ఎగిరే పావురమా! -7

egire-pavuramaa-7

సమాచారం దాఖలు చేసి, ఉమమ్మ అందించిన కాగితాలు తీసుకుని నర్సు చేతికిచ్చారు డాక్టరుగారు.

“గాయత్రిది జబ్బు కాదు. ఆమె స్థితిని అంగవైకల్యంగా పరిగణిస్తారు.
ఆసుపత్రి చేయగలిగిందల్లా సులువైన పద్ధతిలో, కనీసం ఒక కాలైనా మోకాలు వరకు తీసేసి కుత్రిమ కాలు అమర్చవచ్చు. దానికైనా గాయత్రికి పద్దెనిమిదేళ్ళు నిండితేనే మంచిది,” అని ఓ క్షణమాగారు ఆయన.

“ఇకపోతే, గాయత్రి మూగతనం పోయి మాట వస్తుందా? అని నిర్ధారించేవి మాత్రం, కొన్ని సున్నితమైన ‘స్వరపేటిక పరీక్షలు’. ప్రభుత్వాసుపత్రిలో అవి కుదరకపోవచ్చు. ఆ విషయంగా, ఇక్కడి పెద్ద డాక్టర్ గారు మిమ్మల్ని గుంటూరు లేదా హైదరాబాదులోని నిపుణల వద్దకు వెళ్ళమని సూచనలిస్తారు. ఎంతో సమయం, వ్యయం అవ్వొచ్చు,” అంటూ తాతకి నెమ్మదిగా వివరించారాయన.
అందరం శ్రద్ధగా వింటున్నాము.

క్షణమాగి మా వంక సూటిగా చూసారాయన.
“పోతే గాయత్రికి వినికిడితో పాటు మిగతా ప్రమేయాలన్నీ మామూలుగా ఉన్నాయి. బాగానే చదువుకుంటుందని కూడా తెలిసింది. కాబట్టి, సరయిన పద్ధతిలో వైద్యం అందితే ఆమె స్థితి మెరుగవుతుందనే ఆశించవచ్చు, ఆశిద్దాము,” అన్నారు డాక్టర్ గారు.

తాత ఉమమ్మ వంక చూసాడు.
“అయితే మీరు ఏమంటున్నారో దయచేసి మాకు అర్ధమయ్యేలా చెప్పండి. ‘క్రచ్చస్’, అదే ‘ఊతకర్రలు’ వాడమంటున్నారు, మరి తరువాత జరపవలసిన పరీక్షలవీ ఎప్పుడు? ఎక్కడ?” అని ఆగింది ఉమమ్మ.

“చూడండి ఉమాగారు, నేను ఇక్కడ ట్రైనింగ్ లో ఉన్న డాక్టర్ని. ముందు ‘ఊతకర్రల’ కి నర్సుని అవసరమైన వివరాలు, కొలతలు తీసుకోనివ్వండి. ఈ ఆసుపత్రి అనుబంధ సంస్థ ‘శ్రీ సత్య శారద చారిటీ’’ నుండి వారంలోగా గాయత్రికి వాడుకోడానికి ‘ఊతకర్రలు’ మీ చిరునామాకే వస్తాయి.

ఇకపోతే, గాయత్రి విషయమంతా దాఖలు చేసి మా పెద్ద డాక్టరుగారికి పంపిస్తాను. మీరు మళ్ళీ కొంత ఆగి, ఇక్కడ ఆసుపత్రిలో ఆయన్ని కలవచ్చు,” అని ముగించాడాయన.

ఆయన వద్ద సెలవు తీసుకొని, నర్సుకి కావలసిన కొలతలు, వివరాలిచ్చి బయటపడ్డాము.
**
తాత కూడా తన విషయంగా వైద్యుడిని చూశాడు. ఆయన ఆరోగ్యం బాగా పాడయిందని, ఎక్సురే తీసి, రక్తపరీక్షలు చేసారు. కడుపులో ఆమ్లత ఎక్కువుగా ఉందని, దాంతో కడుపులో వ్రణాల ఉదృత వల్ల కూడా బాగా కడుపు నొప్పి, మంట, వాంతులు తరుచుగా అవ్వొచ్చని చెప్పారు.
ఆమ్లతకి వెంటనే చికిత్సతో పాటు శ్రద్ధగా మందులు వాడకం, మంచి ఆహారం, విశ్రాంతి అవసరమని చెప్పారు. జాగ్రత్తలు చెప్పి మందులు రాసిచ్చారు.
అవి తీసుకొని ఇంటిదారి పట్టాము.
**
తాత దిగులుగా కనబడ్డాడు. కారులో తలా ఒక మాట మాట్లాడుతుంటే తాత మాత్రం ఏదో ఆలోచిస్తూ ఉండిపోయాడు.
చంద్రం పిన్ని తాతకి మంచినీళ్ళ చెంబు అందించింది. నీళ్ళు తాగి మరచెంబు నాకందించాడు.

