ద్రౌపది వివాహం: జంట సంకటం

Back-To-Godhead-5-Husbands-of-Draupadi

Kalluri Bhaskaram-pic-a.prabhakar rao (5)

కొన్నేళ్ళ క్రితం ఖుష్బూ అనే సినీనటి చేసిన ఒక వ్యాఖ్య చాలామందికి గుర్తుండే ఉంటుంది…

‘ఈ రోజుల్లో వివాహానికి ముందు ఆడపిల్లలకు లైంగిక సంబంధముండడం ఏమంత పెద్ద విషయం కాద’ని దాని సారాంశం. దానిపై జనంలో తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. నిరసన ప్రదర్శనలు జరిగాయి. టీవీ చానెళ్లలో చర్చలు జరిగాయి. నిజమే… ఆ వ్యాఖ్యను ‘దైవ దూషణ’ను మించిన అపచారంగా భావించడం సహజమే!

వేరే దేశాల అనుభవం ఎలా ఉన్నా, మన దేశంలో ఇప్పటికీ వివాహానికి ముందు ఆడపిల్లల లైంగిక సంబంధం, ఊహించడానికే దారుణమైన విషయం. దానిని ఏ రకంగా సమర్థించినా అది మనోభావాలను గాయపరుస్తుంది. కారణం, వివాహం అనే చెలియలికట్ట మన మనస్సులలో ఒక బలమైన సెంటిమెంట్ గా, అచంచలమైన విశ్వాసంగా పాతుకు పోవడమే. లైంగిక సంబంధం విషయంలో ‘వివాహానికి ముందు, తర్వాత’ అనేది ఏవిధంగానూ చెరపడానికి వీల్లేని శిలారేఖ.

నిజానికి వివాహానికి రెండు పార్స్వాలు ఉన్నాయి. ఒకటి- వ్యవస్థకు, కట్టుబాటుకు, ఆర్థికతకు సంబంధించిన లౌకికపార్శ్వం. రెండవది-సెంటిమెంటుకు, విశ్వాసానికి, భావోద్వేగాలకు సంబంధించిన పార్శ్వం. తటస్థంగా చెప్పుకుంటే, చరిత్రకు అందనికాలంలో కొన్ని లౌకిక కారణాల వల్లనే వివాహవ్యవస్థ ఏర్పడింది. కాలగతిలో అది ఒక సెంటిమెంట్ గా, విశ్వాసంగా, భావోద్వేగ అంశంగా మారి మన ఊహల్లో జీర్ణించుకుంది. ఇప్పుడు విచిత్రంగా అనిపించవచ్చు కానీ, వివాహం అనేది వ్యవస్థీకృతం అవుతున్న కాలంలో దానికి వ్యతిరేకమైన సెంటిమెంటు, విశ్వాసం, భావోద్వేగాలు ఉండి; వివాహవ్యవస్థను అవి ప్రతిఘటించి ఉన్నా ఆశ్చర్యం లేదు. అందుకు సంబంధించిన సాక్ష్యాలు ప్రపంచ వాఙ్మయం అంతటా కనిపిస్తాయి. ఈ వ్యాసాల క్రమంలో వాటి గురించిన ప్రస్తావన ముందు ముందు రావచ్చు.

చరిత్ర లోతుల్లోకి వెళ్లి ఒక పోలిక చెప్పుకోవాలంటే, అది వ్యవసాయం! వ్యవసాయం ఆహారోత్పాదనలో ఒక పురోగామి చర్య. కానీ వ్యవసాయాన్ని నామోషిగా భావించి, అందులో భాగం కావడానికి నిరాకరించి, సాంప్రదాయిక ఆహార సంపాదనకే కట్టుబడిన జాతులు ఉన్నాయి. అది కూడా సాధ్యం కానప్పుడు దొంగతనాన్ని ఆశ్రయించిన జాతులు ఉన్నాయి. కోశాంబీ ‘AN INTRODUCTION TO THE STUDY OF INDIAN HISTORY’ లో ఈ జాతుల గురించి కొంత చర్చ చేశారు.

లైంగిక సంబంధాల విషయంలో వ్యత్యాసాలు ఎలా ఉన్నా వివాహాన్ని మాత్రం ఒక ఉన్నతోన్నత విలువగా, వ్యవస్థగా దాదాపు ప్రపంచమంతా గుర్తించింది. ఆ గుర్తింపు వెనుక సంప్రదాయం కొన్ని వందలు, వేల సంవత్సరాలపాటు సాగించిన అకుంఠిత కృషి ఉంది. వివాహాన్ని వ్యవస్థీకరించడంలో సంప్రదాయం ఎదుర్కొన్న సవాళ్ళు, అనుభవాలు ఇప్పుడు మన ఊహకు అందగలిగినవి కావు. ఆ సవాళ్లలో నాటి వ్యవస్థాపరమైనవే కాక, ప్రకృతి పరమైనవి కూడా ఉన్నాయి. దేనినైనా వ్యవస్థీకరిస్తున్నప్పుడు ప్రకృతిధర్మానికి కూడా కత్తెర వేయక తప్పదు. అలాగని వివాహమనే కట్టడి చేయడంలో సంప్రదాయం పూర్తిగా కఠినంగా వ్యవహరించిందనుకోవడం కూడా పొరపాటు. ఎన్నో సడలింపులకు, సర్దుబాట్లకు అది చోటిచ్చింది. ఒక్కోసారి వివాహవ్యవస్థపైన ప్రకృతిసహజమైన లైంగికతకు, స్త్రీ-పురుష మనోభావాలకు పై చేయిని అంగీకరించడమూ అనివార్యమైంది.

