ఆనాటి పండిత చర్చలు: పెండ్యాల వర్సెస్ శ్రీపాద, వారణాసి

కల్లూరి భాస్కరం

కల్లూరి భాస్కరం

 

కాలంలో ఒకసారి ఎనభయ్యారేళ్ళ వెనక్కి వెడదాం…

తూర్పు గోదావరి జిల్లా పిఠాపురానికి చెందిన పెండ్యాల వేంకట సుబ్రహ్మణ్య శాస్త్రి గారు 1928లో ‘మహాభారత చరిత్రము’ అనే పేరుతో ఒక పుస్తకం వెలువరించారు. 1928-33 మధ్యకాలంలో అది రెండు ముద్రణలు పొందింది. 1991లో ఏటుకూరు బలరామమూర్తిగారి పరిచయవాక్యాలతో విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్ దీనిని పునర్ముద్రించింది. ఆ ప్రతి నా దగ్గర ఉంది.

అప్పట్లో ఈ పుస్తకం ఒక సంచలనం అన్న సంగతి రచయిత, ఇతరులు రాసిన ముందు మాటలను బట్టి అర్థమవుతుంది. మహాభారతాన్ని చారిత్రక దృష్టినుంచి, హేతు దృష్టినుంచి చర్చించిన ఈ పుస్తకంపై తీవ్ర ఖండనలు వెలువడ్డాయి. దీనిపై ఖండన తీర్మానాలు చేయడానికి పలు చోట్ల పండిత సభలు కూడా జరిగాయి. ఈ పుస్తకాన్ని ప్రప్రధమంగా ఖండించిన వారిలో ప్రసిద్ధులు శ్రీపాద కృష్ణమూర్తిశాస్త్రిగారు. ఆయన మహాభారతాన్ని తెలుగులోకి అనువదించిన కవి కూడా. పెండ్యాల-శ్రీపాదవార్ల వివాదం చివరికి కోర్టుకు ఎక్కి, ఏడాది- ఏడుమాసాలపాటు కేసు నడిచింది. రాజమండ్రిలోని ఆనరరీ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేటు ఇద్దరికీ ఇరవై రూపాయల వంతున అపరాధ రుసుము విధించారు. కృష్ణమూర్తిశాస్త్రిగారు రెండుసార్లు తన సాక్షులను ప్రవేశపెట్టని కారణంగా పెండ్యాల వారికి పన్నెండు రూపాయలు నష్ట పరిహారం ఇవ్వాలని కూడా మెజిస్ట్రేటు తీర్పు చెప్పారు.

పెండ్యాలవారి రచనను ఖండిస్తూ 1948-49 ప్రాంతంలో ఆరు సంపుటాలుగా మరో రచన వచ్చింది. దానిపేరు ‘మహాభారత తత్త్వ కథనము’. ఈ గ్రంథ రచయిత వారణాసి సుబ్రహ్మణ్యశాస్త్రిగారు. ఈయన కూడా పిఠాపురం వాస్తవ్యులే. వీరిద్దరూ తమ వాదోపవాదాలు వినిపించడానికి అప్పట్లో పండితుల మధ్యవర్తిత్వంలో సభలు కూడా జరిగాయి. అది కూడా ఆసక్తి గొలిపే ఓ ముచ్చట. దానినలా ఉంచితే, 2003లో ‘మహాభారత తత్త్వ కథనము’ రెండు సంపుటాలుగా పునర్ముద్రణ పొందింది. ఆ సంపుటాలు నా దగ్గర ఉన్నాయి.

స్వవిషయం అనుకోకపోతే పాఠకులతో ఒక విషయం పంచుకోవాలనిపించింది. అది నా ‘జన్యు’ లక్షణాన్ని మరోసారి గుర్తుచేసిన విషయం కూడా.

ఈ వ్యాసం ప్రారంభించేముందు పెండ్యాలవారి ‘మహాభారత చరిత్రము’ తిరగేస్తుంటే దీనిపై మా నాన్నగారు కల్లూరి వేంకట సుబ్రహ్మణ్య దీక్షితులుగారు నమోదు చేసిన తన స్పందన వాక్యాలు కనిపించాయి. ఇంతకుముందు కూడా వాటిని చూశాను కానీ అంత పరిశీలనగా చూడలేదు. ఇప్పుడు చూసినప్పుడు ఆశ్చర్యమనిపించింది. బహుశా ఈ సందర్భానికి అవి తగినట్టు ఉండడం వల్ల కావచ్చు.