”గాయత్రి విషయంలో డాక్టరుగారు చేసే సాయం ఏదైనా మంచిదే, ఉమమ్మా. అయినా నా ప్రయత్నంగా మాత్రం పూజారయ్య చెప్పిన వికలాంగుల సంస్థని కూడా కలుస్తానమ్మా,” అని ఆమెతో అంటూ ఇంకాస్త ముందుకెళ్ళాక, పనుందని కారు దిగిపోయాడు తాత.

కాసేపటికి మమ్మల్ని కూడా కొట్టాం కాడ దింపేసి కారు ఉమమ్మ ఇంటి వైపు మళ్ళింది.
**
కొట్టాం చేరాక, పిన్నిచ్చిన గంజి తాగి, పుస్తకం చదువుతూ కూచున్నాను.
టీ కాచి తెచ్చుకొని, పక్కనే కూచుంది పిన్ని.

“మా కొట్టాంకెళ్ళి కాసేపట్లో మళ్ళీ నీ ముందుంటా. మీకు ఈ పూటకి కాస్త పప్పు, రొట్టెలు కూడా తెస్తా. ఈ లోగా అవసరం వస్తే పొయ్యికవతల కట్టిన గంట మోగించు,” అని మరి కాసేపటికి పిన్ని తమ కొట్టాంకి వెళ్ళింది.
**
సాయంత్రం చీకటి పడుతుండగా తాత రిక్షాలో దిగాడు. రిక్షాబ్బాయి సాయంతో లోనికొచ్చాడు. తాత ముఖం మీద, బట్టల మీద రక్తపు మరకలు చూసి భయపడిపోయాను.
తాతని పట్టుకు కుదుపుతూ ఆదుర్దాగా ఏమయిందని అడిగాను. వకీలు ఇంటినుండి రిక్షాలో వస్తున్న తాతకి విపరీతంగా దగ్గు మొదలయ్యిందంట. ఆ వెంటనే రక్తం కక్కుకున్నాడంట.
రిక్షాబ్బాయి సాయం చేసి మెల్లగా ఇంటికి చేర్చాడంట.

తాత ముఖం కడుక్కొని, బట్టలు మార్చి వచ్చేలోగానే పిన్నొచ్చింది. ఆమెని చూడగానే ఆపుకోలేక బిగ్గరగా ఏడ్చేసాను. తాత పడక పక్కనే కూచున్న నా కాడికి వచ్చి నన్ను దగ్గరికి తీసుకొంది.

అంతలో స్నానాల గది నుండి బయటపడి, కాళ్ళీడ్చుకుంటూ వచ్చి తన నులక మంచం మీద కూచున్నాడు తాత. సత్తువ లేకుండా అయిపోయిన తాతని చూసి మేమిద్దరం దిగాలు పడ్డాము.

కాస్తాగి పిన్ని వంక చూసాడు తాత. “పోతే చంద్రమ్మా, వికలాంగుల సంస్థ యజమాన్ని కలిసి గాయత్రి కోసం అర్జీ పెట్టాను. వకీలుని కలిసి పొలం విషయం మాట్లాడి, లంచాలకంటూ ముందస్తు డబ్బులు నా కాడ లేవని వివరించాను. చూడాలి దేవునిదయ. నా చేతుల్లో ఇకేమీ లేదమ్మా,” అంటూ మంచం మీద తొంగున్నాడు తాత.

తాత చెప్పింది ఒపిగ్గానే విన్నది పిన్ని.
”ఏదేమైనా విశ్రాంతి లేకుండా వొళ్ళు పాడయ్యేటంతగా అలిసిపోడం మంచిది కాదన్నా నీకు. ఇలా రక్తం కక్కుకోడం, నీరసం వచ్చి పడిపోడం డెబ్బైయేళ్ళ వయసులో ఏ రకంగా నీకు, నీ గాయత్రికి మంచిదో సెప్పు,” కోపంగా మాటలంటూనే పోయింది చంద్రం పిన్ని.

