ఋతుమతీ పునః కన్యా…

 

Kalluri Bhaskaram-pic-a.prabhakar rao (5)

స్త్రీ-పురుషుల మధ్య సయోధ్య తప్పనిసరి. లేకపోతే సృష్టి జరగదు. అయితే, లింగభేదం వల్ల వారి మధ్య సంఘర్షణా ఒక్కొక్కసారి అనివార్యమవుతూ ఉంటుంది. స్త్రీ పురుషుణ్ణి తన చెప్పుచేతల్లో ఉంచుకోడానికి ప్రయత్నిస్తుంది. పురుషుడు ప్రతిఘటిస్తాడు. అలాగే స్త్రీని కట్టడి చేయాలని పురుషుడు ప్రయత్నిస్తాడు. స్త్రీ ప్రతిఘటిస్తుంది. ఇద్దరి మధ్యా ఒక వ్యూహాత్మక, నిశ్శబ్ద పోరాటం నిరంతరం జరుగుతూనే ఉంటుంది. అదే సమయంలో వారి మధ్య సర్దుబాటు క్షణాలూ ఉంటూ ఉంటాయి. ఇలా చూసినప్పుడు స్త్రీ-పురుషుల చరిత్ర సమస్తం సయోధ్య-సంఘర్షణల చరిత్రే.

నాకీ సందర్భంలో ప్రసిద్ధ కథకుడు ఓ. హెన్రీ రాసిన ఒక కథ గుర్తొస్తోంది. పేరు గుర్తులేదు కానీ విషయం మాత్రం గుర్తుంది. కాకపోతే వివరాలలో ఒకింత తేడా వస్తే రావచ్చు:

కాయకష్టం చేసుకుని జీవించే ఒక పల్లెటూరి జంట. వారు ఎప్పుడూ కీచులాడుకుంటూనే ఉంటారు. భర్త ఓ ఉద్రేక క్షణంలో ‘నీకు విడాకులు ఇచ్చేస్తా’నని భార్యతో అంటాడు. ‘మరీ మంచిది, నేనూ అదే కోరుకుంటున్నా’నని భార్య అంటుంది. ‘అయితే, విడాకులు మంజూరు చేసే జడ్జి దగ్గరకు వెడదాం పద’ అంటాడు. ఇద్దరూ బండి కట్టుకుని పట్నానికి బయలుదేరతారు. జడ్జి ఇంటికి వెడతారు. భార్య వల్ల తను ఎలా కష్టాలు పడుతున్నాడో భర్త చెబుతాడు. భర్త తనను ఎలా కాల్చుకుతింటున్నాడో భార్య చెబుతుంది. మాకు విడాకులు ఇప్పించండని ఇద్దరూ అడుగుతారు.

‘మీకు విడాకులు మంజూరు చేస్తాను. అయితే, దానికి ఇంత రుసుము చెల్లించాలి(ఆ రుసుము అయిదురూపాయలు అనుకుందాం). ఆ డబ్బు మీ దగ్గర ఉందా?’ అని జడ్జి అడిగాడు.

భర్త దగ్గర సరిగ్గా అయిదు రూపాయలే ఉన్నాయి. చొక్కా జేబులోంచి అయిదురూపాయల నోటు బయటకు తీసి జడ్జి ముందు ఉంచాడు. జడ్జి ఆ నోటు తీసుకుని వారికి విడాకులను మంజూరు చేస్తూ ఆమేరకు ఇద్దరికీ చెరో పత్రమూ ఇచ్చాడు. ‘ఇకనుంచి మీరు భార్యాభర్తలు కాదు. ఎవరి దారిన వారు వెళ్లిపోవచ్చు’ అన్నాడు.

