సంప్రదాయపు ‘వీటో పవర్’-కన్యాత్వ చర్చ

Kalluri Bhaskaram-pic-a.prabhakar rao (5)

రాజుగారి దేవతావస్త్రాల కథ చాలామందికి తెలిసే ఉంటుంది. నాకు ఆ కథ పూర్తిగా గుర్తులేదు కానీ, గుర్తున్నంతవరకు ఆ కథ సారాంశం ఇలా ఉంటుంది:

ఒక నేత కార్మికుడు దేవతావస్త్రాలను నేస్తానని రాజుగారికి చెప్పాడు. నమ్మిన రాజుగారు అతనికి గడువు ఇచ్చాడు. గడువు ముగిసిన తర్వాత నేతకార్మికుడు రాజుగారిని దర్శించుకున్నాడు. ‘ప్రభూ…ఇవిగో దేవతావస్త్రాలు’ అంటూ ఒట్టి చేతులు చూపించాడు. ‘ఏవీ? నాకు కనిపించడం లేదే’ అన్నాడు రాజు. ‘ఇవి దేవతావస్త్రాలు కదా, మామూలు కళ్ళకు కనిపించవు’ అన్నాడు నేతకార్మికుడు. ‘ఓహో, అలాగా, అయితే వాటిని నాకు ధరింపజేయి’ అని ఆజ్ఞాపించాడు రాజు. ‘చిత్తం మహారాజా’ అంటూ నేత కార్మికుడు రాజుగారికి దేవతావస్త్రాలను ధరింపజేసినట్టు అభినయించాడు. ‘ఇదిగో ఇప్పుడు మీరు దేవతావస్త్రాలను ధరించారు’ అన్నాడు. అప్పుడు రాజు,‘దేవతావస్త్రాలు ఎలా ఉన్నాయి?’ అని తన పరివారాన్ని అడిగాడు. దేవతావస్త్రాలు కనిపించడం లేదన్నా, బాగులేవన్నా రాజు తలతీసేస్తాడని వాళ్ళకు తెలుసు. ‘అద్భుతం ప్రభూ, వీటిని ధరించిన తర్వాత మీ అందం ద్విగుణీకృతమైంది’ అని పరివారం ముక్తకంఠంతో అన్నారు.

ఈ కథ ఎందుకంటే,‘కన్యాత్వా’నికి, దేవతావస్త్రాలకు పోలిక ఉందని చెప్పడానికే.

కన్యాత్వం వివాహానికి ముందు ఉండి, తర్వాత అంతరించే ఒక శారీరక అవస్థ లేదా ప్రకృతి చేసిన ఏర్పాటు కాదనుకుంటే, నేతకార్మికుడు దేవతావస్త్రాలను సృష్టించినట్టే సంప్రదాయం కన్యాత్వం అనే ఒక ఊహను కల్పించుకుందన్నమాట. లెక్కల్లో కూడా చూడండి, ఒక ‘ఎక్స్’ను కల్పించుకుని దాని మీద లెక్క చేస్తారు. ఇంకో పోలిక చెప్పాలంటే, సాలె పురుగు తన కడుపులో ఉన్న ద్రవంతోనే దారాలు సృష్టించుకుని వాటితో గూడు అల్లుకుని అందులో ఉంటుంది. కన్యాత్వం కూడా అలాంటిదే అనుకుంటే, కన్యాత్వం అనే ఊహను సృష్టించిన సంప్రదాయమే, ఆ ఊహను వాస్తవంగా తనే నమ్మి, ఇతరులను నమ్మించడం ప్రారంభించిందన్న మాట.

అదే జరిగిందనుకున్నప్పుడు, అది తప్పా, ఒప్పా; అందులో మోసం ఉందా అన్న చర్చకే పరిమితమైతే అంతకన్నా పొరపాటు ఉండదు. తటస్థంగా చెప్పుకోవలసిన విషయాలలో ఇది ఒకటి. కన్యాత్వం అనే ఊహను సృష్టించుకోవలసిన అవసరం సంప్రదాయానికి నిజంగానే కలిగింది. ఎందుకంటే, ఒక పాతవ్యవస్థ స్థానంలో ఒక కొత్త వ్యవస్థను అది సృష్టిస్తోంది. అది అప్పటికి పురోగామి వ్యవస్థ కూడా కావచ్చు.