మన సంప్రదాయానికే వస్తే, ధర్మశాస్త్రాలు ఎనిమిది రకాల వివాహాలను, పన్నెండు రకాల సంతానాన్ని అంగీకరించడమే ఉదాహరణ. వివాహవ్యవస్థకు అనుగుణంగా స్త్రీ-పురుష స్వేచ్ఛను, లైంగికతను నియంత్రించలేనప్పుడు; వాటికి అనుగుణంగా వివాహవ్యవస్థలోనే సర్దుబాట్లు చేయవలసివచ్చింది. దాని ఫలితమే అన్ని రకాల వివాహాలు, అన్ని రకాల సంతానాలు. వీటి గురించి వివరంగా చెప్పుకునే సందర్భం ముందు ముందు వస్తుందేమో, చూద్దాం.

విశేషమేమిటంటే, ఇన్ని వందలు, వేల సంవత్సరాల అనుభవంలో కూడా వివాహం అనేది అందరికీ ఒకే విధంగా వర్తించేలా పూర్తిగా వ్యవస్థీకృతం కాలేదు. ఎప్పటికైనా పూర్తిగా వ్యవస్థీకృతం అవుతుందో కాదో కూడా చెప్పలేం. ఇప్పుడు వివాహేతర ‘సహజీవనా’న్ని న్యాయవ్యవస్థ గుర్తించడాన్నే చూడండి. మనదేశపు అనుభవంనుంచే చూస్తే, వివాహవ్యవస్థ అన్ని కులాలలోనూ, అన్నివర్గాలలోనూ, అన్ని ప్రాంతాలలోనూ ఒకేలా లేదు. ఒక ఉదాహరణ: మారు మనువులు. కొన్ని కులాలలో మారు మనువులుంటే కొన్ని కులాలలో లేవు.

గురజాడవారి ‘కన్యాశుల్కం’ నాటకంలో మారుమనువుల ప్రస్తావన వస్తుంది:

‘మా సూపరెంటు పిల్లలతో ఉన్న రెండో పెళ్లి దొరసాన్ని పెళ్లాడి సుఖంగా ఉండలేదా?’ అని హెడ్ కానిస్టీబులు  అంటాడు.

‘మావగారి అబిప్పరాయం పెయ్యతో టొచ్చిన ఆవు మేలు కాదా అని’ మునసబు అంటాడు. ‘ముసలి బాపనోడు (లుబ్ధావధాన్లు) యెదవ గుంటని పెళ్లాడితే మీ నేస్తం కరణపోణ్ణి (రామప్పంతుల్ని) ఆ ముసలాడి యెదవ కూతుర్ని (మీనాక్షిని) పెళ్లాడమని బోద సెయ్యరాదా?’ అంటాడు.

‘మనకేల మావా? గవునర్ మెంటూ దేవుళ్లూ బ్రాహ్మలూ వారి నేరాలు వారివి’ అని హవల్దార్ అచ్చన్న అంటాడు.

‘మనలో మారుమనువు లుండేవి కావా?’ అని మునసబు అంటాడు.

చెప్పొచ్చేదేమిటంటే, ఇప్పుడు తాతముత్తాతల ఆస్తుల్ని అనుభవిస్తున్నవారికి, వారు ఆ ఆస్తులు కూడబెట్టడానికి ఎంత శ్రమించారో తెలియనట్టే; వివాహాన్ని ఒక సెంటిమెంటుగా విశ్వాసంగా జీర్ణించుకున్న మనకు, ఆ కట్టడికి రూపమివ్వడంలో సంప్రదాయం ఎంత చెమటోడ్చిందో తెలియదన్నమాట.

 

***

ravi_varma-draupadi_carrying_milk_honey1

కన్యాత్వంతో పీటముడి ఉన్న వివాహం గురించి అవసరమైన ఈ నాలుగు మాటలూ చెప్పుకున్న తర్వాత విషయంలోకి వద్దాం.