అప్పటికే బాగా చీకటి పడిపోయింది. విడాకుల పత్రం చేతికి వచ్చాక ఒకరి మీద ఒకరికున్న కోపతాపాలు చల్లబడిపోయాయి. వచ్చేటప్పుడు భార్యాభర్తలుగా కలసి వచ్చినా, ఇప్పుడు విడాకులు తీసుకున్నారు కనుక ఎవరి దోవన వారు పోవలసిందే. అతనైతే బండి మీద వెళ్ళిపోతాడు. తనీ రాత్రి వేళ ఎలా వెళ్ళాలి, ఎక్కడ ఉండాలి, తన చేతిలో చిల్లిగవ్వ కూడా లేదు కదా అనుకుంటూ ఆమె బిక్కమొహం వేసింది.

అతను ఆమెను చూశాడు. జాలి కలిగింది. ‘నాతో బండి మీద రా’ అన్నాడు. ఆమె బతుకుజీవుడా అనుకుంది. ఇద్దరూ తిరుగు ప్రయాణమయ్యారు. ఇకనుంచీ తాము భార్యాభర్తలు కామన్న నిజాన్ని తలచుకుంటూ ఇద్దరూ ఎవరి ఆలోచనల్లో వారు ఉండిపోయారు. రేపటి పరిస్థితిని, ఇక తాము భార్యాభర్తలం కామన్న సంగతినీ ఊహించుకుంటున్న కొద్దీ; ఎవరి బతుకు వారు బతకవలసిందేనన్న నిజం వారిని కుంగదీయడం ప్రారంభించింది. విడాకులు తీసుకున్నందుకు పశ్చాత్తాపమూ, ఒకరి మీద ఒకరికి ప్రేమ, జాలి క్రమంగా ముంచెత్తాయి. ‘పొద్దుటే అతను ఇంత కూడు తిని పనికి పోతాడు. తను లేకపోతే అతనికి ఎవరు వండిపెడతారు? ఎంత ఇబ్బంది పడతాడు?’ అనుకుంటూ ఆమె!,,,’తను లేకపోతే నాకు ఎలా గడుస్తుంది? నేను లేకపోతే తనకు మాత్రం ఎలా గడుస్తుంది?’ అనుకుంటూ అతను! …తమ దగ్గరున్న విడాకుల పత్రాన్ని తలచుకుంటే వారికి ఒంటి మీద తేళ్ళు, జెర్రులు పాకుతున్నట్టు అనిపిస్తోంది.

ఊరు చేరేసరికి ఇద్దరూ ఒక నిర్ణయానికి వచ్చేశారు. ‘మనం కలిసే ఉందాం. విడాకుల్ని రద్దు చేయమని అడుగుదాం’ అని భర్త అన్నాడు. దిగులు మాయమై భార్య ముఖం సంతోషంతో విప్పారింది. ‘సరే’ అంది.

మరునాడే ఇద్దరూ బండి కట్టుకుని జడ్జి దగ్గరకు వెళ్లారు. తమ నిర్ణయం చెప్పి, విడాకులు రద్దు చేయమని అడిగారు. ‘సరే, రద్దు చేస్తాను. అందుకు కూడా రుసుము చెల్లించాలి(అయిదురూపాయలు అనుకుందాం). మీ దగ్గర ఆ డబ్బు ఉందా?’ అని జడ్జి అడిగాడు. ఆ జంట తెల్లబోతూ ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. ‘మా దగ్గర ఆ డబ్బు లేదు’ అని అతను అన్నాడు.

‘మీ దగ్గర ఆ డబ్బు ఎప్పుడుంటే అప్పుడు వచ్చి చెల్లించి విడాకుల రద్దుపత్రం తీసుకు వెళ్లం’డని జడ్జి అన్నాడు.

సరే నంటూ నిరుత్సాహంగా ఆ జంట అక్కడినుంచి వెళ్ళిపోయారు.

మరునాడు పొద్దుటే వాళ్ళు ఇద్దరూ మళ్ళీ జడ్జి దగ్గరకు వెళ్ళాడు. ఇద్దరి ముఖంలోనూ సంతోషం వెల్లివిరుస్తోంది. అతను జడ్జి ముందు అయిదు రూపాయల నోటు ఉంచాడు. జడ్జి ఆ నోటు తీసుకుని విడాకులను రద్దు చేస్తూ ఇద్దరికీ చెరో పత్రమూ ఇచ్చాడు. వారు అప్పుడే పెళ్ళైన కొత్త జంటలా ఒకరినొకరు మురిపెంగా చూసుకుంటూ వెళ్ళిపోయారు.

