ఎగిరే పావురమా! – 6

egire-pavuramaa-tytle-6th-p

రాములు వెళ్ళిపోయిన మూడో రోజు గుడి ‘స్వీపరు’గా కమలమ్మ కొలువులో చేరింది. రాములు ఉండెళ్ళిన పెంకుటింట్లోనే ఇప్పుడు ఆమె ఉంటుంది. నన్ను రోజూ కోవెలకి తిప్పే రిక్షాబ్బాయి గోవిందుకి అక్క కమలమ్మ.

 నా విషయం, నా అవసరాలు ఆమెకి వివరించి, నేను గుడిలో ఉన్నంత సేపు కాస్త సాయం చేయాలని ఆమెని అడిగాడు తాత. నెలకి యాభై రుపాయలిస్తే సాయమందిస్తానందంట. వేరే గత్యంతరం లేక తాత ఒప్పుకున్నాడంట.

 సాయం చేయమంటే యాభై రూపాయలు అడగడం ఏమిటని, పిన్ని గోలెట్టింది. ఆఖరికి ‘గాయత్రి హుండీ’ నుండి నెలకి ఆ యాభై   కమలమ్మకిచ్చేలా ఆలోచించారు. కొత్తగా కొలువులో కొచ్చింది, గోవిందు అక్కని తాత చెపితేనే పిన్నికి తెలిసింది.

మళ్ళీ వారానికి ‘కృష్ణ’ అనే పదేళ్ళ అబ్బాయిని కూడా పనికి పెట్టుకున్నాడు పంతులుగారు. మాకు మల్లేనే రోజూ పొద్దుటే కోవెలకి వస్తాడాబ్బాయి. శ్లోకాలు చదువుకుంటూ పూజసామాను తోమి, గర్భగుడిలో సైతం శుభ్రం చేసి, విగ్రహాలకి పూల మాలలు అలంకరిస్తాడు కృష్ణ.

పంతులుగారికి దూరపు చుట్టమంట. పనయ్యాక బట్టలు మార్చుకొని, కృష్ణ బడికి వెళ్ళిపోతాడు కూడా.

**

పొద్దున్నే, పూలబుట్ట నా ముందుంచి వెళుతున్న కమలమ్మని చూడగానే, చంద్రం పిన్ని అన్న మాటలు గుర్తొచ్చాయి.

…… “కమలమ్మ గురించి ఆరా తీసానురా గాయత్రీ, ఆమె అదోరకం మనిషని విన్నాను. తగువులు పెడుతుందంట. బద్రంగా ఉండాలి ఆమెతో. అయినా గుళ్ళో కమలమ్మ నీకు చేసేది మొక్కుబడి సాయమేలే,” అని చంద్రమ్మ అనడం అక్కడే ఉన్న తాత విన్నాడు.

“ఆ కమలమ్మతో, నువ్వూ కాస్త ఓపిగ్గా ఉండాలి, గాయత్రి,” అన్న తాత మాటలు కూడా గుర్తు చేసుకుంటూ పూల పని ముగించాను.

కాసేపటికి తిరిగొచ్చిన కమలమ్మకి పూలబుట్ట అందివ్వబోతే, నా జాకెట్టు కుట్టు పిగిలింది. తన చీర ఒకటి తెచ్చి నాకు కప్పి, నా వెనుక కూచుని సూది-దారంతో గబగబా నాలుగు కుట్లేసింది కమలమ్మ.

ఈ మధ్య నా బట్టలు కురచైపోతున్నాయి. బిగుతుగా కూడా తోస్తున్నాయి. చంద్రం పిన్ని గమనించి రెండుజతల బట్టలు కొని కుట్టించుకొచ్చింది. ఉమమ్మ కూడా తనకి కురచైపోయిన పరికిణీ జుబ్బాలు తెచ్చిచ్చింది.

నేను అందంగా, ఆరోగ్యంగా ఎదుగుతున్నానని, అందరి కళ్ళు నా మీదే ఉంటున్నాయనంటూ, పొద్దుటే చంద్రం పిన్ని చేత్తోనే  ఈ మధ్య మురిపెంగా దిష్టిచుక్కెట్టిస్తున్నాడు తాత.