పాతవ్యవస్థనుంచి కొత్త వ్యవస్థను సృష్టించే ఆ ప్రయత్నం లేదా ప్రయోగంలో మరో విశేషం ఉంది. మహాభారతం లాంటి ఇతిహాసాలు ఆ ప్రయోగాన్ని బహిరంగ ప్రయోగంగా నిర్వహించాయి. అంటే, అది పాఠకుల కళ్ళముందే జరుగుతోందన్న మాట. ఇది ఎలాంటిదంటే, ఒక పుస్తకం, లేదా పత్రిక తాలూకు అంతిమ ఉత్పత్తి(endproduct)ని మాత్రమే పాఠకులకు ఇవ్వడం కాకుండా, దాని ఎడిటింగ్ దశతో సహా ఇవ్వడం లాంటిది. ఇంకో పోలిక చెబితే, ఇతిహాసాలు ఆధారంగా లేబరేటరీలో తను చేస్తున్న ఆ ప్రయోగాన్ని ప్రయోక్తే నేటి టీవీ ప్రత్యక్ష ప్రసార పద్ధతిలో మనకు చూపిస్తున్నాడు. ఆవిధంగా ఇతిహాస కథలలో కేవలం కథలు మాత్రమే కాక, పాతవ్యవస్థనుంచి కొత్త వ్యవస్థను సృష్టించడానికి కథకుడు చేసిన ప్రయోగం లేదా పెనుగులాట కూడా భాగం.

మహాభారత కథకుడు ఎదుర్కొన్న అనేక ధర్మ సంకటాలలో ప్రస్తుత సందర్భానికి సంబంధించినవి రెండున్నాయి: మొదటిది, కన్యాగర్భం; రెండవది, ద్రౌపది అయిదుగురిని వివాహమాడడం. ఇవి రెండూ పాత వ్యవస్థకు చెందినవనుకుంటే, కొత్త వ్యవస్థలో ఇవి చాలా అసంబద్ధంగా కనిపిస్తాయి. ఈ పరిస్థితిలో వీటిని కొత్త వ్యవస్థకు అన్వయించడం ఎలా? కొత్తవ్యవస్థ వైపు నిలబడిన కథకుడు ఎదుర్కొన్న ప్రశ్నఇదే. దాంతో అతను కొన్ని ఉపాయాలను ఆశ్రయించాడు. పాత వ్యవస్థకు చెంది అసంబద్ధంగా కనిపించే అంశాల స్థానంలో వరాలు, శాపాలు, మహిమలు వగైరాలను ప్రవేశపెట్టి, తద్వారా వాటిపై చర్చను నిషేధించే ప్రయత్నం చేశాడు. అందుకు పురాణ, ఇతిహాసాలకు సహజంగా ఉండే మాంత్రికశైలి అతనికి ఉపయోగపడింది. అంటే, పాత అంశాలను కొత్త వ్యవస్థకు నప్పించే ప్రయత్నంలో రెండింటి మధ్యా వరాలు, శాపాల రూపంలో అతుకులు కల్పించాడన్న మాట. అయితే గతంలో కూడా పలు సందర్భాలలో చెప్పుకున్నట్టు కథకుడు అలా అతుకు పెట్టే పనిని చాలా చోట్ల అంత సమర్థంగా చేయలేకపోయాడు. పాతవ్యవస్థ తాలూకు అవశేషాలను మనం ఊహించడానికి తగిన జాగాలను విడిచిపెట్టాడు.

