముఖ్యమంత్రి గొంతు ఎందుకో పూడుకుపోయి గద్గదమైంది. ఇన్నాళ్ళబట్టి తనను బంధించి ఉంచిన ఇనుప సంకెళ్ళు అప్పుడే భళ్ళున తెగిపడిపోయి విముక్తుడైన మహానుభూతి కలిగిందతనికి. మౌనంగా ఉండిపోయాడు.
హాలునిండా ఒట్టి నిశ్శబ్దం
వెంటనే రామం తరపున డాక్టర్‌ గోపీనాథ్‌ లేచి నిలబడి ముఖ్యమంత్రినుద్దేశించి ”థాంక్యూ సర్‌” అన్నాడు.
ఎందుకో..అనూహ్యంగానే కొందరు చప్పట్లు కొట్టారు.    రామలక్ష్మి యింకో వ్యక్తి సహకారంతో తోలుసంచీలోని కాగితాల సెట్లను హైకోర్ట్‌ చీఫ్‌ జస్టిస్‌కు, పత్రికా సంపాదకులకు, టి.వి. అధిపతులకు.. అందిస్తోంది వినయంగా.
హాలులోని నిశ్శబ్ద ప్రళయం ఒక అరగంట తర్వాత మీడియాలో భళ్ళున బాంబులా ప్రేలి ఢిల్లీ వీధులను గడగడలాడించింది..అంటుకున్న పెట్రోలుమంటలా దేశం వీధివీధిలో ప్రవహించింది.
రాత్రి కొనసాగి కొనసాగి.. చీకటి వెలుతురుగా రూపాంతరం చెందుతున్నవేల..
ఎదుట ఆకాశంలో శిశుసూర్యుడు ఎర్రగా.. రౌద్రంగా.. కాంతివంతంగా.,

