“ఇండియా గేట్”

IMG_0384

దాదాపు అరగంట నుండీ అతను ఇండియా గేట్ దగ్గర ఎదురుచూస్తున్నాడు. సాధారణంగా ఈ పాటికి తనని రిసీవ్ చేసుకోడానికి ఎవరో ఒకరు రావాలి. ఎందుచేత ఆలస్యం అయ్యిందో అనుకుంటున్నాడు. అతను – పేరేదయితేనేం, మంచి శారీర ధారుఢ్యంతో పొడవుగా ఉంటాడు. రంగు మరీ తెలుపు కాకపోయినా చామనచాయ. ఉంగరాల జుట్టు. తీక్షణమైన అతని కళ్ళల్లో కాంతి తలతిప్పి అతనికేసే చూసేలా చేస్తుంది. జేబులోంచి సిగరెట్ ప్యాకెట్ తీసి చూసుకున్నాడు. బీనాకి అతను సిగరెట్లు కాలిస్తే ఇష్టం. దగ్గరగా మాట్లాడుతున్నప్పుడు ఆ వాసన భలే మత్తుగా ఉంటుందంటుంది. అతనికి సిగరెట్టు అలవాటు లేదు. బీనా కోసం అలవాటు చేసుకున్నాడు. బ్యాక్‌పాక్ లోంచి గూచీ స్ప్రే తీసి చొక్కా మీద జల్లుకున్నాడు. బీనాకి గూచీ స్ప్రే వాసన కూడా ఇష్టమే. ఆమెను కలవాల్సినప్పుడల్లా ఆమెకిష్టమయినవన్నీ గుర్తు పెట్టుకుంటాడు. ఇంతలో సెల్ ఫోన్ మ్రోగింది. దీప్తి నుండి ఫోన్. ఆన్ చేసి హలో చెప్పాడు.

“చెప్పానుగా డిల్లీ వచ్చాను. రావడానికి వారం పట్టచ్చు. రేపూ ఎల్లుండీ ఇక్కడ ఉండి తరువాత చండీఘడ్ వెళ్ళాలి…”

అతనికి దీప్తి ఫోన్ కట్‌చెయ్యాలని ఉంది. మాంచి టెన్షన్లో ఉన్నప్పుడే కాల్ చేస్తుందనుకున్నాడు. దీప్తి చెబుతున్నది వింటూ ఊ కొడుతున్నాడు.
“ఎన్ని సార్లు చెప్పాలి? అనసూయమ్మ గారి పని మీద వచ్చాను. ఇంకెంత వారంలో వచ్చేస్తాను. పాప జాగ్రత్త. ఏమైనా అవసరం అయితే కాల్ చెయ్యి. ఉంటాను,” అంటూ అతను ఫోన్ కట్ చేసాడు.

ఇంతలో అతను నుంచున్న చోటుకి దగ్గర్లో ఒక బి.ఎం.డ్బ్ల్యూ వేన్ వచ్చి ఆగింది. విండొ తీస్తుండగానే అతను గుర్తించాడు. నల్లటి కళ్ళద్దాలు పెట్టుకొని బీనా చెయ్యూపింది. గబగబా అతను వ్యాను ఎక్కాడు. బయట ఎండకి అతనికి ఉక్కబోతగా ఉండడంతో అతను విండో గ్లాసు తీయబోయాడు. వద్దని వారిస్తూ ఏ.సీ ఆన్ చేసింది. సీట్లో కూర్చోగానే హై ఫై ఇచ్చింది ఆమె. అతనూ నవ్వాడు. ఇద్దరూ కబుర్లలో పడ్డారు.

మధ్యలో రెండు మూడు సార్లు అతని ఫోన్ రింగయ్యింది. మొదటి రెండు సార్లూ తియ్యలేదు. మూడోసారి తీసి చూసాడు. దీప్తి పేరు స్క్రీన్ మీద కనిపించింది. అతను వేంటనే సెల్ స్విచ్ ఆఫ్ చేసేసాడు.

“ఎవరు? మాట్లాడచ్చు కదా? ఎందుకు స్విచ్ ఆఫ్ చేసావు?” బీనా ప్రశ్నకి ఏం జవాబు చెప్పాలో తెలీలేదు. ఫ్రెండని చెప్పాడు.
తనకున్న కొద్ది పరిచయంలో బీనా అతనికి కాల్ రావడం చూళ్ళేదు. సాధారణంగా బీనా ఇంటికి రాగానే అతను ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేస్తాడు. బీనాని కలవడం అతనికది నాలుగోసారి.

ఆ వ్యాను దూసుకుంటూ పటేల్ నగర్ వైపు వెళ్ళింది.

కారు దిగీ దిగగానే అతను సిగరెట్టు వెలిగించాడు. బీనాకి కారులో సిగరెట్ త్రాగడం ఇష్టం ఉండదు. కారంతా సిగరెట్ వాసన వస్తుందని అంటుంది.
వ్యాను దిగాక సరాసరి మేడమీదకి వెళ్ళాడు. బీనా ఇల్లు చాలా పెద్దది. ఆమె ఐశ్వర్యం అంతా ఆ ఇంట్లో ప్రతీ అంగుళంలోనూ కనిపిస్తుంది.
సరాసరి అతను బెడ్ రూం వైపు వెళ్ళాడు. వేంటనే షవర్ చేసుకోవడానికి బాత్‌రూమ్ వైపు వెళ్ళాడు. షవర్ అయ్యాక లుంగీ కట్టుకొని మంచమ్మీద కూర్చుని సిగరెట్ వెలిగించాడు.

