మహాభారతంలో ఒక భౌగోళిక వివరం

Kalluri Bhaskaram-pic-a.prabhakar rao (5)

 

తనకు క్షేత్రజులను ఇమ్మని కుంతిని కోరుతూ పాండురాజు ఇంకో సంగతి కూడా గుర్తుచేశాడు…

అది, కుంతి చెల్లెలు శ్రుతసేన కూడా క్షేత్రజులను కనడం! కేకయరాజు శారదండాయని భార్య శ్రుతసేన. తనవల్ల పుత్రసంతానం కలగకపోవడంతో నియోగపద్ధతిలో సంతానం కనమని కేకయరాజు భార్యకు చెప్పాడు. అప్పుడు శ్రుతసేన పుంసవన హోమం చేయించి ఋత్విజుల ద్వారా ముగ్గురు కొడుకులను కంది.

అయితే, పాండురాజు ప్రతిపాదనకు కుంతి వెంటనే ఒప్పుకోలేదు. ‘నువ్వు భరతకులశ్రేష్ఠుడివి. నీకు మేము ధర్మపత్నులం. పరపురుషుని మనసులో ఎలా తలచుకుంటాం?’ అంది. ‘అదీగాక మా మీద నీ అనుగ్రహం ఉంటే సంతానం అదే కలుగుతుంది. అలాంటి ఒక పుణ్యకథను నేను పౌరాణికుల ద్వారా విన్నాను’ అంటూ ఆ కథ చెప్పింది.

“పూర్వం వ్యుషితాశ్వుడు అనే రాజు ఉండేవాడు. అతను పురువంశంవాడు. వంద అశ్వమేధయాగాలు చేశాడు. అతని భార్యపేరు భద్ర. వారికి సంతానం కలగలేదు. అతను భార్యతో విపరీతకామాసక్తితో నిరంతరం సంగమించేవాడు. దాంతో అతనికి రోగం వచ్చింది. ఆ రోగంతో కన్ను మూశాడు. భర్త వియోగాన్ని భార్య భరించలేకపోయింది. ‘నువ్వు లేకుండా నేను జీవించలేను. నేనూ నీతోనే వస్తాను. లేదా నీ లాంటి కొడుకులనైనా నాకు ఇవ్వు’ అంటూ భర్త శవాన్ని కౌగలించుకుని ఏడుస్తూ ఉండిపోయింది. అప్పుడా శవంలోంచి ఒక దివ్యవాణి వినిపించింది. ‘విచారించకు. నీకు కొడుకులు కలిగేలా వరమిస్తున్నాను. ఋతుమతి అయిన తర్వాత ఎనిమిదో రోజున గానీ, పద్నాలుగో రోజున గానీ శుచిగా పాన్పు మీద పడుకుని నన్ను తలచుకో’ అని చెప్పింది. ఆమె అలాగే చేసింది. అప్పుడామెకు ముగ్గురు సాల్వులు, నలుగురు మద్రులు- మొత్తం ఏడుగురు కొడుకులు కలిగారు”.

ఈ కథ చెప్పిన కుంతి,‘ఆ రాజులానే నువ్వు మమ్మల్ని అనుగ్రహించి సంతానం పొందు’ అని పాండురాజుతో అంది. పాండురాజు దానికి సమాధానం చెప్పలేదు. ‘వెనకటి కాలంలో స్త్రీలు పురుషుల అధీనంలో ఉండకుండా స్వతంత్రంగా వ్యవహరించేవారనీ, అఖిలప్రాణి సాధారణమైనధర్మం పాటిస్తూ ఋతుకాలం తప్పకుండా తమ తమ వర్ణాలలో స్వపురుషులతోనూ, పరపురుషులతోనూ కూడా సంబంధం పెట్టుకునేవా’రని అంటూ, ఉద్దాలకుని కథ చెప్పాడు. ఆ కథలో ఉద్దాలకుని భార్యను ఒక వృద్ధవిప్రుడు సంతానం కోసం కామించగా, ఆమె కొడుకు శ్వేతకేతుడు ఆగ్రహించాడు. ‘ఇకనుంచి స్త్రీలు పరపురుషులతో సంబంధం పెట్టుకోడానికి వీల్లేదనీ, అందువల్ల సకల పాపాలూ చుట్టుకుంటాయనీ, ఈ మేరకు తను కట్టడి చేస్తున్నాననీ, దీనిని మనుషులందరూ పాటించా’లనీ శాసించాడు.

