వర్మ ప్రయోగం మసాలా సినిమాకి షాక్!

rgv

samvedana logo copy(1)
వర్మకు అభినందనలు.

సత్య, సర్కార్‌ తీసిన మనిషి ఐస్‌క్రీమ్ లాంటి సినిమాలు తీస్తున్నందుకు కాదు. సినిమా రంగాన్ని ప్రజాస్వామీకరించే దిశగా ఆలోచిస్తున్నందుకు. అతనొక సినిమా పిచ్చోడు. ఆయన సినిమాల మీద మనకు ఎలాంటి అభిప్రాయాలైనా ఉండొచ్చు. కానీ సినిమా ద్వారా వచ్చే పేరును సంపదను మాత్రమే కాకుండా సినిమాను కూడా ప్రేమించేవాళ్లు అవసరం. వర్మ సినిమాను వ్యాపారంగా మాత్రమే చూడకుండా అదే జీవితంగా ఎంచుకున్నవాడు. సినిమాను దానిద్వారా సంపాదించిన పేరును అడ్డుపెట్టుకుని సర్కారీ భూములు కొట్టేసి అందులో చట్టవిరుద్ధమైన స్టుడియో ఫ్లోర్లు, సినిమా ధియేటర్టు కట్టే బాపతు కాదు. అతను ఇప్పుడు చేపట్టిన ప్రయోగం సినిమా రంగాన్ని ప్రజాస్వామీకరించడానికి అవసరమైనది.

చిన్న సినిమా నిర్మాతలు అనే పదం తరచూ వింటూ ఉంటాం. వాళ్లు ఇందిరాపార్కు దగ్గరో, ఫిల్మ్‌క్లబ్‌ దగ్గరో మరొకచోటో ఆందోళన చేయడం వగైరా చూస్తూ ఉంటాం. వారి మాటల్లో ఆ నలుగురూ అనే పదం కసికసిగా వినిపిస్తూ ఉంటుంది. స్టార్ల బలం లేకుండా సినిమా తీసే చాలామందికి ఆ నలుగురు సినిమా రిలీజ్‌ కాకుండా అడ్డుపడే సైంధవులు. ఆ నలుగురిపై ఎందుకంత మంట? వందలకొద్దీ థియేటర్లను చేతిలో పెట్టుకుని వారి పుత్రపౌత్రమిత్ర సినిమాలు మాత్రమే ఆడిస్తూ తమకు థియేటర్ ఇవ్వడం లేదనేది తరచుగా వినిపించే ఆరోపణ. సాధారణంగా సినిమా తయారీ ఆఖరి అంకంలో నిర్మాతకు సినిమా చూపించే దశలు రెండు ఉంటాయని చెపుతారు. ఒకటి పోస్ట్‌ ప్రొడక్షన్‌ స్టేజ్‌. ముఖ్యంగా ‘లాబ్స్‌’లో డబ్బాలు ఆగిపోతుంటాయి. ఎవరికివ్వాల్సిన డబ్బులు వారికిస్తే గానీ అక్కడినుంచి డబ్బాలు బయటపడవు. అనుకున్న బడ్జెట్‌ కంటే డబుల్‌ చేశాడని దర్శకుడిని, అనుకోకుండా చేయిచ్చాడని ఫైనాన్సియర్‌ను తిట్టుకుంటూ ఉంటారు. అపుడపుడు పెద్ద పెద్ద నిర్మాతలు సైతం హుస్సేన్‌ సాగర్లో దూకి దాన్ని మురికి చేస్తూ ఉంటారు. ఏవో తిప్పలు పడి అక్కడినుంచి డబ్బాలు బయటకు తేగలిగినా ఆ తర్వాత అసలైన ఆఖరి అంకం మొదలవుతుంది. థియేటర్స్‌ ఎవరివ్వాలి? అన్ని థియేటర్లలో బాబుగార్ల సినిమాలే ఆడుతుంటాయి. చిన్నసినిమా మొకం చూసే వారుండరు. ఇక్కడ డిస్ర్టిబ్యూటర్స్ అనే వ్యవస్థ ఉంటుంది. అదొక పద్మవ్యూహం.

