కవిత్వం వొక వర్షం, అందులో తడిసే ఆనందం తెలిసినప్పుడు!

10419479_10204326595991984_5763381120454654266_n

15న  పులికొండ సుబ్బాచారి “బాడిశ మొక్కబోయింది” ఆవిష్కరణ సభ

సుబ్బాచారి కవిత్వ సంపుటి కి అఫ్సర్ రాసిన ముందు మాట ఇది.

1

మొదలెట్టడం ఎప్పుడూ సమస్యే.. సుబ్బాచారి గురించి ఎక్కడ మొదలెట్టాలి?! నాకు ఇంకా కవిత్వం గాలి సోకని కాలంలో పుస్తకాల పురుగునై లైబ్రరీల మధ్యా, మనుషుల మధ్యా దాహార్తినై సంచరిస్తున్న  తొలి యౌవనకాలంలో తొలినాటి ఖమ్మం సాహిత్య మిత్రబృందంలో ఎప్పుడూ నవ్వుతూ కనిపించే వాడు సుబ్బాచారి. మా బంధం కవిత్వంతోనే మొదలైందో, సుబ్బాచారి కష్టజీవితం పట్ల నాకున్న ఇష్టంతో మొదలయిందో చెప్పడం కష్టం.

కాని, ఆ రోజుల్లో సుబ్బాచారిని చూడడం వొక ఆనందం. వొక ఉత్సాహం. వొక స్ఫూర్తి. తరవాతనే మొదలయింది మా సాహిత్య బంధం! ఇప్పటికీ మరచిపోలేని గుర్తులు ఖమ్మం రికాబ్ బజార్ స్కూలు వెనక కూర్చొని మేం అల్లుకున్న కవిత్వ కబుర్లు. వూరికి ఇంకో దిక్కున ప్రభాత్ టాకీస్ ఎదుట మా కోసమే అన్నట్టుండే వొక శిధిలమైన బెంచీ మీద రైళ్ళ రాకపోకల్ని గమనిస్తూ కలబోసుకున్న ఇంకేవో కబుర్లు. తిలక్ అన్నట్టు- “ఆ రోజుల్ని తలచుకున్నప్పుడల్లా ఆనందం లాంటి విషాదమో, విషాదం లాంటి ఆనందమో!” కాని, ఆనందమే ఎక్కువ అని చెప్పగలను.

సుబ్బాచారి క్రమంగా సుబ్బన్న అయిపోయాడు. అక్షరాలకు మించిన ఆ ఆత్మీయతే ఇవాళ తనని గురించి ఈ నాలుగు మాటలూ రాయాలని ఉత్సాహపెడుతోంది.

అవును, రాయాలి…శ్రమ సౌందర్యంలోంచి జీవితాన్ని నెగ్గుకు వచ్చిన సుబ్బన్న గురించి, పరిశోధన కోసమే జీవితాన్నీ, చాలా కాలం వరకూ కవిత్వాన్ని కూడా త్యాగం చేసిన సుబ్బన్న గురించి, కాలం కాని కాలంలో జీవితంలో అసలైన విలువల వెంట అమాయకంగా అదే అంకిత భావనతో సూటిగా వెళ్ళిపోతున్న సుబ్బన్న గురించి రాయాలి!

మొన్నా, నిన్నా సుబ్బన్న కవిత్వం చదువుతూ ఏమన్నా రాద్దామని కూర్చున్న వేళలోనే మార్క్వెజ్ మరణ వార్త నన్ను నిశ్శబ్దంలోకి నెట్టేసింది. వొక పాతిక ముప్పయ్యేళ్ళుగా చదువుతూ అనుభవిస్తూ పలవరిస్తున్న రచయిత కన్నుమూసినప్పుడు వాక్యాలు మొరాయిస్తాయి.

సుబ్బన్న గురించి రాస్తూ రాస్తూ నేను మార్క్వెజ్ లోకి వెళ్ళాల్సి వచ్చింది. అక్కడ కూడా సుబ్బన్నని చూసాను ఈ వాక్యాల్లో:

Ultimately, literature is nothing but carpentry. Both are very hard work. Writing something is almost as hard as making a table. With both you are working with reality, a material just as hard as wood. Both are full of tricks and techniques. Basically very little magic and a lot of hard work are involved.

ఆ రోజుల్లో సుబ్బన్నని గురించి నాన్నగారు అనే వారు: “చిత్రిక పట్టడం అలవాటైన చేతుల్లో కవిత్వం శిల్పం అవుతుంది. సుబ్బాచారి కవిత్వం మీద దృష్టి పెడితే మంచి కవిత్వ శిల్పి అవుతాడు.” అని!

 

2

 

కాని, వొకే దారిలో వెళ్ళనిస్తే అది జీవితం కాదు కదా!

