మిస్టా కోరిఫర్

అడెలేడ్ కేస్లీ హేఫోర్డ్ పరిచయం

    hayford_adelaide

అడెలేడ్ కేస్లీ హేఫోర్డ్ 1868లో సియెరా లియోన్ లోని ఫ్రీటౌన్ లో జన్మించింది. ఈమె వొక న్యాయవాది,‘సాంస్కృతిక జాతీయత’ కోసం పని చేసిన కార్యకర్త మాత్రమే కాక విద్యావేత్త, కథా రచయిత, స్త్రీవాది కూడా. తన దేశం ఆంగ్లేయుల పాలనలో వున్నప్పుడు, పాఠశాల విద్యార్థినుల్లో సంస్కృతిపరమైన, జాతిపరమైన స్వాభిమానాన్ని పెంపొందించే లక్ష్యంతో1923 లో ఒక స్కూలును నెలకొల్పింది. 1925 లో వేల్స్ రాకుమారుని సన్మానసభకు ఆఫ్రికన్ సంప్రదాయ దుస్తుల్లో హాజరై సంచలనాన్ని సృష్టించింది. పదిహేడేళ్ల వయసులో జర్మనీకి పోయి, అక్కడ సంగీతాన్ని అభ్యసించింది. కొన్నేళ్ల తర్వాత అమెరికాలో పర్యటించి, అక్కడి ప్రజల్లో ఆఫ్రికా గురించిన తప్పుడు అభిప్రాయాలను రూపుమాపేలా ఉపన్యాసాలిచ్చింది.

     మిస్టా కోరిఫర్ అనే యీ కథ లాంగ్స్టన్ హ్యూస్ సంకలించిన African Treasury: Articles, Essays, Stories, Poems (1960) లో చోటు చేసుకుంది.

     ఈమెను 1935లో King’s Silver Jubilee Medal, 1950లో MBE (Most Excellent Order of the British Empire) వరించాయి.

~

 

శవాలనుంచే పెట్టెల్ని తయారు చేసే ఆ వర్క్ షాపులోంచి ఒక్క మాట కూడా వినపడ లేదు. అంటే మనుషుల శబ్దం రాలేదని అనటం. సియెరా లియోన్ దేశానికి చెందిన సంపూర్ణ పౌరుడైన మిస్టా కోరిఫర్ కు మాట్లాడేందుకు ఏమీ లేకపోయింది. అతని దగ్గర శిక్షణ పొందుతున్నవాళ్లు ఆ విషయాన్ని గ్రహించి, మొదట కోరిఫర్ మాట్లాడే దాక ఏమీ మాట్లాడే ధైర్యం చేయలేక పోయారు. తర్వాత వాళ్లు గుసగుసగా మాట్లాడుకున్నారు. మిస్టా కోరిఫర్ మౌనంగా వున్నది అతనికి తన నాలుకనెట్లా ఉపయోగించాలో తెలియక కాదు. అతడు సుత్తితో దెబ్బ వేసినప్పుడల్లా అతని నాలుక ముందుకూ వెనుకకూ కదుల్తూనే వుంది. ఫ్రీ టౌన్ నగరంలో మధ్యన వున్న అతని షాపు నిజానికి సొంత యింట్లోని ఒక భాగం. తన స్నేహితునితో ఒకసారి అతడు చెప్పినదాని ప్రకారం, తన సొంత యింట్లో అతనిది మౌనపాత్ర. అవసరం కొద్దీ అతడట్లా వుండాల్సి వస్తోంది. ఎప్పుడూ లొడలొడ మాట్లాడే అతని భార్య అతణ్ని మాటల్లో ఓడించగలదు.
“ఆడవాళ్లకు వడ్రంగి పని నేర్పటంలో ఎట్లా ప్రయోజనం లేదో వారితో మాట్లాడి కూడా అలానే ఉపయోగం లేదు. ఆడది యెప్పుడూ మేకు తల మీద సుత్తితో సరిగ్గా కొట్టలేదు. ఇంకా చెప్పాలంటే ఆమె ఒక్క మేకు మీద తప్ప మిగతా అన్నింటిమీదా సుత్తితో కొడుతుంది. ఆమె మాట్లాడితే కూడా అంతే” అంటాడు కోరిఫర్.
కాబట్టి పక్కన తన భార్య వున్నప్పుడు కోరిఫర్ నాలుక గడియారపు పెండ్యులమ్ లా నిరంతరంగా ఊగుతుందే తప్ప, అతని ‘నోరు’ మాత్రం దాదాపు మూసుకుని వుంటుంది. కాని యింటి దగ్గర అతడు పాటించే సంయమనం చర్చిలో అధికారిక మతబోధకుని హోదాలో వున్నప్పుడు మాత్రం గాలికి ఎగిరిపోతుంది. ఎందుకంటే మిస్టా కోరిఫర్ ఆ చర్చికి ఒక మూలస్తంభం వంటి వాడు. అతడు ప్రార్థనను జరిపించటం, ఆదివారాలప్పుడు జరిగే ప్రసంగ కార్యక్రమాలను పర్యవేక్షించటం, వేదిక మీద గురుపీఠంలో ఆసీనుడై వుండటం – మొదలైన అన్ని సందర్భాల్లోనూ సమానంగా మంచి సమర్థతను కనబరుస్తాడు.