“అన్నా, గాయత్రితో రిక్షాలో కూచుని గుడికెళ్ళరాదా? అని మళ్ళీ చంద్రమ్మ ఎంతడిగినా ససేమిరా వినలేదు. తాత కాలినడకనే గుడికి వస్తాడు, పోతాడు.

**

గుళ్ళో రాములు లేని లోటు, కొట్టొచ్చినట్టుగా తెలుస్తుంది. ఎప్పుడూ గలగలా మాట్లాడుతూ కలివిడిగా పనులు కలిపించుకుంటూ, అందరికి సాయం చేస్తుండే రాములు లేని లోటు మాకే కాదు – పూజారయ్య, ఉమమ్మలకి కూడా అనిపిస్తుందంట.

ఉమమ్మ కలిసిన ప్రతిసారి రాముల్ని తలుచుకుంటున్నాము. ఆమె పెనిమిటికి ఆరోగ్యం ఇంకా బాగవలేదని మాత్రం తాత మాతో అన్నాడు.

పావురాళ్ళకి గింజలెయ్యడం, వాటి వెనువెంటే శుభ్రం చేయడం తన వల్ల కాదని గొడవ చేసింది కమలమ్మ ఓ సారి.

గుడికి పావురాళ్ళ రాక ఎప్పటినుంచో ఉన్నదేనని, అవి వచ్చి వెళ్ళాక అరుగులు రెండు పూటలా శుభ్రం చేయడం, కోవెలనాశ్రయించిన పక్షులకి, పశువులకి దానా వేయడం, ఆమె పనిలో భాగమే అని పంతులుగారు చెప్పాక గాని కమలమ్మ పావురాళ్ళ మీద విసుగ్గోడం మానలేదు.

కమలమ్మకి – రాములికి అసలు ఏ విషయంలోనూ పోలిక లేదనిపించింది.

**

మరో నెల రోజుల్లో నాకు పదమూడేళ్ళు నిండుతాయని ముందుగానే కొత్త పరికిణి, జాకెట్టుతో ఈ తడవ వోణి, గాజులు తీసుకున్నాడు తాత.  మరో రెండు జతలు బట్టలు తీసాడు. అందుకోసం పూజారయ్య కాడ  అప్పు కూడా చేసాడు.

ఉమమ్మ ఇచ్చిన వాటితో కలుపుకొని ఇప్పటికే సరిపడా బట్టలున్నాయని తాతకి తెలియజెప్పాను. అప్పు చేయవద్దని గొడవపడ్డాను.

“నిన్ను గొప్పగా చూడాలని ఉంటాదమ్మా.  పెద్దదానివౌతున్నావు. తొందరగా నడవగలగాలని, చదువుకొని నువ్వు స్వతంత్రంగా బతకాలని నా కోరిక,” అన్నాడు తాత చమర్చిన కళ్ళతో.

నన్ను కన్న వాళ్ళు ఎలా దూరమయ్యారో కాని,  తాత లేకపోతే నేనేమయ్యేదాన్నో తెలీదు.

మొత్తానికి అలా నా పదమూడవ పుట్టిన రోజు నుండి పైట వెయ్యడం మొదలెట్టాను.

పూజారయ్య భార్య మంగళమ్మగారితో సహా పంతులుగారి భార్య, నాయుడన్న భార్య కూడా నాకు పుట్టినరోజు కానుకగా పరికిణీ, వోణీలు పంపారు.

**

మధ్యాహ్నం రెండు గంటల సమయంలో ఉమమ్మ రెండు పుస్తకాల సంచులు తీసుకొని వచ్చింది.

‘ఏమిటా? ఇన్ని పుస్తకాలు ఉమమ్మ చేతుల్లో! అసలు ఇవాళ ఆమె మాములుగా వచ్చే రోజు కూడా కాదే ’ అని కుతూహలంగా ఉంది.

