ఇప్పుడైనా ఈ చరిత్ర మారుతుందా?!

telangana 14

venu1గతవర్తమానం 04

 

 

జూన్ 1 అర్ధరాత్రి, జూన్ 2 ఉదయించే వేళ. తన అరవై సంవత్సరాల స్వయంపాలనా ఆకాంక్ష నెరవేరిందని తెలంగాణ సమాజం సంబరాలు చేసుకుంటున్న వేళ, రెండు మూడు రోజుల ముందునుంచీ ఆ వర్తమాన సంతోష సందోహంలో భాగమవుతూనే నా మనసు మాత్రం సంక్లిష్ట సందేహ గతంలో తిరుగాడుతోంది. చరిత్రలో తెలంగాణ ఎన్నోసార్లు సంబురపడింది. తన తండ్లాట తీరిందనీ, తన కోరిక నెరవేరిందనీ అనుకుంది. కాని ఎక్కడి గొంగడి అక్కడ్నే అనే నుడికారం తిరిగితిరిగి నిజమయింది. ఈసారీ అంతేనా, ఏమన్నా మారుతుందా అని ప్రశ్నలే ప్రశ్నలు. చారిత్రక ఘటనల మధ్య సామ్యం ఎంత ఉంటుందో భేదమూ అంతే ఉంటుందన్నది నిజమే గాని తేదీలు దాదాపు కలిశాయి గనుక సరిగ్గా డెబ్బై సంవత్సరాల కిందటి ఇటువంటి సందర్భమే గుర్తుకొచ్చింది.

అది తెలంగాణ చరిత్ర ఒక గుణాత్మకమైన మలుపు తిరిగిన సందర్భం. సుప్రసిద్ధమైన పదకొండో ఆంధ్ర మహాసభ బోనగిరిలో 1944 మే 27, 28 ల్లో జరిగింది. అంతకు మూడు నాలుగు సంవత్సరాల ముందునుంచీ సాగుతున్న అభిప్రాయభేదాలు ఒక దశకు చేరి ఆ రోజున ఆంధ్ర మహాసభ చీలిపోయింది. అప్పటికి కనీసం ఆరు దశాబ్దాలుగా సాగుతున్న తెలంగాణ సమాజపు తండ్లాట ఆ రోజున ఒక పరిష్కార మార్గాన్ని చేపట్టింది. ఆ మార్గం మరిన్ని మలుపులు తిరిగి ఆ తండ్లాట యథావిధిగా మిగిలిపోవడమో, ఇంకా పెరగడమో వేరే కథ. కాని ఆ రోజునూ, ఆ రోజుకు అటూ ఇటూ సాగిన చరిత్ర పురిటి నొప్పులనూ ఇవాళ గుర్తు తెచ్చుకోవడం చాల అవసరం. తెలంగాణ తండ్లాట పరిష్కారమయిందనే అభిప్రాయం ఇవాళ మరొకసారి వ్యాపిస్తున్నప్పుడు, అప్పటి పరిష్కారాన్ని పునర్దర్శించడం చాల అవసరం. సరిగ్గా అప్పటిలాగే తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న అనేక శక్తులలో ఒక శక్తిది మాత్రమే పైచేయి అవుతున్నప్పుడు నాటి చరిత్రను మననం చేసుకోవడం అవసరం. గత వర్తమానాల మధ్య సంభాషణ ఇవాళ్టి అవసరం.

తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట చరిత్ర మీద దాదాపు వంద పుస్తకాలు వెలువడినప్పటికీ, అది చరిత్ర, జీవిత చరిత్ర, ఆత్మకథ, వ్యాసం, కథ, నవల, కవిత్వం, నాటకం, విశ్లేషణ వంటి అన్ని ప్రక్రియలలోకీ వ్యాపించినప్పటికీ ఇంకా ఆ పోరాటాన్ని చారిత్రక, సామాజిక, స్థానిక నేపథ్యం నుంచి చూడవలసినంతగా, చూడవలసినట్టుగా చూడలేదనే అనిపిస్తుంది. దాన్ని కమ్యూనిస్టు పార్టీ నడిపిన రైతాంగ సాయుధ పోరాటంగా చూడడం ఎంత సముచితమో, తెలంగాణ సమాజం భారత కమ్యూనిస్టు పార్టీకి నేర్పిన రైతాంగ సాయుధ పోరాటంగా చూడడం కూడ అంతే సముచితం. నిజానికి 1938-39ల్లో కమ్యూనిస్టు పార్టీ తెలంగాణలో ప్రవేశించడానికి చాల ముందు నుంచే తెలంగాణ సమాజంలో ధిక్కార స్వభావం ఉన్నది. మెరుగైన, మంచి బతుకు కోసం తండ్లాట ఉన్నది. తెలంగాణ సమాజం సాగించిన ఆ తండ్లాటకు స్వయంనిర్ణయాధికారం, స్వావలంబన, స్వాభిమానం అనే మూడు ఆకాంక్షల ఆధార భూమికలున్నాయి. ఆ ఆకాంక్షలు అర్థవంతంగా, సుస్థిరంగా నెరవేరాలంటే విశాల ప్రజారాశుల భాగస్వామ్యంతో, శాస్త్రీయ దృక్పథంతో, సమగ్ర పోరాటం జరగాలనే అవగాహన బలపడిన సందర్భం బోనగిరి ఆంధ్ర మహాసభ.

హైదరాబాద్ లో తొలి స్వాతంత్ర సమర యోధుడు తుర్రే బాజ్ ఖాన్ స్మారక స్థూపం

హైదరాబాద్ లో తొలి స్వాతంత్ర సమర యోధుడు తుర్రే బాజ్ ఖాన్ స్మారక స్థూపం

తెలంగాణలో స్వయంనిర్ణయాధికార ఆకాంక్షను ఢిల్లీని ఎదిరించిన ప్రతాపరుద్రుడి నాటికీ, కాకతీయ సామ్రాజ్యాన్ని ఎదిరించిన పగిడిద్దరాజు, సమ్మక్క, సారలమ్మ ల దగ్గరికీ తీసుకుపోవచ్చు గాని, అంత వెనక్కి వెళ్లకుండా ఆధునిక యుగం నుంచే చూడవచ్చు. అది 1857 ప్రథమ భారత స్వాతంత్ర్య సంగ్రామంలో వ్యక్తమయింది. ఆనాడు విదేశీ అధికారాన్ని ప్రశ్నిస్తూ దేశంలోని నాలుగు వర్గాల (సైనికులు, రైతాంగం, చేతివృత్తుల వారు, సంస్థానాధీశులు) మహత్తరమైన ఐక్యసంఘటన పోరాటాన్ని ప్రారంభించినప్పుడు, ఆ పోరాటం దేశవ్యాప్తంగా విస్తరించినప్పుడు, బ్రిటిషిండియాలో భాగం కాని హైదరాబాద్ రాజ్యానికి దానితో సంబంధం ఉండనవసరం లేదు. కాని సర్ సాలార్ జంగ్ (1829-1883) నాయకత్వాన అసఫ్ జాహి పాలకులు బ్రిటిష్ వారికి సహకరించడానికీ, పొరుగు ప్రాంతాల భారత స్వాతంత్ర్య సైనికులను అణచడానికీ కూడ ప్రయత్నించినప్పుడు, హైదరాబాద్ తిరుగబడి, తన స్వయం నిర్ణయాధికారాన్ని ప్రకటించింది. మరెక్కడా లేనివిధంగా ఒక స్వతంత్ర సంస్థానంలో తుర్రేబాజ్ ఖాన్, మౌల్వీ అల్లాఉద్దీన్ ల నాయకత్వాన బ్రిటిష్ వ్యతిరేక అసాధారణ పోరాటాన్ని నడిపినది తెలంగాణ సమాజం. హైదరాబాద్ నడిబొడ్డున బ్రిటిష్ రెసిడెంట్ బంగళాను దిగ్బంధనం చేసి తుపాకి కాల్పులతో గడగడలాడించినది తెలంగాణ సమాజం. ప్రథమ భారత స్వాతంత్ర్య సంగ్రామం దేశవ్యాప్తంగా అణచివేతకు గురైనా రెండు సంవత్సరాల దాకా ఆ జ్వాల ఆరిపోకుండా కాపాడిన మరాఠా వీరులకు ఆశ్రయం ఇచ్చినది తెలంగాణ.