అదిగో, ఆ జాగాలలోనే సంప్రదాయవాదులకు, ఇతరులకు మధ్య వాగ్యుద్ధం. సంప్రదాయేతరులు ఆ జాగాలలో నిలబడి యుద్ధం సాగిస్తే, సంప్రదాయవాదులు సాంప్రదాయికపాఠాన్నే-అందులోని మహిమలు, మంత్రాలు, వరాలు, శాపాలు వగైరాలతో సహా- మరింత ధాటిగా నొక్కి చెప్పడానికి ప్రయత్నించారు. పెండ్యాల, వారణాసి వార్ల వాదంలో ఇది మనకు కనిపిస్తుంది.

‘కన్యాగర్భం’ విషయానికే వస్తే, పెండ్యాల వేంకట సుబ్రహ్మణ్యశాస్త్రిగారి వాదం ఇలా సాగుతుంది:

“నాడు కన్యకలు బిడ్డల గనుట దోషము కాదని యాశ్రమవాసపర్వములోని కుంతీ వ్యాసుల సంభాషణము చెప్పుచున్నది”

“వ్యాసుని తల్లి యగు సత్యవతి కూడ వ్యాసుని గని కన్యాభావము నొందుట గమనింపదగిన విషయము.”

“మామ యగు వ్యాసునితో గుంతి తన చిన్నతనపుజేష్టను వెల్లడించినటులు వ్యాసుని తల్లి సత్యవతి సవతి కొడుకగు భీష్ముని కడ తన చిన్నతనపు చేష్ట నిట్లు సంతోషపూర్వకముగానే చెప్పినది”

“వ్యాసభీష్ముల వంటి మహానుభావులట్టి యధర్మమును ధర్మముగా నంగీకరించుట కానాటి దేశకాల పరిస్థితులే కారణమై యున్నవా? లేక వ్యాసభీష్ములు కూడ ధర్మవైరుధ్యమునకు ఇష్టపడి ఉండిరా? ఆలోచింప నాటి పరిస్థితులే అట్టివి కావచ్చునని తోచెడిని”

కన్యలు బిడ్డల్ని కనడం అప్పట్లో దోషం కాకపోవచ్చని, నాటి దేశకాలపరిస్థితులే అందుకు కారణం కావచ్చునని పెండ్యాలవారు అంటున్నారు. అలా అనడంలో సంప్రదాయ పాఠాన్ని ఆధారం చేసుకుంటూనే, ఆ పాఠం నుంచి పక్కకు జరిగి స్వతంత్ర ఊహ చేస్తున్నారు. సంప్రదాయం అంగీకరించని దేశకాలపరిస్థితులు, హేతుత్వం అనే అదనపు పరికరాలను తన పరిశీలనకు వాడుకుంటున్నారు.

పూర్తిగా సంప్రదాయపక్షం వహించిన వారణాసివారి దృష్టిలో ‘ఒకప్పుడు కన్యాగర్భం దోషం కాదనీ, తర్వాత దోషంగా మారిందనీ’ అంటూ ఊహ చేయడం, కాలాల మధ్య తేడా తీసుకురావడం చాలా తీవ్రమైన విషయం. అలా చేసినప్పుడు మొత్తం సంప్రదాయ వ్యూహమే విఫలమైపోతుంది. కనుక కన్యలు సంతానం కనడం ఎప్పుడైనా దోషమే నని చెప్పడానికి ఆయన ప్రయత్నించారు.

 

మరి కుంతి, సత్యవతుల సంగతేమిటని అడిగితే, దానికి సంప్రదాయ పాఠంలోనే సమాధానం ఉంది. అదేమిటంటే, సాధారణులకు వర్తించే నియమం సత్యవతికి, కుంతికి వర్తించదు. వారు కన్యలుగా ఉండి సంతానం కనడం వెనుక ప్రత్యేక కారణముంది. వారిద్దరి వెనుక పరాశరుడు, దూర్వాసుడు అనే ఇద్దరు మహర్షులు; సూర్యుడు అనే దేవుడు ఉన్నారు. వారి వరాలు, మహిమలు ఉన్నాయి. ఆవిధంగా అవి దైవనిర్ణయాలు కూడా. సత్యవతి విషయంలో ఇంకో అదనపు విశేషం కూడా ఉంది. ఆమె కన్యాగర్భంలో జన్మించినది సాధారణవ్యక్తి కాదు, వ్యాసుడి వంటి మహర్షి. కనుక అది పూర్తిగా దైవ సంకల్పమే. వరాలు, మహిమలు, దైవసంకల్పాలు వగైరాలను అంగీకరిస్తే ఇంతవరకు సంప్రదాయ పాఠం పకడ్బందీగానే ఉంది. వారణాసి వారు చేసింది ఆ పాఠాన్ని మరోసారి నొక్కి చెప్పడమే.