24

లీలకు ఎందుకో చాలా భయంగా ఉంది.
న్యూ ఢిల్లీ..హోటల్‌ లి మెరిడియాన్‌.. విండ్సర్‌ ప్లేస్‌..రాష్ట్రపతి భవన్‌నుండి రెండు కిలోమీటర్ల దూరం
నంబర్‌ పధ్నాల్గువందల పది.. పదిహేనవ అంతస్తు.
లీల.. ఒకప్పుడు ఒట్టి అనాథ.. దిక్కులేక రోడ్డుమీద జనం చీత్కరిస్తూండగా అడుక్కుంటూ చిరిగిన బట్టలు, చీమిడికారే ముక్కు.. ఆకలితో నకనకలాడే కడుపు .. కళ్ళనిండా నీళ్ళు.,
ఎవరో పుణ్యాత్ముడు అనాథ బాలల పాఠశాల ‘చిగురు’లో చేర్పించాడు. ఒక వర్షం కురుస్తున్న రాత్రి రైల్వేస్టేషన్‌లో అడుక్కుంటూండగా..క్రిస్టియన్‌ మిషన్‌ క్రింద నడుపబడే అనాథ బాలల ఉద్ధరణ సంస్థ.. ఎన్‌జివో.. జీసస్‌ ఈజ్‌ ఓన్లీ ద గాడ్‌.., దేవుడు చెప్పెను.. ప్రవచనాలు.. బైబిల్‌ ఆరవ అధ్యాయము మూడవ పేరా..యోహాను..బోధనలు..ప్రక్కన గర్జిస్తూ, తలనిమురుతూ, ఊరడిస్తూ గలగలా పారే నది. నది ఒడ్డుపై కూర్చుని ఏకధాటిగా ఎవరికీ తెలియకుండా ఏడ్చిన ఎన్నో రాత్రులు.
ఎక్కడ పుట్టానో.. ఎవరికి పుట్టానో.. ఎందుకు పుట్టానో.. ఏమి తెలియని వయసునుండి..జీవితమంటే ఒక ఆసరా వెదుక్కోవడమని, జీవితమంటే లోతును తెలుసుకుని సముద్రాన్ని ఈదడమని..జీవితమంటే ఓడినా సరే మళ్ళీ మళ్ళీ గెలవడమని.. ఎన్నో నిర్వచనాలు.,
దిక్కులేక అనాథగా ఎదుగుతున్న తను తనకుతాను ఒక ప్రశ్న. తనతోపాటు ప్రశ్నకూడా ఎదిగి..పెరిగి.. పెద్దదై.. జీవితమంటే ప్రశ్నించడమని అంతిమంగా నిర్ణయించుకున్న రాత్రి..,
తమ ‘చిగురు’ సంగతి తెలిసింది. ఎన్‌జివోగా అది ప్రభుత్వం నుండి పదెకరాల నదిఒడ్డున ఉన్న సారవంతమైన ప్రభుత్వ స్థలం.. ఏడాదికి ఎనభై లక్షల ప్రభుత్వ నిధులు.. మతం ముసుగులో, సేవ ముసుగులో ఎన్నో భవనాలు.. ఎన్నో సౌకర్యాలు..
అనుకునేది.. ఈదేశంలో మతమేదైనా, కులమేదైనా.. కేంద్రప్రభుత్వ మంత్రిత్వ శాఖల్లో రిజస్టరై ఎన్‌జివోలుగా చెలామణి ఔతున్న, ఈ సమాజాన్ని సంస్కరించి, ఉద్ధరించి, బాగుపరిచి సేవలు చేస్తున్న సంస్థలు దేశ్యాప్తంగా ఎన్నున్నాయి.. వాటి వివరాలు,వారు స్వాహా చేస్తున్న నిధులు, వారు పంచుకుంటున్న భూములు, వారనుభవిస్తున్న సౌకర్యాలు, సౌఖ్యాలు.. వీటన్నింటినీ ప్రభుత్వం ఒక శ్వేతపత్రంగా విడుదలచేసి గనుక ప్రజల సమక్షంలో విడుదలచేస్తే నిజాన్ని తెలుసుకుని ప్రజలు వేలమంది దొంగ సామాజిక కార్యకర్తలను, బాబాలను, ధార్మిక సంస్థల నిర్వాహకులను, గ్రుడ్డి, వికలాంగలు ఉద్ధరణ సంస్థల నిర్వాహకులను, వాళ్ళ నిజరూపాలను తెలుసుకుని పెడ్డలతో, కర్రలతో తరిమి తరిమి రాళ్ళతో కొట్టి చంపేస్తారు. వేల ఎన్‌.జి.వోలు కోట్ల కొద్ది రూపాయలు ఎవని పర్సెంటేజ్‌ వానికి పోగా ఎవనికి దొరికిందివాడు పందికొక్కులకంటే హీనంగా తింటూ..,
లీలకు ఎందుకో గతం గుండెలో నిప్పులా భగభగమండుతూ దహిస్తోంది పొద్దట్నుండి.
ఒకటే ప్రశ్న.,
కారణమేదైనా.. కసి ఎవరిపైననో, ఎందుకో ఐనా.. తెగబడి అసాధ్యాలను సాధ్యంచేసి పైశాచిక ఆనందాన్ని పొందుతూ కోట్లకుకోట్లు పోగేసి.. ఎంతపెద్ద వెధవనైనా డబ్బుతో, ఇంకేదో ప్రలోభంతో కొనచ్చునని, వానిలోని బలహీనతతోఎవన్నయినా జయించవచ్చునని..ఋజువు చేస్తూ చేస్తూ.,
ఐతే.. తను చేస్తున్నది కూడా పైరవీయే కదా.. తను చేస్తున్నది కూడా అవినీతి, మోసం, దగాయే కదా.. చీకటిపనే కదా.. చేసే విధానం వేరు కావచ్చు కాని అంతిమంగా తన పనులన్నీ కూడా అనైతికమైనవీ, తుచ్ఛమైనవీ, హేయమైనవే కదా.
ఔను.. ఔను.. తెలుసు తనకు. తెలిసే చేసింది..చేస్తోందింకా.,
ఇంకా ఇంకా చేస్తుందా తను ఈ తప్పును..?
అది అసలు ప్రశ్న.. వేదిస్తున్న ప్రశ్న.. తనను ఛేదిస్తున్న ప్రశ్న. మొన్న ముఖ్యమంత్రిని కలిసి ఢిల్లీకి చేరిన మరుక్షణంనుండి హృదయాన్ని తొలుస్తున్న ప్రశ్న.
జవాబు కావాలి.. జవాబు కనుగొనాలి.,
అద్దాల కిటికీలోనుండి చూస్తోంది లీల. చుట్టూ ఢిల్లీ మహానగరం.. విస్తరించి విస్తరించి.. భవనాలు భవనాలుగా, రోడ్లు రోడ్లుగా, డబ్బు డబ్బుగా, అధికారం, దర్పం, అహంకారం, మోసం, దగా, కుట్ర, కుతంత్రం, హత్యలు, ప్రాణముండీ చచ్చిపోవడాలు.. చచ్చిపోయీ బతికుండడాలు.. అంతా ఓ పెద్ద చదరంగం.. వైకుంఠపాళీ.. పావులు, పాములు, నిచ్చెనలు.. లోయలు, శిఖరాలు.. పరుగు.. పరుగు-
లీలకు ఎందుకో చాలా భయంగా, వ్యాకులంగా, వెలితిగా.. ఎవరో లోపల చేయి పెట్టి దేవినట్టుగా ఉంది.
ప్రక్కకు చూచింది.
పన్నెండు దినపత్రికలు టీపాయ్‌పై పరిచి ఉన్నాయి. తెలుగు, ఇంగ్లీష్‌, హిందీ.. ఎన్నో.
”రాష్ట్ర ప్రభుత్వ పతనం.. రాజకీయ సంక్షోభం..స్వయంగా ముఖ్యమంత్రే బహిరంగంగా బయటపెట్టిన లక్షాయాభైవేల కోట్ల అవినీతి”
”రాష్ట్ర ప్రభుత్వ బర్త్‌రఫ్‌.. కదుల్తున్న అధికార పీఠాలు.. ప్రజల్లో ఆగ్రహజ్వాలలు.. లక్షా యాభైవేల కోట్ల అవినీతిని ఋజువుల్తో సహా బయటపెట్టిన ముఖ్యమంత్రి”
”మాకు తెలియకుండా మమ్మల్ని ఎప్పుడో ఎవరికో అమ్మారు..ప్రజల గగ్గోలు. రాష్ట్ర ప్రభుత్వ పతనం. రాష్ట్రంలో రాష్ట్రపతిపాలన, అవినీతి మంత్రులు, నాయకుల పరార్‌. రోడ్లపై రాళ్ళతో దాడిచేస్తామని ప్రజల ధర్మాగ్రహం.”
”పునాదుల్తో సహా కూలిపోయిన రాష్ట్రప్రభుత్వం స్వయంగా ముఖ్యమంత్రి ప్రకటన.”
”అవినీతి యింత భయంకరంగా ఉందని అనుకోలేదు. నీతిమాలిన నాయకులను ఉరితీయాలి – హైకోర్ట్‌ చీఫ్‌ జస్టిస్‌”
‘జనసేన’ చైతన్యంతో ప్రభుత్వ పతనం,
”పరార్‌లో అవినీతి మంత్రులు.. నాయకులు.. తరుముతున్న ప్రజలు”
”దేశరాజకీయాల్లో మొదటి పెనుతుఫాను. రాష్ట్ర ప్రభుత్వం పతనం.. శాసనసభ రద్దు.”
ప్రపంచం విస్తుపోయింది. రాజకీయ పండితులు అవాక్కయిపోయారు. వ్యూహకర్తలు జుట్టు పీక్కున్నారు. ఢిల్లీ కుర్చీలు గడగడలాడినై.. బలిసిన ఎలుకలన్నీ అర్జంటుగా కలుగుల్లోకి పరారై పారిపోయినై.
లీలకు పిచ్చి ఆనందంగా ఉంది. భరించలేనంత సంతోషంగా ఉంది.
ఎవడో ఒకడు.. ఈ అవినీతి సామ్రాజ్యాన్ని అంతమొందించేందుకు హనుమంతునిలా అగ్నినంటించాడు. యిక మంటలెగిసి సర్వం దగ్ధమైపోతుంది. శుభం.. ఇది జరగాలి.. ఇది జరిగి తీరాలి.
లీలకు బిగ్గరగా అరిచి ఎగిరి గంతేయాలన్నంత మహోద్వేగంగా ఉంది.
రామం జ్ఞాపకమొచ్చాడు.
రాముని రూపంలో ఉన్న హనుమంతుడు వీడేనా.. అసలు రాముడూ, హనుమంతుడూ వేర్వేరుకాదుగదా.. అంతా శకలాలు శకలాలుగా సర్వవ్యాప్తమై ఉన్న శక్తి సంలీనానికి ప్రతీకలుకదా వీళ్ళిద్దరు.
రామం ఒక నిశ్శబ్దం.. రామం ఒక చర్య.. రామం ఒక ప్రజ్వలన.. రామం ఒక విజయం.
లీల చేతిలోని మొబైల్‌ మోగింది.
”హలో..”
”కింద కాన్ఫరెన్స్‌ హాల్‌లో ప్రెస్‌మీట్‌ ఏర్పాట్లన్నీ ఓ కే మేడం.. రిపోర్టర్సందరూ మీకోసం నిరీక్షిస్తున్నారు” నిర్మల.
నిర్మల ఈట్రిప్‌లో తనతోనే ఉంది.. వెంటరమ్మని తనే చెప్పిందామెకు.
నిర్మల.. తన అసిస్టెంట్‌.. ఒక మెరుపు.. వందమంది ఐపిఎస్‌ ఆఫీసర్స్‌, వేయిమంది ఇంటలిజెన్స్‌ పర్సెనల్‌, ఒక వ్యక్తి.. ఒక వ్యవస్థగా.. ఒక డిపార్ట్‌మెంట్‌తో సమానం.
తన దగ్గర చేరి.. తన దగ్గర శిక్షణ పొంది.. తనవలెనే ఎదిగి.. పదునెక్కి,
కాని తనవలెనే ఓ అవినీతి సామ్రాజ్యానికి అధిపతి ఔతుందా చివరికి..