ఈ వ్యాసపరంపర ప్రారంభంలో మా నాన్నగారి గురించి రాశాను. ఆయన సంస్కృతాంధ్రాలలో కావ్యాలు రాసినవారు. పద్దెనిమిది పురాణాలను తెలుగు చేసినవారు. పండితులుగా ఆయన సంప్రదాయవర్గానికి చెందినవారే. ఏదైనా పుస్తకం చదివినప్పుడు అందులోని లోపలి పేజీలపై తన స్పందన నమోదు చేయడం ఆయనకు అలవాటు. ‘మహాభారత చరిత్రము’పై ఆయన స్పందన ఇలా ఉంది:

“పరమాద్భుత గ్రంథమిది. పూర్తిగా చదివాను. పూర్ణ సంఖ్య 9/9/98”

“చాలా లోతుపాతులు చూచి చక్కగా రూపొందింపబడినదీ రచన”

“(పెండ్యాల వేంకట సుబ్రహ్మణ్యశాస్త్రి) ఈయన నివాసము, ఎడ్రస్సు, ప్రస్తుత ఎడ్రస్సు ఏమో? తెలుసుకోవాలి”

“ఇది చేతనుంచుకొని మహాభారతము సవిమర్శముగా చదివి చెప్పాలి”

“శ్రీపాద కృష్ణమూర్తి శాస్త్రి గారి అనువాదం కూడా దీనితో జోడించి మరల చదవాలి”

“రాజసూయ విధానము, అశ్వమేధ విధానము పూర్తిగా పరిశీలింపబడిన గ్రంథము”

“వీరి పరువునష్టం దావా రికార్డు రాజమండ్రిలో సంపాదించాలి. ఆ కాగితాలు చాలా అవసరం”

పెండ్యాలవారు తమ పుస్తకం రెండోముద్రణకు రాసిన ఉపోద్ఘాతం చివరిలో,‘చదువరులకు ఒక మనవి’ అనే ఉప శీర్షిక కింద ఇలా రాశారు:

“నేను రాసిన విమర్శనాంశములలో బెక్కులు నాకు తెలియని తప్పులుండవచ్చును. భాషా స్ఖాలిత్యముండవచ్చును. ఎంతగా బరిశీలించినను ముద్రణస్ఖాలిత్యము లనివార్యములు. అభిప్రాయభేదము లనివార్యములే. అందులకని నన్ను దూషింపకుడని వేడుచున్నాను. నిజమగు తప్పులను సవరించుకొనుట కెప్పుడును వెనుదీయను. అభిప్రాయభేదములే లేకుండిన ‘ప్రస్థానత్రయ’మునకు ‘ద్వైతాద్వైతవిశిష్టాద్వైత’ భాష్యము లేల కలుగును? అట్లే భారత గాథా విశేషములపై నాకును నభిప్రాయభేదములున్నవని తలప గోరెదను. విమర్శించి సత్యముం గనుగొనువారికి నా విమర్శనము కొంత సహాయకారి యగుననియు నేరికై నంత గొంత యిది సహాయమొసగిన నందువలన నేను ధన్యుడ నగుదు ననియే నమ్ముచున్నాను. ఓం తత్సత్”

మా నాన్నగారు,‘అభిప్రాయభేదములే లేకుండిన’ అనే వాక్యం నుంచి చివరి వరకు, మార్జిన్ లో ఒక నిలువు గీత గీసి, పక్కనే “ఇది సత్యం, సర్వదా సత్యం” అని రాశారు.