ఇలా ఆరోపించే చిన్ననిర్మాతల్లో అన్ని రకాల చిన్న వారుంటారు. ఒంటిపై స్పృహ గానీ పట్టింపుగాని లేని ఇద్దరు వ్యాంప్‌ పాత్రలు, సినిమా పిచ్చి ఉన్న ఒక అబ్బాయి-అమ్మాయి అందుబాటులో ఉంటే బంజారాహిల్స్‌లో ఒక గెస్ట్‌ హౌస్‌ను నాలుగు రోజులు అద్దెకు తీసుకుని బెడ్‌మీద రెండు రోజుల్లో పొర్లుడు పందాలు పెట్టి ఏదో ఒక వంకర పేరుతో జనం మీదకు వదలాలనుకునే సాఫ్ట్‌ పోర్న్‌ నిర్మాతల దగ్గర్నుంచి ప్రపంచ సినిమాను అధ్యయనం చేసి మనమెందుకు ఇలా ఉన్నాం అని మధనపడి నేను సైతం అనే శలభాల దాకా చాలా షేడ్స్‌తో ఉంటారు. మధ్యలో కుర్రకారును వల్గర్గా కాకుండా మామూలుగా అర్థం చేసుకోలేని మారుతి వేషాలు కూడా ఉంటాయి. ఏదో ఒక గడ్డితిని ఏదో ఒక చెత్త చూపించి నాలుగు పరకలు సంపాదించాలనుకునేవారుంటారు. పెన్ను బుగ్గన పెట్టుకుని అది అరిగిపోయే దాకా ఆలోచించేవారుంటారు. ఎవరి తిప్పలు ఏమైనా కానీ సినిమా అంటే నిజంగా ప్రేమ- అభినివేశం ఉన్న వారు బయటకు రాకుండా ఈ డిస్ర్టిబ్యూషన్‌ సిస్టమ్ అడ్డుకుంటోంది.

rgv

సినిమా మేకింగ్‌లో ఇప్పటికే చాలా మంచి మార్పులొచ్చాయి. స్విట్జర్లాండ్‌ను స్వీడన్‌ను కాకుండా కథను నమ్ముకుని, స్టార్లను కాకుండా యాక్టర్లను నమ్ముకుని సినిమా తీయాలనుకుంటే ఇవాళ కోట్లు కుమ్మరించనక్కర్లేదు. చాలా రంగాల్లో టెక్నాలజీ తెస్తున్న సానుకూల మార్పు ఇక్కడా తెచ్చింది. డిజిటల్‌ డెక్నాలజీ, నాన్‌ లీనియర్‌ ఎడిటింగ్‌ వంటివి సినిమా మేకింగ్‌ను సులభం చేశాయి. ఇవాళ అది బాబుగార్లకు మాత్రమే సాధ్యమైన విద్య కాదు. ఈ పద్ధతిని చాలామంది ఫాలో అవుతున్నారు. తెలుగులో ‘వెండిమబ్బులు’ తేలిపోయాయి కదా అని తొలిరోజుల్లో తేలికగా మాట్లాడిన వారు ఆ తర్వాత డిజిటల్‌ బాట పట్టక తప్పలేదు. కమల్‌ హాసన్‌ ముంబై ఎక్స్‌ప్రెస్‌ ప్రయోగం చేసినపుడు, ఆనక రెడ్‌ కెమెరా వాడినపుడు ఇదేం పైత్యం అన్నవారు తర్వాత ఆ బాట పట్టక తప్పలేదు. ఇవాళ రెడ్‌ కెమెరాకు ఎంత ఢిమాండ్‌ పెరిగిందో చెప్పనక్లర్లేదు. కమల్‌, వర్మ లాంటివారు దీర్ఘదర్శులు.

ఇవాళ హిందీ సినిమాలో కశ్వప్‌లు, బెనర్జీలు, నంబియార్లు వంటి కొత్త తరం అంతా డిజిటలే వాడుతున్నారు. నాలుగు నిమిషాల రీల్‌కు వేల రూపాయలు పోసే బదులు గంటలకొద్దీ నామ్‌కే వాస్తే ఖర్చుతో సినిమా తీసే డిజిటల్‌ను ఎవరైనా అనుసరించకుండా ఎలా ఉంటారు. సినిమా రంగంలో ఇంకా ఫ్యూడల్‌ ఆలోచనలు సంప్రదాయలు బలంగా ఉండడం వల్ల సినిమా థియేటర్లు ఇంకా పూర్తిస్థాయిలో డిజిటలైజ్‌ కాకపోవడం వల్ల రివర్స్‌ టెక్‌లైన్‌ అవసరమవుతోంది కానీ అది కూడా పోతుంది త్వరలోనే. డిజిటట్‌ టెక్నాలజీ సినిమా రంగాన్ని పూర్తిగా ప్రక్షాళన చేస్తుందని, ఓ స్కూల్‌ టీచర్‌- ట్రక్కు డ్రైవర్‌ సినిమా తీసే రోజు ఐదేళ్లలో రాగలదని 2001లో శేఖర్‌కపూర్‌ ఆశించారు. సినిమా మేకింగ్‌ ఫైనాన్సియర్‌ల ధృతరాష్ర్ట కౌగిలినుంచి బయటపడి సృజనాత్మకత రెక్కవిప్పుకునే రోజు వస్తుందని ఆశించాడు. ఆయన కోరుకున్న స్థాయిలో కోరుకున్నంత త్వరగా కాకపోయినా ఇపుడా ప్రాసెస్‌ అయితే జరుగుతోంది. హిందీలో మంచి మార్పులే వస్తున్నాయి.