కావద్దు.. కావద్దు.. అలా జరుగొద్దు.
అందుకే రమ్మంది ఈ సారి తనవెంట.. చివరి పాఠం చెప్పేందుకు.
నిర్మలకు తెలియదు ఇప్పుడీ ప్రెస్‌ కాన్ఫరెన్సెందుకో. అందుకే ఉదయం నుండి తన వంక పిచ్చిపిచ్చిగా, ప్రశ్నప్రశ్నగా చూస్తోంది భయంతో వణికిపోతూ.
”ఐదు నిముషాల్లో వస్తున్నా నిర్మలా.. యు హోస్ట్‌ దెమ్‌”
”యస్‌ మేం”
లీల ఒకసారి అద్దంలో చూచుకుని ప్రక్కనే ఉన్న స్కాజెన్‌ బ్రీఫ్‌కేస్‌ను తీసుకుంది చేతిలోకి.
అప్పుడామె అప్పుడే సముద్రగర్భంలోంచి జలతలంపైకి మహాప్రచండంగా పయనిస్తూ చేరుకుంటున్న వాయుగుండంగా ఉంది.
స్థిరంగా బయటికి నడిచి.. లిఫ్ట్‌ఎక్కి.. మొదటి అంతస్తులో ఉన్న కాన్ఫరెన్స్‌ హాల్‌లోకి ప్రవేశించి,
దాదాపు ఇరవైమంది.. తెలుగు పత్రికా విలేఖరులు, టి.వి. చానళ్ళవాళ్ళు, హిందూ, టైమ్సాఫ్‌ ఇండియా ప్రతినిధులు.,
”గుడ్మార్నింగు ఎవ్రీబడీ”
”ఆంధ్రప్రదేశ్‌ ఈరోజు ఒక ప్రపంచ ప్రసిద్ధమైన ఘటనను సృష్టించి చరిత్రలో నిలిచిపోయింది. దీనిని మీలోని ఓ కార్పొరేట్‌ నిర్వాహకురాలు ఎలా స్వీకరిస్తోంది.”
”కార్పొరేట్‌ ప్రపంచానికి చెందిన దానిగానైనా, ఒకప్పటి పేద అనామకురాలిగానైనా, ఒక సాధారణ భారతీయ పౌరురాలిగానైనా, మరీ ప్రధానంగా ఆంధ్రప్రదేశ్‌కు చెందిన మహిళగానైనా ఈనాటి ఈ పరిణామాన్ని ఎంతో ఆనందంగా స్వీకరిస్తున్నాను, భావిస్తున్నాను.చరిత్రను ఒక కుదుపు కుదిపి మలుపు తిప్పిన ముఖ్యమంత్రి గారిని అభినందిస్తున్నాను. ఈ ఆరోగ్యకర మహాపరిణామానికి కారణమైన ‘జనసేన’ను, దాని వ్యవస్థాపకుడు, రూపకర్త, సాహసి రామంను, అతని సహచరురాలు క్యాథీని వ్యక్తిగతంగా శుభాకాంక్షలు తెలుపుతూ ప్రశంసిస్తున్నాను”
”దీని ప్రభావం మున్ముందు ఎలా ఉంటుంది మేడం”
”చాలా ప్రభావశీలంగా ఉంటుంది. జనసేన చెప్పినట్టు ‘ప్రక్షాళన’ కార్యక్రమం ప్రారంభమైంది ఇప్పుడే. యిక స్కావెంజింగు చర్య జరుగుతుంది. అశుద్ధాన్ని నీటిధాటితో కడిగి శుభ్రం చేయాలి. నిజానికి ప్రజలందరూ ముక్తకంఠంతో ఈ అవినీతిపరులైన రాజకీయనాయకులను, అనైతిక పాలనను కొనసాగిస్తున్న ప్రభుత్వాలను, చాలా తీవ్రంగా అసహ్యించుకుంటున్నారు. యిక దొంగలను, గూండాలను, నేరచరిత్ర గలిగిన ఏ పార్టీ నాయకున్నైనా ప్రజలు వీధిలో గల్లాపట్టి కొడ్తారు. పారిపోవాలి కంటకులు తోకముడుచుకుని. ప్రజాబలం ఎంత శక్తివంతమైందో ఋజువౌతోంది.”
అందరూ రాసుకుంటున్నారు.
”సరే.. మిమ్మల్ని ఈ ప్రెస్‌మీట్‌కు పిలిపించిన కారణాలు చెప్తాను”
రెండు నిముషాల్లో అందరూ అప్పటిదాకా రాసుకుంటున్నదాన్ని ఆపి.. తలలెత్తి.. ప్రశ్నలై.,
”మిత్రులారా.. యిప్పుడు నేను చెప్పబోతున్నదాన్ని యధాతథంగా, విపులంగా, నిజాయితీగా రిపోర్ట్స్‌ చేసి నా హృదయాన్ని ప్రజలకు ఒక పూర్తి పాఠంగా అందజేయాలని ఆకాంక్షిస్తున్నాను…నిజాకికి యిది ఒక ‘కన్‌ఫెషన్‌ సెషన్‌’ ఈ సందిగ్ధ సందర్భంలో ఒక విద్యావంతురాలైన పౌరురాలిగా యిన్నాళ్ళ బట్టి.. అంటే దాదాపు పదిహేనేళ్ళుగా ప్రపంచ వేదికపైన నిర్వహించిన అనేక అసాంఘిక, సంఘవిద్రోహ, నేరపూరిత చర్యలను మీముందుంచి, నిజాన్ని నిర్భయంగా అందరికీ తెలియజేసి, ప్రాయశ్చిత్తం చేసుకుని పశ్చాత్తాపం ప్రకటిస్తూ ప్రజలను నన్ను క్షమించమని వేడుకునేందుకే ఈ ప్రత్యేక విలేఖరుల సమావేశం ఏర్పాటు చేశాను.
తప్పులు చేయడం.. తోటి మానవులకు నష్టం కల్గించే అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడ్డం.. చివరికి ఏదో ఒక సందర్భంలో జ్ఞానోదయమై పశ్చాత్తాపాన్ని ప్రకటించి సన్మార్గంలోకి మళ్ళి శేషజీవితాన్ని మానవ వికాసం కోసం శ్రమించడం మానవ చరిత్రలో కొత్త విషయమేమీకాదు. బుద్ధునినుండి, అశోకుని నుండి మొన్న ది కన్ఫెషన్‌ ఆఫ్‌ ది హిట్‌మన్‌ అనే పుస్తకాన్ని రాసి అమెరికా రహస్య దుర్మార్గ ఆలోచనలను బయటపెట్టిన జాన్‌ పెర్కిన్స్‌ వరకు, నిన్నరాత్రి మన ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రివరకు.. పశ్చాత్తాప ప్రకటించిన మహావ్యక్తులెందరో ఉన్నారు. తెలిసి తెలిసి తప్పులు చేస్తూ చేస్తూ తన చేస్తున్నది తప్పని తెలుసుకుని యిక తప్పులు చేయకుండా మారినవాడు యింకా యింకా తప్పులు చేస్తూ ఎప్పుడూ తప్పుని తప్పని తెలుసుకోకుండా మరణించేవానికంటే ఉత్తముడని నేను విశ్వసిస్తాను.
ఈ రోజు బహిరంగంగా నా తప్పులన్నింటినీ మీ అందరి సమక్షంలో బయటపెట్టి.. నా నుండి నా సంఘర్షించే ఆత్మనుండి.. చివరికి అర్ధరహితంగా కొనసాగుతున్న ఈ జీవితం నుండి విముక్తమైపోతున్నాను..”
నిర్మల షాకైంది.. అవాక్కయి చూస్తోంది లీలవంక. అసలేం జరుగుతోందో అర్ధం కావడంలేదామెకు.
”సరిగ్గా నేను పది మార్చి పందొమ్మిదివందల తొంభై ఐదు నాటి రాత్రి వరంగల్లు చౌరస్తాలో ఒక విలేఖరుల సమావేశం ఏర్పాటుచేసి ఒక ప్రకటన చేశాను. పుట్టు అనాథను, దిక్కులేనిదాన్ని, నిట్టనిలువుకొండను ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని ప్రాకుతూ ప్రాకుతూ జీవితాన్ని ఓ చాలెంజ్‌గా తీసుకొని బ్రతకాలనుకుంటున్నదాన్ని.. చేతిలో ఒక్క రూపాయికూడా లేనిదాన్ని సరిగ్గా పదిహేను ఏండ్ల తర్వాత సర్వశక్తులనూ ఒట్టి యిరవై వేల కోట్ల రూపాయలను సంపాదించి ఒక మామూలు స్త్రీ ఎలా విజయాలను సాధించగలదో ఋజువు చేసి చూపిస్తానని సవాలు విసిరి నిష్క్రమించాను. మర్నాడు ఆ విషయం ఒక ఉత్కంఠభరితమైన విషయంగా అన్ని తెలుగు పత్రికల్లో వచ్చింది. దాని కాపీ మీకు అందిస్తాను తర్వాత. అప్పట్నుండి యిక జీవితంలో పరుగు ప్రారంభించాను. నేను ఎంబిఎ చదివినప్పుడు మౌళిసార్‌ అని ఓ ప్రొఫెసర్‌ ఉండేవాడు. ఒక వాక్యం చెప్పాడాయన.. మనిషి సర్వకాల సర్వావస్థల్లో సుఖ, దుఃఖ, నిర్వేద, సంకక్షుభిత సర్వసందర్భాల్లో తోడుండేది ఒక ‘పుస్తకమే’ అని. పుస్తకాన్ని ఆయుధంగా చేసుకుని భారత పురాణేతిహాసాల్నుండి ప్రపంచ సకల మానవవికాసానికి సంబంధిచిన పుస్తకాలన్నింటిని ఒక సంవత్సరంపాటు ఆమూలాగ్రం అధ్యయనం చేశాను. పదిహేనేళ్ళలో ఒక ఏడాది గడిచింది. యిక రెక్క విప్పి నన్ను నేను ఒక ప్రశ్నగా, పదునైన పనిముట్టుగా, ఆయుధంగా, బాణంగా, శక్తిగా.. శిల తనను తాను చెక్కుకుని శిల్పంగా మలుచుకున్నట్టు రూపాంతరీకరించుకుని యిక పరుగు పందెంలోకి ప్రవేశించాను.
యిప్పుడు నా నెట్‌ అసెట్‌ వ్యాల్యూ యిరవై ఐదు వేల కోట్ల రూపాయలు. నేను చాలెంజ్‌ చేసినదానికంటే ఐదువేల కోట్ల రూపాయలు ఎక్కువ.
ఐతే మనిషికి పరుగుపందెంలో ఉన్నప్పుడు ఒక్క లక్ష్యం, గమ్యం మాత్రమే కనిపిస్తుందిగాని విచక్షణ ఉండదు. డబ్బు.. డబ్బు.. డబ్బు. డబ్బేలోకం, డబ్బేదైవం, డబ్బే జీవితం. డబ్బు ఇంకా ఇంకా చేరుతున్నకొద్దీ మనిషిని ఒక అజ్ఞాతమైకం కమ్ముతుంది. నిషా శరీరం, మనసు, హృదయం, బుద్ధి వీటన్నింటినీ ఆవహించి ఉన్మాదుణ్ణి చేస్తుంది. డబ్బుతో అధికారం, అధికారంతో వ్యామోహం, వ్యామోహంతో మదం, మదంతో అహంకారం, అహంకారంతో పశుప్రవృత్తి.. యిక మనిషి ధనమదంతో మృగమైపోతాడు. విచక్షణ పూర్తిగా నశించిపోతుంది.