కుంతి, పాండురాజుల మధ్య సాగిన ఈ కాస్త సంభాషణా అనేక ప్రశ్నలు రేకెత్తిస్తుంది. ఉదాహరణకు, నీ చెల్లెలు శ్రుతసేన భర్త నియోగంతో క్షేత్రజులను కందని కుంతితో పాండురాజు అన్న తీరు చూస్తే, తన చెల్లెలు ఎలా సంతానం కన్నదో అక్కకే తెలియదా అనిపించి, అసంబద్ధంగా కనిపిస్తుంది. లేదా, తన కోరికను సమర్ధించుకోవడం కోసం, తన చెల్లెలు సంగతిని కుంతికి పాండురాజు గుర్తుచేశాడనుకుంటే బహుశా అది రెండు సూచనలు చేస్తోంది: మొదటిది, క్షేత్రజులను కనడం అనే ఆనవాయితీ, అందులో తప్పు లేదన్న భావనా అప్పటికే పాతుకుని ఉండడం. రెండోది, కుంతి కన్యగా ఉన్నప్పుడు కర్ణుని కన్న ఉదంతాన్ని కూడా దృష్టిలో పెట్టుకుంటే ఆమె సామాజిక నేపథ్యంలో క్షేత్రజసంతానం ఏమంత ఆక్షేపణీయం కాకపోవడం. భైరప్ప తన ‘పర్వ’ నవలలో కూడా కుంతిది నిమ్నసామాజికవర్గంగా చిత్రిస్తారు. ఆమెకు ఒక తరం వెనకే, ఆమె కంటే ఉన్నత సామాజికవర్గంగా కనిపించే భరతకులానికి చెందిన క్షత్రియకుటుంబం నియోగ పద్ధతిని ఆశ్రయించి క్షేత్రజ సంతానాన్ని(వ్యాసుని ద్వారా అంబిక, అంబాలికలకు ధృతరాష్ట్ర, పాండురాజులు జన్మించడం)పొందిన మాట నిజమే. కానీ అప్పటికే ఉన్నత సామాజిక వర్గాలలో అది ఆక్షేపణీయంగా మారుతూ ఉండవచ్చు.

ganga-shantanu-mahabharat-indian-mythology-story1

అదే సమయంలో ఇంకొకటి జరుగుతూ ఉండచ్చు. అది,నిమ్నసామాజికవర్గాల ఊర్ధ్వచలనం(upward mobility). పాండురాజుకు కుంతిని ఇవ్వడం ద్వారా భరతకుల క్షత్రియులతో వియ్యమందుతున్న భోజకులకు(కుంతి దత్తత తండ్రి కుంతిభోజుడు భోజక తెగకు చెందిన యాదవుడు) కుంతి పుట్టింట కన్యగా ఉండి కొడుకును కన్న సంగతిని రహస్యంగా ఉంచవలసిన అవసరం కనిపించి ఉండవచ్చు. భైరప్ప అన్వయం ఇంచుమించు ఇలాగే సాగుతుంది.

నా అభిప్రాయంలో దీనిని మరోలా చూడవచ్చు: క్షేత్రజ సంతానం పట్ల కానీ, కన్యాగర్భం పట్ల కానీ ఉన్నత, నిమ్న సామాజిక వర్గాలలో(అలాంటి స్పష్టమైన విభజన నిజంగా ఉందనుకుంటే) ఎటువంటి అభ్యంతరాలు, లేదా ఆమోదాలు ఉన్నాయో మనకు కచ్చితంగా తెలియదు. మనకూ, వారికీ మధ్య; భిన్న కాలాలకు, విలువలకు చెందిన కథకుడు ఉన్నాడు. మన ఎదురుగా ఉన్నది; అతని అభ్యంతరాలను, లేదా ఆమోదాలను కూడా సూచించే వ్యాఖ్యాన రూపంలోని కథ మాత్రమే. అతని గుప్పిటి సందులలోంచి జారిపడే వాస్తవాల తునకలే మనకు ఆధారం. ఆ తునకల ఆధారంగానే కథను మనం పునర్నిర్మించుకోవాలి. కుంతి-పాండురాజుల సంభాషణలో క్షేత్రజుల గురించి జరిగిన చర్చ అలాంటి తునకలలో ఒకటి.