ఈ పుస్తకం ముందు మాటలు తిరగేయడం , నాన్నగారి స్పందన చదవడం నాలో ఒకవిధమైన మెరుపుతీగలాంటి జ్ఞానశకలాన్ని ఆవిష్కరించాయి. అంటే రెవెలేషన్ లాంటిదన్నమాట. భారతరామాయణాలపై సంప్రదాయవిమర్శ ఒక మూసలో ఉంటుందనుకుంటాం. చాలావరకు అది నిజమే కూడా. అయితే సంప్రదాయపండితులందరూ ఒకే మూసలో ఉండరని ఈ పుస్తకం తిరగేస్తున్నప్పుడు అనిపించింది. వాళ్ళలోనూ ఛాయాభేదాలు ఉన్నాయి. మా నాన్న గారే కాక, అలాంటివారు- అంటే సంప్రదాయవాదానికి చెందినప్పటికీ నవీనత్వాన్ని పూర్తిగా నిరాకరించకుండా తెరచిన పుస్తకం లాంటి బుద్ధితో దానిని ఆస్వాదించగలిగినవారు, సంప్రదాయ పరిధిలోనే కొంత హేతుబద్ధంగా, తార్కికంగా ఆలోచించగలిగినవారు ఈ పుస్తకంలో మరికొందరు కనిపిస్తారు. ఎవరివరకో ఎందుకు, పెండ్యాలవారితో ఘర్షణపడి కోర్టుకు కూడా ఎక్కిన శ్రీపాదవారే ఉదాహరణ. ఆయన నవీనత్వాన్ని ఆహ్వానిస్తారని అనలేకపోయినా కొంత స్వతంత్రించి హేతుబుద్ధితో ఆలోచించిన పండితులే.

పెండ్యాలవారే ఇలా రాస్తారు:

“వారు(శ్రీపాదవారు) నా గ్రంథమును నిరాకరింపుచు వ్రాసిన వ్యాసములలోనూ ఆ వ్యాసములన్నిటిని చేర్చి కూర్చిన ‘శ్రీ మహాభారత చరిత్ర నిరాకరణము’ అను గ్రంథములోనూ నేను వ్యాసాదులను నిందించితిననియు బురాణపురుషులను నిందించితిననియు, బెక్కుసారులు నన్ను దూషించిరి. కాని నా పుస్తకమునకు బూర్వమే వారు వ్యాస, భీష్మ, బలరామ, శ్రీరాముల గూర్చి యెట్లు వ్రాసిరో దిగ్మాత్రముగా వ్రాయుచున్నాడను.

కృష్ణమూర్తిశాస్త్రిగారు ‘కురుపాండవదాయభాగ విమర్శనము’న వ్యాసుని గూర్చి యిట్లు వ్రాసిరి.

(1)  “ధర్మశాస్త్రముల మాటకేమిగాని, మహానుభావుడై యడవులలో దపము చేసికొను వ్యాసుడంతవా డిట్టి పాడు పనికీయకొనెనని మన మొప్పుకొనుచున్నప్పుడు రెండు మూడు తడవులకు సందేహించి చర్చింపవలసి యున్నదా?”

అడవులలో దపము చేసికొను వ్యాసుడు రాజాంతఃపురము జొచ్చి ‘అంబికాంబాలికలను దాసిని’ గూడి బిడ్డల గనుట,‘ఒకటి కాదు, రెండు కావు, మూడుసారులు చేసిన పాడుపను’లనియే కృష్ణమూర్తిశాస్త్రిగారి ముఖ్యాభిప్రాయము.(మానవసేవ పత్రిక 1912 ఆగస్టు సంచిక)

భీష్ముని గూర్చి యిట్లు తమ వజ్రాయుధ పత్రిక (1927 సం.రము అక్టోబర్ సంచిక)లో వ్రాసి యున్నారు.

(2)“భీష్ముని మెచ్చుకొనినారు దానికి సంతోషింపవలసినదేకా? భీష్ముని బ్రహ్మచర్యము స్వచ్ఛందమైనది కాదు. తండ్రి కోర్కెం దీర్ప వ్రతంబు బూనెగాని విరక్తుండై కాదు. అది యుత్తమ మన నొప్పదు. భీష్ముం డుత్తమపాత్రమే గాని తాను సమర్థుండై యుండియు నెవరికిం జెప్పవలసినట్లు వారికి జెప్పి యుద్ధము గాకుండం జేయవలయు. అటులం జేయక తానొక పక్షముం జేరి పాండవులతో భండనము జేసినాడు సరే! దుర్యోధనుని యుప్పు దినుచున్నాడట! అందుచేత యుద్ధము జేసినాడనుకొందము. తన చేరిన పక్షమునకు జేటుగా దన చావునకు మార్గము తానే చెప్పి పరులకు లోలోన సలహా నిచ్చినాడు. ఇది స్వామిద్రోహము కాదా? స్వామిద్రోహపాతకము సామాన్యమా?”