అతని కంఠస్వరం అద్భుతమైన హెచ్చుతగ్గులతో విశిష్టంగా, ప్రత్యేకంగా వుంటుంది. భక్తిపాటల బాణీల పట్ల అతడు పట్టుదలగా వుంటాడు. ఫలితంగా ఆ పాటలు దాదాపు ప్రతిసారీ ఒంటరి గాయకుని పాటలుగా మిగులుతాయి. అతడు మంద్రస్వరంలో పాడినప్పుడు ఎంత దిగువకు వెళ్తాడంటే, ప్రార్థన కోసం వచ్చినవాళ్లు అతణ్ని అందుకోలేక కొంచెం హెచ్చు స్థాయిలో కొట్టు మిట్టాడుతారు. అతడు హెచ్చు స్థాయిలో పాడటం ప్రారంభించినప్పుడు ఎంత పైకి పోతాడంటే, పిల్లలు గుడ్లప్పగించి నోరు తెరుస్తారు. పెద్దవాళ్లేమో ఆశ్చర్యానందాల్లో మునిగిపోతారు. అతని ప్రార్థనలను గమనిస్తే అతడు ఉరుముతున్నట్టుగా, ఎంత బిగ్గరగా పాడుతాడంటే, వాటిని వినే చిన్న పిల్లలకు తొందరగానే శోష వచ్చినట్టై భయంతో ఏడుస్తారు.
కాని గురుపీఠం మీద కూర్చున్నప్పుడు అతనికి చాలా నిమ్మళంగా వుంటుంది. అతని సేవలు గ్లౌసెస్టర్, లీసెస్టర్ అనే రెండు జిల్లాల్లోని గ్రామాలకే పరిమితమనేది నిజం. ఈ విషయం అతనికి ఎంత మాత్రం సంతృప్తినివ్వలేదు. అయినా గ్రామ చర్చి లోని సమావేశాలు ఏమీ లేనిదానికన్న నయం.
అతనికి ఇష్టమైన పురాణ పాత్రలు జోనా, నోవా. ఆ రెండు పాత్రల మధ్య వున్న సామ్యాన్ని అతనెప్పుడూ చెప్తూ తన ప్రసంగాన్ని సాధారణంగా యిలా ముగిస్తాడు: “నా ప్రియమైన సోదరులారా! ఆ రెండు పాత్రలూ చాలా వరకు ఒకే విధముగా నుండును. వారిద్దరూ పాపభూయిష్ఠమైన, అనైతికత నిండిన తరాలలో బ్రతికిరి. ఒకరు పెద్ద పడవలోనికి పోగా మరొకరు వేల్ అనే పెద్ద చేప నోటిలోనికి పోవటం మీకు తెలిసినదే. వారిద్దరూ విజృంభిస్తున్న అలల నుండి రక్షణ కోరిరి. కావున ఓ నా ప్రియమైన సోదరులారా! మనం పడవలోనికి పోయినా ఫరవా లేదు, వేల్ చేప నోటిలోనికి పోయినా ఫరవా లేదు. దుష్టత్వముల నుండి, దెయ్యముల నుండి మనను మనం రక్షించుకొనటానికి ఏదో వొక సురక్షిత ప్రదేశం, ఒక ఆశ్రయం, ఒక దాక్కునే చోటు కావాలి మనకు”
కాని ప్రార్థన కోసం వచ్చినవాళ్లకు మనసు పూర్తిగా నిండదు.
మిస్టర్ కోరిఫర్ ఎప్పుడూ నల్లని దుస్తుల్నే తొడుక్కుంటాడు. అతడు యూరోపియన్ల ప్రతి వ్యవహారం సవ్యంగా వుండటమే కాక ఆఫ్రికాకు సరిపోయే విధంగా వుంటుందని నమ్మే సియెరా లియోన్ పౌరుల్లో ఒకడు. ఆంగ్లేయ మతబోధకులు సాధారణంగా ముదురు రంగు బట్టల్ని తొడుక్కుంటారని ఎక్కడో చదివిన కోరిఫర్, తను కూడా అటువంటి దుస్తుల్నే వేసుకోవటం ప్రారంభించాడు.
అతడు తన యిల్లును కూడా యూరపులోని ఇళ్లలాగా కట్టుకున్నాడు. తాను లండన్లో కొంతకాలం వున్నప్పుడు అక్కడ యిళ్లను ఎట్లా కడతారో, ఎట్లాంటి ఫర్నిచర్ను వాడుతారో గమనించాడు. ఆ సూత్రాలను పాటిస్తూ తనే స్వయంగా ఇల్లు కట్టుకున్నాడు. గదుల మధ్య అంత విశాలం కాని స్థలాలతో, సన్నని మెట్ల దారులతో, చిన్నచిన్న గదులతో, మందమైన కార్పెట్లతో వున్న ఆ యింటి నిండా సంచులు వుంటాయి. ఆ యిల్లు చాలా ఇరుకుగా, గాలి ఆడనట్టుగా, అపరిశుభ్రంగా, అసౌకర్యంగా వుంటుంది కనుక అతని భార్య ఎప్పుడూ సణగటంలో ఆశ్చర్యం లేదు.
African Kadhalu_title
ముందే చెప్పినట్టు, మిస్టర్ కోరిఫర్ నల్లబట్టలే తొడుక్కుంటాడు. ఎర్రదుస్తులు సవ్యంగా, నప్పేట్టుగా, చాలా చవకగా, ఎంతో జాతీయతను ప్రతిబింబించే విధంగా ఉంటాయని అతనికి ఒక్క క్షణం సేపు కూడా అనిపించదు. లేదు, నలుపే బాగుంటుందని అంటాడతడు. నీలం రంగు కలిసిన నలుపు కూడా అతనికి ఇష్టమే. కాని దానికి ఖర్చు ఎక్కువౌతుందని, మెరుపు లేని నల్లని దుస్తులే వేసుకుంటాడు.