క్షేత్రజ సంతానాన్ని ఆక్షేపణీయంగా భావించడం ప్రారంభించిన ఉన్నత సామాజిక వర్గానికి పాండురాజు ప్రతినిధి అనుకుందాం. క్షేత్రజ సంతానం అంత ఆక్షేపణీయం కాకపోయినా, ఊర్ధ్వచలనంలో భాగంగా ఆ ఆనవాయితీనుంచి బయటపడాలనుకునే నిమ్నసామాజికవర్గానికి కుంతి ప్రతినిధి అనుకుందాం. అప్పుడు వారిద్దరి సంభాషణా కొంత అర్ధవంతంగా కనిపిస్తుంది. తమ స్థాయిలో క్షేత్రజ సంతానం గౌరవప్రదం కాదని పాండురాజుకు తెలుసు. తన అన్న ధృతరాష్ట్రుడికి అలాంటి అవసరం లేదన్న సంగతి అతని దృష్టిలో సహజంగానే ఉంటుంది. తను క్షేత్రజ సంతానం పొందితే సాటివారిలో తలవంపుగానే ఉంటుంది. కానీ ఒక దశలో అంతకంటే గత్యంతరం లేదని అతనికి అనిపించింది. క్షేత్రజ సంతానానికి కుంతిని ఒప్పించడంతోపాటు, బహుశా అంతకంటే ఎక్కువగా తను సమాధానపడడానికి అతను ఎక్కువ సమయం తీసుకోవలసి వచ్చింది. ఎక్కువ ఆలోచనా, ధైర్యమూ చేయవలసి వచ్చింది. సమర్ధింపులనూ ఆశ్రయించవలసి వచ్చింది. ఏకాంతంలో తన బాధను కుంతి దగ్గర వెళ్లబోసుకోవడం, పన్నెండురకాల కొడుకుల గురించి వివరించడం, క్షేత్రజులు ఔరసులకు ఏమాత్రం తక్కువ కారని అనడం, వెనకటి కాలంలో స్త్రీ-పురుష సంబంధాలు ఎలా ఉండేవో చెప్పడం, కుంతి చెల్లెలి ఉదాహరణను ప్రస్తావించడం -కుంతిని మానసికంగా సిద్ధం చేయడంగానూ, అంతకంటే ఎక్కువగా తను మానసికంగా సిద్ధపడే ప్రయత్నంగానూ కనిపిస్తుంది.

కుంతి సమస్య వేరు. తన సామాజిక నేపథ్యం రీత్యా క్షేత్రజసంతానం ఆమెకు అంత ఆక్షేపణీయం కాదు. ఆ విషయంలో స్వయంగా తనకే అనుభవం ఉంది కూడా. కానీ ఇప్పుడు తను భరతకుల క్షత్రియుల కోడలు. తన స్థాయి పెరిగింది. ఇప్పుడు మళ్ళీ క్షేత్రజ సంతానం వైపు మళ్లడం ఆమెకు స్థాయీ పతనంగా కనిపిస్తుంది. డానికి తోడు తోటికోడలు గాంధారి ఆమె కళ్ల ముందు ఉంటుంది. గాంధారికి క్షేత్రజ సంతానం కనవలసిన అవసరం లేదు. కనుక క్షేత్రజ సంతానం కనడం కుంతికీ సాటివారిలో తలవంపే. అయితే, పాండురాజుకులానే ఆమెకూ గత్యంతరం లేదని తెలుసు.

