గణసమాజంలో మనసు తీరాకే మనువు

Kalluri Bhaskaram-pic-a.prabhakar rao (5)

మనిషి ఎప్పుడూ తను ఉన్న పరిస్థితుల మధ్య జీవిస్తాడు. తనకున్న పరిమితులలో జీవిస్తాడు. అలా జీవించడమూ, జీవించడం గురించి ఒక మూసలో ఆలోచించడమూ అతనికి అలవాటుగా మారతాయి. గతంలో దానికి భిన్నమైన పరిస్థితులలో పరిమితులలో మనిషి జీవించాడని కానీ; భవిష్యత్తులో జీవించబోతున్నాడనికానీ సాధారణంగా అతను అనుకోడు. అలాంటి ఊహను అతను ప్రతిఘటిస్తాడు. ఆవిధంగా ఆలోచనలు, అలవాట్లు ఒక సంప్రదాయంగా, లేదా విశ్వాసంగా ఘనీభవించిపోతాయి. అది ఒకవిధమైన స్తబ్ధత. కానీ మనిషి ఇష్టాయిష్టాలతో నిమిత్తం లేకుండా చలనమూ సంభవిస్తూ ఉంటుంది. స్తబ్ధతా, చలనాల మధ్య అతనికి తెలియకుండా నిశ్శబ్ద ఘర్షణ జరుగుతూనే ఉంటుంది.

గడిచిపోయిన కాలంలో మనిషి పరిస్థితులలోనూ; దానికి అనుగుణంగా అతని ఆలోచనలు, అలవాట్లలోనూ మార్పు సాపేక్షంగా ఎక్కువ కాలం తీసుకుంటూ వచ్చింది. అంటే అతను ఎక్కువ కాలం స్తబ్ధతకు అలవాటుపడ్డాడు. ఒక కీలకమైన మార్పు సంభవించడానికి కొన్ని తరాలు పట్టేది. కానీ ఇప్పుడు చూస్తే మార్పు సాపేక్షంగా అతి తక్కువ కాలం తీసుకుంటోంది. ఒక తరంలోనే ఇప్పుడు మనం అనేక మార్పులు చూస్తున్నాం. చలనశీలత ఒక ఝంఝామారుత వేగాన్ని సంతరించుకుంది. ఆ ప్రచండత్వం నుంచి తనను తాను నిలదొక్కుకోడానికి స్తబ్ధత పంటిబిగువు పోరాటం చేస్తోంది. నిజానికి ఏదో ఒక పరిమాణంలో ఈ పోరాటం అన్ని కాలాలలోనూ జరుగుతూనే వచ్చింది. గెలుపు, ఓటములు తారుమారు అవుతూనే వచ్చాయి. ఇప్పటి పోరాటం ఎలా పరిణమిస్తుందో కాలానికి వదిలేద్దాం.

నేటి చలనవేగానికి ఉదాహరణలను చెప్పుకుంటూ వెడితే అదే ఒక ఉద్గ్రంథం అవుతుంది. ఆ అవసరం కూడా లేదు. ఎన్నో ఉదాహరణలు మీ కళ్ల ముందే ఉన్నాయి. ఒక ఆత్మీయమైన ఉత్తరం కోసం రోజుల తరబడి ఎదురుచూస్తూ ‘పోస్ట్’ అనే కమ్మని కేకకు చెవులు రిక్కించుకున్న రోజులు మనకు తెలుసు. కానీ ఇప్పుడు ఉత్తరాలు, పోస్ట్ మ్యాన్ కేక ఆరోవేలుగా మారిపోయాయి. తొంభై దశకం ప్రారంభంవరకు మధ్యతరగతి యువకుడు గవర్నమెంటు ఆఫీసులో గుమాస్తా ఉద్యోగం, కనీసం నాలుగో తరగతి ఉద్యోగం వచ్చినా చాలని కలలు కనడం మనకు తెలుసు. కానీ ఇప్పుడు ప్రతి మధ్యతరగతి కుటుంబం నుంచీ కనీసం ఒక్కరైనా విదేశంలో ఉన్నారు. పౌరాణికులవారు సాంప్రదాయిక విలువల గురించి, జీవనం గురించి, వేషభాషల గురించి మధ్య మధ్య నిట్టూర్పులు పుచ్చుతూ ప్రవచనం చేస్తూ ఉండవచ్చు. కానీ అదే సమయంలో ఆయన కొడుకో, మనవడో ఏదో ఒక ‘మ్లేచ్ఛ దేశం’ లో మ్లేచ్ఛ ఆచారాల మధ్య జీవిస్తూ ఉండవచ్చు. భక్తి తన్మయంతో ఆ ప్రవచనాలు వింటున్న శ్రోతల పిల్లలూ డిటో కావచ్చు. ఎంత గుప్పిట్లో పట్టుకోవాలనుకున్నా కాలం వేళ్ళ సందుల్లోంచి జారిపోతూనే ఉంటుంది.