మిస్టర్ కోరిఫర్ చాలా ఒడుపుతో, హాయిగా మాట్లాడగల మరొక విషయం, ఇంతకు ముందు చెప్పుకోనిది వుంది. అది తన కొడుకైన టోమాస్ గురించి యెన్నో ఆశలు పెట్టుకోవటం. టోమాస్ ప్రభుత్వ రంగంలో పని చేస్తున్నాడు కనుక అతణ్ని ఒక ఉన్నతాధికారిగా చూడాలనే ఆశను తన మనసులో దాచుకున్నాడు కోరిఫర్. మరీ ఉన్నత స్థానంలో అని కాదు గాని, ఓ మోస్తరుగానైనా కొడుకు పై స్థాయికి చేరాలనుకున్నాడు. అది చాలా పెద్ద గౌరవమని భావిస్తాడు కోరిఫర్. కాని దురదృష్టం కొద్దీ టోమాస్ ఆ రకంగా ఆలోచించినట్టనిపించదు. కాని తన తండ్రి ముందర అతడు పూర్తి తటస్థమైన అభిప్రాయాన్నే వెలిబుచ్చుతాడు. టోమాస్ తొడుక్కున్న బట్టల్ని చూస్తే అతడు కొంచెం ఆడదానిలా కనిపిస్తాడు గాని, అతని గొంతులో పురుషత్వం స్పష్టంగా కనిపిస్తుంది. తటస్థంగా వుండటం అతనెన్నుకున్నది కాదు. బలమైన పితృస్వామ్య భావనలున్న కోరిఫర్ కుటుంబంలో ఎవ్వరికీ దేన్నీ స్వంతంగా ఎన్నుకునే స్వాతంత్ర్యం ఉండదు. అదీ అసలు కారణం.
మొదట్నుండి చివరిదాకా టోమాస్ జీవితం ముందే నిర్దేశింపబడి వుంది. అతని చర్మం నల్లగా వున్నా, అతనిది అచ్చమైన ఆఫ్రికన్ స్వభావమైనా, అతడు ఆంగ్లేయునిగా పెరగాలని నిశ్చయింప బడింది. రూపంలో కూడా అతడు ఆంగ్లేయునిలా వుండాలని తండ్రి కోరిక.
తత్ఫలితంగా పోస్టు ద్వారా పెద్దపెద్ద పార్శిళ్లు వచ్చేవి. వాటిని విప్పిచూస్తే లోపల చారలున్న, గళ్లున్న , అద్భుతమైన స్వెటర్లు, జెర్కిన్లు, కోట్లు ఆకుపచ్చ రంగువి, నీలం రంగువి ఉండేవి. వాటిమీద ఇంద్రధనుస్సుల్లా మెరిసే ఆకర్షణీయమైన డిజైన్లు, ఇత్తడి గుండీలు కనిపించేవి. చాలా నాజూకైన బూట్లూ, మేజోళ్లూ కూడా ఆ పార్శిళ్లలో వచ్చేవి. అవన్నీ ఇంగ్లండులోని ఫ్యాషన్ కు తగినట్టుగా ఉండేవి.
టోమాస్ ఇప్పుడు పెద్దవాడయ్యాడు కనుక మొదటిసారి బడికి వెళ్లే చిన్నపిల్లవాడి కోసం కొన్నట్టుగా తన దుస్తుల్ని వేరే వాళ్లు ఎంపిక చేయటాన్ని గట్టిగా తిరస్కరించాడు. ఒకసారైతే తన తండ్రి కొన్న గుడ్డలన్నింటినీ మంటలోకి విసిరేసేవాడే కాని, అతని చెల్లి సరైన సమయానికి అతణ్ని వారించింది. తనకన్న ఎనిమిది సంవత్సరాలు చిన్నదైన ఆ పిల్ల పేరు కెరెన్ హాపుచ్. గిడచబారినట్టు చిన్న ఆకారంలో వుండే ఆమె, ఎంత మాత్రం ఆకర్షణీయంగా వుండదు కాని, ఆమె హృదయం చాలా విశాలమైనది. అదెంత పెద్ద తప్పు! మనుషుల హృదయాలు ఎప్పుడూ వారి శరీరపు సైజుకు తగ్గట్టుగానే వుండాలి. లేకపోతే పరిమాణాలన్నీ సమతౌల్యం చెడి, మొత్తం శరీరరూపం అస్తవ్యస్తమౌతుంది. టోమాస్ ఆలోచనలు ఇట్లా సాగుతాయి.
కెరెన్ యెవరూ ఆరాధించని మామూలు పిల్ల. దాంతో ఆమె ఇతరులను అమితంగా ఆరాధించే కళను అర్థం చేసుకుని దాన్ని పాటించింది. టోమాస్ ను ఆమె ఆరాధిస్తుంది. అతనికోసం ఆమె తన వంతు ధనాన్ని పుష్కలంగా వెచ్చించింది. టోమాస్ ను బాధించే ఏ విషయమైనా ఆమెకు మానసిక హింసను కలుగజేస్తుంది.
మంటల్లోకి విసిరేయడానికి గుట్టలా పేర్చివున్న బట్టల్ని చూసిన కెరెన్ అతణ్ని ఎలుగు బంటిలా గట్టిగా పట్టుకుని, “టోమాస్, వాటిని కాల్చొద్దు. ముసలోడు నిన్ను కొరడాతో బాదుతాడు. నేను మగవాణ్నై వుంటే అవి నాకైనా పనికొచ్చేవి” అన్నది.
అది విన్న టోమాస్ మొదటిసారిగా ఆ విషయమై ఆలోచనలో పడ్డాడు. కెరెన్ హాపుచ్ కు తన జీవితంలో యెప్పుడూ ఇంగ్లీషువాళ్ల దుస్తుల పార్శిళ్లు రాలేదు. అందుకే వాటిని అంతగా ఇష్టపడుతున్నదామె అనుకున్నాడు.