(3) “వీరు (గరికపాటి రామమూర్తి గారు) రాముని మాత్ర మవతారపురుషుడని యన్యాయము లేనివాడని వ్రాసిరి. సంతోషమే గాని మాటవరసకుం జెప్పుచున్నాము. రాముడు మహానుభావుడే కదా, లోకవృత్తముతో నవసరము లేక యొకరి జోలికిం బోక యొక యడవిలో గూర్చుండి ముక్కు మూసికొని తపము జేయుచున్న శంబూకుని తల నరికినాడు. ఇది న్యాయమా? వాలి సుగ్రీవులు పోరాడుచుండ జాటునుండి వాలిం దెగవేసినాడు. ఇది న్యాయమా? అగ్నిశుద్ధిం బొందియున్న సీతను సంపూర్ణ గర్భవతిని నరణ్యములకుం బడద్రోసినాడు. ఇది న్యాయమా? (వజ్రాయుధ పత్రిక, సంపుటము 2, సంచిక 9)

(2,3 అంశములు శ్రీ గరికపాటి రామమూర్తి బి.ఎ గారి వ్రాతలను ఖండింపుచు కృష్ణమూర్తిశాస్త్రి గారు వ్రాసినవి)

Files.34

***

శ్రీపాదవారు భీష్ముడి గురించి, రాముడి గురించి ఇలా రాయడమే నమ్మశక్యం కాని ఆశ్చర్యం. శ్రీపాదవారు రాశారని చెప్పకుండా ఇవే వాక్యాలను చూపించి ఇవి ఎవరు రాసుంటారని ఇప్పటి వారిని అడిగి చూడండి, తప్పకుండా ఏ త్రిపురనేని రామస్వామి చౌదరిగారి పేరో చెబుతారు. అంటే, నాటి సంప్రదాయపండితులలోనే కొందరిలో త్రిపురనేని రామస్వామి చౌదరిగారి అంశ కూడా ఉండడం ఎంత విలక్షణం! వ్యాసాదులను, పురాణపురుషులను నిందించారని పెండ్యాలవారిని దూషించిన శ్రీపాదవారే ఆ పని చేయడం ఎలాంటిది? వ్యక్తిగతంగా చెబితే, బహుశా అది ఆయనలోని ద్విధా వ్యక్తిత్వాన్ని(splitpersonality)ని సూచిస్తూ ఉండచ్చు. వ్యవస్థాగతంగా చెబితే, మహాభారత రామాయణాదులు అప్పటికి చాలావరకూ ఆయనలాంటి పండితుల విశేషాధికార పరిధిలోనే ఉన్నాయి. కనుక పండితులు వాటిపై ఎటువంటి వ్యాఖ్యలు, విమర్శలు చేసినా అది పూర్తిగా ‘ఆంతరంగిక’ విషయం. ఈ పండిత సామ్రాజ్యంలోకి ఇతరులు అడుగుపెట్టడంతోనే సమస్య వచ్చినట్లుంది. అందువల్ల కలిగిన అభద్రతా భావం సంప్రదాయపండితవర్గాన్ని ఆత్మరక్షణలోకి నడిపించి, రామాయణభారతాదులకు వారిని కాపలాదారులుగా మార్చివేసి ఉండచ్చు. క్రమంగా కేవలం జబ్బపుష్టి మాత్రమే కలిగిన ‘లుంపెన్ శక్తులు’ ఈ కాపలా బాధ్యతలో పాలుపంచుకోవడం సహజ పరిణామం కావచ్చు.