ఈ మాత్రం వాక్యాలతో మీ ఊహ కీ ఇచ్చి ఇక్కడితో వదిలేస్తాను.

***

మనిషి చరిత్రలో గణసమాజం కూడా సాపేక్షంగా ఎక్కువ కాలాన్ని తీసుకుంది. తన పరిస్థితులు, పరిమితులు, అనుభవాల పరిధిలో మనిషి తన జీవనం తాలూకు విలువలను, వ్యవస్థలను, విశ్వాసాలను రూపొందించుకుంటూ వచ్చాడు. కాలం వెంబడి ఆ ప్రక్రియ అప్పుడే కాదు, ఎప్పుడూ సాగుతూనే ఉంటుంది. మన ఇష్టాయిష్టాలతో కాకుండా, కాలం అనే కళ్ళద్దాలతో చూసినప్పుడు గతాన్ని మనం తటస్థంగా అర్థం చేసుకునే అవకాశం కలుగుతుంది.

‘కన్య అంటే అవివాహిత మాత్రమే తప్ప పురుష సంపర్కం లేనిది కాదు’ అన్న వాక్యం; కన్య గురించిన నేటి మన ఊహను తలకిందులు చేసి షాక్ ఇస్తున్న మాట నిజమే. అప్పుడు షాక్ అబ్జార్వర్ గా పనిచేసేది తటస్థ దృష్టి మాత్రమే.

ఋతుమతి అయితే పురుష సంపర్క దోషం పోతుందన్న సూత్రం, ఆమె కన్యగా సంతానం కన్న అనంతర పరిస్థితికీ వర్తిస్తుంది. అంటే అప్పుడు కూడా ఆమె కన్యగానే ఉంటుంది. ఉన్నప్పుడు పరాశరుడు సత్యవతికి, దుర్వాసుడు(లేదా సూర్యుడు) కుంతికి ప్రత్యేకంగా కన్యాత్వ వరాన్ని ఇవ్వనవసరంలేదు. నిజంగా ఆ వరాన్ని వారు ఇచ్చి ఉండకపోవచ్చు కూడా. ఎందుకంటే, కన్యకు పురుష సంపర్కం దోషం కాదన్న పురాతన ధర్మాన్ని వారు పాటించిఉండవచ్చు. ఆ పురాతన ధర్మానికి కాలం చెల్లి, ఋతుమతి కావడానికీ, కన్యాత్వానికీ పూర్వుల దృష్టిలో ఉన్న ముడి తెగిపోయి, కన్య గురించి ఇప్పటి ఊహ బలపడిన తర్వాత కన్యాత్వ వరం అనే కల్పన చేయవలసిన అవసరం కథకుడికి కలిగి ఉండవచ్చు.

