ఎంత దూరము..అది …ఎంత దూరము ?

Kadha-Saranga-2-300x268

ఆ గడపతో ఆమెకెంత అనుబంధమున్నా, ఆ క్షణంలో మాత్రం తను పూర్తిగా పరాయిదనట్టు, అపరిచితునింటికొచ్చినట్టు.. కొత్త గా, బెరుకుగా, చెప్పలేనంత జంకుతో అలానే నిలబడిపోయింది – మూసిన ఆ తలుపు బయట.
కాలింగ్ బెల్ నొక్కబోయిన చేతిని అప్పటికి రెండు సార్లు వెనక్కి లాక్కుని, మరో సారి ప్రయత్నించనా వద్దా? – అనే సందిగ్ధంలో ఆగింది.
ఎవరింటికైనా, మనం ఇష్టముంటే వెళ్తాం. లేకుంటే మాన్తాం. కానీ పెళ్ళైన ఆడపిల్ల పరిస్థితి మాత్రం అలా కాదు. ఇష్టమున్నా, లేకున్నా, మొగుడింటికి వెళ్ళాల్సిందే. వెళ్ళి తీరాల్సిందే. అదొక సోషల్ లా! సామాజిక చట్టం. ఫామిలీ రూల్. దాన్ని అతిక్రమించడానికి వీల్లేదు. అంతే. అదంతే.
ఇప్పుడు దీప్తి కూడా అదే సిట్యుయేషన్ లో వుంది. కాదు. ఇరుక్కుంది.
ఆమె వెనకే నుంచుని, – కూతురు పడుతున్న అవస్థనంతా గమనిస్తున్న ఆ తండ్రి హృదయం ఒక్కసారి గా నీరైపోయింది. ఆ కన్న తండ్రి గుండె కలుక్కుమంది. గారం గా పెంచుకున్న కన్నబిడ్డనా స్థితిలో చూడటం భరించలేనంత బాధగావుంది. చూస్తూ వూరుకోడం అమానుషం అని పిస్తుంది. ఒక్కసారిగా ఉద్వేగం పెల్లుబుకింది. ‘వొద్దురా దీపూ. నీకిష్టం లేని పని చేయొద్దు. నువ్వు నాకు భారమౌతావా. కాదు. ముమ్మాటికీ కాదు. పద. మనింటికి పోదాం’ అని అనాలనుకున్న మాటలు పెదవి దాకా వచ్చి, తిరిగి గొంతులోకెళ్ళి, ఆగిపోయాయి. కాదు. ఆపబడ్డాయి. భార్య మాటలు గుర్తుకు రాడంతో. “ అక్కడ మీకు అవమానం జరిగిందనో, తల కొట్టేసినట్టైందనో, ఇంకోటనో, మరొకటనో…కూతుర్ని వెంట పెట్టుకు రాకండి. మీరు వెళ్తోంది దాన్ని, దాని మొగుడింట్లో దింపి రావడానికి. దాని కాపురాన్నది సరిదిద్దుకోడానికి అన్న సంగతి అస్సలు మర్చిపోకండి. ఏమిటీ, వింటున్నారా?” ..ఆయనేం మాట్లాడ్లేదు. సరే అన్నట్టు తలూపూడు. కళ్ళముందింత జరుగుతున్నా, భార్య మాటకు కట్టుబడ్డ వాడిలా, అందుకే – మౌనంగా వుండిపోయాడు. దీపూ వైపు అసహాయంగా చూస్తూ.
ఇక అదే చివరిసారనట్టు, కళ్ళు మూసుకుని ధైర్యం తెచ్చుకుంటూ, ఎలా ఐతేనేం! కాలింగ్ బెల్ నొక్కింది.
కోయిల కూత కమ్మగా కూ..కూ..అంటూ మోగింది. ఈ ట్యూన్ ని తనే సెలెక్ట్ చేసింది. శ్రీకాంత్ కి ఇష్టమని తెలిసి.
కోయిల పాట ఆగిపోయింది. ఆమె లో కంగారు మొదలైంది.
ఇప్పుడు తలుపులు తెరుచుకుంటాయి. తనని చూస్తాడు. ఊ… చూసి? ఏమంటాడు?
నవ్వుతాడు. కాదు. దానికంటె ముందు ఆశ్చర్యపోతాడు. పట్టలేని ఆనందంతో అతని కళ్ళింతింతలై పోతాయి, వెన్నెల కాంతితో విచ్చుకుంటాయి.
తననిన్నాళ్ళూ మిస్సైనందుకు ఏమంటాడు? అతని మొదటి మాట ఎలా వుంటుంది? వినాల్నుంది.
అసలు మనిషెలా వున్నాడూ? దేవదాసు లా కళ్ళల్లో ప్రాణాలు పెట్టుకుని నీరసంగా కనిపిస్తాడా? లేక, మజ్ఞూ లా మాసిన బట్టల్తో అగుపిస్తాడా?
ఆమె ఆత్రానికి, ఊహలకీ ఫుల్ స్టాప్ పెడుతూ..’యెస్..కమింగ్..’ అంటూ లోపలనించి, అతని స్వరం వినిపించింది. ఆ తర్వాత ఆ తలుపు తెరుచుకోడమూ జరిగిపోయింది.
ఇద్దరి కళ్ళు కలుసుకున్నాయి.
ఆమె గుండె వేగంగా కొట్టుకుంటోందని, అర చేతులు చల్లబడుతున్నాయన్న సంగతి కూడా ఆమెకి తెలీడం లేదు.
ఆమె నవ్వ బోయింది. అది చూసి అతని మొహం అప్రసన్నంగా మారిపోయింది. మరు క్షణంలో విపరీతంగా గంభీరమై పోతూ ఆమె మొహం లోకి లోతుగా చూసాడు.
ఎందుకొచ్చావ్? అని అడిగినట్టనిపించిందామెకి. వెంటనే ప్రాణం చచ్చినట్టైంది.
భరించలేనంత అవమానంతో కళ్ళు దించేసుకుంది.
మొగుడనేవాడు చూపుల్తోనే ఇంత కఠినంగా అవమానించగలడన్న సంగతి ఆమెకిప్పుడే తెలుస్తోంది. ఆమె అమాయకత్వం కానీ, అసలు త్రేతా యుగం నాట్నించీ కూడా మొగుడి తీరు ఇంతే. ఆ రాముని అవమానపు చూపులు భరించలేక కాదూ?, ఆ సీతమ్మ తల్లి నిప్పుల్లో దూకింది?! హు.
అయినా, మొగుడు అన్ని చోట్లా మొగుడు కాదట. అనుభవజ్లులైన ఇల్లాళ్ళ మాటలు కాదని కొట్టేయలేం. ఇవన్నీ తనకూ తెలిసి రావాలంటే దీప్తికింకా టైం పడుతుంది. అవును, పాపం! ఎన్నాళ్ళైందనీ పెళ్ళై? సరిగ్గా యేడాది కూడా కాలేదు మరి.
ఇంతలోనే ఇద్దరి మధ్యా మాటా మాటా పెరిగింది. కారణం – ఆమె దృష్టిలో పెద్దదే. అందుకే ఇల్లొదిలి వెళ్ళిపోయింది. తన కోపం తీర్చి, కాళ్ళు పట్టుకుని బ్రతిమాల్తాడనుకుంది..కానీ ఆ పప్పులేం వుడకనట్టున్నాయి.
రోజులు, వారాలు, గడచి, నెలలు దాటినా మొగుడి జాడ లేదు. అయితే ఇక రాడా? వొదిలేసినట్టేనా? దిగాలు పడిపోయింది. కళ తప్పిన కూతురి మొహం చూసి తల్లే నెమ్మదిగా అన్నీ అడిగి తెలుసుకుంది. మంచి మాటలు చెప్పి, కూతుర్ని దింపి రమ్మని చెప్పింది వాళ్ళాయనకి.
అదీ జరిగిన సంగతి.
ఇలా వెనక్కి రావడం దీప్తికస్సలిష్టం లేదు.

ఇన్నాళ్ళ సాహచర్యం చేసిన కృతజ్ఞతైనా లేని ఈ మనిషి – రమ్మని పిలవకుండా, కనీసం ఫోనైనా చేయకుండా..తనంతట తానై రావడం మనసుకి నచ్చట్లేదు. పైగానామోషీ గా కూడా వుంది.
అయినా, ‘పోన్లే పాపం మొగుడుం గారే కదా’అని తిరిగొస్తే…ఇలానా ఆహ్వానించడం?
‘ఛ’ అనుకుంటూ తల దించేసుకుంది.
అతనికిదేం పట్టనట్టు లోపలకెళ్ళిపోయాడు. తను ఆఫీస్ కెళ్లే హడావుడి లో వున్నాడన్న సంగతి ఆ ఇద్దరికీ అర్ధమయ్యేలా ..గబ గబా షూస్ వేసుకుని, ఆ లేసులకి ఓ రెండు ముళ్లు బిగించాడు. మెడకేసుకున్న టై కు ఓ ముడేసి, క్షణంలో లాప్టాప్ ని బాగ్ లో తోసి, కారు కీస్ తీసుకుని పెద్ద పెద్ద అడుగులతో గడప దాటుకుంటూ… లిఫ్ట్ వైపు వేళ్ళిపోయాడు దురుసుగా.
అతని ప్రవర్తనకి ఆ ఇద్దరూ ఖిన్నులైపోయారు. చిన్నబోయారు. ఆమె – చలనం లేనిదైపోయింది. అయితే ముందుగా తేరుకున్న ఆ తండ్రి ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయలేదు. వెంటనే తనేం చేయాలో అర్ధమైన వాడిలా, చేతిలోని సూట్ కే ని లోపలకి తోసేసి, “అల్లుడు గారూ! వుండండి..నేనూ వస్తున్నా..అక్కడ దాకా డ్రాప్ చేద్దురుకానీ..” అంటూ అల్లుడికి వినిపించేలా ఓ కేకేసి, అంతే వేగంగా ఇటువైపు తిరిగి అన్నాడు. “ వస్తానురా తల్లీ. జాగ్రత్త! అవసరమైతే వెంటనే కాల్ చేయ్.” అంటూనే, ‘ నీకేం ఫర్వాలేదు నేనున్నా..’ అని భరోసోగా సైగ చేసి పరుగులాటి నడకతో వెళ్ళిపోయాడాయన.
నిజానికి కూతుర్ని కొత్తగా కాపురానికి పంపుతున్నప్పుడు కంటేనూ, ఆడపిల్లనిలా బలవంతంగా అత్తారింట్లో దింపి, వెళ్లిపోవాల్సి రావడమే ఏ తండ్రికైనా దుఃఖం తో గుండె చెరువౌతుంది. గుండె భారమౌతుంది. రంగనాధానికి కూడా అలానే వుంది. కానీ భార్య అలా అనుకోకూడదనీ, ఆ ఆలోచన్లతో మనసుని బాధపెట్టుకోకూడదనీ, సర్ది చెప్పింది. అందుకు తగిన కారణాన్ని కూడా ఎంతో సహనంగా వివరించడం తో ఆయన ఆగుతున్నాడు.
ఏ కారణాలెలా వున్నా, అవేవీ దీప్తి ని ఓదార్చలేకపోతున్నాయా క్షణం లో.
ఆమె ఒంటరిగా అక్కడే నిలబడి పోయింది, మాట రానిదానిలా, అసలేమీ అర్ధం కాని దానిలా అయిపోయింది పరిస్థితి.