చెహోవ్ రాసిన ‘గుల్లలో జీవించిన మనిషి’ కథలోలా రామాయణభారతాదులపై పండిత విమర్శ క్రమంగా ఒక గుల్లలో ముడుచుకోవడానికి లోతైన చారిత్రక, సామాజిక, రాజకీయ కారణాలూ ఉండచ్చు. ఇప్పుడంత లోతులోకి వెళ్లద్దు కానీ, ఎమ్మే పిహెచ్ డీలనే మూస పండితులను సృష్టించే యూనివర్శిటీల కార్ఖానా చదువు కూడా ఒకనాటి పండిత సంప్రదాయాన్ని చంపేసిందా అనిపిస్తుంది. నేటి పండితులు గడుసుగా సాంప్రదాయిక సాహిత్యానికి సంబంధించిన వివాదాల జోలికి వెళ్లకుండా అలంకారం, రసం, శిల్పం వగైరా కావ్యసామగ్రికి పరిమితమవడమే చూడండి. తిరుమల తిరుపతి దేవస్థానం ప్రచురించిన ఆంధ్రమహాభారతంలో అది కనిపిస్తుంది. ఆ ప్రచురణ వ్యాఖ్యాతలు నిజంగా వ్యాఖ్యానం అవసరమైన చోట ఎలా మౌనం వహించారో ఇంతకు ముందు ఒకటి రెండు సందర్భాలలో చెప్పుకున్నాం. బహుశా ముందు ముందు కూడా చెప్పుకోవలసి రావచ్చు.

అసలు సామాజిక, రాజకీయ, చారిత్రక పాఠం కూడా అయిన మహాభారతం లాంటి ఒక రచనను పూర్తిగా మత,ఆస్తిక వ్యవస్థ అయిన టీటీడీ ప్రచురించడంలోని ఔచిత్యమేమిటో తెలియదు. అప్పటికే సౌజన్యం, గడుసుదనం అనే సుతిమెత్తని లోహంతో తయారైన ఎమ్మే పండితుల పాళీపై టీటీడీ ప్రచురణ అదనపు అంకుశం. ఇదే ఏ వావిళ్ల వారి ప్రచురణో, తెలుగు విశ్వవిద్యాలయం ప్రచురణో అయితే ఆ దారి వేరు. అప్పటికీ నేటి మన పండితులు స్వతంత్రవ్యాఖ్య చేస్తారన్న నమ్మకం లేదు.

విచిత్రం ఏమిటంటే, సంప్రదాయభిన్నంగా మాట్లాడడానికి ఇప్పుడు ఎన్నో జాగ్రత్తలు తీసుకోవలసివస్తుంటే, సంప్రదాయ వర్గానికి చెందిన శ్రీపాదవారు ఏ జాగ్రత్తా తీసుకోకుండా వ్యాఖ్యానించడం! భీష్ముని గురించి ఆయన అన్న మాటలే చూడండి…నిజానికి భీష్మునిలో ఆయన ఎత్తి చూపిన లోపాలకు సాంప్రదాయిక పాఠం లోనే కావలసినంత సమర్థన ఉంది. ఆదిపర్వం తృతీయాశ్వాసం ప్రకారమే చూస్తే, కురుక్షేత్రయుద్ధం జరిగింది భూభారం తగ్గించడం కోసం. భూదేవి ప్రార్థనపై బ్రహ్మ దేవుడు రచించిన కురుక్షేత్రయుద్ధమనే విశాల వ్యూహంలో,‘భీష్మాది వీరులు దేవదానవ అంశలతో పుట్టి యుద్ధం చేసి మరణించడం’ ఒక భాగం. అప్పుడు బ్రహ్మదేవుని వ్యూహం అనే పెద్ద గీత ముందు; కురుపాండవ శత్రుత్వం, పాండవులకు రాజ్యం దక్కడం, ఆయా పాత్రల లోపాలోపాలు వగైరాలు చిన్న గీతలు అయిపోతాయి. అయినా సరే, మహాభారత అనువాదకులు కూడా అయిన శ్రీపాదవారు స్వతంత్రించి సంప్రదాయభిన్న వ్యాఖ్య చేయడం ఆసక్తికరం.