మహాభారత కథకుడు కన్యాగర్భం, ద్రౌపది అయిదుగురిని వివాహమాడడం అనే రెండు ధర్మసంకటాలను ఎదుర్కొన్నాడని ఇంతకు ముందు అనుకున్నాం. నిజానికి ద్రౌపది వివాహంలో ఒకటి కాదు, రెండు ధర్మసంకటాలు ఉన్నాయి. మొదటిది, అయిదుగురిని వివాహమాడడం; రెండోది కన్యాత్వం. అదెలాగంటే, పెద్దవాడైన ధర్మరాజు మొట్టమొదట ఎప్పుడైతే ద్రౌపది పాణిగ్రహణం చేశాడో అప్పుడామె కన్యావస్థనుంచి వివాహితావస్థకు మారిపోతుంది. ఆ తర్వాతి నలుగురూ కన్యను కాక వివాహితను పెళ్లాడినట్టు అవుతుంది. అది శాస్త్రవిరుద్ధం. ఆవిధంగా ద్రౌపది వివాహం జంట సంకటంగా పరిణమించిందన్న మాట. ఈ రెండు సంకటాలను కథకుడు జమిలిగా ఎలా పరిష్కరించాడో చూద్దాం:

ద్రౌపదిని అర్జునుడు స్వయంవరంలో గెల్చుకున్నాడు. తల్లి చెప్పడంతో పాండవులు అయిదుగురూ ఆమెను పెళ్లాడడానికి నిర్ణయించుకున్నారు. ధర్మరాజు ఈ నిర్ణయాన్ని ద్రౌపది తండ్రి అయిన ద్రుపదుడి ముందు ఉంచాడు. ఆశ్చర్యపోయిన ద్రుపదుడు,‘ఒక పురుషుడికి అనేక మంది భార్యలు ఉండచ్చు కానీ, అనేకమంది పురుషులకు ఒక్కతే భార్య అన్నది ఏ యుగంలోనూ ఏ కథల్లోనూ వినలేదు. నువ్వేమో అన్ని ధర్మాలూ తెలిసినవాడివి. కనుక నువ్వు మాట్లాడేది ధర్మవిరుద్ధం కావడానికి వీల్లేదు. అయినా దీనిపై రేపు నువ్వు, నేను, కుంతీదేవి, దృష్టద్యుమ్నుడు చర్చించుకుని నిర్ణయం తీసుకుందా’ మన్నాడు.

ఆ తర్వాత హఠాత్తుగా వేదవ్యాసుడు ద్రుపదుని దగ్గరకు వచ్చాడు. అప్పుడు ద్రుపదు డాయనకు ధర్మరాజు ప్రతిపాదన గురించి చెప్పి,‘మీరు ఎరగని లోకాచారాలు ఉండవు కనుక మీరే ఇందులో ధర్మాధర్మ నిర్ణయం చేసి, ధర్మసంకరం కాకుండా చూడవలసిం’దని ప్రార్థించాడు.

అప్పుడు ధర్మరాజు జోక్యం చేసికొని,‘పరిహాసంగా కూడా నేను ఎప్పుడూ అధర్మం మాట్లాడలేదు. ధర్మం తప్పలేదు. కనుక తగునా, తగదా అనే ఆలోచన మానేసి ద్రౌపదిని మా అయిదుగురికీ ఇచ్చి పెళ్లి చేయం’డని నిశ్చితంగా చెప్పాడు. ఆపైన,‘పూర్వం గౌతమ గోత్రానికి చెందిన జటిలు డనే ఋషి కూతురు తపః ప్రభావంతో ఏడుగురు ఋషులకు భార్య అయిందనీ, దాక్షాయణి అనే ముని కన్య ప్రచేతసులనే ఒకే పేరు గలిగిన పదకొండుమందికి భార్య అయిందనీ కథల్లో వింటూ ఉంటాం. అదీగాక, గురువులలోనే పరమ గురువు అయిన మా తల్లి ఆదేశాన్ని, విధి నిర్దేశాన్ని త్రోసిపుచ్చడం సాధ్యం కాదు’ అని మరోసారి నిష్కర్షగా అన్నాడు.

అప్పుడు ద్రుపదుడు ‘ధర్మసూక్ష్మాన్ని నిర్ణయించడం మన వల్ల కాదు. త్రిలోకపూజ్యుడు, త్రికాలవేది అయిన వ్యాసమహర్షి ఎలా చెబితే అలా చేద్దాం’ అన్నాడు. దానికి వేదవ్యాసుడు,‘ధర్మరాజు ధర్మతత్వం తెలిసినవాడు. కనుక అతను ధర్మ మార్గం తప్పే ప్రశ్న లేదు. అలాగే దేవతామూర్తి అయిన ఈ కుంతీదేవి నోట కూడా అబద్ధం రాదు. వీళ్ళ మాటలూ, దేవతల అభిమతమూ రెండూ ఒకటే. కనుక నిస్సంకోచంగా నీ కూతురిని ఈ అయిదుగురికీ ఇచ్చి పెళ్లి చేయి. అదీగాక, దీని వెనుక ఒక రహస్యం ఉంది. వినడానికి నువ్వు ఇష్టపడితే చెబుతాను విను’ అంటూ ద్రుపదుని చేయి పట్టుకుని ఏకాంతప్రదేశానికి తీసుకుని వెళ్ళి ఇలా చెప్పడం ప్రారంభించాడు:

“ద్రౌపది పూర్వజన్మలో ఇంద్రసేన అనే పరమ పతివ్రత. మౌద్గల్యుడు అనే మహాముని భార్య. కర్మవశాత్తూ ఆ మునికి కుష్టువ్యాధి వచ్చింది. దానికితోడు వృద్ధాప్యం. ఆపైన అతికోపం. అయినాసరే, అతని దుర్గంధంతో సహా అన్నీ భరిస్తూ, ఏమాత్రం అసహ్యించుకోకుండా ఇంద్రసేన అతనికి భక్తితో సేవలు చేస్తూ ఉండేది. అతను తిన్న తర్వాత అతని ఎంగిలినే తను తింటూ ఉండేది. ఒకరోజున అలా తింటుండగా అన్నంలో తెగిపడిన అతని వేలు ఒకటి కనిపించింది. ఇంద్రసేన ఏవగించుకోకుండా దానిని తీసి పక్కన పెట్టి ఎంతో ఇష్టంగా ఆ అన్నం తింది.

మౌద్గల్యుడు అది చూశాడు. ఆమె భక్తికి మెచ్చుకున్నాడు. ‘నీకు ఏది ఇష్టమో కోరుకో, ఇస్తాను’ అన్నాడు. ‘నాకు కామేచ్ఛ ఎక్కువగా ఉంది. నువ్వు తపశ్శక్తితో ఈ బీభత్సరూపం వదిలేసి అందమైన అయిదుగురు పురుషుల రూపం ధరించి నాతో రమించి నన్ను సంతోషపెట్టు’ అని ఇంద్రసేన అంది. అప్పుడు ఆ ముని ఆమెకు ఇష్టమైనట్టు అయిదు దేహాలు ధరించి అనేకచోట్ల విహరింపజేస్తూ అనేక వేల సంవత్సరాలపాటు ఆమెతో రమించాడు. ఆవిధంగా తను తృప్తి చెందిన తర్వాత ఆమెను వదిలేసి తను తపస్సుకు వెళ్లిపోయాడు.

అయితే, ఇంద్రసేన తృప్తి చెందలేదు. కొంతకాలానికి మరణించి కాశీరాజు కూతురుగా పుట్టింది. భర్త దొరకకపోవడంతో చాలాకాలం కన్యగానే ఉండిపోయింది. తన దౌర్భాగ్యస్థితికి విచారించి భర్త కోసం శివుని ఉద్దేశించి తపస్సు ప్రారంభించింది. అప్పుడు యముడు, వాయువు, ఇంద్రుడు, అశ్వినీ దేవతలు ఆమెపై ప్రీతి చెంది ఆమె దగ్గరకు వచ్చి, వచ్చే జన్మలో మా అంశతో పుట్టేవారికి భార్య కావలసిందని కోరారు. ఇంద్రసేన తపస్సును కొనసాగించింది. అది క్రమంగా ఉగ్రతపస్సు అయింది. అప్పుడు ఆమెకు శివుడు ప్రత్యక్షమై వరం కోరుకోమన్నాడు. తనకు పతిదానం చేయమని అయిదుసార్లు అడిగింది. సరే, నీకు వచ్చే జన్మలో అయిదుగురు భర్తలు లభిస్తారని శివుడు అన్నాడు.

‘ఎక్కడైనా ఒక స్త్రీకి ఒక్కడే భర్త. పలువురు భర్తలు ఉన్నట్టు ఏ కథల్లోనైనా విన్నామా? ఇలాంటి లోకవిరుద్ధమైన వరం నాకు వద్దు’ అని ఇంద్రసేన అంది. అప్పుడు శివుడు,‘నీకు అయిదుగురు భర్తలైనా నా వచనప్రభావం వల్ల అది ధర్మబద్ధమే అవుతుంది. నీ మీద దయతో ఇలాంటి వరం ఇస్తున్నా’ నన్నాడు. ‘అలా అయితే, ఆ అయిదుగురు భర్తలతో నేను ఉన్నప్పుడు, ప్రత్యేకంగా ఒక్కొక్కరితో సంగమించేటప్పుడు నాకు కౌమారాన్ని (అంటే కన్యాత్వాన్ని), పతి సేవాభాగ్యాన్ని, కామోపభోగాన్ని, సౌభాగ్యాన్ని ఇవ్వవలసిం’దని ఇంద్రసేన అడిగింది. శివుడు సరే నన్నాడు…”