నేను గత పదిహేనేళ్ళుగా మృగంగా జీవిస్తున్నాను.
కాని యిప్పుడు నాలో.. ‘ఎందుకు?’ అన్న ప్రశ్న ఉదయించింది.
ఈ గుట్టల గుట్టలు డబ్బు ఎందుకు.. కనీసావసరాలకు మించిన ఈ సౌకర్యాలెందుకు.. ఈ అవధులు మీరిన లౌల్యం ఎందుకు.. అసలు గమ్యమే తెలియని ఈ ప్రయాణం ఎందుకు.
ఏమిటి..?ఎందుకు?..ఎక్కడికి?..యివి అసలైన ప్రశ్నలు
యిక యిప్పుడు నన్ను నేను తెలుసుకుని విముక్తమౌతున్నాను.
సూట్‌కేస్‌లో సర్వ వివరాలతో, ఋజువుల్తో కొన్ని ఫైళ్ళున్నాయి. వీటిలో ఈ కేంద్ర ప్రభుత్వంలో పెద్ద మనుషులుగా చెలామణిఔతూ కోట్లకోట్ల అవినీతికి పాల్పడ్తున్న దాదాపు నూటా ఇరవై మంది ఐఎఎస్‌లూ, మంత్రులూ, డిపార్ట్‌మెంట్‌ సెక్రటరీలు, అన్ని రాజకీయ పార్టీలకు చెందిన ఉన్నతస్థాయి వ్యక్తుల జాతకాలు, వాయిస్‌ ఎవిడెన్సెస్‌, వీడియో క్లిప్పింగ్సు.. అన్నీ ఉన్నాయి.
అంతర్జాతీయంగా ప్రపంచబ్యాంక్‌, ఇంటర్నేషనల్‌ మానిటరీ ఫండ్‌ వంటి సర్వోన్నత సంస్థల్నుండి బిలియన్సాఫ్‌ డాలర్స్‌ను పర్సెంటేజ్‌లపై భారతదేశపు ఎనిమిది రాష్ట్రప్రభుత్వాలకు తరలించి, ఎన్నో పవర్‌ ప్రాజెక్ట్‌లకు, ఇర్రిగేషన్‌ ప్రాజెక్ట్‌లకు, రోడ్లకు, విద్య, వైద్య, ఆరోగ్య పథకాలకు కోటానుకోట్ల మళ్ళించి.. ఇన్ని రాష్ట్రాల్లో ఎవడు ఎంత కమీషన్‌ తీసుకుంటాడు, ఎవడు ఎలా పనులు చేస్తాడు.. ఎవడు ఎంత దోచుకుంటాడు.. ఏ కార్పొరేట్‌ కంపెనీ ఎంత ముట్టజెప్పి ఎంత లాభపడ్తుంది.. యివన్నీ లీలకు ఫింగర్‌ టిప్స్‌. లీల నెట్‌వర్క్‌ ప్రపంచవ్యాప్తంగా ఉంది. లీల సామ్రాజ్యం అదృశ్యంగా భారతదేశం మొత్తం వ్యాపించి ఉంది. నేను ఒక ఆక్టోపస్‌ వంటిదాన్ని. విస్తరణ నాకు వెన్నతో పెట్టిన విద్య.
నా సామ్రాజ్య రూపురేఖల వివరాలన్నీ ఈ సూట్‌లోని కాగితాల్లో మైక్రోఫిల్ముల్లో నిక్షిప్తమై ఉంది.
సారాంశమేమిటంటే.. దేశమేదైనా.. భాష ఏదైనా.. విషయమేదైనా.. వ్యవహారమేదైనా.. చాలావరకు ‘మనిషి దొంగ.’ ఏ మనిషైనా దేనికో ఒకదానికి లొంగుతాడు..పడిపోతాడు చెప్పిన పనిచేస్తాడు..అది పెద్ద రహస్యమేమీకాదు.. మనం ఎవనికివాడు గుండెపై చేయేసుకుంటే మనకే తెలుస్తుంది మనం దేనికీ లొంగిపోతామో.
ఐతే.. ఏ మనిషైనా దేనికో ఒకదానికి లొంగిపోవడం మాత్రం ఖాయం అన్న సూత్రంపై ప్రపంచాన్ని జయించుకుంటూ వచ్చాను.
కాని అంతిమంగా ఈ డబ్బంతా ఈ సమాజానిది.. ఈ ప్రజలది.. ఈ దీనులది.. ఈ ప్రజలది.. ఇథియోఫియాకు పోండి. ఇండోనేషియాకు పోండి, యుద్ధానంతరం ఇరాక్‌ వీధుల్లో తిరగండి, అప్ఘనిస్తాన్‌ పల్లెల్లో నడవండి. భారతదేశపు ఆదివాసీ గ్రామాల్లోకి తొంగిచూడండి. దుఃఖం.. కన్నీళ్ళు ఏరులై పారుతాయి. ఆకలి, అనారోగ్యం.. దరిద్రం.. నిస్సహాత, దిక్కులేనితనం.. యివి మనల్ని ఒక జీవితకాలం వెంటాడ్తాయి. డబ్బును యింత దారుణంగా దోచుకుంటున్న మనల్ని నిలదీసి సిగ్గుతో తలవంచుకునేట్టు చేస్తాయి.
పశ్చాత్తాపపడ్తూనే నేను ఈ సందర్భంగా దోపిడీదారులైన ఈ దేశవ్యాప్త రాబందు నాయకులకు, ప్రభుత్వాధికారులకు, వ్యాపార రాక్షసులకు ఒకటే వినయపూర్వక విన్నపం చేస్తున్నాను. లంచం తీసుకునేప్పుడు, లంచం యిచ్చేప్పుడు ఈదేశంలో ఆకలితో అలమటిస్తున్న కోటానుకోట్లమంది పేదల కన్నీళ్ళను, వాళ్ళ ఆకలి కడుపులను, వాళ్ళ దుర్భర జీవిత ఆవరణను ఊహించుకోండి. మీరు తీసుకుంటున్న డబ్బు వాళ్ళ రక్తాన్ని తాగుతున్నట్టు వాళ్ళ శరీరాన్ని చించుకుని తింటున్నట్టుగా దృశ్యించండి. ఆ డబ్బు వాళ్ళదే…మీరు దొంగతనంగా వాళ్ళ నోటిముందరి అన్నం ముద్దను లాక్కుని తింటున్నట్టుగా ఊహించుకోండి. యిక మీరు మీ జన్మలో ఎక్కడా లంచం తీసుకోరు.
సుప్రీంకోర్టు న్యాయమూర్తులకు, హైకోర్టు న్యాయమూర్తులకు, సర్వ న్యాయవ్యవస్థకు చేతులెత్తి విన్నపం చేస్తున్నాను.. మీ కళ్ళముందే యిన్ని ఘోరాలు, నేరాలు, దౌర్జన్యాలు, బహిరంగ రాజకీయదోపిడీలు, శాసనాలను, రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తూ గూండాలు చట్టసభలను ఆక్రమించుకోవడాలు..జరుగుతుంటే దయచేసి మాకెవ్వరూ కాగితాలపై పిటిషన్‌గానో, దరఖాస్తుగానో దాఖలు చేయడం లేదని చర్యలు తీసుకోకుండా మౌనం పాటిస్తున్నారు. ఒక సాధారణ మనిషిగా మీరే  ఓ రాజ్యాంగ పౌరునిగా స్పందించి సుమోటో కేస్‌గా ఈ దోపిడీని, దొంగతనాన్ని ఆపండి. అవినీతిని పరిహరించండి ప్లీజ్‌.
అంతిమంగా ప్రజలకు చేతులెత్తి దండంపెడ్తూ వేడుకుంటున్నాను. రామం వంటి నాయకులు ఎప్పుడో ఒకరో ఇద్దరో పుడ్తారు. కాని మీరు ఎవరికి వారు ఒక్కోనాయకునిగా ఎదగండి. సింపుల్‌ ఫార్ములా..కోట్లను కుప్పలేస్తున్న వానిదగ్గరికి ఒక సమూహ జనశక్తిగా వెళ్లి నువ్వేం పనిచేస్తున్నావ్‌..నీకిన్ని ఆస్తులెక్కడివి..కోటానుకోట్లు ఏ అపక్రమ మార్గంలో వస్తున్నాయ్‌..అని బాజాప్తాగా నిలదీయండి. వ్యక్తి ఒంటరిగా ఎప్పుడూ బలహీనుడు..సంఘటితం కండి..చినుకు చినుకు కలిసి ఉప్పెనై విజృంభించండి.
రామం స్థాపించిన ‘జనసేన’ ఒక మహాశక్తి కేంద్రకం. ఎటువంటి అధికార వాంఛలేని, స్వంత ఆస్తులపై మమకారం లేని, ఏ పదవీ వ్యామోహం లేని లక్షమంది శాశ్వత కార్యకర్తలతో, ఒక నిరంతర మహోద్యమాన్ని ఈ దేశానికే ప్రేరణగా రూపొందించి ఒక స్ఫూర్తిగా నిలుస్తున్నారు. అతని ఆ మహాయజ్ఞంలో సమిధగా నా సర్వ స్థిర చరాస్తులన్నింటినీ ‘జనసేన ట్రస్ట్‌’కు ధారాదత్తం చేస్తున్నాను. ఆ విల్లు ఈ సూట్‌కేస్‌లో ఉంది. నా తరపున నిర్మల ఈ కేసులన్నింటిని కోర్టుల్లో ఫైల్‌ చేస్తుంది. మిగతా వ్యవహారాలన్నీ నా వారసురాలిగా కొనసాగిస్తుంది. నిర్మలే మున్ముందు నాకు వారసురాలు.
విలేఖరులందరూ తలలు వంచుకుని రాసుకుంటున్నారు. టి.వి. ఛానల్‌ వాళ్ళు కెమెరాల్లో ముఖాలు పెట్టి షూట్‌ చేస్తున్నారు. అటు ప్రక్క నిర్మల నిర్ఘాంతపోయి రాతిబొమ్మలా నిలబడి వింటోంది.
అప్పట్నుండి ఒక ప్రవాహంలా మాట్లాడ్తున్న లీల గొంతు ఆగిపోయింది చటుక్కున. ధార తెగి…నిశ్శబ్దమై..స్తబ్దమై
అందరూ ఆ అంతరాయానికి స్పందిస్తూ తలెత్తారు లీలవైపు…
కాని ఎదురుగా అప్పట్నుండి మెరుపులా కనిపించిన లీల అక్కడ లేదు. ఒక లిప్తకాలంలో సుడిగాలిగా కదిలి..ఉరికి.. ప్రక్కనే ఉన్న గాజు కిటికీ తలుపులను తెరుచుకుని చటుక్కున బయటికి కిందికి దూకింది…పదిహేనవ అంతస్తుపైనుండి…అకస్మాత్తుగా.
అందరూ గగుర్పాటుతో ఉలిక్కిపడి..కిటికీ దగ్గర చేరి..కిందికి చూస్తూ.
క్రింద రక్తపు మడుగులో లీల శవం..చుట్టూ ఎర్రగా రక్తం…సడన్‌గా జరిగిన సంఘటనకు విస్తుపోయి గుమికూడుతున్న జనం…కోలాహాలం.
కాన్ఫరెన్స్‌హాల్‌లో…టేబుల్‌పై లీల అప్పట్నుండి చెప్పిన డాక్యుమెంట్లతో నిలిచిన స్కాజెన్‌ తోలు సూట్‌కేస్‌…
కొందరు విలేఖరులు లీల మరణ దృశ్యాన్ని రికార్డ్‌ చేయడానికి పరుగు తీశారు కిందికి కెమెరాల్తో. హాల్‌నిండా గంభీర నిశ్శబ్దం అలుముకుంది.
ఏమిటి?…ఎందుకు?…ఎక్కడికి? లీల గొంతు ప్రతిధ్వనిస్తోంది.
ప్రశ్నలు ప్రశ్నలుగా నిర్ఘాంతపోయిన నిర్మల కళ్లనిండా నీళ్లు…ఎదుట ఏమీ కనబడడం లేదు. గాలి బరువెక్కుతుంది.