ఈ మొత్తం చర్చ అంతా ఎక్కడ ఎలా ప్రారంభమైందో మనం ఇంతకు ముందే చెప్పుకున్నాం. సంతానం లేని తనకు ఉత్తమగతులు ఉండవన్న పాండురాజు చింత నుంచి ఇదంతా ప్రారంభమైంది. అయితే, అంత స్పష్టంగా చెప్పకపోయినా ఇక్కడ ఆస్తిహక్కు, వారసత్వాల గురించిన చింత కూడా ఉంది. క్షేత్రజులు కూడా ఔరసుల లానే బంధువులు, దాయాదులు అవుతారని పాండురాజు అనడమే చూడండి. అలా అనడంలో ఆస్తిహక్కు గురించిన కోణమూ బయటపడుతూ ఉండచ్చు. ఈ కోణం నుంచి చూసినప్పుడు పాండురాజు-కుంతి సంభాషణ రూపంలో పైకి కనిపించే కథ వెనుక, కనిపించని కథ చాలా ఉందని అనిపిస్తుంది. కురు-పాండవుల మధ్య ఆస్తి పోరాటం తాలూకు మూలాలు అక్కడినుంచే ఉన్నాయని కూడా అనిపిస్తుంది. పాండురాజు-కుంతి సంభాషణలో కనిపించని టెన్షన్ చాలా ఉన్నట్టూ అనిపిస్తుంది.

వందల సంవత్సరాలుగా ప్రచారంలో ఉన్న పురాణ కథల విషయంలో ఒక సమస్య ఉంది. అవి కాలగతిలో ఒక విశ్వాసంగానూ; ప్రశ్నలకు, అనుమానాలకు, హేతుబద్ధతకు అతీతంగానూ ఘనీభవించిపోతాయి. వాటిని ఉన్నవి ఉన్నట్టుగా తీసుకోడానికి అలవాటుపడిపోతాం. వాటిని తార్కికంగానూ, హేతుబద్ధంగానూ పరిశీలించడం ఎప్పుడైతే ప్రారంభిస్తామో ఘనీభవస్థితి నుంచి అవి కరగడం ప్రారంభించి కొత్త కోణాలను బయటపెడుతూ కొత్త రూపాలు తీసుకుంటాయి.

ఏదో విధంగా తను సంతానవతి కావడం మినహా గత్యంతరం లేదని తెలిసినా, కుంతి భర్త దగ్గర వెంటనే బయటపడలేదు. తన వెనకటి సామాజిక నేపథ్యమూ, క్షేత్రజుని కనడంలో తనకున్న పాత అనుభవమూ ఆ క్షణంలో ఆమెను కెలుకుతూ ఉండచ్చు. మారిన తన సామాజికస్థాయి కారణంగా ఆమెలో కొంత జంకు, భర్త దృష్టిలో పలచనవుతానన్న భయమూ ఉండడం సహజమే. అందుకే భరతకుల శ్రేష్ఠుడవైన నీకు ధర్మపత్నులమైన మేము పరపురుషుని మనసులో ఎలా తలచుకుంటామంది. తనతోపాటు, సవతి అయిన మాద్రిని కూడా కలుపుకుంది. అంటే, ఈ విషయంలో మొత్తం బాధ్యతను తనొక్కతే తీసుకోడానికి కుంతి సిద్ధంగా లేదన్న మాట. మాద్రిని కూడా భాగస్వామిని చేస్తే తనపై ఉన్న చిన్నతనపు భారం కొంత ఆమెకు బదిలీ అవుతుంది. ఆ తర్వాత నియోగపద్ధతిలో నకుల, సహదేవులను కనడం ద్వారా మాద్రి ఇందులో పూర్తి భాగస్వామిని అయింది కూడా.