ఒక్కాసారి వెనక్కాలనుండి వచ్చి బీనా అతన్ని వాటేసుకుంది. ఆమె స్పర్శ అతనికి కొత్తకాదు. అతని చేరువ బీనాకి అంతే!
కొంతసేపయ్యాక అతను మంచమ్మీద నుండి లేచి బట్టలు మార్చుకుంటూండగా బీనా అతనికి చిన్న కవరు అందిచ్చింది. బీనా కేసి చూస్తూ నవ్వాడతను . రేపూ వస్తావా అనడగింది. సరేనన్నాడు అతను.

***

హొటలుకి తిరిగొస్తూండగా మధ్యాన్నం దీప్తి ఫోన్ చేసినట్లు గుర్తొచ్చింది. వేంటనే కాల్ చేసాడు.
“వచ్చిన పని కావడానికి ఇంకా రెండ్రోజులు పైనే పట్టచ్చు, ” ఆవతల దీప్తి ప్రశ్నలకి జవాబిస్తున్నాడు.

“నే చేప్పేది విను. అనసూయమ్మ గారు పంపితేనే వచ్చాను. వాళ్ళమ్మాయి ఐష్ మాటలు నమ్మకు. అయినా నా గురించి తెలిసీ ఆ అమ్మాయి మాటలు ఎలా నమ్మగలిగావు? అయినా నేను మొన్ననగా వచ్చాను. ఐష్‌ని కలిసే చాన్సే లేదు. నువ్వేం కంగారు పడకు. ఎవరైనా అడిగితే పని మీద సొంతూరు శ్రీకాకుళం వెళ్ళానని చెప్పు. పాప జాగ్రత్త. అవసరమయితే ఫోన్ చెయ్యి,” అని దీప్తికి సర్ది చెప్పాడు.
డిన్నర్ చేసి రాత్రికి నిద్రకి ఉపక్రమిస్తూండగా రూం బెల్ మ్రోగింది. వెళ్ళి డోర్ తీసి చూసి అవాక్కయ్యాడు.
అతని ఎదురుగా యూనిఫాంలో ఓ పోలీసాఫీసర్! అతని నోట మాట రాలేదు.

***

అతన్ని ఒక గదిలో పడేసి చచ్చేలా బాదుతున్నాడా పోలీసాఫీసర్.
“సార్! నాకు ఏమీ తెలియదు. నన్ను నమ్మండి. కిట్టని వాళ్ళెవరో నా నంబరిచ్చారు,” అంటూ హిందీలో బావురుమన్నాడు.
“నా గురించి మీకు వివరాలెవరిచ్చారో తెలీదు,” అంటూ అతను హిందీలో భోరున విలపించాడు. ఆ వచ్చిన పోలీసాఫీసరుకి తెలుగు రాదు. హైద్రాబాదులో ఆటో నడపడం వల్ల అతనికి హిందీ బానే వచ్చింది.
“ఇవాళ మధ్యాన్నం నా సెల్‌కి ఒక కాల్ వచ్చింది. ఒకమ్మాయి నీ వివరాలన్నీ చెప్పింది, నువ్వొక పెద్ద రాకెట్ నడుపుతున్నావనీ చెప్పింది,” ఆ పోలీసఫీసర్ చెప్పాడు.
అతనికి ఆ అమ్మాయెవరో అర్థమయ్యింది. అనసూయమ్మ కూతురు ఐష్ అయివుంటుంది. డిల్లీకి బయల్దేరేముందు అతనితో పిచ్చిగా ప్రవర్తించింది. అతను చీకొట్టడంతో కోపంతో ఈ పని చేసుండచ్చు. అయినా తను డిల్లీలో ఉన్న సంగతి అనసూయమ్మకి తప్ప ఇంకెవరికీ తెలిసే అవకాశం లేదు. దీప్తికి అతను వెళ్ళేది డిల్లీ అని చెప్పాడంతే! దేనికో, ఎక్కడికో చెప్పలేదు. ఎప్పుడూ చెప్పే అలవాటు కూడా లేదు. అనసూయమ్మ రియల్ ఎస్టేట్ పని మీదనే ఈ టూర్లని దీప్తి నమ్మకం.

అయితే, అనసూయమ్మే చేయించిందా ఈ పని ? అతనికేమీ అర్థం కావడం లేదు.

“డోంట్ వర్రీ, నీకేమీ భయం లేదు. నువ్వు నాకు సహకరిస్తే ఈ ఈ రాకెట్ని బయట పెట్టాలి. ఈ డిల్లీలోనే మినిస్టర్ల భార్యలూ, ఆర్మీ చీఫుల పెళ్ళాలూ వీళ్ళందరూ పెద్ద రాకెట్ నడుపుతున్నారని తెలుసు. నీలాంటి యువకులు చాలామంది ఈ రాకెట్లో ఉన్నారు. దేర్ ఈజ్ సంథింగ్ ఫిష్షీ హియర్!” అని ఆలోచనలో పడ్డాడా పోలీసాఫీసర్!

ఇంతలో అతని ఫోన్ మ్రోగింది. దీప్తి అన్న పేరు సెల్ ఫోన్ మీద కనిపించింది. ఫోన్ తియ్యాలా వద్దన్నట్లు పోలీసాఫీసరు కేసి చూసాడతను. మాట్లాడమన్నట్లు తలెగరేసాడా పోలీసాఫీసరు. వెంటనే ఫోన్ అందుకున్నాడతను.

