మూడు ‘క్షేత్రా’ల ముడి

Kalluri Bhaskaram-pic-a.prabhakar rao (5)

నే నిప్పుడు ఒక విచిత్రమైన తర్కానికి లోనవుతున్నాను. దాని గురించి ముందుగా చెప్పాలనిపిస్తోంది.

ఈ వ్యాసాలను కేవలం ‘చూసే’ వారు ఉంటారు. యధాలాపంగా చదివేవారు ఉంటారు. ఆసక్తితో, ఇష్టంతో, లోతుగా చదివేవారు ఉంటారు. ఒకవిధమైన ఆసక్తి ఉన్నా అయిష్టంగా చదివేవారు ఉంటారు. ఆసక్తి లేకుండా కేవలం అయిష్టంగా చదివేవారు ఉంటారు. పాఠకులలో అనేక రకాలు. నేను కూడా ఇలాంటి పాఠకరకాలలో ఒక రకానికి చెందినవాణ్ణే కనుక ఈ వైవిధ్యాన్ని గౌరవిస్తాను.

ఈ పాఠకరకాలలో ఒక రకంవారికి, లేదా కొన్ని రకాల వారికి ‘మళ్ళీ మళ్ళీ ఇదేల భారతం’ అనిపిస్తూ ఉంటుందని నాకు తెలుసు. వాళ్ళ దాకా ఎందుకు? ఎంతోమంది మహాపండితులు రాసిన భారతం, రామాయణం, పురాణాలు, ధర్మశాస్త్రాల సంగతులు నేనెందుకు రాస్తున్నానని ఒక్కోసారి నాకే అనిపిస్తూ ఉంటుంది.

నేను విచిత్రమైన తర్కానికి లోనవుతున్నా నన్నది -ఇదిగో, ఇక్కడే!

నిజానికి నేనివి రాస్తున్నప్పుడు భారతం గురించి రాస్తున్నానన్న స్పృహ నాలో లేదు. భారత కథలు, పాత్రలు, ఘట్టాల గురించి ఇంతగా రాస్తున్నప్పుడు ఇది భారతం గురించి కాకుండా ఎలా ఉంటుందని మీరు అనుకోవచ్చు. ఇక్కడే ఉంది తర్కం. సంగతేమిటంటే, భారతం మిషతో నేను భారతదేశం గురించి రాస్తున్నాను. భారతంలో కనిపించే భారతదేశ మూలాల గురించి, మన మూలాల గురించి రాస్తున్నాను. భారత, రామాయణాలను, పురాణాలను, ధర్మశాస్త్రాలను ఒకానొక కాలానికి చెందినవిగా మాత్రమే చూస్తూ; కాలమనే నదిలో ప్రవహిస్తున్న వాటికి ఆనకట్ట పడినట్టు ఊహించుకుంటున్నవారికి నేను భారతం గురించి మాత్రమే రాస్తున్నట్టు కనిపిస్తుంది. మరల ఇదేల భారతం అనిపిస్తుంది. కానీ నా అవగాహన వేరు. నా ఊహలో కాలమనే నదిలో ప్రవహిస్తున్న భారతరామాయణాదులకు ఎలాంటి ఆనకట్టలూ లేవు. చాలామందికి అవి గతంలా అనిపిస్తాయి. కానీ అవి నాకు వర్తమానం!!!

ఇంకోలా కూడా చెప్పుకుందాం. మనం ఇప్పటికీ మనిషి గురించి చెప్పుకుంటున్నాం. ‘మళ్ళీ ఇదేల మనిషి గురించి’ అనుకోవడం లేదు. కానీ ఈ మనిషి ఎప్పటివాడు? మనం ఇప్పటికీ విశ్వం గురించీ, ప్రపంచం గురించీ మాట్లాడుకుంటున్నాం. కానీ ఈ విశ్వమూ, ప్రపంచమూ ఎప్పటివి? మనం ఇప్పటికీ భారతదేశం గురించి మాట్లాడుకుంటున్నాం. కానీ ఈ భారతదేశం ఎప్పటిది? అలాగే, భారతరామాయణాదులే కాదు; ప్రపంచ వాజ్మయం సమస్తం -మనిషి, విశ్వం, ప్రపంచం, భారతదేశం లాంటివే. కనుక వాటి గురించి ఇప్పటికీ కాదు, ఎప్పటికీ మాట్లాడుకుంటూనే ఉంటాం.