పాండురాజు వల్ల తమకు సంతానం కలిగే అవకాశం లేదని కుంతికి తెలుసు. అలాగే, తను పురుష సంపర్కంతోనే సంతానం కలుగుతుందని తెలియని అమాయకురాలేమీ కాదు. కనుక, నీ అనుగ్రహం ఉంటే మాకు సంతానం అదే కలుగుతుందని ఆమె అనడంలో అర్థంలేదు. భర్త కోరికను వెంటనే ఆమోదించి తను తేలికవకూడదనే ఉద్దేశంతో ఆమాట అన్నట్టు తెలుస్తూనే ఉంది. ఆపైన, ఆమె చెప్పిన కథ వల్ల ఆ ఉద్దేశం మరింత హాస్యాస్పదమైన మలుపు తిరిగింది. చనిపోయిన భర్తను కౌగలించుకుని భార్య ఏడుస్తూ సంతానం ఇమ్మని అడిగినట్టూ, అప్పుడు, నీకు సంతానం కలిగేలా వరమిస్తున్నానని భర్త కళేబరం నుంచి దివ్యవాణి పలికినట్టు, ఆమెకు ఏడుగురు కొడుకులు కలిగినట్టు ఆ కథ చెబుతోంది.

కాస్త లోతుగా పరిశీలిస్తే పైకి అమాయకంగా కనిపించే ఈ కథలో అతితెలివి దాగి ఉన్న సంగతీ అర్థమవుతుంది. చనిపోయిన భర్త కూడా భార్యకు సంతానం అనుగ్రహించగలడని కుంతి ముఖతా కథకుడు చెబుతున్నాడు. అంటే, భర్తకు దివ్యత్వం (దివ్యవాణి)ఆపాదిస్తున్నాడు. కానీ మరోవైపు, వ్యుషితాశ్వుని భార్యకు మనుష్య ప్రక్రియలోనే సంతానం కలిగిన విషయాన్నీ తనే బయటపెడుతున్నాడు. ఎలాగంటే, వ్యుషితాశ్వుడు పురువంశ రాజు. అతని భార్యకు కలిగిన ఏడుగురు కొడుకులలో నలుగురు సాల్వులు, ముగ్గురు మాద్రులు. అంటే వారు సాల్వ, మద్రతెగలకు చెందిన పురుషుల ద్వారా కలిగిన సంతానమన్న మాట. దీనినిబట్టి ఇందులో భర్త నియోగం కూడా లేదనీ, భర్త మరణించాక భార్య ఇతరుల వల్ల సంతానం కన్నదనీ తెలిసిపోతోంది. పైగా, ఋతుమతి అయిన తర్వాత ఎనిమిదవరోజు, లేదా పద్నాలుగవరోజు సంతానం పొందడానికి యోగ్యమైన సమయమన్న వివరాన్ని కూడా ఈ కథ చెబుతోంది. ఈ విధంగా కథకుడు ఎన్నోచోట్ల చేసినట్టుగా మనుష్యధర్మం మీదే దేవధర్మం లేదా దివ్యత్వం అనే ముసుగు కప్పి శ్రోతలను ఏమార్చే ప్రయత్నం చేస్తున్నాడు. అది ఎప్పటిలా విఫలయత్నంగా మారుతోంది.

అంటే ఏమిటన్నమాట? భర్త కోరికకు వెంటనే ఆమోదించనట్టు కుంతి కనిపిస్తూనే, ఆ కోరికకు అనుకూలించే కథే చెబుతోంది.

ఇక్కడినుంచి పాండురాజు అక్షరాలా స్త్రీ-పురుష సంబంధాల పురాచరిత్ర గురించి చెప్పడం ప్రారంభించాడు. వెనకటి కాలంలో స్త్రీలు పురుషుని అధీనంలో ఉండకుండా స్వతంత్రంగా వ్యవహరిస్తూ ఋతుకాలంలో ధర్మం తప్పకుండా స్వపురుషులతో, పరపురుషులతో సంతానం కనేవారని చెప్పడం దీనికి ప్రారంభం. ఆ తర్వాత ఉద్దాలకుని కొడుకు శ్వేతకేతు దానిని ఎలా నిషేధించాడో కూడా చెప్పాడు. నిషేధించినప్పుడు తను కుంతిని క్షేత్రజసంతానం కనమని అడగడం ఎలా పొసగుతుందనే ప్రశ్న వస్తుంది. దానికి పాండురాజే ఆ వెంటనే సమాధానం ఇస్తున్నాడు. శ్వేతకేతు నిషేధం మనుష్యజాతికి చెందిన స్త్రీల పరపురుష సంబంధానికి మాత్రమే వర్తిస్తుంది. అది పశుపక్షులకూ, ఉత్తరకురుభూములలోని వారికీ వర్తించదు. పశుపక్షులలోనూ, ఉత్తర కురుభూములలోనూ వెనకటి ధర్మమే అమలు జరుగుతోంది!