మొదట టోమాస్ కేవలం నవ్వాడు. అది సాహసంతో కూడిన మొండితనపు నవ్వు. తర్వాత ఏమైనా కానీ అనే నిర్లక్ష్యమున్న నవ్వు. కాని చెల్లి అన్న వాక్యాల్ని విన్నతర్వాత అతడు తన పాత కోపాన్నంతా మరచిపోయి, ఒక అన్న నిర్వర్తించాల్సిన బాధ్యతను గుర్తు చేసుకుని, తదనుగుణంగా ఆ పనిని మానుకున్నాడు.
కొన్ని ఆదివారాల తర్వాత టోమాస్ కోరిఫర్ తన చెల్లి ఐన కెరెన్ హాపుచ్ తో కలిసి వెస్లీ చాపెల్ చర్చి అరుగు మీదికి నడిచాడు. లివర్ పూల్ నుండి తెప్పించిన అతని దుస్తుల వైభవం ముందు కుచ్చులతో, పేటంచుతో ఎర్ర రంగులో వున్న కెరెన్ డ్రెస్సు ఆమె రూపపు ఆకర్షణ లేమిని మరింత ఎక్కువ చేసింది. కాని ఆమె ముఖం మీద మెరిసిన నవ్వు ఆ వేషాన్ని మరచిపోయేట్టు చేసి, చూపరులకు హాయిని గొలిపింది. జోనా బాధల వర్ణనవల్ల ఆవరిచబోయే దిగులును ముందే పరిహరించే విధంగా ఆమె నవ్వు చర్చినంతా వెలిగించినట్టనిపించింది.
దురదృష్టం కొద్దీ టోమాస్ కు ప్రభుత్వ ఉద్యోగం పట్ల చాలా చులకన భావం వుంది. మితి మీరిన ఆత్మవిశ్వాసంతో అతడు ఆ వుద్యోగాన్ని వదులుకుంటానని మొదట్లోనే తన చెల్లితో అన్నాడు. ఆమె ఆ వుద్యోగంలోని గౌరవాన్నీ, పెన్షను వంటి లాభాల్నీ, ఉద్యోగం లేకపోతే కుటుంబపెద్ద కనబరిచే కోపం తాలూకు శిక్షనూ, అపజయాన్నీ వివరించింది.
“ఉద్యోగాన్ని ఎందుకు వదులుతావు టోమాస్?” అని అడిగింది నిరాశతో.
“ఎందుకంటే అక్కడ నాకు సరైన సెలవు దొరకదు. నేను నాలుగు సంవత్సరాలనుండి పని చేస్తున్నా ఒక వారం రోజుల సెలవు కూడా దొరకలేదు నాకు. పైగా ఈ పాశ్చాత్య దేశాల బాసులు వస్తారు, పోతారు. కొత్తగా వచ్చినవాళ్లు పాతవాళ్లు చేసిందాన్ని నాశనం చేస్తారు. మళ్లీ కొత్తగా వచ్చినవాడు మరింతగా పాడు చేస్తాడు. వాళ్లు కేవలం ఒక యేడాదిన్నర మాత్రమే పనిచేసి, నాలుగు నెలల సెలవు మీద పోతారు. భారీ జీతాలను తీసుకుంటూ ప్రభుత్వ ఖర్చులమీద విలాసవంతమైన ప్రయాణాలు చేస్తారు. ఇక నావంటి ఆఫ్రికన్లేమో పాపం మంచి సెలవే లేకుండా సంవత్సరాల పాటు పని చేస్తారు” అన్నాడు టోమాస్ ఆవేశంగా. “కానీ నువ్వు భయపడాల్సిన అవసరం లేదు కెరెన్. నేను రాజీనామా చేయను. వాళ్లంతట వాళ్లే నన్ను ఉద్యోగంలోంచి తొలగించే విధంగా ప్రవర్తిస్తాను. అప్పుడు ముసలోడికి నన్ను అంతగా తిట్టే అవకాశం ఉండదు” అన్నాడు మళ్లీ.
ముందు అనుకున్నట్టుగా టోమాస్ ఎనిమిది గంటలకు బదులు తొమ్మిది గంటలప్పుడు సిగరెట్ తాగుతూ మెల్లగా ఆఫీసులోకి ప్రవేశించాడు. అతని పై అధికారి అయిన మిస్టర్ బక్ మాస్టర్ కళ్లు పెద్దవి చేసి, గట్టిగా మందలించాడు. సాధారణంగా అతడు మౌనాన్ని పాటించడమే కాక, కళ్లు మూసుకుని వుంటాడు. టోమాస్ కు ఆహం బాగా దెబ్బ తిన్నది. నిజానికి తెల్లవాడైన మిస్టర్ బక్ మాస్టర్ పట్ల టోమాస్ కు తన మనసు లోతుల్లో రహస్యమైన ఆరాధనభావం ఉంది. అతడి మనసును గాయపరుస్తానేమోననే భయం వల్లనే ఇంతకాలం అతడు ఆ వుద్యోగానికి అతుక్కుని వున్నాడు.
