సాహిత్యం- సాహిత్తెం

 

 

కలలు చమత్కారంగా ఉంటవి. దెయ్యాలూ భూతాలు కలలోకి వచ్చినా మర్నాడు లేచాక మనకి కనిపించవు కదా? మంచి కలలొస్తే మంచి జరుగుతుందనీ, పాడు కల వస్తే చెడు జరుగుతుందనీ ఎక్కడైనా ఉందా? కల వచ్చిన మర్నాడు పొద్దున్నే కొంత సుఖమో కష్టమో అనిపించవచ్చు గానీ తర్వాత రోజూ పనుల్లో పడి ఇవన్నీ మర్చిపోతూంటాము కదా? కానీ నా కొచ్చిన కల వింతగా ఉంది.

 

లేకపోతే ఇది చూడండి. రాత్రి పడుకున్నానన్న మాటే గానీ ఎప్పటికో గాని నిద్రలేదు. అప్పుడొచ్చిన కలలో నేనూ, బిల్ గేట్సూ, వంగూరి చిట్టెన్ రాజు గారూ కలిసి నడుస్తున్నాం. ఇప్పుడు మనమో విమానం ఎక్కాలి అన్నారు బిల్ గేట్స్. “ఎక్కడికండి మనం వెళ్ళేది? ఇండియాకేనా?” అని ఎంతో ఉత్సాహంగా అడిగేను. సమాధానం లేదు. నాకేమో ఒళ్ళు జలదరిస్తోంది వీళ్ళతో వెళ్ళడానికి. వాళ్ళేమో సమాధానం చెప్పరు. విమానం వచ్చింది. ఎక్కాక పైలట్ కూర్చుని ఏవో మీటలన్నీ నొక్కుతున్నాడు. “బోయ్” మని చప్పుడు. విమానం తూర్పు కేసి ఎగురుతోంది అని నేనంటే వీళ్ళు “ఇండియాకి కాదు వెళ్ళేది ఆఫ్రికాకి” అనడం.

 

గేట్స్ గారితో వెళ్ళడం అంటే ఏ ఫస్టు క్లాసులోనో వెళ్ళచ్చేమో, వైన్ అదీ తాగి, పీక దాకా తినేసి, సీటు నూట ఎనభై డిగ్రీలు వచ్చేదాకా కాళ్ళు తన్ని పడుకోవచ్చు అనుకున్నాను కానీ వీళ్ళు నన్ను ఎకానమీలో ఎక్కించారని ఎక్కేదాకా తెలీలేదు. తీరా ఎక్కిన తర్వాత దాహంతో నోరు పిడచగట్టుకుపోతూంటే, ఓ కోక్ ఇమ్మన్నా, కాసిని మంచినీళ్ళిమ్మన్నా గంటు మొహం పెట్టుకుని ఏదో ముష్టి పారేసినట్టు తెచ్చి మొహం మీద విసరడం.

 

ఇంక ఎలాగా తప్పదు కదా? వాళ్ళు పెట్టిన గడ్డీ గాదం (అవే లెండి, ఆంగ్లంలో సలాడ్లు అంటారు కదా) తిని ఓ కునుకు తీసి లేచేసరికి సీటు బెల్ట్ పెట్టుకోమని ఆర్డర్. అప్పటికే రాజు గారూ, గేట్స్ గారూ రడీగా ఉన్నారు. నేనే లేటుగా లేచింది. కిందకి దిగి “ఇది హైద్రాబాదులా లేదే, ఇదే ఊరండి రాజు గారు?” అనడిగాను. సమాధానం లేదు.

 

కాస్త ముందుకెళ్ళాం. ఇక్కడకెందుకొచ్చామో నాకర్ధం కాలేదు. చుట్టూ చూసాను. మమ్మల్ని దింపిన విమానం వెళ్ళిపోతోంది మళ్ళీ. కార్లూ అవీ ఉన్నట్టులేదు. ఇండియా అయితే ఎడ్లబండో, ఏనుగో కనపడాలి కదా విమానం దిగిన పదినిముషాల్లో? రాజుగారి కేసి ప్రశ్నార్ధకంగా చూస్తే ఆయనే చెప్పేరు ఈ సారి – “ఇది ఆఫ్రికా, మనం ఇక్కడ చూడాల్సినవి కొన్ని ఉన్నాయి.”

 

“మరి బిల్ గేట్స్ గారేరీ?” అన్నాను ఆయన మాతో లేకపోవడం గమనించి.

 

“ఆయనకి వేరే పనులున్నాయి, పోలియో, మలేరియా మందులు ఇప్పించడానికీ, దానికీను. ఆయనరారు మనకి తప్పదు.” చెప్పేరు రాజు గారు.

 

“మనకి ఎందుకు తప్పదు?”