 

అలాగే స్వావలంబన కోసం తపన కూడ మొత్తం భారత ఉపఖండంలోనే మొదటిసారిగా తెలంగాణలో వ్యక్తమయింది. ఆ వ్యక్తీకరణలో శాస్త్రీయ దృష్టి ఉందా, విశాల భాగస్వామ్యం ఉందా అని ఇవాళ ప్రశ్నించవచ్చుగాని, అసలు ఆనాటి సమాజంలో ఆ ప్రశ్న వెలువడడమే గణనీయమైన అంశం. ఒకవైపు బ్రిటిష్, ఫ్రెంచి ఆధునికతా పవనాలు రాజ్యంలో నింపుతున్న సాలార్ జంగ్ సంస్కరణలు అమలు జరుగుతుండగానే, స్థానిక మౌలిక సౌకర్యాల కోసం పరాయి దేశపు కంపెనీకి ఎర్ర తివాచీ పరవగూడదని నినదించింది తెలంగాణ, బహుశా దేశంలో బహుళజాతి సంస్థలకు తొట్టతొలి వ్యతిరేకతను ప్రకటించినది తెలంగాణ. సాలార్ జంగ్ మరణానికి ముందే ఆమోదించిన చాందా రైల్వే స్కీమ్ పట్ల, ముఖ్యంగా ఆ స్కీమ్ ను బ్రిటిష్ పెట్టుబడిదారీ సంస్థల లాభాల కోసం తయారు చేయడం పట్ల 1883లో వ్యతిరేక ఆందోళన ప్రారంభమయింది. వాడి నుంచి హైదరాబాదు దాకా ఉండిన రైల్వే లైనును చాందా దాకా విస్తరించడానికీ, ఆ విస్తరణ పనులను బ్రిటిష్ సంస్థలకు అప్పగించడానికీ, ఆ సంస్థల లాభాలకు హామీ ఇవ్వడానికీ నిర్దేశించినది ఈ స్కీము. అప్పటికే ఉండిన అంజుమన్-ఎ-ఇక్వాన్-ఉస్-సఫా నాయకత్వంలోనూ, కొత్తగా ఏర్పడిన చాందా రైల్వే స్కీం వ్యవహారాల కమిటీ నాయకత్వంలోనూ పోరాటం జరిగింది. ప్రభుత్వ పథకపు పూర్తి వివరాలను ప్రజల ముందు ఉంచాలని ఈ సంస్థలు కోరాయి. రాచరిక ప్రభుత్వ కాలంలో ప్రభుత్వ విధానాన్ని ప్రజలకు తెలియజెప్పాలని కోరడమంటే, అందులోనూ విదేశీ సంస్థల ప్రయోజనాన్ని వ్యతిరేకించడమంటే ఎంత ప్రగతిశీల ఆలోచనో చెప్పనక్కర లేదు.

