ఒక ‘తుఫాను తుమ్మెద’ పుట్టిన రోజు

పంద్రాగస్టు ప్రసిద్ధ కవి దేవిప్రియ పుట్టిన రోజు

index

మొదటి సారి ‘దేవిప్రియ’ పేరు విన్నపుడు కొత్తగా అన్పించింది.అమ్మాయి పేరు అనుకున్నాను కూడా.

కాదని తెలియడానికి ఎక్కువ కాలం పట్టలేదు.ఎప్పుడు ‘దేవిప్రియ’ను తొలిసారి చూసానో బాగా గుర్తుకు లేదు. బహుశా ‘ద్వారక’లోనేమో ! చూడగానే ఇతను పీరియడ్ వ్యక్తి కాబోలనుకున్నాను. కానీఆయనతో సంభాషణకు దిగాక తెల్సింది చాలా informal అని. చాలా సాదాసీదామనిషని. అంతేనా ! చాలా లోతున్న కవి అని కూడా. సోవియట్ పరిణామాల నేపథ్యంలోఆయన రాసిన ‘హిట్లర్ నవ్వు’ కవితను చదివాక నేను సీరియస్ గా చదవాల్సినకొద్దిమందిలో ఆయన ఒకరైనారు. చదివాను. పైపైన కాదు. నిమగ్నతతో చదివాను.అప్పుడు తెల్సింది – దేవిప్రియ కవిత్వం ఒక పాయగా కాక అనేక పాయలుగాసాగుతుందని. ఆయన range of poetry చాలా విశాలమైందని. వైవిధ్యంతోకూడుకున్నదని కూడా. ఏది రాసినా ఇష్టంగా రాసుకుంటాడని. తేటగానూవ్యక్తమవుతాడని.

నాకు దేవిప్రియ ఇష్టం కావడానికి కారణాలు చాలానే వున్నా, ప్రధానమైనది – ఆయన కవిత్వంలో వస్తువూ, కవితాకాంతీ ఏకకాలంలో తళుక్కుమనడం.మాటను ఔచిత్యంతో వాడడం ఆయన conscious పద్ధతి. ఎవరి ఛాయలోనో కాక తనదైనదారిలో నడుస్తాడు. ఈ ‘తనదైన’ శైలే అతని చేత చాలా ప్రయోగాలు చేయించింది.ఆయన పుస్తకాల పేర్లు నవ్యంగా వుంటాయి. ఇటీవలి ‘గాలి రంగు’ దానికి తాజాఉదాహరణ. ఏకకాలంలో పద్యాలు రాస్తారు. వచన కవిత్వం రాస్తారు. రన్నింగ్కామెంటరీ చెబుతారు. ఏదీ కృతకంగా వుండదు. తాజాగా, అతని ఇష్టంలా వుంటుంది.
ఆయనలో ఒక మూల ఏదో సినిమా కూడా కదుల్తూ వుంటుంది. ఇన్నిటికీ తనలో distinct ఏర్పరుచుకోగలరాయన. భిన్నతలాల్ని కలగాపులగం చేయడు !

ఇప్పుడున్న సాహిత్య వాతావరణంలో దేవిప్రియలాంటి సాహిత్యకారులఅవసరం ఎక్కువ వుంది. ఇంత చేసాను, అంత చేసాను అనే స్వోత్కర్షల బడాయిలేనివాళ్ళ అవసరం. ప్రేమతో, నిస్సవ్వడిగా పని చేసే వాళ్ళ అవసరం. కవిత్వమన్నాకకవిత్వం – రాసే దానికి వుండీ తీరాలని పలికే వాళ్ళ అవసరం. కొత్తసృజనకారుల్నీ, కొత్త తరాన్నీ ఉదారంగా ఆకాశానికెత్తేయకుండా objective గాjudge చేసేవాళ్ళ అవసరం. దేవిప్రియను కదిలించి చూడండి. ఈ అవసరపుప్రాధాన్యతను నిక్కచ్చిగా మాట్లాడ్డం మీరు చూస్తారు. మనకొక బాధ్యత వుందికదా అంటారాయన.

