పాండవుల పుట్టుకపై చర్చ

Kalluri Bhaskaram-pic-a.prabhakar rao (5)

సంప్రదాయ పాఠం లేదా వివరణ విడిచిపెట్టిన ఖాళీలను గురించి ఇంతకుముందు చాలా ఉదంతాలలో చెప్పుకున్నాం. కొన్ని మరోసారి గుర్తు చేసుకుందాం:

యయాతి-శర్మిష్టల సంబంధమే చూడండి. వారిద్దరూ మనకు తెలిసిన అర్థంలో భార్యాభర్తలు కారు. యయాతి అధికారిక భార్య అయిన దేవయానికి శర్మిష్ట దాసి మాత్రమే. అయినాసరే, యయాతికి శర్మిష్టకు సంబంధం ఏర్పడి ముగ్గురు కొడుకులు కలిగారు. వారిలో చివరివాడైన పూరునికే రాజ్యాధికారం లభించింది. ‘నా యజమానురాలికి భర్తవు కనుక నాకూ నువ్వు భర్తవే’ అనీ,‘భార్య, పుత్రుడు, దాసి వారింపలేని ధర్మాలు’ అనీ శర్మిష్ట అన్న మాటలు సూటిగా ఉండి మనకు అర్థమవుతూనే ఉన్నాయి. ఇటీవలి అమెరికా సహా ఒకనాటి బానిస సమాజాలు అన్నిటా దాసిపై, లేదా బానిసపై కూడా యజమాని లైంగిక హక్కును చలాయించిన సంగతి మనకు తెలుసు కనుక, ఆనాడు శర్మిష్ట ఆ హక్కు గురించే మాట్లాడుతున్నట్టు మనం ఈరోజున తేలికగా పోల్చుకోగలం.

ఈవిధంగా శర్మిష్ట మాటల్లో కూడా పురాచరిత్ర వ్యక్తమవుతోంది.

విశేషమేమిటంటే, మహాభారత కథకుడు ఎంతో విలువైన ఈ పురాచారిత్రక సమాచారాన్ని దాచకుండా అందిస్తున్నాడు. అంతకన్నా విశేషం ఏమిటంటే, సాంప్రదాయిక వ్యాఖ్యాతలు యయాతి-శర్మిష్టల సంబంధం ఎలాంటిదో వివరించకుండా మౌనం పాటించడం!

ఇంకో ఉదాహరణకు వస్తే, సత్యవతి, కుంతి కన్యగా ఉన్నప్పుడే సంతానాన్ని కన్నారు. అయినా సరే, ఇద్దరిలో కొంత తేడా ఉందని చెప్పుకున్నాం. పరాశరుని వల్ల సత్యవతికి వ్యాసుడు జన్మించడం వెనుక దైవ సంబంధం కానీ, వరప్రభావం కానీ ఏమీ లేవు. పరాశరుడు ఒక మునే కానీ దైవం కాదు. కానీ కుంతి కర్ణుని కనడం వెనక దుర్వాసుని వరంతోపాటు సూర్యుడనే దైవం ఉన్నారు. సత్యవతి, కుంతి మధ్య ఎందుకు ఈ తేడా అంటే మనకు అర్థమయ్యేది ఒక్కటే…మహాభారత కథకుడు పాండవుల పక్షాన కథ చెబుతున్నాడు కనుక వారి తల్లి అయిన కుంతికి ఒక ప్రత్యేకతను లేదా విశిష్టతను ఆపాదిస్తున్నాడు.

ఇలాంటి తేడాయే; ద్రౌపదీ-జటిలుడనే ముని కూతురూ, అజిత అనే రాచకూతురుల మధ్య కూడా కనిపిస్తుంది. జటిలుని కూతురు పదకొండుమందినీ, అజిత అయిదుగురినీ పెళ్లిచేసుకున్నట్టే; ద్రౌపది కూడా అయిదుగురిని పెళ్లాడింది. కానీ జటిలుని కూతురూ, అజితల వివాహం వెనక ఎటువంటి వరాలు, శాపాలు, దైవ కారణాలు ఉన్నట్టు కథకుడు చెప్పలేదు. ద్రౌపది వివాహం వెనుకే అలాంటివి ఉన్నట్టు చెబుతున్నాడు. కారణం కుంతి విషయంలో చెప్పుకున్నదే. ద్రౌపది పాండవుల భార్య, తను పాండవుల పక్షాన కథ చెబుతున్నాడు!