అలాగే స్వాభిమానం కోసం తపన అప్పటి సామాజిక, రాజకీయ స్థితిలో మత, కుల, భాషా రూపాలలో వ్యక్తమై ఉండవచ్చు గాని అట్టడుగున ఉన్నది ఆత్మగౌరవాన్ని నిలబెట్టుకునే ఆలోచనే. అందుకు, 1895లో మొదటి మరాఠీ గ్రంథాలయంగా భారత గుణవర్ధక సంస్థ, 1901లో మొదటి తెలుగు గ్రంథాలయంగా శ్రీకృష్ణ దేవరాయాంధ్ర భాషా నిలయం, 1906 జగన్ మిత్ర మండలి వంటి ఎన్నో వ్యక్తీకరణలను చూడవచ్చు. ఆ వరుసలోనిదే 1921లో ఏర్పడిన ఆంధ్ర జనసంఘం, 1923లో రూపొందిన ఆంధ్ర జన కేంద్ర సంఘం. న్యాయవాదులతో, విద్యావంతులతో ఏర్పడిన ఆ సంస్థే 1931 నాటికి విశాల ప్రజారాశుల ఆంధ్ర మహాసభగా మారింది. తమ భాషలో మాట్లాడి అవహేళనకు గురైన తెలుగువారి సంస్థగా సాంస్కృతిక మూలాల నుంచి ప్రారంభమైన ఆ సంస్థ, బాధ్యతాయుత ప్రభుత్వాన్ని, భూమి-భుక్తి-విముక్తినీ కోరే సామాజిక, రాజకీయ సంస్థగా ఎదిగింది. భాష, సంస్కృతి, సాహిత్యం, చరిత్ర వంటి అంశాల మీద పోరాటం, అంతిమంగా రాజకీయార్థిక మూలాలను ప్రశ్నించకుండా సార్థకమూ అర్థవంతమూ కాజాలదని గుర్తించింది. నాలుగు శాతం కన్న తక్కువ అక్షరాస్యత ఉన్న సమాజంలో గ్రంథాలయోద్యమం ఏమిటనే వైరుధ్యం నుంచి బుద్ధిజీవుల, విద్యావంతుల సామాజిక బాధ్యతా స్పృహ వెలికివచ్చింది. ఆ పరిణామక్రమంలోనే ఆంధ్ర మహాసభ మహాఘనతవహించిన నిజాము రాజుగారి దివ్యసమ్ముఖమునకు మహజర్లు, విన్నపాలు సమర్పించే స్థితి నుంచి వెట్టి చాకిరీలో మగ్గిపోతున్న అసంఖ్యాక నిరక్షరాస్య జనానికి చేరువయింది. భూస్వామ్య వ్యతిరేక పోరాటానికి వేదిక అయింది. అక్షరోపజీవులు తమ సమస్య అనుకుని ప్రారంభించిన ఉద్యమానికి నిరక్షరాస్య బండి యాదగిరి పాట మార్గ నిర్దేశనం చేసింది. ఉపరితల భాషా సమస్య దగ్గర ప్రారంభమైన కదలిక పునాది భూమి సమస్యకు చేరింది. రంగస్థలం శ్రీకృష్ణదేవరాయాంధ్ర భాషా నిలయం నుంచి కామారెడ్డిగూడానికీ, పాలకుర్తికీ, మొండ్రాయికీ, ధర్మాపురానికీ మారింది.

బోనగిరి ఆంధ్ర మహాసభను ఈ నేపథ్యంలో చూడవలసి ఉంది. ఆంధ్ర మహాసభలో కమ్యూనిస్టుల ప్రాబల్యం పెరుగుతున్నందువల్ల, వారు గ్రామాలలో అశాంతికి కారకులవుతున్నందువల్ల తాము ఆంధ్రమహాసభ నుంచి తటస్థంగా ఉంటామని ‘జాతీయవాదుల’మని చెప్పుకునేవారు బోనగిరి సభలకు సహాయ నిరాకరణ ప్రారంభించారు. ఏ పక్షానికీ చెందనివారమని ప్రకటించుకున్న అప్పటి అధ్యక్షులు కొండా వెంకటరంగారెడ్డి, కార్యదర్శి మందుముల రామచంద్రరావు సభల్లో ప్రారంభోపన్యాసం చేసి, కవిలెకట్టలు అప్పగించి మిగిలిన సభలో కూడ పాల్గొనకుండా వెళ్లిపోయారు. ఆంధ్ర మహాసభలో కమ్యూనిస్టుల ప్రవేశమో, జోక్యమో, ప్రాబల్యమో ఉన్నాయా లేవా అనేది చర్చనీయాంశమే. కాని అంతకన్న ముఖ్యంగా, ఆనాటి తెలంగాణ సమాజంలో అతి పెద్ద ప్రజాసంస్థలో నిజమైన ప్రజాసమస్యల ప్రస్తావన ప్రారంభం కాగానే ఎవరెవరు తప్పుకోజూశారనేది, ఎవరెవరు నిలబడి పోరాడుతామన్నారనేది ప్రధానం. ప్రజాసమస్యలపై పోరాటానికి, పరిష్కారానికి తాను సిద్ధంగా లేనని ఒక వర్గం నాయకత్వం, ఆ తర్వాత మొత్తంగా కాంగ్రెస్ లో చేరిపోయిన నాయకత్వం ప్రకటించిందనేది వాస్తవం. అప్పుడు కమ్యూనిస్టులు మేమున్నామంటూ ముందుకొచ్చారు.

