ఎగిరే పావురమా ! – 4 వ భాగం

serial-banner4

( గత వారం తరువాయి )

నాల్గవ భాగం

పిన్ని కాడనుండి కదిలి, గుడికి తయారవుతుండగా, కొట్టాం బయట “సత్యమన్నా,” అని ఎవరిదో పిలుపు. ఇంత పొద్దున్నే ఎవరా! అనుకుని పిన్ని వంక చూసాను. తాత లేచి వెళ్ళి వారగా వేసి ఉన్న కొట్టాం తలుపు తీశాడు.

“నువ్వా వెంకటేశం? రా లోనికి రావయ్యా. నిజంగానే వచ్చావన్నమాట?” అంటూ ఒకతన్ని కొట్టాం లోనికి తెచ్చాడు. వచ్చినాయన చేతిలో ఒక చక్రాల పీట ఉంది.

“చంద్రమ్మా ఈడ చూడవమ్మా. ఇతనే వెంకటేశం. పక్క ఊళ్ళోనే ఉంటాడు. నడక రాని వారికి పనికొచ్చే బండ్లు, పీటలు చేస్తుంటాడు. వాటిని వాడే విధానం కూడా నేర్పిస్తాడు.
మన గాయత్రికి కూడా ఒకటి చేసి ప్రత్యేకంగా ఈ రోజు తెమ్మని అడిగాను. ఇంత పొద్దున్నే మన కోసం ఇలా వచ్చాడు,” అంటూ పిన్నిని పిలిచాడు తాత.

“వెంకటేశం, నువ్వు చేసిన పీట గాయత్రికి చూపిద్దాం. ఈ రోజు చిట్టితల్లి పుట్టినరోజు తెలుసా?” అంటూ అతని చేతిలోని పీట తీసుకొని, నేల మీద ఉంచాడు తాత.

జాలీ చెక్కపీటకి నాలుగు రబ్బరు చక్రాలు ఉన్నాయి. నేల మీద నుంచి పీట కాస్త ఎత్తుగానే ఉంది. ఒక పక్కగా చేత్తో పట్టుకోడానికి పొడవాటి పిడి బిగించి ఉంది.

“గాయత్రికి అది ఎలా పని చేస్తుందో చెప్పవయ్యా వెంకటేశా,” అన్నాడు తాత.

నేను, పిన్ని కూడా చాలా శ్రద్ధగా విన్నాము. కూసేపు ఆ పీట నాకు ఎంతగా పనికొస్తుందో, దాన్ని ఎలా వాడాలో, ఎలా నడపాలో, ఎలా ఆపాలో చెప్పాడు వెంకటేశం.
నా పుట్టినరోజుకి తాత తెప్పించిన చక్రాల పీట బాగుంది. నాకు నచ్చింది.

“తాత నీ గురించి అలోచించి అన్నీ చేస్తాడని చెప్పానా?” అంది పిన్ని నా చెవిలో.
కొద్దికాలం గుంటూరు ఆసుపత్రిలో నర్సుగా పనిచేశాడంట వెంకటేశం. ఈ పీటలు వాడే నా ఈడు పిల్లల కన్నా, నేను బలంగా, మెరుగ్గా ఉన్నానన్నాడు.

“ఆ దేవత కూడా కనికరిస్తే మా గాయత్రి అవిటితనం పోయి మాములుగా నడుస్తుందిలే, వెంకటేశం. ఆ ప్రయత్నమే చెయ్యాలి,” అంటూ వెంకటేశంని సాగనంపాడు తాత.

**

రోజూ దేవత కాడ నా సంగతి మొరెట్టుకో మన్నాడు తాత. ‘నేనూ అందరి మల్లే నడవాలని, మాట్లాడాలని’ ఆ దేవతని వేడుకోడం మొదలెట్టాను.
అట్టాగే ప్రతిరోజు చక్రాలపీట కూసేపు వాడుతుంటే అలవాటయి, కొట్టాంలో నా కదలిక సుళువయ్యింది. చిన్న పనులు నా అంతట నేనే చేసుకోడం మొదలెట్టాను.