ఇప్పుడు నియోగ పద్ధతిలో సంతానం కనడం గురించే చూడండి…తన కోడళ్ళు అంబిక, అంబాలికలకు నియోగ పద్ధతిలో సంతానం ఇమ్మని వ్యాసుని సత్యవతి ఆదేశించింది. వ్యాసుడు ఒక మునే తప్ప దైవం కాదు. కుంతికి దుర్వాసుడు ఉపదేశించినట్టుగా అంబిక, అంబాలికలకు, వారి దాసికి ఏ మునీ వచ్చి సంతాన మంత్రాన్ని ఉపదేశించలేదు. సహజప్రక్రియలోనే వారికి వ్యాసుని వల్ల సంతానం కలిగారు. తనకు దుర్వాసుని మంత్రం, సూర్యుని అనుగ్రహం ఉన్నప్పటికీ, సంస్కృత భారతం ప్రకారం కుంతి నవమాసాలు మోసే కర్ణుని కంది. దీర్ఘతముడు అనే ముని కూడా బలి అనే రాజు భార్యకు నియోగపద్ధతిలో, సహజప్రక్రియలోనే సంతానం ఇచ్చాడు. కల్మాషపాదుడనే రాజు భార్యకు వశిష్టుడు నియోగపద్ధతిలో, సహజవిధానంలోనే కొడుకును ఇచ్చాడు.

VanaParva

పాండురాజు కూడా నియోగ పద్ధతిలో తనకు సంతానం ఇమ్మనే కుంతిని అడిగాడు. ఆ విధంగా కలిగే సంతానం కూడా అన్నివిధాలా ఔరసునితో సమానమే నని కూడా అన్నాడు. నీకు ధర్మపత్నులమైన మేము పరపురుషుని ఎలా తలచుకోమని కుంతి అనడంలో కూడా, తను కనవలసింది స్త్రీ-పురుష సంపర్కం ద్వారా అందరూ కనే సంతానమే తప్ప మరొకటి కాదన్న సూచన ఉండనే ఉంది. తీరా అందుకు అంగీకరించిన తర్వాత, తనకు దుర్వాసుడు ఇచ్చిన వరాన్నీ, ఆ వరప్రభావంతో ఏ దేవుణ్ణి తలచుకుంటే ఆ దేవుడు వచ్చి తనకు సంతానం ఇస్తాడన్న వివరాన్నీ ఆమె పైకి తీసింది. ఏ దేవుణ్ణి తలచుకోమంటావో చెప్పమని పాండురాజును అడిగింది. అలా క్రమంగా ఆమెకు దైవ సంబంధం వల్ల ముగ్గురు కొడుకులు, మాద్రికి ఇద్దరు కొడుకులు కలిగినట్టు కథకుడు చెబుతున్నాడు.