మూడేళ్ళ క్రితం అనుకుంటాను – దేవిప్రియతో కొన్ని గంటల పాటుసంభాషించాను, రెండు మూడు రోజుల space తో, ‘నవ్య’ పత్రిక కోసం జగన్నాథశర్మ అడిగితే మాట్లాడిన సందర్భం. ఎంత విస్తారంగా మాట్లాడారో, అంత
సారాంశంతో మాట్లాడారు. నిర్మొహమాటంగా మాట్లాడారు. సహజంగా, ఇష్టపూర్తిగామాట్లాడారు. దేవిప్రియ పూనుకోకపోతే శ్రీశ్రీ ‘అనంతం’ వచ్చి వుండేదా ? రన్నింగ్ కామెంటరీలుండేవా ? యుద్ధనౌక గద్దర్ వుండేదా ? ఉండకపోయేవేమో !
ఆయన్ని వింటూ వుంటే ఒక మనిషి కాక ఏకంగా కవితా హృదయమే మనముందు నిల్చునిభాషను సమకూర్చుకుని మాట్లాడినట్టుంటుంది. ఆగష్టు 15వ తేదీన జన్మించినదేవిప్రియ గొప్ప స్వేచ్ఛాప్రియుడు. తన ఉనికిని కవిత్వతీరమ్మీద
ముద్రించగల్గిన అరుదైన కవి ఆయన.

– దర్భశయనం శ్రీనివాసాచార్య

179590_168635736601358_1835500410_n

 

_____________________________-

నిబద్ధతలో నిమగ్నమైన ‘దేవుడు’

 

1970లలో వొక సంధికాలానికి సమాధానంగా బయలుదేరిన విప్లవోద్యమంవిలువైన  కవిత్వ వారసత్వాన్ని మిగుల్చుకుంది. కవిత్వ ప్రయోజనానికిస్పష్టమైన గిరి గీసింది. అభ్యుదయోద్యమంతో స్థిరపడిన లక్ష్యనిబద్ధతతొపాటునిమగ్నత అనే మరో ఆచరణాత్మకమైన పదం కవిత్వ విమర్శలో చేరింది. నిబద్ధతకీ, నిమగ్నతకీ మధ్య వొక వూగిసలాట ప్రారంభమైంది. కవికి నిబద్ధత వుంటే చాలదు, నిమగ్నత కూడ అవసరమేనన్న వాదం వొకవైపు సాగుతుండగా, మధ్యతరగతి కవుల్లోఆశయానికీ, ఆచరణకీ మధ్య అంతరం ఏర్పడింది. ఇక్కడ రెండు అంశాలు ప్రధానంగాకనిపిస్తాయి. మొదటిది విప్లవోద్యమ ప్రత్యక్ష ప్రభావం. రెండవది ఆప్రభావాన్ని జీవితంలో అన్వయించుకోగలిగినా భౌతిక పరిస్థితులు లేక పరోక్షంగావిప్లవ భాగస్వామ్యం తీసుకోవడం శివారెడ్డి, దేవిప్రియలవంటి సీనియర్కవులనుంచి గుడిహాళం రఘునాధం, నందిని సిద్ధారెడ్డి దాకా ఈ విధంగా ఒకవర్గీకరణ కిందికి వస్తారు. అయితే  శివారెడ్డికీ, ఈ వరసలోని మిగిలిన కవులకీమరో తేడా వుంది. మిగిలిన కవులతో పోల్చినప్పుడు శివారెడ్డిలో అంతర్ముఖత్వంతక్కువ. వీళ్ళందరితో పోల్చినప్పుడు దేవిప్రియలో అంతర్ముఖత్వం ఎక్కువ. దీనికారణాలు ఆయా కవుల భౌతిక జీవన పరిస్థితుల్ని బట్టి వుంటాయి. వీళ్లందరి మీదపని చేస్తున్న ప్రభావాలు వొక్కటే. కాని వీళ్లలో వొక్కొక్కరిది వొక్కొక్కతరహా జీవితం.

దేవిప్రియ జీవితం వడ్డించిన విస్తరి కాదు. ‘పొగాకు కంపెనీ సైరన్ మోత ‘ జీవితాన్ని శాసించే నేపథ్యంలో దేవిప్రియ పుట్టేరు. ‘ఒక గుడిసె కథ’ కవితలో దేవిప్రియ తన కవిత్వానికి ప్రాధమిక ముడిసరుకులేమిటో చెప్పారు. తనపంచేంద్రియాల ద్వారా సంపాదించుకునే జ్ఞానం కవితకి ఎప్పుడూ ప్రాధమికమైందే.ప్రేరణలు ప్రభావాలుగా స్థిరపడకముందు కవిలో నిక్షిప్తమైన భావసంపుటి అది.వ్యక్తి జీవన సారాన్ని సాంద్రతరం చేసేవి ఈ భావాలేనని ఫ్రాయిడ్ అంటాడు.దేవిప్రియ జీవన తాత్వికతని నిర్దేశించి చూపుడువేళ్లు ‘ఒక గుడిసె కథ’లోకనిపిస్తాయి.

