విష్టరాగ్ని కన్యలూ…విస్టాల్ వర్జిన్సూ…

Kalluri Bhaskaram-pic-a.prabhakar rao (5)

అజ్ఞానం అనను కానీ, జ్ఞానశూన్యత రకరకాలుగా ఉంటుంది. అలాంటిదే విశ్వాసం కూడా. మందిలో ఒకడిగా జీవించడానికి మనం జ్ఞానశూన్యతనో, విశ్వాసాన్నో నటించడం కూడా ఒక నిత్యావసరంగా మారుతూ ఉంటుంది. రాంభట్లగారు అప్పుడప్పుడు చెబుతూ వచ్చిన పాఠాలలో అది ఒకటి. ‘మనకు ప్రత్యేకమైన వ్యక్తిత్వాలు, దృక్పథాలు ఉన్నాసరే, మందికి మరీ దూరంగా ఉన్నట్టు కనిపించకూడదు. మంది గొంతును అనుకరిస్తూ ఉండాలి. వాళ్ళలో కలసిపోవాలి’ అంటూ తన జీవితం నుంచే ఉదాహరణలు ఇస్తూ ఉండేవారు. అందులో ఎంతైనా వాస్తవం ఉందని అనిపించేది. కానీ ఎంత ప్రయత్నించినా ఆ మెళకువ నాకు పట్టుబడిందని చెప్పలేను. నావరకూ ఎందుకు, రాంభట్లవారే తన పాఠాన్ని తను ఎంతవరకు జీర్ణించుకున్నారో అనుమానమే.

దేశాలు, సంస్కృతుల మధ్య విపరీతమైన తేడాలను ఊహించుకోవడమూ; తన దేశం లాంటి దేశం, తన సంస్కృతి లాంటి సంస్కృతి మరెక్కడా లేదనుకోవడమూ జ్ఞానశూన్యతకు ఒకానొక ఉదాహరణగా నాకు కనిపిస్తుంది. కొన్ని కొన్ని ప్రత్యేకపరిస్థితులలో అలా అనుకోవలసిన అవసరం ఏర్పడుతుందని నేను కూడా అంగీకరిస్తాను. అయితే ఒక అవసరాన్ని జ్ఞానశూన్యత స్థాయికి సాగదీయడంలోని ఔచిత్యమే ప్రశ్నార్థకం అవుతుంది.

పురాచరిత్రలోకి వెళ్ళినకొద్దీ దాదాపు ప్రపంచమంతా ఒకే సంస్కృతిని పంచుకుందనడానికి ఆధారాలు కొట్టొచ్చినట్టు కనిపిస్తూ ఉంటాయి. ఒక్క అగ్నినే తీసుకుంటే, అగ్నిహోత్రాలు, అగ్నికార్యాలు, అగ్నిసాక్షులు, యజ్ఞాలు మన ఒక్క సంస్కృతిలోనే ఉన్నాయని మనలో చాలామంది అనుకుంటారు. కానీ ప్రపంచంలో మనిషి ఎక్కడున్నా అగ్ని అతని జీవితంలో ఒకే విధమైన పాత్ర నిర్వహించింది. ఒకేవిధమైన పవిత్రతకు సంకేతంగా నిలిచింది.

అగ్ని గురించే చెప్పుకోవడం ప్రారంభిస్తే, పైకి తేలదానికి కనీసం ఓ పది వ్యాసాల వ్యవధి పడుతుంది. కనుక కొన్ని విశేషాలకే ప్రస్తుతం పరిమిత మవుతాను. అమెరికా ఆదివాసీ తెగ అయిన ఇరాక్యూల గురించి, వారి సమాఖ్య పనితీరు గురించీ మోర్గాన్ అందించిన సమాచారం ఇలా ఉంటుంది:

పక్క పక్కనే ఉన్న బంధుగణాలు పరస్పర రక్షణ కోసం సమాఖ్యలుగా ఏర్పడేవి (మనం ఇంతకుముందు వ్యాసంలో చెప్పుకున్నట్టు గణాలు కొన్ని కలసి వ్రాతంగా ఏర్పడడం లాంటిదే ఇది కూడా). ఉత్తర అమెరికాను కనుగొనే నాటికి వివిధ ప్రాంతాలలో అనేక సమాఖ్యలు ఏర్పడి ఉన్నాయి. అలా సమాఖ్యలుగా ఏర్పడడం మేధా పరిణతికి సూచన. వీటిలో ఇరాక్యూ సమాఖ్య ఒకటి, అది అయిదు స్వతంత్ర తెగలతో ఏర్పడింది. ఈ అయిదు తెగలూ ఒకే ప్రభుత్వం కింద సమాన ప్రతిపత్తితో ఉంటాయి. తెగలు తమ ప్రతినిధులుగా కొందరిని ఎన్నుకుంటారు. వారిని ‘శాకెమ్’ అంటారు. సమాఖ్యలో శాకెమ్ లు యాభైమంది వరకూ ఉంటారు. అవసరమైనప్పుడు ఆయా నిర్ణయాలు చేయడానికి వీరందరూ సమావేశమవుతూ ఉంటారు. ఒక్కో తెగ, వంతుల వారీగా ఆ సమావేశనిర్వహణ బాధ్యత తీసుకుంటుంది.

