ఏడు పదుల “నయాగరా”… నవ కవిత్వ నగారా!

ఏల్చూరి సుబ్రహ్మణ్యం గారు

 

అది మార్చి 1944 అప్పటికే ఒకటో రెండో కవితలు మినహా మొత్తం మహా ప్రస్థాన గీతాల రచన శ్రీశ్రీ పూర్తి చేశారు. చలం గారి ముందు మాటలూ వచ్చి చేరాయి. అయినా , 1950 దాకా ,‘మహా ప్రస్థానం’ ఒక సంపుటంగా వెలువడే అవకాశాలు సానుకూల పడలేదు. ఆ గీతాలన్నీ ఎన్నో ఏళ్లుగా ఎందరో కవుల  నోళ్ల ద్వారా , సభల్లో గానం చేయడమూ, అవి బహుళ ప్రాచుర్యాన్ని పొందడమూ జరుగుతూ వస్తోంది.

చూడబోతే  యుద్ధపు రోజులు , సామ్రాజ్య పంజరాలు బద్దలయ్యేలా సామాన్యుల సాహసాలు నమోదవుతున్నాయి. దగ్గరలోనే తెలంగాణ కూడా వ్యతిరేక పవనాలకు ఊతమిచ్చి ప్రతిఘటన తల దాల్చింది. అటు సోమసుందర్ , ఆరుద్ర,, కుందుర్తి వంటి కవులు జన గళాలకు తమ అక్షర నివాళులిచ్చిన , కొత్త నమ్మకాలు వెలార్చిన దశాబ్దం అది. 1948, 49 వత్సరాలలో కానీ ఈ కావ్య దుందుభులు మోగలేదు వజ్రాయుధాలుగా ,‘తెలంగాణా’ లుగా.

కవులు రాజుల ఏనుగులేక్కే కాలం కాదిది. ప్రజలు రాజుల్ని సింహాసనాల మీంచీ ఏనుగుల మీంచి కిందికి దింపే కాలం. అది కవుల చేతుల్లో అక్షరాల కరవాలం . మరీ ముఖ్యంగా ముగ్గురు అభ్యుదయ కవుల యవ్వనాల నయాగరా హోరెత్తిన దశాబ్దం అది. అది మార్చ్ 1944, బెల్లం కొండ రామదాసు, కుందుర్తి ఆంజనేయులు, ఏల్చూరి సుబ్రహ్మణ్యం ల మూడు ముళ్లు తొమ్మిది కవితల ‘నయాగరా’ కవితల సంపుటి వెలువడిన నెల. ఈ నవ కవితల నవ్య ధార నగారాకు, ఇది సప్తతి పూర్తి నగారా మొగుతున్న వత్సరం(1944-2014).

ఏల్చూరి సుబ్రహ్మణ్యం గారు

ఏల్చూరి సుబ్రహ్మణ్యం గారు

అభ్యుదయ కవితా యుగం లో అచ్చైన తొలి కావ్యంగా దీని విశిష్టత ఎనలేనిది. ఈ కవులు ప్రగతి శీల భావ దురంధరులు. కోస్తా జిల్లాల యువకులు. వామ పక్ష జన ప్రయోజనాభిలాషులు. రోజూ యుద్ధ మృగంతో తల పడుతున్న ప్రపంచం లో . సామాన్యుల ముందర ఉన్నది ఒక్కటే ఆశ, ప్రజానుకూల శక్తులు గెలవాలి. నియంతలు, సైన్యాధికారోన్మాదులు . నర హంతలు ఓటమి పాలవ్వాలి. దేశాదేశాలను మెల్లగా యుద్ధపు ఊబిలోనికి లాక్కుపోతున్న ప్రపంచ పరిస్థితుల కాలంలోనే ఈ ‘నయాగరా’ ప్రపంచాగ్నికి సమిధగా వెలువడింది. ఈ కవితలు కొద్ది సంఖ్యలో వున్నా, వీటి చైతన్య స్థాయి గొప్పది. అది ప్రజల పక్షాన నిలిచింది.