 

“నేను కధలు రాస్తాను. నువ్వు నాకన్నా బాగా రాస్తావు; అందుకని” వెర్రి వెధవని కాకపోతే రాజుగారు నన్ను వెక్కిరిస్తున్నారని తెలియలేదు.

 

ఎదురుగా “విలియం ఎండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్ లైబ్రరీ” అని పెద్ద పెద్ద అక్షరాలతో పెద్ద భవనం కనిపించింది. “మనమే ఎం.బి.ఏ చేసుంటే నేను ఏ వాల్ స్ట్రీట్ లోనో లక్ష డాలర్లు సంపాదించేవాడిని, నువ్వు ఏ కోటి డాలర్లో తెచ్చేవాడివి గేట్స్ గారిలానే.” నేను ఆ బిల్డింగ్ బోర్డు చూసి నోరు వెళ్ళబెట్టగానే చెప్పేరు రాజుగారు.

 

ఏమైనా నేను కోటి డాలర్లు తెస్తున్నట్టే అనిపించింది. మీరు ఎందుకు ఎం. బి. ఏ చేయలేదని రాజుగార్ని అడుగుదామనుకున్నాను కానీ ఊరుకున్నాను.  జేబులన్నీ వెతికి తుపాకులూ అవీ ఉన్నాయా అనే చూసి, ఏమీలేవని నిర్ధారించుకున్నాక లైబ్రరీ లోపలకి వదిలేరు.

 

పుస్తకాలు కుప్పలకొద్దీ బీరువాల్లో దాచి ఉంచారు. చూస్తూ పోయేసరికి ఓ చోట తెలుగు సాహిత్యం అని ఉంది. కనుబొమ్మలు పైకెత్తి రాజు గారు కేసి చూసాను ఆశ్చర్యంతో.

 

“ఇప్పుడర్థం అయిందా?” అన్నట్టూ నవ్వుతున్నారు ఆయన. ఆయన పబ్లిష్ చేసిన పుస్తకాలూ, అందులో నేను అప్పుడప్పుడూ రాసిన కధలూ అన్నీ ఉన్నట్టున్నాయి.

 

“ఇక్కడకి తెలుగు సాహిత్యం ఎలా వచ్చిందో?” అని నేననుకునేలోపల రాజుగారే చెప్పారు, “తెలుగు వాడు లేని నేల ఎక్కడుందోయ్ ఈ భూమ్మీద?”

 

“ఇక్కడ ఆఫ్రికాలో ఎవరు చదువుతారండీ ఇవి?” అడిగేను ఆయన్ని.

 

“ఎవరో చదువుతారని కాదు, ప్రపంచం నాలుగు మూలలా మువ్వన్నెల తెలుగు సాహిత్య పతాకం ఎగరవల్సిందే,”

 

మళ్ళీ నడవడం మొదలు పెట్టాం. “ఇక్కడ్నుంచి, రచయితల సెక్షన్” అని రాసి ఉంది.

 

మొదటి చోట కొంతమంది తెలుగు వాళ్ళు కాయితాలు ముందేసుకుని ఏవో రాస్తున్నారు. మేము రావడం చూసారు కానీ ఏమీ పట్టించుకున్నట్టు లేదు. కాయితానికి రెండంటే రెండే లైన్లు రాసి పారేస్తున్నారు పక్కన. కాయితాలు ఖరాబు చేస్తున్నట్టు అనిపించి ఏదో అనబోయేను కానీ రాజు గారు నా నోటి మీద చెయ్యేసి నొక్కేసి అక్కడ్నుంచి దూరంగా తీసుకెళ్ళి చెప్పేరు, “వీళ్ళు రాసేవి నానీలు. నోరెత్తావా, పెన్నుతో పొడిచి చంపేస్తారు.”

 

ఒళ్ళు జలదరించింది.  కాస్త ముందుకెళ్తే కొంత మంది కాయితాల మీదే రాసుకుంటూ కనిపించేరు. దగ్గిరకెళ్ళి చూద్దుం కదా, వాళ్ళు రాసేవి సమస్యా పూరణాలు. ఓక్కో చోట ప్రాసకోసం “గూగిలించుచో” అనో, “యాహూలించుచో” అనో “బింగులించుచో” అని రాసేస్తున్నారు. “ఇదేమిటండీ రాజుగారు ఇవి అంతర్జాలంలో ఉండేవి కదా, అవి తెలుగు పదాలు ఎలా అవుతై?” అనడిగేను. రాజుగారు సమాధానం చెప్పేలోపుల అక్కడే ఉన్న ఒకాయన చెప్పేడు, “కొత్త కొత్త పదాలు మనం సృష్టించపోతే బాష ఎలా ఇంప్రూవ్ అవుద్దోయ్ చెవలాయ్?” మొహం గంటు పెట్టుకుని రాజు గారి కేసి  చూస్తే ఆయన “ఊరుకో, ఊరుకో తెలుగు పద్యాల్లో కాసినేనా తెలుగు పదాలున్నాయని సంతోషపడు” అని చెప్పి ముందుకి లాక్కేళ్ళేరు.