8385917_f520

విషయాంతరం అనుకోకపోతే నాకిక్కడ ఒక విచిత్రం కనిపించింది. అదేమిటంటే, తెలుగు భారతం ప్రకారం సత్యవతికి వ్యాసుడు, కుంతికి కర్ణుడు ‘సద్యోగర్భం’లోనే జన్మించారు. అలాంటి ఒకే విధమైన విశేషజన్మ రీత్యా వ్యాసుడు, కర్ణుడు ఒకే విధమైన మహా పురుషులు కావాలి. పోనీ సద్యోగర్భాన్ని పరిహరించి చూసినా ఇద్దరి పుట్టుక వెనుక పరాశరుడు, దూర్వాసుడు అనే ఇద్దరు మహర్షులు; కర్ణుని పుట్టుక వెనుక అదనంగా సూర్యుడు అనే దేవుడు ఉన్నారు కనుక కర్ణుడు వ్యాసునితో సమానుడు, బహుశా అంతకంటే విశిష్టుడు కావాలి. కానీ కాలేదు. అతడు మహాభారతంలో మొదటినుంచి హీనజన్ముడిగానే గుర్తింపు పొందాడు. దుష్టచతుష్టయంలో ఒకడయ్యాడు. అర్జునుడితో జరిగిన అన్ని యుద్ధాలలో ఓడిపోయాడు. అనేక విధాలుగా అతడు శాపగ్రస్తుడు కూడా. మరి వ్యాసుడు అలా కావడానికి, కర్ణుడు ఇలా కావడానికి సంప్రదాయ భాష్యం ఎలాంటి వివరణ ఇచ్చిందో, లేక ఇస్తుందో తెలియదు.

వారణాసివారి ఖండనకు మళ్ళీ వస్తే, పెండ్యాలవారు ఉదహరించిన సంస్కృత భారతం, ఆశ్రమవాసపర్వం లోని కుంతి, వ్యాసుల సంభాషణను యథాతథంగా ఆయన ఎత్తిరాస్తూ; అప్పుడే కాదు, ఎప్పుడూ కన్యాగర్భం దోషమే నని నొక్కి చెప్పారు. ఆయన ప్రకారం, తను కన్యాదశలో ఉండి కూడా మూర్ఖంగా దూర్వాసుని మంత్రం పఠించి సూర్యుని రప్పించినందుకు, పితృమర్యాదను కాపాడడానికి రహస్యంగా కొడుకును కని, నీళ్ళలో విడిచిపెట్టవలసి వచ్చినందుకు కుంతి వ్యాసుని దగ్గర బాధపడింది. ‘నిజముగా నా సూర్యదేవుని కటాక్షమున మరల నాకు కన్యాత్వము ప్రాప్తించినది. దుర్వాసోమహర్షి చెప్పినట్లే జరిగినది. నేను మూఢురాలనై పుత్రు నపేక్షించితిని. పుణ్యమో పాపమో నీ యొద్ద వివరింపబడిన ఈ విషయము నన్ను పీడించు చున్నది.’అని ఈ సందర్భంలో కుంతి అంటుంది.

అప్పుడు వ్యాసుడు ఇలా అంటాడు: ‘నీవెట్లు చెప్పితివో అట్లది జరగవలసిన విధియై యున్నది (నీకు సూర్యాంశమున సూతుడు గూఢముగా బుట్టి దూరమైపోయి దుర్యోధనుని జేరి యుద్ధహేతువు కావలసిన విధి యట్లున్నది). నీ కపరాధము లేదు. నీవు కన్యకవై కదా అప్పుడుంటివి. అణిమాది సిద్ధులు కల దేవతలు శరీరముల నావేశింతురు. సంకల్పము చేతను, వాక్కు చేతను, దృష్టి చేతను, స్పర్శ చేతను, రతి చేతను ఐదు విధములుగా దేవతలు సంతతి నిచ్చుచుందురు. మనుష్యధర్మము దైవధర్మముచే దూషితము కాదు. కుంతీదేవీ! నీకు మనోవ్యధతో బని లేదు’.