31

25

రామం కొద్దికాలం కోమాలో ఉండి కోలుకుని మొదటిసారిగా ‘జనసేన’ కేంద్రకానికొచ్చాడు ఆ రోజు.
ఉదయం ఎనిమిది గంటలు…
మనిషి చాలా బలహీనంగా ఉన్నాడు. బాంబు ప్రేలినప్పుడు వీపు భాగం ఛిద్రమై, పేలికలై…మాంసం ముద్దగా మారి…
వరుసగా ఎనిమిదిసార్లు ఆపరేషన్స్‌ జరిపి సెట్‌ చేసి…కుట్టి…తొడల నుండి మాంసాన్ని కత్తిరించి అతికి..కోలుకోవడం ఓ గండం గడిచి బయటపడి…
రామంను క్యాథీ తన భుజాన్ని ఆసరాగా ఇచ్చి నడిపించుకొచ్చింది కారు నుండి ఆఫీస్‌లోని కుర్చీదాకా.
అత్యంత కీలకమైన సమావేశం అది.
”అందరికీ నమస్కారం సర్స్‌…శివ, గోపినాథ్‌గారు, మూర్తి గారు…మీకందరికి ధన్యవాదాలు…నన్ను కంటికి రెప్పకన్నా అధికంగా చూచుకున్నారు”.
”ఒక్కసారి అటు చూడండి” అన్నాడు మూర్తి…హాల్‌లో ఓమూలనున్న అక్రిలిక్‌ ట్రాన్స్‌పరెంట్‌ షీట్‌తో చేసిన పెద్ద మనిషెత్తు పెట్టెను చూపిస్తూ.
రామం తలను అటు త్రిప్పిచూశాడు. దాదాపు దానినిండా ఉత్తరాలు, టెలిగ్రాంలు ఉన్నాయి.
”అవన్నీ మీరు తొందరగా కోలుకుని జనసేన కార్యకలాపాలకు స్వయంగా నాయకత్వం వహించాలని రాష్ట్రవ్యాప్తంగా, రాష్ట్రేతర ప్రాంతాల్నుండి, ఎన్నారైలనుండి వచ్చిన ఉత్తరాలు…మెసేజ్‌లు”
”రియల్లీ… ఐ ఓ టు దెం…ఏం చేసి వాళ్ల ఋణం తీర్చుకోగలను…” చటుక్కున అతని కళ్ల నిండా నీళ్లు నిండాయి చలించిపోయాడు.
కొద్దిసేపు నిశ్శబ్దంగా గడిచిన తర్వాత…తేరుకుని…”చెప్పండి సర్స్‌…విశేషాలు”
గోపీనాథ్‌గారు ప్రారంభించారు.”మీకు అన్నీ తెలుస్తూనే ఉన్నాయి గాని..ఫర్‌ క్లారిటీ..రాష్ట్రవ్యాప్తంగా ప్రజల్లో భవిష్యత్తుపట్ల పెల్లుబుకుతున్న విశ్వాసంతో చైతన్యం వెల్లివిరుస్తోంది. అన్ని ‘జనసేన’ కార్యాలయాల్లో పౌరశిక్షణ తరగతులు సజావుగా సాగుతున్నాయి. మనం అనుకున్న శాశ్వత లక్షమంది నిస్వార్ధ జనసైనికులు తమ విధులను జనంతో కలసి ప్రేరక్‌లుగా పనిచేస్తున్నారు. అవసరమైతే జనసైనికులుగా ఫుల్‌టైమర్‌లుగా పనిచేయడానికి ఇంకో లక్షమంది సంసిద్ధంగా ఉన్నారు. మొత్తం జనసేన సభ్యుల ఎన్‌రోల్‌మెంట్‌ ఒక కోటి డెబ్బయి లక్షలు. అహింస…క్రమశిక్షణ…సంస్కారం…ప్రశ్న…త్యాగం అంశాలుగా నిరంతర శిక్షణ కొనసాగుతోంది.
తర్వాత మూర్తిగారు మాట్లాడ్డం మొదలెట్టారు.”ముఖ్యమంత్రి తనే స్వయంగా అవినీతి నిర్మూలన కార్యక్రమానికి శ్రీకారం చుడ్తూ లంచగొండి నాయకులపై, మంత్రులపై యితరేతర అన్ని రాజకీయ పార్టీలనాయకులపై అవినీతిపరులైన ప్రభుత్వాధికారులపై కేసులు పెట్టిన తర్వాత…మొత్తం పాలనా వ్యవస్థ కుప్పకూలిపోయింది. దీన్ని ఒక ‘నాన్‌వయలెంట్‌ సివిల్‌ రెవల్యూషన్‌గా’ మీడియా అభివర్ణించింది. రాష్ట్ర ప్రభుత్వాన్ని గవర్నర్‌ బర్తరఫ్‌ చేసిన తర్వాత ఇది ఒక ‘జనసేన’ ఘన విజయంగా ప్రజల హృదయాల్లో నమోదైంది. దేశం యావత్తూ మన రాష్ట్రం వైపు, జనసేన వైపు పరిశీలనగా, ఆశతో చూస్తోంది. వేరే రాష్ట్రాల్లో కూడా ఇదే మాదిరి జనచైతన్య వేదికలు రూపుదిద్దుకుంటున్నాయి. ముఖ్యమంత్రి చేసుకున్న దరఖాస్తులు, మనం పెట్టిన వేల కంప్లయింట్స్‌తో ఇనకంటాక్స్‌ డిపార్ట్‌మెంట్స్‌ ‘వాలంటరీ డిస్‌క్లోజర్‌ అండ్‌ టాక్స్‌’ పథకాన్ని ప్రవేశపెట్టి నల్లడబ్బును సేకరిస్తే నమ్మశక్యం కాని విధంగా లక్షా నలభై రెండు వేల కోట్ల రూపాయలు జమయ్యాయి. రెండు వందల రెండు కాంట్రాక్ట్‌లు రద్దయి రీవర్కవుతున్నాయి. ఎసిబీ మన కంప్లయింట్స్‌ ఆధారంగా జరిపిన దాడుల్లో మొత్తం ఒక వేయి ఆరువందల అరవై కోట్ల రూపాయలు, ఎనిమిది వందల కిలోల బంగారం పట్టుబడింది. మొత్తం ఎనిమిది వందల పైచిలుకు కేసులు నమోదై కోర్టుల్లో నడుస్తున్నాయి. మొత్తానికి వ్యవస్థలో సమూలమైన మార్పు స్పష్టంగా గోచరిస్తోంది. పాలక రాజకీయ పార్టీకి చెందిన మూడువందల పదిమంది, ప్రతిపక్ష…వామపక్ష రాజకీయ పార్టీలకు చెందిన నూటా పద్దెనిమిదిమంది రాజకీయనాయకులు…ఎంపిటిసి స్థాయి నుండి మంత్రుల దాకా అవినీతి ఆరోపణల కింద ప్రజలచే దాడి చేయబడి, ప్రశ్నించబడి ఆధారాలతో సహా నిలదీయబడ్డప్పుడు సిగ్గువిడిచి ముక్కును నేలకు రాసిన సందర్భాలున్నాయి. చిత్రమేమిటంటే ఒకనిపై ఒకరు పోటీపడి, ఎగబడి సంపాదించుకున్న ఆరువేల ఐదువందల తొంబై ఆరు మద్యం షాపుల్లో ఐదువేల నాలుగువందల పదహారు మంది మాకు షాపులు వద్దని ఆఫర్లు వెనక్కి తీసుకున్నారు. ఆడవాళ్ల పేరుమీద అప్లికేషన్‌ పెట్టుకుని మద్యం షాపును దక్కించుకున్న వందమంది పాలకపక్ష, ప్రతిపక్ష రాజకీయ నాయకుల్లో ఏడ్గురు మంది ఎమ్మెల్యేల పెళ్లాలు మొగుళ్లను బహిరంగంగా ‘జనసేన’ కార్యకర్తల ఎదుట చీపుళ్లతో కొట్టి సత్కరించారు. మద్యం సిండికేట్లన్నీ పటాపంచలైపోయాయి. ధరలు నలభై శాతం తగ్గాయి. డాక్టర్లు ఫీజులను స్వచ్ఛందంగా తగ్గించుకున్నారు. ప్రతి వక్రబుద్దిగలవానిలో ఎక్కడ్నుండో ఎవరో ‘జనసేన’ కార్యకర్తలు తమను గమనిస్తూ అంతా రికార్డు చేస్తున్నారనే భయం వ్యాపించింది. ప్రభుత్వ కార్యాలయాలన్నీ పకడ్బందైన నిఘాలో ఉన్నాయి. అందువల్ల ఆఫీసుల్లో పనులు చకచకా, సజావుగా ఆమ్యామ్యాలు లేకుండా ఆరోగ్యవంతంగా నడుస్తున్నాయి. మొన్ననే ఎన్నికల కమీషన్‌ రాష్ట్రంలో శాసనసభకు ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించింది. ఈ రోజు తేది పది. ఇరవై నామినేషన్లకు చివరి తేది. ఇరవై రెండు విత్‌డ్రాయల్స్‌…వచ్చేనెల ఎనిమిదిన పోలింగు. పన్నెండున కౌంటింగు.
రామం అప్పటిదాకా కళ్లు మూసుకుని సావధానంగా వింటున్నవాడల్లా…నెమ్మదిగా…ఆగండని సైగచేసి..కళ్లు తెరచి సర్దుకుని కూర్చుని…”ఇంతవరకు జరిగిందంతా ప్రక్షాళనే..అసలు మన ‘జనసేన’ యొక్క ‘సంగ్రామ’ థ ఇప్పుడు మొదలు కాబోతుంది. ఒక గురువు తన సర్వశక్తులను ఒడ్డి శిష్యుణ్ణి తయారుచేసిన తర్వాత ఆ శిష్యుడు ప్రతిభాపాటవపరీక్షల్లో పాల్గొన్నప్పటి ఉద్విగ్న పరిస్థితి ఇది. ప్రస్తుత రాజకీయ పార్టీల ప్రతిస్పందన ఎలా ఉంది…”
”యిదివరకటిలా రెచ్చిపోయి ఒకనిపై ఒకరు ఎగబడి టికెట్ల కోసం పైరవీలు చేసుకోవడం, లాబీలు నడపడం, డబ్బుతో ఎవర్నయినా కొనగలమనే స్థితి లేకపోవడం వల్ల దొంగ నాటకాలు వేయడం అంతగా ఎక్కడా కనబడ్డం లేదు. అంతా గుంభనంగా, నివురుగప్పిన నిప్పులా, దొంగలుపడ్డ యింట్లోని పరిస్థితిలా ఉంది. లీల అనే కార్పొరేట్‌ మహిళ ఢిల్లీలో వందలమంది కేంద్ర రాజకీయులు, ప్రభుత్వ పెద్దలపై వందల కేసులు పెట్టి ఎలక్షన్‌ కమీషన్‌కు నేరచరితుల లిస్ట్‌ వేరే ఋజువుల్తో సహా ఇచ్చి ప్రకంపనలు సృష్టించి ఆత్మార్పణం చేసిన తర్వాత ఢిల్లీలో అన్ని రాజకీయ పార్టీల పునాదులు కదులుతున్నాయి…”
”లీలనా..” అన్నాడు రామం వెంటనే…చటుక్కున అని క్యాథీ వైపు చూశాడు.
”ఔను రామం…లీలనే…ఆమె తనకు చెందిన సర్వ లీగల్‌ ఆస్తులను జనసేనకు డొనేట్‌ చేసి గతనెల రెండవ తేదీ ఒక విభ్రాంతికరమైన ప్రెస్‌మీట్‌ పెట్టి అనేక అవినీతికర సంబంధిత చిట్టాలను బహిర్గతపరిచి అనూహ్యంగా పదిహేను అంతస్తుల హోటల్‌ భవనంపైనుండి కిందికి దూకి ఆత్మార్పణ చేసుకుంది. లీల మరణం ఢిల్లీ పెద్దలకు చలిజ్వరం తెప్పించింది. ఎందరి చీకటి చరిత్రలో బయటపడి ఒక్కొక్కడు అదిరి చచ్చిపోతున్నాడు. అంతా కకావికలైంది”
”ఉహు…చెప్పండ్సార్‌”
”శివా చెప్పు…” అన్నాడు మూర్తి తప్పుకుంటూ
శివ చెప్పడం ప్రారంభించాడు. యింతవరకు ‘జనసేన’ ద్వారా ప్రజల్లో ఒక నీతివంతమైన సంస్కృతి, ప్రశ్నించే చైతన్యం, శాస్త్రీయంగా సమాజం, దేశం స్పృహతో ఆలోచించే విధానం అలవడ్డాయి. మన ‘జనసేన’ కేంద్రాలన్నింటికి ఈ రాబోయే ఎన్నికల్లో పోటీ చేసేందుకు సచ్చరిత్ర గలిగి, అంకితభావంతో, విలువలు ప్రధానంగా ప్రజలకోసమే పనిచేసే విద్యావంతులైన యువకులు అనేకమంది ఆసక్తిచూపుతూ ముందుకొస్తున్నారు. మనం మన స్పందనను తెలియజేయాల్సిఉంది. ‘సంగ్రామ’ థలో మన పాలసీని ప్రకటించవలసి ఉంది. ప్రధానంగా ఈ సమావేశం అందుకే..
”డు యు హావ్‌ స్టాటిస్టికల్‌ డాటా ఆఫ్‌ ఆల్‌ దోజ్‌”
”యస్‌..”
”క్యాథీ ప్లీజ్‌ స్క్రీన్‌”
క్యాథీ వెంటనే క్షణాల్లో ఎల్‌సిడి ప్రొజెక్టర్‌ను స్టార్ట్‌ చేసింది.
తెరపై..నియోజక వర్గం…’జనసేన’ ఆమోదముద్ర కోసం అప్లికేషన్‌ పెట్టుకున్న అభ్యర్థి వివరాలు కదులుతున్నాయి.. రామం చేతిలోకి మానిటర్‌ను తీసుకుని మచ్చుకు ఐదారు చూచి…పాస్‌ చేసి
”చెప్పండి మూర్తి గారు..తర్వాత” ప్రధానంగా ‘జనసేన’ ఆమోదం పొందిన ఏ అభ్యర్థి అయినా ఏ రాజకీయ పార్టీ క్రిందికి రాడు. అతను ఇండిపెండెంట్‌. అంటే స్వతంత్ర అభ్యర్థియై ఉండాలి విధిగా. దరఖాస్తు చేసుకున్న కాండిడేట్లలో ఎవరో ఒకరికి ఐతే.. మన జనసేన ఆమోద ముద్ర తెలిపిన అభ్యర్థిని ఎంపిక చేయడానికి కొన్ని మార్గదర్శక సూత్రాలను మన విధాన నిర్ణాయక సంఘం తయారుచేసింది. జనసేన ఆమోదం కావాలంటే మొట్టమొదట అభ్యర్థి ఈ కండిషన్లను సంతృప్తి పర్చాలి…విందామా వాటిని… శివా వినిపించు..”