ఎర్నస్ట్ టాలర్

ఎర్నస్ట్ టాలర్

అందుకే ఏ చిరు కవితల పొత్తం అంకితం ఇచ్చారు వీరు ఒక జన్మతః యూదుడైన , జర్మన్ నాటకకర్త , వారం రోజుల పాటు బవేరియా సోషలిస్ట్ రిపబ్లిక్ కు అధ్యక్షుడిగా పని చేసిన ఎరన్స్ టాలర్ కు , అతని పంక్తులనే ఊటంకిస్తూ.

“ఎప్పుడు మనం ప్రేమలో బతుకుతాము

ఎప్పుడు మనం ఇష్టమొచ్చిన పని చేయ గల్గుతాము

ఎప్పుడు విముక్తి???”

యుద్ధ పిశాచి దురంతాలకు లోనయి ఉన్న యావత్ ప్రపంచమూ, సామ్రాజ్య వాదుల పెచ్చుమీరిన దోపిడీ పరిపాలనలో ఉన్న ఎన్నో బడుగు దేశాలూ, బహుశా ఇదే ప్రశ్న తో పడే పడే సతమవుతున్న కాలం అది . అందుకే తెలుగులో తొలి అభ్యుదయ కవిత్వ సంపుటి ఇదే ప్రశ్నలు వేసింది. మొదటి మూడు కవితలు ‘నా గీతం’,’ఈ రోజున’. ‘చెరసాల’, బెల్లం కొండ రామ దాసు గీతాలు. వీటిని ఆయన రెండు నెలల ముందే అంటే జనవరి 1944 లోనే రాశారు. వీటిలో అంతర్జాతీయ స్పృహ, గుచ్చెత్తి చూపే అభివ్యక్తి , అచంచలమైన ప్రజాపేక్ష విశ్వాసం మెండుగా ఉన్నాయి.

మధ్య లోని మూడు కవితలు కుందుర్తి ఆంజనేయులు రాసినవి ‘మన్యంలో’,(ఏప్రిల్, 1943),‘జయిస్తుంది’, (అక్టోబర్ , 1941),‘తర్వాత’,(సెప్టెంబర్. 1942) లో రాయబడ్డాయి. వీటిలో మన్యం లో కవిత , విశాఖ మన్యం వీరోచిత పోరాట కారుడు అల్లూరి సీతారామరాజు గురించిన కదన కధనం. బహుశా అల్లూరికి అక్షర తర్పణాలు ఇచ్చిన అభ్యుదయ కవులలో కుందుర్తి ముందు వరుస లో వుంటారు. అల్లూరి బలిదానం(07/05/1924), తర్వాత పందొమ్మిదేళ్ళకు వెలుగులోకి వచ్చిన కవిత ఇది. కుందుర్తి అల్లూరి పై అంగార మాల రచిస్తే , ఏల్చూరి సుబ్రహ్మణ్యం తన మూడు కవితలలో ఇంకాస్త భిన్నంగా కనిపిస్తాడు.

ఈయన ‘ఠాకూర్ చంద్ర సింగ్” (జూలై, 1943), “ప్రజాశక్తి’, (జూన్, 1941),‘విజయ ముద్ర’(మార్చి, 1941) కవితలను నయాగరాకు అందించాడు. కవితల్లో ఎక్కడా ‘నయాగరా’ పదాన్ని ఈయన ముందు కవులిద్దరివలే వాడలేదు. బెల్లం కొండ రామదాసు ‘నా గీతం’ లో ,‘జగత్తునొక నయాగరా జల ధారలుగా వర్షించిన నా గీతం’, అని రాయగా , కుందుర్తి ‘గబ గబ గబ గబ నయాగరా జల పాతం లా నడిచే విప్లవ సైన్యం జయిస్తుంది’ అంటారు తన గీతం ‘జయిస్తుంది’ లో.

Kundurti anjaneyalu

1938 కి ముందే అత్యధిక శాతం శ్రీశ్రీ రాసిన మహా ప్రస్థాన గీతాలు , భావావేశ సంపన్నతకు ప్రతిబింబాలై , ఒక తాత్విక స్థాయి నుంచి ప్రజా పక్షం వహిస్తాయి. తక్షణ సందర్భాలు, కవితా వస్తువు కావల్సిన అవసరం శ్రీశ్రీ కి జూన్ 22, 1941, దాకా కలగ లేదు. అప్పుడే ‘గర్జించు రష్యా ‘ గీతం చండ ప్రచండంగా వెలువడింది. ఇంచుమించు యుద్ధకాలపు నీడలే నల్లగా వ్యాపించిన ప్రపంచం గురించి, ప్రగతి అనివార్యత గురించి, శ్రీశ్రీ ని ఆరాధించే , అభిమానించే ముగ్గురు తెలుగు కవులముప్పేట హారం ఈ కవిత్వ నయాగరా!