దీనిపై వారణాసివారు వివరణ ఇస్తూ,‘వ్యాసభగవానుని మాటలలో గూడ దుర్వాసోమహర్షి యుపదేశము మొదలు సూర్యసంబంధ సుతోత్పత్తి, సుతపరిత్యాగాంతకృత్యములు విధివశమున జరిగినవి. ఆ ఘటన యంతయు నీకు కన్యాదశయందు అట్టి యిచ్ఛ లేనప్పుడు తటస్థించినది కనుకను దేవతలు సంకల్పాదులచే నైదు విధములుగా సంతతి నిచ్చువారు కనుక దేవధర్మముచే మనుష్యధర్మము దూషితము కాదు కనుకను నీ తప్పు లేదు అని యున్నది. ఈ కుంతీ సంభాషణములో కన్యకలు బిడ్డల గనుట దోషము కాదని యున్నదా? సూర్యానుగ్రహమున సుతుని గన్న కుంతీదేవికి అది దోషము కాదని యున్నదా?’ అంటారు.

సంప్రదాయపక్షం వహించిన వారణాసివారు ఇక్కడ విధి గురించి, దేవతలు అయిదు విధాలుగా సంతతి నివ్వడం గురించి వ్యాసుడు అన్న మాటల్ని సంపూర్ణంగా సమర్థిస్తున్నారు. కన్యకలు బిడ్డల్ని కనడం దోషం కాదని ఈ సంభాషణ చెప్పడం లేదంటున్నారు. ఆయన ప్రకారం, కన్యకలు సంతానం కనడం ఎప్పుడైనా తప్పే. అయితే కుంతికి కానీ, సత్యవతికి కానీ ఆ నియమం వర్తించదు. ఎందుకంటే వారి వెనుక ఒక ‘విధి’ ఉంది. వారికి ‘దేవధర్మ’మే కానీ ‘మనుష్య ధర్మం’ వర్తించదు. ‘అయిదు విధాలుగా సంతానం ఇచ్చే దేవతల ద్వారా’ సంతానం పొందే ప్రత్యేక అర్హత వారికి ఉంది.

అయితే సాధారణ హేతుబుద్ధితో పరిశీలించినప్పుడు ఈ వాదం సమాధానపరచకపోగా మరిన్ని సందేహాలను సృష్టిస్తుంది. ఎలాగంటే, విధిని అనుసరించి ‘దేవధర్మం’ ప్రకారం కన్యగా సంతానం కన్న కుంతి; అలా సంతానం కన్నందుకు, పితృ మర్యాదను కాపాడడానికి ఆ సంతానాన్ని నీళ్ళలో విడిచిపెట్టవలసివచ్చినందుకు ‘మనుష్యధర్మం’ ప్రకారం బాధపడుతుంది. అది పుణ్యమో, పాపమో అన్న విచికిత్సకు లోనవుతుంది. విధికి, దైవ సంకల్పానికి తను ఒక సాధనం ఎందుకు కావలసివచ్చిందో, తనే ఎందుకు కావలసివచ్చిందో పాపం కుంతికి వ్యాసుడు చెబితే తప్ప తెలియదు. చెప్పిన తర్వాత కూడా తెలిసిందో లేదో తెలియదు. వాస్తవంగా జరిగింది ఏమిటంటే, కుంతి సాధనం అయింది విధికీ, దైవసంకల్పానికీ కాదు; కథకుడికి! దేవధర్మం, మనుష్యధర్మం అనే రెండు చక్రాలతో కథ అనే బండిని నడిపించడం కథకునికి అవసరం. ఎందుకంటే, అతను రెండు భిన్న వ్యవస్థల మధ్య అతుకు పెడుతున్నాడు!