పిన్ని చెప్పేదంతా వింటూ కిక్కురు మనకుండా పడుకుండి పోయాడు తాత.
**
మరసటి రోజు పావుగంట ముందే నేను గుడికెళ్ళాను.

నన్ను చూస్తూనే గబగబా పరిగెత్తుకొనొచ్చింది కమలమ్మ.
“అబ్బో పిల్లా, వచ్చేశావా? ఒకే ఒక్కరోజు పువ్వుల్లాంటి నీ నవ్వులు సూడకపోతే పొద్దు పోలేదనుకో. నీ తానంలో నేను కూకుంటే గుడికోచ్చే నీ అభిమానులకి నచ్చలేదనుకో.
మా గాయత్రి ఎప్పుడొస్తుంది? అని ఒకటే గోల. నీ అందం అసుమంటిది మరి. నీ అవిటితనం పోతే అసలు నీ లెవెలే మారిపోతాదిలే,” గంటలా గణగణా మోగింది కమలమ్మ గొంతు.
నవ్వేసి ఊర్కున్నాను. పూజసామాను సర్దుతూ నాతో మళ్ళీ మాట కలిపింది కమలమ్మ. ఈ సారి నా విషయంలో డాక్టర్లు ఏమన్నారనడిగింది. తాతెందుకు రాలేదని అడిగింది.

‘నాకు ఇంకా వైద్య పరీక్షలు ఉంటాయని, తాతకి వొంట్లో బాగోక రాలేదని’ తెలియజెప్పాను.
నేను చెప్పిన వివరాలు చాల్లేదామెకి.
“మీ తాత కనపడ్డప్పుడు అడిగి తెలుసుకుంటాను. నీకేం తెలుస్తాదిలే? చిన్నపిల్లవి,” అంటూ కాస్త విసురగా అవతలకి వెళ్ళబోయింది.

వెళుతున్న ఆమెని చేయి పట్టి ఆపాను.
‘నిన్నటి రోజున పావురాళ్ళు వచ్చాయా? గింజలేసావా?’ అని సైగలతో అడిగాను.

“ఆ ఆ, ఎందుకు వేయను? బాగానే ఒకటికి రెండు మార్లు వచ్చి గింజలు మెక్కి, కావలసినంత గోల చేసి మరీ వెళ్ళాయిలేమ్మా,” రుసరుసమంటూ కదిలిందామె.
**
గుడిలో మధ్యాహ్నం రద్దీ తగ్గాక నా కాడ చేరింది కమలమ్మ. నా కిష్టమైన బెల్లం పాయసం అంటూ గ్లాసు అందించింది.

“మా గోవిందు, ఊరికి కాస్త దూరంగా విశాలమైన పాక కిరాయికి తీసుకున్నాడు. ఇన్నాళ్ళు ఎవరితోనో కలిసి సత్రంలోలా ఉండేవాడుగా!. ఇప్పుడు వాడి సొంత పాకలో కాస్త అదీ ఇదీ సర్ది, వాడికిష్టమైంది వండి పెడదామని, ఆదివారాలు మధ్యాహ్నాలు కాసేపు ఎళ్ళొస్తున్నా. నాకు కొడుకైనా, తమ్ముడైనా వాడేగా,” అని వివరించింది.

‘ఊ’ కొడుతూ వింటున్నాను. పాయసం బాగుందని సైగ చేసాను.
కబుర్లు చెబుతూనే ఉంది కమలమ్మ.
“ఈడ నుండి విశ్రాంతి కావాలంటే, హాయిగా గోవిందు పాకకి పోవడమే,” అన్నది మళ్ళీ సంబరంగా కమలమ్మ.
**
ఒక్కింత ఓపిగ్గానే ఉందంటూ ఖాయిలా పడి లేచిన మూడోరోజు చీకటితో నా రిక్షా వెనకాలే నడుస్తూ పనికొచ్చాడు తాత.
పూజసామాను సర్దుతున్న తాతతో మాట కలపాలని ఆత్రుతగా వచ్చింది కమలమ్మ.