“ఈ ‘గుడిసెలో’ నేనా ప్రపంచం వుదయించింది అని కవి అంటున్నప్పుడు ఆప్రపంచం కేవలం భౌతిక ప్రపంచం కాదు. కొత్త వ్యక్తిత్వాన్ని రూపుదిద్దేతాత్విక ప్రపంచం. ఈ కవితలో గతం మీద జాలి, ప్రేమ మాత్రమే కాదు వర్తమానంనుంచి భవిష్యత్తులోకి  సాధికారికంగా నడిచి వెళ్లగల ఆత్మస్థయిర్యం వుంది.

అయితే దేవిప్రియ ఆలోచనల మీద ముద్ర వేసిన పరోక్ష అనుభవాల ప్రస్తావన ‘పుట్టినరోజు గురించి’ అనే కవితలో వుంది.

నా పుట్టినరోజుదేముంది

ఒక కాడ్వెల్ తరువాత

ఒక శ్రీశ్రీ తరువాత

ఒక పాణిగ్రాహి తరువాత

ఒక చెరబండరాజు తరువాత

పుట్టినవాణ్ని నేను” అంటారు.

ఇక్కడ సూచించిన నాలుగు పేర్లు కేవలం   పేర్లు కాదు. ఈ వరస క్రమంలో ఒకచారిత్రక వికాసం వుంది. ఆధునిక కవిత్వంలో సామాజిక చైతన్యం ఎన్ని మలుపులుతిరిగిందో ఈ నాలుగు పాదాల్లో కనిపిస్తుంది.

ఈ రెండు కవితలు ముందు చదివితేగాని కవిగా దేవిప్రియ యేమిటో పూర్తిగాఅర్ధమయ్యే అవకాశం లేదు. ‘పైగంబరకవి’గా కన్ను తెరిచిన దేవిప్రియ ‘నీటిపుట్ట’లో ఏ వర్గం భావజాలానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారో ఈ కవితల్లోస్పష్టంగా కనిపిస్తుంది. “కవిత్వ నిత్య నిబద్ధం” అని ఆయన నమ్ముతారు. అందుకేచిరకాల స్వప్నాన్ని వాస్తవం చేసిన ” ‘శ్రామికస్వర్గం’ నరకంగామారుతున్నప్పుడు నిస్సంశయంగా నిరసన వ్యక్తం చేయగలిగారు.

తూర్పు యూరప్‌లో సంభవించిన పరిణామాలు ఏ సామ్యవాద కవికైనా ఆశనిపాతంవంటివే. గ్లాస్‌నొస్త్, పెర్రిస్త్రోయికాల ముసుగులో సోవియట్‌లో ప్రవేశించినపెట్టుబడిదారీ స్వభావం  ఇక సోషలిస్టు వ్యవస్థ స్వప్నప్రాయమేననిభయపెట్టింది. మనిషి ఆనందానికి ఏ వ్యవస్థ సరిపడ్తుందో తెలియని గందరగోళంయేర్పడింది. ‘ఏది నీ మానవాంశని పరిపూర్ణం చేస్తుందో నాకు అంతుబట్టడం లేదు’ అని వేదన వ్యక్తం చేస్తారు. “ఎర్రబల్బుల్లా వెలిగిన కళ్లలో కలర్ టీవీవర్ణబింబాలు కదలాడుతున్నప్పుడు, తరతరాల ధార్మిక దాస్యాన్ని ధిక్కరించినచేతుల్లో కోకాకోలాలు చెమ్మగిల్లుతున్నప్పుడు” సామ్యవాది హృదయ ప్రకంపనలుఇలాగే వుంటాయి.