అదీ సంగతి…స్త్రీ-పురుష సంబంధాల పురాచరిత్రలో భాగంగా పాండురాజు వాటి ప్రాంతీయభేదాల గురించి కూడా చెబుతున్నాడు. అంతేకాదు, కుంతిని క్షేత్రజులను ఇమ్మని అడుగుతున్న పాండురాజు ఇప్పుడు భార్యల సహితంగా హిమాలయాలకు అవతల ఉత్తర కురుభూములలోనే ఉన్నాడు!

మహాభారతంలో స్పష్టమైన భౌగోళిక వివరాన్ని అందిస్తున్న ఘట్టాలలో ఇదొకటి.

పాండురాజు, అతని భార్యల ప్రయాణమార్గాన్ని ఒకసారి గుర్తుచేసుకుందాం. మన్మథక్రీడలో ఉన్న మృగదంపతులను అన్యాయంగా చంపిన తర్వాత, మగమృగం తనను శపించిన తర్వాత విరక్తుడై తపస్సు చేసుకోవాలనుకున్న పాండురాజు భార్యలతో కలసి ఉత్తరదిశగా ప్రయాణం సాగించాడు. నాగశైలాన్ని, చైత్రరథాన్ని, హిమవంతాన్ని దాటివెళ్ళాడు. సురులు, సిద్ధులు నివసించే గంధమాదన పర్వతం మీద కొంతకాలం ఉన్నాడు. అక్కడినుంచి మళ్ళీ బయలుదేరి ఇంద్రద్యుమ్న మనే కొలనునూ, హంసకూటాన్నీ దాటి ఎత్తైన శిఖరం కలిగిన శతశృంగం అనే పర్వతానికి చేరుకున్నాడు. అది కూడా సిద్ధులు, దేవతలు, యక్షులు నివసించే ప్రాంతం. ఆ శతశృంగంలోని ఉత్తరభాగంలో తపస్సు చేసుకుంటున్నాడు.

స్వర్గానికి వెళ్ళే మార్గంలోనే శతశృంగం ఉంది. దివ్యవిమానంలో వచ్చిపోయే దేవతలతో ఆ ప్రాంతం ఎప్పుడూ కోలాహలంగా ఉంటుంది. అప్పుడే ఊర్ధ్వలోకాలకు వెడుతున్న మునులు అతనికి కనిపించారు. ఆరోజు అమావాస్య కనుక బ్రహ్మను దర్శించడానికి బ్రహ్మలోకానికి వెడుతున్నామని చెప్పారు. పాండురాజు, భార్యలతో సహా వారి వెనక బయలుదేరేసరికి, మిట్టపల్లాలతో నిండిన ఈ మార్గంలో సుకుమారులైన కుంతీ, మాద్రులు నడవలేరనీ, అదీగాక ఇది దేవతలు వెళ్ళే మార్గాలనీ చెప్పి మునులు వారించారు. దాంతో పాండురాజు శతశృంగంలోనే ఆగిపోయి సంతానం కోసం ఆలోచన ప్రారంభించాడు.

అంటే, ఉత్తరంగా హిమాలయాలకు అవతల ఉన్న ప్రాంతాన్నే ఉత్తరకురుభూములు అంటారన్నమాట. హిమాలయాలకు ఇవతల ఉన్న ప్రాంతం కురుభూమి కనుక, అవతల ఉన్నవి ఉత్తర కురుభూములు అవుతాయి. పాండురాజు ఉన్న శతశృంగం ఉత్తరకురుభూములలో భాగమే. ఆ ప్రాంతమంతటా సిద్ధులు, యక్షులు, దేవతలు, మునులు నివసిస్తున్నారు. గమనించండి, అక్కడ ‘మనుషులు’ ఉన్నట్టు భారతం చెప్పడం లేదు.