10411164_610855999030323_8810754119747777955_n

Painting: Rajendra Jadeza

మన వివాహ వ్యవస్థే అంత. సమస్త అస్తవ్యస్తాల మయం. అశాంతి నిలయం. మనసులు కలవని స్త్రీ పురుషులు కేవలం పెళ్ళి కారణంగా కలుసుండటం ఎంత దారుణం?- ఎవరికోసం?ఎందుకోసం? దేని కోసం? ఏ గమ్యం కోసం? ఈ కలసి బ్రతకడం అనిపిస్తుంది. అన్నీ ప్రశ్నలే. తెలీని పజిల్సే.
ఎందుకెళ్ళాలి తను లోపలకి? అసలెందుకు రావాలి తను వెనక్కి? ‘అవును. నిన్నెవరు రమ్మనేడ్చారిక్కడా? ’ అని తనని మొహమ్మీదే అడిగినట్టు లేదూ?, అతనూను, అతగాని ప్రవర్తనాను..?
“అలా అనుకోకు. నీ ఇంట్లో నీకవమానమేవిటీ, వింత కాకుంటే? ఊ?.. చూడు దీపూ! అదే నీ ఇల్లు. నీ ఇంటికి నువ్వెళ్తున్నావ్. ఎవరో వచ్చి నిన్ను బొట్టు పెట్టి పిలవాలని ఎందుకనుకుంటావ్? వెళ్ళు. నా మాటవిని వెళ్ళు. ” తల్లి మాటలు గుర్తుకొచ్చాయి.
“అవును. ఇది తన ఇల్లు. చట్ట ప్రకారం అతను తన భర్త. అతని మీదే కాదు, ఈ ఇంటిపై కూడా తనకు సర్వ హక్కులూ, అధికారాలూ వుంటాయి. వుండి తీర్తాయి. అసలా మాటకొస్తే, తనెప్పుడైనా రావొచ్చు, ఎప్పుడైనా పోవచ్చు. కాదని ఎవరంటారో తనూ చూస్తుంది. ఏమనుకుంటున్నాడు తనని? హు.!” ఉక్రోషం తో ముక్కుపుటాలదిరాయి.
“అయినా, నువ్విప్పుడింతగా అప్సెట్ అయ్యేందుకేముంది చెప్పు! నీ మొగుడు నిన్ను పన్నెత్తి పలకరించలేదన్న మాటే కానీ, నీ మొహం మీద తలుపులు మూసి పోలేదు గా పొమ్మని. అంటె పరోక్షంగా, లోపలకి రమ్మనే గా దానర్ధం? పద. లోపలకి పద. గడపలోకి ముందు గా కుడికాలు పెట్టు. ..” అంటూ ఆమెకి ధైర్యాన్నిస్తూ, ముందుకు తోసింది అంతరాత్మ.
గట్టిగా నిట్టూర్చి, లోపలకడుగేసింది దీప్తి. కొత్తపెళ్లికూతురు గృహప్రవేశం చేసినట్టు. ఒక్కసారి నలువైపులా కలయచూసింది.
ముందు హాలంతా గజిబిజిగా వుంది. న్యూస్ పేపర్లు గుట్టలు గుట్టలు గా పడున్నాయి. టీవీ స్క్రీన్ మీద దుమ్ము పేరుకు పోయుంది. షూ రాక్ లో చెప్పులు, షూస్ ఎడా పెడా బోర్లా పడున్నాయ్. టేబుల్ కాలెండర్ ల్ పేజ్ మార్చనే లేదు.
ఐ తను వెళ్ళిన నెలనే చూపిస్తోంది. అంటే – మారలేదు. శ్రీ కూడా మారలేదు. తన గురించి ఆలోచిస్తూ..అలానే విరక్తిగా వుండిపోయాడా!?
ఆ ఒక్క చిన్ని తలపే..మనసులోని భారాన్నంతా దించేసింది.
స్త్రీ హృదయం-
పాషాణం కాదు. నవనీతం మరి.
మనల్ని ప్రేమించే వారి ప్రేమ, ఎంత శాతమనే విషయం మనం దగ్గరున్నప్పుడు కంటేను దూరమైనప్పుడే తెలుస్తుంది. నా అనుకున్న వారి అసలైన ప్రేమ మన ఆబ్సెన్స్ లో నే తెలియాలి.
శ్రీని చూస్తూనే అనుకుంది. చిక్కిపోయాడని. ఇప్పుడీ ఇల్లు చూస్తుంటే మరీ జాలేసిపోతోందామెకి.
‘నీ కోసమే మేమంతా ఎదురుచూస్తున్నాం..ఎన్నళ్ళైపోయింది నువ్వు మా అతీ గతీ పట్టించుకోక? ఏమైపోయావు మిత్రమా? అని తనని దీనంగా అడుగుతున్నట్టు తోచింది.
ఆ ఇల్లాలి గుండె కరిగిపోయింది. అవును. ఏ ఇల్లాలైనా మొగుడి తర్వాత అమితంగా ప్రేమించేది తన ఇంటినే ! నా ఇల్లు, నా సంసారం అనే ప్రేమతో కూడిన కమిట్మెంటే కనక లేకుంటె ఏ ఇల్లాలికైనా, ఈ ఇళ్ళన్నీ ఏమైపోయెండేవి? ఎంత చెత్త కుండీలైపోయేవీ కావూ?
హాల్ దాటుకుని ఇటుగా, వంటింట్లోకొచ్చి చూసింది. కిచెన్ ప్లాట్ ఫాం అంతా యెడా పెడా డబ్బాలతో, స్టీల్ గ్లాసులతో, విరిగిపోయిన గాజు కప్పుల తో నిండిపోయుంది. సింక్ నిండా చెత్తా చెదారము, అన్వాష్డ్ డిషెస్ తో నానా బీభత్సంగా కనిపించింది.
పనమ్మాయి సంగీత రావడం లేదా పనికి? ఫోన్ చేయాలి.
శ్రీకాంత్ కి వంటిల్లు ఎలా వుండాలంటె, స్పిక్ అండ్ స్పాన్ లా వుండాలి. ఏ ఒక్క వస్తువు బయటకి కనిపించకూడదంటాడు. మరి ఇప్పుడీ వాతావరణాన్నెలా ఎలా భరిస్తున్నాడూ? – ‘నువ్వు లేవన్న విషాదంలే..” మనసు చెప్పింది. ఎంత ఆనందమేసిందో అంతర్వాణి మాటలకు.
వేళకేం తింటున్నాడో ఏవిటో అని గ్రోసరీ షెల్ఫ్ తెరిచి, ఆరాగా చూసింది. వస్తువులన్నీ అలానే వున్నాయి. డస్ట్ బిన్ నిండా బయట్నించి తెచ్చుకున్న ఫుడ్ పాక్స్ కనిపించాయి. అంటే, వంట చేసుకోడం లేదన్నమాట. ఈ మూణ్నెల్లన్నించీ హోటళ్ల కూడే తింటున్నాడా? అయ్యో! శ్రీ కాంత్ కి అస్సలు బైట తిండంటేనే – ఎలర్జీ కదూ?
‘పాపం! మరేం చేస్తాడే?, వండి వార్చి పెట్టే ఇల్లాలు హఠాత్తుగా ఇల్లొదిలి పోతే?- నీ చేతి వంటంటే ఎంత ఇష్టమూ? ఎన్నిసార్లు చెప్పాడు నీకాసంగతి? మర్చిపోయావా? “
“ఊహు. మర్చిపోలేదు. “
“మరెందుకెళ్లినట్టు..ఆ పిచ్చాణ్ణి వొదిలి?”
“ఎందుకంటె, ఎం..దుకం..టే.. ఇప్పుడు కాదులే తర్వాత చెబుతాలే..నా మనసా, చేయక రభస, అవతలికి ఫో..” నవ్వుకుంటూ తనలో తను, పడగ్గదిలో కి తొంగి చూసింది.
నల్ల టేకు, నగిషీ చెక్కిన డబల్ కాట్ మంచం. రాత్రి రంగుల స్వప్నం.
ఇదేమిటీ, ఇలా? మంచానికి అడ్డంగా ఆ తలగడలు?
అది కాదు, మంచం మీద పరచివుండాల్సిన బెడ్షీట్ జారిపోయి, బ్లాంకెట్ కార్పెట్మీద కూలిపోయి పడుంది. క్లాజెట్ డోర్స్ సగానికి జరిపి, వదిలేసున్నాయి. లోపల హాంగర్కి ఒక్క చొక్కా వ్రేలాడి లేదు. బట్టలన్నీ ఒకదాని పైనొకటి ఇష్టమొచ్చినట్టు జారిపడి కుప్పపోసుకునున్నాయి. చూడం గానే, కంపరం పుట్టుకొచ్చింది ఆమెకి.
పాపం, శ్రీకాంత్! తను లేనని, ఇక రానని నిరాశతో, బెంగతో…హూ!
ఇలా నిట్టూరుస్తారు కానీ, చాలామంది ఇల్లాళ్ళకు అదే ఓ గొప్ప బలాన్నిచ్చే అంశం. ‘మా ఆయన నేను లేకుండా బ్రతకలేరు. కనీసం కాఫీ అయినా పెట్టుకుని తాగలేరు..అంటూ గర్వంగా చెప్పుకోడం ఇష్టం. అదొక హోదా. పెళ్లానికి మొగుడు చేయించకుండానే అమిరే ధగధగల నగ.
ప్రస్తుతం ఆ సంబరం లోనే వుంది మన దీపూ కూడా.
హూ! పిచ్చివాడు!చెలి లేని చిరుగాలులెందుకు? …నా దేవి లేని ఈ గుడి ఎందుకు? అని అనుకున్నాడేమో! మరి ఆ సంగతి తనతో చెప్పలేదెందుకనీ?
“ పెళ్ళాలయ్యాక – ప్రేమికులు ప్రేమించుకోడం మానేస్తారట. నీకా భయం వుండదు. ఎందుకంటే నీది ప్రేమ వివాహం కాదు కాబట్టి. నువ్వు ఇష్టపడి శ్రీకాంత్ ని పెళ్ళి చేసుకుంటోంది.. అతన్ని జీవితాంతం ప్రేమిచడానికే. తెలుసా?”
తల్లి – తన చెవిలో రహస్యం గా చెప్పిన మాటలు తలపుకొచ్చాయి.
ఎంత బాగా చెప్పింది అమ్మ! తను వినదు కానీ, అమ్మ చెప్పే ప్రతి మాటా ఎంతో విలువైనది! నిజానికి అమ్మ చెబితేనే గా, తను వెనక్కి వచ్చేసింది ఇలా!
“అలా అమ్మ మీద కంతా నెట్టేయకు. నీకు మాత్రం మనసులో రావాలని లేదా, ఏమిట్లే.” మనసు టీజ్ చేసింది. .
అప్పటి దాకా మొగుడి మీదున్న అనుకొండ లాటి కోపం పోయి, ఆ స్థానే, అనురాగ గంగ వెల్లువై పుట్టుకొచ్చింది.
తల్లి మాటలు గుర్తుకొచ్చాయి గుప్ఫున. “ ప్రతి భర్తకీ తన భార్య అవసరం ఎంతో వుంటుందన్న సంగతి తెలుసు. కానీ, ఎటొచ్చీ ఇంత అని చెప్పడం మాత్రమే తెలీదు. అంత మాత్రాన, అతను నిన్ను ప్రేమించడం లేదని అపోహపడటం సమంజసం కాదు సుమా. భర్త కోపంలో వున్నప్పుడే భార్య అతన్ని అర్ధం చేసుకోవాలి. అప్పుడే అర్ధాంగి అనే పదానికి అసలైన అర్ధం లా నిలుస్తుంది ఇల్లాలు.”
“నిజం చెప్పావమ్మా! ..ఇదిగో ఈ ఇంటినిలా సంత లా చూస్తుంటే, ఈ ఇంటికి నా అవసరం ఎంతుందో, ఈ మనిషికి నా ఆవశ్యకత ఏ రేంజ్ లో వుందో ఇట్టే తెల్సిపోతోంది. థాంక్స్ అమ్మా, థాంక్యు!” -మనసులోనే తల్లికి థాంక్స్ చెప్పుకుంది సంతోషంగా.