అప్పటి తెలంగాణ సమాజంలో అధికారాన్ని ధిక్కరించిన ఆర్యసమాజం మతంలో కూరుకుపోయింది. దానికి వ్యతిరేకంగా వచ్చిన ఇత్తెహాదుల్ ముసల్మీన్ అధికారంతో అంటకాగింది. ఈ రెండు సంస్థలతో పాటు మరొక అరడజను ఇటువంటి సంస్థలు 1938 నాటికే నిషేధానికి గురయ్యాయి. కుల సంఘాలు పెద్ద ఎత్తున పుట్టుకొచ్చాయి గాని అవి అప్పటికింకా ప్రజల మౌలిక సమస్యలను ప్రస్తావించడం లేదు. భయ సంకోచాలతో పుట్టిన స్టేట్ కాంగ్రెస్ తాను తెలంగాణ ప్రజా ఉద్యమానికి నాయకత్వం వహించనని స్పష్టంగానే చెప్పింది. ఆ నేపథ్యంలో జరిగినది బోనగిరి ఆంధ్ర మహాసభ. అక్కడ తాను ప్రజల పక్షం ఉంటానని, ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఉద్యమం నిర్మిస్తానని, నిర్మాణమవుతున్న ఉద్యమానికి నాయకత్వం వహిస్తానని కమ్యూనిస్టు పార్టీ మనసా వాచా కర్మణా ప్రకటించింది గనుకనే తెలంగాణ సమాజం కమ్యూనిస్టు పార్టీని తన గుండెలకు హత్తుకుంది. ఏడు దశాబ్దాల తర్వాత కూడ తెలంగాణ సమాజంలో కమ్యూనిస్టుల పట్ల ప్రేమ అందువల్లనే.

స్టేట్ కాంగ్రెస్ మీద 1938లో విధించిన నిషేధాన్ని 1946 వరకూ కూడ తొలగించనందువల్ల పైకి స్టేట్ కాంగ్రెస్ అని చెప్పుకోకపోయినా ఆ భావాలు గలవాళ్లు ఆంధ్ర మహాసభలో ‘జాతీయవాదులు’ పేరిట కొనసాగారు. 1942లో నిషేధం ఎత్తివేసినందువల్ల కమ్యూనిస్టులు బహిరంగంగా పనిచేసే అవకాశం వచ్చింది గాని వారు కూడ ఆంధ్ర మహాసభలోనే కొనసాగారు. ఈ రెండు ప్రత్యర్థి పక్షాలే కాక ఏ పక్షానికీ చెందని వారు కూడ ఆంధ్ర మహాసభలో పెద్ద సంఖ్య లోనే ఉన్నారు. ఆంధ్ర మహాసభ వివిధ వృత్తులవారితో, వివిధ రాజకీయ విశ్వాసాలు గలవారితో నిజంగా ఒక విశాలమైన ఐక్యసంఘటనగా కొనసాగింది. అప్పటికి పదిహేను సంవత్సరాలుగా ఇలా సాగుతున్న సమన్వయం భూపోరాటాలు ప్రారంభం కాగానే చెదిరిపోయింది. ఆ చీలిక బోనగిరిలో స్థిరపడింది. తర్వాత ఆంధ్ర మహాసభ ఎక్కువరోజులు పనిచేయలేకపోయింది గాని, దొడ్డి కొమరయ్య హత్యతో (1946 జూలై 4) తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం ప్రారంభమయింది. ఐదు సంవత్సరాల పాటు సాగిన ఆ పోరాటం పదిలక్షల ఎకరాల భూమిని పంపిణీ చేసి, మూడు వేల గ్రామాలను విముక్తి చేసి అటు భూమి-భుక్తి-విముక్తి ఆకాంక్షలనూ, ఇటు స్వయం నిర్ణయాధికారం – స్వావలంబన – స్వాభిమాన ఆకాంక్షలనూ ఒక మేరకు సాధించింది. ఐదు సంవత్సరాల తర్వాత 1951 అక్టోబర్ 20న ఆ పోరాటం అర్ధాంతరంగా ఉపసంహరణ జరిగి ఉండకపోతే ఆ ఆకాంక్షలు సంపూర్ణంగా నెరవేరేవే, సుస్థిరంగా ఉండేవా, తెలంగాణ తండ్లాటకు శాశ్వత పరిష్కారం దొరికి ఉండేదా…. ఇప్పుడన్నీ ఊహాత్మకమైన ప్రశ్నలే. కాని ఆ నాడు తెలంగాణ మట్టి మనిషి సంధించిన ప్రశ్నలూ ఆయుధాలూ ఇవాళ్టికీ ఆరని నిప్పుకణికల్లా రగులుతూనే ఉన్నాయి.