పురాకాలంలో జాతులు, తెగల వర్గీకరణకు సంబంధించి ఇది ఒక ఆసక్తికరమైన వివరం. ఒకవిధమైన జీవనశైలిని, ఆచారాలను, ఆహారవిహారాలను పాటించేవారికి; భిన్నమైన జీవనశైలి, ఆచారాలు, ఆహారవిహారాలను పాటించేవారు తమకంటే పూర్తి భిన్నులుగా కనిపించడం సహజమే. అవి వారికి విచిత్రంగానూ, అద్భుతంగానూ కనిపించడం కూడా సహజమే. ఆ విలక్షణత వారికి ఒక మాంత్రికతను, మార్మికతను ఆపాదింప చేసేలానూ ఉండచ్చు. తమకంటే అన్నివిధాలా భిన్నులనే భావనతో వారిని వేరే పేర్లతో పిలిచి ఉంటారు. ముఖ్యంగా మన ప్రస్తుతాంశానికి సంబంధించి, అక్కడ స్త్రీ-పురుష సంబంధాలు కూడా కురుభూములలో కంటే భిన్నంగా ఉంటాయి.

శతశృంగంనుంచే స్వర్గానికి వెళ్ళే మార్గం ఉంది. అది కూడా మిట్టపల్లాలతో ఉంటుంది. అంటే, స్వర్గం మరెక్కడో లేదు, ఈ భూమి మీదే ఉందని ఈ వివరాలు చెబుతున్నాయి. హిమాలయాలకు అవతల ఉన్న ఈ ప్రాంతాలు ఇప్పుడు భౌగోళికంగా వేర్వేరు దేశాల పేర్లతో ఉండి ఉండవచ్చు. పాండురాజు ప్రయాణమార్గాన్ని సూచిస్తూ మహాభారతం పేర్కొన్న స్థలనామాల ఆధారంగా ఇప్పటి ప్రదేశాలను, దేశాలను గుర్తించడం ఎంతవరకు సాధ్యమవుతుందో నాకు తెలియదు. కానీ మనకు బాగా తెలిసిన హిమాలయాలను పేర్కొంది కనుక ఈ మొత్తం ఘట్టం భౌగోళిక సమాచారాన్ని ఇస్తున్నదనడంలో సందేహం లేదు.

మహాభారతంలో ఉత్తరకురుభూముల ప్రస్తావన, అదే స్వర్గమన్న సూచన, అక్కడ స్త్రీ-పురుషసంబంధాలు భిన్నంగా ఉంటాయన్న సంగతీ ఇక్కడ ఒక్కచోటే కాదు; చాలా చోట్ల వస్తుంది. ఆ వివరాలలోకి ఇప్పుడు పూర్తిగా వెళ్లలేం. కాకపోతే ఒక విషయం చెప్పుకోవాలి. పాండురాజు ప్రయాణ సమాచారం హిమాలయాలను కూడా దాటిపోయే మన పూర్వుల సంచార పరిధిని వెల్లడిస్తోంది. అంతేకాదు, ఆయా ప్రాంతాలు, మనుషులతో వారికి గల సంబంధాల వైశాల్యాన్నీ సూచిస్తోంది. దేశాలు, ప్రాంతాలు, మనుషుల మధ్య నేడు ఉన్నట్టు కృత్రిమమైన హద్దులు ఏవీ లేని కాలం అది. అటువంటి ఆ కాలం మన పూర్వుల దృష్టి వైశాల్యాన్ని ఎంత నిరవధికంగా పెంచి ఉంటుందో; రక రకాల ప్రాంతాలు, వ్యక్తులతో సంబంధాలు వారికి ఎటువంటి అనుభవాలు కలిగించాయో, వారి ప్రాపంచిక దృష్టిని ఏమేరకు ప్రభావితం చేసి ఉంటాయో-ఈరోజు అనేక హద్దులు, పరిమితులలో జీవించే మన ఊహకు అందడం కష్టం. మన పూర్వులు మనకంటే విశాలమైన, వైవిధ్యవంతమైన ప్రపంచాన్ని చూశారన్న చరిత్రకారుడు హెచ్.జి.వెల్స్ మాటలు నాకు ఎప్పుడూ గుర్తొస్తూ ఉంటాయి.