భర్త మీద పట్టలేనంత కోపమొచ్చినప్పుడు, మనస్పర్ధలు మితి మీరినప్పుడు . ఆ ఆగ్రహంలో ఏ స్త్రీ అయినా డిసైడైపోతుంది. ఇక ఇతనితో కలసి కాపురంచేయడం కంటే, విడిపోయి ఒంటరిగా బ్రతకడమొకటే సుఖమని. కానీ, అదే భర్త – తను దూరమైతే బ్రతకలేడన్న సంగతి తెలుసుకున్నప్పుడు మాత్రం – తన తప్పుడు ఆలోచనకి పశ్చాత్తపం చెందుతుంది. అందుకు నిదర్శనమే ఈమె!- దీప్తి.
సాయంత్రం ఆయనగారు ఆఫీస్ నించి ఇంటికొచ్చేలోపు ఈ కూలబడ్డ సామ్రాజ్యాన్ని పునః నిర్మించి, యువరాజా వారి పాలెస్ లా మార్చేయాలని గట్ఠిగా నిర్ణయించుకుంది.
ఉత్త ఇల్లేనా? లేక అతనికమిత ప్రియమైన బెడ్రూం కూడా అలంకరిస్తావా?”
-‘ ఫోవోయ్, నా ఇల్లు, నా మొగుడు – నా ఇష్టం. నేనేమైనా చేసుకుంటా. మధ్యన నీకుందుకు చెప్పాలి? బిడియ పడిపోయింది.
‘గుడ్ దీపూ. గుడ్. అదీ స్పిరిట్ అంటే. నువ్వెదుగుతున్నావ్’ అమ్మ నవ్వుతూ వెన్ను తట్టినట్టైంది.
ఇంటిని ఒక పట్టు పట్టాలంటే..ముందు ఓ కప్ – ఫిల్టర్ కాఫీ కావాలి తనకు. అర్జెంట్ గా!
నడుం చుట్టూ, చీర కొంగు బిగించి కుచ్చెళ్ళు పైకి దోపి, వంటింట్లో కెళ్ళి, స్టవ్ వెలిగించింది.
డికాషన్ కని, నీళ్ల గిన్నె వుంచుతూ..అల్లరిగా ఓ అడ్వర్టైజ్మెంట్ ని ఇమిటేట్ చేసింది. “ టింగ్ టింగ్..మొగుడితో పోట్లాడి పుట్టింటికెళ్ళి, తిరిగొచ్చారా?
ఇల్లంతా యుధ్ధం తర్వాతి వాతావరణం కనిపిస్తోందా? అయితే వినండి. మొండి మొగుణ్నీ, ఇంటి చెత్తనీ ఒక కొలిక్కి తేవాలంటే మీకు వెంఠనే కావాలి ఈ దీప్తి చేతి కాఫీ ! ..చిక్కనైన రుచి గలది, చక్కని చురుకుదనాన్ని కలిగించేది..దీప్తి చేతి కాఫీనే తాగండి. తాగించండి. క్షణాల్లో కోపం మాయం. ఇంటి పని శుభ్రం. ఇంక ఆలస్యమెందుకు. పదండి అసలైన సిసలైన కాఫీని ఆస్వాదిద్దాం. టింగ్ టింగ్..’ తన ప్రకటనలకి తనే లిరిక్ కట్టి పాడుకుంటూ, ..ఘుమఘుమలాడే కాఫీ తయారుచేసుకుంది. ఆ కేరళా కాఫీ ఫ్లేవర్ ఘుమాయింపుల ఆఘ్రాణింపులో.. ఆహాహా..! ఎక్కడ్లేని ఉత్సాహం పొంగుకొచ్చేసింది. ఆ వెనకే, ఉల్లాసంగా..పనిలోకి దూకింది.
రేడియో ఎఫెం హిందీ సాంగ్స్ వింటూ, హమ్మింగ్స్ తో..హాహా రాగాలతో.. హోరుగా, హుషారుగా డస్టింగ్, వాషింగ్, క్లీనింగ్ పనుల్లో మునిగి తేలింది. అప్పుడప్పుడు మెడొనాని గుర్తుచేసుకుంటో, బూజు కర్రలు పట్టుకుని షకీర లా నడుం ని రింగులు తిప్పుతూ.. ఈల వేసుకుంటూ, గోల చేసుకుంటూ… చకచకా ఇంటి పనంతా ఫినిష్ చేసేసింది.
అమ్మ ఎప్పుడూ చెబుతుంటుంది. “దీపూ! కాలాన్ని సంతోషంతో నింపుకుంటూ, క్షణక్షణాన్ని అనుభూతించడానికే మనకీ జన్మ సరిపోదు. అలాటిది సమస్యలను కొనితెచ్చుకోడానికి నీకు టైమెక్కడుంటుంది చెప్పు? ఊ?”
‘ అబ్బ. కరెక్ట్ గా చెప్పావు మమ్మీ..అద్భుతం నీ మాటలు.” మనసులోనే తల్లిని ప్రశంసించింది.
మనం కష్టంలో వున్నప్పుడు, ఊరడించే వారి మాటలే మనకెక్కువగా గుర్తుకొస్తుంటాయి. అవి జీవితానుభవాల తో కూడి వుంటం వల్ల వెన్నెంటే వస్తుంటాయి. అందుకే దీప్తికి తల్లి మాటలు అడుగడుగునా, పదే పదే తలపుకొస్తున్నాయి.
*******
పగలైపోయింది. సాయంత్రం చీకట్లు చుట్టుకునే దాకా ఆమెకి టైమే తెలీలేదు.
బూజు రాలగొట్టడంతో – గోడలు, దుమ్ము వదిలించడంతో గ్లాస్ అద్దాలు, తళతళమంటున్నాయి. పాలరాతి ఫ్లోరింగ్ – అద్దం లా మెరిసిపోతోంది.
కిటికీలకి, తలుపులకీ కొత్త కెర్టెన్స్ మార్చింది. సోఫా దిళ్ళకి మిర్రర్ వర్క్చేసిన కవర్లు తొడిగింది.
బాల్కనీ లో పూల కుండీలన్నిటికీ నీళ్ళు పెట్టి, వాట్నొక క్రమంలో అమర్చింది.
చివరగా, ఫ్లవర్ వాజ్ లో తాజా పూలు సర్ది, స్ప్రే జల్లింది. గుప్పుమనే గుభాళింపులతో నిండిపోయింది ఆ ప్రదేశమంతా.
తన టాలెంటంతా ఉపయోగించి మరీ ప్రత్యేక శ్రధ్ధతో ఇంటిని అలంకరించింది. ఆమె – ఇంటీరియర్ డెకరేషన్ లో స్పెషల్ డిప్లొమా చేసింది. కొన్నాళ్ళయ్యాక, కన్సల్టెన్సీ స్టార్ట్ చేయాలనే ఆలోచన కూడా వుంది.
శ్రీకాంత్ ఇంటినిలా చూస్తూ చూస్తూనే..అతనికి తన మీదున్న కోపమంతా పోవాలి. అలకలన్నీఅటకెక్కి, తామిద్దరూ కలిసి మునపటిలా..హాయిగా నవ్వుకోవాలి.
అమ్మేం చెప్పింది?
“మాటల్లో సైతం గతంలోకెళ్లకుండా జాగ్రత్తపడాలి. తెలిసిందా? ఎందుకంటే, అన్ని యుధ్ద్ధాలకి మూలకారణాలు -మాటలే! భార్యాభర్తలు మాట్లాడుకోడం వల్ల – కాపురంలో శాంతి కలగాలి కానీ, చిచ్చు రగలకూడదు. గుర్తుపెట్టుకో. సరేనా దీపూ?”
“అలాగే అమ్మా! ప్రామిస్. అసలేమీ అనను. అతన్ని మాటల్తో సాధించను సరా?”
అవును. ఇకనించి అన్నీ అమ్మ చెప్పినట్టే వింటుంది తను.
అతనికిష్టమైన వంటకాలు చేసి, డైనింగ్ టేబుల్ మీద నీట్ గా సర్దేసి..ఒక్కసారి ఇంటినంతా పరికించి చూసింది.
ఇంద్ర భవనం లా కనిపించింది. ఇంటిని ప్రేమించడమంటే…దేవుణ్ని ప్రేమించడమే. అందుకే ఇల్లాలు దేవత అని అంటారు కామోసు!
******
మూణ్నెల్ల తర్వాత భర్త తో గడపబోతున్న మధుర క్షణాలు మదినూరిస్తుంటే..కళ్ల ముందు ఇంద్ర ధనస్సొచ్చి వాలుతుతున్నంత సంబరం గా వుందామెకి. వుండదు మరి!
భార్యా భర్తల మధ్య నిజమైన రొమాంటిక్ క్షణాలెప్పుడుంటాయంటే, ఎప్పుడూ అన్యోన్యంగా వుంటం వల్ల కాదు.
ఇద్దరి మధ్య ఒక ఘోర యుద్ధం జరిగాక, కుదిరిన సమన్వయం తర్వాతనే.
అతను మాధవుడో కాదో కానీ, ఈమె మాత్రం అచ్చు రాధికలా ..ఆ పాత్రలో లీనమైపోతోంది.
మొన్న కాదనుకున్న కాపురం, వొద్దేవొద్దనుకున్నభర్త ..నేడు కావాలనుకుంటూ విరహించడం ఎంత వింత కదూ? కానదే చిత్రం. స్త్రీ మనస్తత్వం.
ఎందుకు ప్రేమిస్తుందో
ఎందుకు కలహిస్తుందో..
ఎందుకు నిశ్శబ్దమౌతుందో
మరెందుకు నీరౌతుందో
కన్నీరౌతుందో
నీ – రవమౌతుందో!
ఎలా తెలుస్తుంది? అవును. ఎలా తెలుస్తుంది. ఆమెని అర్ధం చేసుకోగల హృదయం అతనికి లేకపోతేను?
పొద్దుట్నించీ, నడుం విరిగే లా పనిచేసీ చేసీ ..అలసిన శరీరానికిప్పుడు స్నానం ఒకటే గొప్ప రిలాక్సేషన్!
వొళ్ళు విరుచుకుంటూ, బాత్ రూం వైపు నడిచింది. షవర్ బాత్ కోసం.
ఈ షవర్ స్నానాన్ని ఎవరుకనుక్కున్నాడో కానీ, ఒకసారి దీని ప్రేమలో పడితే టైమే తెలీనీదు. జలపాతాలని తలపిస్తూ, కాదు కాదు, చిరు వర్షపు జల్లుల తడుపుతూ… పూల నక్షత్రాలు విసురుతూ, వొళ్లంతా ఎక్కడా సూది మొనంత చోటైనా వదలక, జడిజల్లుల, తడిపెదవుల చుంబనాలతో ముంచేస్తుంది. ..వహ్వా..ఎంత అద్భుతమైన భావాలని ఇచ్చిపోతుంది షవర్ బాత్!
బాత్ టబ్ ఒక సరస్సు అయింది. అందులో ఆమె ఒక జలకన్య లా మారింది.
బృందావనమెందుకో, యమునాతటమెందుకో..నా ముందర నువ్వుంటే నందనవనమెందుకో?..
మునకలన్నీ మంచి గంధాల లేపనాలు గా ..నీ మధుర జ్ఞాపకాలేవో..మరి మరి మరులు గొలుపుతూ..
మధురోహల తేలుతూ..అలా అలా..అలుపు తీరేదాకా స్నానిస్తూనే వుంది.
తలుపు చప్పుడైతే…గబగబా టవల్ చుట్టుకునొచ్చి చూసింది. ఎవరూ లేరు.
నిరాశ అనిపించినా, తన సింగారం పూర్తి కాకుండా అతను రాకపోడమే మంచిదని సంతోషించింది.
****
ఏడు దాటిపోయింది.
అతను రాలేదు.
ప్లాస్క్ లో సిధ్ధం గా వుంచిన టీ ని తనే రెండు సార్లుగా సేవించింది.