ఇంకా నా ఉద్దేశంలో భారతం అంటే భారతదేశమే. భారతం గురించి చెప్పుకోవడం అంటే, భారతదేశం గురించి చెప్పుకోవడమే. ఇంకా చెప్పాలంటే ఒకనాటి ప్రపంచం గురించి చెప్పుకోవడమే. ఇంత వైవిధ్యవంతమైన ప్రపంచంలో ఏ విషయంలోనైనా ‘ఇది కచ్చితం’‘ఇది ఇంతే’ అనగలిగిన సాహసం ఏ మానవమాత్రుడికీ ఉండదని నేను నమ్ముతాను. అయినాసరే, ఒక విషయంలో మాత్రం నా అనుభవంనుంచి ఒకింత కచ్చితానికి దగ్గరగా మాట్లాడతాను. అదేమిటంటే, భారతంతో (అలాగే ఇతర పురాతన వాజ్మయంతో)తగు మేరకు పరిచయం లేకపోతే భారతదేశమూ, ప్రపంచమూ కూడా అర్థం కావు. సమకాలీనమైన ఏ సమస్య పైన అయినా మీరు సాధికారంగా మాట్లాడదలచుకుంటే, భారతం సహా పురావాజ్మయంతో మీకు కొంత పరిచయం ఉండితీరాలి!

ఒక ఇతిహాసం పేరే ఒక దేశానికి పేరైన ఉదాహరణ నాకు తెలిసినంతవరకు ప్రపంచంలో మరొకటి లేదు. మళ్ళీ నేనిక్కడ భారతాన్నో, మరొకదాన్నో గ్లోరిఫై చేస్తున్నానని అనుకోవద్దు. నేను కవిత్వం రాయడం లేదు. అక్షరాలా ఉన్న మాట చెబుతున్నాను.

ఈ వ్యాసాల క్రమంలో ఇదే వివరణను-అచ్చంగా ఈ మాటల్లో కాకపోయినా-అప్పుడప్పుడు ఇచ్చుకుంటూనే వచ్చాను. అయినా మరోసారి ఇవ్వవలసి రావడం చూస్తే, నాకు ‘బ్రాహ్మణుడు-మేక’ కథ గుర్తొస్తోంది. ఆ కథలో ఒక బ్రాహ్మణుడు యజ్ఞానికి మేకను తోలుకుపోతుంటే, ఆ మేకను కాజేయాలనుకున్న కొందరు దొంగలు దారిలో తలో చోటా కాపు కాసి,‘అదేమిటి అయ్యవారూ, కుక్కను తోలుకుపోతున్నారు’ అంటారు. నలుగురూ అలా అనేసరికి బ్రాహ్మణుడు అవునేమో ననుకుని దానిని వదిలేసి పోతాడు.

నేను కూడా ఆ బ్రాహ్మణుడిలా మోసపోకుండా జాగ్రత్త పడడానికే ఈ ఆత్మవిమర్శ లాంటి వివరణ.

***

మన ప్రాచీనులు లైంగికత్వాన్ని, స్త్రీ-పురుష సంబంధాలను మనకంటే విశాలమైన, వైవిధ్యవంతమైన దృష్టి నుంచి చూశారనీ; లైంగిక సుఖాన్ని ప్రకృతిలో భాగంగా, అతి సహజంగా, స్వచ్ఛ, పవిత్ర కార్యంగా అర్థం చేసుకున్నారనీ కిందటి వ్యాసంలో అన్నాను. పురాచరిత్ర కోణం నుంచి ఇది చాలా ముఖ్యమైన వివరం. మనలో చాలామందికి ఈ విషయంలో తలకిందుల అభిప్రాయం ఉంది. లైంగికత విషయంలో మన పూర్వులు చాలా నిష్ఠను, కట్టడిని, నైతికతను పాటించారనీ; మన దగ్గరకు వచ్చేసరికి అవి పలచబారిపోయాయనీ వారు భావిస్తారు. ఈ విషయంలోనే కాక ప్రతి విషయంలోనూ వెనకటి తరాలవారి కంటే నేటి తరాలు అన్నివిధాలా పతనమై పోయాయనే ఒక సూత్రీకరణ వినిపిస్తూ ఉంటుంది. లోతుగా చూస్తే, ఈ అభిప్రాయంలో నిజం కన్నా అపోహే ఎక్కువ.

