భయప్రాయం

index

 

 

కలం ఒంటి మీద

సిరా చెమట చుక్కలు గుచ్చుకుంటున్నాయి

గాలి బిగదీయకముందే

ఊపిరి ఆగిపోతున్నట్టయిపోతోంది

 

ఊగుతున్న నీడలేవో

నా మీద తూలిపడుతునట్టు

ఎన్నడూ చూడని రంగులేవో

నా ముందు చిందులేస్తున్నట్టు

ఎప్పుడూ ఊహించని ఉప్పెన యేదో

పక్కన యెక్కడో పొంచివున్నట్టు…

నేనకుంటున్నట్టు నా గుండె

కొట్టుకుంటున్నది నాలోపల కానట్టు,

నేననుకుంటున్నట్టు నేను ఇన్నాళ్ళు

వింటున్న అంతర్ స్వరం నాది కానట్టు,

నాలోంచి నన్నెవరో బయటికి నెట్టి

లోలోపల అంతా ఆక్రమించుకుంటున్నట్టు

నా కంటి రెప్పలు వేరెవరికో

కాపలా కాయడానికి వెళ్ళిపోయినట్టు

 

జీవనవేదన యేదో కొత్తగా

పుట్టి ఇన్సులిన్ సూదిలా చర్మంలోకి ఇంకుతున్నట్టు,

జంకెరగని నడక ఇప్పుడు

కొత్తగా తడబడుతున్నట్టు…

 

అవునేమో ఇది

మరొక మరణమేమో

అవునేమో ఇది

మరొక జననమేమో…!?

 

-దేవిప్రియ

***

(ఉ. 6.55 గం.లు, 27 మే, 2014)

Download PDF

3 Comments

  • నా కంటి రెప్పలు వేరెవరికో
    అవునేమో ఇది
    మరొక మరణమేమో
    అవునేమో ఇది
    మరొక జననమేమో…!?
    కాపలా కాయడానికి వెళ్ళిపోయినట్టు

    …sad.

  • “నాలోంచి నన్నెవరో బయటికి నెట్టి
    లోలోపల అంతా ఆక్రమించుకుంటున్నట్టు…” అన్వేషణే ప్రయాణమైన కవి. తనను తాను “పట్టుకోవడానికి” తిరిగి తనలోకే వెళ్ళిపోతున్నాడు. తనను తవ్వుకుంటున్నాడు. లోలోపల స్పృహిస్తున్న మార్పులకు చకితుడవుతూ.. చెదిరిపోతున్నాడు. లోపలి చిటారు కొమ్మల కొసల ఒంటరి పిట్టలా బిగుసుకుపోయి.. చిందులేస్తున్న రంగుల్నీ, పొంచివున్న ఉప్పెనల్నీ జనన మరణాల వర్ణాలతో పోల్చి చూస్తున్నాడు. జీవనవేదన యేదో కొత్తగా చర్మంలోకి ఇంకుతున్నప్పుడు తడబడిన అడుగుల కింద మరణాన్ని అణచిపెట్టి… సిరా చెమట చుక్కలు గుచ్చుకుంటున్నా మరొక జననాన్ని పాడుతున్నాడు. ఇంకా, తూలిపడే నీడల ఊడల మధ్య విక్రమార్కుడిలా… శ్రీశ్రీలా “శాంతములే కేకాంతముగా దిగ్భ్రాంతిలో మునిగి..” శైశవగీతి వినిపిస్తున్నాడా దేవిప్రియ “కంటిరెప్పలు వేరెవరికోకాపలా కాయడానికి వెళ్ళిపోయినట్టు” దడపుట్టిస్తున్న భయప్రాయంలో.. నిర్భయంగా?

  • -ఆర్.దమయంతి. says:

    నా కంటి రెప్పలు వేరెవరికో

    కాపలా కాయడానికి వెళ్ళిపోయినట్టు..

    – చాలా బావుంది భావ ప్రకటన. కాసింత చివుక్కుమనిపిస్తూ మనసుని

Leave a Reply to Anil అనిల్ అట్లూరి Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)