భాషా పరంగా , ఒకింత మోతాదు ఎక్కువగా అలంకారిక గ్రాంధికమా అన్పించే నడక బిగి , ఏల్చూరి సుబ్రహ్మణ్యం రచనల్లో విరివిగా కన్పిస్తుంది. ‘సముద్ధర్త’,‘రూక్షోజ్వాల రుధిర దీప్తి’. ‘తమసా గర్భ ధళన హేతి’,’‘సుప్తోధృత జీవ శక్తి’ అంటూ మొదలైనా ఏల్చూరి విశ్వాసం తిరుగులేనిది. ‘వొస్తున్నది ప్రజా శక్తి’ అంటూ సాగే ఈ నయాగరా గీతం, యుద్ధాన్ని నిలదీస్తుందిలా ,‘హత్యకు హారతులిచ్చే , అగ్నికి దాహం పెంచే చీకటి కాటుక దిద్దిన యుద్ధం’. వామ పక్ష శక్తుల విజయాన్ని విశ్వసనీయంగా ప్రకటిస్తుంది. ‘ఎగిరే ఎగిరే ఎర్రటి జెండా , కరకరలాడే కొడవలి పదునూ, లోహం వంచిన సమ్మెట పెట్టూ, వైప్లవ్యపు వైతాళికులై నినదించెను నిప్పుల గొంతుక!’. ఈ ఏల్చూరి గీతం , అదే కాలం లో వెలువడిన మఖ్దూం మొహియుద్దీన్ కవిత ,‘వస్తున్నది , వస్తున్నది సామ్యవాద మహా నౌక , యువకుల బలిదానాలను అందుకుంటూ వస్తున్నది’ ను బలంగా మన మనసుల్లో మెరిపిస్తుంది.

Bellamkonda ramadasu

‘నా గీతం’ అనే బెల్లం కొండ రామదాసు గీతం, అంతర్జాతీయ సంఘర్షణామయ ప్రపంచ గందరగోళం లో, ఒక ప్రజల చేతి ఆయుధం ‘ నా గీతం’ అంటూ బెల్లం కొండ దర్శించేది , బహురూపాలైన జన ప్రతిఘటనను. 1944 లో రాస్తున్నాడేమో, యూరప్ నగరాల బాంబు మోతలు తన కవితల్లో సాకారమౌతాయి. “గత సాంఘిక నరబలి నగరం పై బాంబులు దూకించిన నా గీతం”, అంటూ వర్గ రహిత సంఘ స్వర్గానికి పూల నిచ్చెనలు వేసిందట, నరహంతలకు చెరసాలలకు , ఊరి తీర్పులకు , నిరంకుశ నియంతలకు తల కొరువులు పెట్టిందట’ అని కవన వ్యాఖ్యానం చేస్తూ జీవితాన్ని విహంగం చేసిందట’ అని నయాగరా అంతా నవ మోహన విహంగం అవుతాడు ఈ కవి కుమారుడు.

ఉన్నవి తొమ్మిది కవితలే . రాసింది ముగ్గురే . అయినా ఇదొక ప్రయాణానికి పచ్చ జెండా. ప్రపంచ విప్లవ శక్తుల గుర్తింపు, దేశదేశాల రూపు రేఖలు మారి పోనున్న మహత్తర సందర్భాలు , వాటిలో అతలాకుతలమయే మానవుడి పాత్ర , ఇవన్నీ వీటిలో సముచితంగా , సమున్నతంగా ప్రస్తావితం కావడం , ఈ నవ కవితల నయా గరాకు కొత్త వడిని, వరవడినీ తెచ్చి పెట్టింది. అల్లూరి గురించి కుందుర్తి రాయగా , దండి ఉప్పు సత్యాగ్రహం లో పాల్గొన్న 18 గర్వాల్ దళ నాయకుడు ‘ఠాకూర్ చంద్ర సింగ్ ‘ కు ప్రశంసగా తన గీతం అదే పేరుతో రాశారు ఏల్చూరి .