 

ఇంకాముందుకి వెళ్లేసరికి అక్కడంతా కలగా పులగంగా ఉంది వాదోపవాదనలతో. నేను అడిగేలోపులే రాజుగారు చెప్పేరు, “వీళ్ళందరూ ఎడిటర్లు, మనం రాసేది ఎలా తీసిపారేద్దామా అని చూస్తూ ఉంటారు. ఓ రకంగా డాక్టర్ల లాంటి వాళ్ళు, అంగవ్రాతములో చికిత్సకుడు దుష్టాంగమ్ము ఖంఢించి.. లాంటి వాళ్ళనుకో”.

 

“అదేమిటండోయ్, డాక్టర్లకీ ఎడిటర్లకీ పోలిక?” వెర్రిమొహం వేసి అడిగాను.

 

“అదంతే. ఎవడికి ఎప్పుడు రోగం వస్తుందా, ఎప్పుడు పేషంట్ మన దగ్గిరకి వస్తాడా అని డాక్టర్లు చూస్తూ ఉంటారు. అలాగే ఎవడు ఏమి రాసి రచయిత అవుదామా అని చూస్తూ ఎడిటర్లకి పంపిస్తే వాళ్ళు ఏ కారణం చూపించి రాసినది అవతల పారేద్దామా అని వీళ్ళు చూస్తూ ఉంటారు.” విడమర్చి చెప్పేరు రాజు గారు.

 

“ఛా, అలా అంటారేంటండీ? నాకు అలా అవలేదే? నేనేం రాసినా వేసుకుంటున్నారు ఎడిటర్లు.”

 

“చెప్పేనుగా నువ్వు నాకన్న మంచి కధలు రాస్తావని?” గుంభనంగా నవ్వుతున్నారు రాజు గారు. మట్టిబుర్ర కాకపోతే ఈ పాటికైనా రాజుగారు నన్ను వెక్కిరిస్తున్నారని తెలియలేదు.

 

మళ్ళీ ముందుకి నడిచాం.  అందరూ కంప్యూటర్లమీద చక చకా ఏదో టైప్ చేస్తున్నారు. కాయితం లేదు, కలం లేదు. ఏదో రాయడం, పబ్లిష్ చేయడం వెంట వెంటనే జరిగిపోతున్నాయి. ఆశ్చర్యంగా చూద్దును కదా, రాజుగారు నన్ను వెనక్కి లాగి చెప్పేరు, “వీళ్ళు బ్లాగు రైటర్లు. అలా చూడకూడదు, అవి పబ్లిష్ అయ్యేదాకా”.

 

“ఇక్కడ చూడకపోతే పబ్లిష్ అయ్యేక ఎలా చూస్తామండి?”

 

“అవి పబ్లిష్ అయ్యేక, మాలిక అనీ కూడలి అనీ బ్లాగుల సమాహారాల్లో వస్తాయి. అక్కడ్నుంచి చూసి కామెంట వచ్చు.”

 

“కామెంటడం అంటే?” కామెర్లు అంటే తెలుసు, కామేశ్వరీ తెలుసు. కామెంటడం అంటే తెలియక అడిగేను సిగ్గు పడుతూ.

 

“వాళ్ళు రాసి పారేసాక మన అభిప్రాయం కామెంట్ రూపంలో పెట్టడాన్ని కామెంటడం అన్నారు. అలాగే ధన్యవాదాలు చెప్పడాన్ని నెనర్లు అనీ, ఈకలనీ ఏవోవో పేర్లు. పక్కనున్న సెక్షన్లో ఇందాకే చెప్పేడు కదా ఒక మహామహుడు, కొత్త పదాలు సృష్టించకపోతే తెలుగు ఎలా నిలబడుద్దో చెవలాయ్ అనీ? అయినా ఇన్ని ప్రశ్నలు అడక్కూడదు.”

 

“రాసేసినవి ఎడిటర్లకి పంపొచ్చు కదా? బ్లాగులో రాసుకోడం ఎందుకో?” నా మనసులో సందేహం అనుకోకుండా నోట్లోంచి బయటకొచ్చేసింది.

 

“చెప్పాను కదా, పాతిక కధలు పంపిస్తే ఎడిటర్లు ఒకటో రెండో వేసుకుంటారు. మిగతావి చెత్తబుట్టలోకే. వాళ్ళు పబ్లిష్ చేయకపోతే నిరుత్సాహ పడిపోకుండా, ఈ బ్లాగుల్లో మనకి మనవే పబ్లిష్ చేసుకోవచ్చు. ఎడిటర్లు నీ రచన బావోలేదు అంటే, నీ సలహా ఎవడిక్కావాలోయ్ ఇదిగో నేనే పబ్లిష్ చేసుకోగలను అని వీళ్ళు ఇలా రాస్తారు.”