ఇంకా స్పష్టంగా చెప్పాలంటే, కన్యకు పురుష సంపర్కం గణసమాజానికి చెందిన నీతి. గణసమాజంలో దానిని దోషంగా కాదు సరికదా, గుణంగా కూడా భావించినట్టు కనిపిస్తుంది. గణసమాజం అంతరించినా ఆ సమాజం తాలూకు లక్షణాలు అనంతర కాలంలోకి ప్రవహిస్తూనే వచ్చాయి. అలా మన పురాణ ఇతిహాసాలకూ ఎక్కాయి. ఇప్పటికీ మన అనేక ఆచారాలలో, భాషలో, నుడికారంలో గణ సమాజ లక్షణాలు కనిపిస్తాయి.

కన్య విషయానికే వస్తే… ఇద్దరు పండితులను ఉటంకించుకోవలసిన అవసరం నాకిక్కడ కనిపిస్తోంది. ఒకరు, రాంభట్ల కృష్ణమూర్తి. ఇంకొకరు, తిరుమల రామచంద్ర.

రాంభట్లవారి ‘జనకథ’ సామాజిక పురామానవశాస్త్రా(సోషల్ యాంత్రొపోలోజీ)నికి తెలుగులో ఒక వ్యాకరణ గ్రంథం లాంటిది. వివాహవ్యవస్థా, స్త్రీ-పురుష సంబంధాలూ గణదశనుంచీ ఇప్పటి వరకూ ఎలా పరిణామం చెందుతూ వచ్చాయో అందులో ఆయన రాశారు. నేడు వివాహ సమయంలో, ఇతర సందర్భాలలో చదివే వేదమంత్రాలలో గణసమాజం తాలూకు లక్షణాలు ఎలా ప్రతిఫలిస్తున్నాయో సోదాహరణంగా ప్రస్తావించారు. పెళ్లి, స్త్రీ-పురుష సంబంధాలతో ముడిపడిన అనేక విషయాలను ఆయన రాశారు కానీ వాటన్నింటిలోకీ వెడితే ఇప్పట్లో పైకి తేలడం కష్టం. కనుక కన్య గురించి ప్రస్తుతానికి పరిమితమవుదాం.

గణదశలో మనిషి గుర్తించిన తొలి తప్పు అన్నా-చెల్లెళ్ల మధ్య సంబంధం అంటారు రాంభట్ల. దాంతో కొన్ని ఇతర గణాలతో సంబంధం పెట్టుకునేవారు. ఇలా మనువు కలసిన గణాలు అన్నీ కలసి వ్రాతంగా ఏర్పడతాయి. అప్పటికే పశుపాలనతోపాటు పరిమితంగా వ్యవసాయం ప్రారంభమైంది. వ్యవసాయానికి స్థిరజీవితం అవసరం కనుక గ్రామాలు ఏర్పరచుకోవడమూ మొదలైంది. పరిమిత స్థాయిలో పశుపాలననే కాక, వ్యవసాయాన్ని కూడా మొదట్లో స్త్రీలే నిర్వహించేవారు. కానీ మందలు పెరిగేసరికి గ్రామ పరిసరాలు చాలలేదు. పచ్చికబీళ్లను వెతుక్కుంటూ సంచారం అవసరమైంది.

