సరే, గుర్తుచేయన్లే!

మానస చామర్తి

గుర్తొస్తూంటాయెపుడూ,

వలయాలుగా పరుచుకున్న మనోలోకాల్లో
నువు పొగమంచులా ప్రవేశించి
నా ప్రపంచాన్నంతా ఆవరించిన రోజులు,

లేలేత పరువాల పరవళ్ళలో
లయతప్పే స్పందనలను లాలించి
ఉన్మత్త యౌవన శిఖరాల మీదకు
వలపుసంకెళ్ళతో నడిపించుకెళ్ళిన దారులు ,

లోతు తెలీని లోయల్లోకి మనం
తమకంతో తరలిపోతూ
మలినపడని మంత్రలోకాల్లో ఊగిసలాడిన క్షణాలు-

నీకూ గుర్తొస్తాయా..ఎప్పుడైనా…

1540514_505395279575961_1379096292_o

శబ్దాలు సిగ్గుపడే చీకట్లో
అగణిత నక్షత్ర కాంతుల్ని
నీ చూపులతో నాలో వెలిగించిన రాత్రులు

కలిసి నడచిన రాగాల తోటల్లో
రాలిపడ్డ అనురాగపరాగాన్ని
దోసిళ్ళతో గుండెలపై జల్లి
నను గెల్చుకున్న త్రోవలు

గువ్వల్లా ముడుచుకున్న ఉడుకు తలపులన్నీ
గుండెగూడు తోసుకుని రెక్కలల్లార్చాక
ఆకాశమంత ప్రేమ పండించిన అద్వైతక్షణాలు –

సరే, గుర్తుచేయను. సరదాకైనా,
నీ జ్ఞాపకాల బలమెంతో కొలవను.

పసరు మొగ్గలు పూవులయ్యే వెన్నెల క్షణాలన్నింటి మీద
మనదీ ఓ మెరుపు సంతకముంటుందని మాటివ్వు చాలు.

-మానస చామర్తి

painting: Anupam Pal

Download PDF

19 Comments

 • nmraobandi says:

  జ్ఞాపకాల బలం కొలవనంటూనే …
  కొలిమిన కాల్చే ప్రయత్నం …
  మళ్ళీ సంతకం కోసం హామీ కోరడం …

  నిలువెల్లా విడమర్చిన మనఃఫలకం …

  with regards …

 • Prasuna says:

  చాలా బావుంది మానసా ..

 • కవిత అయితే చాలా బావుంది కానీ భావాన్ని భాష అవసరమైన దాని కంటే ఎక్కువ డామినేట్ చేస్తున్నట్టుంది, మానసా!
  :)

 • madhavi mirapa says:

  మానస గారు గొప్ప అనుభవాన్ని అందరికి అద్వైతం అయ్యేలా చెసారు. చాలా బాగా రాశారు. లోతు తెలియని వారిక్కూడా లోతుల్కోకి తిసికెళ్ళే అద్భుతమైన భావన.. వండర్ ఫుల్ …..

 • Thirupalu says:

  అందమైన కలకు అక్షరాలు పొదిగిన తీరు చాలా బాగుంది మానస గారు!.
  //అగణిత నక్షత్ర కాంతుల్ని// ‘ అగణిత ‘ అన్న మాట చాలా నచ్చింది.

 • చాలా బావుంది..

 • NS Murty says:

  అద్భుతమైన కవిత్వానుభూతిలోకి తీసుకెళ్ళారు మానసగారూ. హృదయపూర్వకమైన అభివాదములు.

 • Abdul hafeez says:

  మానస , ( సరే మానస గారు ), జ్ఞాపకాల పర్వత సానువుల పైకి, కలల ను పారేసుకున్న మైమరపు లోయల లోకి , పాదాలు నేలకు అంట కుండా ప్రయాణించిన అనుభూతి . ధన్యోస్మి.