అతని కిష్టమని కట్టుకున్న పాల నురుగు షిఫాన్ జరీ చీర వైపు, వేసుకున్న చేతి గాజుల వైపు మార్చి మార్చి చూసుకుంది.
జడలో జాజి పూల దండ సాయంత్రం కన్నా, ఇప్పుడు మరికాస్త రెక్కలిప్పుకుని, యవ్వనాన్నొలకబోస్తోంది.
ఎనిమిది దాటింది.
తొమ్మిదైంది.
పదిలోకి మారింది.
నిట్టూర్చింది, గోడ గడియారం వైపు చూస్తూ.
కాసేపు టీవీ సీరియల్ చూసింది. బోర్. మరి కాసేపు కర్ణాటక సంగీతం వినబోయింది. కర్ణ కఠోరంగా వినిపించింది. ఎం టీవి మ్యూజిక్ – చెవిలో హోరుగా వుంది. న్యూస్ చూడబోయింది. తలనొప్పొచ్చేసింది. టీవీ కట్టేసి, అలా డైనింగ్ టేబుల్ ముందు కుర్చీలో కూలబడి పోయింది.
ఇల్లంతా నిశ్శబ్దం..నిశ్శ..బ్దం. గుబులుగుబులు గా చీకటి . తెరలుతెరలుగా గుండె లోతుల్లోంచి ఏదో బాధ పొగలు చిమ్ముకుంటోంది. బయట బాల్కనీ లోంచి రాత్రిచీకటంతా ఇంట్లోకి ప్రవహిస్తూ..కాదు తన వొంట్లోకి ఇంకిపోతూ..
ఒక్కసారిగా ఒంటరి తనం – నల్ల తాచు పాములా.. ఆమెని నిలువునా చుట్టేసుకోడంతో ఎక్క డ్లేని దిగులొచ్చింది. దుఖాన్నాపుకోలేనిదైంది. గభాల్న రెండు చేతుల్లో ముఖం దాచుకుంది..
ఏమిటీ? అసలు తను ఏం చేస్తున్న పనేమిటీ? తన పొరబాట్లను లెక్కోసుకుంటోంది. ఇలా –
సిగ్గు లేకుండా, అతను రమ్మనకుండానే రావడం తను చేసిన మొదటి తప్పు. వచ్చాక, కనీసం అతను పలకరించనైనా పలకరించకుండా వెళ్లిపోయినా, ఈ ఇంట్లోకి అడుగు పెట్టడం రెండో తప్పు.
పొద్దుట్నించీ కనీసం ఒక్క ఫోన్ కాలైనా చేయని ఈ కసాయి కోసం..తనిలా ఎదురుచూడటం..నిజమైన తప్పు.
అసలే కాలం లో వుంది తను? ..అమ్మ లా, అమ్ముమ్మలా ఇలా మొగుడి కరుణా కటాక్షాలకోసం, కంటి చూపుల కోసం పాకులాడటమేమిటీ, పడిగాపులు కాయడమేంటీ? అదీ – తనేమిటీ, తన వ్యక్తిత్వమేవిటీ? తన మనస్తత్వానికీ విరుధ్ధం గా తను చేస్తోందేమిటీ?
అదలా వుంచు. ఇదేమిటీ, ఇలా, శొభనపు పెళ్ళికూతురిలా తయారై కూర్చోవడమేమిటీ, రాని వాని కోసం ఈ నిరీక్షణలేమిటీ? నిట్టూర్పుల సెగలేమిటీ? పరమ అస్సహ్యంగా! …ఇదంతా దేనికోసమూ..అని ఆలోచిస్తే ఆమెకి తన మీద తనకే పట్టలేనంతా ఆగ్రహమేసింది.
చివ్వున లేచి, జడలో జాజిపూల చెండు తీసి, మూలకిసిరేసింది. తెల్లచీరలోంచి వెంటనే నైటీ లోకి మారింది. అతనితో కలసి గుడికెళ్దామనుకుంది. కానీ, ఇప్పుడు ఆ ఆలోచన చేసినందుకు తనని తాను నిందించుకుంటోంది.
విస్సురుగా గదిలొకెళ్లి, అంతకంటే విసురుగా మంచం మీద బోర్లా పడి, దిండులో ముఖం దాచుకుంది.
పొద్దుట్నించి తిండీ తిప్పలు లేకున్నా దగ్గరకి రాని నీరసం…ఇప్పుడు అతని నిరాదరణకి నిస్సత్తువెత్తుకొచ్చింది.
జీవిత భాగస్వామ్యుల మధ్య అవగాహన కంటే ముందు మర్యాద వుండాలి. దాన్నిచ్చిపుచ్చుకునే విధానం వుండాలి. ఆత్మ గౌరవానికీ, ఆత్మాభిమానాలకి భంగం కలగకుండా నడచుకునే ఓ గట్టి నిర్దేశికత కలిగి వుండాలి. ఇవేవీ..లేనప్పుడు, ఇక శూన్యమనుకున్నప్పుడు ఏం చేయాలి. ఇప్పుడు తను ఎదుర్కుంటున్న పరిస్థితే గనక ఏ ఆడపిల్లకైనా ఎదురైతే ఏం చేయాలి?
శుభ్రంగా అతగాణ్ణి నాలుగు కడిగి, నీ ఏడ్పు నువ్వేడు. నాకు నీలాటి పనికిమాలిన వాడితో కాపురం చేయాల్సిన అగత్యం కానీ, అవసరం కానీ లేదని చెప్పి, వెళ్ళిపోవాలి. ఇతనొక శాడిస్ట్ అని కోర్ట్ లో నిలబెట్టి, విడాకులు ఇప్పించుకోవాలి. ‘పో రా! ఫో.’ అంటూ చెంపలు వాయించి పంపాలి.
కరెక్ట్. యు ఆర్ రైట్ దీపూ, రైట్.
అలా చేయడమే న్యాయం.
కోర్ట్ ల నిండా విడాకుల కేసులే అంటూ వాపోతున్నారు కానీ, ఇలా కానరాకుండా భార్యల్ని కాల్చుకుతినే మగాళ్ళ మోసకారితనాలు మాత్రం బయటకు తెలీవు. తనకి మాత్రం తెలిసిందా, తననింత మానసికంగా హింసించే మొగుడని వీడు? తన దాకా వస్తే కానీ తెలీదంటారు అందుకే.
‘అబ్బా తల పేలిపోతోంది. నడుం నొప్పి నమిలేస్తోంది. కళ్ళల్లోంచి ఈ జలపాతాలేమిటి? ..తను బేలయిపోతోందేవిటీ, ఇలా?- అందరాడపిల్లల్లా..కాదు. తను కాదు. తను ధైర్యవంతురాలు. సాహసవంతురాలు. తను ఓడిపోదు. ఎందులోనూ ఓడిపోదు.
ఎంత టైమై వుంటుంది. పదీ? పదకొండు? పన్నెండు? ..ఏమో అర్ధ రాత్రి దాటిపోయిందేమో.
అదిగో బయట్నించి తలుపు లాక్ తీస్తున్న చప్పుడు.
చెవులు రిక్కించి వింది.
శ్రీకాంత్ లోపలకొచ్చాడు.
మళ్లీ తలుపు మూసిన చప్పుడైంది. ఆ తర్వాత ..ఐదు నిముషాలు ఎలాటి అలికిడి లేదు.
ఆమె వింటోంది. బాత్ రూంలొంచి..నీళ్ళ శబ్దాన్ని. చాలా సేపు తర్వాత గదిలోకొచ్చాడు. లైటేసాడు. ఆమె కదలకుండా కళ్ళుమూసుకుని పడుకుంది.
ఏం చేస్తాడా అని ఒళ్ళంతా కళ్ళు చేసుకుని. నైట్ డ్రెస్ తీసుకున్నాడు. మరో నిమిషం తర్వాత మంచం దగ్గర ఆగినట్టు తెలుస్తోంది. ఆమె గుండె వేగం గా కొట్టుకుంది. కాని, అంతలోనే అంత వేగం గానూ, మంచం మీంచి పిల్లో లాక్కుని, విస్సురుగా వెళ్లిపోయాడు.
కళ్లు మూసుకున్నా ఇదంతా కళ్ళక్కట్టినట్టు కనిపిస్తోనే వుందామెకి.
ఎవరన్నారు, హృదయానికి కళ్ళుండవని. నిజమే, ప్రేమ గుడ్డిదైతే కదా!
షేమ్ షేమ్ దీపూ.. షేమ్ షేమ్ ! నీ కలలిక కట్టిపెట్టు. నీ మొగుడు నిన్ను తాకడం మాటలా వుంచు, కనీసం కన్నెత్తి చూడటానికి కూడా ఇష్ట పడటం లేదని గ్రహించు. లేకుంటె, నీకే ప్రమాదం.
ఆమెకొక్కసారిగా ఏడ్పొచ్చేసింది..పొంగుకుంటూ. ఎంత వద్దనుకున్నా, ఆగకుండా, ముంపెత్తిన గోదారిలా.
ఇంతగా శిక్షించడానికి, అసలు తను చేసిన తప్పేమిటనీ? ..అతనే కదా చెప్పాడు..తన క్లాస్ మేటు నీతా తనని ప్రేమించిందని..వెంటపడేదనీ..పెళ్ళి చేసుకోమని ప్రాధేయపడిందనీ..అదడిగిందనీ..ఇలా చేయి పట్టుకుందనీ.. తను ప్రేమించకుంటే బ్రతకనందని కూడా చెప్పలేదూ?
మరి ఇప్పుడేమవసరమొచ్చిందనీ? ఆవిడగార్ని ఫేస్ బుక్ ఫ్రెండ్ చేసుకోవాలి? అదే అడిగింది.
జవాబు చెప్పలేదు. పైగా మేధావిలా ఓ వెధవ నవ్వొకటి నవ్వూరుకున్నాడు.
తను అనుమానిస్తున్నట్టె అయింది. ఇద్దరూ కలసి రెస్టారెంట్ కీ వెళ్ళారు. తనకి మాట మాత్రం గా నైనా చెప్పలేదు. ఆ రోజున, అతను బాత్ రూం లో దూరినప్పుడు సెల్ ఫోన్ లో చూసింది. మెసేజ్ లో ఆమె ఎంజాయి చేసినట్టు, అందుకు థాంక్స్ అని చెప్పడాన్ని కళ్ళారా చదివి తెలుసుకుందా నిజాన్ని.
తెలిసాక, ఏ పెళ్ళామైనా మరి అడగదా? అడిగింది. దులిపింది. తనకు జవాబు కావాలంది.
ఏమన్నాడు? చెప్పాల్సిన అవసరం లేదన్నాడు. ఐతే నాకూ నీతో వుండాల్సిన అవసరం లేదంది.
‘నీ ఇష్టం’ అంటూ చుర చురా చూసుకుంటూ వెళ్ళి పోయాడు. తనూ రోషం కొద్దీ అమ్మగారింటికెళ్ళింది. అతనితో చెప్పాల్సిన అవసరం కూడా కనిపించలేదామెకా క్షణంలో.
జరిగిందాంట్లో తన తప్పేముందనీ? తప్పో ఒప్పో, తెలుసుకుని తనంతట తానే గా తిరిగొచ్చింది?
ఇక మాటలనవసరం. ఇతనితో కాపురం – తనకిక కుదిరే వ్యవహారం కాదు. ముమ్మాటికీ కాదు. రేపొద్దునే తనెళ్ళిపోవాలి ఇక్కణ్నించి. ఈ మనిషి నించి శాస్వతంగా దూరంగా వెళ్ళిపోవాలి. ఈ పెళ్ళీ, ఈ మొగుడు అంతా ఓ పీడ కలగా మర్చిపోవాలి.