ఈ ఘట్టాన్ని వ్యాసుడు మరికాస్త పొడిగించి, దేవతలకు మేలు చేయడం కోసం ఇంద్రుడే అయిదు రూపాలు ధరించి యమ, వాయు, ఇంద్ర, అశ్వినుల అంశతో పాండవుల రూపంలో మనుష్యజన్మ ఎత్తాడంటూ ఆ కథ కూడా చెప్పాడు. ఈవిధంగా కాశీరాజు కుమార్తెగా పుట్టిన ఇంద్రసేనే ఈ జన్మలో ద్రౌపదిగా యజ్ఞవేదిలో జన్మించిందని చెప్పిన వ్యాసుడు,‘ఇప్పటికీ నువ్వు నమ్మకపోతే, ద్రౌపది, పాండవుల పూర్వదేహాలు చూడు’ అంటూ ద్రుపదునికి దివ్యదృష్టి ఇచ్చాడు. అప్పుడు ప్రకాశవంతమైన మణులు పొదిగిన విచిత్ర కిరీటాలతో, బంగారు ఆభరణాలతో, తాటి చెట్టంత ఎత్తైన దేహాలతో పాండవులూ; ఆ అయిదుగురికి భార్య కావడం కోసం తపస్సు చేసిన సకల లావణ్యమూర్తి అయిన ఆ కన్యకా పూర్వదేహాలతో ద్రుపదుడికి కనిపించారు. అతను ఆశ్చర్యపోయాడు.

వ్యాసుడు ఇంకా ఇలా అన్నాడు:

“పూర్వం నితంతుడనే రాజర్షి ఉండేవాడు. అతనికి సాల్వేయుడు, శూరసేనుడు, శ్రుతసేనుడు, బిందుసారుడు, అతిసారుడు అనే అయిదుగురు కొడుకులు ఉండేవారు. వారు మహా పరాక్రమవంతులు. అన్యోన్య స్నేహానికి, ఐకమత్యానికి కూడా ఆ సోదరులు ప్రసిద్ధులయ్యారు. వారు అయిదుగురూ ఔశీనరుడనే రాజుకూతురు అజితను స్వయంవరంలో గెల్చుకుని వివాహమాడారు. ఆమె వల్ల అయిదుగురూ విడివిడిగా సంతానం పొందారు.

వెనకటి మహాత్ములకు సంబంధించి కూడా ఇలాంటి చరిత్రలు ఉన్నాయి. కనుక పాండవులు అయిదుగురికీ ఒకరి తర్వాత ఒకరుగా ద్రౌపదిని ఇచ్చి పాణిగ్రహణం చేయించు. ఇది మనం చేసేది కాదు, దైవనిర్ణయం.”

ద్రుపదుడు అంగీకరించాడు.

***

Back-To-Godhead-5-Husbands-of-Draupadi

ఇది తెలుగు భారతంలోని కథ. సంస్కృత భారతంలో కొంత తేడా కనిపిస్తుంది. దాని ప్రకారం, మౌద్గల్యుడు ఇంద్రసేన కోరినట్టు ఆమెతో అయిదు రూపాలతో చిరకాలంపాటు సుఖించిన తర్వాత విరక్తుడై తపస్సుకు వెళ్లిపోవాలనుకుంటాడు. అప్పుడు,‘నేనింకా తృప్తి చెందలేదు, నన్ను విడిచిపెట్టి వెళ్లద్దు’ అని ఇంద్రసేన అంది. ‘నువ్విలా నాతో అనకూడని మాట అన్నావు కనుక ద్రుపదుని కూతురిగా పుట్టి అయిదుగురు భర్తలను పొందు’ అని మౌద్గల్యుడు ఆమెను శపించాడు. అప్పుడు ఖిన్నురాలైన ఇంద్రసేన శివుని గురించి తపస్సు చేసింది. శివుడు ప్రత్యక్షమై ‘నువ్వు పై జన్మలో ఉత్తమస్త్రీవి అవుతావు. దేవేంద్రుడితో సమానులైన అయిదుగురు నీకు భర్త లవుతారు. నువ్వొక దైవకార్యానికి నిమిత్తమవుతావు’ అని వరమిచ్చాడు. అప్పుడు ఇంద్రసేన,‘నేను ఒక్క భర్తనే అడిగితే అయిదుగురు భర్తలంటున్నావేమిటి? ఒక స్త్రీకి ఒక్క భర్తే కానీ బహు భర్తలు ఉండకూడదు కదా?’ అంది. ‘నువ్వు పతిని ఇవ్వమని అయిదుసార్లు అడిగావు కనుక ఈ వరం ఇచ్చా’నని శివుడు అన్నాడు.