ఈ సంచారదశలోనే అన్నోత్పత్తిలో స్త్రీలు క్రియాశూన్యులయ్యారు. పచ్చిక బాగా ఉన్నచోట వ్రాతాలు కొన్ని రోజులు ఒకేచోట స్థిరంగా ఉండే అవకాశం దొరికేది. వ్రాతంగా ఏర్పడకముందు గణసభ్యులు అందరూ ఒకే గృహంలో ఉండేవారు. ఆ తర్వాత ప్రత్యేకంగా కన్యాశాలలు, వటు(పెళ్లికాని మగవాడు)శాలలు ఏర్పడ్డాయి. అప్పటికే జంట వివాహాలు కూడా మొదలయ్యాయి. జంట వివాహాలు నేటి వివాహాల లాంటివే కానీ కొంత తేడా ఉంది. ఆ వివాహానికి ఇరు గణాలవారూ అనుమతించాలి. నాటి జంట వివాహాలలో ఆస్తి మీద స్త్రీపురుషులకు ఇద్దరికీ సమాన హక్కు ఉంటుంది. పురుషుడు ఒక్క స్త్రీతోనూ, స్త్రీ ఒక్క పురుషుడితోనూ ఉండాలి. అయితే, ఎవరికి ఇష్టం లేకపోయినా విడిపోయి మారు మనువు చేసుకోవచ్చు. ఈలోపల స్త్రీ అయితే తన సొంత గణానికి వెళ్లిపోవచ్చు. పురుషుడు అత్త గణంలోనే ఉండిపోవాలి. జంట విడిపోయిన తర్వాత వారి ఆస్తి వారి గణాలకు బదిలీ అయిపోతుంది. ఈ మారు మనువులు కూడా ఏడు వరకే మర్యాద. ఏడో మనువుకైనా కట్టుబడి ఉండిపోతే ఆ స్త్రీ గౌరీదేవితో సమానం. అది కూడా విఫలమైతే అది చాలా అవమానకర పరిస్థితి. అలాంటివారిని సప్తవిధవలంటారు. ఆ నింద పురుషుడికీ వర్తిస్తుంది.

గురజాడవారి కన్యాశుల్కం అనగానే రాంభట్లవారికి ఒళ్ళు తెలియదు. అందులో గణసమాజ లక్షణాలు ఉట్టిపడే వాక్యాలను తరచు ప్రస్తావించేవారు. మారుమనువుల గురించి ఇంతకు ముందు ప్రస్తావించుకున్నాం. అలాంటిదే సప్తవిధవల గురించిన ప్రస్తావన.

లుభ్దావధాన్లు, రామప్పంతులు, మధురవాణిల మధ్య ఇలా సంభాషణ జరుగుతుంది:

లుభ్దా: మీ కల్పనైతేనేం, మరొహరి కల్పనైతేనేం, బుద్ధి పొరపాటు నాది. మధ్యవెధవలతో నాకేం పని. వెంటనే బయల్దేరిపోయి ఆ అగ్నిహోత్రావధాన్లునే అడుగుతాను.

రామ: మాటలు మా జోరుగా వస్తున్నాయి, జాగ్రత్త. నన్నేనా వెధవలు అంటున్నాడు?

మధు: నన్ను కూడా కలుపుకోవాలని వుందా ఏమిటండీ?

రామ: నన్ను మటుకు వెధవ కింద కట్టావూ?

మధు: నేనుండగా వెధవలు మీరెలా అవుతారు?

రామ: నన్ను సప్తవెధవని చేశావు. మరి ఇంకా తరవాయి యేం వుంచావు?

ప్రస్తుతానికి వస్తే, జతకట్టిన దంపతులు చిన్న చిన్న పర్ణశాలల్లో ఉండేవారు. ఆడపిల్లలైనా, మగపిల్లలైనా ఈడొచ్చిన తర్వాత తల్లిదండ్రులతో ఉండరు. కన్యలు కన్యాశాలలో, వటువులు వటుశాలలో ఉంటారు. ఇలాంటి శాలలను నిద్రాశాలలు అంటారు. నేటికీ ఆదివాసుల్లో నిద్రాశాలలు కనిపిస్తాయి. వాటిని ‘ఘోతుల్’ అంటారు. ఆ దశలో జత దొరకని కన్యనే విధవ అంటారు. మగవారిని విధురులంటారు. విధురులు సామాన్యంగా సోమం చేస్తూ ఉంటారు. సోమం అంటే ఒక తీగ. దానిని నలగ్గొట్టి రసం పిండుతారు. ఆ రసాన్ని వడగొట్టి కొయ్యతొట్టెల్లో నిలవ ఉంచుతారు. సోమం చేసేవారినే సోములు అంటారు. వారు రాత్రింబవళ్ళు వటుశాలలోనే ఉంటారు కనుక కన్యలకు తొలి అనుభవం ఈ సోములతోనే కలుగుతుంది.

