పాలస్తీనా

అవ్వారి నాగరాజు

అవ్వారి నాగరాజు

నిదుర రాని రాత్రి ఒకలాంటి జీరబోయిన గొంతుకతో

వొడుస్తున్న గాయం మాదిరి, పోరాడే  గాయం మాదిరి

నిస్పృహ, చాందసం ఆవల

ఎక్కడో ప్రవాసంలో తన దాయాదులనుద్దేశిస్తూ నిరాఘాటంగా దార్వేష్ పాడుతూ  ఉన్నాడు

అతడి పాట చెవిని తాకి నెమ్మదిగా లోలోనికి  చురకత్తిలా  దిగుతున్నప్పుడు

తనలాంటి, తన కవిత్వంలాంటి ఒక తల్లి

తన తొలిప్రాయపు బిడ్డను కోల్పోయిన దుఃఖంలా

వేలి కొసలకు ఎన్నటికీ చెరగిపోని నెత్తుటి మరక

సమయం ఉపవాస మాసపు తెల్లవారుజాము-

మసీదు గోపురం చివర నుండి సన్నని వొణుకుతో జాగోమని జాగురూకపరిచే సుపరిచిత గొంతుక

ఈ రోజు ఎందుకో నా ముస్లీం మిత్రులను పేరుపేరునా కలవాలనిపిస్తోంది

ఒక వ్యధామయ ప్రయాసను దాటబోతున్న వాళ్ళలా

మృగ సదృశ్య సాయుధ హస్తం ముందర నిలబడి మరేమీ లేక వుత్తిచేతులతో తలపడబోతున్నవాళ్ళలా

ఒక్కొక్కరినీ పొదువుకొని ముఖంలో ముఖం పెట్టి పుణికి పుణికి చూడాలనిపిస్తోంది

ఒకరు పుడుతూనే పరాయితనాన్నిమోస్తున్న వాళ్ళు

వేరొకరు కాలుమోపడానికి కూడా చోటులేని  శాపగ్రస్తులు

నిర్నిద్రితమైన  దేహంతో కనలుతూ  రాకాసిబొగ్గులా  ఎగపోసుకుంటూ తెల్లవారుతున్న ఈ రాత్రి

రెండు సాదృశ్యాల నడుమ రెండు ఉనికిల నడుమ అగ్ని గోళంలా దహించుకపోతున్నప్పుడు

సింగారించిన నాలుగు అక్షరాలను కాగితాలమీద చిలకరించి  కవిత్వం రాయబోను

ఉదయాలు మరణంతో కొయ్యబారి ఆకాశానికి చావు వాసన పులుముకుంటున్నట్టూ

ఒక రోజునుంచీ ఇంకో రోజుకు దాటడానికి ఎన్ని దేహాలు కావాలో లెక్కకట్టి

ఒకానొక దానిని ఇది తొలి వికెట్టని ప్రకటించినట్టూ మాత్రమే  రాస్తాను

సరిగ్గా ఇలాంటి వేకువ జాములలోనే మొస్సాద్-రా మన ఇంటి తలుపు తట్టి

ఉమ్మడి దాడులలో  పెడరెక్కలు విరగదీసి  తలకిందులుగా వేలాడదీస్తారని రాస్తాను

గాజా – కశ్మీర్  తరుచూ పొరపడే పేర్లుగా నమోదు చేస్తాను

నేల మీద యుద్ధం తప్పనిదీ, తప్పించుకోజాలనిదీ అవుతున్న వేళలలో

విరుచుకపడే ధిక్కారాన్నే పుడమికి ప్రాణదీప్తిగా పలవరిస్తాను.

-అవ్వారి నాగరాజు

Download PDF

2 Comments

  • గాజా – కశ్మీర్ తరుచూ పొరపడే పేర్లుగా నమోదు చేస్తాను
    నేల మీద యుద్ధం తప్పనిదీ, తప్పించుకోజాలనిదీ అవుతున్న వేళలలో
    విరుచుకపడే ధిక్కారాన్నే పుడమికి ప్రాణదీప్తిగా పలవరిస్తాను.

    గుండెను మెలిపెట్టే ఈ హత్యాకాండ జరుగుతున్నా ఎవరికీ పట్టనట్టు ప్రపంచం నిద్ర నటిస్తోంది. దారుణం కదా?

  • -ఆర్.దమయంతి. says:

    “ఒకరు పుడుతూనే పరాయితనాన్నిమోస్తున్న వాళ్ళు

    వేరొకరు కాలుమోపడానికి కూడా చోటులేని శాపగ్రస్తులు”

    *- ఎక్కడ చూసినా ఇదే స్థితి. ఇదే ప్రజల గతి. బాగా చెప్పారు.

    “ఉదయాలు మరణంతో కొయ్యబారి ఆకాశానికి చావు వాసన పులుముకుంటున్నట్టూ”

    * కొందరికి అనుదినం
    అదొక నడుస్తున్న శవం
    కాదనలేం. కానీ, ఈ సమస్యకి దారేదీ?

ఒక వ్యాఖ్యను

Your email address will not be published. Required fields are marked *

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)