ఇదే ధోరణిలో రాసిన మరొక అద్భుతమైన కవిత ‘హిట్లర్ నవ్వు’. ఇదిప్రజాస్వామ్య శిలలమీద ఎర్రపూలు రాలుతున్న రుతువు – అంటూ మొదలయ్యే ఈ  కవితలో దేవిప్రియ రాజకీయ భావాల తీవ్రత తెలుస్తుంది. ఒక శ్రీశ్రీ, ఒక చెరబండరాజు వారసత్వం నుంచి వచ్చిన కవి మాత్రమే ఈ భావాన్ని ఇంత బలంగా వ్యక్తంచెయ్యగలడు. ఈ రెండు సందర్భాల్లో కూడా దేవిప్రియ కవిత్వ సంవిధానంప్రత్యేకంగా గమనించాలి. ఇక్కడ కవి పదం మీద ఎక్కువ దృష్టి నిలుపుతాడు.సాధారణంగా  దేవిప్రియ కవితకి ఒక రూపపరిమితి వుంది. అలవాటుపడిన గేయ చందస్సులనడక ప్రతి కవితలో కనిపిస్తుంది. ‘హిట్లర్ నవ్వు’ ‘ఆదిరహస్యం మానవుడు’ కవితల్లో కూడా ఆ నడక వుందిగానీ, భావాల తీవ్రత దాన్ని అధిగమించింది. కవితలోకొసమెరుపులు ఇవ్వడం ‘రన్నింగ్ కామెంటరీ’ లక్షణం. ఆ లక్షణాన్ని మామూలుకవితలో కామిక్ రిలీఫ్‌గా మార్చుకుని నిర్మాణంలో ఒక సౌలభ్యం సమకూర్చారుదేవిప్రియ. దీనివల్ల ఆయన ఇతర ఆధునిక కవుల్ని బాధిస్తున్న నిర్మాణసంక్లిష్టత నుంచి బయటపడ్డారు.

గొప్ప ఉద్వేగాన్ని కూడా నింపాదిగా చెప్పడం దేవిప్రియ లక్షణం. కార్యకారణ  సంబంధాలు తెలిసి వుండడం వల్ల ఈ కవిలో అకారణమైన ఆవేశం నుంచి పదచిత్రాలుఅదేపనిగా రాలవు. ఆయన భావాన్ని ఒక పదచిత్రంతోనే చిత్రిక పడ్తాడు. తాత్వికసంకోచాలు లేనప్పుడు మాత్రమే కవిలో ఈ స్పష్టత సాధ్యపడుతుంది.

వైరుధ్యాల చిత్రీకరణలో దేవిప్రియ కవిత్వ వ్యక్తిత్వం  కనిపిస్తుంది.నిబద్ధత వుండి ఉద్యమాలలో నిమగ్నం కాలేక పోయాననే ఆవేదన చాలా సందర్భాల్లోవ్యక్తమవుతుంది. కాని ఇలాంటి అనేక రకాల వైరుధ్యాల పొరల్ని విప్పి చూసుకునేనిజాయితీ దేవిప్రియలో వుంది. నిజానికి నిబద్ధత విషయంలొ ఏమాత్రం తెలివివుపయోగించకుండానే ఎవరినైనా ఇట్టే మోసం చెయ్యవచ్చు. కాని లోపల నిజమైన కవిదేవులాడుతున్నవాడు కవిత్వంలో పగటి వేషం వెయ్యలేడు. ఉద్యమం గాలి అయినా సోకనికవులు కూడా ఒక ఫాషన్‌గా ఉద్యమ కవిత్వం రాస్తున్న ఈ కాలంలో ఒక కవి నిమగ్నతగురించి నిజాయితీగా కంఠం విప్పడం విడ్డూరంగానే కనిపించవచ్చు.

 

గార్డెన్ రెస్టారెంట్ చల్లగాలి

రుచిమరిగిన వాణ్ణి నేను

ఫ్యాను విసిరే చల్లగాలిలో

శరీరాన్ని ఆరేసుకోవడానికి

అలవాటు పడ్డవాణ్ని నేను

అయినా అడివీ

నువ్వంటే నాకిష్టం‘ (‘అమ్మచెట్టు’లో)

ఇక్కడ అడవి దేనికి సంకేతమో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 1970లలో ఒకవైపుఉద్యమం తీవ్రతని అందుకుంటున్నప్పుడు మరోవైపు మధ్యతరగతి జీవితంలోకి నయాసంపన్న లక్షణాలు ప్రవేశిస్తున్నాయి. ఆర్ధికంగా కొద్దికొద్దిగాస్థిరపడుతున్న ఈ వర్గంలో అసంతృప్తికి తగిన కారణాలు లేవు. సామాజిక చైతన్యంవున్న మధ్యతరగతి మేధావులలో ఈ స్థితిపై అసహనం వుంది. ‘అడవి’ కవితలోదేవిప్రియ ఈ స్థితిని బలంగా వ్యక్తం చేశారు. అంతేకాదు,

ఈ దేశాన్ని

ప్లాస్టిక్ తీగల విషపుష్పాల ఉద్యానవనాల నుంచి కాపాడడానికి,

ఏదో ఒకనాడు,

నేను నీ సాయమే కోరతాను..” అని వాగ్ధానం చేయగలిగారు..