ఓ. హెన్రీ కథల్లో ఉండే కొసమెరుపు లేదా ట్విస్టు ఈ కథలోనూ ఉంది. వాస్తవంగా జరిగింది ఏమిటంటే, అయిదు రూపాయలు చెల్లించి విడాకుల రద్దు పత్రం తీసుకోమని చెప్పి జడ్జి పంపేసిన తర్వాత ఆ జంటకు ఏం చేయాలో తోచలేదు. అయిదురూపాయలు తాము ఇప్పట్లో సంపాదించడం కష్టం. కనుక అతను ఆ రోజు రాత్రి జడ్జి ఇంట్లో దొంగతనం చేశాడు. తను జడ్జికి ఇంతకుముందు ఇచ్చిన అయిదురూపాయలు దొరికింది. మరునాడు ఆ నోటే జడ్జికి ఇచ్చాడు. తన దగ్గర అయిదురూపాయలు మాయమైన సంగతి ఆ తర్వాత కానీ జడ్జీకి తెలియలేదు.

ఇది న్యాయవ్యవస్థపై సెటైర్ గా రాసిన కథ అని తెలుస్తూనే ఉంది. దానిని అలా ఉంచితే, మనకిప్పుడు కావలసినంతవరకు స్త్రీ-పురుషుల మధ్య సంఘర్షణ-సయోధ్యల గురించి కూడా ఈ కథ చమత్కారం మేళవించి చెబుతోంది.

***

మన ధర్మశాస్త్రాలు స్త్రీ-పురుష సంబంధాల విషయంలో పట్టు-విడుపులు లేని వైఖరిని అనుసరిస్తాయని మనం అనుకుంటాం. కానీ అది నిజం కాదు. అవి ఎంతో సడలింపునూ పాటించాయి. నిజానికి ధర్మశాస్త్రాలు చండశాసన ప్రవృత్తి గల ఒక వ్యక్తి లేదా వ్యక్తుల ఊహల్లోంచి పుట్టినవి కావు. అవి సమాజంలోంచి పుట్టినవి. స్త్రీ-పురుష సంబంధాలతో సహా సామాజిక సంబంధాల పరిణామ చరిత్రను నమోదు చేస్తూ పోయినవి. అయితే అవి కొన్ని సందర్భాలలో అసమానతలు, వివక్ష కలిగిన నిర్దిష్ట సామాజిక సంబంధాల పక్షం వహించిన మాటా వాస్తవం. ధర్మశాస్త్రాల గురించి నాకు పైపైన కలిగిన అభిప్రాయం మాత్రమే ఇది. సూక్ష్మంగా పరిశీలించినప్పుడు నా అభిప్రాయాలను సవరించుకోవలసిన అవసరం వస్తుందేమో చెప్పలేను.

కేవలం తటస్థ, చారిత్రక దృష్టినుంచి చెప్పుకుంటే, స్త్రీ శీలం గురించి నేడు మనకు కొన్ని కచ్చితమైన అభిప్రాయాలు ఉన్నాయి. ఆ అభిప్రాయాలనుంచి చూసినప్పుడు పూర్వుల అభిప్రాయాలు చాలా విచిత్రంగానూ, ఆసక్తికరంగానూ, ఇంకా చెప్పాలంటే అమాయకంగానూ అనిపిస్తాయి. ఉదాహరణకు, తిక్కన భారతం, శాంతిపర్వం, ప్రథమాశ్వాసంలో ధర్మరాజుకు వ్యాసుడు ప్రాయశ్చిత్త విధానాలను చెబుతూ అన్న కింది మాటలు నన్ను ఆశ్చర్యచకితం చేశాయి:

పరపురుషసంగమంబున బరిహృతయై యున్న యట్టి భామిని శుద్ధిం

బొరయు రజస్వలయై కంచరయగ భస్మమున శుద్ధమైన విధమునన్

పరపురుషునితో సంబంధం వల్ల విడిచిపెట్టబడిన స్త్రీ, బూడిదతో కంచు శుభ్రమైనట్టుగా రజస్వల కావడం ద్వారా శుద్ధి అవుతుందని ఈ పద్యానికి అర్థం.