నేను లైంగికతపై ప్రాచీనుల దృష్టి గురించి పై మాటలు రాసిన తర్వాత, యధాలాపంగా ‘SEXUAL LIFE IN ANCIENT GREECE’ (ByHANSLITCH-1952 ముద్రణ) అనే పుస్తకం తిరగేయడం ప్రారంభించాను. ఈ పుస్తక రచయిత అక్కడక్కడ చేసిన వ్యాఖ్యలు నా అభిప్రాయాన్ని నూటికి నూరుపాళ్లూ ధ్రువీకరించేలా ఉండడం చూసి ఆశ్చర్యపోయాను. గ్రీకు కామెడీలో లైంగికోద్దీపక లక్షణం, అశ్లీలం చాలా ఎక్కువ పాళ్లలో ఉండడం గురించి రచయిత రాస్తూ, ప్రాచీనులు లైంగికత్వాన్ని చాలా అమాయకంగానూ, సహజంగానూ చూశారనీ, దానిపై ఎలాంటి రహస్యాల ముసుగులూ వేయలేదనీ అంటాడు. పైగా, లైంగికతను సమస్త ప్రాణుల అస్తిత్వానికి మూలమైన ప్రాథమిక అవసరంగా మతవిశ్వాసకోణంనుంచి చూసి ప్రస్తుతించారంటాడు(పేజీ-153).

అంతేకాదు,‘Religion And Erotic’ అనే అధ్యాయంలో,‘మతపరమైన అవసరాన్ని, మతపరమైన ఆకాంక్షను సఫలం చేసుకోవడం వెనుక చాలావరకూ లైంగికతే ఉందనీ, కొన్ని సందర్భాలలో అది ఉద్దేశపూర్వకంగా కూడా వెల్లడవుతుందనీ’ రచయిత అంటాడు(పేజీ-180). ఈ వాక్యం చూసినప్పుడు మనకు తాంత్రిక ధోరణులు గుర్తుకొస్తాయి.

అలాగే, లైంగికత విషయంలో యూదు-క్రైస్తవ దృక్పథం గురించి రచయిత ప్రస్తావిస్తాడు(పేజీ-180). మన దగ్గర ‘ఇనుప కచ్చడాలు కట్టుకున్న ముని మ్రుచ్చు’లన్నట్టుగానే, యూదు-క్రైస్తవ దృక్పథం కూడా శరీరాన్ని అన్ని విధాలా కష్టపెట్టుకోవాలనీ, కృశింపచేసుకోవాలనీ చెబుతుంది. అదే మనిషికి గొప్ప నైతికాదర్శమంటుంది. దేవతలు లైంగిక వాంఛకు అతీతులనీ, పవిత్రజీవితం గడిపినవారికే మరణానంతరం ఉత్తమగతి లభిస్తుందనీ అంటుంది. ఏకపక్షంగా ఈ అభిప్రాయాలను సమర్ధించేవారికి లైంగికతకు, మతానికి చాలా దగ్గర సంబంధం ఉందన్న సంగతిని అర్థమయ్యేలా చెప్పడం కష్టమంటాడు రచయిత.