 

“అలా ఏది పడితే అది రాసేయొచ్చా బ్లాగులో?”

 

“ఆ, మన ఇష్టం. ఆ తర్వాత ఏదైనా తేడాలొస్తే దాంతో తంటాలు పడాల్సింది కూడా మనమే.”

 

కంప్యూటర్ల దగ్గిర కూచున్నవాళ్ళు మమ్మల్నీ, రాజు గారి చేతిలో ప్రింట్ పుస్తకాలనీ చూసి నవ్వడం. ఈ రోజుల్లో పుస్తకాలెవడు చదువుతాడోయ్ చెవలాయ్ అనడమూను. రాజు గారు పబ్లిషర్ అని చెప్తే ఇంకా నవ్వులు.

 

తెలుగు సాహిత్యం ఎంత పైపైకి పోతోందో, నేనెంత వెనకబడి ఉన్నానో ఇదంతా చూసేసరికి అర్ధమైంది. కళ్ళు తిరిగేయి గిర్రున.  రాజుగారు నా చేయి పట్టుకుని బయటకి నడిపించుకొచ్చేరు. దారిలో తత్త్వ బోధ చేస్తున్నట్టూ చెప్పేరు రాజుగారే, “చూసావా తెలుగు సాహిత్తెపు మువ్వెన్నల  జండా ఎంత గొప్పగా పైపైకి పోతోందో?”

 

“సాహిత్యం అనకుండా సాహిత్తెం అన్నారేమిటబ్బా?”

 

“మన కవులు రాసినదీ సాహిత్యం. ఇప్పుడొచ్చేది సాహిత్తెం. అంతే తేడా”

 

ఇంతట్లో మేడూరు వచ్చి ఉయ్యూరు మీద పడిందన్నట్టూ ఎవరికో నేను కధలు రాస్తానని తెల్సింది. నాకేసి వేలెత్తి చూపించి చెప్పేడు, “జాగ్రత్త, నువ్వు మా గురించి రాసావా, మరి చూస్కో!” అన్నాడు.

 

“ఏం చేస్తారేం?” అని ఇంకేదో అడగబోతుండగా రాజుగారు వారించి నన్ను బయటకి తీసుకొచ్చేరు. లోపలకి వెళ్ళిన దారి వేరూ, బయటకొచ్చిన దారి వేరూను. బయటకి రాగానే తలుపు దగ్గిరే జీరాఫీ, చిరుతపులీ కనిపించేయి.

 

ఇది ఇండియా అయితే జిరాఫీ ఉండదే, చిరుతపులి ఇండియాలో ఉంటే దాన్ని చంపేసి చర్మం అమ్ముకోరూ ఈపాటికి అనుకుంటూంటే వెనకనుంచి చింపాంజీ అరుపు వినిపించింది. భయపడి పక్కనే ఉన్న రాజు గారి చెయ్యి పట్టుకున్నాను.

 

“చూసావా, నేచెప్పలే? ఇది ఆఫ్రికా” అని మృదువుగా చేయి విడిపించుకుని భుజం తట్టేరు రాజు గారు. బుర్ర పక్కకి తిప్పిచూస్తే ఏదో జలపాతం. చల్లని నీళ్ళు మొహం మీద పడ్డాయి. చటుక్కున మెలుకువొచ్చింది.

 

పగటి కలలకి పాటి లేదు. అరచేతి మీద “శ్రీరామ” అని రాసి కళ్ళకద్దుకున్నాను. అంతే!

 

[ఉపసంహారపు చివరితోక:  తెలుగు వారి గోల్డ్ నిబ్బు, విశ్వనాథ గారి ‘జూ’ కధ గుర్తొచ్చిందా? అది చదివాక రాసినదే ఈ కధ. ఆయన కాలిగోరుక్కూడా పనికిరాని వాణ్ణి కనక ఇవే చిట్టెన్ రాజుగారికీ , విశ్వనాథగారికిచ్చే క్షమాపణలు]

 

– ఆర్. శర్మ దంతుర్తి

Download PDF

2 Comments

  • MJ says:

    శర్మ గారు, నేను మీ హాస్యకథ చదవడమ్ ఇది మొదటిసారి. మంచి ప్రయత్నం. వంగూరి గారి పాత్రను ఎంచుకోవడం, బిల్ గేట్స్ కలరాకి, పోలియోకి మందులు వేయడానికి నవ్వు తెప్పించాయి.

  • తెగులు రచైత అన్నా తెలుగు సాహెత్తం అన్నా ఎంత చులకనైపోంది, హన్నా!

Leave a Reply to Anil అనిల్ అట్లుారి Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)