“అయితే అన్నా, మరి డాక్టరు ఏమన్నాడు? మా గాయత్రికి మాట, నడక ఎప్పుడొస్తాయన్నాడు? మాకు తెలిసిన ఒకమ్మాయికి ఇలాగే ఉండేది. పట్నం డాక్టర్లు వైద్యం చేసి ఇప్పుడు చకచకా నడిపిస్తున్నారు. మన గాయత్రి లాగానే అప్సరసనుకో.
ఇక కాలు బాగయిన రెండేళ్ళకి ఓ గొప్పింటి కుర్రాడు ప్రేమించి పెళ్ళి కూడా చేసుకున్నాడు సత్యమన్నా. నిజ్జంగా, అమ్మతోడు,” అంది తల మీద చెయ్యెట్టుకొని నవ్వుతూ కమలమ్మ.
తాత కిమ్మనలేదు.
తన మాట చెప్పుకుంటూ పోయిందే గాని తాతకి నోరు విప్పి మాట్లాడే సందు ఇవ్వదుగా కమలమ్మ.
నాకేమో ఆ అమ్మాయికి వైద్యం చేసిన డాక్టర్లు ఎవరని కనుక్కుంటే బాగుండుననిపించింది.
egire-pavurama-7-revised
**
మధ్యాహ్నం పొంగలి ప్రసాదం తిని తాత కూరల బడ్డీ వైపు వెళ్ళగానే కమలమ్మ నా కాడికొచ్చి కూచుంది.
నడకొచ్చిన ఆ చుట్టాలమ్మాయి గురించి ఎలాగైనా అడగాలని అనుకుంటుండగా, ఆమే అందుకుంది.

“నే చెప్పేది నిజమేనే తల్లీ, నీకిప్పుడు పదిహేనేళ్ళు కదా! ఐదేళ్ల వయసు నుండి ఈడ ఇలా కొలువు చేస్తివి కదా! నీ హుండీ డబ్బే బోలెడంత కూడుకొనుంటుంది మీ తాత కాడ.
ఆ డబ్బు పెట్టి వైద్యం చేయిస్తే పోలా?
ఎంచక్కా మా చుట్టాలమ్మాయి లాగా బాగయిపోయి ఎవరినో ఎందుకు?
నీకు తెలిసిన నా తమ్ముణ్ణి పెళ్ళి చేసుకోవచ్చు,” క్షణమాగి నా వంక చూసింది…
ఏమంటుందో అర్ధం అవ్వలేదు నాకు…

“సవితితల్లి కొడుకన్న మాటేగాని, నా బిడ్డ లాంటోడేగా గోవిందు. కాస్త రంగు తక్కువేమో గాని బాగుంటాడు వాడు. ఆటో కూడా చేతికొచ్చేస్తే, రాజాలా సంపాదిస్తాడు.
వాడు ఒప్పుకోవాలే గాని, మంచి మొగుడౌతాడు నా తమ్ముడు,” నోటికొచ్చింది అంటూనే ఉంది కమలమ్మ.

నా తల గిర్రున తిరిగినట్టయింది. నా కాళ్ళ వైద్యం నుంచి పెళ్ళి వరకు వెళ్ళిపోయిన కమలమ్మ మాటల్లో నిజం ఉందా అనిపించింది.

ఆలోచనలో పడ్డాను.
‘అసలీ బుర్రలేని పెళ్లి మాటలేంటి? పిన్నికి, తాతకి అందుకే నచ్చదేమో కమలమ్మ తీరు’ అనుకుంటుండగా ……
“ఏమోలే, నువ్వా నోరులేని దానివి. ఇలాంటి ఇషయాలు మీ తాతతో, ఎలాగైనా నువ్వే తేల్చుకోవాలి. నిన్ను చూస్తే చానా కష్టంగా ఉంది. వైద్యం చేయిస్తే మాములు మనిషయ్యి చక్రం తిప్పగలవు నువ్వు,” అంది కమలమ్మ మళ్ళీ బిగ్గరగా నవ్వుతూ.

ఆమె మాటలకి ఆశ్చర్యపోయాను. ఎప్పుడూ ఏదో ఒకటి ఇట్టాగే మాట్లాడుతుంది.

“అయ్యో నీతో మాటల్లో పడి మరిచేపొయ్యా. ఇయ్యాళ ఆదివారం కదా. ఈ సమయానికి మా తమ్ముడు వచ్చుంటాడు. వాడి పాక వరకు ఎళ్ళి గుడి తెరిచేలోగా, నాలుగింటికంతా వచ్చేస్తానే,” అంటూ రిక్షా ఆగే చోటు – గుడి వెనక్కి పరుగు తీసింది కమలమ్మ.
**
బయట సన్నగా తుప్పర పడుతుంది. ఇంకా తెల్లారలేదు. ఈ మధ్యనే నా కోసం తాత వేసిన కొత్త పరుపు మీద బాగా నిద్ర పడుతుంది. అయినా చీకటితో లేచి కూచున్నాను.
పరీక్షల భయం పట్టుకుంది. నాలుగు రోజుల్లో మాష్టారు పెట్టబోయే పరీక్షలు మునపటికన్నా మెరుగ్గా రాయాలంది ఉమమ్మ.