“ముందు ఏడుపు ఆపి నే చెప్పేది శ్రద్ధగా విను. అనసూయమ్మ కూతురు ఎవడితోనే పారిపోయిండచ్చు. అతనెవరూ దొరికే వరకూ అనసూయమ్మ నన్ను వాడుకుంటోంది. అందుకే మీ అందరికీ నేను లేపుకుపోయానని చెప్పుండచ్చు. ఇది తల్లీ కూతుళ్ళ నాటకం. నేనొచ్చేవరకూ నువ్వు తొందర పడద్దు, ” అంటూ చెబుతూండగానే ఫోన్ లాక్కున్నాడా పోలీసాఫీసరు. ఒక్కసారి కంగారు పడ్డాడతను.

“కౌన్ హో తుమ్? క్యా చాహియే? తుమ్హారా ఆద్మీ మేరే జాల్ మే…” అంటూ ఫోన్ కట్ చేసాడు. దీప్తికి హిందీ అంత బాగా రాదు. కానీ వేరే గొంతు వినేసరికి కంగారు పడే అవకాశం ఉందనుకొని భయపడ్డాడతను.

“ఇప్పుడు చెప్పు? నీ వెనుక ఎవరెవరున్నారు? అసలీ రాకెట్ ఏవిటి?” అంటూ ఫోన్ అడ్రసు బుక్కులో నంబరు వెతుకుతున్నాడు. ఏమీ కనిపించక పోయే సరికి చాలా చికాకు పడ్డాడు ఆ పోలీసాఫీసరు.

“ఇంతకు ముందు ఫొన్ చేసిందెవరు?” గట్టిగా లాఠీతో కాళ్ళ మీద అదిలించాడు.
ఒక్కాసారి అదిరిపడి – “నా పెళ్ళాం, సార్!” అంటూ వణికిపోయాడతను.

“సాలే! నీ బ్రతుక్కి పెళ్ళి కూడా అయ్యిందా? లేక ఎవరైనా…” అంటూ మరో సారి లాఠీ అదిలించాడు. దూరంగా కానిస్టేబుల్స్ ఇదంతా గమనిస్తూనే ఉన్నారు.
“లేదు సార్! నన్ను నమ్మండి. నాకు ఎవరి వివరాలూ తెలీవు. నేను మా ఇంటి ఓనరు అనసూయమ్మ పంపితే పని మీద వచ్చాను…” అంటూ ఏడుస్తూ చెప్పాడతను. ఆ పోలీసాఫీసర్ని చూస్తే భయమేసింది.
తనకి తెలుసున్నది చెప్పడానికి ఉపక్రమించాడతను. అతని కళ్ళ ముందు దీప్తీ, పాప మెదిలారు.

 