telangana 14

ఈ గతం వెలుగులో వర్తమానాన్ని చూస్తే, తెలంగాణ సమాజపు తండ్లాటకు ఇటీవలి వ్యక్తీకరణ ఆంధ్ర మహాసభ కన్న విస్తృతమైనది. వర్గం, బృందం, కులం, మతం, వయసు, స్త్రీపురుష భేదం వంటి అంతరాలన్నిటినీ పక్కనపెట్టి తెలంగాణ సమాజమంతా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడింది. రాష్ట్ర సాధనే తన తండ్లాటకు పరిష్కారమని భావించినట్టు అనిపించింది. రాష్ట్రం ఏర్పడింది గాని తండ్లాట పరిష్కారమవుతుందా అని అనుమానాలు అట్లాగే ఉన్నాయి. ఇన్ని శక్తులు ఐక్యంగా ఉద్యమించినప్పుడు విజయ ఫలాలు అన్ని శక్తులకూ వాటి భాగస్వామ్యం ప్రకారమైనా అందుతున్నాయా అని ప్రశ్న మిగిలే ఉంది. అన్నిటికన్నా ముఖ్యంగా స్వయంనిర్ణయాధికారం సంపూర్ణంగా అందిందా, పరిమితంగా, పాక్షికంగా అందిందా? ప్రపంచీకరణ రాజకీయాల, కార్పొరేట్ పన్నాగాల యుగంలో స్వావలంబన ఏ మేరకైనా సాధ్యమా? సాధ్యమైన మేరకైనా తెలంగాణ పాలకవర్గాలు అమలుచేస్తాయా? బహుశా స్వాభిమానం, ఆత్మగౌరవం గత అరవై సంవత్సరాలలో అనుభవించినదానికన్న కాస్త ఎక్కువే అనుభవించే అవకాశం వస్తుందేమో.

బోనగిరిలో 1944 మే 27-28ల్లో సాధించిన విజయం, తెలంగాణ వ్యాప్తంగా 1951 అక్టోబర్ 20న చెదిరిపోయింది. ‘నడుమ తడబడి సడలి ముడుగక పడవ తీరం క్రమిస్తుందా’ అనే ఆందోళన నిరాశతో అంతమయింది. 2014 జూన్ 2 ఏమవుతుంది?

 

-ఎన్. వేణుగోపాల్

 

Download PDF

6 Comments

 • బహుశా స్వాభిమానం, ఆత్మగౌరవం గత అరవై సంవత్సరాలలో అనుభవించినదానికన్న కాస్త ఎక్కువే అనుభవించే అవకాశం వస్తుందేమో

  బహుశా స్వాతంత్ర్యకాంక్షకు, విముక్తి భావనకు స్వాభిమానం, ఆత్మగౌరవం మాత్రమే సరిపోవేమో… 70 సంవత్సరాల చరిత్రకు చిత్రిక పట్టారు. ఆద్యంతం అద్భుతంగా ఉంది మీ కథనం.

  2014 జూన్ 2 ఏమవుతుంది తో ముగించారు. ఎక్కువగా ఆశించకపోతేనే మంచిదని అనుభవం చెబుతోంది కదా… ఇక అన్నీ ప్రయివేట్ ఉద్యోగాలే అని పొరుగు రాష్ట్రం కొత్త మంత్రి నిన్ననే బయటపెట్టేశారు కాబట్టి ప్రభుత్వ ఉద్యోగాలపై .యువత ఆశలు పెట్టుకుంటే అడియాసలవటం తప్పదు. అక్కడా ఇక్కడా ఉద్యోగాల కోసం వేట తప్పదు. కలిసివున్నప్పుడు, విడిపోయాక కూడా అందరికీ కాంట్రాక్టు ఉద్యోగాలు, కాంట్రాక్టు బతుకులే.. ఇది మాత్రం తప్పదు.