కొద్ది రోజుల్లోనే బక్ మాస్టర్ సెలవు మీద వెళ్లిపోతాడని ఈ మధ్యనే విన్నాడు టోమాస్. కనుక తనకు చాలా అసంతృప్తిని కలిగించిన ఆ వుద్యోగాన్ని ఉన్నపళంగా వదిలెయ్యాలని నిశ్చయించుకున్నాడు. టోమాస్ చిన్నచిన్న వార్తాపత్రికల్ని విరివిగా చదువుతాడు. ఇంగ్లండులోని షాపుల్లో పని చేసే అతి చిన్న ఉద్యోగులకు కూడా సంవత్సరానికి పదిహేను రోజుల సెలవు దొరుకుతుందని ఆ పత్రికల్లో చదివాడతడు. నేను ఆఫ్రికాలో పనిచేస్తున్న ఆఫ్రికన్ ను కనుక సెలవు ఇవ్వాల్సిన అవసరం లేదనటం విడ్డూరం – అనుకున్నాడతడు. సెలవు కోసం అతడు పెట్టుకున్న దరఖాస్తులన్నింటినీ చెత్తబుట్టలో పడేశారు పై అధికారులు. తర్వాత ఆఫీసులో పని తక్కువగా ఉన్నప్పుడు సెలవును మంజూరు చేస్తారట.
“కోరిఫర్! నా ఆఫీసురూం లోకి వచ్చి కనపడు” అన్నాడు మిస్టర్ బక్ మాస్టర్ గంభీరంగా. ఉద్యోగం ఊడటానికి ఇది ప్రారంభం అనుకున్నాడు టోమాస్.
“మన ఆఫీసులోని పనివేళలు ఉదయం ఎనిమిది గంటలనుండి తొమ్మిది గంటల వరకు అని నీకు తెలుసనుకుంటా” అన్నాడు మెల్లగా.
“స…స… సార్, తెలుసు” అన్నాడు టోమాస్. గుండె దడదడ కొట్టుకుంటుంటే అతని మూతి వంకర తిరిగింది.
“ఆఫీసులో పొగ తాగటం పట్ల నిషేధముందని కూడా నీకు తెలుసనుకుంటాను”
“తె…తె… తెలుసు సర్” తడబాటు వల్ల నత్తిగా మాట్లాడాడు.
“నిన్నెప్పుడూ నేనొక మంచి క్లర్కుగానే భావించాను. చాలా వినయంగా వుంటావు. సమయ నిబంధనల్ని చక్కగా పాటిస్తావు. నిజాయితీగా ఉంటావు. పనిలో కచ్చితత్వాన్ని పాటిస్తావు. కాని రెండు మూడు వారాలనుండి నీ మీద ఫిర్యాదులు వస్తున్నాయి. నా అంచనా ప్రకారం నీ ప్రవర్తన బాగా లేదు”
మిస్టర్ బక్ మాస్టర్ లేచి నిలబడి మాట్లాడాడు. జేబులోంచి తాళంచెవుల గుత్తిని బయటకు తీసి డ్రాయర్ను తెరిచి, అందులోంచి కొన్ని కాయితాల్ని లాగాడు. “ఇదేనా నువ్వు చేసిన ఆఫీసు పని?” అని అడిగాడు.
టోమాస్ తను ఘోరంగా టైపు చేసిన, సిరామరకల్తో నిండిపోయిన కాయితాల్ని చూసి, సిగ్గు పడుతున్నవాడిలా “అవును… స్సర్” అన్నాడు తడబడుతూ.
“అయితే నువ్వింత ఘోరంగా పని చేయటానికి కారణమేంటి?”
టోమాస్ ఒకటి రెండు క్షణాలసేపు మౌనంగా వున్నాడు. గంభీరంగా వున్న బాసు ముఖంలోకి నేరుగా చూడటానికి ధైర్యాన్ని కూడగట్టుకున్నాడు. అట్లా చూస్తుంటే బాసు ముఖంలోని గాంభీర్యం కరిగిపోయి, పని పట్ల అతనికున్న నిజమైన పట్టింపు కనిపించింది.
“ప్లీజ్ సర్. అసలు విషయమంతా చెప్పమంటారా?”
అరగంట తర్వాత ఓడిపోయిన, పశ్చాత్తాపపడుతున్న, చాలా మౌనంగా వున్న టోమాస్ కోరిఫర్ పక్క తలుపు గుండా మెల్లగా బయటికి వచ్చాడు. తర్వాత ఆ పశ్చిమాఫ్రికా యువకుని సహనశక్తిని గౌరవిస్తూ మిస్టర్ బక్ మాస్టర్ కూడా వచ్చాడు బయటికి.
ఆరు వారాల తర్వాత ఒక యూరోపియన్ తన వర్క్ షాపుకు వచ్చి, తలుపు దగ్గర నిల్చున్నప్పుడు మిస్టర్ కోరిఫర్ తన నాలుకను బిజీగా కదలాడిస్తున్నవాడల్లా పనిని ఆపి, ఆ వచ్చినతని వైపు చూశాడు.
మిస్టా కోరిఫర్ కుర్చీని లాగుతూనే మాట్లాట్టం మొదలెట్టాడు. ఆ కుర్చీ మీది దుమ్మును దులపకముందే “నమస్కారం సార్” అన్నాడు. తర్వాత కుర్చీని వేస్తూ , “దేవుని దయవల్ల మీకు శవాల పెట్టె అవసరం లేదనుకుంటాను” అన్నాడు. నిజానికి అది మహా పర్వతమంత పెద్ద అబద్ధం. ఎందుకంటే ఒక యూరోపియన్ కోసం శవాల పెట్టెను తయారు చేయాల్సిన అవసరం రావటంకన్న ఎక్కువ ఆనందకరమైనదేదీ లేదతనికి. వాళ్లైతే తప్పక పుష్కలంగా డబ్బు యిస్తారు. అది కూడా ఎటువంటి కోత, ఎలాంటి ఆలస్యం లేకుండా. తన దేశస్థులు అట్లా కాదు. వాళ్లు బేరమాడుతారు, సంకోచిస్తారు, డబ్బుకు బదులుగా వస్తువులిస్తారు. తమకున్న ఆర్థిక యిబ్బందుల్ని ఏకరువు పెడతారు. అంతేకాక, కొన్ని వారాల పాటు తిప్పించి సగం డబ్బే యిచ్చి, దానికే సంతోషపడాలంటారు.