***

“మాది శ్రీకాకుళం దగ్గరలో వున్న ఆముదాలవలస. మా నాన్న ఒక రైసు మిల్లులో పని చేసేవాడు. నేనే ఆఖరి వాణ్ణి. నాకు ఇద్దరు అక్కలూ, ఒక అన్న. నాకు చదువంత సరిగా అబ్బలేదు. ఆముదాలవలసలో ఉంటే చెడు తిరుగుళ్ళు ఎక్కవయ్యాయని నాన్న నన్ను శ్రీకాకుళం మా అత్తయ్య ఇంట్లో పెట్టాడు. శ్రీకాకుళంలోనే కాలేజీ చదువు ప్రారంభం అయ్యింది. ఇంటరు అత్తెసరు మార్కులు వచ్చి చచ్చి పాసవ్వడంతో బీ.కాం లో జాయిన్ అయ్యాను. డిగ్రీ రెండో ఏడు చదువుతూండగా దీప్తితో పరిచయం అయ్యింది. దీప్తి వాళ్ళు ఆర్థికంగా కాస్త ఉన్నవాళ్ళు. మా పరిచయం ప్రేమగా మారింది. చాటుగా ఏడాది పాటు ప్రేమాయణం సాగించిన మేము డిగ్రీ పరీక్షల చివర్లో వాళ్ళింట్లో పట్టుబడిపోయాం. దీప్తి వాళ్ళది మావీ కులాలు వేరు. వాళ్ళ నాయనకి కులాల పట్టింపు బాగా ఉంది. పైగా డబ్బూ, పలుకుబడీ ఉన్న వాళ్ళు. మమ్మల్ని కాదన్నారు వాళ్ళు. మేం వాళ్ళని వద్దనుకున్నాం. ఎవరికీ చెప్పా పెట్టకుండా హైద్రాబాదు ఉడాయించాం. హైద్రాబాదు రాగానే జీడిమెట్లలో ఉన్న నా స్నేహితుడొకడు మాకు ఆసరా ఇచ్చాడు. కొంతకాలం వాడింట్లో ఉన్నాం. ఈలోగా నేను ఉద్యోగం వెతుక్కోడం మొదలు పెట్టాను. ఒకటి రెండు ఫాక్టరీల్లో చిన్న చిన్న పనులు చేసాను కానీ, మా ఇద్దరికీ చాలేది కాదు. సరిగ్గా అదే సమయానికి దీప్తి నెల తప్పింది. అబార్షన్ చేయించుకోమని చెప్పాను. తను మొండి కేసింది. మాకే బ్రతకడానికి చచ్చే చావులా ఉంది. ఇంకో ప్రాణాన్ని ఎలా నెట్టుకు రావడం? సరిగ్గా అదే సమయానికి నా స్నేహితుడు ఇల్లు ఖాళీ చెయ్యాల్సొచ్చింది. ఇల్లు వెతుకులాట మొదలయ్యింది. ఎక్కడా ఇంటి అద్దె భరించే స్థితిలో నేను లేను. ఉద్యోగం కూడా అంతంత మాత్రం. అనుకోకుండా మా స్నేహితుడికి తెలుసున్నాయన మా కష్టాలు విని బాలానగర్ దగ్గర్లో ఒక అపార్ట్మెంట్ గ్రౌండ్ ఫ్లోర్లో రెండు చిన్న గదుల ఇల్లు చూపించాడు. ఆ అపార్ట్మెంట్ ఓనరు అనసూయమ్మ. ఆవిడ మాగురించి తెలుసుకొని అద్దె లేకుండా మాకు ఉండడానికి ఇల్లిచ్చింది. నాకు కారు డ్రైవింగ్ వచ్చని తెలియడంతో ఆవిడ కారు డ్రైవరుగా నన్ను పెట్టుకుంది. దీప్తి అనసూయమ్మ ఇంట్లో చిన్న చిన్న పనులు చేసేది. నిజం చెప్పద్దూ, అనన్సూయమ్మ మా పాలిట దేవతలా అనిపించింది మాకు. నాకు దగ్గరుండి బ్యాంకు లోన్ ఇప్పించి ఒక ఆటో కొనిపించింది. ఆటో వచ్చాక మాకు డబ్బు కొరత కాస్త తీరింది. రోజుకి నాకు అయిదారొందలు మిగిలేవి. చూస్తూండగా దీప్తికి నెలలు నిండాయి. మా వూరు శ్రీకాకుళం వెనక్కి వెళిపోదామా అనుకున్న క్షణాలు చాలానే ఉన్నాయి. కానీ ఇద్దరకీ అభిమానం అడ్డొచ్చింది. ప్రేమించడం కంటే బ్రతకడం కష్టం అన్నది మాకు అర్థమవ్వడానికి ఎక్కువ కాలం పట్టలేదు. ఒక పక్క రోజు గడవాలి. ఆకలి తీరాలి. మరో పక్క అహం, అభిమానం. మా కాళ్ళమీద మేం బ్రతకాలన్న పౌరుషం మమ్మల్ని ఆపేసింది. దీప్తి పురుడికి అనసూయమ్మే దగ్గరుండి సాయం చేసింది. అప్పటికి నాకు ఇరవయ్యారేళ్ళు. దీప్తికి ఇరవై నాలుగు. మాకు పాప పుట్టింది. మొదటి నెల బాగానే గడిచింది. రెండో నెల వచ్చేసరికి పాపకి జబ్బు చేసింది. డాక్టరు తల్లి పాలు మానిపించి డబ్బా పాలు పట్టమన్నాడు. చూస్తూండగా ఖర్చులు పెరిగిపోయాయి. రాత్రింబవళ్ళు ఆటో నడిపినా చాలేది కాదు. పెళ్ళయ్యాక దీప్తిని సుఖపెట్టిందంటూ లేదు. తనెప్పుడూ ఒక్కసారి కూడా ఇది కావాలని అడిగేది కాదు. తను పెరిగిన వాతావరణాన్ని కూడా ఎప్పుడూ తలుచుకునేది కాదు. కానీ నాకు తెలుసు తనెంత గొప్పగా బ్రతికిందో! దీప్తి నాకోసం ఇంతలా మారిపోవడంతో నాలో నాకు తెలీని అంతర్మధనం మొదలయ్యింది. పైకి చెప్పుకోలేని ఆత్మన్యూనతా భావం బయల్దేరింది.

సరిగా అదే సమయానికి అనసూయమ్మ డబ్బు సులభంగా సంపాదించే కొత్త మార్గం చూపించింది. అనసూయమ్మ మొట్టమొదటి సారి ఆ ప్రతిపాదన చెప్పినప్పుడు ఆమెను నరికేయాలన్నంత కోపమూ, ఆవేశమూ వచ్చాయి. మా వూళ్ళొ చాలా మంది మగాళ్ళ ఇల్లీగల్ రిలేషన్స్ చూసాను. అప్పట్లో ఆడవాళ్ళనే తప్పుబట్టిన సందర్భాలున్నాయి. శృంగారానిక్కూడా హృదయమూ, ప్రేమా ముఖ్యమని నమ్మేవాణ్ణి. ఆ క్షణం మగాడిగా పుట్టినందుకు అసహ్యించుకున్నాను. మొదట్లో జుగుప్సాకరంగా అనిపించేది. “ఆమ్మాయిలు ఇటువంటి పనికి సిగ్గు పడ్డారంటే అర్థం వుంది. నేకేం పొయ్యకాలం వచ్చిందిరా? నువ్వు మగాడివి కావా?” అంటూ అనసూయమ్మ రెచ్చగొట్టేలా మాట్లాడేది. ఏం? సిగ్గూ, లజ్జా, ఏడుపూ మగాళ్ళకుండవా? అని ఆ క్షణం అయితే అడిగాను కానీ, మెల్లగా బ్రతుకు బలహీనత ఆవరించింది. ఒక్కసారి అంత మొత్తం కళ్ళ చూసాక ఒక రకమైన జస్టిఫికేసన్ మొదలయ్యింది. నెలంతా ఆటో తిప్పితే వచ్చే సొమ్ములు ఒక్క గంటలో వచ్చేస్తున్నాయి. అదీ ఏమాత్రం శ్రమ లేకుండా. మొదట రెండు మూడు సార్లు బెరుగ్గా అనిపించినా తరువాత తరువాత అలవాటయిపోయింది.