అప్పటికీ-దేవధర్మం ఏమిటి, అది కొందరి విషయంలోనే మనుష్యధర్మాన్ని అతిక్రమించి ఆవహించడమేమిటి, దేవతలు అయిదు విధాలుగా సంతానం ఇవ్వడం ఏమిటి అనే సందేహాలు సాధారణ హేతుబుద్ధిని సలుపుతూనే ఉంటాయి. అప్పుడిక సంప్రదాయం ప్రయోగించే అంతిమ అస్త్రం: శాస్త్రమర్యాద! వారణాసివారు చివరికి ఆ అస్త్రాన్ని కూడా ఇలా ప్రయోగిస్తారు:

‘…సూర్యుడేమి? శరీరధారియై కుంతీదేవి యొద్దకు వచ్చి సంతానమిచ్చుట యేమి అనిపించినది కాబోలు. వీరికి శాస్త్రమర్యాద నొకింత వినిపింతము.

‘తాత్పర్యమేమనగా (దేవతాధికరణము-బ్రహ్మసూత్రము)-యోగశక్తులను బట్టి సూర్యాది దేవతలకు జ్యోతిర్మండలాది రూపములతో నుండుటకును, ఇష్టము వచ్చిన విగ్రహము ధరించుటకును గూడ సామర్థ్యము కలదు. కనుకనే…సూర్యుడు పురుషరూపము ధరించి కుంతీదేవిని బొందెనని ఇతిహాసమందును చెప్పబడినది…

మనకు ప్రత్యక్షము కాకున్నను పూర్వులకు ప్రత్యక్షమగుటచే దేవతావిగ్రహాదికము ప్రత్యక్షసిద్ధము కూడ నగుచున్నది. కనుకనే వేదవ్యాసాదులు దేవతలతో ప్రత్యక్షముగా వ్యవహరించిరని చెప్పబడినది. ఇప్పటివారికి వలెనే పూర్వులకు కూడ దేవతలతో వ్యవహరించెడి సామర్థ్యము లేదని యెవ్వడనునో అతడు జగత్తునందు విచిత్రతయే లేదనువాడగును…ఇప్పటి వలెనే కాలాంతరమందు గూడ వర్ణాశ్రమధర్మము లవ్యవస్థితములే యనును. దానివలన వ్యవస్థావిధాయకమైన శాస్త్రము నిరర్థకమగును…

పరిశీలింపగా మన శాస్త్రమర్యాద యిట్లున్నది. ప్రతివాది ప్రసంగము లట్లున్నవి.

వారణాసివారి ఈ మాటలు సంప్రదాయ మర్మాన్ని కూడా వెల్లడిస్తున్నాయి.అదేమిటంటే, శాస్త్రం ఒక వ్యవస్థను, అంటే కట్టడిని చేస్తుంది. వర్ణాశ్రమధర్మాలు (ప్రస్తుత సందర్భంలో కన్యాత్వం మొదలైనవి) ఆ కట్టడిలో భాగాలే. శాస్త్రవిరుద్ధమైన స్వతంత్ర ఆలోచనలు చేస్తే వర్ణాశ్రమధర్మాలు (అలాగే కన్యాత్వం) ఒకప్పుడు లేవు, ఇప్పుడే ఉన్నాయనే విపరీతవాదానికి ఆస్కారం కలుగుతుంది. అది తప్పు. అంటే, అలాంటి కట్టడులు ఎప్పుడూ ఉన్నాయని ఈ మాటల్లోని సారాంశం. పాత వ్యవస్థ తాలూకు అవశేషాలను తుడిచి పెట్టి కొత్త వ్యవస్థను నెలకొల్పడం సంప్రదాయానికి ఎంత పెద్ద పరీక్ష అయిందో, ఆ సవాలును అది ఎలా అధిగమించిందో పరోక్షంగా ఈ మాటలు సూచిస్తూ ఉండచ్చు.