1984లో దేవిప్రియ ఇలాంటిదే మరో కవిత రాశారు. ఇది దాదాపు ‘అడవి’కవితకుఒకరకమైన కొనసాగింపు. ఎనభయ్యో దశకం వచ్చేసరికి విప్లవోద్యమం మీద పెట్టుకున్నఆశలు అడియాసలయ్యాయి. గుత్తపెట్టుబడిదారీ మనస్తత్వాల ముందు గొప్ప ఆదర్శాలుకూడా వీగిపోతాయని తీవ్రవాద కమ్యూనిస్టులు కూడా మరోసారి నిరూపించారు.సిద్ధాంతాలను పణంపెట్టి ‘వ్యక్తి’వాద ముఠాలుగా చీలిపోయారు. దేవిప్రియఅన్నట్టు ‘వర్తమానానికి నిన్నటి గుణపాఠాల వర్తమానం అదేమిటో ఇంకా అందలేదు.నేను నడుస్తోన్న ఈ రోడ్డు నా కళ్లు యేరయ్యేదాక నా కాళ్ళు తెడ్లయ్యేదాకాముగిసేట్టు లేదు.’. ఎదురుచూపులు ఫలించకుండానే కళ్లముందు మళ్లీ చీకటిఅలుముకుంది. రాజకీయ, సామాజిక రంగాలలో ఏర్పడిన ఈ స్తబ్దతని కవి ‘అర్ధరాత్రినిశ్శబ్దంలోని అనిర్వచనీయ శబ్దం’గా అభివర్ణించారు. ఈ ‘నిశ్శబ్దశబ్దం’ తననిభయపెడుతుందనడంలో ఒక మానసిక అంతరాన్ని సూచించారు.

పుస్తకాల పిరమిడ్‌లో మరొక మమ్మీగా మారిపోతానేమోనన్న ఆందోళనవెలిబుచ్చారు. చివరికి ఒక ఆశ. దిగులు  తనని ఎంతగా ఆవరిస్తున్నా నిరీక్షణఆగిపోదన్న ధైర్యం. ఉద్యమంలో ఏర్పడిన అవరోధాలు తొలగిపోయి రేపటి చరిత్రనికొత్త రంగుల్లో రాయగలనన్న ధీమా. దేవిప్రియలో Negative element ఏ కోశానాలేదనడానికి ఈ కవిత ఒక్కటే చాలు నిదర్శనంగా.

(ఈ వ్యాసం పునర్ముద్రణ, దేవిప్రియ కవిత్వాన్ని మరో సారి తలచుకోవాలన్న ఆకాంక్షతో )

అఫ్సర్

 

Download PDF

2 Comments

  • బాలసుధాకర్ says:

    ” ఉద్యమం గాలి అయినా సోకనికవులు కూడా ఒక ఫాషన్‌గా ఉద్యమ కవిత్వం రాస్తున్న ఈ కాలంలో ఒక కవి నిమగ్నత గురించి నిజాయితీగా కంఠం విప్పడం విడ్డూరంగానే కనిపించవచ్చు. ” – ఎవరికి వారు తరచిచూసుకుని తీర్చిదిద్దుకోవాల్సిన మాట చెప్పారు.

    “ఈ దేశాన్ని
    ప్లాస్టిక్ తీగల విషపుష్పాల ఉద్యానవనాల నుంచి కాపాడడానికి,
    ఏదో ఒకనాడు,
    నేను నీ సాయమే కోరతాను..” -పట్టినట్టు చెప్పారు.

  • devulapalli durgaprasad says:

    దేవిప్రియ గారి సాహితీ విందు ఆరగించని తెలుగు వారు లేరంటే అతిశయోక్తి కాదు. దేవిప్రియ కవన కుతూహలాన్ని దర్భ శయనం & అఫ్సర్ గార్లు చాల బాగా ఆవిష్కరించారు.

Leave a Reply to devulapalli durgaprasad Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)