యుద్ధ కల్లోల దశాబ్దాలలో కవిత్వ రచనా చేస్తున్నా, తమ జీవన సౌకుమార్యతలను కోల్పోని ఈ ముగ్గురు నయాగరా త్రేతాగ్నులు (ఇది ఆచార్య జి.వి.సుబ్రహ్మణ్యం గారి మాట ), ఈ సంపుటిని అనిశెట్టి సుబ్బారావు (మరొక ప్రముఖ తెలుగు అభ్యుదయ కవి), లక్ష్మిల వివాహ సందర్భంగా ‘అని-ల’ కు అంకితం ఇచ్చారు.

ఇంకా ముందుగా ప్రస్తావించబడ్డ ఎరన్స్ టాలర్, దేశాలు వేరైనా ఫ్రెంచ్ వారయినా ఫ్రెంచ్ వారూ జెర్మన్ వారూ సోదరులే అని చెప్పడం తో పాటు , ఆనాటి హిట్లర్ ఆధిపత్య దేశంలో హీరోలను, హీరోయిజాలను తిరస్కరిస్తూ, “అసలు ఉదాత్త నాయకులనే భావనే అన్నిటికన్నా అతి తెలివి తక్కువ ఆలోచన” అన్నందుకు ఏళ్ల తరబడి చెరసాలల్లో బతికాడు. జెర్మనీలోని ఫాసిజపు ముష్కర మూకలు, నాజీల స్నేహాన్ని నిలదీస్తూ , యూరప్ అంతా ఉపన్యాసాలు ఇచ్చాడు. 1939 లో ఒక హోటల్ గదిలో ఉరిపోసుకు చనిపోవడం వెనుక వివాదాస్పద కధనాలు వున్నాయి.

ఇలా డెబ్భైయ్యేళ్ళకు వచ్చిన ‘నయాగరా’ ఒక సంఘటనల సమాహారం. జాతీయంగా , అంతర్జాతీయంగా , ప్రాంతీయంగా 1940లకు అటూ , ఇత్తూ గల సామాజిక పరిణామాలకు దర్పణంగా నిలుస్తూ దార్శనిక సంపన్నతను నిండుగా కలిగున్న మైలు రాయి ఈ కవిత్వ సంపుటి. ఏడు దశాబ్దాలు నిండిన ‘నయాగరా’, తెలుగు ఆధునిక కవిత్వం లో శిఖరమూ, జల పాతమూ కూడా .

రామతీర్థ

ramateertha

Download PDF

3 Comments

  • ఏల్చూరి మురళీధరరావు says:

    మాన్య విమర్శకతల్లజులు శ్రీ రామతీర్థ గారికి
    నమస్కృతులతో,

    అభ్యుదయ కవితాయుగంలో అచ్చయిన తొలికావ్యం ‘నయాగరా’ సప్తతితమ సంవత్సర స్మరణోత్సవాన్ని పురస్కరించికొని అమోఘమైన వ్యాసాన్ని విరచించిన మీకు, ప్రకటించిన ‘సారంగ’ సారథులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు.

    మీ వ్యాసం ‘నయాగరా’ చారిత్రికనైపథ్యానుసంజనను, రోచకతను, రౌచికతను సమర్థంగా ఆవిష్కరిస్తున్నది. కవితల ఆంతర్యాన్ని దర్శించి భావలక్షణాన్ని, శబ్దార్థాల ప్రయుక్తివిశేషాలను స్ఫూర్తిదాయకంగా వివరించారు.

    ప్రతిపాదితంలో ఒక్కటే చిన్ని సవరణ: ‘నయాగరా’ కావ్యాదిని జర్మన్ నాటకకర్త Ernst Toller (1893-1939) రచించిన

    When shall we live in love
    When shall we work at will
    When is deliverance?