అపరాహ్ణం(మధ్యాహ్నానికి, సాయంత్రానికి మధ్య కాలం) వేళ కన్యలు, వటువులు బయటకి వచ్చి స్వేచ్ఛావిహారం సాగిస్తారు. అన్నా-చెల్లెళ్ళు కాకుండా మాత్రం జాగ్రత్తపడతారు. తప్పుకు పాల్పడితే మాత్రం మరణదండన తప్పదు. అన్నలు తప్ప మిగిలినవారు అందరూ గంధర్వులు. అదే గాంధర్వం. గాంధర్వం అష్టవిధ వివాహాలలో ఒకటిగా ధర్మశాస్త్రాలకు, పురాణ, ఇతిహాసాలకు ఎక్కింది. శకుంతలను దుష్యంతుడు గాంధర్వ వివాహం ఆడడం మనకు బాగా తెలిసిన కథ. గణదశలో ఉన్న అన్ని సమాజాలలోనూ ఈ గాంధర్వం ఉండేదని అనడానికి ఆధారాలు కనిపిస్తాయి.

ఈ సందర్భంలో గ్రీకు వివాహచరిత్రపై పుస్తకం రాసిన జర్మన్ శాస్త్రవేత్త బాకోఫెన్ ను రాంభట్ల ప్రస్తావించారు. ‘హెటాయరిజం’ అనే మాటను తొలిసారి వెలుగులోకి తెచ్చినవాడు బాకోఫెన్. అది గ్రీకుల గణవివాహదశను సూచించే మాట. ఆ మాటే మన దగ్గర గాంధర్వం అయింది. ఆరోజుల్లో కన్యలతో క్రీడించడం తప్పు కాదని ఆ మాట చెబుతుంది. మోర్గాన్ సహా పండితులు ఎందరో బాకోఫెన్ పుస్తకాన్ని ప్రామాణికంగా భావించారు.

ఒకరినొకరు ఇష్టపడినంతకాలం కలసి ఉండడానికి చేసుకునే ఒప్పందమే గాంధర్వం. ఏ ఒకరు కోరుకున్నా ఒప్పందం రద్దైపోతుంది. ఆ తర్వాత కూడా ఏ ఒక్కరైనా ఇంకొకరి వెంటపడితే తప్పు. తప్పుకు శిక్ష ఉంటుంది. రాంభట్ల గారి వివరణ ప్రకారం; ఈ సోమ, గాంధర్వ పద్ధతుల వల్ల కన్యలు గర్భవతులు కావచ్చు. అది తప్పు కాదు. అందువల్ల వారి కన్యాత్వం చెడదు. గాంధర్వం గురించిన ఈ వివరాల వెలుగులో శకుంతలా-దుష్యంతుల కథను సరికొత్తగా అన్వయించుకున్నప్పుడు, ఆశ్చర్యంగా ఆ కథ తలకిందులవుతుంది. మనకు తెలిసిన కథ ప్రకారం, శకుంతలను గాంధర్వ వివాహం చేసుకుని, గర్భవతిని చేసి; ఆ తర్వాత నువ్వెవరో నాకు తెలియదన్న దుష్యంతుడే మోసగాడు(చివరికి ఇద్దరూ ఒకటవుతారు, అదలా ఉంచుదాం). శకుంతల అమాయకంగా మోసపోయిన యువతి. కానీ, గాంధర్వం గురించి పైన ఇచ్చిన వివరణ ప్రకారం చూసినప్పుడు, దుష్యంతుడు ఒప్పందం నుంచి బయటపడినా, శకుంతల అతని వెంటబడింది. ఆ విధంగా తప్పు ఆమెది అవుతుంది.