దానికి ఇంద్రసేన,‘ స్త్రీకి ఒకే భర్త ఉండాలనీ, పురుషుడికి అనేకమంది భార్యలు ఉండవచ్చుననీ మునులు నిర్ణయించారు. అదే లోకధర్మం. ఆపత్కాలంలో నియోగవిధిని బట్టి, భర్తకంటె అన్య పురుషుడితో సంబంధాన్ని చెప్పారు. మూడో పురుషుడితో సంబంధం ఉంటే ప్రాయశ్చిత్తం చెప్పారు. నాలుగో పురుషుడితో సంబంధం వల్ల పతితురాలు అవుతుందని చెప్పారు. అయిదో పురుషుడితో సంబంధం వల్ల బంధకి అవుతుంది. ఇదీ ధర్మమార్గం. కనుక నాకు బహు భర్తలు వద్దు. నాకు అదే తప్పకపోతే ఒక వరం ఇవ్వు. ఒక్క పతితో ఉన్న ప్రతిసారీ నాకు కన్యాత్వం కలిగేలా అనుగ్రహించు’ అంది. శివుడు సరే నన్నాడు.

***

తెలుగు, సంస్కృత పాఠాలు రెంటిలోనూ కొన్ని సందేహాలు కలుగుతాయి. మొదటిది, నీకు అయిదుగురు భర్త లవుతారని మౌద్గల్యుడు శపించినప్పుడు; అలాంటి శాపం ఇవ్వవద్దనీ, ఒక్క భర్త మాత్రమే లభించేలా దానిని సవరించమనీ అతనినే ఇంద్రసేన కోరి ఉండవచ్చు. కానీ కోరకుండా శివుని గురించి తపస్సు చేసింది. అప్పుడు కూడా ధర్మబద్ధంగా ఒక్క భర్తనే ఇవ్వమని అడగవలసింది పోయి, అయిదుసార్లు భర్తనిమ్మని అడిగింది. శివుడు అయిదుగురు భర్తలను ఇస్తాననేసరికి, అదెలా కుదురుతుంది, ధర్మబద్ధంగా ఒక్క భర్తనే ఇవ్వమని అడిగింది. అలా కానప్పుడు, ఒక్కొక్క భర్తతోనే ప్రత్యేక సంగమాన్ని, కన్యాత్వాన్ని ఇవ్వమని కోరింది. అంటే, ఒక భర్త దగ్గరనుంచి ఇంకో భర్తవద్దకు మారిన ప్రతిసారీ తను కన్యగా మారిపోవాలని ఆమె కోరిందన్నమాట.

చూడండి… ’ఒక భర్త-అయిదుగురు భర్తలు’ అనే అంశం చుట్టూ విషయం ఎలా పరిభ్రమిస్తోందో! ‘ద్రౌపదికి అయిదుగురు భర్తలు’ అనే విషయాన్ని చెప్పడం కథకుడికి ఎలాగూ తప్పదు. కానీ అందుకు ఏవో ప్రత్యేకకారణాలు చెప్పడానికి ప్రతి దశలోనూ ప్రయత్నిస్తున్నాడు. ఒక స్త్రీకి ఒకే భర్త అనే ధర్మాన్ని మధ్య మధ్య తీసుకు వస్తున్నాడు. లేదా గుర్తు చేయడానికి ప్రయత్నిస్తున్నాడు. ద్రౌపది అయిదుగురికి భార్యే అయినప్పటికీ ఒక భర్త దగ్గర ఉన్నప్పుడు ఆ ఒక్కడికే భార్య. ఆమెకు ఆ ఒక్కడే భర్త. ఎందుకంటే, ఒక భర్త దగ్గరనుంచి ఇంకో భర్త దగ్గరికి వెళ్ళేటప్పటికి ఆమె కన్యగా మారిపోతుంది. అప్పుడామె ‘అక్షతయోనిత్వం’ పొందుతుందన్న మాట. ఈ విధంగా చూసినప్పుడు ద్రౌపదికి అయిదుగురు భర్తలనడం కథకుడి దృష్టిలో కేవలం సాంకేతికవివరం, లేదా లోక వ్యవహారం మాత్రమే. నిజానికి ఆమె ప్రతిసారీ, ప్రతి ఒక్క భర్త దగ్గరకూ వెళ్ళేటప్పుడు కన్యగానే వెడుతుంది కనుక, అతనితో ఉన్నంతసేపూ అతనొక్కడే ఆమెకు భర్త. ఆమె ఏ భర్తతోనూ లేని కాలం ఉందనుకోండి, అప్పుడామె కన్యగానే ఉండిపోతుంది. ఆ సమయంలో ఆమె పంచభర్తృత్వమే కాదు, వివాహం కూడా రద్దైపోతుంది! ఇదో విచిత్రమైన పరిస్థితి.