సుబ్బన్న పరిశోధనలో చాలా దూరాలు వెళ్ళాడు. అతని పరిశోధన విలువని గుర్తించే స్థాయికి ఇంకా మన ప్రమాణాలు ఎదగలేదు. ఇక్కడ అంతర్జాతీయ వేదికల మీద మాట్లాడుతున్నప్పుడు, చర్చల్లో పాల్గొంటున్నప్పుడు ఆ పరిశోధన ఎంత విలువైనదో నాకు తెలుసు. శ్రమించే చేయి, చిత్రిక పట్టే ఆలోచనా, అంకితమైపోయే చిత్తం వున్నప్పుడు ఏ రంగమైనా “చిత్తం!” అనేస్తుంది. ఇంత కూడా విరామం లేకుండా పనిచేస్తూనే సుబ్బన్న ఇంకో కిటికీ రెక్క తెరచి పెట్టుకున్నాడు, కవిత్వం కోసం! అదీ కష్టమైన పని.

వొక రంగంలో నిలబడి, ఆ పరిభాషతో తలపడుతున్నప్పుడు కవిత్వమనే సున్నితమైన భాషలోకి రాకపోకలు అంత తేలిక కాదు మరి! కష్ట సాధ్యమైంది సాధించడమే సుబ్బన్న జీవన సారం! శ్రమ పాఠం! ఈ పుస్తకంలో ప్రతి పుటలో మీకు సుబ్బన్న అంతరంగం కనిపిస్తుంది. అతని వేదనల తరంగాలు మిమ్మల్ని తడిపేస్తాయి. కష్టజీవికి ఇరుపక్కలా వుండే వాడే నిజమైన కవి. నిజమే! కాని, కష్టజీవే కవి అయినప్పుడు ఆ కవిత్వం ఎలా వుంటుంది..అందులో పలికే హృదయం ఎలాంటి చప్పుడు చేస్తుంది…మీరే వినండి!

3

తెలుగు సాహిత్యంలో  మనం కష్టజీవుల గురించి మాట్లాడుతూనే వున్నాం. కాని, సాహిత్యంలో ప్రతిఫలించిన కష్టజీవులు చాలా మటుకు అమూర్త మానవులు – అంటే, నిర్దిష్టంగా ఫలానా రకం కష్టజీవి – శ్రీశ్రీ అన్నట్టు కుమ్మరిచక్రం, చేనేత మగ్గం, లేదా ఈ కవిత్వంలో సుబ్బాచారి చెప్తున్న బాడిస బతుకుల జీవన చిత్రం లాంటివి కచ్చితంగా చిత్రిస్తున్న వాళ్ళు అరుదు. ఈ నేపధ్యంలో కష్టజీవికి నిర్దిష్టమైన నిర్వచనం ఇస్తూ, ఆ కష్టానికి తగిన పరిభాషని నిర్మిస్తున్న కవిగా సుబ్బాచారి ఈ కవితా సంపుటిలో కనిపిస్తున్నాడు.

“బాడిస మొక్కబోయింది” అనే కవిత నా మటుకు నాకు ఆధునిక తెలుగు కవిత్వ చరిత్రలో వొక అరుదైన వ్యక్తీకరణ రెండు కారణాల వల్ల- 1) అంతకు ముందు మనం కవిత్వంలో విని వుండని వొక నిర్దిష్టమైన కులవృత్తి అస్తిత్వ వేదనని చెప్పడం, 2) ఏ కవిత ప్రత్యేకత అయినా వొక కొత్త వస్తు నిర్దేశం దగ్గిరనే ఆగిపోకూడదు. ఆ వస్తువు తనదైన కొత్త శిల్పాన్ని కూడా ఆవిష్కరించుకోవాలి. ఈ కవితలోని శిల్పాన్ని ఆత్మీయంగా చూసే చదువరికి వొక వుద్వేగ తీవ్రతని చిత్రిక పట్టే కొత్త భాష, పదచిత్ర నిర్మాణం అబ్బుర పరుస్తుంది.

కవిత ఎత్తుగడలోనే సుబ్బాచారి శిల్ప విన్యాసం కనిపిస్తుంది. “ఇంటి నిండా కంటి నిండా /కళని కుమ్మరించిన చెయ్యి”, “దంతే, గంటక, గొర్రు, కాడిమాను, బండిచక్రాలు, పందిరి మంచాలు, కార్నీసు దూలాలు” ఇవన్నీ అమర్చి పెట్టిన చెయ్యిని గుర్తు చేయాల్సి రావడంలో విషాదం వుంది. కాని, ఈ వస్తు సముదాయాన్నంతా గుర్తుచేయడం ద్వారా ఆ శ్రమజీవుల సౌందర్యాన్ని మాత్రమె కాకుండా, వారి జీవన ప్రాముఖ్యతని కావ్యబద్ధం చేసాడు సుబ్బాచారి. ఈ కవిత శిల్పంలో కూడా ఆ రెండు అంశాలు- సౌందర్యం, ఆ కులవృత్తి గతమైన జీవన ప్రాముఖ్యం కలిసి చేస్తున్న ప్రయాణం  వుంది. నిజానికి వొక దీర్ఘ కావ్యానికి కావలసిన సామాగ్రి ఇందులో వుంది.