లైంగికతకు, మతానికి ఉన్న ఈ ముడి గ్రీకు సమాజ, సంస్కృతులకే పరిమితం కాదని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మన దేశంతో సహా ప్రాచీన సమాజాలు, సంస్కృతులు అన్నిటా ఈ ముడి ఉంది. తాంత్రిక ధోరణుల గురించి పైన ప్రస్తావించుకున్నాం. కేవలం పురాచరిత్ర కోణం నుంచి ఒక్క మాటలో చెప్పాలంటే, ప్రాచీన సమాజాలు మతపరమైన తంతులో లైంగికతను కూడా భాగం చేసి, అక్షరాలా దానిని ‘సెలెబ్రేట్’ చేసుకున్నాయి. ఆధునిక కాలంలోనూ కొత్త కొత్త రూపాలలో ఈ ముడి కనిపిస్తూనే ఉంది. ఎన్నో ఆసక్తికరమైన అంశాలు ఉన్న ఈ కోణం గురించి చెప్పుకోవడం ప్రారంభిస్తే ఇప్పట్లో పైకి తేలడం కష్టం. కనుక ప్రస్తుతానికి వస్తే…

***

పన్నెండు రకాల కొడుకుల గురించి చెప్పిన పాండురాజు, ఔరసులతో అన్ని విధాలా తులతూగే క్షేత్రజులను తనకు సంతానంగా ఇమ్మని కుంతిని కోరాడు. ఔరసుడి నుంచి అపవిద్ధుడి వరకూ ఉన్న ఆరు రకాల కొడుకులూ బంధువులే కాక దాయాదులు కూడా అవుతారన్నాడు. ఈ ఆరుగురిలోకి వచ్చే క్షేత్రజుడు, గూఢోత్పన్నుడు అనే రెండు రకాలవాళ్లూ నిజభర్తకు కలిగినవారు కాదు. అయినా సరే, వారు బంధువులే కాక, ఆస్తి హక్కు కలిగిన దాయాదులు కూడా అవుతారని చెప్పడం ద్వారా పాండురాజు వీరిని పూర్తి స్థాయిలో ఔరసులుగా గుర్తిస్తున్నాడు. మిగిలిన ఆరు రకాల వాళ్ళలో కూడా కానీనుడు, సహోఢుడు, పౌనర్భవుడు అనే ముగ్గురు కూడా నిజభర్తకు కలిగిన వాళ్ళు కాదు. పాండురాజు వీరిని బంధువులుగా గుర్తిస్తున్నాడు. ఇప్పటి వారసత్వ చట్టం గురించి నాకు అంతగా తెలియదు కానీ, అందులో ఇంత సడలింపు ఉంటుందని మాత్రం నేను అనుకోను. తెలిసినవారు చెప్పాలి.

ఈ ‘క్షేత్రజుడు’ అనే మాట పుట్టుక గురించి నా ఊహలు పరి పరి విధాలుగా పోయాయి. సంతానం కనే స్త్రీని క్షేత్రంగా, సంతానాన్ని ఇచ్చే పురుషుని బీజంగా, లేదా విత్తనంగా చెప్పడం ఉంది. ఈ క్షేత్ర, బీజాల పోలిక వ్యవసాయం విస్తరిస్తున్న దశకు చెందినదని అనిపిస్తుంది. మగవాడి చేయి పైన, స్త్రీ చేయి కింద అవడం కూడా అప్పటినుంచే నని పురాచరిత్రకారులు అంటారు. ఈ క్షేత్రం, బీజం అనే మాటలు కూడా వ్యవసాయానికి చెందినవే. స్త్రీ, పురుష సంబంధాలతో సహా మొత్తం సమాజ, సాంస్కృతిక జీవితం మీద వ్యవసాయసంస్కృతి ఎంత లోతైన ప్రభావం వేసిందో చెప్పడానికి ఇదొక ఆధారం కావచ్చు.