***

‘మహాభారత చరిత్రము’ రెండవ ముద్రణకు పెండ్యాలవారు రాసిన ఉపోద్ఘాతం, వారణాసివారి ‘మహాభారత తత్త్వకథనము’ చదవడం నిజంగా ఒక తాజాదనాన్ని కలిగించే అనుభవం. మహాభారతాన్ని సంప్రదాయేతర కోణం నుంచి పరిశీలించిన రచనలు కొన్ని పెండ్యాలవారి రచనలకు ముందే వచ్చాయి. కట్టమంచి రామలింగారెడ్డి గారు మద్రాసులోని గోఖ్లేహాలులో ఇచ్చిన మహాభారతోపన్యాసం పెక్కుమంది ఆంధ్రులను భారతంపై దృష్టి మళ్లించేలా చేసిందని పెండ్యాలవారు అంటారు. అప్పటికే రావుబహద్దర్ పనప్పాకం అనంతాచార్యులుగారు, విమర్శకాగ్రేసర కాశీభట్ట బ్రహ్మయ్యశాస్త్రిగారు ‘కురుపాండవ దాయభాగ నిర్ణయము’ల గురించి గ్రంథాలు రాశారు. బ్రహ్మయ్యశాస్త్రిగారి గ్రంథాన్ని ఖండిస్తూ శ్రీపాద కృష్ణమూర్తిశాస్త్రిగారు ‘కురుపాండవ దాయభాగ వినిర్ణయ’మనే గ్రంథం రాశారు. దుర్యోధనుని పక్షంలోనే న్యాయముందని చెబుతూ కోటమర్తి చినరఘుపతిరావు అనే కవి ‘సుయోధన విజయము’ అనే కావ్యం రాశారు. వజ్ఝల చిన సీతారామస్వామిశాస్త్రి గారు సంప్రదాయాభిన్న వివరణతో ‘కర్ణచరిత్రము’ రాశారు. పూర్తిగా సంప్రదాయ పక్షం నుంచి ‘మహాభారత తత్త్వ కథనము’ రచించిన వారణాసివారు ఇలాంటి రచనలను అన్నిటినీ ఖండించారు. ఆర్ష సాహిత్యంపై సాంప్రదాయిక భాష్యం ఎలా ఉంటుందో తెలుసుకోడానికి ఒక ఆసక్తికరమైన ఆధారం వారణాసివారి రచన.

అయినాసరే, భారత రామాయణాదులపై ‘వంగ మహారాష్ట్రాది’ భాషలలో వచ్చినన్ని రచనలు తెలుగులో రాలేదని పెండ్యాలవారు అంటారు. ఆయన ఇంకా ఇలా అంటారు:

‘ఆంధ్రభాషలో విమర్శన గ్రంథములు తక్కువ. మహాభారతమును తత్రస్థవ్యక్తులను విమర్శించుట మరియును దక్కువ. దుర్బలమానసులకట్లు విమర్శించుట భీతావహముగా నుండును. విమర్శించినవారి కేదేని యనిష్టము సంభవించునని వారు తలంతురు. నా నేత్రవ్యాధికి గారణమిదియ యని యసూయాపరులు హేళనము చేయుటయే కాదు, కొందరు మిత్రులును నయోక్తులతో నయనిష్ఠురోక్తులతో గూడ నను నీ కార్యమునుండి మరలింప బ్రయత్నించిరి.’

తన మహాభారత ప్రసంగాలపై వ్యక్తమైన వ్యతిరేక స్పందనకు ఉదాహరణగా పెండ్యాలవారు ఒక సందర్భాన్ని ఇలా పేర్కొన్నారు:

‘గడిచిన నవంబరు(1932 సం.)నెలలో మ.రా. సర్. కూర్మా వెంకటరెడ్డి నాయుడుగారి యాధిపత్యమున (మద్రాసు)పచ్చయప్ప కలాశాలలో నే నిచ్చు నుపన్యాసమున సందర్భానుసారముగ ‘అశ్వమేధము లోని యశ్వసేవ’ను గూర్చి చెప్పుచున్నప్పుడు కొందరు కేకలు వైచిరి. అపుడు శ్రీ విద్వాన్ గంటి జోగి సోమయాజులు యం.యే. యల్.టి గారు ఈ యంశము నీ నాటి రాత్రి నేను చదివి రేపు సభలో యథార్థము జెప్పెదను గాన మరునాడు తిరిగి ఉపన్యసింప రమ్మని కోరి యట్లు సభ చేయించిరి…ఆ సభారంభముననే శ్రీ సోమయాజులుగారు లేచి నిన్నటి దినమున శాస్త్రిగారు చెప్పిన యశ్వసేవా విధానము సత్యముగా నట్లే యున్నది గాని యసత్యము గాదని చెప్పుటచే నందరును సావకాశముగా నా యుపన్యాసము నాలకించిరి.’