సాయంత్రం కొట్టాంలో మెసులుతూ, దండెం మీద నుండి తీసిన బట్టలు మడతేస్తుండగా వచ్చింది చంద్రం పిన్ని. తన సంచి నుండి తాతకని తెచ్చిన మందులు తీసి తాత పడక కాడెట్టమని నాచేతి కిచ్చింది.
వాకిట్లోకెళ్ళి తాతకాడ కూకుని కబుర్లు చెబుతూ, నా కోసం చక్రాల పీట చేయించినందుకు తాతని మెచ్చుకుంది.

“అన్నా, చెప్పడం మరిచిపోతానేమో! రేపటి నుంచి గోవిందు అనే మరో రిక్షాబ్బాయి వస్తాడు. ఇప్పుడున్నోడిక్కూడా ఆటోరిక్షా వచ్చేసింది. ఇక అతను రాడు. ‘గోవిందు’ ని నేను చూసి మాట్లాడానులే అన్నా,” అని చెబుతూ లేచెళ్ళి – కంచాలు, మంచినీళ్ళెట్టి, మా కోసం చేసి అట్టే పెట్టిన సంకటి, చింతపండు మిరపకాయ పప్పు వడ్డించింది పిన్ని.
**
నా చక్రాల పీటని నాతో పాటే రిక్షాలో గుడికి తెచ్చుకోడం మొదలెట్టాను. పీట సాయంతో అరుగు చుట్టూ కొంత దూరం మెసలడం, నీళ్ళకి కొళాయి కాడికెళ్లడం చేస్తున్నా. అమ్మవారి గుడికాడికెళ్ళి, ప్రసాదాలు తెచ్చుకోడం కూడా చేస్తున్నా.

గుడికొచ్చే భక్తుల్లో నవ్వుతూ పలకరించి, ‘గాయత్రి’ అని రాసున్న చెక్క హుండీలో డబ్బులు వేసేవారు కొందరైతే, “ఇలా మూగ, కుంటిని కూర్చోబెట్టి పూజాసామాను అమ్మించాలా? పక్కనే మరో హుండీ కూడానా అడుక్కోడానికి?” అంటూ నా ముఖం మీదే అనేవారు మరికొందరు.
ఒక్కోప్పుడు  ఆ ఈసడింపులు, చీదరింపులు కష్టమనిపిస్తది.
**
కొత్త పుస్తకాల సంచీ తీసుకొని మూడింటికి వచ్చింది ఉమమ్మ. నా పక్కన కూకుని ఓ బొమ్మల పుస్తకం నాకందించి, నా చేతిలోని పలక, నోటు పుస్తకం తీసుకొని చూసింది.

“పర్వాలేదే, ముత్యాల్లా ఉన్నాయి అక్షరాలు. నా చేతివ్రాత కంటే నీది వందరెట్లు అందంగా ఉంది గాయత్రి.
మా అందరి పేర్లు కూడా రాయగలుగుతున్నావు,” అంటూ నా తల మీద తట్టింది ఉమమ్మ.

“సరే, ఇక నీ పూర్తి పేరు రాయడం కూడా నేర్చుకోవాలి. నీ పేరు చిన్నదే. మూడే అక్షరాలు. ‘గాయత్రి’ అని. పూర్తి పేరు అంటే మాత్రం నీ పేరు వెనక ‘సత్యం’ లేదా ‘సాయిరాం’ అని తాత పేరు కలిపి రాయాలి. ఇలా అన్నమాట,” అని ‘గాయత్రి సాయిరాం’ అని రాసి చూపింది ఉమమ్మ.

పేరు వినడానికి – బాగుందన్నారు అక్కడే ఉన్న తాత, రాములు.
‘అమ్మో’ ఇంత పొడుగు పేరా?’ అన్నట్టు చూశాను ఆమె వంక.
నా ముఖం చూసి ఉమమ్మ ఫక్కున నవ్వింది.
“అయినా పెద్ద తొందర లేదులే. మెల్లగా రోజూ చదువు అయ్యాకే పేరు రాయడం సాధన చెయ్యి,” అందామె.
నేనూ నవ్వేశాను.