 

పంటను ఇచ్చే వ్యవసాయభూమి క్షేత్రమైనట్టే, సంతానాన్ని కనే స్త్రీ కూడా క్షేత్రం అయింది. ఆవిధంగా వాటి మధ్య పోలిక కుదిరింది. వ్యవసాయభూమిలానే స్త్రీని కేవలం క్షేత్రంగా గుర్తించడమంటే ఏమిటన్నమాట? వ్యవసాయభూమి ఏ ఒకరి యాజమాన్యం కిందో ఉండకుండా ఉమ్మడి వనరుగా ఉన్న దశ ఉందనుకుందాం. అప్పుడు ఆ భూమిలో విత్తు నాటిన వాడికే పంట మీద హక్కు ఉన్నట్టుగా; స్త్రీ క్షేత్రంలో బీజావాపన చేసినవాడికే సంతానం మీద హక్కు ఉంటుంది. శర్మిష్ట కథలో చెప్పుకున్నట్టుగా, ఋతుమతి అయిన స్త్రీకి వివాహంతో సంబంధం లేకుండా సంతానం పొందే హక్కు ఉందనుకుంటే, తన క్షేత్రంలో పుట్టే సంతానం మీద ఆ దశలో ఆమెకే హక్కు ఉండడానికీ అవకాశం ఉంది. గంగా-శంతనుల కథలో తనకు పుట్టే సంతానాన్ని ఏమైనా చేసుకునేలా శంతనుడితో గంగ ఒప్పందం చేసుకోవడమే చూడండి. అంటే ఆమె తన క్షేత్ర హక్కును స్థాపించుకోదలచిందన్న మాట. ఎస్.ఎల్. భైరప్ప ‘పర్వ’ నవలలో ఇచ్చిన అన్వయాన్ని బట్టి చూస్తే, గంగ తనకు కలిగిన ఏడుగురు సంతానాన్నీ తన దగ్గరే ఉంచుకుని; ఎనిమిదో సంతానమైన భీష్ముని విషయంలో శంతనుడు అడ్డు చెప్పాడు కనుక అతన్ని శంతనుడికి ఇచ్చేసి, ఒప్పందం నుంచి తప్పుకుంది.

ganga-shantanu-mahabharat-indian-mythology-story1

ఇంకో సినేరియోను చూద్దాం. క్షేత్ర ప్రాధాన్యం, బీజ ప్రాధాన్యం అనే మాటలూ, వాటి గురించిన చర్చా సంప్రదాయవర్గాలలో కూడా కనిపిస్తాయి. ఎక్కడ ఏ ప్రాధాన్యాన్ని వర్తింపజేయాలన్నది ఒక్కోసారి చిక్కుముడిగా పరిణమిస్తుంది. ఉదాహరణకు, సత్యవతి-పరాశరుడు; అంబిక, అంబాలిక-వ్యాసుల సంబంధాన్నే చూద్దాం. వ్యాసుడు మత్స్యకన్యకు పుట్టినా, ఆయనను సంప్రదాయం ‘పరాశరుని కొడుకుగా’; లేదా ‘పరాశరుని కొడుకుగా కూడా’ గుర్తిస్తుంది. పరాశరుని వర్ణమే ఆయనకు ఇస్తుంది. అంటే అక్కడ బీజప్రాధాన్యం చెబుతోందన్న మాట. అదే, క్షత్రియులైన అంబిక, అంబాలికల దగ్గరికి వచ్చేసరికి వ్యాసుడి వల్ల వారికి కలిగిన చిత్రాంగద, విచిత్రవీర్యులను క్షత్రియులుగా చెబుతోంది. అంటే అక్కడ క్షేత్రప్రాధాన్యాన్ని చెబుతోంది. అలాగే, అంబిక దాసికి వ్యాసుడి వల్ల కలిగిన విదురుని దాసుడుగా, శూద్రుడుగా చెప్పడంలో కూడా క్షేత్రప్రాధాన్యమే ఉంది.