మిస్టర్ బక్ మాస్టర్ కుర్చీ మీద కూర్చుని “కృతజ్ఞతలు. నాకిప్పుడే చావాలని లేదు. ఈ దుకాణం ముందు నుండి పోతున్నాను కనుక ఇక్కడ ఆగి, నీ కొడుకు గురించి ఒక మాట చెప్పి పోవాలనుకుంటున్నాను” అన్నాడు.
మిస్టర్ కోరిఫర్ ఏదో శుభవార్త వుందనుకున్నాడు. విజయగర్వంతో, సంతోషంతో అతని శరీరం పులకరించింది. బహుశా తన కొడుకును వాళ్లు పెద్ద రాష్ట్రాధికారిగా నియమిస్తున్నారేమో అనుకున్నాడు. కోరిఫర్ కుటుంబానికి అదెంత గొప్ప గౌరవం! దాంతో సమాజంలో తమ స్థాయి ఎంతగా పెరుగుతుంది? భగవంతుడెంత మంచివాడు? అనుకున్నాడతడు.
“నీ కొడుకు నా ఆఫీసులో పని చేస్తున్నాడని నీకు తెలుసు కదా?”
“ఔను సార్. వాడెప్పుడూ మీ గురించే చెప్తుంటాడు”
“నేను సెలవు మీద స్వదేశానికి వెళ్తున్నాను. మళ్లీ సియెరా లియోన్ కు రాకపోవచ్చు కనుక, అతని పని గురించి ఒక సర్టిఫికెట్ యివ్వటానికి నేనెంతగా సంతోషిస్తానో చెప్పలేను”
“ఔనా సార్” అన్నాడు మిస్టర్ కోరిఫర్ అనుమానంగా.
“అతని ముఖం వాలిపోయింది. ఒకవేళ శుభవార్తకు విరుద్ధమైనదైతే ఎంత అప్రతిష్ఠ? అనుకున్నాడు.
“నీ కొడుకు ఒక నెమ్మదస్థుడనీ, పట్టుదల గలవాడనీ, నమ్మకస్థుడనీ అంటూ ఒక సర్టిఫికెట్ ఇవ్వగలను నేను. అట్లాంటిది కావాలనుకుంటే మీరు దరఖాస్తు పెట్టుకోవచ్చు”
అంతేనా? ఎంత ఆశాభంగం! అయినా అట్లాంటిదైనా తీసుకోతగిందే. మిస్టర్ బక్ మాస్టర్ ఒక ఆంగ్లేయుడు కనుక అతడిచ్చే సర్టిఫికెట్ కు చాలా విలువ ఉంటుంది అనుకుని, కోరిఫర్ తన రెండు చేతుల్తో కళ్లు నులుముకుని, “సార్, కృతజ్ఞుణ్ని, చాలా కృతజ్ఞుణ్ని. ఎక్కువ సమయం లేదు కనుక అదేదో యిప్పుడే రాసిస్తారా?” అన్నాడు.
“తప్పకుండా. ఒక కాయితం ఇస్తే ఇప్పుడే రాసిస్తాను” అన్నాడు బక్ మాస్టర్.
టోమాస్ సాయంత్రం ఆఫీసునుండి రాకముందే మిస్టా కోరిఫర్ దానికి ఫ్రేము కట్టి, పురుగులు తిన్న మఖ్మల్ సోఫాల పైన గోడకు వేలాడదీశాడు.
మరుసటి సోమవారంనాటి ఉదయాన టోమాస్, తన తండ్రిగారి వర్క్ షాపులోకి దభీమని దూకటంతో అక్కడున్న బెంచీ సమతుల్యతతో పాటు, దీక్షతో పని చేసుకుంటున్న మిగతా పనివాళ్ల సమతుల్యత కూడా చెడిపోయింది.
“సార్, తమరు చాలా ఆలస్యంగా వచ్చారు. ఇవ్వాళ మీరు ఆఫీసుకెందుకు పోలేదు?” అని అడిగాడు మిస్టా కోరిఫర్.
“ఎందుకంటే నాకు రెండు పూర్తి నెలల సెలవు దొరికింది నాన్నా . కొంచెం ఆలోచించండి మీరు. రెండు పూర్తి నెలల సెలవు. హాయిగా గడపటమే తప్ప మరే పనీ చెయ్యాల్సిన అవసరం లేదు”
“టోమాస్, శవాల పెట్టెల్ని తయారు చేయటం నేర్చుకోవాలి నువ్వు. ఇదే మంచి అవకాశం నీకు”
‘అమ్మో నా బతుకు చంక నాకిపోతుంది’ అనుకున్నాడు టోమాస్ మనసులోనే. పైకి మాత్రం “ధన్యవాదాలు నాన్నా. ఎట్లా ప్రేమించాలో నేర్చుకోబోతున్నాను నేను. దాంతర్వాత ఒక మంచి మట్టిగోడల గుడిసెను ఎలా కట్టాలో నేర్చుకుంటాను”
“అయితే నువ్వు పెళ్లి చేసుకోవాలనుకుంటున్న అమ్మాయి ఎవరు?” అని గర్జించాడు తండ్రి , తర్వాత అనవలసిన వాక్యాన్ని పూర్తిగా మరచిపోయి.
టోమాస్ ముఖం మీద పెద్ద నవ్వు వెలిగింది. “అయ్యా, ఆమె చాలా మంచి అమ్మాయి. ఎంతో మౌనంగా, మెత్తని మనసుతో, ప్రసన్న వదనంతో వుంటుంది. ఆమె ఎక్కువగా మాట్లాడదు”
“ఓహో, అలాగా? అంతేనా?”