మేకింగ్‌ ఓకె. కానీ రిలీజ్‌ ఎక్కడా? మన ల్యాప్‌టాప్లో వేసుకుని ఫ్రెండ్స్‌కి చూపించుకుని వారు ఆహా ఓహో అంటే మురిసిపోవడమే. థియేటర్లు ఇచ్చే దిక్కెవరు? ఇక్కడే వర్మ మంచి ప్రయోగానికి పూనుకున్నారు. నిర్మాతకు-థియేటర్లకు మధ్య డిస్ర్టిబ్యూషన్ అనే వ్యవస్థను సింపుల్‌గా తీసేశారు. నేరుగా సినిమాను వేలంపాటలో పెట్టారు. థియేటర్ల వారు నేరుగా పాట పాడుకోవచ్చు. మధ్యలో ఆ ఉడ్డానలుగురో నలుగురో ఎవరూ ఉండరు. ఇపుడు అనుమానంగానే చూడొచ్చు. వర్మ ఏం పీకెన్‌ అని వ్యంగ్యంగా అనుకోవచ్చు. జూద లక్షణం ఉన్న రంగంలో ప్రయోగాలను అనుమానంగానే చూస్తారు. కానీ భవిష్యత్తు అలా ఉండదు. సినిమాను ఆ ఉడ్డా నలుగురికే ఎందుకు ప్రీవ్యూలో చూపాలి. థియేటర్ల వారు వస్తారు. చూసుకుంటారు. గిట్టుబాటవుతుందనుకుంటే పాటలో పాల్గొంటారు. నీ సినిమాలో సరుకు ఉందనుకుంటే అమ్ముడు పోతుందనుకుంటే కొంటారు. లేదంటే లేదు. మార్కెట్‌కు అడ్డుపడుతున్న ఫ్యూడల్‌ పద్థతిని తొలగించే ప్రయోగం ఇది. అసలు పూర్తిగా మార్కెట్‌నే ధిక్కరించే తిరుగుబాటుదారుల సంగతి వేరే. మళయాళంలో జాన్‌ అబ్రహాం ఆరంభించిన రాడికల్‌ ప్రయోగం ఆయనతోనే అంతమైపోయింది.

సినిమారంగం కొద్దిమంది కౌగిట్లోనే బందీ అయి ఉన్నది. వారు చూపిందే సినిమాగా ఉన్నది. మిగిలిన వారు అడుగుపెట్టాలంటే అనేక అడ్డుగోడలున్నాయి. ఈ అడ్డుగోడలు బద్దలు కొడితే కానీ కొత్త నీరు రాదు. ఏ రంగమైనా ప్రజాస్వామికీకరణ కావాలంటే కొత్త నీరు అవసరం. కొత్త ఆలోచనలు అవసరం. కేవలం డబ్బు మూటలున్నోళ్లకే అది పరిమితం కావడం ఎంత మాత్రం ఆరోగ్యకరమైనది కాదు. కాబట్టి ఆ రకంగా ఇది అవసరమైన మార్పు. మేము సైతం సినిమా రంగంలోకి రావచ్చు, మా ఆలోచనలను పంచుకోవచ్చు అనే ధైర్యం కల్పిస్తే ఆరోగ్యకరమైన వారు సినిమా రంగంలోకి వస్తారు. తమతో పాటు మార్పు తీసుకు వస్తారు. డిజిటల్‌ టెక్నాలజీతో పాటు మల్టీప్లెక్స్‌ థియేటర్స్‌ కూడా వచ్చాక హిందీ సినిమాలో వచ్చిన మంచి మార్పులను చూస్తున్నాం. ఎన్ని మార్పులు! ఎన్ని ప్రయోగాలు! అక్కడ ఎందుకు సాధ్యమైంది? వాళ్లది విస్తృతమైన మార్కెట్‌. బిక్లాస్, సిక్లాస్‌లో ఆడకపోయినా అర్బన్‌ పీపుల్‌ మల్టీప్లెక్స్‌లో చూసినా వాళ్ల డబ్బులు వారికొచ్చే పరిస్థితి ఏర్పడింది. అటువంటి ధైర్యాన్ని మల్టిప్లెక్స్లులు కల్పించాయి. తెలుగులో మల్టీప్లెక్స్‌ మార్కెట్‌ అంతలేదు. మల్టీప్లెక్స్ ఆడియెన్స్తో పాటు చిన్న పట్నాల వాళ్లను కూడా కాస్తో కూస్తో ఆకర్షించే ఎలిమెంట్స్‌ కలిపి తెలివిగా తీస్తే నాన్‌ మసాలా సినిమాకు తెలుగులోనూ చోటుందని ఇటీవలే ఉయ్యాల జంపాల, ఊహలు గుసగుసలాడే లాంటి సినిమాలు నిరూపించాయి.