”శివా…” అన్నాడు రామం
”ఒకటి.. అభ్యర్థి ఆ నియోజక వర్గానికి స్థానికుడై ఉండాలి. రెండు…కనీసం పట్టభద్రుడై ఉండాలి. వయస్సు అరవై ఏళ్ల లోపు గలవాడై ఉండాలి. మూడు…విధిగా నిరాడంబర జీవితాన్ని గడపడానికి ఇష్టపడే తత్త్వాన్ని, జనంలో మమేకమై వాళ్ల స్థితిగతులను ఎప్పటికప్పుడు గ్రహించి పరిష్కరించాలనే అనురక్తిని కలిగి ఉండాలి. నాలుగు…ఎటువంటి నేరచరిత్ర ఉండకూడదు. ఐదు..రాజకీయమంటే కొంతపెట్టుబడిపెట్టి గెలిచి దానికి వందరెట్లు సంపాదించుకోవడమనే ఒక ముద్ర ఉండి. ఆ కోణంలో ఏ కొంచెం ఆలోచన ఉన్నా ఆ అభ్యర్థి నిరాకరించబడ్తాడు. అందుకు అభ్యర్థి యొక్క సాధారణ ప్రవర్తనను, తత్వాన్ని జనసేన స్వయంగా అధ్యయనం చేయిస్తుంది. ఆరు… ఎన్నికైతే అభ్యర్థి ఆ నియోజక వర్గం ఉన్న జిల్లా కేంద్రంలో ఉన్న జనసేన కార్యాలయ ప్రాంగణంలో శాసనసభ్యుల కోసం ప్రత్యేకంగా నిర్మించి ఇచ్చేఅన్ని సౌకర్యాలున్న సాధారణ గృహంలోనే భార్యా పిల్లలతో నివాసముండాలి. జనసేన ఇచ్చే వాహనాది సదుపాయాలనే ఉపయోగించాలి. ఏడు..ఏ ఓటరుకైనా ఎన్నికైన శాసనసభ్యుడు పిలుపు దూరంలో ఎల్లవేళలా అందుబాటులో ఉండాలి. ఎనిమిది… ప్రవర్తన బాగా లేనప్పుడు ప్రతి ఆరునెలలకొకసారి జనసేన నిర్వహించే జనాభిప్రాయ సేకరణలో నిరసన వ్యక్తమైనపుడు ఆ శాసనసభ్యుడు తన సభ్యత్వాన్ని వదులుకొని వెనుదిరిగి రావడానికి సంసిద్దుడై ఉండాలి. తొమ్మిది తన పదవీ కాలం ఐదేళ్లలో ప్రభుత్వం తరపున, జనసేన తరపున లభించే ఆదాయం మినహా ఎటువంటి అదనపు సంపాదననూ సమకూర్చుకోరాదు. ఇతర వ్యాపారాలు చేయరాదు. అతనికి, అతని కుటుంబ సభ్యుల సౌకర్యార్థం జనసేన సకల ఏర్పాట్లు చేస్తుంది. కాబట్టి పదవీకాలం ఐదేళ్లను ప్రజల, నియోజకవర్గ అభివృద్ది కోసమే పాటుపడాలి. పది…నీతివంతమైన జీవన సంస్కృతిని జనసేన తరపున ప్రజల్లో ప్రతిష్టించి పౌరునిగా ఆదర్శంగా స్వతంత్రంగా జీవించాలి…ఇవి పది నిబందనలు”.
”ఊ…బాగున్నాయి…ఒకసారి ఒక స్వతంత్ర అభ్యర్థి. మన జనసేన తన ఆమోదముద్ర వేసిన తర్వాత అతను ప్రజల అభిమానాన్ని చూరగొని ఎన్నికై రావడానికి మనం అవలంభించే పద్దతులను కూడా ఖరారు చేద్దామనుకున్నాం గదా గోపినాథ్‌ గారు…” అన్నాడు రామం సాలోచనగా.
”ఔను..అవి కూడా సిద్ధంగా ఉన్నాయి. క్యాథీ మీరు వినిపించండి”
‘ఒకటి…ప్రజలను ఇన్నాళ్లుగా మోసం చేసిన ప్రజాకర్షక పథకాల గురించి ఏమీ ప్రస్తావించం. ‘ఉచితాలు వద్దు…ఉపాధి ముద్దు..’ యాచకులుగా కాదు ఆత్మగౌరవంతో జీవిద్దాం’, ‘వృద్దుల సంరక్షణ సామాజిక బాధ్యత’ ఇవి మన సిద్దాంతపరమైన నినాదాలు.రెండు..ఏ నియోజకవర్గంలోనైనా జనసేన ఆమోదముద్ర పొంది స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న వ్యక్తి తనతో పోటీలో ఉన్న ఏ ప్రత్యర్థి గుర్తించీ తన ప్రచారంలో ప్రస్తావించడు..దుర్భాషలాడడు, విమర్శించడు. తను ఎన్నికైతే ప్రజలకు ఎటువంటి మేలు చేస్తాడో, ఏమేం సేవలు చేయగలడో వివరిస్తారు. సంస్కారవంతమైన భాషతో ప్రచారం నిరాడంబరంగా కొనసాగిస్తాడు. మూడు…ఎక్కడా రోడ్‌షో వంటి పిచ్చి పిచ్చి నడిరోడ్డు చిందులాటలు జరిపి ప్రజలకు అసౌకర్యం కలుగజేయరు. నాలుగు…నిర్ణీతమైన విశాల మైదానాల్లోనే పద్దతి ప్రకారం…డబ్బిచ్చి జనాన్నికొనుక్కుని రాకుండా నిజంగా తనపై, జనసేనపై ఉన్న అభిమానంతో వచ్చిన ప్రజలతోనే చాలా నిజాయితీగా తన గురించి క్లుప్తంగా చెప్పుకుంటాడు. నాలుగు…జనసేన ఆమోదమున్న అభ్యర్థులెవ్వరూ పోలీస్‌ సెక్యూరిటీని పోటీ చేసినపుడు గానీ, గెలిచిన తర్వాత గాని అంగీకరించరు. ప్రజల మధ్య స్వేచ్చగా తిరుగలేని వాడు ప్రజలకు మిత్రుడు కాడని జనసేన నమ్ముతుంది. ఐదు…జనసేన తరపున సుశిక్షితులైన జిల్లాకే చెందిన మూడువేల కార్యకర్తలు ప్రతి నియోజకవర్గంలో మన అభ్యర్థి తరపున యింటింటికి తిరిగి ప్రచారం చేస్తారు. నిరాడంబరంగా, స్వచ్ఛందంగా, వాళ్ల క్రమశిక్షణాయుతమైన ప్రచారమే అభ్యర్థి గెలుపుకు ప్రాణవాయువు. ఆరు…ప్రతి నియోజకవర్గంలోని స్థానిక కేబుల్‌ నెట్‌వర్క్‌ ద్వారా మాత్రం మన అభ్యర్థి ప్రతిరోజు ఓ పావుగంట ప్రజలనుద్దేశించి ఏ పరిస్థితుల్లో ఎన్నికలొచ్చాయి…అంతకు ముందు ఏం జరిగింది..జాతీయ స్థాయిలో ప్రభుత్వాలు ఎలా ఉండాలి…ఎలా ఉన్నాయి. ఇన్నాళ్లు ప్రజాధనం ఎలా కొల్లగొట్టబడింది..ఎలా ప్రజలపై ఋణభారం మోపబడింది. మనం ఎంత లోతు అప్పుల బురదలో కూరుకుపోయి ఉన్నాం..ఈ విషయాలను అంకెలతో సహా పారదర్శకంగా ప్రజలకు తెలియజేయాలి. ఏడు…అభ్యర్థికి అయ్యే పరిమితమైన ఈ ప్రచార ఖర్చును, కార్యకర్తల నిర్వహణ ఖర్చును, ఎక్కడా అతిగా అనిపించని ప్రచార సామాగ్రి ఖర్చును స్వచ్ఛందంగా ‘జనసేన’ భరిస్తుంది. ఎనిమిది…ప్రచార సమయంలో పకడ్బందీ సమయపాలనతో రామం, క్యాథీ, గోపీనాథ్‌, మూర్తి, శివలతో కూడిన సారథ్య బృందం తప్పనిసరిగా ఒక్కసారైనా ప్రతి నియోజక వర్గంలో పర్యటిస్తుంది. ప్రజలను కలుస్తుంది. తొమ్మిది…మన లక్ష్యం…ప్రజల కోసం, ప్రజలతో, ప్రజల వెంట…యివీ తొమ్మిది సూత్రాలు” ఆగింది క్యాథీ.
”బాగున్నాయి…ఫర్‌ఫెక్ట్‌..సర్‌… యింతవరకు ఎన్ని నియోజకవర్గాలనుండి ‘జనసేన’ ఆమోదం కోసం దరఖాస్తులందాయి మనకు”
”అన్నీ…రెండవందల తొంభై మూడు శాసనసభా నియోజక వర్గాలకు ఒక్కో నియోజక వర్గానికి కనీసం యిరవై మంది నుండైనా అప్లికేషన్లయినా వచ్చి ఉంటాయి. ఐతే ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే…చాలామంది ముప్పయ్యేండ్లవయస్సు లోపు వారే కాకుండా అందరూ బీద, వెనుకబడిన, దళిత, ఆర్థికంగా నిమ్నమధ్యతరగతికి చెందినవాళ్లే. ఆ జన్మ ధనవంతులు దాదాపు ఎవరూ లేరు.
”మనకు వాళ్లే కావాలి…వాళ్లే చరిత్ర నిర్మాతలు. ప్రపంచవ్యాప్తంగా ఎక్కడా ఏ వస్తువు తయారైనా, ఎక్కడ ఏ బృహత్తర నిర్మాణం జరిగినా వాటివెనుక వీళ్ల శ్రమే ఉంది. నాయకుడెప్పుడు కరుణార్థ్ర హృదయుడై, పీడిత జన పక్షపాతియై ఉండాలి. ప్రపంచ ప్రఖ్యాత నంబర్‌వన్‌ ధనవంతుడు వారెన్‌ బఫెట్‌ తన నలభై ఏండ్ల క్రితం కొనుక్కున్న పాత యింట్లో నివసిస్తూ, అతి సాధారణ జీవితం గడుపుతూ ఇంతవరకు ప్రపంచంలో ఎవరూ చేయనంత పెద్ద మొత్తంలో ముప్పయి బిలియన్‌ డాలర్లను దానం చేస్తూ…ధనవంతులపై విపరీతంగా టాక్స్‌ పెంచి పేదలను టాక్స్‌ నుండి విముక్తం చేయమన్నాడు. మన లక్ష్యం పేదవాని అభ్యున్నతి”.
”…..” కొద్దిసేపు మౌనం తర్వాత…”కొద్దిగా టీ తాగుదామా..క్యాథీ విల్‌ యు కైండ్లీ అరెంజ్‌ సం టీ ఫరజ్‌…” అన్నారు రామం చొరవగా.
బాంబు పేలుడు ఉదంతం నుండి రామం టీ తాగలేదని అందరికి తెలుసు. అతను కోలుకుని స్వయంగా టీ అడగడం ఎందుకో అందరిని ఆనందపర్చింది.
ఓ ఐదునిముషాల్లో టీ వచ్చింది.
క్యాథీ అందరికి టీ ని స్వయంగా కప్పుల్లో వంచి అందించి ప్రేమగా ఓ కప్పును రామంకు కూడా ఇస్తూ, అతని కన్నుల్లోకి చూచింది లిప్తకాలంలో.
అతని కన్నుల నిండా పొంగిపొర్లే కృతజ్ఞత.
”సర్‌..ఐతే…అందరి అప్లికేషన్స్‌ను మీరు కలిసి పరిశీలన చేయండి. ఎల్లుండి ఫైనలైజ్‌ చేసి కమ్యూనికేట్‌ చేద్దాం..శివా..ఫైనల్‌గా నిలుస్తున్న వాళ్ల గురించి మన గూడాచారి విభాగంతో సమగ్రంగా అధ్యయనం చేయించు. ఎక్కడా మనంతట మనం నిర్ణయం తీసుకోవద్దు. నామినేషన్స్‌ విత్‌డ్రా డేట్‌ తర్వాత మన విస్తృతమైన అన్ని నియోజక వర్గాల పర్యటనను ఫిక్సప్‌ చేయ్‌…సంగ్రామం థ ప్రారంభమైంది…”
కుర్చీలో నుండి మెల్లగా, ఆయాసంగా లేచి నిలబడ్డాడు రామం. వెంటనే చటుక్కున క్యాథీ అతన్ని పొదివి పట్టుకుంది.
కారులోకి ఎక్కి వెనక్కి చేరగిలపడ్తున్న రామంకు…కారు కదుల్తుండగా ఎందుకో శివ చెప్పిన లీల విషయం గుర్తొచ్చింది..ఢిల్లీలో పదిహేనంతస్తుల హోటల్‌ గదిలోనుండి కిందికి దూకి మరణించండం…
ప్రొద్దున తను ఇంట్లో నుండి బయల్దేరే ముందు ఎన్నో రోజుల నుండి చెక్‌ చేసుకోకుండా ఉండిపోయిన ఈమెయిల్స్‌ని తన లాప్‌టాప్‌లో పరిశీలిస్తుండగా ఆ రోజే కావచ్చు…చనిపోవడానికి కొద్ది గంటలకు ముందు తనకు డిస్పాచ్‌ చేసిన మెయిల్‌ జ్ఞాపకమొచ్చింది.
”రామం..ఈరోజు వాషింగ్టన్‌ డి.సి. ఏర్‌పోర్ట్‌ ఫస్ట్‌క్లాస్‌ లాంజ్‌లో..నాతో నువ్వున్నావు..లీలా, నీకు పద్మవ్యూహంలోకి ప్రవేశించడం తెలిసింది. ప్రవేశించి భీకరంగా , వీరోచితంగా యుద్ధం చేస్తున్నావు. కాని కావాలనుకున్నప్పుడు పద్మవ్యూహం నుండి నిష్క్రమించడం నీకు తెలియదు. అయితే విషాదమేమిటంటే నిష్క్రమించడం తెలియదనే విషయం కూడా నీకు తెలియదు..నిజం రామం..పద్మవ్యూహ నిష్క్రమణ నాకు తెలియలేదు. నేను నక్షత్రాణ్ణి కాను. తారాజువ్వను. కాంతివంతంగా క్షణకాలం వెలిగి తప్పనిసరిగా నేలరాలిపోతాను…నీకు ఏమీ కాలేకపోయిన..లీల”.
రామం కళ్లలో సన్నని కన్నీటి పొర  ఏర్పడి హృదయం భారమైంది.
అప్పుడతనికి ఎక్కడ్నుండో ఆరుద్ర గీతం…’ప్రాప్తమున్న తీరానికి పడవ చేరిపోయింది.’ గీతం వినబడ్తోంది..సన్నగా..లీలగా.