“కాదు కాదు. ఆమెకు డ్రెస్సులు కుట్టటం, ఇల్లును పరిశుభ్రంగా వుంచటం, ఇల్లును చక్కగా నడపటం వచ్చు. ఆమెకు చాలా తెలివి ఉంది. ఆమె ఒక మంచి తల్లి కాగలదు”
“సరే. అంతకన్న ఎక్కువ చెప్పేది ఏమీ లేదా?”
“ఆమె చాలా సంవత్సరాల పాటు బడికి వెళ్లింది. పుస్తకాలు బాగా చదువుతుంది. బాగా రాస్తుంది కూడా. ఓహ్, ఎంత మంచి ఉత్తరాలవి?” అన్నాడు టోమాస్ షర్టుజేబు మీద ఆప్యాయంగా కొట్టుకుంటూ.
“అలాగా? ఆమె వంట కూడా బాగా చేస్తుందనుకుంటాను”
“ఆ విషయం నాకు తెలియదు. బహుశా తమరు చెప్పింది నిజం కాదేమో. అయినా దాంతో పెద్ద యిబ్బందేమీ వుండదు”
“ఏంటీ? వంట చేయటం రాని అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని అంటున్నావా నువ్వు?” అని గర్జించాడు ముసలాయన.
“నేనామెను ప్రేమిస్తున్నాను కనుక ఆమెనే పెళ్లి చేసుకుంటానయ్యా”
“అది సరే కాని, మన ఆఫ్రికన్లకు హృదయమన్నా కడుపన్నా ఒకటే. మనదేశంలో ఏ మగవాడూ వంట రాని అమ్మాయిని పెళ్లి చేసుకోడు. అది అన్నిటికన్న ముఖ్యమైన విషయం. నీ సొంత తల్లి వంట చేస్తుంది కదా”
‘అందుకే ఆమెకు ఎప్పుడూ దుర్భరమైన చాకిరీ చేయటం తప్ప వేరే ఏ ఆనందమూ వుండదు’ అనుకున్నాడు టోమాస్ మనసులోనే. తన మాటల్ని ఇలా కొనసాగిస్తుంటే అతని ముఖం గంభీరమైపోయింది: “మన దేశంలోని విధానం సరైనది కాదు నాన్నా. తన భర్త కోసం ఒక యిల్లాలు మంచి భోజనాన్ని తయారు చేస్తే అతడు భార్యాపిల్లల కోసం ఏమీ మిగల్చకుండా అంతా మింగేయటం నాకు నచ్చదు నాన్నా . ఉహుఁ , అట్లాంటిది వద్దు. ఇక పోతే , నేనొక ఆంగ్లేయునిగా తయారవ్వాలని ఎప్పుడూ అంటుంటావు నువ్వు. అందుకే ఎప్పుడూ నీతో మంచి ఇంగ్లీషు మాట్లాట్టానికి ప్రయత్నిస్తాను నేను”
“అది సరే. అది చాలా మంచి విషయం. కాని నువ్వొక ఇంగ్లీషువాడిలా ‘కనిపించాలి’. వాళ్లను పూర్తిగా అనుకరించాలని అనటం లేదు నేను”
“కాని చచ్చేదాకా ప్రయత్నించినా నేనొక ఆంగ్లేయునిలా కనిపించలేను. అలా కనిపించాలని నాకు వుండదు కూడా. కాని ఇంగ్లీషువాళ్ల కొన్ని ఆచారాలు నాకు నిజంగా బాగా నచ్చుతాయి. వాళ్లు భార్యలను ఎట్లా చూస్తారో నాకు నచ్చుతుంది. వాళ్ల కుటుంబ జీవన రీతి నాకు నచ్చుతుంది. తల్లీ, తండ్రీ , పిల్లలూ, కుటుంబమంతా కలిసి భోజనం చేయటం నాకిష్టం”
“ఓహో అలాగా?” వెటకారంగా తిప్పికొడుతున్నట్టుగా అన్నాడు తండ్రి. మళ్లీ “మరి వంటెవరు చేస్తారు? నీ నాలుగు పౌండ్ల జీతంతో ఒక మంచి వంటమనిషిని పెట్టుకోవచ్చు నుకుంటున్నావా?” అన్నాడు.
“కాదు. నేనట్లా అనటం లేదు నాన్నా . పెళ్లికన్న ముందరే అక్కాస్టసువా వంట నేర్చుకుంటుందని నా నమ్మకం. కాని నువ్వేం అర్థం చేసుకోవాలంటే, ఆమెకు వంట వచ్చినా రాకున్నా అదేమంత పెద్ద విషయం కాదు కనుక నేనామెను పెళ్లి చేసుకోబోతున్నాను”
“అయితే చాలా మంచిది. కాని నువ్వొక మట్టిగుడిసెకు బదులు వెర్రిగృహానికి సొంతదారు కాబోతున్నావు”
“ధన్యవాదాలు నాన్నా. కాని నేనేమిటో నాకు బాగా తెలుసు. ప్రస్తుతానికి మట్టిగుడిసే మాకు బాగా సరిపోతుంది”
“మట్టిగుడిసె సరిపోతుందా?” అని భయంగా అన్నాడు మిస్టర్ కోరిఫర్. తర్వాత “నువ్వొక మంచి విదేశీ గృహం లాంటి యింట్లో వున్నావు. దాంట్లో మంచి మెట్లదారి, అందమైన పిట్టగోడ, దళసరి తివాచీ, ముచ్చటగొలిపే ఫర్నిచర్ వున్నాయి. నువ్వు మట్టిగుడిసెలో వుంటావా? కృతఘ్నుడా. సిగ్గు పడాలి” అన్నాడు.