డిస్ర్టిబ్యూషన్‌ వ్యవస్థలో ఫ్యూడల్‌ అడ్డుగోడలు తొలగిస్తే అంతకంటే మంచి సినిమానే మనం ఆశించవచ్చు. వర్మ ప్రయత్నం ఆ దిశగా ముందడుగు అని భావించొచ్చు.

 

జి ఎస్‌ రామ్మోహన్‌

Download PDF

5 Comments

 • pavan santhosh surampudi says:

  కచ్చితంగా వర్మ విజనరీనే. దురదృష్టవశాత్తూ ఆయన క్రియేటివ్ పీక్ అయిపోవడంతో ఇలా ప్రయోగాలు “మాత్రమే” చేస్తున్నారు. వేరేవాళ్ళు సఫలీకృతులు అవుతున్నారు. అదే శివ, క్షణ క్షణం, గాయం నాటి వర్మ అయ్యుంటే, ఈ ప్రయోగానికి క్రియేటివ్ పీక్ తోడై ఉంటే వర్మ అడుగులో అడుగేయడం తప్ప ఇండస్ట్రీకి వేరే దారి ఉండేది కాదు. ఏం చేస్తాం కొన్ని అలా కుదరవు అంతే.

 • వినయ్ says:

  చాలా బాగా చెప్పారు రామ్మోహన్. అటువంటి మార్పు తెలుగునాట చాలాకాలం క్రితమే వచ్చుండాల్సింది. ఇప్పటికి మనం చాలా నష్టపోయాం. సినిమాద్వారా తమ ప్రతిభను నిరూపించుకోడానికి ఎందరో రచయితలు, కళాకారులు ఇతరత్రా సృజనకారులు ఎదురుచూస్తున్నారు. సినిమా నిర్మాణ / పంపిణీ రంగంలో ప్రజాస్వామ్యిక మార్పులు రాకుంటె మనకే నష్టం. ఇంకెన్నాళ్ళు పడుతుందో.

  మన సినీ రంగంలో ప్రజల అభిరుచిని తీర్చిదిద్దేవాళ్ళే లేకపోయారు. ఆ నలుగురూ నిర్దేశించిన ఫ్యూడల్ మోడల్ లేదా ఫార్మాట్ లో సినిమాలు తీయడానికే ఇంకా కొందరు అమాయకంగా అమీర్ పేటలో, కృష్ణానగర్ లో పస్తులుంటూ అవకాశాలకోసం ఎదురుచూస్తున్నారు.

 • S. Narayanaswamy says:

  Interesting. I’d agree with Pavan’s comment. One thing Mr. Varma could do now, perhaps, is to act as guide and mentor to younger filmmakers who still have that creative spark.

  • rachakonda srinivasu says:

   వర్మ ప్రయోగం బాగుంది . ఆయన పద్దతే బాగోలేద్ .నా ఇష్టం అని చెత్తని చూడమంటే ఎలా ? మీ ఆర్టికల్ మాత్రం అన్ని మూలాల్ని తడిమింది .బాగుంది

 • buchireddy gangula says:

  రాజకీయాల్లో వారసత్వం — అదే తీరులో — తెలుగు సినిమా రంగ్గం —నిన్న దాసరి గారి
  ఉపన్యాసం లో నిజం లేక పోలేదు —సిని లోకం లో గుండా యిజం ఉంది — కొద్ది మంది
  చేతుల్లో —టాకీసు లు ఉండటం —-వాళ్ళ పక్షపాత ధో రి ని —- అని చెబుతూ — త్వరలో
  మార్పు రక తప్పదు —వీళ్ళను ఎదిరించే రోజు రానుంది — అని అన్నారు —నూటికి నోరు పాళ్ళు దాసరి గారి మాటల్లో నిజం ఉంది —
  యింకా బాల కృష్ణ –నాగుర్జన — వెంక టెష్ —మోహన్ బాబు — రాజేషేకర్ — హీరో లు గా
  రావడం — వాళ్ళ పక్క హె రో యిన్ — కూతురు లా కనిపిస్తూ —-మార్పు అవసరం

  వర్మ గారు — గొప్ప డైరెక్టర్ — ఒక రక మయిన మార్పు —ఆలోచన ను — రేకెత్తించే తిరు
  వారి సినిమాల లో కనిపిస్తుంది —వారి ఇంటర్వూస్ చూసాను — అందులో నాకు తోచింది –వారు బాగా చదువుతారని —
  — రామ్మోహన్ గారు చాల చక్కగా రాశారు — సర్

  —————————–బుచ్చి రెడ్డి గంగుల

Leave a Reply to S. Narayanaswamy Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)