ఏం? మొగుడు లేకుండా బ్రతికే వాళ్ళు లేరా? మొగుణ్నొదిలేసిన ఆడవాళ్ళు జీవించడం లేదా? చస్తున్నారా? పక్కింటి శకుంతల సంగతేమైందీ? మొగుడొదిలేస్తే, పుట్టింటికొచ్చి మిషన్ కుట్టుకుని బ్రతకడం లా? విరజ కూడా అంతే. మొగుడు ఆమెని మంచం మీంచి తోసేసేవాడట. వొద్దని. ఇలాగే కాపురానికి తోలే వాళ్ళు ఆమెని మళ్ళా మళ్ళా. కానేం చేస్తుంది?వాడు వొద్దు బాబోయి అంటే మరి? విడాకులు తీసుకుంది. మళ్ళీ పెళ్ళి చేసుకుంది. ఇప్పుడు ఇద్దరు పిల్లలు కూడా. మరి తను? చస్తే మళ్ళీ పెళ్ళి చేసుకోదు. వీడి తో వచ్చిన బుధ్ధి చాలు. తనింకా చదువుకుంటుంది. కెరీర్ మీద చాన్సెంట్రేట్ చేస్తుంది. అమెరికాలో అక్కా బావల సాయం తో ఓ ఉద్యోగం సంపాదించుకుని, అక్కడే సెటిలైపోతుంది. అంతే. అంతే. అదే తన నిర్ణయం. చివరినిర్ణయం. తిరుగులేని నిర్ణయం.
ఆలోచిస్తూ ఆలోచిస్తూ..నిద్రలోకెళ్ళిపోయిందామె.
***
శ్రీకాంత్ హాల్లోని సోఫాలో ఒరిగి పేపర్ అందుకున్నాడు.
ఒక్క అక్షరమూ కనిపించడం లేదు. అసలు చూపక్కడ నిలిస్తే కదా! మనిషి ఉడికిపోతున్నాడు.
ఎంత మాటంది తనని వెళ్తూ వెళ్తూ. నేను నీతా తో రోజూ..తిరిగుతున్నానా? పైగా మా ఇద్దరి మధ్య ..అది వుందని అంటుందా? వినంగానే ఎంత విలవిలమంది మనసు?
అసలీ ఆడవాళ్ళు ఏమనుకుంటారు? శీలం, దాని పవిత్రత పేటెంట్ హక్కులన్ని వాళ్లకేనా సొంతం? మగాడికీ కారెక్టర్ వుంటుందనీ, దాన్ని శంకిస్తే వాడికీ రగుల్తుందని తెలీదా? అదే మాట తను అంటే ఆమెని? వూరుకుంటుందా? అయినా అలాటి అనైతిక సంబంధాల్లోకి ఎలా ఈడుస్తుంది తనని? అందులో తనని ..తనని అంత మాటనా అనడమా? మొగుడన్న గౌరవం వుండొద్దూ? నోటికెంతొస్తే అంత అ నడమే? ఎంత పెళ్ళామైతె మాత్రం, కాస్త హద్దుండొద్దాంటా? ఇదేమైనా సినిమానా? అలా పెట్టెలు సర్దుకుని ఇంట్లోంచి పారిపోడానికీ? అదీ తనతో చెప్పనైనా చెప్పకుండా ఇంటికి తాళమేసి పోడమే? ఊహూ? – ఇదేనా ఇల్లాలి లక్షణం? – తనలో తనే వాదించుకుంటున్నాడు. తనే కరెక్టే అని ఓదార్చుకుంటున్నాడు.
పోని ఆ విషయం వదిలేద్దాం. ఇంటికొచ్చింది కదా, ఒక్కసారి ఆఫీస్ కి ఫోన్ చేసి, ఎలా వున్నావని అడగొచ్చు కదా? ఏదో తెలీక వాగి, బాధపెట్టాను సారీ అని చెబ్తే ఈవిడ గారి సొమ్మేం పోయిందో కదా?..ఎంత గా ఎదురుచూసాడు, ఫోన్ చేస్తుందనీ? ఎన్ని సార్లు ఉలిక్కిపడ్డాడు, సెల్ మోగినప్పుడల్లా ఆమెనే అనీ! హు. మొండిది. పెంకి పెళ్ళాం. పెంకి పెళ్ళామని.
అందుకే ఆమెకీ శిక్ష. ఎన్నాళ్ళైనా కానీయి, ఎన్నేళ్ళైనా కానీయి..తనకి సారీ చెప్పాకే, ఆమెతో కాపురం చేసేది. లేదంటే లేదంతే. ఇంతే. ఇలా సోఫాలో నే పడుకుంటాడంతే. – డిసైడైపోయాడు.
నిద్ర పోదామని, లైట్లు ఆర్పేసుకున్నాడు. కాని కళ్ళు మూత పడటం లేదు.
అబ్బబ్బా..ఎప్పుడూ లేంది, ఈ సోఫా ఏమిటీ ఇలా గుచ్చుకుంటోంది? ఆ?
తనకి బెడ్రూం లో, ఆ బెడ్ మీదే నిద్ర పడుతుంది. ఇలా ఎక్కడపడితే అక్కడ నిద్ర వచ్చి చావదు.
మహా తల్లి. మంచమంతా పరుచుకుని పడుకుందిగా, మహా రాణిలా.
ఆ మంచం లో నిజానికి తనకీ సగం జాగా వుంటుంది కదా? అవును. భలే పాయింట్ దొరికింది. ఇక లాభం లేదు. తనెళ్ళి, తన భాగం లో తనూ పడుకుంటాడు.
కోపంగా పైకి లేచి, చేతిలోకి దిండు తీసుకుని గదిలోకొచ్చాడు. చప్పుడు చేయకుండా మంచం మీద చోటు చేసుకున్నాడు.
మరి కొన్ని క్షణాల తర్వాత, ఇటు వాడు కాస్త అటు తిరిగాడు.
రెండు కనుమల మధ్య వాగులా..ఒక నిశ్శబ్ద వెన్నెల ప్రవాహం లా ఆమె! మల్లె దండని, ముగ్ధ మనోహరిని గుండెలకి హత్తుకోలేని మగ జన్మా ఒకజన్మే?
గాలి జోరుకి పూల కొమ్మ వూగినట్టు…మబ్బువెనకే మెరుపు మెరిసినట్టు..గ్రీష్మానికి మాడిన మట్టి -ఒక్క వాన చుక్క కోసం ..తపిస్తున్నట్టు..అతని పరిస్థితీ అలానే వుంది. దాహందాహంగా..
ఒక్కసారి తాకితే ఏమౌతుందనీ? కయ్యి మంటేనో? ఆ, అనన్నీ, నిద్దట్లో చూడ్లేదని అబధ్ధమాడేయొచ్చులే. తప్పేముంది?
చొరవచేసాడు.
వులిక్కిపడి, మేల్కొంది. పక్కన మనిషున్న ఆనవాలు. అది కూడా కాదు, నడుం మీద అతని చేతి వేళ్ళ కదలికలు..
ముందు నమ్మలేనిదైంది. ఆ తర్వాత ..కడుపులోంచి దుఖం..గొంతు దాటి, .కళ్ళలోంచి..పొంగి ప్రవహిస్తూ..
ఈ చేయినే కదూ నమ్మి తను ఇతగాని వెంట నడిచింది…ఈ చేతిలో నే కదూ..తన చేయుంచి..పెళ్ళి ప్రమాణాలు చేయించింది..ఈ చేతి చిటికెన వేలు ఒక్కటి చాలని కాదూ..తన మీద సర్వ హక్కుల్నీ ఇతనికి రాసిచ్చింది..ఈ చేయే కదూ..తన శిరస్సున తాకిన మొదటి స్పర్శ… ఈ చేతికి తెలీందేముందని? తనేమిటో, తన మనసేమిటో?
మరి ఎందుకనీ ఇంత దూరంగా వుంచి, తనకింత నరకాన్ని చూపింది..
ఈ చేయి తనని తాకలేదనే కదా తనిప్పటిదాకా కుమిలిపోయిందీ?..
ఉధృతమైన ఉద్వేగం భారాన్ని తట్టుకోలేని ఆ చిన్నది బిగ్గరగా ఏడ్చేసింది.
అతనూహించని సీన్ కావడంతో కలవరపడిపోతూ “దీ..ప్స్..” అని పిలిచాడు కంగారుకంగారుగా.
ఆమె మాత్రం అతని చేతిని తన చేతుల్లోకి తీసుకుని…వెక్కెక్కిపడుతూ చెప్పింది. “శ్రీ..ఇంకెప్పుడూ..నన్నింతగా పనిష్ చేయొద్దు..నే భరించ..లేను..చచ్చి పో..తా..ను..” అతను గబుక్కున ఆమె నోటి మీద చేయుంచాడు.
రెండు చేతులతో ఆమె భుజాలను చుట్టుకుని, దగ్గరకి తీసుకున్నాడు. అంతే, అమాంతం అతని గుండెల్లో ముఖం దాచుకుని చిన్నపిల్లలా ఏడ్చేసింది. అలా..చాలా సేపు..చాలా చాలాసేపు.
భార్యలో వున్నదంతా అహం అని అపోహపడ్డాడే కానీ, ఆమె లోని పసి హృదయాన్ని తెలుసుకోలేకపోయాడు. ఛ. ఎంత కఠినం గా మారాడు!…ఇంకెప్పుడూ దీప్స్ పట్ల ఇలా ప్రవర్తించకూడదని ఒట్టేసుకున్నాడు.
ప్రాయశ్చిత్తంగా ఓ వేయి ముద్దుగులాబీలను అర్పించుకుని, ఆ ముగ్ధ్రాల్ని, బాధనించి విముక్తిరాలిని చేసాడు. పాపం!
*******
కూతురు మళ్ళీ తిరిగిరావడం ఖాయం అనుకున్న రంగనాధం, ఆ జంట హనీమూన్ కోసం సింగపూర్ కెళ్ళిందని తెలిసి చాలా ఆనందపడిపోయాడు. ఆ క్రెడిట్ అంతా భార్యకే ఇచ్చేసాడు.
“అద్సరేనోయ్ పెళ్ళాం! కోపమొచ్చి కొమ్మెక్కి కూర్చున్న అల్లుడి దగ్గరికి పిల్లనెలా పంపావోయ్? వాళ్ళిద్దరూ కలుస్తారని ఎలా గెస్ చేసావ్? నేనైతే ఆశలొదిలేసుకున్నా సుమా! ఇంకా చెప్పాలీ అంటే, అల్లుడి ప్రవర్తన మీద భలే కోపమొచ్చేసిందనుకో నాకు..”
“అబ్బా! అలానేం? మనకు పెళ్ళైన కొత్తల్లో..మరి మీ ప్రవర్తనకి మా నాన్నకెంత కోపమొచ్చుండాలి స్వామీ, మీ మీద?” నవ్వుతూ, నవ్వుతూనే మొగుడి మీద బాణం వేసి నవ్వింది సుజాత. నవ్వాక మళ్ళీ చెప్పింది. “ మనకి రోజులో దుర్ముహుర్తాలు, రాహు కాలాలు వున్నట్టె, శుభ ముహుర్తాలు, అమృత ఘడియలూ వుంటాయి. అలానే, కాపురం లో కూడా కలతలు, కలహాలతో బాటు అమృత పాన క్షణాలూ,అనురాగ బంధా లూ వుంటాయి. వివాహానికి అసలైన భాష్యాన్ని వివరించే అతి విలువైన ఘడీయలవి. ఆ విలువంటూ ఒక్కసారి తెలిస్తే.. ఎన్ని ఆటంకాలు రానీ, పోనీ.. భార్యాభర్తలు ఒకర్నించి మరొకరు విడిపోలేరు. జీవితాంతమూ అన్యోన్యంగా కలిసే వుంటారు.
తొందరపాటు లో విడిపోవాలనుకునే జంటలను తిరిగి కలిపే – ఈ చిన్ని మలుపు ఎంత దూరమో..అది అంత చేరువ కూడా.
అందుకే, ఆ అమృత ఘడియ వచ్చే వరకూ అమ్మాయి అక్కడే వుండాలని చెప్పా..మీకు.
“అవునూ..ఈ టెక్నికులన్నీ నీకెలా తెలిసాయబ్బా?”
“అనుభవం సార్..స్వానుభవం..” అంటూ ఫక్కున నవ్వింది.
అర్ధం కాకున్నా, ఆయనా నవ్వేశాడు భార్యతో కలసి.