స్త్రీ శీలానికి, ఆమె రజస్వల కావడానికీ ఇలా ముడిపెట్టడం నేడు మన ఊహకు అందని విషయం. సంస్కృత భారతంలో దీనినే ఇలా చెప్పారు:

స్త్రియ స్త్వాశంకితాః పాపా నోపగమ్యా విజానతా,

రజసా వా విశుధ్యంతే భస్మనా భాజనమ్ యథా           

దీనికి శలాక రఘునాథశర్మగారి అనువాదం ఇలా ఉంది:

వివేకము కలవాడు పాపము చేసిరను శంక గల స్త్రీలను పొందరాదు. బూడిద పాత్రను శుద్ధి చేసినట్లు రజస్సు వారిని శుద్ధి చేయును.

తిక్కన పద్యంలో అర్థం సూటిగా ఉంటే, శ్లోకంలో అర్థం కొంత అస్పష్టంగా ఉంది. అనువాదంలోనూ అదే అస్పష్టత ఉంది. వివేకం ఉన్నవాడు పాపం చేశారన్న శంక కలిగినప్పుడు ఆ స్త్రీలను పొందరాదని మొదటి వాక్యం చెబుతోంది. బూడిద పాత్రను శుద్ధి చేసినట్లుగా రజస్సు వారిని శుద్ధి చేస్తుందని రెండో వాక్యం చెబుతోంది. అంటే, రెండో వాక్యం మొదటి వాక్యాన్ని నిషేధిస్తోందన్న మాట. (స్త్రీ పరపురుష సంగమానికి పాల్పడినా) రజస్వల అయినప్పుడు శుద్ధి జరిగి ఆ పాపం పోతుందని ఈ వాక్యం చెబుతోంది. అప్పుడు మొదటి వాక్యం విధించే నిషేధం తొలగిపోతుంది. కానీ శ్లోకం ఆ సంగతిని సూటిగా చెప్పడం లేదు.

అంతకన్నా ఆశ్చర్యం, తిక్కన పద్యంలోనూ, సంస్కృత శ్లోకంలోనూ వ్యక్తమైన అభిప్రాయానికి సమర్థన, ఒకింత తేడాలో, నాకు ఆచార్య పుల్లెల శ్రీరామచంద్రుడుగారి రచనలో కనిపించింది! ‘కౌణ్డిన్యస్మృతిః’ (ఎమెస్కో ప్రచురణ, 2010) అనే రచనలో,‘స్త్రీలు’ అనే శీర్షిక కింద ఆయన ఇలా రాశారు:

అనిచ్ఛన్తీ తు యా నారీ బలాత్కారేణ దూషితా,                                                                           

రాజోదర్శనతహః పశ్చాద్విశుద్ధ్యతి; నా సంశయః

తా. ఇష్టపడకపోయినా బలాత్కరింపబడి దూషితురాలైన స్త్రీ రజోదర్శనానంతరం పరిశుద్ధురాలవుతుందని ధర్మశాస్త్రకారుల నిర్ణయం. దీనిలో సందేహం లేదు.

రజస్వల, అంటే ఋతుమతి కావడంతోనే స్త్రీ పరిశుద్ధురాలు అవుతుందనడం, స్త్రీ శీలం గురించిన మన ఊహల్ని పూర్తిగా తలకిందులు చేస్తోంది. స్త్రీ శీలంపట్ల ఉన్న ఇంత సరళమైన భావనతో, శీల భంగానికి ఇది చూపించే పరిష్కారంతో నేడు ఎవరూ ఏకీభవించరని మనకు తెలుసు. ఋతుమతి కావడంతోనే స్త్రీ శుద్ధి అవుతుందన్న ఊహలో   ఎంతో అమాయకత్వం ఉంది. మరోవైపు, స్త్రీ శీలం గురించి మనకంటే, మన పూర్వులే చాలా ఉదారంగానూ, విశాలంగానూ ఆలోచించారన్న అభిప్రాయం కూడా ఈ ఊహ కలిగిస్తుంది. అందులో స్త్రీ-పురుష సంబంధాల పట్ల గొప్ప సర్దుబాటు వైఖరి ఉంది.