“ప్రియమైన నాన్నా. నువ్వు సిగ్గుపడేలా చేయను నేను. ఆ మట్టిగుడిసె చాలా విశాలంగా, శుభ్రంగా వుంటుంది. అదొక సంతోషం నిండిన చిన్న యిల్లులా ఉంటుంది. కేవలం ఇద్దరికి సరిపోయేటంత. అంతకన్న యేం కావాలి? గోడలమీద మంచి ఆకుపచ్చని పెయింటును వేయిస్తాను. కెరెన్ చదివే బడిలో హెడ్ మాస్టరుగారి గదిలో లాగా”
“మరి నీ భార్య గది ఎలా వుండబోతుంది?”
“కెరెన్ కోసం ఫీజు కట్టటానికి నన్ను రెండుమూడు సార్లు స్కూలుకు పంపావు నువ్వు. అప్పుడు ఆ గోడల్ని చూశాను నేను. అవి నాకు చాలా నచ్చాయి”
“అలాగా. ఇంకా యేం చేయాలనుకుంటున్నావు నువ్వు?” అని అడిగాడు తండ్రి వ్యంగ్యంగా.
“కొన్ని కేన్ కుర్చీలను కొంటాను. కింద నేల మీద పరచటంకోసం మంచి మెరిసే ప్లాస్టిక్ షీట్లను కొంటాను. ఇంకా……”
“ఆఁ , యింకా?”
“నా భార్యను ఇంటికి తీసుకొస్తాను”
ఒక్కొక్క క్షణం గడుస్తున్నకొద్దీ మిస్టర్ కోరిఫర్ లో నిస్పృహ పెరిగిపోతోంది. ఒక మట్టిగుడిసె! ఈ నా …. కొడుకు. నా జీవితానికి వెలుగనుకున్నవాడు. ఒక ప్రభుత్వాధికారి కాబోయే ఆంగ్లేయుడు. మట్టి గుడిసెలో నివసించటం! అతని నైరాశ్యం విపరీతంగా పెరిగింది. కృతజ్ఞత లేని దరిద్రుడా! నువ్వు నన్ను అప్రతిష్ఠ పాలు చేస్తున్నావు. నీ పేదతండ్రిని పాతాళంలోకి పడతోస్తున్నావు. నీ ఆపీసు హోదాను తక్కువ చేస్తున్నావు.
“క్షమించు నాన్నా. నిన్ను బాధ పెట్టడం నా ఉద్దేశం కాదు. నాకోసం నువ్వు చేసిందానికి నేనెంతో కృతజ్ఞుడిని. కాని నా జీతం పెరిగింది కనుక నేను సొంత యింటిని కట్టుకోవాలనుకోవటం సహజమే” అని ఆగి , నేరుగా తండ్రిముఖం లోకి చూస్తూ మళ్లీ “ఇప్పడే చెప్పటం మంచిది. ఇకమీదట నాకోసం నువ్వు ఏ లివర్ పూల్ సూట్లకోసం ఆర్డరివ్వాల్సిన అవసరం లేదు”
“ఎందుకవసరం లేదు?” అని ఉరిమినట్టుగా కోపంగా అన్నాడు తండ్రి , కళ్లద్దాలు కింద పడిపోకుండా వాటిని ముఖం మీంచి తీస్తూ.
“నీ మనసును నొప్పిస్తున్నందుకు నాకు విచారంగా వుంది నాన్నా . కాని నువ్వు కోరుకున్న యూరోపియన్ ప్రమాణాలకు తగ్గట్టుగా బతకటం కోసం ఇన్నాళ్లూ నేనెంతో ప్రయత్నించాను. అదంతా శాశ్వతంగా విసిరిపారేయబోతున్నాను. అమ్మ తరఫువాళ్లు తొడుక్కునే సంప్రదాయ దుస్తుల్నే తొడుక్కోబోతున్నాను. మళ్లీ చర్చికి పోయినప్పుడు నేనొక సంప్రదాయ ఆఫ్రికన్ గా కనపడుతాను”
తర్వాత వచ్చిన ఆదివారం నాడు తన కొడుకు ఒక పొడవైన లాగునూ, గాంబియా దేశస్థులు ధరించే వదులైన, ముదురు రంగున్న ఎర్రని చొక్కానూ తొడుక్కుని చాకొలేట్ రంగులో వున్న ఒక యౌవనవతి ఐన అందమైన పిల్లను (ఆమె కూడా సంప్రదాయ దుస్తుల్ని వేసుకుంది) వెంటబెట్టుకుని చర్చి అరుగు మీదికి నడుస్తుంటే మిస్టా కోరిఫా ఎంత నిరాశ చెందాడంటే, అకస్మాత్తుగా అతని మెదడులో శూన్యం ఆవరించింది. అతడు జోనానుగానీ, వేల్ చేపనుగానీ జ్ఞాపకముంచుకోలేక పోయాడు. అతని నోట్లోంచి ఒక్కటంటే ఒక్క మాట కూడా రాలేకపోయింది. ఆనాటి కార్యక్రమాన్ని కేవలం మామూలు ప్రార్థనగా మార్చాల్సి వచ్చింది.
ఇప్పుడు మిస్టా కోరిఫర్ మతబోధకుడెంత మాత్రం కాడు. అతడు కేవలం శవాల పెట్టెల్ని తయారు చేసే ఒక వడ్రంగి మాత్రమే.

-అడెలేడ్ కేస్లీ హేఫోర్డ్
అనువాదం: ఎలనాగ

Download PDF

ఒక వ్యాఖ్యను

Your email address will not be published. Required fields are marked *

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)