ఇంకో సందర్భంలో కూడా వారణాసివారు ఇలా అంటారు:

‘కర్ణోత్పత్తిని గూర్చి కన్యాదశలోని తన వృత్తాంతమును కుంతీదేవి వ్యాసమహర్షి తోడను, వ్యాసోత్పత్తిని గూర్చి కన్యాదశలోని తన వృత్తాంతమును సత్యవతీదేవి భీష్ముని తోడను చెప్పినపుడు ఆ మహానుభావులు అట్టి యధర్మమును ధర్మముగా నంగీకరించిరట! అది యధర్మమే యైన యెడల వారు ధర్మముగా నంగీకరింపరు. వారట్లు యంగీకరించినపుడు అది యధర్మము కాదు. కనుక నధర్మమును ధర్మముగా నంగీకరించి రను మాట విరుద్ధము. పూర్వోక్తగ్రంథ సందర్భమేమి? యోగశక్తి తపోమహిమలచే జరిగిన యా లోకోత్తరఘటన యేమి? ఆ అక్షతయోనిత్వరూప కన్యాత్వ వరప్రాప్తి యేమి? భీష్మవేదవ్యాసులు దానిని ధర్మముగా నంగీకరించుట యేమి? దానిని ఈ మ. భా. చ. కారులు అధర్మ మనుట యేమి? ధర్మాధర్మ నిర్ణాయకు డా వ్యాసమునియా? యీ వ్యత్యాసమూర్తియా? “తస్మాచ్ఛాస్త్రం ప్రమాణం తే కార్యాకార్యవ్యవస్థితౌ” అనుటను బట్టి అకార్య మేదియో కార్య మేదియో తెలిసి కొనుటకు శాస్త్రమే ప్రమాణము కాని మనుష్యబుద్ధి కాదు. అట్టి స్థితిలో శాస్త్రకర్త యగు వ్యాసభగవానుడు, శాస్త్రనిష్ణాతుడగు భీష్ముడు చెప్పినదే నిజము. “వారట్లు చెప్పుటకు నాటి పరిస్థితులే కారణము” అనుట తప్పు. పరిస్థితులను బట్టి అధర్మమెపుడును ధర్మము కానేరదు. ధర్మాధర్మ నిర్ణాయకము శాస్త్రము కనుక నెట్టి పరిస్థితులలో నైనను శాస్త్రీయమే ధర్మము. అశాస్త్రీయ మధర్మమే.

ప్రతివాదులు ఆ కుంతీ సత్యవతీ చరిత్రములలో రహస్యముగా బిడ్డలను గనుటను మాత్రమే గ్రహించిరి గాని ఆపై ముఖ్యమైన కన్యాత్వసిద్ధిని గ్రహింపలేదు. అదియే వారి హృదయ దోషము.

ఈవిధంగా మనుష్యబుద్ధిపై శాస్త్ర ప్రమాణం అనే అంకుశం బిగించిన తర్వాత ఇక మాట్లాడగలిగింది ఏమీ ఉండదు. అంతిమంగా సంప్రదాయం చెలాయించే ‘వీటో పవర్’ అది!

కొసమెరుపు ఏమిటంటే, శాస్త్రమే ప్రమాణమన్న వారణాసివారు కూడా కుంతి కన్యాగర్భాన్ని సమర్థించడానికి ‘మనుష్యబుద్ధి’తో ఒక విచిత్ర తార్కాన్ని ఆశ్రయించడం! కన్యగా ఉన్నప్పుడు సంతానం కనడంలో ఉన్న తప్పును గమనించకుండా బాల్య చాపల్యంతో(బాలభావేన) వ్యవహరించానని కుంతి అంది కనుక, అప్పటికామె బాలికే తప్ప యవ్వనవతి కాదని ఆయన అన్వయించారు. ఆవిధంగా ఆమెది కన్యాగర్భమే కాక, బాలికాగర్భం కూడా. పైగా కుంతికి అలాంటి కోరిక కూడా లేని స్థితిలో సూర్యుడి నిర్బంధంవల్ల అలా జరిగిందంటున్నారు. అంటే, అప్పటికి కుంతి రజస్వల కూడా కాలేదా అన్న సందేహం ఆయన సమర్థన వల్ల కలుగుతుంది. అదే ఆయన ఉద్దేశమైతే ఇక్కడ ప్రకృతి ధర్మం కూడా సంప్రదాయపు వీటో పవర్ ముందు తలవంచుతోందన్న మాట.