తన రచనను గర్హిస్తూ పండిత సభలలో చేసిన తీర్మానాల గురించి, వాటిపై పత్రికల స్పందన గురించి పెండ్యాలవారు ఒక చోట ఇలా రాశారు:

‘…పిమ్మట వారు(శ్రీపాద కృష్ణమూర్తిశాస్త్రిగారు) వెళ్ళిన రెండు పండిత సభలలో నన్నును, నా గ్రంథములను గర్హించు తీర్పులు పొడసూపినవి…కలువాయి(అనే ఊరు)లోని నిరాకరణపు తీర్పయుక్తమని ‘ఫెడరేటెడ్డు ఇండియా’ యను ఆంగ్ల వారపత్రిక యిట్లు నిరసించినది.

Finally a resolution was accepted condemning in unmeasured terms the work of Pendyala Subrahmanyasastry of Pithapuram who is alleged to have committed the sin of criticizing Bharatam and its author. It is unfortunate that our sense of veneration to all that is ancient should be so keen as to resent any criticism. Literary criticism is at its lowest ebb in Andhra and if the few who courageously come out with views of their own should be hunted out. I am afraid we are not advancing the cause of literature to any extent…

సంప్రదాయపు మూసను దాటి ఆలోచించగల మరో అరుదైన పండితుడు నాకు కనిపించారు: ఆయన, జమ్మలమడక మాధవరామశర్మ. పెండ్యాల, వారణాసి వార్ల మధ్య తలెత్తిన ఒక వివాదంలో జమ్మలమడకవారు ఒక తీర్పరిగా ఉన్నారు. బ్రహ్మసూత్రాలు రచించిన బాదరాయణుడు, వ్యాసుడు ఒకరు కారని పెండ్యాలవారి వాదన అయితే, ఒకరే నని వారణాసివారి వాదన. ఎవరి వాదన సమంజసమో నిర్ణయించడానికి 1947 జూలై, 2న అన్నవరం దేవస్థానంలో సభ ఏర్పాటు చేశారు. పెండ్యాలవారు ఎన్నుకున్న జమ్మలమడకవారిని, వారణాసివారు ఎన్నుకున్న పిడపర్తి కృష్ణమూర్తిశాస్త్రిగారిని తీర్పరులుగా నియమించారు. మళ్ళీ వీరిద్దరూ కలసి రాళ్ళభండి వేంకట సీతారామశాస్త్రి గారిని తీర్పరిగా ఎన్నుకున్నారు. పెండ్యాలవారు చారిత్రకమైన దృష్టితో సమీక్షిస్తే, చరిత్ర సంబంధములేని ప్రామాణిక దృష్టితో వారణాసి వారి వాదము సాగిందనీ, ఎవరి విమర్శ కూడా గాఢంగా లేదనీ, నేను ఈ తగాయిదాను త్రోసివేస్తున్నాననీ జమ్మలమడకవారు తీర్పు చెప్పారు. మిగిలిన ఇద్దరూ వారణాసి వారి పక్షం వహించి ఆయనకు అనుకూలంగా ‘మెజారిటీ’ తీర్పు ఇచ్చారు. ఈ ఇద్దరిలో సంప్రదాయ పాక్షికత వ్యక్తమైతే, జమ్మలమడకవారిలో విషయ ప్రధానమైన నిష్పాక్షికత కనిపిస్తుంది.

***

క్షమించాలి, కన్యాత్వ చర్చలోకి వెళ్లకుండానే ఈ వ్యాసాన్ని ముగించాల్సివస్తోంది. దాని గురించి మరోసారి….

 

 

 

 

 

 

Download PDF

6 Comments

  • Saikiran says:

    పండిత చర్చల కబుర్లు బాగున్నాయి సార్. బై ద వే, జమ్మలమడకవారి పేరు మాధవరాయశర్మ గారనుకుంటాను. ఎందుకంటే, వారి కుమారుడు జమ్మలమడక మాధవరామశర్మ గారు మాకు గుంటూరు హిందూ హైస్కూలులో తెలుగు పాఠాలు నేర్పేవారు. మాంచి సరసులు :)

  • కల్లూరి భాస్కరం says:

    థాంక్స్ సాయికిరణ్ గారూ…నేను రిఫర్ చేసిన మహాభారత తత్త్వ కథనములో ప్రతిచోటా మాధవరామ శర్మ అనే ఉంది, బహుశా మీకు తెలుగు పాఠాలు చెప్పింది ఆయన మనవడేమో!