దీనినిబట్టి ఒకటి అనుకోవాలి: పురుషుడు కేవలం సంతానం కోరి ఒక స్త్రీ క్షేత్రాన్ని ఆశ్రయిస్తే, అందుకు ఆమె ఒప్పుకుంటే ఆ సంతానం పురుషుడికే చెందుతుంది. అక్కడ బీజప్రాధాన్యం వర్తిస్తుందన్న మాట. తెలుగు భారతంలో పరాశరుడు సంతానం కోసమే సత్యవతి పొందు కోరినట్టు లేకపోయినా (నేను సంస్కృత భారతం ఇంకా చూడలేదు) సత్యవతి-పరాశరుల సంబంధాన్ని భైరప్ప ఇలాగే అన్వయిస్తారు. ఒకవేళ పురుషుడు కేవలం లైంగిక సుఖం కోసమే స్త్రీతో సంబంధం పెట్టుకుంటే, అప్పుడు ఆ స్త్రీ కనే సంతానం ఆమెకే, అంటే క్షేత్రానికే చెందుతుంది. గంగా-శంతనుల సంబంధం నిజానికి అలాంటిదిగానే కనిపిస్తుంది. చిత్రాంగద, విచిత్రవీర్యుల విషయానికి వస్తే, తన కోడళ్ళకు సంతానం ఇమ్మని వ్యాసుని సత్యవతి నియోగించింది కనుక, ఆ సంతానానికి క్షేత్రప్రాధాన్యం కలిగి వారు క్షత్రియులయ్యారు. ప్రస్తుత సందర్భంలో పాండురాజు కూడా క్షేత్రపద్ధతిలో సంతానం ఇమ్మని కుంతిని అడుగుతున్నాడు కనుక, అంటే నియోగిస్తున్నాడు కనుక ఆ సంతానం అతనికే చెంది, అతనిలానే క్షత్రియులవుతారు.

వ్యవసాయభూమిపై ఉమ్మడి యాజమాన్యం పోయి వ్యక్తిగత యాజమాన్యం ఏర్పడిన దశలో సినేరియో కొంత మారుతుంది. భూయజమాని తన క్షేత్రంలో తను పండించుకోవచ్చు, లేదా ఇంకొకరికి తన క్షేత్రాన్ని అద్దెకు ఇవ్వచ్చు. అప్పుడు క్షేత్రానికి యజమాని వేరొకరు అయినా పంట, పండించినవాడిదే అవుతుంది. వ్యవసాయ క్షేత్రానికి, స్త్రీ క్షేత్రానికి ఉన్న పోలికే పూర్వుల దృష్టిని ప్రముఖంగా ఆక్రమించుకుందనీ, వ్యవసాయక్షేత్రానికి వర్తింపజేసిన నీతినే యథాతథంగా స్త్రీ క్షేత్రానికీ వర్తింప జేశారనీ అనేక ఉదాహరణలను గమనిస్తే అనిపిస్తుంది.

ఇక, క్షేత్రం అనే మాట మరో సందర్భంలో కూడా కనిపిస్తుంది. అది: ‘పుణ్యక్షేత్రం’ అనడంలో. దేవాలయం ఉన్న చోటును పుణ్యక్షేత్రం అంటాం. ఇంతకీ వ్యవసాయక్షేత్రం, స్త్రీ క్షేత్రం, పుణ్యక్షేత్రం అనే ఈ మూడు క్షేత్రాలకూ మధ్య ఏమైనా ముడి ఉందా? ఉన్నట్టే కనిపిస్తుంది. లైంగిక సంబంధాన్ని, పునరుత్పత్తిని పూర్వులు మతకోణంలోంచి చూసి ఒక పవిత్రవిధిగా పరిగణించారు కనుక; వ్యవసాయ, స్త్రీ క్షేత్రాలు రెండూ పునరుత్పత్తికి చెందినవే కనుక ఆ రెండింటికీ పుణ్యక్షేత్రంతోనూ ఒక ముడి ఏర్పడింది. సౌభాగ్య(fertility)వర్ధనాలుగా వ్యవసాయ, స్త్రీ క్షేత్రాల మధ్య ఉన్న పోలికా, వాటిపై అభివృద్ధి చెందిన మతపరమైన తంతు, అందులో భాగమైన తాంత్రికతలో స్త్రీకి గల పాత్ర గురించి చెప్పుకోవలసింది చాలా ఉంది. ఇంతకు ముందు అనేక సందర్భాలలో చెప్పుకున్నట్టు వ్యవసాయం మనిషి చరిత్రలో ఒక కీలకమైన మలుపు. అంతకుముందు లేనంత అన్న పుష్కలత్వాన్ని వ్యవసాయం ఇచ్చింది. వ్యవసాయంతోనే స్థిరనివాసాలు ఏర్పడడం, జనాభా పెరగడం తదితర పరిణామాలు సంభవించాయి.