అందుకే ద్రౌపదిని ‘పంచకన్యల’లో ఒకరుగా చెప్పారా?! సంప్రదాయం ప్రకారం, అహల్య, ద్రౌపది, కుంతి, తార(రామాయణంలో వాలి భార్య), మండోదరి(రావణుని భార్య) పంచకన్యలు. వీరిలో మండోదరి సంగతి తెలియదు కానీ; మిగిలిన నలుగురికీ ఒకరి కంటే ఎక్కువమంది పురుషులతో సంబంధం ఉన్నట్టు కనిపిస్తుంది. అహల్య గౌతముడనే మునికి భార్యకాగా, ఇంద్రుడు ఆమెను కామించి సంబంధం పెట్టుకున్నాడు. కుంతి సంగతి తెలిసినదే. వాలి మరణించిన తర్వాత తార, వాలి తమ్ముడైన సుగ్రీవునికి భార్య అయింది. వీరందరికీ ఒకరిని మించి పురుషులతో సంబంధమున్న స్థితిలో ఆ దోషాన్ని నివారించడానికి వీరిని నిత్యకన్యలుగా సంప్రదాయం చెబుతోందనుకోవాలి.

ద్రౌపదికి ఒకడే భర్త అన్న విషయాన్ని కథకుడు ఇంకో విధంగా కూడా చెబుతున్నాడు. పూర్వజన్మలో ఆమె మౌద్గల్యుడి ఒక్కడికే భార్య. అతన్నే అయిదురూపాలు ధరించి తనతో సంగమించమని కోరింది. ద్రౌపదిగా జన్మించినప్పుడు ఆమెకు భర్తలైన పాండవులు కూడా ఇంద్రుడనే ఒక్కడికే భిన్న రూపాలు మాత్రమే. ఇలా చూసినా ద్రౌపదికి ఒకడే భర్త.

మొత్తానికి ‘ఒక స్త్రీకి ఒకడే భర్త’ అన్న వివాహవ్యవస్థలోకి ద్రౌపదిని తీసుకురావడానికి వరాలు, శాపాలు, దైవనిర్ణయాల రూపంలో కథకుడు ఆశ్రయించిన ఉపాయాలు అర్థమవుతూనే ఉన్నాయి. ఆ విధంగా ఒక ధర్మసంకటం నుంచి అతను బయట పడ్డాడు. పాండవులలో పెద్ద అయిన ధర్మరాజును పెళ్లాడిన తర్వాత, ద్రౌపది కన్యాత్వాన్ని కోల్పోయి వివాహిత అవుతుంది కనుక, అప్పుడు తర్వాతివారైన భీమార్జున నకుల సహదేవులు ఒక ‘వివాహిత’ను పెళ్లాడడం అనే శాస్త్రవిరుద్ధమైన పరిస్థితి తలెత్తుతుంది కనుక దానికి పరిహారంగా ఆమెకు శివుడు కన్యాత్వవరం ఇచ్చినట్టు చెప్పాడు. ఆవిధంగా రెండో ధర్మ సంకటం నుంచి బయటపడ్డాడు.

తెలుగు భారతంలో ఇలా ఉంది: “…ముందర ధర్మపుత్రునకు ద్రుపదరాజపుత్రిం బాణిగ్రహణంబు సేయించి తొల్లి యేవురకు వివాహంబు సేయునప్పుడు కన్యాత్వంబు దూషితంబు గాకుండ నీశ్వరు వరంబున గౌమారంబు వడసిన యక్కన్యకం గ్రమంబున భీమార్జున నకుల సహదేవులకుం బాణిగ్రహణంబు సేయించిన…”

మరికొన్ని విశేషాలు వచ్చే వారం…

-కల్లూరి భాస్కరం

Download PDF

4 Comments

 • buchireddy gangula says:

  ఖుశుబు —–ఒపీనియన్ తో నేను ఎ కి బ విస్తాను —
  పురుషుని కి ఒక రూల్ స్త్రీ కి మరొక రూల్ దేనికి ?? ఎందుకు
  యింకా యిప్పటి కి స్త్రీ పురుషుని తో సమానం కాదు —అనే తీరులోనే
  యి దోపిడీ వ్యవస్థ కొనసాగుతుంది —
  బార్య పూజలు చేస్తే భర్త — ఎక్కువ కాలం జీవిస్తాడని —ఉపవాసాలు — పూజలు ??
  యింకా ఎంత కాలం — బాబా ల ను — స్వాములను — జియ్యం గార్లను నమ్ముకుంటూ —
  వాళ్ళు చెప్పేది సత్యం –అలా పాటిస్తే — స్వర్గాని కి వీసా — అంటూ నమ్ముతూ
  దేవుళ్ళ కథలను — కు — అంతా ఇంపార్టెన్స్ అవసరమా ??
  అగ్ర కుటుంభాల లో — ఉన్నోల్ల ఫామిలీస్ —కాలు జారినా —అది తప్పు కాదు — అదే
  లేనోల్లకే — యి రూల్స్ –?? యి చట్టాలు ??
  అమెరికా లో మన పిల్లలు — బాయ్ ఫ్రెండ్ — గర్ల్ ఫ్రెండ్ అంటూ — పెళ్ళికి ముందు
  ఎన్ని రకాల అనుభవాల తో —ఉంటున్నారో —-??మన దేశం లో అలా చేస్తే తప్పు –దేనికి ??
  (మన దేశం లో లో కూడా మార్పు వచ్చింది )—-మార్పు అవసరం
  ——————————————————————————–
  బుచ్చి రెడ్డి గంగుల

  • కల్లూరి భాస్కరం says:

   బుచ్చిరెడ్డి గారూ… మీ స్పందనకు ధన్యవాదాలు.