ఆ అలవాటులో భాగంగా దీప్తికి అబద్ధాలు చెప్పడం అవసరం అయ్యేది. ఏం చేసేది? డబ్బు పాపిష్టిది. ఉండి ఉన్నవాణ్ణీ, లేక లేనివాణ్ణీ హింసిస్తూ ఉంటుంది. ఎన్నో రాత్రుళ్ళు నాలో నేనే ఏడ్చేవాణ్ణి. మగాణ్ణి కదా పైకి ఏడ్చే హక్కు లేదు నాకు. దీప్తి ముందరయితే ఏమయ్యిందని ప్రశ్నిస్తుంది. అందుకే మా పాప దగ్గరే ఏడ్చేవాణ్ణి.

చెప్పద్దూ? బ్రతకడం వేరు. భరించడం వేరు. నాలో నేను చస్తూ నన్ను నేను భరిస్తున్నాను. ఎన్నోసార్లు దీప్తికి నా గురించి చెప్పేద్దామని ప్రయత్నించాను. ఆ పాపిష్టి డబ్బు నన్ను జుట్టు పట్టుకు గుంజేసేది. తలొగ్గేసేవాణ్ణి.

జూబ్లీ హిల్స్లో ఒక ఇండస్ట్రయిలిస్ట్ భార్య నా మొట్ట మొదటి కస్టమరు. మొదట్లో తెలియలేదు కానీ అనసూయమ్మకి చాలా పొలిటికల్ కనక్షన్స్ ఉన్నాయి. నేను ఈ వ్యవహారమంతా చూసి భయపడి చచ్చాను. పైగా చెప్పలేనంత సిగ్గు నన్ను అధః పాతాళానికి తోసేసింది. “ఏంట్రా? నువ్వూ ఓ మగాడివేనా? ఆడదాన్ని చూస్తె పురుగుని చూసినట్లు అలా ముడుచుకుపోతావేంటి?” అని ఓ సారి చెంప దెబ్బ కూడా వేసింది అనసూయమ్మ.
ఈ వ్యవహారమంతా చాలా విచిత్రంగా జరుగుతుంది. చాలాసార్లు మధ్యాన్నం ఇళ్ళలోనే జరుగుతాయి. వాళ్ళు కూడా చచ్చేటన్ని జాగ్రత్తలు తీసుకుంటారు. మొదటి సారి అనసూయమ్మ కూడా వచ్చింది. వెళ్ళేటప్పుడు సెల్ ఫోన్ తీసుకెళ్ళనీయరు. చాలా సీక్రెట్గా నడిపిస్తారు. వాళ్ళ ఇష్టాయిస్టాలకి అనుగుణంగా నడుచుకోవాలి. వీళ్ళల్లో కొంతమందికి తాగడం ఇష్టం. కొంతమందికి సిగరెట్ తాగడం ఇష్టం. ప్రతీ ఒక్కళ్ళకీ ఒక్కో రకమయిన పెర్ఫ్యూమ్స్ ఇష్టం ఉంటాయి. మొదట్లో అవన్నీ వాళ్ళే ఏర్పాటు చేసేవారు. రాన్రానూ నాకు అర్థమయ్యింది. చిత్రం ఏవిటంటే ఈ వ్యవాహరమంతా ఇళ్ళల్లోనే జరుగుతాయి. ఎవరూ బయటకి రారు. ఇదంతా ఒక పకడ్బందీ వ్యవహారం. మూడో కంటికి తెలియకుండా జరిగిపోతాయి. అన్నింటికన్నా నాకు నచ్చిందేవిటంటే పని అవ్వగానే డబ్బు కవర్లో ఇచ్చేస్తారు. మొదట్లో చేసే పని చాలా బాధ కలిగించేది. మొదటిసారి ఇండస్ట్రియలిస్ట్ భార్య నన్ను తాకినప్పుడు శరీరమంతా తేళ్ళూ, జెర్రులూ పాకినట్లనిపించింది. ఒక్క అరగంటలో లక్షల సార్లు చచ్చుంటాను. మనసు ఛీత్కరించుకుంది. బుద్ది డబ్బుతో నచ్చచెప్పింది.

నరమాంసపు రుచి అలవాటయిన పులి జింకల కోసం చూడదు. అలవాటు పడ్డ రుచి దహించేస్తూ ఉంటుంది. పులికి నరమాంసంలా డబ్బు నాకు కొత్త జిహ్వనీ, జీవితాన్నీ చూపించింది.

అనసూయమ్మ రాకెట్ చాలా పెద్దదని మెల్లగా అర్థమయ్యింది. పెద్ద పెద్ద సినిమా తారలూ, సాఫ్ట్ వేరు కంపెనీ మేనేజర్లూ చాలా మందే అనసూయమ్మ కస్టమర్లు. ఎప్పుడూ ఎవరి దగ్గరా ఈ ప్రస్తావన తెచ్చేది కాదు. నా దగ్గర ఎప్పుడూ ఏవీ జరగదన్నట్లే ప్రవర్తించేది. మా ఇద్దరికీ ఒక కోడ్ సైన్ ఉండేది. నా సెల్‌కి కాల్ చేసి బజార్నుండి కోక్ పట్టుకురమ్మనమనేది. అంటే ఆరోజు నాకు డబ్బులొస్తాయి.
ఒక సారి కోక్ అంటే ఏవిటని అడిగితే నవ్వుతూ చెప్పింది – “కోకో కోలా – కోక కావాలా?” అనర్థం చెప్పింది. అది తెలిసాక కోక్ త్రాగాలంటే మనసొప్పేది కాదు. దీప్తికి కోక్ అన్నా, థమ్సప్ అన్నా ఇష్టం. ఎప్పుడయినా బయటకి వెళ్ళినప్పుడు కోక్ అంటే వద్దనే వాణ్ణి.
అనసూయ్యమ్మకి కస్టమర్లు హైద్రాబాదుకే పరిమితం కాదు, డిల్లీ, కలకత్తా, ఇలా పలునగరాల్లో ఉన్నాయి. నా పెర్సనాలిటీ, వయసూ నా రేటుని పెంచేసాయి. డిల్లీ వెళ్ళినప్పుడల్లా వారంలో లక్ష రూపాయిలు దొరికేవి.