తనకు నియోగపద్ధతిలో సంతానం ఇమ్మని అడిగినప్పుడు పాండురాజు దృష్టిలో ఉన్నది తను పుట్టిన విధానమే. అంబాలికకు నియోగపద్ధతిలో వ్యాసుని వల్ల తను ఎలా పుట్టాడో ఆ ప్రక్రియలోనే తనకు సంతానం ఇమ్మని అతను కుంతిని అడిగాడు. ఆ సంగతి మహాభారతంలోనే స్పష్టంగా ఉంది(ఆదిపర్వం, పంచమాశ్వాసం, 59). కుంతికి గల వరమూ, ఆ వరప్రభావంతో దేవతలు వచ్చి ఆమెకు సంతానం ఇచ్చే అవకాశమూ అతని దృష్టిలో లేవు. అతనికి అంతవరకూ వాటి గురించి తెలియదు కూడా. ‘పరపురుషుని ఎలా తలచుకుంటా’మని కుంతి అన్నప్పుడూ తనకు దుర్వాసుడు ఇచ్చిన వరం ఆమె దృష్టిలో లేదు. అంటే, పాండురాజు, కుంతీ కూడా ఆ సమయంలో కేవలం నియోగం గురించే ఆలోచిస్తున్నారు. తీరా నియోగానికి తను ఆమోదించిన తర్వాత దుర్వాసుని వరం గురించీ, దేవతల గురించీ కుంతి చెబుతున్నదంటే, ఆ మాటలు నిజానికి ఆమెవి కావు, కథకుడివి. కారణం స్పష్టమే. తను పాండవుల పక్షాన కథ చెబుతున్నాడు కనుక వారికి దైవసంబంధాన్ని ఆపాదించవలసిన అవసరం అతనికి కనిపించింది.

అదే సమయంలో కథకునిలోని వైరుధ్యాన్ని చూడండి…ఒకపక్క, కుంతికి సహజప్రక్రియలోనే సంతానం కలిగినట్టు తనే సూచిస్తున్నాడు. ఇంకోపక్క, దానికి మహిమను, దైవసంబంధాన్ని జోడిస్తున్నాడు…

***

మహాభారత కథకుని ప్రత్యేకతే అది. అతను నిజం దాచడు. కాకపోతే ఆ నిజంపై కల్పన అనే ఒక పారదర్శకమైన ముసుగు కప్పుతాడు. అందులోంచి నిజం కనిపించిపోతూనే ఉంటుంది.

పాండవుల పుట్టుకనే తీసుకోండి. కాస్త హేతుబద్ధంగా ఆలోచించేవారికి ఆ పుట్టుకపై తప్పనిసరిగా కొన్ని సందేహాలు కలుగుతాయి. భారత కథను ఉన్నదున్నట్టు తీసుకుంటూ విశ్వాసంలో భాగం చేసుకునే ఇప్పటివారికి, ఈ సందేహాలు ఈ కాలంలోనే పుట్టిన పెడధోరణిగా కనిపిస్తాయి. కానీ విశేషమేమిటంటే, పాండురాజు, మాద్రి మరణించిన తర్వాత కుంతి పాండవులను వెంటబెట్టుకుని కొందరు మునులతో కలసి హస్తినాపురానికి వచ్చినప్పుడు అక్కడి జనంలోనే కొందరికి పాండవుల పుట్టుకపై అనుమానాలు కలిగిన విషయాన్ని కథకుడు దాచకుండా చెబుతున్నాడు.

సంస్కృత భారతం ప్రకారం, పాండురాజు కన్నా గొప్పగా కనిపిస్తున్న వీరు అతని కొడుకులు ఎలా అవుతారని కొందరూ; కుంతి, మాద్రి పతివ్రతలు కనుక పాండురాజు కొడుకులేనని మరికొందరూ అనుకుంటే; పాండురాజు ఎప్పుడో శాపగ్రస్తుడైనప్పుడు ఇంత చిన్న వయసు పిల్లలు అతనికి ఎలా కలుగుతారని ఇంకొందరు అనుకున్నారట. అప్పుడు కుంతి వెంట వచ్చిన మునులే కాక, దేవతలు కూడా వీరు పాండురాజు కొడుకులే నని చెప్పారట. పాండవుల పుట్టుకను కొందరు అనుమానించిన సంగతిని మాత్రం తెలుగు భారతం పరిహరించింది.

శతశృంగం నుంచి పాండవులను హస్తినాపురానికి తీసుకొచ్చినప్పుడు వారి వయసు ఎంత అన్న విషయంలో కూడా సంస్కృత, తెలుగు భారతాల మధ్య తేడా కనిపిస్తుంది. పాండవులు ఒక్కొక్కరి వయస్సులలోనూ ఏడాది తేడా ఉందని చెబుతూనే, హస్తినాపురానికి వచ్చినప్పుడు ఆ అయిదుగురూ అయిదేళ్ళ వయసు వారిగానే కనిపించారని సంస్కృత భారతం చెబుతోంది. తెలుగు భారతం పాండవుల వయసులలో ఏడాది తేడా ఉందని అంటూనే హస్తినాపురానికి వచ్చేనాటికి ధర్మరాజు వయసు పదహారేళ్లని చెబుతోంది.