“నీవు చదివే ప్రతి పాఠం మన స్కూల్లోని శ్రీనివాసు మాస్టారు సాయంతో నీ కోసం అలోచించి తయారు చేసేదే. నీ పరీక్షలు కూడా ఆయన పథకం ప్రకారమే జరుగుతాయి,” అంటూ నా చేతికిచ్చిన కొత్త బొమ్మల పుస్తకం తీసుకొని పేజీ తిరగేసింది ఉమమ్మ.

“ఈ పుస్తకంలో చూడు. ప్రతి పేజీలో బొమ్మ కింద రెండేసి వాఖ్యాలు – వివరణ ఉంటుంది, అన్నీ చిన్న మాటలే. మాటలు విరిచి గుణించుకుంటూ చదవచ్చు. ఇలా,” అని నా వేలుతో అక్షరాలని చూపుతూ నాకు తెలిసేలా చదివింది ఉమమ్మ.

“ఇలాటివే నంబర్లు వేసి మరో మూడు పుస్తకాలున్నాయి ఈ సంచిలో.
మొదటిది పూర్తయ్యాక, రెండోది చదవడం తేలికవుతుంది.
తరువాత మూడో పుస్తకం చదవగలిగే వరకు వస్తే నీకు చదవడం వచ్చేసిందన్నమాట. ఇక నీ తీరికని బట్టి సాధన చెయ్యి,” అంటూ కూడికలు, తీసివేతలు రాసిచ్చి, కొత్త పుస్తకాల సంచి కూడా నా చేతికిచ్చి రెండు రోజుల్లో వస్తానని చెప్పి వెళ్ళింది ఉమమ్మ.

illustration4

 

**

కొత్త పుస్తకం చదివే ప్రయత్నం సరదాగుంది. నాలో చదవాలన్న కోరిక పెరిగింది. పూలపని అవుతూనే వీలున్నప్పుడల్లా కొత్త బొమ్మల పుస్తకం చేత పట్టుకుంటున్నాను.

మొదట్లో కష్టమనిపించినా, ఎలా చదవాలో తెలిసింది. కాస్త సులువు వచ్చాక, మొదటి పుస్తకం సగమవ్వడానికి మూడు వారాలు పట్టింది.

**

రుద్రాక్షలు, రంగురంగుల పూసలతో నిండిన పళ్ళెం తెచ్చుకొని నా పక్కనే కూకుంది రాములు. పుస్తకం మూసేసి నేను కూడా వాటిని వేరు చేయడం మొదలెట్టాను.

“ఏమో, ఈ సారి ఉమమ్మిచ్చిన పుస్తకాలు వదలకుండా ఉన్నావే? ఎప్పుడూ నీ మొహంకి పుస్తకం అడ్డం. నీ పావురాళ్ళు కూడా అలిగి రాడం మానేస్తాయేమో సూడు,” అంది రాములు.

ఫక్కుమని నవ్వాను. ‘అయితే పుస్తకాల్లో మునిగి ఉంటున్నానని రాములు అలిగిందన్నమాట’ అనుకున్నాను.

‘నేను నీకు చదువు చెబుతాను. నా లాగా నువ్వూ పుస్తకాలు చదివేయచ్చు,’ అని సైగ చేసాను.