– ఆర్.దమయంతి

damayanthi

 

 

 

 

 

Download PDF

25 Comments

  • చిరు అలకలు సంసారంలోని మధురిమలు.. చిలికి చిలికి గాలివాన చెయ్యకుండా కలవడం తెలివైన వారు చేసే పని. వేయి కళ్లతో కనిపెడుతూ.. కూతురి కాపురంలో కలతలకి కారణం అల్లుడే అని అగ్నికి ఆజ్యం పొయ్యకుండా.. కాపురాన్ని సరిదిద్దిన సుజాత అభినందనీయురాలు.
    చిన్న సంఘటనని ఇంతగా అలరించేలా చెప్పగలగడం, చేయితిరిగిన రచయిత్రి దమయంతిగారికే సాధ్యం. మానసిక విశ్లేషణ, కొత్త దంపతులకి నీతి పాఠాలు, తల్లిదండ్రుల బాధ్యత నెరిగించడం.. అప్పుడప్పుడు మలయ సమీరంలా ఆహ్లాదాన్ని కలిగించే చిరు శృంగారం.. అలోచనాత్మకంగా, కమనీయంగా ఉందీ కథ.

    • ఆర్.దమయంతి. says:

      ‘కూతురి కాపురంలో కలతలకి కారణం అల్లుడే అని అగ్నికి ఆజ్యం పొయ్యకుండా.. కాపురాన్ని సరిదిద్దిన సుజాత..’
      – సరిగ్గా ఇదే నేను చెప్పాలనుకున్న విష్యం అక్కా. ఎంత బాగా చెప్పారు!
      మీ విశ్లేశణలతో మనసుని దోచేస్తున్నారు అక్కా!
      నిజం. ప్రామిస్.
      అనేకానేక ధన్యవాదాలతో..
      మీ
      సోదరి.
      :-)

  • మణి వడ్లమాని says:

    అమ్మయ్య! దమయంతి గారు . ఒక చక్కటి ఆహ్లాదకరమైన,సంసారపక్ష కధ రాసి ఒక అపప్రధని తొలగించారు,లేక పొతే ఎప్పుడూ ఆడవాళ్లు,ఏడుపులు,కష్టాలేఉంటాయి అనుకోకుండా భానుమతి గారు అన్నట్లు “మలయ సమీరంలా ఆహ్లాదాన్ని కలిగించే చిరు శృంగారం.. అలోచనాత్మకంగా, కమనీయంగా” ఉంది

    • ‘మలయ సమీరంలా ఆహ్లాదాన్ని కలిగించే చిరు శృంగారం.. అలోచనాత్మకంగా, కమనీయంగా” ఉంది.
      మీ కామెంట్ కి చాలా సంతోష మైంది మణి.
      ఇదొక అతి సున్నితమైన అండర్స్టాండింగ్ పాయింట్ కాపురంలో.
      అనుభవమున్న తల్లులు సైతం అర్ధం చేసుకోరేందుకు అనిపిస్తుంది నాకు.
      ఇలాటి సమస్యలు ఎదురైనప్పుడు ఆ తల్లి రెచ్చిపోవడం వల్ల,
      – అసలు సమస్య పరిష్కారం కాక పోగా, ఆమె దుఃఖం మరింత రెట్టింపు అవుతుంది.
      నాకు తెలిసిన ఒక కథ ఇది.
      కోడల్ని పంపమని, మరో సారి అలా (?) జరగదని ఆ అత్తగారు ఎన్ని సార్లు ఆ తల్లి ఇంటి చుట్టూ తిరిగిందో. ataDenni సార్లు వచ్చి వెళ్ళాడో. పెళ్ళాన్ని బ్రతిమాలుకోడానికి.
      అయినా ఆవిడ కరగలేదు. వాౡ ద్దర్నీ కలవనీయలేదు. కలిపే ప్రయత్నమూ చేయలేదు.
      కూతుర్ని ససేమిరా అత్తారింటికి పంపనంది.
      కోర్ట్ కెక్కి, సక్సెస్ఫుల్ గా విడాకులిప్పించింది.
      నేనెక్కడ బాధ పడ్డానంటే, – ఆ పిల్లకి ఒక బిడ్డ కూడా.
      అదీ సంగతి..
      కథ నచ్చిందని మీ స్పందన తెలియచేసినందుకు ధన్యవాదాలు మణి!
      :-)

  • Malathi says:

    చక్కని అంశం తో కధ సాగిన తీరు అమోఘం

    • ఆర్.దమయంతి. says:

      మాలతి గారు,
      మీరు అమోఘం అనంగానే, ఎంత ఆనందమేసిపోయిందో చెప్పలేను. :-)
      మీకు నా మనః పూర్వక ధన్యవాదాలు తెలియచేసుకుంటూ..
      శుభాభినన్దనలతో..