డబ్బు వస్తోందన్నది మినహాయిస్తే మానసికంగా నాకు స్థిమితమూ, శాంతీ లేదు. దీప్తిని తాకడానిక్కూడా మనస్కరించేది కాదు. చెప్పానుగా డబ్బు నన్నొక పులిలా తయారుచేసింది. మామూలు పులి కాదు, ధనమాంసపు పులి…”

***

Kadha-Saranga-2-300x268
అతని గురించి దీప్తికి తెలిసిపోయింది. తనని జైల్లో పెట్టారనీ, నానా చిత్రవధలూ పెడుతున్నారని తెలిసి జైలుకి వచ్చింది. అతను జైలు గది లోపలున్నాడు. వెలుపల ఆమె చంకలో పిల్లనెత్తుకొని ఏడుస్తూ ఉంది.
జరిగినదంతా దీప్తికి అతను చెప్పుకొచ్చాడు. “ఎందుకు చేసావ్? ఈ పాపిష్టి పనులు? నేనెప్పుడయినా డబ్బు కావాలని అడిగానా? ” ఏడుస్తూ అతని చెంప వాయించింది.
అతను దోషిలా నిలబడ్డాడు. అతను చేసిన తప్పు పనికన్నా, ఆమె ముందు దోషిగా నిలబడడం అతన్ని కృంగతీసింది. ఏడుస్తూ మౌనంగా ఉండిపోయాడు.

“దీప్తీ! నన్ను నమ్ము! ఒక పక్క నీకు మంచి జీవితాన్ని ఇవ్వలేని నా అసమర్థత. మరో వైపు మన అవసరాలు. డబ్బుకోసమే ఇదంతా చేసాను తప్ప…” అంటూ గోడకి తలకొట్టుకుంటూ ఏడ్చాడతను. దీప్తి వచ్చి వారించి అతన్ని దగ్గరకి తీసుకుంది.
అతను చెప్పింది దీప్తి నమ్మ లేదు. వివరం చెప్పేసరికి అవాక్కయ్యింది. “డబ్బున్న మగాళ్ళకి ఇలాంటివి విన్నాను. ఆడవాళ్ళు కూడా…?” అంటూ ఆశ్చర్యపోతే – “ఏం? ఆకలికీ, సెక్స్ కీ ఆడా, మగా తేడాలుండవు. ఇలా గిరి గీసుకోవడం మన తప్పు. నీకే కాదు, నాకు మొదట్లో నమ్మకం కలగలేదు,” అంటూ అతను జవాబిచ్చాడు.

అంతే దీప్తి ఒక్కసారి తల జైలు తలుపు ఇనుప కమ్మీలకి ఏడుస్తూ కొట్టుకుంది. “దీప్తీ!” అంటూ గట్టిగా అరిచాడతను.
ఒక్కసారి ఉలిక్కి పడి లేచి చుట్టూ చూసాడు. తన పక్కనా, ఎదుటా ఎవరూ లేదు. కల వచ్చిందని గ్రహించాడతను.
దూరంగా పోలీసాఫీరు మాటలు వినిపిస్తున్నాయి.

తల విదిలించి అటుగా చూసాడు. వడి వడిగా పోలీసాఫీసరు తన సెల్ వైపు వస్తున్నట్లు గమనించాడు.