చదువుతూ ఆలస్యంగా తొంగోడంతో బద్ధకంగా ఉంది.
తాత లేచాడో లేదో తెలీలేదు.. పడక మీదనుండి లేవబోయాను….

కొట్టాం తలుపు తెరిచిన చప్పుడయింది. చూస్తే, చేతిలో ఎర్ర మందార పువ్వులతో, పిన్ని లోనికి వచ్చింది….

“లేరా గాయత్రి, ఇవాళ ‘అట్లతద్ది’. త్వరగా లేచి స్నానం చేసి తయారవ్వు. తాత కుట్టించిన కొత్త పరికిణీ వోణీ వేసుకో. నీ తలదువ్వి రెండు జడలు వేద్దామని వచ్చాను.
నీ జుట్టు పెద్దపని కదా. టైం పడుతుంది,” అంటూ నా ఎదురుగా చతికిల పడింది పిన్ని.
రాములు వెళ్లిపోయాక పండగలప్పుడు తప్పనిసరిగా నాకు రెండు జడలు వేస్తుందామె.
**
పొద్దున్నే, గుడికి రిక్షా అల్లంత దూరముండగానే సంతోషంగా ఎదురొచ్చింది కమలమ్మ. నాకు చేయందిస్తూ “ఈ రోజు ‘అట్లతద్ది’ ఆడపిల్లల పండుగ. పిండి రుబ్బి అట్లు వేయలేను గాని మధ్యానం బయట హోటలు నుండి మనకి అట్లు తెప్పిస్తాను గోవిందుతో,” అంది సంబరంగా కమలమ్మ.
ఒక్కోసారి కమలమ్మ చేసే హడావిడి తలనొప్పిగా ఉంటుంది నాకు.

(ఇంకా ఉంది)

Download PDF

4 Comments

  • G.S.lakshmi says:

    ఉమాభారతిగారూ,
    ఇప్పుడే మీ “ఎగిరే పావురమా..” ఏడుభాగాలూ ఏకబిగిన చదివేశాను. కథ మొదలుపెట్టేముందు మీరు ఇచ్చిన చిన్న ఉపోద్ఘాతం మనసును కదిలించింది. ఆ ఉపోద్ఘాతానికి ఏమాత్రం తగ్గకుండా నడుస్తోంది మీ కథ. పాత్రల పరిచయాలూ, వాటిని నడిపించే తీరూ, భాషా, శైలీ అన్నీ పట్టుగా వున్నాయి. ముందు ముందు కథ ఎలా నడుస్తుందనే ఉత్కంఠ కలుగుతోంది. ఇంత చక్కని కథను అందిస్తున్నందుకు మీకు, సారంగ పత్రికవారికి అభినందనలు.

    • Kosuri Uma Bharathi says:

      లక్ష్మి గారు, మీరు ఆసక్తిగా చదివినందుకు, మీ వ్యాఖ్యకి, మీ ప్రోత్సాహానికి హృదయపూర్వక కృతజ్ఞతలు…
      ….ముందు ముందు ఇంకింత ఆసక్తిగా ఉంటుందనే ఆశిస్తాను….
      ఉమా భారతి

  • Anupama says:

    ఉమా,
    కథ పట్టుతో సాగుతోంది. ప్రతి ఎపిసోడ్ చాల తక్కువగా ఉన్నట్లు అనిపిస్తుంది. దేముడు అన్యాయం చేసిన గాయత్రికి మనుషులవల్ల అన్యాయం జరగకూడదు. కమలమ్మ స్వార్ధంతో పెద్దవాడైన తమ్ముడికి గాయత్రినిచ్చి పెళ్ళికి అల్లోచిస్తుందేమో అనిపిస్తుంది. కథ సుఖాంతం అవ్వాలని ఆశిస్తున్నాము.

    • Kosuri Uma Bharathi says:

      అనుపమ,
      చదువుతున్నందుకు థాంక్యూ…. ఇకనుండీ కూడా పట్టుగానే ఉంటుందని ఆశిస్తాను…
      తల్లి అండ లేని ఆడపిల్ల అందరికీ అలుసేగా మరి….అందునా నోరు లేనిదైతే…

      ఉమా

Leave a Reply to G.S.lakshmi Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)