 • S.Haragopal says:

  ఒక రాష్ట్రప్రభుత్వం ఏం చేయగలుగుతుంది. ఉన్న భారత రాజ్యాంగంలో వున్నవాటిని 64 ఏళ్ళుగా ఏలుతున్న ఏ ప్రభుత్వాలు ఏం అమలు పరిచాయని? ప్రపంచీకరణను ఎదిరించే శక్తి, అణగారిన సామాజికవర్గాలకు ఏం చేయగలదంటారీ చిన్నరాజ్యం. భూ పంపిణీ చేస్తుందా, వాక్స్వాతంత్ర్యాన్ని ఇస్తుందా, పేదరికాన్ని ఎట్లా నిర్మూలిస్తుంది, వివక్షతలను ఏ రకంగా అధిగమిస్తుంది? పేదలను బిచ్చగాళ్ళను చేసే స్కీములు మానుకుంటారా, అందరికి విద్య, వైద్యం,ఆహారం, మంచినీళ్ళు, ఇంత చిన్నగూడు అందించగలరా. ఎక్కువ ఆశిస్తున్నా మంటారేమో.
  ఒక ఉద్యమ నాయకత్వం ప్రభుత్వమైతే ప్రజలు ఎక్కువే స్వప్నిస్తారేమో. స్వావలంబన సాధ్యమా రాష్ట్రప్రభుత్వానికి.మరో తిరుగబాటు చేసే అవకాశముందా ఈ ప్రజలకు.

 • నాకొక విషయం అర్థం కావడం లేదు. ప్రత్యేక రాష్ట్రం గా ఏర్పడినా కూడా పరిపాలన మొత్తంగా మనం [!] ఏర్పాటు చేసుకున్న రాజ్యాంగం ప్రకారం నడవాలి. దానికి భిన్నంగా వుంటే రాజ్యం సహించదు అనే విషయం నాకంటే మీకే ఎక్కువగా తెలుసు. [అనుకూలంగా నడిపితే సహిస్తుందా అని అడగొద్దు!]
  ప్రజలందరకు సమాన అవకాశాలు కలిపించి ,దోపిడీ లేని సమాజం ఏర్పడాలంటే దీర్ఘకాలిక పోరాటం జరిపి సాధించుకోవాలి.
  అది సాధ్యం కానపుడు ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్న రాష్ట్రం లో , మిగిలిన రాష్ట్రాల కంటే భిన్నంగా పరిపాలన వుండదు గదా !
  యిక స్వావలంబన , స్వపరిపాలన ఉండాలంటే ప్రత్యేక రాష్ట్రం గా కాదు , ప్రత్యేక దేశం గా కావడానికి ఉద్యమించాలి !!
  ఏమంటారు ?

  • మంజరి. says:

   మీరు చెప్పింది 100% నిజం. బాగా చెప్పారు. బాగుంది.

 • బహుశా స్వాభిమానం, ఆత్మగౌరవం గత అరవై సంవత్సరాలలో అనుభవించినదానికన్న కాస్త ఎక్కువే అనుభవించే అవకాశం వస్తుందేమో
  బహుశా స్వాతంత్ర్యకాంక్షకు, విముక్తి భావనకు స్వాభిమానం, ఆత్మగౌరవం మాత్రమే సరిపోవేమో… 70 సంవత్సరాల చరిత్రకు చిత్రిక పట్టారు. ఆద్యంతం అద్భుతంగా ఉంది మీ కథనం.
  2014 జూన్ 2 ఏమవుతుంది?
  నిజంగా మేము తెలంగాణ కొట్లాడి సాదించుకున్నం, మాది ఉద్యమ పార్టి , 60 ఏండ్ల తండ్లాట మాది మేము ప్రజల ఆకాంక్షలకు నిలువెత్తు సాక్షులమ్ అన్నది ఉత్తిత్తి మాటలుగానె మిగిలిపోతాయి.