వస్తూనే – “నీ మొబైల్‌కి రాత్రంతా ఒకటే ఫోన్లు. స్విచ్ ఆఫ్ చేసేసాను. ఇందాకనే మా పై ఆఫీసరుతో మాట్లాడాను. నువ్వు సహకరిస్తే ఒదిలి పెట్టేయమని చెప్పారయన. కాబట్టి నువ్వు నీకు తెలుసున్న నంబర్లు చెప్పు,” గట్టిగా అన్నాడు. ఆఫీసరు రాగానే లేచి నుంచున్నాడతను.
“సార్! చెప్పానుగా! అవసరమయితే వాళ్ళే కాల్ చేస్తారు తప్ప నాకెవరి నంబర్లూ తెలీవు. పైగా ప్రతీ సారీ వాళ్ళు ఫోన్లు మార్చేస్తారు,” అన్నాడతను.
“సార్! మీకు ఫోన్ వచ్చినప్పుడు నా గురించి చెప్పిన వాళ్ళ వివరాలు ఎందుకడగలేదు సార్?” పోలీసాఫీసర్ని ప్రశ్నించాడు.
“అడిగాను. చెప్పలేదు. తరువాత ఫోన్ పెట్టేసాక ఈ హొటల్కి కాల్ చేస్తే నీ పేరూ అవీ కరక్టుగా సరిపోయాయి. నాకు ఇలాంటివి ఇక్కడ జరుగుతున్నాయని మా డిపార్ట్మెంటుకి తెలుసు. సరే చూద్దామని హొటల్కి వస్తే నువ్వు దొరికావు…”
“మీకు ఫోన్ చేసిన అమ్మాయికి తిరిగి మీరు ఫోన్ చేసి కనుక్కోలేదా?”
“చేసాను. కానీ ఆ సెల్ నంబరు సర్వీసులో లేదని మెసేజ్ వచ్చింది. అందుకే నీ దగ్గర కూపీ లాగుతున్నాను, ” అన్నాడా పోలీసాఫీసరు.
అతను భయపడ్డాడు. “అయితే మమ్మల్ని అరెస్టు…” అంటూ మధ్యలో ఆపేసాడతను.
“నో! నిన్నేం అరెస్టు చెయ్యను. నీ పేరు బయటకి రాకుండా చూస్తాగానీ, నాకు మాత్రం వివరాలు కావాలి. నిన్న నువ్వు కలిసిన ఆవిడ ఎవరు?” ఆ పోలీసాఫీసరు అతన్ని అడిగాడు.
బీనా పేరు చెప్పాలా వద్దా అని తటపటాయించాడు. అయినా ధైర్యం చేసి ఏం జరిగితే అది జరుగుతుందని చెప్పేసాడు. అది విని అతను ఆశ్చర్యపోయాడు.
“బీనా ఎవరనుకున్నావ్? నేవీ చీఫ్ భార్య. ఇంకా ఎవరు నీ కష్టమర్లు? నువ్వు కాక ఇందులో ఇంకా ఎంత మంది యువకులున్నారు? ” అతను ప్రశ్నల శరంపర తీసాడు.
“నవనీత్ కౌర్ అని చండీఘడ్ లో ఉండే ఆవిడ తెలుసు. చెప్పానుగా, నాకు చాలా మంది పేర్లు మాత్రమే తెలుసు సార్! వాళ్ళు పనయ్యాక సెల్ ఫోన్లు మార్చేస్తారు. బానీ నంబరు ప్రతీసారీ ఒక కొత్తది ఉంటుంది. ఒట్టు సార్! నిజంగా నాకెవరున్నారన్నది తెలీదు. ప్రతీ సారీ అనసూయమ్మ ఎక్కడికెళ్ళాలో చెప్పేది. నేను కలిసిన వాళ్ళు ఒక్క మాట కూడా మాట్లాడరు. అంతా ప్యూర్ బిజినెస్! అంతకు మించి నాకు ఏవీ తెలీదు…” అంటూ అతను అతను భోరున ఏడ్చాడు.
“నీకు తెలుసున్న వివరాలు చెప్పు చాలు…”
“తెలుసున్నవన్నీ చెప్పాను సార్! హైద్రాబాదులో అనసూయమ్మకి అన్ని డిటైల్సూ తెలిసే అవకాశం ఉంది. ఎందుకంటే ఆవిడే నా కాంటాక్ట్స్ కుదురుస్తుంది…సార్! ఆకలి గా ఉంది….” అని దీనంగా చూసాడు.
అది విని కానిస్టేబుల్ చేత పంపిస్తానని అక్కడనుండి వెళిపోయాడు. కొంత సేపయ్యాక ఒక కానిస్టేబుల్ వచ్చాడు. బయట హొటల్లో ఏదైనా తినడానికి తీసుకెళ్ళడానికి. పారిపోవడానికి ప్రయత్నిస్తే చావేనని బెదిరించాడు.
బయటకు వస్తూండగా పోలీసాఫీసరు బయట ఒక కారు దగ్గర ఎవరితోనో మాట్లాడుతూ కనిపించాడు. వీళ్ళని చూసి వెనక్కి రమ్మనమని పిలిచాడు. అతను కారు సమీపించగానే కారులో ఉన్న ఒకామెను చూసాడతను. వేంటనే గుర్తు పట్టాడు. ఆమె అతన్ని గుర్తుపట్టి తల తిప్పుకుంది. ఆమె పేరు గుర్తుకు రావడం లేదు. ఫోన్లు లాగనే వీళ్ళూ పేర్లు మార్చేసుకుంటారు. వేంటనే తల తిప్పి ఆ కానిస్టేబుల్ని అనుసరించాడు.
టిఫిన్ తిన్నాక అతని ప్రాణం లేచొచ్చింది. తిరిగి వస్తూ పోలీస్టేషన్ ప్రవేశిస్తూండగా అక్కడ ఒక రూములో పోలీసాఫీసరు కనిపించాడు.
ఆయనతో మాట్లాడాలి అన్నట్లు కానిస్టేబుల్తో సైగ చేసాడతను. ఆయన రూమువైపు తీసుకెళ్ళి బయటకి వెళిపోయాడా కానిస్టేబుల్.
“సార్! మీకో విషయం చెప్పాలి. ఇందాక మీరు బయట కారులో మాట్లాడుతున్న ఆమె నాకు తెలుసు సా…ర్!” అంటూండగా ఒక్కసారి కుర్చీలోంచి లేచి సాగదీసి లెంపకాయ కొట్టాడా పోలీసాఫీసరు.
అంతే అతని నోట మాట లేదు. కానిస్టేబుల్ని గట్టిగా కేకేసాడా పోలీసాఫీసరు. అతన్ని జైలు గది వైపు లాక్కెళ్ళాడు. కసితీరా అతన్ని చావబాదాడా పోలీసాఫీసరు.