దాంతోపాటు, తటస్థంగా చెప్పుకుంటే; స్త్రీ శీలం గురించిన పై భావన మరికొన్ని విలక్షణ పరిస్థితులను కూడా సృష్టిస్తుంది. ఎలాగంటే, స్త్రీ నెల నెలా ఋతుమతి అవుతుంది. ఋతుమతి కావడంతోనే అంతకుముందు పురుషసంబంధం తాలూకు దోషం అంతా పోయి తిరిగి శుద్ధి అవుతుంది. ఇందులో ఇమిడి ఉన్న అంతరార్థాలను వివరించుకో నవసరం లేదు. తన ఇష్టం లేకుండా బలాత్కరింపబడిన స్త్రీలు ఋతుమతి కావడంద్వారా శుద్ధి పొందుతారని పుల్లెల శ్రీరామచంద్రుడు గారు అంటున్నారు. అయితే పూర్వుల ఊహ నుంచి చూస్తే, ఎటువంటి పురుష సంగమం ద్వారానైనా సరే, ఋతుమతి కావడంతోనే స్త్రీ శుద్ధిపొందుతుంది.

మొత్తం మీద చూస్తే, ఒక దశలో స్త్రీకి సంబంధించిన ఇతరేతర అంశాలపై కంటే, ఆమెకు గల ఋతుకాల ధర్మం మీదే పూర్వులకు ఎక్కువ పట్టింపు ఉండేదని అనిపిస్తుంది. ఋతుకాలమే వారి ఊహలో ఎక్కువ ప్రాధాన్యాన్ని పొందినట్టు అనిపిస్తుంది. అది సంతానయోగ్య కాలం కూడా కనుక సంతానానికే ఎక్కువ ప్రాధాన్యమిచ్చారని కూడా తోస్తుంది. ఋతుకాలంలో సంతానం పొందడం స్త్రీకి ఒక హక్కుగా గుర్తించారన్నఅభిప్రాయానికి సైతం శర్మిష్ట-యయాతి కథే కాక మరికొన్ని కథలు అవకాశమిస్తాయి. ఋతుమతి కావడంతోనే స్త్రీ శుద్ధి పొందుతుందని పూర్వులు భావించడం ఋతుకాల ప్రాధాన్యానికి పొడిగింపే.

ఇప్పటి మన అవగాహనలో ఇది విపరీతంగా, అనైతికంగా తోచే మాట నిజమే. కానీ, అప్పటి పరిస్థితులు, అప్పటి ఒత్తిడులు, స్త్రీ-పురుష సంబంధాల గురించిన అప్పటి అవగాహన అలాంటివి కావచ్చు. అపారమైన భౌగోళిక విస్తీర్ణం, పరిమిత జనాభా ఉన్న ఆ కాలంలో సంతానోత్పత్తే అన్నింటికంటే ఉన్నతంగా కనిపించడంలో ఆశ్చర్యం లేదు. సంతానవతికి, లేదా సంతానవంతుడికి ఆనాడే కాదు, నిన్న మొన్నటివరకు సమాజంలో ఎక్కువ గౌరవ ప్రతిష్టలు ఉండేవన్న సంగతి మనకు తెలుసు.

భూమిపై కానీ, ఇతర ఆస్తులపై కానీ ఉమ్మడి యాజమాన్యం పోయి, వ్యక్తిగత యాజమాన్యం ఏర్పడిన తర్వాత; ఫలానా పురుషుడికే స్త్రీ సంతానం కనవలసిన అవసరం కలిగింది. భర్తకు సంతాన సామర్థ్యం లేనప్పుడు ధర్మశాస్త్రాలు నియోగాన్ని అనుమతించాయి.