  నిజంగా ఈ మాటలు చెప్పిన ఈ పాలక పక్షానికి రాష్ట్ర ప్రజల ప్రయోజనాలే ముఖ్యమనుకుంటే మీరు చెప్పినట్లు స్వావలంబన , స్వాభిమానం, ఆత్మగౌరవం తో చరిత్ర గతులలో నిలుపుకున్న అదే బహుళజాతి కంపనిల పన్నాగాలను వ్యతిరేకించి, ప్రజల స్వంత ప్రయోజనాలైన విద్యా, వైద్యం,కూడు, గూడు మొదలగు స్వాభిమానం చేకుర్చే విధానాలను అంటే కార్పోరేటు సెక్టార్ కు కొమ్ము కాయకుండా ప్రజల ప్రయోజనమే తమ ప్రభుత్వ ప్రయోజనాలుగా బావించి,ఈ రోజువరకు లేని తెలంగాణా ఆత్మ గౌరవాన్ని ప్రపంచానికి చాటే విధంగా ఈ పాలక వర్గం ఉండకపోతే చరిత్ర మల్లి పునరావృతం కావడం తద్యం.
  ఇది తెలంగాణ ప్రజల నైజం. అల్లు అనుకున్నట్లుగా 60 ఎండ్లసంది. ఎన్నో ఎన్నెన్నో బ్రతుకు పోరాట గాదలతోటి హింసలు, ప్రతిహింసలు కళ్ళకు గట్టినట్లు చుసిండ్రు.
  ఈ రోజు మల్లి అదే కావాలని కోరుకునే వాళ్ళే అయితే ఎంతొ మంది యువకులు న్యూనతా బావంతో తెలంగాణ కొరకు ఉత్తరాలు వ్రాసి బలవాన్ మరణాలకు పాల్పడే వారే కాదు.
  ఇంకా చరిత్ర పుటల్లో కెళితే ఇదే తెలంగాణా కొరకు 59లో 400 మంది యువకులను ఆ ప్రభుత్వాలు చంపితే మిగిలిన యువకులు ఎంతో మంది పీపుల్స్ వార్ పార్టీలో రహస్య జీవితాలకు వెళ్ళిన ఘటనలు మరచి పోవద్దు.
  మళ్ళి యువతరం మీ పై ఎన్నో ఆశలతో, మీరు చెప్పుకునే ఉద్యమపార్టికి ఎన్ను దన్నుగా వుంటూ విజయాన్ని కట్టబెట్టినారు.
  అంతలోనే అన్ని మరచినట్లు ప్రవర్తించి, బహుళజాతి సంస్దల ప్రయోజనాలు కాపడుతారో లేక ప్రజల ప్రయోజనాలకు రాష్ట్ర స్వావలంబన, స్వాభిమానం, ఆత్మగౌరవం కాపాడాలని
  2014 జూన్ 2 ఏమవుతుందో ?
  కాకుండా మీ పరిపాలన ఉండాలని

 • buchi reddi gangula says:

  ఎమవుతు0 ధో —??? బ్రేకింగ్ న్యూస్ లా ??? స్వాతంత్రం వచ్చిన అప్పటి నుండి
  జూన్ 1 వరకు —ఎంత ప్రగతి సాది0 ఛి మో ?? ఆర్థిక వత్యాసం –కుల పట్టింపులు —
  మత పిచ్చి — నేటి విద్యా విధానం లో మార్పులు —బూసంస్కరణలు —యివన్ని సక్రమంగా — అమలు జరిగి నప్పుడు — నిజమయిన మార్పు ను చూడగలుగు తాం —
  కొత్త రాష్ట్రం లో కొంతయినా మార్పు కనిపించక పోదు —నేటి వరకు — దేశం లో –రాష్ట్రం లో
  కొద్ది మంది — నాయకుల పెత్తనాల తో నడుస్తున్న — వారసత్వ — కుటుంభ party లు
  –రాజుల్లా —-
  ప్రజలు అ లాంటి వాళ్ళకే — వాళ్ళ నే నమ్ముతూ — రాజరికం అంటగడుతూ — ఉంటె —
  ఏది ప్రజా సామ్యం — ఎక్కడ ఉంది ??ఎక్కడున్నారు vaavilaala– సుందరయ్య — రాజేశ్వర్ రావులు —లాల్ — నందా — జయప్రకాశ్ లు ???అన్ని రాజకీయ పార్టీ ల లో అవనీతి పరుల కు కొదవ లే దు —-
  గుర్తింపు కోసం — డబ్బు సంపాదన కోసం — పరుగులు — వేషాలు —యీ తీరును — అన్ని రంగాల లో ( రాజ కియాల లో — సాహితి ప్రపంచం లో ) చూస్తున్న నిజాలు —
  మోడీ — బాబు — దయాకర్ రావు —రేవంత రెడ్డి లు — మన గాంధి lu- అంబేద్కర్ లు ????
  మార్పు రాక పో దు —
  donot make assumptions
  always do your best
  Be skeptical–but learn and listen
  ——————–DON MIGUEL RUIZ
  *******************************************************
  buchi reddy gangula

ఒక వ్యాఖ్యను

Your email address will not be published. Required fields are marked *

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)