  • darbha lakshmi annapurna says:

    ప్రతి క్షణాన్నీ ఆస్వాదనలోకి తీసుకువస్తూ ,ప్రతి పదాన్నీ గుబాల్హిస్తున్న మల్లెలుగా మార్చి నిలువెత్తు దమ్డని చేసి మా చేతుల్లో పెట్టి ఆఘ్రాణిమ్చుకొమ్డి అన్నట్టుగా వుంది మీ కధ దమయంతిగారు!
    అయినా …ఏమిటండీ….అంత గమ్మత్తు…మత్తు…మాటల అమరికలో..ఒక మధురమైన సన్నివేశానికి ..మాటల్ని కూర్చిన మీ నేర్పు ..మరీ…యింత గొప్పగా వుమ్డిపొవటమ్ ఏవిటండీ …ఆశ్చర్యంగా…
    మరీ…ఏవిటండీ..ఊహకందని ఆ పదాల పదనిసలు!ఉరుకుమ్టుమ్టె మరీ ఉయ్యాలలూగిమ్చేస్తున్నారు మమ్మల్ని…
    పిట్ట మనసూ…పిసరంతైనా…పెపమ్చమమ్తా దాగుమ్డీ…అన్నట్టుగా…చిన్న ఆర్తీ…చిన్న చేరికా జీవితాన్నే గమ్మత్తైన రాగాలతో నిమ్పెస్తుమ్దన్న విషయాన్ని..మరీ..అంతగా .మా హృదయాల్లొకి చొచ్చుకు వచ్చేసి చెప్పాలా… రచయిత్రి దమయంతిగారు….దర్భా లక్ష్మీ అన్నపూర్ణ

  • ఆర్.దమయంతి. says:

    ఎంత గొప్ప గా రాసారు !..
    చక్కని ప్రశంసల చమ్కీ పూల దండనందుకున్నా అన్నపూర్ణ గారూ!
    ఇంత అందమైన అభినన్దనలమ్దచేయడానికి ..ఎంత మంచి మనసు వుండాలి కదూ?
    చాలా ఆనందాన్నిచ్చింది మీ లేఖ.
    అనేక ధన్యవాదాలతో..
    ..

  • Jayashree Naidu says:

    కథలో నేరేషన్ సూపర్ దమయంతీ
    మారిన లైఫ్ స్టైల్ లో మారని మనసు విలక్షణం గా చూపించావు!
    ఎన్జాయ్డ్ రీడింగ్ దిస్

    • ఆర్.దమయంతి. says:

      జయశ్రీ , నిజంగానా!!?.. :-)
      సూపర్ అనంగానే భలే గొప్ప ఆనందమేసింది. నిజం.
      ఒక్క లైన్ లోనే అయినా – మీ విశ్లేషణ ఆలోచనాత్మకం గా వుంది జయశ్రీ.
      స్త్రీ ఆర్ధికాభివృధ్ధి కి సూచన – మారిన లైఫ్ స్టైల్.
      హార్దికం గా మారారు. మారలేరు.
      సహజంగానే స్త్రీలెప్పుడో సెన్సిటివ్ గువ్వలే.
      ఆ సున్నితత్వమే మనకు బలం అంటాను జయశ్రీ.
      కాదంటారా, చెప్పండి.
      మరో మాట నేనిక్కడ చెప్పాలి.
      మీతో ఒక్క నిముషం సేపు మాట్లాడినా నాకు అనేక పరిశోధనాత్మకాంశాలు దొరుకుతాయి.
      ఇప్పుడు, ఇక్కడ కూడా..
      ధన్యవాదాలతో..

  • krishnavasanthika says:

    దమయంతి గారూ……..మళ్ళీ. మళ్ళీ చదవాలి

    అనిపిన్చేట్టున్నదండీ మీరు రాసిన ఈ కదా.సున్నితమైన బంధాలని అంత రామ్యంగానూ రాయ గలగటం మీకే చెల్లింది . ఇగో నో వోదిలించుకో గలిగితే అనుబంధాలు ఎంత గాధంగా అల్లుకో గలవో ఎంత అమ్డంగానో వర్ణించారు. ఈ రోజులలో సద్ది చెప్పే తల్లులు
    కరువవుతున్నారని వొస్తున్న మాటలకి జవాబుగా సుజాతపాత్రని ఆవిష్కరించారు. హృద్యమైన కదా ni andinchinanduku dhanyavaadaalandee

    • ఆర్.దమయంతి says:

      ~ ఇగో ని వోదిలించుకో గలిగితే అనుబంధాలు ఎంత గాధంగా అల్లుకో గలవో ఎంత అమ్డంగానో వర్ణించారు.
      * ఈగో..- మనుషుల మధ్య పగలకొట్టలేని పెద్ద ఇనప గోడ. అందులో భార్యాభర్తల మధ్య గనక చోటు చేసుకుంటే ఇక చెప్పేదేముంది…జీవితం అంతా అశాంతి మయమే. చాలా బాగా చెప్పారు కృష్ణా!

      ~ ఈ రోజులలో సద్ది చెప్పే తల్లులు
      కరువవుతున్నారని వొస్తున్న మాటలకి జవాబుగా సుజాతపాత్రని ఆవిష్కరించారు
      * ఇది సత్యం.
      – కారణం తన కూతురో సంపాదిస్తోందనో, , లేక ఆర్ధికంగా స్థితి మంతులమనో, లేదా మీరన్నట్టు ఈగో నో.. ఏదో ఓ కారణం..చూపిస్తున్నారు.
      కొన్ని లా పాయింట్స్ కానీ, రీజనింగ్స్ కానీ ఏవీ వర్కౌట్ కావు. ఆలూ మగల మధ్య అనురాగ సౌధాలని నిర్మిం చుకోడానికి నాకు సుజాత లాటి తల్లులంటే ప్రత్యేకమైన ఇష్టం. గౌరవం కూడా. :-)

      ~ మళ్ళీ. మళ్ళీ చదవాలి అనిపిన్చేట్టున్నదండీ మీరు రాసిన ఈ కద.సున్నితమైన బంధాలని అంత రమ్యంగానూ రాయ గలగటం మీకే చెల్లింది
      * మీ ప్రశంస కి మనసు పులకించింది కృష్ణా. మీకివే నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియచేసుకుంటూ..
      శుభాకాంకాక్షలతో..
      :-)

  • G.S.Lakshmi says:

    ఎంతటివారికైనా తప్పని కొత్తకాపురంలో వుండే అలకలూ, అపార్ధాలూ, విరహాలూ అన్నీ అందరికీ తెలిసినవే. ఈ కథ కూడా ఆ కోవకు చెందినదే..
    కానీ, ఇక్కడ ఈ కథలో విశేషంగా చెప్పుకోవలసింది ఆ అద్భుతమైన శైలి. రచయిత్రి దమయంతిగారు మన చిటికెనవేలు పట్టుకుని మాటలమత్తులో పెట్టి తమతో అలా తీసుకుపోతారు.
    ఇదేం కథండీ బాబూ…
    కాలింగ్‍బెల్ కొడుతూ మొగుడింటికి తప్పక వెళ్ళి తీరాల్సిన ఆడపిల్ల పరిస్థితికి బాధపడతాం.
    శ్రీకాంత్ తలుపు తెరిచే లోపల దీపూ మనసులో పడే సంఘర్షణకు సాక్షుల మవుతాం. తలుపు తీసిన శ్రీకాంత్ ప్రవర్తనకు మన మనస్సు కూడా కలుక్కు మంటుంది.
    అయినా సరే అది తన యిల్లే అని దీపూ అనుకుంటే ” అవును సుమా ” అనుకుంటాం.
    ఒకసారేమో దీప్తిని పౌరుషంగల పిల్లంటారు. మరో నిమిషంలో ఆనందంగా ఇంటి పనంతా చేయించేస్తారు.
    భర్త కోసం ప్రేమతో వేచి చూసే భార్య మనసును అద్దం పట్టి చూపించారు.
    మరో నిమిషంలో అదే భర్త మీద అంతెత్తు ఆగ్రహం చూపించారు.
    ఇప్పుడు భర్తని తిట్టిన దీపూని చూసి “బాగా తిట్టింది” అనుకుంటామా.. ఇంకో నిమిషంలో ఆ దీప్తి చేతే భర్తని ఆకాశానికెత్తించేస్తే “అవును కదా..” అని అనిపించేస్తారు రచయిత్రి మనచేత.
    అసలీ దమయంతిగారికి యిలా మన మనసుని ఆవిడకి కావల్సినట్టు తిప్పేసుకునే ఈ అధికారం యెవరిచ్చేరండీ..
    కాసేపు ఆ భార్యాభర్తల మనసులమధ్య దోబూచులాడి, అత్యంత సహజంగా ఇద్దరికీ సంధి చేసేసి, మనల్ని సంతోషపెట్టడమే కాకుండా “ఇలాంటివి తరతరాలుగా నడుస్తున్నవే..” నంటూ ముక్తాయింపు ఒకటీ..
    ప్రతి అక్షరంతోనూ పాఠకులని తనతోపాటూ ఆనందం పంచుతూ నడిపించుకుపోయే దమయంతిగారి రచనాశైలికి జోహార్లు.