ముందుజన్మలో ద్రౌపదిగా పుట్టబోతున్న ఇంద్రసేనకు శివుడు ప్రత్యక్షమై నీకు అయిదుగురు భర్తలు లభిస్తారని అన్నప్పుడు ఆమె ఏమందో మరోసారి గుర్తుచేసుకుందాం: ‘స్త్రీకి ఒక్కడే పతి కావడం లోక ప్రసిద్ధం. ఆపత్కాలంలో నియోగవిధిని బట్టి అన్యపురుష సంపర్కాన్ని చెప్పారు. మూడో పురుషునితో సంబంధం పెట్టుకుంటే ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. నాలుగో పురుషునితో సంబంధం వల్ల ఆమె పతిత అవుతుంది. అయిదవ పురుష సంబంధంతో బంధకి అవుతుంది. కనుక నాకు అయిదుగురు భర్తలు వ’ద్దని ఆమె అంటుంది. కురుసభలో ద్రౌపదిని అవమానించినప్పుడు కర్ణుడు ఆమెను బంధకి అంటూ ఎద్దేవా చేస్తాడు. ఇంద్రసేన అన్న పై మాటల్లో స్త్రీపురుష సంబంధాలపట్ల ధర్మశాస్త్రాలు ప్రదర్శించిన సర్దుబాటు వైఖరి అంతర్లీనంగా కనిపిస్తుంది.

ఇంకా ఆశ్చర్యం ఏమిటంటే, పెండ్యాలవారితో తను జరిపిన వాదోపవాదాలలో సంప్రదాయపక్షం వహించిన వారణాసి సుబ్రహ్మణ్య శాస్త్రి గారు నియోగవిధిని సమర్థిస్తారు కానీ, వితంతు వివాహాన్ని మాత్రం వ్యతిరేకిస్తారు. నియోగవిధి ఆమోదయోగ్యమై, వితంతు వివాహం కాకపోవడం వెనుక పైకి ఎలాంటి హేతుబద్ధతా కనిపించదు. బహుశా ఆస్తి సంబంధమైన అభ్యంతరాలు దాని వెనుక ఉండవచ్చు.

అదలా ఉంచితే, ఋతుమతి కావడంతోనే స్త్రీ శుద్ధి పొందుతున్న భావన పురాణ కథలలోని ఒక ముఖ్యమైన మర్మాన్ని, లేదా కల్పనను బట్టబయలు చేస్తోంది. అది, కన్యాత్వ వరం!

mbx_xtra_draupadi_by_nisachar-d56baz1

ఈ కన్యాత్వ వరం గురించి వెనకటి వ్యాసాలలో చాలా చెప్పుకున్నాం. క్లుప్తంగా మరోసారి గుర్తు చేసుకుంటే, పరాశరుడు సత్యవతికి, దుర్వాసుడు, సూర్యుడు కుంతికి, శివుడు ద్రౌపదికి కన్యాత్వవరం ఇచ్చారు. ఋతుమతి కావడంతోనే స్త్రీ శుద్ధురాలవుతుందన్న పై ఊహను ఇక్కడ వర్తింపజేసి చూడండి. స్త్రీ ఋతుమతి కావడానికి ముందు పురుష సంగమం పొందినా, ఋతుమతి కావడంతోనే శుద్ధి అవుతుందంటే అర్థం ఏమిటి? ఆమె వెనకటి స్థితికి, అంటే కన్యగా ఉన్న స్థితికి తిరిగి వెడుతుందనే. అలాంటప్పుడు ఆమెకు కన్యాత్వ వరం అంటూ ప్రత్యేకంగా ఇవ్వనవసరం లేదు. ఎందుకంటే అప్పుడు ఆమె కన్యే!

దీనినిబట్టి తేలుతున్నది ఒకటే…కన్య అంటే వివాహం కాని స్త్రీ మాత్రమే. పురుష సంపర్కం పొందని స్త్రీ అని కాదు.