ప్రస్తుతానికి వస్తే, చివరిగా, కల్మాషపాదుడనే రాజు నియోగించడంతో, అతని భార్య వశిష్టుని వల్ల అశ్మకుడనే కొడుకును పొందిన ఉదంతాన్ని కూడా పాండురాజు కుంతికి చెప్పాడు. తర్వాత కుంతి నియోగపద్ధతిలో సంతానం కనడానికి అంగీకరించింది. తనకు పూర్వం దుర్వాసుడు ఇచ్చిన వరం గురించి చెప్పింది. ఆ మంత్రప్రభావంతో ఏ దేవతను ఆరాధించినా వారు వచ్చి తనకు సంతానం ఇస్తారనీ, ఎవరిని ఆరాధించాలో చెప్పమనీ అడిగింది. పాండురాజు యమధర్మరాజును ఆరాధించమని చెప్పగా కుంతి అలాగే చేసింది. అప్పుడు ఆమెకు ధర్మరాజు పుట్టాడు. ఆ తర్వాత వరసగా వాయుదేవుని వల్ల భీముడు, ఇంద్రుని వల్ల అర్జునుడు ఆమెకు కలిగారు. ఆ తర్వాత మాద్రి కోరగా కుంతి వరప్రభావం వల్ల ఆమెకు కూడా నకుల, సహదేవులు కలిగారు.

పాండవుల జననంలో కూడా మళ్ళీ తెలివిగా దేవధర్మం, మనుష్యధర్మాలను జోడించడం ఉంది. దానితోపాటు, మరికొన్ని విశేషాలు వచ్చే వారం…

-కల్లూరి భాస్కరం

Download PDF

3 Comments

 • mohan says:

  భాస్కరం గారూ’
  ఇంటరెస్టింగ్ గా నడుపుతున్నారు.
  ఆ స్వర్గం ఈ ప్రాంతంలో ఉండేదో తెలిస్తే బాగుంటుంది.

  మోహన్

  • కల్లూరి భాస్కరం says:

   ధన్యవాదాలు మోహన్ గారూ…తాము జీవించే పరిసరాలకు భిన్నంగా అందంగా కనిపించే ప్రాంతాన్ని లేదా ప్రాంతాలను పూర్వులు స్వర్గంగా భావించి ఉంటారు. ఈ స్వర్గం అనే కాన్సెప్టు బాబిలోనియన్లలోనూ, యూదులలోనూ, పురాతన ఐరిష్ ప్రజలలోనూ కూడా ఉంది. బహుశా పురాతన ప్రజలందరిలోనూ ఉంది. ‘దేవ’ అనే మాట రష్యన్లలోనూ కనిపిస్తుంది. మెద్వెదేవ్ రష్యా అధ్యక్షుడు అయినప్పుడు ఆ పేరు లోని దేవ్ మన సంస్కృత శబ్దమే ననీ ఆ పేరును సంస్కృతంలోకి మార్చుకుంటే అది మధుదేవ్ అవుతుందనీ అప్పుడే ఒక న్యూస్ ఐటెమ్ వచ్చింది. క్షత్రభాష(హిట్టైట్) ప్రాచీన సంస్కృతమని, రష్యన్ భాష ఆధునిక సంస్కృతమనీ బ్రెడరిక్ హ్రోజ్నీ అనే చెకొస్లవేకియన్ పండితుడు నిర్ధారించారు.

 • Mohan says:

  భాస్కరం గారూ

  నాకు తెలియని చాల ఇంటరెస్టింగ్ విశేషాలను తెలిపారు. థాంక్స్.

ఒక వ్యాఖ్యను

Your email address will not be published. Required fields are marked *

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)