అంతిమంగా ఇంకొకటి గమనించాలి. పెండ్యాలవారు సంప్రదాయ పాఠాన్ని ఆధారం చేసుకుంటూనే సంప్రదాయ భాష్యం నుంచి పక్కకు జరిగి స్వతంత్ర ఊహలు చేస్తున్నారు. వారణాసివారు పూర్తిగా సంప్రదాయ పాఠాన్ని, భాష్యాన్ని ఆధారం చేసుకుంటున్నారు. అంటే, అందులో సంప్రదాయాన్ని నొక్కి చెప్పడమే తప్ప కొత్తదనం ఏమీ లేదన్న మాట. ఆవిధంగా వీరువురూ ఒకే విధమైన ఆధార భూమిక నుంచి మాట్లాడడం లేదు. ఇంకొంచెం వివరంగా చెప్పాలంటే ఇద్దరి వాదాలూ రైలు పట్టాలవంటివయ్యాయి. వాటి మధ్య కలయిక ఎప్పటికీ సాధ్యం కాదు.

కన్యాత్వ చర్చ మరికొంత వచ్చే వారం…

 

 

Download PDF

3 Comments

  • మంజరి.లక్ష్మీ says:

    మీ వ్యాసాల్లో మీరనుసరిస్తూ ఉన్న పధ్ధతిలో ఈ వ్యాసంలో తర్కించిన విధానం బాగా కుదిరిందండీ.(లేదా నాకిది బాగా అర్ధమైందనుకోవాలి). బాగుంది.

    • కల్లూరి భాస్కరం says:

      థాంక్స్ మంజరి లక్ష్మిగారూ…గత రెండు వ్యాసాలుగా గ్రాంథిక భాషతో పాఠకుల్ని భయపెట్టేస్తున్నాననుకున్నాను. మీకిది బాగా అర్థమైనట్టు అనిపించడం, బాగుండడం నాకు పెద్ద రిలీఫ్.

  • anrd says:

    వివాహానికి పూర్వమే సంతానాన్ని పొందటాన్ని ఆ కాలంలో కూడా తప్పుగా భావించేవారు కాబట్టే కుంతీ దేవి పిల్లవాడిని పెంచటానికి భయపడింది. కర్ణుడిని వదిలి పెట్టి అన్యాయం చేసానని జీవితాంతము బాధపడింది.

    సత్యవతీదేవి కూడా తనకు గర్భం వస్తే ఎలా అని భయపడింది. వ్యాసుడు పుట్టుకతోనే పెద్దవానిగా జన్మించి తనదారిన తాను వెళ్ళాడు కాబట్టి పిల్లవాడిని ఎలా పెంచాలనే సమస్య సత్యవతీదేవికి ఎదురుకాలేదు.

    ఈ రోజుల్లో కన్యాత్వం పోకుండానే సంతానాన్ని పొందే పద్ధతులు వచ్చాయి. ఉదా.. ఆధునిక యుగంలో వివాహం అంటే ఇష్టం లేని కొందరు స్త్రీలు తమ కన్యాత్వం పోకుండానే స్పెర్మ్ బేకుల సహాయంతో సంతానాన్ని పొందుతున్నారు.

    మనుషులకే ఇన్ని పద్ధతులు తెలిసినప్పుడు దేవతలకు మరెన్నో మహిమలు ఉంటాయి కదా !

    సూర్యభగవానుడు కుంతీదేవికి కన్యాత్వం పోకుండా సంతానాన్ని ప్రసాదిస్తానని అభయమిస్తాడు. కుంతీదేవి కన్యాత్వం పోకుండానే సంతానాన్ని పొందింది.

ఒక వ్యాఖ్యను

Your email address will not be published. Required fields are marked *

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)