32

26

సురేఖ దిగ్గున ఉలిక్కిపడి…మెలకువ వచ్చి ఎదురుగా ఉన్న గోడ గడియారం దిక్కు చూచింది.
సమయం ఉదయం నాలుగ్గంటలు    ప్రక్కనున్న పక్కను చూచుకుంది. మున్సిపల్‌ వర్క్‌ ఇన్స్‌పెక్టర్‌ భర్త బాలకృష్ణ యింకా ఇంటికి రాలేదు. ప్రక్కన ఇద్దరు పిల్లలు…రమ్య నాలుగేళ్లు, బాబు కృష్ణ ఏడాదిన్నర…ఇద్దరూ అదమరచి నిద్రపోతున్నారు.
రాత్రంతా గడిచిపోతోంది. ఇతనింకా రాడేమిటి…ఎక్కడ ఎవన్తో తాగి, ఏడ తందనాలాడ్తున్నాడో…అసలే మున్సిపాలిటీ చెత్త..కంపు.
‘అమ్మచెప్పింది స్త్రీకి రెండు జీవితాలని
ఒకటి ఇక్కడ…మరొకటి అక్కడ
కాని అమ్మ చెప్పలేదు స్త్రీకి మరణాలెన్నో’
ఇంటర్‌ ఫెయిలై, వీడు…ఈ బాలకృష్ణ అనబడే డిప్లమో ఇంజనీర్‌..మున్సిపల్‌ వర్క్‌ ఇన్‌స్పెక్టర్‌గాణ్ణి తన తండ్రి మూడు లక్షలకు కొని మెడకు ఆవుమెడలో మొద్దులా కట్టి సంసారంలోకి పంపితే…మొదటి రోజు…శోభనపు రాత్రే తెలిసింది…వాడు పరమ పచ్చి తాగుబోతు..లంచగొండి వెధవ…అవినీతిపరుడు…సర్వ దుర్లక్షణాలూ మూర్తీభవించినవాడు.
కాని ఏం జేయగలదు తను…కిక్కుమనకుండా కాపురం చేస్తూ…భరిస్తూ..,
యిద్దరు పిల్లలు…రమ్య, బంగారు బొమ్మ…కాని చెవులు వినపడవు…కొడుకు కృష్ణ..మూగ..మాటలురావు.
భర్త బాలకృష్ణ…మున్సిపల్‌ రోడ్లు వేయించి, కాలువలు కట్టించి, కల్వర్టులు కట్టించి, బాక్స్‌ డ్రాయిన్‌లలో పూడికలు తీయించి…పైప్‌లైన్‌లు, వాటర్‌ పైప్‌లు…కాంట్రాక్టర్‌లు…వీడు…బిల్లులు..కాంట్రాక్టర్‌…కమీషన్లు..రాత్రిదాకా ఎవడో తాగిస్తే పీకలదాకా తాగి…ఊగుతూ, తూగుతూ…ఎప్పుడో రాత్రి రెండు గంటలకు…చేతిలో మల్లెపూలు.. నోట్లో విస్కీ కంపు…జేబులో కొన్ని నోట్ల మడతలు..
ఏమిటిది…వర్క్‌ ఇన్స్‌పెక్టర్‌…జీతం నాల్గువేల రెండు వందల యాభై…
కాని ఇంట్లో కలర్‌ టి.వి., ఫ్రిజ్‌., హీరోహోండా మోటార్‌ బైక్‌..స్వంత ఇల్లు…ఈ మధ్య వింటున్నది ఎక్కడో రెండో సెటప్‌…ఏమిటిదంతా…
పాపం….పాపం…లంచాలు…దోపిడీ..,
”వద్దండీ ఈ పాపపు డబ్బు…పిల్లలు చూడండి ఈ పాప ఫలితంగా ఎలా మూగ, చెవుడు”
‘చెంప చెళ్లు…గూబ గుయ్యి’
అదంతే…యిదంతే…వీడు మానడు…వీడు మారడు.
ప్రక్కనున్న సెల్‌ మ్రోగింది. సమయం సరిగ్గా నాల్గూ ముప్పయ్యయిదు.
”హలో”
”ఏయ్‌..తలుపు తియ్యవే..” మాట ముద్ద ముద్ద….తూలి తూలి.
తలుపు తీస్తే…ఎదురుగా మనిషిరూపంలో ఓ పశువు…విస్కీ కంపు…ఉల్లిపాయల వాసన.
”ఎంతసేపే నీయవ్వ…మొద్దు నిద్రపోతానవా…”దబాయింపు.
”ఏంరా ఒళ్లు బలిసిందా..రాత్రంతా నిదురపోక ఇద్దరు పిల్లల్నేస్కోని ఎదురు సూత్తాన…పోరికి జ్వరంతో ఒళ్లు కాలిపోతాంది. ఎవడో పోయిస్తే గుద్దబల్గ తాగిందిపోయి నకరాల్‌ చేస్తానావ్‌…మూస్కో”
”ఏందే మాటల్‌ బాగత్తానై”
”…..”తమాయించుకుంది సురేఖ.
”గా జేబుల నాల్గువేలున్నై తీయ్‌…”
”ఎక్కడియీ నాల్గువేలు…”
”ఎవడో యిచ్చిండు నీకేందే…చెప్పినట్టు చేయ్‌….తీసి లోపల దాయ్‌…” గదమాయింపు.
”పాపపు ముండాకొడ్కా…గీ పాపపు సొమ్ము చేయబట్టే నా పిల్లల మాట పాయె, చెవుల్‌పాయె..ఎందుకురా….వద్దంటే ఇనవుగదరా…లంచగొండి ముండకొడ్కా…”బాలకృష్ణ చొక్కా గల్లా పట్టుకొంది సురేఖ.
”పా….బైటికి పా…గీ పాపపు సొమ్ము నా యింట్లద్దు. గా జనసేన పోరగాండ్లు నెత్తి నోరుపెట్కొని ఒర్రుతాండ్లుగాదురా….లంచం వద్దు…అవినీతి వద్దు అని…చదువుకున్నవో సిగ్గుశరం లేదు…పో..బైటికి పో…లంచం తీసుకుంటే నా యింట్లకు రావద్దు…పో ముండకొడ్క…” బాలకృష్ణను బైటికి వీధిలోకి నెట్టి లోపల్నుండి తలుపులుగొళ్లెం వేసుకుంది సురేఖ.
ఎందుకోగాని ఆమెకు పిచ్చి ఆనందం….తృప్తికలిగాయి.
ప్రతిఘటించి..తను ఒక ప్రశ్నగా మారినందుకా….?

***

ఇంజనీరింగు రెండవ సంవత్సరం చదువుతున్న మాధవికి మూడు రోజులుగా కంటికి కునుకు లేదు.
ఆమెకు అవమానంగా ఉంది. సిగ్గుగా ఉంది. నలుగుర్లో తలెత్తుకోలేకుండా ఉంది. చాలా అసహనంగా,కోపంగా, అసహ్యంగా కూడా ఉంది.
ఎవరిపైనా…ఎందుకు….?
రెండ్రోజుల క్రితం తన తండ్రి ప్రముఖ ప్రొఫెసర్‌ రాంనివాస్‌ కొప్పుల…ఎమ్సెట్‌ కన్వీనర్‌..ఎంతో పెద్ద విద్యావేత్త… ముప్పయ్‌ రెండేళ్ల సర్వీస్‌….ప్రతిష్టాత్మకమైన ఎమ్సెట్‌ పరీక్షలకు సాధికారికంగా రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించవలసిన గురుతర బాధ్యత.
కాని ఏంచేశాడు…పరీక్ష ప్రారంభమైన అరగంట లోపే రాష్ట్ర వ్యాప్తంగా గగ్గోలు. ఇంజనీరింగు పేపర్‌ లీక్‌…జిరాక్స్‌ కాపీలు…పంపకాలు…డబ్బులు…వేటలు….కట్టలు కట్టలు..చేతులు మారటాలు..
తనకు ముందురోజే డౌటొచ్చింది…యింటికి ఎవరెవరో ఏవో వేళకాని వేళల్లో కార్లలో… మోటార్‌బైక్‌లపై..బ్రీఫ్‌ కేస్‌లు….డబ్బు వాసన…ప్రైవేట్‌ కార్పొరేట్‌ కాలేజ్‌ల వాసన…ఏదో గుసగుస…వ్యాపారం.
బెడిసిందెక్కడో…పేపర్‌ లీక్‌..ద్రోహచర్య బట్టబయలు…
నాన్న అరెస్ట్‌…లాకప్‌…కస్టడీలోకి తరలింపు…విచారణ.
ఎమ్సెట్‌ పరీక్ష వాయిదా..మళ్ళీ నిర్వహించేందుకు ప్రభుత్వ అంగీకారం.,
కాని లక్షలమంది విద్యార్థుల మానసిక స్థితి…టెన్షన్‌,…వాళ్ల ఉద్వేగాలు…ఎవరి తప్పు…ఎవరు బలి…ఎవరి నేరం…ఎవరికి శిక్ష.
మాధవికి చాలా అసహ్యంగాఉంది తన తండ్రిపై…అవినీతి పనులు చేస్తుంటే వాడితో కలిసి కాపురం చేస్తూ పాపపు డబ్బుతో కులుకుతున్న అమ్మపై…తమ ఇంట్లోనే ఉంటూ డిఎస్పీ హోదాలో ప్రతినిత్యం ఎందరినో యింటికి రప్పించుకుని కట్టల క్కట్టలను లంచంగా స్వీకరించే తన చిన్నాన్నపై…వారి లంచం డబ్బుతో స్లీవ్‌లెస్‌ జాకెట్టు వేసుకుని జులాయిగా తిరిగే చిన్నమ్మపై…అందరిపై..తన కుటుంబ సభ్యులందరిపై.
కాని..ఎలా….ఎలా..దీన్ని పరిష్కరించాలి.
”మాధవీ….మీ నాన్నేనట గదా…నిన్నటి ఎమ్సెట్‌ పేపర్‌ లీక్‌…”
ప్రశ్నలు-ప్రశ్నలు-తలదించుకుని నడవడాలు…సిగ్గుతో కుచించుకుపోవడాలు’
‘నాన్నా నీకు ఈ కుక్క బుద్దెందుకు…నీకున్నది ఒక్కగానొక్క కూతుర్ని నేనే.. అసలు నీ దగ్గరున్న నీ డబ్బే నీకు ఎక్కువ…యింకా మందికొంపలు ముంచే ఈ దొంగ డబ్బెందుకు. పైగా పవిత్రమైన అధ్యాపక వృత్తిలో ఉన్న విద్యావేత్తవు…తగునా యిది. నీకు సిగ్గెందుకు లేదు…బుద్దెందుకు లేదురా ఓ దుర్మార్గపు, ఛండాలపు నాన్నా”
ఎన్నట్నుండి డిఎస్పీ చిన్నాన్న..యింకెవడెవడో ఒకటే హైరాన పరుగులు….అటురుకు..యిటురుకు..ఎవరికో ఫోన్‌ చేయ్‌..ఎవడ్నో బతిమాలు…
తెలుసు తనకు …నాన్న అనబడే వీడికి ఈ దౌర్భాగ్యపు దేశంలో ఏ జడ్జో అమ్ముడుపోయి బెయిలిస్తాడు. మళ్లీ వీడు బాజాప్తాగా యింటికి తిరిగొస్తాడు.
అందుకే కసిగా…దుఃఖంగా.. అసహ్యంగా…పరమ క్రూరంగా ఎదురుచూస్తోంది మాధమి మూడు రోజుల్నుండి… నిద్రాహారాలు మాని లోలోపల కుమిలిపోతోంది.
సరిగ్గా..తెలతెల్లవారుతుండగా…ఉదయం ఐదున్నర-ఓకారు యింటి ముందు ఆగి ఓ తలుపు రెక్క తెరచి…లోపల్నుండి ప్రొఫెసర్‌ రాంనివాస్‌ కొప్పుల బెయిల్‌పై విడుదలై దిగి నిస్సిగ్గుగా యింటికి చేరుతూ
మెరుపులా…రేచుకుక్కలా ఉరికొచ్చింది మాధవి తండ్రి పైకి…చేతిలో డిఎస్పీ డెన్మార్క్‌ పిస్టల్‌ క్షణంలో బుల్లెట్ల వర్షాన్నికురిపించి…
శరీరం తూట్లు, తూట్లు…గావుకేక…మరుక్షణం నిశ్శబ్దం.
లక్షల మంది విద్యార్థుల జీవితాల ట్రాజడీ సంగతేమిట్రా తండ్రి బాస్టర్డ్‌…ఎన్ని జనసేనలొస్తే, మార్తారురా మీరు ముండాకొడ్కుల్లారా…బుద్దిరాని, బుద్ది లేని దరిద్రుల్లారా చావండి…” మాధవి శపిస్తోంది.
ఎదురుగా ఎర్రగా రక్తం…మధ్య ప్రశ్న ఆకారంతో రాంనివాస్‌ శవం.
మాధవి నేలపై మోకాళ్ల మీద కూర్చుని పిస్తోలు అలాగే చేతిలో ఉండగా ఘొల్లున ఏడుస్తోంది.
ఎందుకు….?