అయితే ఒకటి గుర్తుపెట్టుకోవాలి. వ్యవసాయం కోసం అడవుల్ని నరకడం, జనాన్ని వ్యవసాయంవైపు మళ్ళించడం, వ్యవసాయభూముల విస్తరణకు వీలుగా స్థిర జనావాసాలను ఏర్పాటు చేయడం అంత తేలికగా జరగలేదు. సామదాన దండోపాయాలను ఆశ్రయించవలసి వచ్చింది. వ్యవసాయాన్ని పవిత్రకార్యంగా సూచించే క్రమంలో దేవాలయం ఉన్న ప్రదేశం పుణ్యక్షేత్రం అయినట్టే; వ్యవసాయభూమి కూడా క్షేత్రం, అంటే పుణ్యక్షేత్రం అయింది. వ్యవసాయక్షేత్రాలు ఉన్న చోట దేవాలయక్షేత్రాలూ అవతరించాయి. సుమేరు, సింధు నాగరికతలలో వ్యవసాయభూములు దేవాలయ అధీనంలోనే ఉండేవి. ఏటా దేవాలయంలోనే పాచికలు వేసి భూములు పంచేవారు. మన దగ్గర కూడా దేవాలయాలకు మాన్యాలు కల్పించడం ఉంది. దేవాలయంలో ‘క్షేత్ర’పాలకులుగా కొందరు దేవతలు ఉంటారు. వ్యవసాయక్షేత్రాలకూ కాపలాదారులు అవసరమే.

ఇక స్త్రీ క్షేత్రానికీ, పుణ్యక్షేత్రానికీ ఉన్న ముడిని చూద్దాం. ఇందుకు దేవాలయాలలో మైథున చిత్రాలే గొప్ప సాక్ష్యం. సౌభాగ్య వర్ధనానికి- స్త్రీ, వ్యవసాయ, పుణ్యక్షేత్రాలు మూడూ కేంద్రాలే. సుమేరు, సింధు, గ్రీకు సహా ప్రాచీన సమాజాలు అంతటా దేవాలయాలలో ‘పవిత్ర వ్యభిచారం’ జరుగుతూ ఉండేది. దేవాలయాలలో శృంగారకేళి అన్న మాట వినడానికే మనకు ఈ రోజు చాలా కంపరంగా ఉంటుంది. కానీ లైంగిక క్రియకు, దేవాలయానికి ఒకే విధమైన పవిత్రత్రను ఆపాదించిన ప్రాచీనుల దృష్టిలో అది అపవిత్రం కాదు.

క్షేత్రంతోపాటు కలిపి చెప్పుకునే మరో మాట తీర్థం. ఈ తీర్థం కూడా సౌభాగ్యవర్ధన కేంద్రమే. పురాతన కాలంలో మతపరమైన ప్రతి పండుగా, ప్రతి ఉత్సవం, ప్రతి తీర్థక్షేత్రాలూ లైంగిక విశృంఖల సందర్భాలే. తీర్థాలు, తిరునాళ్ళలో ఇలాంటి ముచ్చట్లు ఇప్పటికీ చూస్తూనే ఉంటాం. ప్రముఖ రచయిత్రి లత ఆకాశవాణిలో పనిచేస్తున్నప్పుడు శివరాత్రికి పట్టిసీమ(ప.గో. జిల్లా) తీర్థానికి వెళ్ళి రాత్రివేళ కారులో తిరిగివస్తున్నప్పుడు గోదావరి గట్టు పొడవునా జంటలు కనిపించాయని రాశారు.