 • Elanaaga says:

  పొగమంచులా ప్రవేశించి, కవితనంతా ఆవరించిన భావుకత, లాలిత్యం మీ కవితలోని ప్రత్యేకతలు. అక్కడక్కడ చక్కని సమాసాలే లేకుంటే కవితకు అంత అందం చేకూరేది కాదేమో. చాన్నాళ్ల తర్వాత మళ్లీ ఓ మంచి కవిత.

 • Abdul hafeez says:

  మానస, జ్ఞాపకాల పర్వత సానువుల పైకి , కలల ను పారేసుకున్న మైమరపు లోయల లోకి, పాదాలు నేలకు అంటకుండా ప్రయాణించిన అనుభూతి … చిరు చేదు చిగురాకు తీపి…!! ధన్యోస్మి.

 • “తనను గెల్చుకున్న త్రోవల్లో” మానస సంచారం ప్రేమాద్భుతం! “గుర్తు చేయను సరదాకైనా… నీ జ్ఞాపకాల బలమెంతో కొలవను” అనడానికి ఎంతో బలం కావాలి. వీడ్కోలు గీతంగానో, విరహవేదనగానో, విఫల మోహనంగానో తేలిపోకుండా మనోలోకాల్లోని పొగమంచును చల్లగా దృశ్యాదృశ్యంగా అక్షరాల్లోకి ఒంపిన ఈ కవిత.. ఇటీవలి కాలంలో నాకు బాగా నచ్చిన కవిత. “ఉన్మత్త యౌవన శిఖరాల మీదకు వలపు సంకెళ్ళతో నడిపించుకెళ్ళిన దారులు.., శబ్దాలు సిగ్గుపడే చీకట్లు, అనురాగపరాగాన్ని దోసిళ్ళతో గుండెలపై జల్లిన అద్వైత క్షణాలు…” వంటి గాఢమైన వ్యక్తీకరణలతో మానస ఓ అద్భుతాన్ని ఆవిష్కరించారు ఈ పద్యంలో. ఇన్నేళ్ళుగా చదివిన కవిత్వం పంచిన ఆనందాలు, భావోద్వేగాలకు అతీతంగా ఓ కొత్త అనుభవాన్ని ప్రసాదించేదే కొత్త కవిత్వం లేదా ఆధునిక కవిత్వం. ఈ కవిత సారంగలో ఓ “మెరుపు సంతకం”.

 • రాజశేఖర్ గుదిబండి says:

  “పసరు మొగ్గలు పూవులయ్యే వెన్నెల క్షణాలన్నింటి మీద
  మనదీ ఓ మెరుపు సంతకముంటుందని మాటివ్వు చాలు.”

  స్త్రీ సహజమైన లాలిత్యం కవిత లోని ప్రతి పదం లొనూ వినిపిస్తుంది….

  నిస్సందేహంగా ఈ కవిత సారంగ తలలో ఓ అందమైన తురాయి….

  అభినందనలు…..

 • మైథిలి అబ్బరాజు says:

  మధురలాలస – మోహనంగా ఉంది !

 • మణి వడ్లమాని says:

  “ఆకాశమంత ప్రేమ పండించిన అద్వైతక్షణాలు”
  బావుంది,సరే గుర్తు చెయ్యను అంటూ గుర్తుకొచ్చేలా చేసిన పదాల పొందిక తో నీ కవిత బావుంది. మానసా!! అబినందనలు

 • Mohita says:

  చాల బాగుంది మీ కవిత. చదువుతుంటే నా అనుభవాలే గుర్తు వచ్చాయి
  అంటే మీరు మనసును తట్టే రచన చేసారన మాట!

 • V. Krishna Moorthy says:

  Manasa Garu,

  మీ కవిత చాల చాల బాగుందండి. అభినందనలు మీకు.

 • karthik says:

  Awesome poetry:):)

 • Rekha Jyothi says:

  చాలా బావుంది మానస గారూ ,లేత రంగు చీరకు వన్నె తెచ్చే ముదురురంగు అంచులా , ప్రతీ వాక్యం లోనూ వెల్ సౌండింగ్ – పదం ఒకటి మెరుస్తూ , చాలా బావుంది.

ఒక వ్యాఖ్యను

Your email address will not be published. Required fields are marked *

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)