మళ్ళీ విషయానికి వస్తే, ఈ గాంధర్వ సంబంధాలు ఇక చాలు, పెళ్లి చేసుకుంటాననుకున్న కన్య ఒక వరుని ఎంచుకుని తండ్రికి చెబుతుంది. అప్పుడు వధువు తండ్రి వరుని తండ్రిని కలసి వివాహానికి ఏర్పాటు చేస్తాడు. ఆ సమయంలో వధువు మంచితనం గురించి వరుని తండ్రికి చెబుతాడు. వివాహమంత్రాలలో భాగమైన ఋగ్వేదం, పదో మండలం, 85వ సూక్తంలోని మూడవ ఋక్కు ప్రకారం తండ్రి మాటలు ఇలా ఉంటాయి: ‘ఈ అమ్మాయి అన్నను చంపలేదు, భర్తను చంపలేదు, కొడుకును చంపలేదు, ఇందుకు వరుణుడు, బృహస్పతి, ఇంద్రుడు సాక్షులు. ఈమెకు లక్ష్మి వర్చస్సు కలుగుగాక.’

ఆ తర్వాత వధువు తండ్రి వరునికి ఒక ఎద్దును ఇస్తాడు. ఆ సందర్భాన్ని మధుపర్కం అంటారు. ఆ సమయంలో చదివే మంత్రంలో ‘గోః గోః’ అని చదువుతారు(వేదాలలో ఎద్దును కూడా గో శబ్దంతోనే సూచిస్తారు). తర్వాత ఎద్దును దూరంగా తీసుకుపోయి చంపి దాని రక్తంలో సోమం కలిపి ‘మధుపర్కం మధుపర్కః మధుపర్కో మధుపర్కః’ అని కేకపెడతారు. ఆ కేక విని వరుడు అక్కడికి వెళ్ళి మధుపర్కపానం చేస్తాడు. ఆ సందర్భంలో కన్యాదాత వధూవరులకు పెట్టే వస్త్రాలకు మధుపర్కాలన్న పేరు వచ్చింది.

కన్యాదాత వధువును వరునికి అప్పగించేటప్పుడు అగ్ని ముఖంగా చదివే మంత్రాలు వధువు గతాన్ని చెబుతాయి. ‘నీ తొలి భర్త సోముడు. రెండో భర్త గంధర్వుడు. మూడో భర్త అగ్ని’ అని వాటి అర్థం. ఆ తర్వాత, ‘ఈమెను సోముడు గంధర్వుడికీ, గంధర్వుడు అగ్నికీ ఇవ్వగా; అగ్నినైన నేను ధనార్జనకూ, పుత్రులను కనడానికీ నీకు ఇస్తున్నాను’ అని వరుని ఉద్దేశించిన మంత్రాలు చెబుతాయి.

ఇప్పటికీ పెళ్లి తర్వాత ‘పునస్సంధానం’ పేరుతో కొంత తంతు జరుపుతారు. పానుపు వేయించి దాని మీద రెండు బొమ్మలు పెడతారు. ఆ బొమ్మల మధ్య ఒక కర్ర ఉంచుతారు. ఆ కర్రకు గంధర్వుడని పేరు. దానర్ధం, ఆ దంపతులు ఒకటి కావడానికి గంధర్వుడు అడ్డుపడతాడన్నమాట. అప్పుడు చదివే మంత్రం ప్రకారం, ‘అయ్యా, విశ్వావసుగారూ, తమర్ని యాచిస్తున్నాను. ఈమెను విడిచిపెట్టి తరుణవయస్కురాలైన మరొక అమ్మాయిని కోరుకోండి’ అని కన్యాదాత చేతులు జోడించి గంధర్వుని ప్రార్థిస్తాడు.

mahabharata1

కప్పగంతుల లక్ష్మణశాస్త్రిగారు సంస్కృత భారతాన్ని యథాథంగా గద్యంలోకి అనువదించిన ‘సభాపర్వ’ భాగానికి తిరుమల రామచంద్రగారు ఉపోద్ధాతం రాస్తూ ఇలా అంటారు:

మన జీవితాన్ని మలుపు తిప్పే కర్మకాండలోని మంత్రాలు కొన్నింటిని పరిశీలించినా, ముఖ్యంగా వివాహమంత్రాలు పరిశీలించినా ప్రాచీన గణాల పూర్వాచారాలు తొంగి చూస్తాయి. ప్రతి కర్మకూ ప్రారంభంలో ఆచమనానంతరం అగ్నిహోత్రం చుట్టూ కూర్చతోగాని, చేతితో గాని ప్రదక్షిణంగా నీటిని ప్రోక్షించడం ఉంటుంది…

ప్రాచీన గణాలలో అన్నా చెల్లెళ్ల సంపర్కం నిషిద్ధం, అనిష్టం, తప్పు, టాబూ. ఇది ఒక్క ఈజిప్టు వారిలో తప్ప ప్రపంచమంతటా నేటికీ పాటిస్తున్న నీతి. దీనికి సంబంధించి తెలుగులో ఒక పల్లెటూరి వచనం ఉంది:

తల్లివాయి తప్పులేదు, కూతురువాయి కూర్చవచ్చు, అత్తవాయి అదృష్టం, చెల్లెలు వాయి చెప్పరాదు

దీనికి యమ-యమీ సంవాదం మనకు ప్రమాణం.

కొన్ని ప్రాచీన గణాలలో ఒక విచిత్రమైన ఆచారం ఉండేది. ఈ గణానికి సంబంధించిన గ్రామాలలో మధ్యన నిప్పు ఉండే గుడిసె ఉంటుంది. దానికి అటు ఇటు విడిగా చెరి ఒక పొడుగాటి గుడిసె-శాల ఉంటుంది. నిప్పున్న గుడిసెల బృందంలో వంటా, వార్పూ జరుగుతాయి. ఆ రెండు వరసల శాలలలో ఒకదానిలో యువకులు, రెండవడానిలో యువతులు- అవివాహితులు పడుకుంటారు. భోజనానంతరం స్త్రీల శాలలో మొదట ముఖ్యమైన వస్తువులు భద్రపరుస్తారు. వాటిని వృద్ధులు కాపాడతారు. ఆ వృద్ధులు ఒక్కొక్కప్పుడు చిన్నపిల్లలను ఆప్యాయతతో చూసినా తప్పులేదు. ఆ రెండు శాలలలో ఉన్న యువతీ యువకులు ప్రేమించుకుంటారు. వివాహాత్పూర్వ సంపర్కమూ కలగవచ్చు . కలిగిన తర్వాత పెద్దలకు తెలియజేస్తారు. వారు సక్రమంగా అగ్ని ఎదుట వివాహం తంతు జరిపిస్తారు. ఈ ఆచారం మధ్యప్రదేశ్ లోని కొన్ని అనాది జాతులలో పూర్వం ఉండేది. యువతీ యువకుల శాలలను ఘోత్ అంటారు.

ఆ తర్వాత తిరుమల రామచంద్ర గారు వివాహకాండలోని పైన చెప్పిన మంత్రాలనే ప్రస్తావించారు.

అన్నా-చెల్లెళ్ల సంబంధాన్ని నిషేధించడం గురించీ, రామచంద్రగారు ప్రస్తావించిన అగ్ని ప్రాధాన్యం గురించీ చెప్పుకోవలసిన విషయాలు చాలా ఉన్నాయి. ఒకటి చెప్పుకుంటే; అగ్నిసాక్షి, అగ్ని ప్రాధాన్యం మన సంస్కృతిలోనే ఉన్నాయనే అపోహ చాలామందికి ఉంటుంది. కానీ అమెరికా ఆదిమ వాసులతో సహా, గణసమాజం అంతటా అగ్నికి అంతే ప్రాధాన్యం ఉంది. వారిలోనూ వివిధ సందర్భాలలో మనం జరిపే తంతు లాంటివే ఉన్నాయి.

మిగితా విశేషాలు తర్వాత…

 

 

 

 

 

 

 

Download PDF

1 Comment

ఒక వ్యాఖ్యను

Your email address will not be published. Required fields are marked *

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)