కోశాంబీ AN INTRODUCTION TO THE STUDY OF INDIAN HISTORY లో ఇలా అంటారు:

When local gods were adopted as relatives, attendants, incarnations, variants of Brahmin deities, while the locality coincided with or developed into a centre of production, or of trade, there arose great religious pilgrimage centers like Banaras, Mathura and Nasik (page-45)

(స్థానిక దేవతలను [బ్రాహ్మణీయ దేవతలకు] బంధువులుగా, సేవకులుగా, అవతారాలుగా, బ్రాహ్మణ దేవతలలోనే భిన్న రకాలుగా మలచుకున్న చోట్ల; అప్పటికే ఉత్పత్తి కేంద్రంగానో, వర్తక కేంద్రంగానో ఉన్న చోట్ల, లేదా ఆ దిశగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతాలలోనే బెనారస్, మథుర, నాసిక్ లాంటి గొప్ప యాత్రాక్షేత్రాలు అవతరించాయి)

                                                                                                   మిగతా వచ్చే వారం

-కల్లూరి భాస్కరం

Download PDF

4 Comments

  • Nageswara Rao says:

    “అదే, క్షత్రియులైన అంబిక, అంబాలికల దగ్గరికి వచ్చేసరికి వ్యాసుడి వల్ల వారికి కలిగిన చిత్రాంగద, విచిత్రవీర్యులను క్షత్రియులుగా చెబుతోంది. అంటే అక్కడ క్షేత్రప్రాధాన్యాన్ని చెబుతోంది. ”

    మహానుభావా !! అంబికకి- అంబాలికకీ వ్యాసుని వలన కలిగినవారు ఎవరు? విచిత్ర వీర్యుడు- చిత్రాంగదుడా !! మరి ధృతరాష్ట్రుడు- పాండురాజు ఎవరు దేవరా?!!!

    • కల్లూరి భాస్కరం says:

      “అదే, క్షత్రియులైన అంబిక, అంబాలికల దగ్గరికి వచ్చేసరికి వ్యాసుడి వల్ల వారికి కలిగిన చిత్రాంగద, విచిత్రవీర్యులను క్షత్రియులుగా చెబుతోంది. అంటే అక్కడ క్షేత్రప్రాధాన్యాన్ని చెబుతోంది. ”

      ధన్యవాదాలు…పై వాక్యంలో చిత్రాంగద, విచిత్రవీర్యులకు బదులు ధృతరాష్ట్ర, పాండురాజులని చదువుకోగలరు.
      ఇదే పొరపాటు మరోచోట కూడా దొర్లింది…
      ..”చిత్రాంగద, విచిత్రవీర్యుల విషయానికి వస్తే, తన కోడళ్ళకు సంతానం ఇమ్మని వ్యాసుని సత్యవతి నియోగించింది కనుక, ఆ సంతానానికి క్షేత్రప్రాధాన్యం కలిగి వారు క్షత్రియులయ్యారు” ఇక్కడ కూడా పైలానే సవరించుకోగలరని పాఠకులకు మనవి.

  • Saikiran says:

    ఈ సిరీస్‌లోనే గతంలో ఉటంకించిన ధార్తరాష్టృలుగా దుర్యోధనాదులు, కౌంతేయులుగా ధర్మరాజాదుల విషయాన్ని ఈ క్షేత్ర బీజా ప్రాధాన్యతలతో అన్వయించి చూసినా సరిపోలుతున్నది. కానీ, క్షేత్ర ప్రాధాన్యతతో పుట్టినా ధర్మరాజాదులు పాండవులుగానే ఎక్కువ ప్రాముఖ్యం పొందటం ఏమై ఉంటుందండి?

    • కల్లూరి భాస్కరం says:

      ధర్మరాజాదులు పాండవులుగా ఎక్కువ ప్రాధాన్యం పొందడంలో విశేషం ఏమీలేదు. అప్పటికి వ్యవస్థ పితృప్రాధాన్యం వైపు మళ్ళిపోయింది. లేదా మాతృ, పితృ ప్రాధాన్యాల సంధిదశలో ఉంది. ఆపైన కథకుడికి కూడా పితృప్రాధాన్యం నుంచి కథ చెప్పడమే ఇష్టం. నా వ్యాసాలలో దీని గురించి స్పష్టత ఇవ్వడానికి ప్రయత్నించాను. స్పందనకు ధన్యవాదాలు.

ఒక వ్యాఖ్యను

Your email address will not be published. Required fields are marked *

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)