గట్టి అట్ట పుస్తకాలు ఎన్నో! పక్కనే కూచుని వరసగా పుస్తకాలని తీసి నా ముందు పేర్చింది ఆమె.

నా వంక చూసి, “ఇప్పటినుంచి ఈ పుస్తకాలతోనే నీ అస్సలు చదువు మొదలవుతుంది,” అంది ఉమమ్మ.

అర్ధమవ్వక, ‘అంటే’ అన్నట్టు చూసాను ఆమెని.   నా ముఖంలో గాబరాని చూసి ఫక్కున నవ్విందామె.

“ఏం లేదురా గాయత్రీ, లెక్కలు, సాంఘికం, తెలుగు, కాస్త ఆంగ్లం మాత్రమే చదువుతున్నావు ఇప్పటి వరకు. పబ్లిక్ పరీక్షలకి కూడా నిన్ను తయారు చేయాలి కదా!” నా వంక చూసింది.

“అంటే, సైన్స్ – భూగోళ శాస్త్రం- ఆల్జీబ్రా – లాంటి సబ్జెక్ట్స్ ఉన్నాయి. ఇవన్నీ నాలుగవ తరగతి నుండి మొదలవుతాయి. అందుకే నీకు ఆ సబ్జెక్ట్లు – నాలుగు, ఐదు, ఆరవ తరగతుల పాఠ్య పుస్తకాలు తెచ్చాను.

నీకు రెండేళ్ళ సమయం ఉంది. మూడు నెల్లకోసారి ఈ సబ్జక్టుల్లో పరీక్షలు రాయవచ్చు,” చెప్పడం ఆపి నా వంక చూసి, సరేనా?” అంది ఆమె.

‘అర్ధమయ్యింది’   అని తలూపాను.

“ఈ సారి నుంచి ఓ పథకం ప్రకారం ఈ పుస్తకాలే విప్పుదాము,” అని ముగించింది ఉమమ్మ.

కొత్త పుస్తకాలని చూస్తే, నాకు ఉత్సాహంగా ఉన్నా , భయంగా కూడా అనిపించింది.

“సరే, కొత్తగా వచ్చిన కమలమ్మ సాయంగా ఉంటుందా?” ఆరా తీసింది ఉమమ్మ.

సన్నగా నవ్వాను.

“ఇంకా కొత్త కదా! చనువు లేదుగా. దూరంగానే మసులుతున్నట్టుగా ఉంది. మంచిదేలే. వచ్చే రెండేళ్లు గట్టిగా చదువు మీద దృష్టి పెట్టు గాయత్రీ, నేను రెండు రోజుల్లో వస్తా. ఈ లోగా కొత్త పుస్తకాలు తిరగేయి,” అంటూ వెళ్ళింది ఉమమ్మ.

**

యేడాదిన్నర సమయం ఇట్టే గడిచిపోయింది. చాలా కష్టపడి చదువుతున్నాను. ఆ చదువు అర్ధమయ్యి, నేర్చుకుని, పరీక్షలు రాయడం లోనే ఎక్కడి సమయం చాలడం లేదు. ఇంకొక్క వరస పరీక్షలైతే, నేను పూర్తిగా అరవ తరగతి విద్యాభ్యాసం చేస్తున్నట్టే లెక్క అంది ఉమమ్మ.

అందుకే, సమయం దొరకగానే పుస్తకాలతో గడిపేస్తున్నాను.

కమలమ్మ అప్పుడప్పుడు అలుగుతూ, అలసిపోతూ, పంతులుగారితో చెప్పించుకుంటూ, పని చేసుకుంటుంది.

నాతో ఇప్పుడిప్పుడే కాస్త ఓపిగ్గా మాట్లాడుతుంది.

తాతతో మాట కలపాలని చూస్తుంది కమలమ్మ. తాత తలొంచుకుని తన పని చేసుకోడమే తప్ప రాములుతో లాగా మాట్లాడడు.   ఎప్పుడన్నా తాతకి నలతగుండి పనిలోకి రాకపోతే, ఆ పని కూడా తన మీద పడిందని అందరికీ తెలిసేలా రుసరుసలాడుతుంది కమలమ్మ.