“నాకా? సదువా?” అంది రాములు. కొద్ది క్షణాలాగి, “మా అమ్మ చనిపోకుండా ఉంటే, అమ్మమ్మ కాడికి ఎళ్ళకుండా ఈడనే ఉండి సుబ్బి, మాణిక్యం లాగా బుద్ధిగా సదువుకునుంటే బాగానే ఉండేదిరా,” అంది నా జడ లాగి.
“అంతే కాదు, మా అమ్మమ్మ అతిగారాంతో, ‘ఆడపిల్లకి సదువేంది? ఏమవసరం?’ అని నన్ను పాడుచేసింది. నా కన్నా పెద్దోడు, నా మామతో కలిసి పుట్లెంట, గట్లెంట తిరిగి సెడాను… సదువు కాదు కదా, కనీసం వంటా-వార్పు అయినా వంటబట్టాయి కాదు నాకు,” అంది దిగులుగా రాములు.
ఆమె వంకే చూస్తూ ఆమె చెబుతున్నది వింటున్నాను.
“ప్చ్, ఎవర్నని ఏమి లాభంలే! అమ్మ, అమ్మ ప్రేమ, మంచి-చెడు సెప్పే అమ్మ ఆదరణ లేని జీవనం, అందుకే ఇలాగయ్యింది,” అని బాధపడుతూ తిరిగి పూసలు వేరుచేసే పనిలో పడింది రాములు.
**
శనివారం నాడు కొబ్బరులమ్మి పెందరాళే వచ్చాడు తాత. రాములికి, నాకు కాసిన్ని ద్రాక్షపళ్ళు తెచ్చాడు. కాళ్ళు చేతులు కడుక్కొనొచ్చి పైమెట్టు మీద నా పక్కనే చెట్టునానుకొని కూకున్నాడు.

“రాములూ, ఇలా రాయే. ఈ ద్రాక్షలు కడిగి ఇద్దరు తినండి,” అంటూ ఎనక్కి జారిగిలబడి కళ్ళు మూసుకున్నాడు.

ఐదు నిముషాలైనా రాములు రానేలేదు. నా కర్ర తీసుకొని చెట్టుకు కట్టిన గంటని మెల్లగా కొట్టాను. అవసరం వస్తే రాములు కోసం అట్టా పిలవడం నాకలవాటే.

మరో రెండు నిముషాలకి వచ్చింది రాములు. మొహం దిగులుగా ఉంది. తాతని, ద్రాక్షని చూపెట్టా. ద్రాక్ష తీసుకొని లోనికెళ్ళి కాసేపటికి తాతకి టీ కూడా తెచ్చింది.
నాకు ద్రాక్ష, తాతకి టీ గ్లాసు అందించి తాత కాడనే కూకుంది.

“ఏమయిందే రాములు? బాగా ఏడ్చినట్టున్నావు. నీ పెనిమిటి సంగతేమయింది?” టీ తాగుతూ రాముల్ని అడిగాడు తాత.

బొళ్లున ఏడ్చేసింది రాములు. “వాడికి వ్యాధి ముదిరిందంటయ్యా. వాడి రెండో భార్య వాడి కాడ డబ్బులు తీసుకోడమే కాని, వాడి సంగతే పట్టించుకోదంట. మామని ఎవరితోనూ కలవనివ్వదంటయ్యా.
మామని చూడ్డానికి, చివరికి నేనెల్లినా, వాడ్ని చంపేస్తానందంటయ్యా,” అంది వెక్కుతూ ఆమె.

“బంగారం లాంటి నిన్ను పిల్లలు పుట్టలేదన్న పిచ్చి సాకుతో వదిలేసి, తెలిసి తెలిసి అసుమంటి దాన్ని మారు మనువాడితే, బాధలు పడక తప్పుతాదా? అది మాత్రం కన్నదా పిల్లల్ని? లేదే.
పైగా ఇద్దరూ కలిసి తాగుడికి బానిసయ్యారంట. వాడి ఖర్మ. నువ్వు బాధపడమాకు. నీ చేతుల్లో ఏం లేదే,” అంటూ రాముల్ని ఓదార్చాడు తాత.
ఖాళీ అయిన టీ గ్లాసు పక్కకెట్టి నిముషం ఆగాడు..

“అయినా, నువ్వు కూడా మొండిగా, వయసులో పెద్దోడైన నీ మేనమామనే మనువాడుతానని గోలెడితివే? చదువుకోకుండా, మాటినకుండా నీ అయ్య పక్షవాతంతో మంచాన పడేవరకు బాధపెడితివి… ఇప్పుడు నువ్వేడుస్తుండావు. నీ కష్టం చూసి నా గుండె కలిచేస్తుంది రాములు,” అన్నాడు తాత బాధగా.