పాండవుల పుట్టుక గురించి సంప్రదాయవర్గాలలోనే ఎంతో చర్చ జరిగింది. ఆ వివరాలు చెప్పుకోవడం ఎంతో ఆసక్తికరంగా ఉంటుంది. ఇటీవలి కాలంలో ఈ చర్చకు తెరతీసిన తెలుగువారిలో ప్రముఖంగా చెప్పుకోదగిన వ్యక్తి, చారిత్రక దృష్టి నుంచి మహాభారతాన్ని అర్థం చేసుకోడానికి ప్రయత్నించిన పెండ్యాల వేంకట సుబ్రహ్మణ్యశాస్త్రిగారే. వారణాసి సుబ్రహ్మణ్యశాస్త్రిగారు తన ‘మహాభారతతత్త్వకథనము’లో పెండ్యాలవారి అభిప్రాయాలను ఖండించారు.

పెండ్యాలవారి వాదం ప్రకారం, పాండవుల జన్మస్థానమైన శతశృంగం నేటి టిబెట్టే. ఒక స్త్రీ అనేకులను పెళ్లాడే ఆచారం టిబెట్టులోనే ఉందని ఆయన అంటారు. అయిదుగురూ ద్రౌపదిని పెళ్ళాడడం ఎలా ధర్మబద్ధమని ద్రుపదుడు ప్రశ్నించినప్పుడు, మా పూర్వుల ఆచారాన్నే మేము పాటించదలచుకున్నామని ధర్మరాజు జవాబిస్తాడు. ఆ మాట టిబెట్టులోని ఆచారాన్నే సూచిస్తుందనీ పెండ్యాలవారు అంటారు. పాండవులు విదేశీయులే కాక, ధర్మరాజుకు విదేశీ భాష (టిబెట్ కు చెందిన భాష) తెలుసు నంటూ మహాభారతంలోని ఒక సందర్భాన్ని ఆయన ఉదహరించారు. అదేమిటంటే:

ధర్మరాజును ధృతరాష్ట్రుడు యువరాజుగా అభిషేకించిన తర్వాత అతను విపరీతమైన జనాదరణను పొందాడు. దుర్యోధనుడు దానిని సహించలేకపోయాడు. తండ్రి దగ్గర మొరపెట్టుకున్నాడు. పుత్రప్రేమకు లొంగిపోయిన ధృతరాష్ట్రుడు పాండవులను వారణావతం అనే ప్రాంతానికి వెళ్లమన్నాడు. పాండవులు కుంతితో కలసి వారణావతానికి బయలుదేరారు. అప్పుడు, హస్తినాపురంలో వారిని అభిమానించే జనం కూడా వారివెంట కొంత దూరం వెళ్లారు. అలాగే విదురుడు కూడా వెళ్ళాడు. అక్కడ ఉన్నవారికి వినిపించినా అర్థం కాని మాటలతో ధర్మరాజుకు విదురుడు కొన్ని విషయాలు చెప్పాడు. ఆ తర్వాత వెనక్కి వెళ్లిపోయాడు.

విదురుడు వెళ్ళిపోయిన తర్వాత కుంతి ధర్మరాజు దగ్గరికి వచ్చి, విదురుడు నీతో ఏం మాట్లాడాడు అని అడిగింది. ధృతరాష్ట్రుడు మీ హితం కోరేవాడు కాదనీ, మీకు అపకారం చేస్తాడనీ, ఆహారంలో విషం కలిపే అవకాశం, అగ్ని ప్రమాదం మొదలైన వాటిపట్ల అప్రమత్తంగా ఉండాలనీ; దుర్యోధనుని కుట్ర కనిపెడుతూ అందుకు చేయవలసిన ప్రతీకారాన్ని ఎప్పటికప్పుడు తెలియజేస్తూ ఉంటాననీ విదురుడు చెప్పినట్టు ధర్మరాజు తల్లితో అన్నాడు. విదురుడు ధర్మరాజుతో మాట్లాడింది విదేశీ భాషలోనే ననీ, అది టిబెట్ భాష కావచ్చుననీ పెండ్యాలవారు అంటారు.