    అన్న వాక్యత్రయిని కవులు తమ రచనకు శీర్షణ్యంగా మాత్రమే గ్రహించారు. ”నయాగరా’ టాలర్ కు అంకితం కాలేదు. వ్యాసాంతంలో మీరన్నట్లుగానే కవులు దానిని అనిసెట్టి సుబ్బారావు, లక్ష్మీదేవి గారలకు పెండ్లికానుకగా 1944లో అంకితం చేశారు.

    మీ దార్శనికసంపన్నతకు కృతజ్ఞతతోడి ప్రణామశతం!

    సప్రశ్రయంగా,
    ఏల్చూరి మురళీధరరావు

  • Gannavarapu Narasimha Murty says:

    సామ్రాజ్యవాదము, జాత్యహంకారము, పరపీడన తత్వములు విశృంఖలంగా నాట్యమాడి ప్రజల మస్తిష్కాలను మధిస్తే బడబాగ్ని జనించడము సహజమే ! ఆ దినములలో జనసమ్మతమైన సామ్యవాద సిధ్ధాంతాలు ప్రజాకవుల నాకట్టుకున్నాయి.పుడమి తల్లి యెట్టకేలకు ప్రపంచయుధ్ధాలనే పురిటి నొప్పులు భరించి అనేక ప్రజాస్వామ్య దేశాలకు కానుపు నిచ్చింది. మెరుగుపడుతున్న ,మెరుగు పడిన కాలములో పెరిగిన నవ తరానికి 1945 నాటి పరిస్థితుల నాకళింపు చేసుకొనడము కష్టమే ! ఆ పరిస్థితుల నర్ధము చేసుకుందుకు ఆ భావోద్రేకములో పరవళ్ళు ద్రొక్కుటకు శ్రీశ్రీ వ్రాసిన మహాప్రస్థానము, త్రేతాగ్నులు విరచించిన నయాగరా కవితలు పాఠకుల కెంతగానో ఉపయోగపడుతాయి. త్రేతాగ్నులుగా ప్రశస్తి కెక్కిన శ్రీ ఏల్చూరి సుబహ్మణ్యము గారిని, శ్రీ కుందుర్తి ఆంజనేయులు గారిని, శ్రీ బెల్లంకొండ రామదాసు గారిని పరిచయము చేసిన శ్రీ రామతీర్థ గారికి, శ్రీ ఏల్చూరి మురళీధర రావు గారికి కృతజ్ఞతాభివందనములు !

  • ఒక నరసరావుపేట కు చెందిన ( ఇప్పటి హైద్రాబాద్ వాసిని ) వ్యక్తిగా ,నేను మానాన్న ద్వారా ‘నయాగరాకవులు ‘ గురించి విన్నవాడిగా , ఆపై ఒక పర్యాయం గుర్తుంచుకున్న సందర్భం గా , “కుందుర్తి ఆంజనేయులు” గారు మరణించిన ఆ వారంలో నరసరావుపేట ‘అభ్యుదయ భారతి ‘ సంస్థ వారు ఏర్పాటు చేసిన ‘సంతాప సభ ‘ కు రెంటాలగోపాలకృష్ణ గారు వచ్చి , ఆ నయాగరా కవుల్లో ఒకరైన కుందుర్తి ( రెంటాల వారికి స్నేహితుడు కూడా ) గురించి, అలాగానే మిగతా నయాగరా కవులగురించి 3 గంటలపాటు వివరించగా విని ఆశ్చర్య పోవడం ఆనాడు నావంతైనది . ఆనాటినుండి మా నరసరావుపేట మీద గతంలో కంటే నాకు అభిమానం ఎక్కువైంది. దానికి కారణం తొలి అభ్యుదయకవులు ‘ నయాగరా కవులు ‘ మాఉరివారే అని తెలిసి గర్వించాను. .నేటికీ ఆ ‘నయాగరకవులు ‘ నడయాడిన ఆనేల అంటే నాకు మక్కువెక్కువే! ఆ 70 ఏళ్ల ‘ నయాగరా కవుల కవిత్వం’ కు జోహార్లు ! ఆ ‘నయాగరా కవులు’ అమరులు . అమర్ రహే ! అమర్ రహే ! నయాగరా కవిత్వం అమర్ రహే ! .

Leave a Reply to Gannavarapu Narasimha Murty Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)