బిడ్డలా సుబ్బాచారి కవిత్వ వ్యక్తిత్వంలో అది వొక కోణం మాత్రమే. ఈ సంపుటిలో సుబ్బాచారి ఇతర కవితలు అతని వున్న భిన్నత్వాన్ని చెప్తాయి. కవిత్వంలో వైయక్తిక కోణాన్ని దర్శించే పధ్ధతి వొక్కో కవికి వొక్కో విధంగా వుంటుంది. ఈ సంపుటిలో మొదటి కవిత “యుగళయానం” దీనికి వుదాహరణ. ఈ కవితలో నన్ను బాగా ఆకట్టుకున్న సందర్భమూ, వ్యక్తీకరణ:

 బిడ్డల కత్తి పడవలు ఒంటి మీద నడుస్తూంటే

తొణికిన తరంగాల దారి చెదరకుండా నిలబడింది.

 

వ్యక్తిగతమైన సందర్భాల్ని సాధారణీకరించి వాటికి కవిత్వ గౌరవాన్ని ఇవ్వడంలో సుబ్బాచారి నిబద్ధత కనిపిస్తుంది. ఇలాంటి కవితలు కవి దార్శనికతని కూడా చెప్తాయి. ఇలాంటిదే మరి కవిత “ తనువూ తనువూ మధ్య తనూభాష”. ఈ కవితలో చివరి వాక్యం “పెళ్లి ఒక ఉత్తుత్తి మిష” వొక జీవన సందర్భాన్ని తనదైన దృష్టితో చెప్పడం అంటే ఏమిటో చెప్తుంది. వృత్తి వొక సామాజిక సందర్భం అయితే, దాంపత్యం కౌటుంబిక వ్యక్తిగత సందర్భం. ఆ రెండీటి మధ్యా సమతూకమే దార్శనికత. సుబ్బాచారి కవిత్వంలో నాకు ప్రధానంగా కనిపించిన లక్షణం ఇదే!

4

ఈ సంపుటిలో సుబ్బాచారి కవిత్వ అనువాదాలు కూడా వున్నాయి. ప్రసిద్ధ ఉర్దూ కవి ఫైజ్ అహమద్ ఫైజ్ అంటే సుబ్బచారికి ప్రత్యేకమైన అభిమానం వున్నట్టు వుంది. అందులో ఆశ్చర్యమేమీ లేదు. బహుశా, జీవితాన్ని శ్రమజీవుల కోణం చూస్తూనే, అందులో ఇమడాల్సిన పద్య సౌందర్యాన్ని పోగొట్టుకోని అరుదైన కవిత్వ శిల్పి ఫైజ్. సుబ్బాచారి ఆ వారసత్వాన్ని నిలుపుకొనే ప్రయత్నంలో భాగంగా ఈ అనువాదాలు చేస్తున్నట్టు కనిపిస్తుంది. అంటే, తన కవిత్వ వ్యక్తిత్వాన్ని చిత్రిక పట్టే సాధనాలని నిర్మించుకునే దారిలో వాటి ఆసరాని తీసుకుంటూ ముందుకు వెళ్తున్నాడు సుబ్బాచారి.

అలాగే, ఇతర భారతీయ భాషల నించి చేసిన అనువాదాలు కూడా సుబ్బాచారి వ్యక్తిత్వంలో వొదిగే లక్షణాలతో వుంటాయి. ఈ అనువాదాల ద్వారా ఈ తరం కవులకి కవిత్వ అభ్యాసానికి సంబంధించిన పాఠం చెప్తున్నాడు సుబ్బాచారి.

కవిత్వం వొక వర్షం, అందులో తడిసే ఆనందం తెలిసినప్పుడు!

సుబ్బాచారికి ఆ ఆనంద రహస్యం తెలుసు.అందుకే, అతనికి చినుకు ఓనమాలు అర్థమవుతాయి. అయితే, ఈ వర్ష ధారలు బలపాలై నేల పలకతో సంభాషించినప్పుడే కవిత్వ వర్షానికి సార్ధకత అని కూడా సుబ్బా చారికి తెలుసు.

ఈ సారవంతమైన సార్ధకమైన కవిత్వ ధార సదా నిలిచి వుండాలని నా ఆకాంక్ష.

*

 

Download PDF

2 Comments

  • కపిలరాంకుమాr says:

    చక్కటి పుస్తకం..దాచుకునటానికి కాదు. చదువుకునటానికి (టానిక్‌)

  • balasudhakarmouli says:

    తక్కువ మాటల్లో ఎక్కువ ఆసక్తి కల్గినట్టు రాసారు గురువు గారు…. బాగుంది.

ఒక వ్యాఖ్యను

Your email address will not be published. Required fields are marked *

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)