**

రెండు రోజులయినా రాములు దిగులుగానే ఉంది. ఆమెని మాట్లాడించాలనే ప్రయత్నం చేస్తున్నా.

రాములట్టా మాటలేకుండా ఉంటే రోజంతా అస్సలు తోచడం లేదు. చేసేది లేక ఇంకింతసేపు పుస్తకం చదవటం చేస్తున్నా.

రెండో పుస్తకం సగమయ్యేప్పటికి చుట్టూ ఉన్న ప్రపంచం అక్షరమయంగా తోచింది నాకు. ఎక్కడ అక్షరాలు కనబడ్డా చదవడం సంతోషంగా ఉంది. చిన్న సాదా మాటలు గుణించుకొనే పనిలేకుండా చదవగలను. ఇప్పుడు చిన్న తరగతి పుస్తకాలు చదివి, లెక్కలు కూడా చేస్తున్నా.
**
మరో రెండు ఎండాకాలాలు, రెండు చలికాలాలు గడిచాయి. నాకు పన్నెండేళ్ళు నిండాయి.
గడిచిన రెండేళ్ళల్లో నా చదువు విషయంగా ఉమమ్మ నన్ను మెచ్చుకొంది.
నా మీద నాకు నమ్మకం, ధైర్యం వచ్చాయి.
‘ఇప్పుడు నాకు మాట వస్తే కాస్త చక్కంగానే మాట్లాడగలను కూడా!’ ఉమమ్మకి మల్లే …..అనుకున్నాను.
ఏదైనా బాగానే చదవగలను. రాయగలను. పెద్ద పదాలు కూడా అర్ధమవుతున్నాయి.

ముందుగా నా వెనుక రావి చెట్టునున్న బోర్డుల మీద వివరాలు సుళువుగా చదివాను.
‘విన్నపము’ అని రాసున్న బోర్డు మీద నా పేరు, నా పేరుతో పాటున్న వివరాలు ముందుగా చదివాను……
‘గాయత్రి’ అనే ఈ అమ్మాయి – మాట, నడక లేని అభాగ్యురాలు. జీవనాధారం లేని ఈ చిన్నారికి వైద్య సహాయార్ధం దయతో మీ విరాళాన్ని ‘గాయత్రి’ హుండీలో వేయ ప్రార్ధన.
ధన్యవాదములు…. – ఇట్లు ఆలయ నిర్వాహకులు ….

అక్కడినుండే అందరికీ నా పేరుతో పాటు పూర్తిగా నా గురించి తెలుస్తుందన్న సంగతి అర్ధమయ్యింది.

పోతే, పైన ఉన్నది పూజా వస్తువుల వివరాలు, ఖరీదుల పట్టికలు, డబ్బు చెల్లించే పద్ధతి….

‘ఆలయ నిధుల కోసం పూజాసామగ్రిని మీ వీలు కోసం విక్రయిస్తున్నది గాయత్రి. వస్తువులు కొన్నవారు నిధులని పక్కనే ఉన్న ‘గుడి’ హుండీలో వేయ ప్రార్ధన – ఇట్లు ఆలయ నిర్వాహకులు’
ఆరు నెల్లక్కోసారి ఆ పలకలకి, బోర్డులకి రంగులు వేయించి తిరిగి కొత్తగా రాయిస్తుంటారు పూజారయ్య.
(ఇంకా ఉంది )

Download PDF

2 Comments

  • usha says:

    Hi Uma,
    Importance of imparting knowledge to the poor and the disabled has been
    tailored well in the serial. Good concept.

    Usha

    • Uma Bharathi says:

      Thanks Usha, and yes! the importance of being able to read and become aware of one’s surroundings is necessity.

ఒక వ్యాఖ్యను

Your email address will not be published. Required fields are marked *

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)