***

ఎప్రిల్‌ పదమూడో తేది…ఉదయం పదకొండు గంటలు.
వరంగల్లు నగరం…జనసేన ‘కేంద్రకం’. కార్యాలయంలో ఓ వెల్లివిరుస్తున్న పండుగ..నగరం నిండా రోడ్లపై ఎక్కడ బడితే అక్కడ జనం సంబరాలు…మిఠాయి పంపకాలు. బాణసంచా కాల్చడాలు..మైకుల్లో జనసేన పేద, సాధారణ కార్యకర్తల చైతన్య గీతాలు…ఒక నూతన ఉత్సాహం…విజయ మహోద్వేగం.
రాత్రి పొద్దుపోయే దాకా శాసనసభా స్థానాల ఫలితాల ప్రకటన కొనసాగుతూనే ఉంది. తెల్లవారగానే పెద్ద పెద్ద పతాక శీర్షికలతో దినపత్రికలు.
‘నూతన శకారంభం..’
‘భారత చరిత్రలో ఓ కొత్త మలుపు’
‘ప్రజల విజయం…అవినీతి అంతం’
‘మరో కొత్త చరిత్ర…జనసేన చారిత్రాత్మక విజయం’
టి.వి.లు…..మేధావుల చర్చలు…విశ్లేషణలు…అంతటా కోలాహలం.
”రెండు వందల ఎనభై రెండు స్థానాల్లో జనసేన అభ్యర్థుల తిరుగులేని విజయం-ఓడిపోయిన అభ్యర్ధులందరి డిపాజిట్లు గల్లంతు”
బ్రేకింగు న్యూస్‌
‘ప్రజల స్వప్నం సాకారమైన వేళ’
‘ఒక చీకటియుగం ముగిసింది. ప్రజల విజయంతో ఒక కొత్త అధ్యాయం ప్రారంభం’
‘అప్పులు లేని…దోపిడీ లేని స్వచ్ఛమైన పాలనకు హామీ’
‘ఒక నూతన రాజకీయ సంస్కృతికి రూపకల్పన’
ఎన్నో ఆశలు..ఎన్నో అంచనాలు..ఎన్నో కలలు.,
రాత్రికి రాత్రి రాష్ట్రం నలుమూలల నుండి స్వతంత్ర అభ్యర్థులుగా, జనసేన ఆమోద ముద్రతో, జనసేన హామీపై గెలిచిన రెండువందల ఎనభై రెండు మంది శాసనసభ్యులను జనసేన రక్షక దళాలు ప్రాణ సమానంగా కార్లలో తీసుకుని వచ్చి ‘కేంద్రకం’లో హాజరుపర్చాయి.
లేలేత ఎండ…విశాలమైన ప్రాంగణం…నిండా పచ్చని గడ్డి…చెట్లు…పూల మొక్కలు…అంతటా క్రమశిక్షణ నిండిన వ్యక్తుల కదలికలు.
సెంట్రల్‌ హాల్‌లో నూతన సభ్యులందరూ తమ తమ కుర్చీల్లో ఆసీనులయ్యారు. వెంటనే ఉద్వేగ భరిత క్షణాల మధ్య వేదిక పైకి నలుగురు వ్యక్తులు ప్రవేశించారు. రామం,క్యాథీ, డాక్టర్‌ గోపీనాథ్‌, మూర్తి గారు..ఎటువంటి అట్టహాసం లేకుండా.
అప్పటికే శాసనసభ్యులందరికీ జనసేన తరపున శుభాకాంక్షల లేఖలను, పుష్ప గుచ్ఛాలను పంపిణీ చేయించాడు శివ.
మైక్‌లో డాక్టర్‌ గోపీనాథ్‌ మాట్లాడ్డం ప్రారంభించారు…’మిత్రులారా మీకందరుకు జనసేన పక్షాన మరోసారి విజయ శుభాకాంక్షలు. జనసేన అతి తక్కువగా మాట్లాడ్తుంది. ఎక్కువగా పనిచేస్తుంది. ఆ పరంపరలో భాగంగా మన జనసేన వ్యవస్థాపకులు రామం మీకు శుభాకాంక్ష సందేశం వినిపిస్తారు. తర్వాత కొత్తగా ఎన్నుకోబడ్డ మొత్తం శాసనసభ్యులు పన్నెండు బస్సుల్లో మన జనపథం ప్రాంగణం నుండి హైద్రాబాద్‌ శాసనసభా ప్రాంగణానికి వెళ్తారు. అక్కడ లాంఛనంగా గవర్నర్‌ గారిని కలిసి తదుపరి నూతన ప్రభుత్వ నిర్మాణ కార్యాన్ని నిర్ణయించుకుంటారు. అని చెప్పి కూర్చుని..
రామం నిలబడ్డాడు. నిశ్శబ్దంగా, వినమ్రంగా రెండుచేతులా జోడించి అందరికీ నమస్కరించి.,
”మిత్రులారా..మీ అందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు..జనసేన ఆమోదముద్రతో పోటీ చేసిన అందరూ గెలిచారు. ఒక్కరు కూడా ఓడిపోలేదు. పైగా ప్రత్యర్థుల డిపాజిట్లు గల్లంతయ్యేంత భారీ మెజార్టీతో గెలిపించారు. అంటే ‘జనసేన’ ఆలోచనలను, విధానాలను ప్రజలు ఎంతగా విశ్వసిస్తున్నారో, మనమీద ప్రజలు ఎన్ని ఆశలు పెట్టుకొన్నారో సృష్టమవుతోంది. ఒకటే మీకు వినమ్రంగా విన్నవించుకుంటున్నాను…మనం..మనందరం ప్రజల ఆకాంక్షల మేరకు పనిచేద్దాం. ఒక కొత్త చరిత్రను, నీతిమయమైన భవిష్యత్తును నిర్మిద్దాం. భారతదేశంలో మొట్టమొదటిసారి ఒక ”ఇండిపెండెంట్స్‌ రూల్డ్‌ స్టేట్‌” పరిపాలనలోకి రాబోతోంది. దేశం, ప్రపంచం యావత్తూ ఎంతో ఆసక్తిగా మన పనితీరును పరిశీలిస్తోంది. జాగ్రత్తగా ప్రగతి పథంలో అడుగులు వేద్దాం కలసికట్టుగా.
మేము…జనసేన సారథ్య సంఘ సభ్యులం నల్గురం నాల్గు దిక్కులమై, లక్షమంది కార్యకర్తలు మీ చుట్టూ ఒక వలయమై కవచమై అన్నీ పదవులకూ, అధికారాలకూ అతీతంగా ప్రజల పక్షాన మిమ్మల్ని డేగ కళ్లతో గమనిస్తూనే ఉంటాం. యిచ్చిన మాట ప్రకారం నిజాయితీగా పనిచేసి ప్రజల రుణం తీర్చుకోండి…జైహింద్‌”.
చప్పట్లు…కొద్దిసేపు.
అందరూ ఒకరి వెంట ఒకరు క్రమశిక్షణతో బయటికి ఆవరణలోకి వచ్చి కార్యకర్తలు సూచించిన స్థానాల్లో నిలబడ్డారు.
ఎదురుగా అరుగుపై రామం, క్యాథీ, గోపీనాథ్‌, మూర్తిగారు…శివ…నిలబడి.,
ముందు…అందంగా అలంకరించిన గద్దెపై జెండాకర్రకు కట్టిన మువ్వన్నెల జెండా.
”మూర్తిగారిని మన జాతీయ జెండాను ఆవిష్కరించవలసిందింగా ప్రార్థిస్తున్నాను” అన్నాడు రామం.
నాల్గడుగులు ముందుకు నడిచి..సీనియర్‌ పాత్రికేయుడు ‘అగ్ని’ వార్తా ఛానెల్‌ అధినేత మూర్తి పులకించిపోతూ జాతీయ జెండాను నూలు తాళ్లు లాగి  వినీలాకాశంలోకి ఎగరేసి…
భారత పతాక ఒక చారిత్రాత్మక నూతన అధ్యాయానికి ప్రతీకగా…గర్వంగా, ధీమాగా ఉజ్జ్వలంగా ఎగుర్తూండగా..
”వందేమాతరం…” గీతాలాపన ప్రారంభించింది స్వయంగా క్యాథీ, బిల్టిన్‌ మైక్రోఫోన్‌లో.
వందలమంది చేతులు దేశంపట్ల భక్తిప్రపత్తులతో జాతీయ పతాకానికి వందనం చేస్తూ,
అందరి కళ్లలోనూ ఓ బంగారు రంగు కల…ముత్యమంత ఆశ…కొండంత ఆత్మవిశ్వాసం…ఓ సుదీర్ఘ అవిశ్రాంత నిరంతర ప్రయాణం వైపు చూపు.

***

అప్పుడు…ఆ క్షణం,
‘అగ్ని’ టి.వి.చానల్‌లో ఆ రోజు ‘రాజకీయ ముఖచిత్రం’ అనే అంశాన్ని ముగ్గురు వ్యక్తులు విశ్లేషిస్తున్నారు.        ఒకరు…ఆబిడ్స్‌లో ఫుట్‌పాత్‌పై అరటిపళ్లమ్మే యాకూబ్‌, మరొకరు..సికింద్రాబాద్‌, అంబాసిడర్‌ లాడ్జ్‌లో పనిచేసే బాయ్‌ మల్లేశం, ఇంకొకరు…ఓల్డ్‌ సిటీ మక్కా మసీద్‌ దగ్గర కంకులు కాల్చి అమ్మే యాకమ్మ.
యాంకర్‌ ఆనందరావు అడుగుతున్నాడు. ”ఈ పెనుమార్పును మీరెలా అర్థం చేసుకుంటున్నారు”
అరవై ఆరేళ్ల యాకమ్మ మాట్లాడ్తోంది..ఉద్వేగంగా.

( సమాప్తం)

Download PDF

3 Comments

  • Dr.padmaja says:

    ఈ నవల ముగింపు..ఇక్కడ భారతదేశంలో,తెలంగాణాలో,ఆంధ్రప్రదేశ్ లో నూతన ప్రభుత్వాలు ఏర్పడుతున్న సందర్భం యాదృఛ్చికంగా కలియడం..చాలా చిత్రంగా ఉంది.ఈ రూపుదిద్దుకోబోతున్న కొత్త ప్రభుత్వాలు ఎలా ఉండాలి..ప్రజలపట్ల..బాధ్యతలపట్ల..ప్రజా విలువల పట్ల ఎలా నడచుకోవాలో విపులంగా చర్చించిన ప్రయోజనాత్మక నవల ఇది.రామా చంద్రమౌళి గారు సశాస్త్రీయంగా ప్రజా వ్యవస్థ యొక్క భావన,నిర్మాణం,వృద్ధి,విస్తరణ,కొనసాగింపు వంటి సంగతులను శక్తివంతంగా ఈ నవలలో సృజించారు. ఆయనకు ప్రత్యేక అభినందనలు.దాదాపు ఇరవై వారాలు సంస్కరణవాదులైన నావంటి పాఠకులను ఈ నవల అలరించింది.ఆలోచింపజేసింది. సంపాదకులుకూడా ఏదో కాలక్ష్జేప నవలను కాకుండా ఒక ప్రామాణికమైన మంచినవలను అందించారు.వాళ్ళకూ అభినందనలు.
    డా.ఆర్.పద్మజ.న్యూయార్క్

  • prof b indira says:

    ప్రతి స్వప్నం ఒక నూతన ఆరభం…ఒక సామాజిక స్పృహ తో కూదిన స్వప్నం…రాజకీయ, సామాజిక ప్ర్క్షాలనకి శ్రీకారం…అంకురార్పాన్ రచయితా బాధ్యత… శుభారంభం…ఎక్కడో, ఎప్పోడూ తప్పనిది…తప్పించుకూలీనిది…ఆశ…ఆశయం…ఆరంభం…

  • karuna says:

    పత్రిక వారికి ధన్యవాదములు ….కృతజ్గతలు……దాదాపు మూడు ,నాలుగు దశాబ్దములు గా అనేక రంగాల్లో ,ముఖ్యం గా రాజకీయ రంగంలో పాదుకుని కొనసాగుతున్న అవినీతి అక్రమం పై …ఆవేదన వ్యక్తం చేస్తూ … ..రచయిత …,.జనసేన పార్టీ ..రామం పాత్ర ద్వారా సమర్థవంతం .గా ఆచరణాత్మకం గా పరిష్కరించు కోవచ్చ్చు అన్న ఆశావహ దృక్పధం తో తన బాద్యత గా ఈ నవలను ఈ నాడు మనకు అందివ్వడం .హృద్యం….

Leave a Reply to Dr.padmaja Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)