ఆమె, గుడికి ఎదురుగా ఉండే కూరలబడ్డీ సీతమ్మ దగ్గర కబుర్లకి కూచుంటుందని, మధ్యాహ్నాలు అక్కడే భోజనం చేస్తూ, తాతని కూడా తమతో కూచోమని పిలుస్తుందని చెప్పాడు తాత.

నాయుడన్న భార్య కూడా అప్పుడప్పుడు వచ్చి కమలమ్మతో మాట్లాడి పోతుంటది.

**

గుడిలో ఒక్కోసారి కుర్రోళ్ళు కొందరు పూజసామాను కొనే సాకుతో మాటలు సాగిస్తూ, నన్ను అల్లరి పెట్టడం మొదలెట్టారు.

కమలమ్మ ఒకటి రెండు సార్లు వాళ్ళని తిట్టి పంపేసింది.

“నీకు నేను తోడుంటాలే గాయత్రి,” అంటూ నా కాడ కూచుంది కొన్ని మార్లు.   “వోణి యేశాక ఎక్కడిలేని అందం వచ్చింది నీకు గాయత్రి. నీ నవ్వులు, నీ చూపుల కోసం కుర్రాళ్ళు బారులు కడుతున్నారా? ఒక్క అవిటితనమే నీ లోపమిప్పుడు,” అంది కమలమ్మ.

ఆమె మాటలు నాకు నచ్చలేదు. అసలా సంగతులేవీ తాతకి చెప్పలేదు.

**

నిద్రపోయే సమయానికి హడావిడిగా చంద్రం పిన్నొచ్చింది.

“అన్నా, ఈ వారంలో గాయత్రిని మంగళగిరి ఆసుపత్రికి తీసుకెళ్ళడానికి, పూజారయ్య బండి కావాలన్నారుగా.

మా ఆయన, వాళ్ళ రవాణ ఆఫీసు బండి ఏర్పాటు చేశాడు.

ఎల్లుండి పొద్దున్న తొమ్మిదికంతా బయలుదేరుదామన్నా.

రేపు గుడి కాడికొచ్చి అన్ని విషయాలు మాట్లాడుదాములే, వస్తానే,” అంటూ వచ్చినంత హడావిడిగా వెళ్ళిందామె.

**

egire-pavurama-6

అనుకున్నట్టే పొద్దున్న పదిగంటలకి మంగళగిరి ధర్మాసుపత్రికి తాత, చంద్రమ్మ, ఉమమ్మ, నేను బయలుదేరాము. మొదటి సారిగా నేను కారెక్కాను.

మాకు కావలసిన సాయం చెయ్యమని, తెలిసిన ఆసుపత్రి సిబ్బందికి ముందే కబురంపారంట పూజారయ్య.   దాంతో నాకు ఆసుపత్రి వారి చక్రాలబండి ఏర్పాటు, వైద్య నిపుణుల సంప్రదింపులు సులువుగా అయ్యాయి. నా విషయంగా మొత్తం ముగ్గురు వైద్యులని చూసాము.

ఆఖరున డాక్టరు మల్లిక్ గారిని కలిసాము.

ఆయన నన్ను పరీక్షించి, ఊతకర్రల సాయంతో నిలదొక్కుకొని కొంత మేర సులువుగా కదలవచ్చన్నారు.

నాతో మాట్లాడుతూ, “చూడు గాయత్రి, చక్రాల పీటలవీ చిన్న పిల్లలు కొద్ది రోజుల వాడకానికి పర్వాలేదు.

కానీ, నీవిక ఈ వయస్సుకి ఊతకర్రల సాయంతో కదలడం అలవరచుకోవాలి.

లేదంటే నీ ఎదుగుదలకి మంచిది కాదు. వెన్నెముకతో పాటు కదలిక మరింత స్తంభించే అవకాశముంది.