గణసమాజంలో కూడా కన్య అంటే వివాహం కాని స్త్రీయే తప్ప పురుషసంపర్కం లేనిదని కాదు.

దాని గురించి తర్వాత…

 – కల్లూరి భాస్కరం

 

Download PDF

4 Comments

 • ఆసక్తి కరంగా ఉంది భాస్కరం గారు. ఈ విషయాలు నాకు తెలుసునని కాదుగానీ మీరు వ్యాసం మొదట ఉదహరించిన పద్యం చదివితే నాకు తోచిన భావం – గర్భం దాల్చకుండా ఉన్నంతవరకూ ఆమె శుద్ధురాలైనట్లే అని. ఒక పరాయి మగవానితో గర్భం వస్తే, అటుపైన ఎన్ని ఋతుస్రావాలు అయినా .. ఈ సూత్రం ప్రకారం .. ప్రయోజనమేమీ లేదు .. అని నాకు అర్ధమవుతున్నది.

  • kalluri bhaskaram says:

   “మొదట ఉదహరించిన పద్యం చదివితే నాకు తోచిన భావం – గర్భం దాల్చకుండా ఉన్నంతవరకూ ఆమె శుద్ధురాలైనట్లే అని.”-

   నాకూ ఆ సందేహం కలిగింది నారాయణస్వామిగారూ…కానీ అదే ఉద్దేశమైతే ఆ సంగతి స్పష్టంగానే చెప్పచ్చు. కానీ ఎవరూ చెప్పలేదు. సత్యవతి, కుంతి సంతానం కన్నారు కనుక వారికి కన్యాత్వ వరం ఇచ్చారనుకుందాం. కానీ ఇంద్రసేన( ద్రౌపది)? కన్యాత్వ వరం పొందే నాటికి ఆమె సంతానవతి కాదు.

 • “ఋతుమతి కావడంతోనే స్త్రీ శుద్ధి అవుతుందన్న ఊహలో ఎంతో అమాయకత్వం ఉంది.” అన్నది మీ అభిప్రాయంలా అనుకుంటున్నాను. కాకపోతె క్షమించండి. దీన్ని అమాయకత్వం అనడానికి నామనసొప్పడం లేదు.
  ఋతుమతి కావడంతోనే స్త్రీ శుద్ది అవుతుంది అనే వూహలో కంటే పురుషుడితో సంగమించినంత మాత్రానే స్త్రీ అపవిత్రురాలయ్యింది అన్న వూహలోనే నాకెక్కువ అమాయకత్వం కనిపిస్తోంది.

  మీరన్నట్లు గణ సంపద నుండి వ్యక్తి సంపదకు మళ్ళి నప్పుడు స్త్రీ కేవలం ఒకే పురుషుడి ఆస్తి అయ్యింది. అప్పుడే పరపురుషుడి సంగమం అపవిత్రమయ్యింది. ఆ కొలమానంలో సంగమం తర్వాత రజస్వల అయ్యిందంటే తను ఆ అపవిత్రత నుండి బయట పడ్డట్టే!

 • kalluri bhaskaram says:

  “ఋతుమతి కావడంతోనే స్త్రీ శుద్ధి అవుతుందన్న ఊహలో ఎంతో అమాయకత్వం ఉంది” అనే మాట నేను స్త్రీ శీలం గురించి ఇప్పటి ఊహలకు పురాకాలం నాటి ఊహలకు ఉన్న తేడా గురించి చెప్పడానికే అన్నాను తప్ప, అందులో ప్రత్యేకంగా నా అభిప్రాయం అంటూ ఏమీ లేదు. వీలైనంతవరకు తటస్థంగా చెప్పడమే ఈ వ్యాసాలలో నా పరిమితి. దీనిపై వ్యక్తిగతంగా ఎవరి అభిప్రాయాలు వారు ఏర్పరచుకోవచ్చు.

ఒక వ్యాఖ్యను

Your email address will not be published. Required fields are marked *

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)