  • ఆర్.దమయంతి says:

    `అసలీ దమయంతిగారికి యిలా మన మనసుని ఆవిడకి కావల్సినట్టు తిప్పేసుకునే ఈ అధికారం యెవరిచ్చేరండీ..
    * నేనే తీసేసుకున్నాను అక్కా! :-)

    ~ ప్రతి అక్షరంతోనూ పాఠకులని తనతోపాటూ ఆనందం పంచుతూ నడిపించుకుపోయే దమయంతిగారి రచనాశైలికి జోహార్లు.
    * ఇవే మీకు నా మనః పూర్వక ప్రణామములు.
    ఎంత మనోహరమైన ప్రశంసలని కురిపించారు నా పైని!
    ధన్యోస్మి శుభక్కా.. ధన్యోస్మి.
    :-)

  • దమయాంతీ ,
    నేనీ కథ ఇంత ఆలస్యం గా ఎందుకు చదివానా ? అని బాధ పడుతున్నాను ..నన్ను నేను తిట్టుకుంటున్నాను ,అంత రాచ కార్యాలు ఏం వెలగబడుతున్నావు ? నీ ప్రియ హితురాలి కథ చదవకుండ ? ఇన్ని రోజులూ అని , నా కన్నా ,ముందే ఎంత అందం గా స్పందించారు , తోటి సోదరీ మణులు ..
    అవును ,చిన్న చిన్న కారణాలకే విడాకులు ,విడిపోతాం అంటున్నారు ,చదువు ఉంది మా కాళ్ళ పై మేం నిలబడతాం అంటున్న ఆడ పిల్లలని ,తల్లులు కూడా చాలా సమర్ధిస్తూ , మా పిల్ల మాకేం బరువు కాదు అంటున్నారు ..పుట్టింటికి చేసే అప్పట్లో ఎస్ టి డీ కాల్స్ ఎక్కువయ్యాయి అన్నాడని ,వచ్చేసిన అమ్మాయి మధ్య గొడవలు చూసాను ..చెప్పుకుంటే ఉంది ..సర్దుకుంటే లేదు అన్నట్టుంటాయి ఆ గొడవలు ..ఇద్దరి మధ్య చిన్న చిన్న అపార్ధాలు ,మాటల్ లో పదును , ఎత్తిపొడుచుకోవడం ..హింస లు పెట్టి , నిత్య కంటకం చేసే కాపురం సాగించమని ఎవరూ చెప్పరు ..కానీ ఇలాగ చిన్న చిన్న కారణాలకే ఇంటికి వస్తే ,ఇక ముందు ఏం చేయాలో తల్లులు ,చక్కగా ,సున్నితం ..రసాత్మకం గా చెప్పారు ..కథ చిన్నదే కానీ , ఉద్దేశం పెద్దదే ,ఉన్నతమైనది ..మీ శైలి అమోఘం ..ఇంకా ఎంత వర్ణించినా పైన చెప్పిన వారి మాటలు పలు మారులు చెప్పినట్టు అవుతుంది ..మీ అందరి స్పందనలు తో నేనూ ఏకీభవిస్తూ ..ఇంకా ,ఇంకా కథలు అందించాలి మీరు ..అని కోరుకుంటూ ..
    వసంత లక్ష్మి

    • ఆర్.దమయంతి. says:

      ~ నేనీ కథ ఇంత ఆలస్యం గా ఎందుకు చదివానా ? అని బాధ పడుతున్నాను ..నన్ను నేను తిట్టుకుంటున్నాను ,అంత రాచ కార్యాలు ఏం వెలగబడుతున్నావు ? నీ ప్రియ హితురాలి కథ చదవకుండ ? ఇన్ని రోజులూ అని..

      * మీంత స్వచ్చమైన మనసండీ..వసంతా!!

      ~ నా కన్నా ,ముందే ఎంత అందం గా స్పందించారు , తోటి సోదరీ మణులు ..

      * సహ రచయిత్రులను మెచ్చుకునే విధానం అంటే, ఇదీ!

      ~అవును ,చిన్న చిన్న కారణాలకే విడాకులు ,విడిపోతాం అంటున్నారు
      * నిజమే, మరీ అర్ధం లేకుండా వున్నయీ విపరీతాలు.

      ~ చదువు ఉంది మా కాళ్ళ పై మేం నిలబడతాం అంటున్న ఆడ పిల్లలని ,తల్లులు కూడా చాలా సమర్ధిస్తూ..

      * అక్కడే వచ్చింది చిక్కు.
      కొబ్బరి కాయలమ్ముకుంటూ, మొగుణ్ణి, సంసారాన్ని ఈదుతోంది ఒక కుంటి అమ్మాయి.
      పైగా ఎప్పుడూ నవ్వుతూ కనిపిస్తుంది. ఏం చదివిందనీ..ఈమెకింత జ్ఞానం అనుకుంటా.
      ఆమె పరిధిలో ఆమె కూడా ఆర్ధిక స్వాతంత్రురాలే కదా..మరి ఎందుకు విడిపోడం లేదూ? – అని ఆలోచిస్తూ వుంటాను. బహుశా ఎక్కువ చదువుకోకపోవడం వల్లనేమోలే అని..నవ్వుకుంటుంటాను. మీరు చెప్పింది 100% నిజం వసంత.

      ~ మా పిల్ల మాకేం బరువు కాదు అంటున్నారు ..
      ఈ రోజులో మనిషి బరువులని, తేలికల్నీ, విలువల్నీ..అన్నీ కూడా – మాటల్లేని నోటు నిర్ణయిస్తోంది కదా వసంతా?

      ` పుట్టింటికి చేసే అప్పట్లో ఎస్ టి డీ కాల్స్ ఎక్కువయ్యాయి అన్నాడని ,వచ్చేసిన అమ్మాయి మధ్య గొడవలు చూసాను ..
      * ఊ.
      నేనూ విన్నాను. శ్రీమంతానికి పుట్టింటి వారు తెచ్చిన లడ్డూలు సైజ్ – చిన్నవని అన్నారని ఆ జమిందారు కోడలు వెళ్ళిపోయింది. కోర్ట్ లో గెలిచింది. విడాకులు తీసుకుంది.
      చాలా కాలం నమ్మలేకపోయాను. చాలా చాలా యేళ్ళ కిందటి సంగతిలేండి.

      ~ ఇలాగ చిన్న చిన్న కారణాలకే ఇంటికి వస్తే ,ఇక ముందు ఏం చేయాలో తల్లులు ,చక్కగా ,సున్నితం ..రసాత్మకం గా చెప్పారు ..కథ చిన్నదే కానీ , ఉద్దేశం పెద్దదే ,ఉన్నతమైనది ..మీ శైలి అమోఘం ..ఇంకా ఎంత వర్ణించినా పైన చెప్పిన వారి మాటలు పలు మారులు చెప్పినట్టు అవుతుంది ..

      *మీ అభిమానానికి ఏమిచ్చి కృతజ్ఞతలు చెప్పుకోగల్ను?
      .. మాటల్లేవు!
      …నా మనః పూర్వక ధన్యవాదాలు తెలియచేసుకుంటోఓ..

      ఓ బిగ్ హగ్ తో.. :-)
      మీ ఫ్రెండ్ని.
      :-)

  • sankisa sankar says:

    మేడం, మీ కథ, ఎంత దూరం……., చదివాను. చాలా బాగుంది. నాకు ఒక చోట అంటే తండ్రి దీప్స్ కి చెప్పిన మాటల బట్టి చూస్తే మీరు కథని ఇంకొక వైపుకు తీసుకెళ్ళాలని మొదట్లో ఆలోచించి తరువాత ఇప్పుడున్న వైపుకు తీసుకొచ్చారని అనిపించింది. కాకపోతే నడక చాల బాగుంది, అంతర్మథనం చక్కగా చూపించారు . కాకపోతే శ్రీ యొక్క అంతర్మథనానికి తక్కువ చోటు కేటాయించారని అనిపించింది! ( వాడి అంతర్మథనం ఎవడిక్కావాలి, అయినా అది ఒక లెఖ్ఖ లోనిది కాదనుకోండి!,). మీకు తెలియకుండానే, చివరిలో శృంగార రసం ( పట్టు విడుపు రసం) అలవోకగా పండించారు , వెరసి ఒక గొప్ప ( మంచి ) కథ, కాదు కామెంట్రీ !

    • ఆర్.దమయంతి. says:

      * శ్రీ యొక్క అంతర్మథనానికి తక్కువ చోటు కేటాయించారని అనిపించింది!

      + అతని వెర్షన్ కూడా వినిపించాను కదా!
      గొప్ప కథ అని మీ చేత ప్రశమ్సనందుకోడం ఆనందంగా వుంది శంకర్ గారు.
      ధన్యవాదాలతో..

  • malakumar says:

    కథ చాలా అద్భుతంగా వుంది.ఇంతకంటే నేనికేమీ చెప్పలేను.

  • ఆర్.దమయంతి. says:

    ఈ ఒక్క మాట చాలండి, రైటర్ మనసు నిండేలా..ఒక నిండైన న మాట. పండగయ్యే మాటన్నారండీ!
    ఈ సందర్భంగా మన అఫ్సర్ గారికి ధన్యవాదాలు తెలుపుకోవాలి. ఎందుకంటే,
    కథో, కవితో రాస్తోండమని గుర్తు చేస్తూ వుంటారు అందుకని. ఈ కథ అలా రాసిచ్చిందే సారంగకి.
    మీకు మరో సారి నా కృతజ్ఞతలు తెలియచేసుకుంటూ
    అభిమానంతో..

  • GV Ramesh says:

    వండర్ఫుల్ స్టొరీ. ఈ చిన్ని మలుపు ఎంత దూరమో..అది అంత చేరువ కూడా. – సుపెర్లికే :-)

  • GV Ramesh says:

    సూపెర్ లైక్

  • ఆర్.దమయంతి. says:

    సూపర్ లైక్.. :-) మీ ప్రశంస ఎంత గొప్పగా వుందో!
    బోలెడన్ని థాంక్స్ చెప్పుకుంటూ..
    ఆనందంతో..

  • Suresh says:

    మీ కధనం, మొదలెడితే..ఆపలేము. కథ చదువుతున్నంత సేపు…అయ్యో ముగింపు ఎలా ఉంటుందో అనుకొంటూ చదువుతున్నాను. ఆఖరి పారాగ్రాఫ్ చదివాకా….హమ్మయ్యా …అనుకొన్నా. భలే ముచ్చటైన కథ అండి.

    • ఆర్.దమయంతి says:

      ‘మీ కథనం మొదలు పెడితే ఆపలేం’
      ధన్యోస్మి సురేష్..ధన్యోస్మి.
      మీ మాటలకు మనసు నిండిపోయింది. ఏ రైటర్ కైనా ఇంతకు మించిన తృప్తి ఎం కావాలి.?
      మీరు చూపే అభిమానానికి
      సదా కృతజ్ఞతలు తెలియచేసుకుంటూ…
      శుభాకాంక్షలతో.. .

Leave a Reply to malakumar Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)