అసలిప్పటికే నీవు కర్రలు వాడుతుండవలసింది,” అంటూ సమయం తీసుకొని, నాకు ఆరోగ్యం పట్ల ఉండవలసిన సామాన్య శ్రద్ధ గురించి వివరించారు.

నన్ను, ఉమమ్మని తన ఆఫీసులో కలవమని చెప్పి వెళ్ళారు డాక్టరుగారు.

**

మేము వెళ్ళేప్పటికి అటుగా తిరిగి ఫోనులో మాట్లాడుతున్న ఆయన మమ్మల్ని కూచోమని సైగ చేసారు. ఆ గదిలో, ఓ పక్కగా రకరకాల కొలతల్లో ఊతకర్రలు, చెక్క కాలితొడుగులు ఉన్నాయి.

ఫోనులో కూడా డాక్టరుగారు ఊతకర్రల గురించే ఎవరితోనో మాట్లాడుతున్నారని అర్ధమవుతుంది. ఆయనకెదురుగా బెంచీ మీద కూర్చుని, చిన్న సైజు బూట్లకొట్టులా ఉన్న ఆ గదిని కలయజూసాము.

ఫోన్ పెట్టేసాక, ఆయన మావైపు తిరిగారు.

“చూడండి మేడమ్, గాయత్రికి వెంటనే ఊతకర్రలు తెప్పించే ప్రయత్నంలోనే ఉన్నాను. మీరు ఈ అమ్మాయికి ఏమవుతారు? మీరంతా ఎక్కడ వుంటారు? గాయత్రి వైద్యసహాయ విషయమై కాగితాలు మీరే చూస్తారా?” అని ఉమమ్మని అడిగాడు డాక్టర్ గారు.

“గాయత్రి విషయమై కాగితాలు నాకు ఇవ్వచ్చు. నా పేరు ఉమాదేవి సోమయాజులు. పాలెం లోని మా ‘శ్రీ గాయత్రి’ కోవెల్లోనే వాళ్ళ తాత సత్యం సాయిరాం కొలువు చేస్తున్నారు. గాయత్రికి మేము శ్రేయోభిలాషులం అనుకోండి. ఆమె తాత, పిన్నమ్మ మా కూడా వచ్చారు. బయట కూర్చున్నారు,” అని ముగించింది ఉమమ్మ.

“అలాగా,” అంటూ తాతావాళ్ళ కోసం కబురంపి, ఊతకర్రల విషయంగా నా గురించిన సమాచారం, చిరునామా రాయమని ఉమమ్మకి కొన్ని కాగితాలు ఇచ్చారు డాక్టరుగారు.

తన కాడ ఉన్న నా వివరాల పత్రాలు మరోసారి పరిశీలించి, లోనికొచ్చి కూర్చున్న తాత, చంద్రమ్మల వంక చుసారాయన.

“చూడండి సత్యంగారు, గాయత్రి ఎదుగుదల, కదలికకి సహాయపడాలంటే వీలయినంత త్వరలో ఆమె ‘ఊతకర్రలు’ వాడకం అలవాటుగా మొదలుపెట్టాలి.

ఆసుపత్రి ద్వారా అయితే, దానికి కొంత సమయం, మీకు కొంత ఖర్చు అవుతుందట.

నేనిప్పుడే కనుక్కున్నాను. మా ‘ధార్మిక సంస్థ’ ద్వారా మీకు ఉచితంగా వాటిని ఏర్పాటు చేయించగలను,” అంటూ వాళ్ళకి ఓపిగ్గా వివరించారు.

తాత మాత్రం అర్ధం కానట్టుగా చూసాడు డాక్టరు వంక.

“అదేమిటి బాబు. ఆసుపత్రి వాళ్ళు చేయవలసినది, మీరు మీ సొంతంగా చేయడమేమిటి?

అసలు గాయత్రికి మాట, నడక స్వతహాగా వస్తాయేమోనని పరీక్షించి చెప్పలేరా బాబు? అని అడిగాడు.

(ఇంకా ఉంది)

 

 

Download PDF

ఒక వ్యాఖ్యను

Your email address will not be published. Required fields are marked *

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)