 • anrd says:

  శ్రీ పాద శ్రీ వల్లభ సంపూర్ణ చరితామృతము ..గ్రంధములో ఎన్నో విషయాలు ఉన్నాయి. ఆసక్తి ఉన్నవారు చదవగలరు.
  …………………..
  సృష్టికి ఆదిలో ఒక మహాశక్తి తనను తాను రెండుగా విభజించుకుని ఎడమభాగం స్త్రీగా కుడిభాగం పురుషునిగా ఏర్పడాయని గ్రంధాల ద్వారా తెలుస్తోంది. ఈ విషయాన్ని గమనించితే స్త్రీ పురుషుడు ఇద్దరూ సమానమే. ఇద్దరూ గొప్పవారే. మాతృస్వామ్యం పితృస్వామ్యం అనేవి తరువాత ఏర్పడిన భావాలు కావచ్చు.

  ఒక భార్య ఒక భర్త అనే పద్ధతికే ప్రాచీనులు పెద్దపీట వేశారు. అదే ఉత్తమమైన పద్ధతి. అయితే , విభిన్నమైన ఆలోచనలు, విభిన్నమైన పరిస్థితుల వల్ల లోకంలో అందరి జీవితాలు ఒకేలా నడవవు కదా ! ఎన్నోరకాల కారణాల వల్ల జీవితాలు మారుతుంటాయి. లోకంలో ఎలా ప్రవర్తిస్తే ఎలాంటి ఫలితం ఉంటుందో పురాణేతిహాసాల ద్వారా పెద్దలు తెలియజేశారు.

 • anrd says:

  యాదవులు యయాతి కి దేవయానికి జన్మించిన యదు సంతతివారేనంటారు. అయితే యయాతి ఇచ్చిన శాపం వల్ల యాదవులు రాజ్యపాలనావకాశాన్ని కోల్పోయారంటారు.
  ………………..
  ఒక స్త్రీకి ఒకే భర్త. ఒక పురుషునికి ఒకే భార్య అన్నది ఉత్తమమైన అద్ధతి. అయితే అనేక కారణాల వల్ల అనేక వివాహాలు జరుగుతుంటాయి.

  మాతృస్వామ్యంలో ఒక స్త్రీకి అనేకమంది భర్తలు ఉండేవారని వ్రాసారు. పురుషుడు అనేక మంది స్త్రీలను వివాహం చేసుకుంటున్నప్పుడు ..స్త్రీ అనేకమంది పురుషులను వివాహం చేసుకుంటే తప్పేమిటని కొందరు అంటుంటారు.

  ప్రతి స్త్రీ ప్రతి పురుషుడు తన రక్తం పంచుకు పుట్టిన సంతానం జన్మించాలని ఆశపడతారు.
  అయితే గర్భం ధరించి సంతానాన్ని పొందే అవకాశం స్త్రీకి మాత్రమే ఉంది.

  తనకు జన్మించిన సంతానం తన సంతానమే అన్నది స్త్రీకి చక్కగా తెలుస్తుంది. ఒక స్త్రీకి అనేకమంది భర్తలున్నప్పుడు తన భార్య ద్వారా జన్మించిన సంతానం తన వల్ల జన్మించిన బిడ్డో కాదో భర్తకు ఎలా తెలుస్తుంది ?

  అందువల్లే పితృస్వామ్యం ప్రాధాన్యతలోకి వచ్చి ఉంటుంది. అరటాకు ముల్లుపై పడ్డా ముల్లు అరటాకు పై పడా అరటాకుకే నష్టం అంటారు పెద్దలు. ఇక్కడ అరటాకు స్త్రీనా ? లేక పురుషుడా ? అన్నది పెద్ద ప్రశ్న.

  ఇవన్నీ ఆలోచించి , అభద్రతా భావం వల్ల భర్త తన భార్యను అనుమానించటం, ఆంక్షలు విధించటం చేస్తారేమోనని నాకు అనిపిస్తుంది.

  అయితే భర్త భార్యను అనుమానించి హింసించటం చాలా తప్పు. స్త్రీ తన జీవితంలో తన కుటుంబానికే ఎక్కువ విలువనిస్తుంది. తన భర్త, పిల్లలు తన కుటుంబం ముఖ్యమనుకుంటుంది. భర్త కొంచెం ప్రేమగా ఉంటే చాలు అనుకుంటుంది.

  పరాయి ఆకర్షణలకు అర్రులు చాచటం స్త్రీ స్వభావం కాదు. పురుషులు ఇది తెలుసుకుంటే చాలు
  .

ఒక వ్యాఖ్యను

Your email address will not be published. Required fields are marked *

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)