    • Saikiran says:

      అబ్బే కాదండి. జమ్మలమడక మాధవరాయ శర్మ గారికి ఇద్దరు కొడుకులు. ఒకాయన మాధవరామ శర్మ గారు – మా హిందు హైస్కూలులో తెలుగు ఉపాధ్యాయులు. ఆయన మరో కొడుకు భవభూతి శర్మ గారు – ఈయన ఎ.సి.కళాశాలలో లెక్చరరుగా చేసారు. ఎనీ వేస్, రామాయణంలో ఇదో పిడకల వేట :)

  • కల్లూరి భాస్కరం says:

    మీరు చెప్పిందే ప్రామాణికం కావచ్చు. మాధవరాయ(రామ)శర్మ పేరు గురించి ఇంకెక్కడైనా ఆధారాలు దొరుకుతాయేమో…చూద్దాం.

  • ivln says:

    bhaskaramgaaroo ka burlu kuda bagane chepparu

  • anrd says:

    నేను ఎక్కువ గ్రంధములను చదవలేదు నాకు తెలిసిన విషయములు తక్కువ,. తెలిసినంతలో వ్రాస్తున్నానండి.

    ఈ రోజుల్లో కూడా ఎందరో సంతానం లేనివారు స్పెర్మ్ బేంకుల సాయంతో సంతానాన్ని పొందుతున్నారు కదా ! వ్యాసుల వారు తల్లి ఆజ్ఞ ప్రకారం , రాజ్యాన్ని పాలించే రాజ వంశాన్ని నిలబెట్టడం కోసం సంతానాన్ని ప్రసాదించారు కానీ అంబిక, అంబాలికలతో కాపురం చేయలేదు.

    జన్మించిన వెంటనే పెరిగి పెద్దయిన వ్యాసులంతటి మహానుభావులకు ఆధునిక విజ్ఞానాన్ని మించిన మహిమలు తప్పక ఉంటాయి. వారు అలాంటి మహిమల ద్వారా సంతానాన్ని అనుగ్రహించి ఉంటారు.
    ………….
    భీష్ముని బ్రహ్మచర్యము స్వచ్ఛందమైనది కాకపోయినా గొప్పదే. భీష్ముని వల్ల ఎన్నో విషయములు ప్రపంచానికి తెలిసాయి.

    అధర్మవర్తనులైన వారి వద్ద ఉండి వారికి సాయం చేసే వారికి కూడా పాపాలు తగులుకుంటాయనే గొప్ప నిజం లోకానికి తెలిసింది. అధర్మవర్తనుడైన వ్యక్తి ఎంత గొప్పవంశానికి చెందిన వాడైనా అతని వద్ద పొందిన ఆహారాన్ని స్వీకరించరాదు అని కూడా తెలుసుకోవచ్చు.

    అధర్ముడైన వ్యక్తిని వదిలివేయటం స్వామిద్రోహం కాదు. విభీషణుడు కూడా అధర్ముడైన సోదరుని వదిలిపెట్టాడు కదా !
    ……………………………….
    రాముడు మహానుభావుడే…ముక్కు మూసికొని తపము జేయుచున్న శంబూకుని తల నరకటం న్యాయమే. తపస్సులు చేస్తున్నంత మాత్రాన అందరూ మంచివారే ఉంటారా ? లోకాలను పీడించే వరాలను పొందటం కోసం రాక్షసులు కూడా తపస్సులు చేస్తారు . అంతమాత్రాన రాక్షసులు కూడా మంచివారు అయిపోతారా ?

    శంభూకుడు ఎటువంటివాడో ఎవరికి తెలుసు ? బహుశా శంభూకుడు చెడ్దకోరికలతో తపస్సు చేస్తున్నాడేమో ? అందుకే రాముల వారు వధించి ఉంటారు. శూద్ర స్త్రీ అయిన శబరి అందించిన ఎంగిలిపండ్లను స్వీకరించిన రామునికి శూద్రులనే భేదభావం ఉండదు.

Leave a Reply to anrd Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)