***

అంతవరకూ నానా హింసలు పెట్టినా ఆ పోలీసాఫీసరు అతను చెప్పింది విన్నకా ఏమనుకున్నాడో కారెక్కించుకొని బయటకి తీసుకెళ్ళాడు.
“సార్! మీరు ఈ డొంకతా కదిపి మీకే ముప్పు తెచ్చుకునేలా వున్నారు….” అంటూ చెప్పాడు. ఆ పోలీసాఫీసరు మొహం కందగడ్డలా మారిపోయింది.
“లేదు సార్! నేను నిజమే చెబుతున్నాను. నమ్మండి. నేను అబద్ధం చెప్పడం లేదు!”
తనొక పెద్ద ఉచ్చులో ఇరుక్కున్నానని అతనికి అప్పుడర్థమయ్యింది. పోలీసాఫీసరు సమస్య వేరు.
“ఈ క్షణం నుండి నువ్వెవరో నాకు తెలీదు. నేనెవరో నీకు పరిచయం లేదు. ఒకవేళ నోరు జారితే నువ్వూ, నీ ఫామిలీ…” అంటూ ఒక విషపు నవ్వు నవ్వాడా పోలీసాఫీసరు.
అతన్ని నేరుగా తీసుకెళ్ళి ఇండియా గేట్ వద్ద వదిలేసాడు. ఆ ఆఫీసరు వెళ్ళాక దీప్తికి కాల్ చేసాడతను.
“నాకు భయంగా ఉంది. ఆ పోలీసాఫీసరు నిన్ను పట్టుకొని జైల్లో…” అంటూ ఫోనులో గట్టిగా ఏడ్చింది.
“అతను మన జోలికి రాడు, అతనికి మినిస్ట్రీ నుండి ఫోన్ వచ్చింది. పైగా ఇంకో విషయం…” చెప్తూ ఆపేసాడు.
దీప్తి విషయం ఏమిటని మరలా రెట్టించింది.
“ఈ ఆఫీసరు …ఇహ అతను మన జోలికి రాడు,” అని దీప్తికి ధైర్యం చెప్పాడు.
“నువ్వు వేంటనే బయల్దేరి ఇంటికొచ్చేయ్! మనకున్నది చాలు. బ్రతకడానికి చాలా దార్లున్నాయి. ఈ పాపిష్టి డబ్బు మనకొద్దు. నువ్వీ పనులు చెయ్యనని ప్రామిస్…” అంటూ ఫోనులో గట్టిగా ఏడ్చింది దీప్తి. ఆమె ఫోను పెట్టేసాక మనసు మనసులో లేదు. దీప్తికి తను మోసం చేసినా ఇంకా తననే నమ్ముకుంది.
ఇండియా గేట్ డిల్లీలో అతనికి నచ్చిన ప్రదేశం. ఎన్నో సాయంత్రాలు అక్కడ గడిపాడు. ఇదే తన పికప్ పాయింట్.
అక్కడే ఒక హొటల్లో చాట్ తిని టీ తాగాడు. రాత్రి తొమ్మిది కావస్తోంది.
మనసు పరిపరి విధాల పోతోంది. ఒక పక్క తనంటే తనకి అసహ్యం, గత్యంతరం లేని బ్రతుకు. మరొక పక్క కుటుంబం. కాలే కడుపుకి ఒక రకం ఆకలి. రగిలే డబ్బుకి మరో రకం ఆకలి. పనికి మాలిన జస్టిఫికేషన్! పరిపరి విధాల ఆలోచిస్తూ అక్కడున్న పచ్చిక మైదానంలో నడుస్తున్నాడు.
దూరంగా ఒకమ్మాయి అతన్ని చూసి నవ్వుతూ చెయ్యూపింది. మెల్లగా నడుచుకుంటూ అతని వైపే వచ్చింది.
దగ్గరకొచ్చాక ఆమెను చూసాడు. పెదాలకి ఎర్రటి లిప్స్టిక్‌తో విపరీతమైన మేకప్‌తో ఉంది.
అతనికి ఆమె ఎవరో అర్థమయ్యింది. దగ్గరకి రాగానే పెర్ఫ్యూం వాసన గుప్పున కొట్టింది.
“వాంట్ టూ హావ్ సమ్ డ్రింక్ టుగెదర్?”
వద్దన్నట్లు తలూపుతూ జేబులోంచి ఒక కవరు తీసి ఆమె చేతిలో పెట్టి వెళిపోయాడు. రెండ్రోజుల క్రితం బీనా అతనికిచ్చిందది.
ఆమె ఆ కవరు విప్పి చూసినట్లుంది, అతని వెనకాలే పరిగెత్తుకొచ్చి, చేతిలో కవరు చూపించి ఏవిటన్నట్లు సైగ చేసింది.
తీసుకో అన్నట్లు తలూపి బయల్దేరాడతను.
“హూ ఆర్ యూ? ” ఆమె అతన్ని వెనక్కి లాగి అడిగింది.
మెల్లగా ముందుకి నడుస్తూ చెప్పాడతను.
“జిగొలో!”

–సాయి బ్రహ్మానందం గొర్తి

Download PDF

1 Comment

  • ఏకబిగిన చదివించిన కథ. బొమ్మ బాగుంది.
    నరమాంసపు రుచి అలవాటయిన పులి జింకల కోసం చూడదు. అలవాటు పడ్డ రుచి దహించేస్తూ ఉంటుంది. పులికి నరమాంసంలా డబ్బు నాకు కొత్త జిహ్వనీ, జీవితాన్నీ చూపించింది..

ఒక వ్యాఖ్యను

Your email address will not be published. Required fields are marked *

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)