అంటే ఆ భాష ధర్మరాజుకే కాక విదురుడికీ తెలుసునన్న మాట.

ఇంకా విశేషం ఏమిటంటే, ఇంద్రుని వల్ల అర్జునుడు ఒక్కడే కుంతికి పుట్టాడనీ, ధర్మరాజు, భీముడు ఆమెకు పుట్టలేదనే భావన కలిగించే వాక్యాలు సంస్కృత భారతంలో ఉన్నాయి. ‘బ్రహ్మచర్యవ్రతంలో ఉన్న పాండురాజుకు ధర్మదేవత ప్రత్యక్షంగా ధర్మరాజును పుట్టించాడు. అలాగే, మహాబలవంతుడైన భీముని వాయుదేవుడు ఇచ్చాడు. ఇంద్రుని వల్ల కుంతికే అర్జునుడు పుట్టాడు’ అని సంస్కృత భారతం(ఆది-అ 126)అంటోంది.

కుంతికి పృథ అనే పేరు ఉంది కనుక, పాండవులలో ఒక్క అర్జునుడికే పార్థుడనే(పృథ కొడుకు పార్థుడు అవుతాడు)పేరు ఉంది కనుక వాస్తవంగా కుంతికి పుట్టింది అతనొక్కడే కావచ్చునని పెండ్యాలవారి అనుమానం. యముడు, వాయువు తలచుకున్న వెంటనే కొడుకుల్ని ఇవ్వగా, ఇంద్రుడు ఏడాది పాటు తపస్సు చేస్తే కానీ కరుణించని సంగతిని ఆయన ఉదహరిస్తారు. ఇంకోచోట ఆయనే, పురాణ మునులలో ధర్ముడు, వాయువు అనే పేర్లతో ఇద్దరు మునులు; ఇంద్రుడు అనే పేరుతో ఇద్దరు మునులు ఉన్నారనీ, వీరి పేర్లతో ఋగ్వేదంలో సూక్తాలు కూడా ఉన్నాయనీ; కుంతికి ధర్మరాజు, భీముడు, అర్జునుడు ఈ మునుల వల్ల కలిగి ఉండే అవకాశం ఉందని అంటారు. భైరప్ప అన్వయం కూడా ఇంచుమించు ఇలాగే ఉంటుంది.

పెండ్యాలవారి వాదాలను ఖండించడంలో వారణాసి సుబ్రహ్మణ్యశాస్త్రిగారు ఇటువంటి హేతుబద్ధ పరిశీలన, గ్రంథస్థ వివరాల జోలికి వెళ్లకుండా మునులు, దేవతలు చెప్పిన మాటలనే ప్రమాణంగా తీసుకున్నారు. అంటే, ఆయన వాదనలో కేవలం విశ్వాసానిదే పై చేయి అయిందన్న మాట.

మరికొన్ని విశేషాలు వచ్చే వారం…

 

 

Download PDF

1 Comment

  • మన పురాణ కవులు ఏదీ దాచలేదు.కాని కొందరు హీరోలు ,దేవతల విషయంలో వాటిని సమర్థించెరు.అదీకాక కొన్నిఆచారాలు పూర్వం ఉండేవి.అవి ఇప్పటి సమాజ సూత్రాలు ,చట్టాల ప్రకారం మనం తప్పుగా భావిస్తున్నాము.అందువల్ల సనాతన పండితులు వాటిని ఎత్తిచూపించే రచనల్ని ఖండిస్తారు.

ఒక వ్యాఖ్యను

Your email address will not be published. Required fields are marked *

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)