ఒకటి, రెండు రోజుల ముందే శాకెమ్ లు అంతా తమ సహాయకులతో వచ్చి సమావేశస్థలానికి దూరంగా మకాం చేస్తారు. సమావేశ బాధ్యత తీసుకున్న తెగ శాకెమ్ లు పొద్దుటే వచ్చి వారిని పలకరించి వెడతారు. సమావేశం రోజున శాకెమ్ లు అందరూ చర్మం దుస్తులు ధరించి ఓ కట్టెల కట్ట చేత్తో పుచ్చుకుని సమావేశస్థలానికి వస్తారు. అక్కడ వారికి సమావేశాన్ని నిర్వహించే తెగవారు స్వాగతం పలుకుతారు. ఆ తర్వాత అంతా వలయంగా నిలబడతారు. సమావేశాన్ని నిర్వహించే శాకెమ్ తూర్పు దిక్కున నిలబడతాడు. మిగిలిన శాకెమ్ లు మిగిలిన దిక్కుల్లో నిలబడతారు. ఆ తర్వాత శాకెమ్ లు అందరూ ఉత్తరం నుంచి ప్రారంభించి మూడుసార్లు ఆ వలయం చుట్టూ ప్రదక్షిణ చేస్తారు. సమావేశ నాయకుడు మళ్ళీ తూర్పున తన స్థానంలో నిలబడతాడు. తన చేతిలో ఉన్న కట్టెల కట్టను వలయంలో తన ముందు ఉంచుతాడు.

ఉత్తరం నుంచి ప్రారంభించి మిగిలిన శాకెమ్ లు కూడా అదే చేస్తారు. మళ్ళీ అదే క్రమంలో తాము తెచ్చుకున్న చర్మాన్ని కిందపరచి దాని మీద కూర్చుంటారు. అప్పుడు నాయకుడు లేచి తన సంచిలోంచి రెండు కట్టెలు, ఇంత పీచు తీసి కట్టెలను రాపాడించి నిప్పు చేస్తాడు. వలయంలో అడుగుపెట్టి తను ఇంతకుముందు ఉంచిన కట్టెలకు నిప్పు ముట్టిస్తాడు. ఆ తర్వాత ఆ కట్టెలతో మిగిలిన శాకెమ్ లు ఉంచిన కట్టెలకు కూడా నిప్పు ముట్టిస్తాడు. ఆయన సంజ్ఞ చేయగానే ఆయనతోపాటు శాకెమ్ లు అందరూ మళ్ళీ మూడుసార్లు అగ్నిహోత్రానికి ప్రదక్షిణం చేసి, ఆ తర్వాత ఆత్మ ప్రదక్షిణం కూడా చేసి తమ తమ స్థానాలలో నిలబడతారు.

తాము అందరం పరస్పర స్నేహ అభిమానాల వెచ్చదనాన్ని పంచుకున్నామనీ; సమావేశాన్ని ఎంతో ఆత్మీయంగా, ఐకమత్యంగా జరుపుకుంటామనీ చెప్పడం ఈ మొత్తం తతంగానికి అర్థం. ఇందులో రెండు కట్టెలను రాపాడించి నిప్పు చేయడమే చూడండి. అగ్గిపెట్టెల వంటి సాధనాలు లేని కాలంలో నిప్పు చేసే పద్ధతి అది. దానిని మనవాళ్లు అరణి అంటారు. పాండవులు అరణ్యవాసంలో ఉన్నప్పుడు ఒక బ్రాహ్మణుడు వారికి ఎదురై, తన అరణి(నిప్పు చేయడానికి ఉపయోగించే కొయ్యలు)ఒక లేడి కొమ్ములకు చిక్కుకుందనీ, అది పారిపోయిందనీ, దాంతో తను అగ్నికార్యం చేయలేకపోతున్నాననీ, ఆ లేడిని పట్టుకుని నా అరణిని నాకు ఇవ్వవలసిందనీ అడుగుతాడు.

pix02

అనంతర కాలాలలో ఆయా పనులు సులువుగా చేయడానికి సాయపడే కొత్త కొత్త పరికరాలు ఎన్ని వచ్చినా తద్దినాలు, పెళ్లిళ్ల వంటి ప్రత్యేక సందర్భాలలో పురాకాలం నాటి పరికరాలనే ఇప్పటికీ వాడడం చూస్తూ ఉంటాం. నిన్న మొన్నటి వరకు (బహుశా కొన్ని చోట్ల ఇప్పటికీ) యజ్ఞాలు మొదలైన వాటిలో శ్రోత్రియులు అరణి మథించి నిప్పు చేసేవారు. అంటే, పురాసామగ్రి కూడా విశ్వాసంలో భాగమైపోయిందన్నమాట.

ఇక మన పురాణ, ఇతిహాసాలనుంచి అగ్ని ప్రాధాన్యాన్ని ఎత్తి రాయడం ప్రారంభిస్తే దానికి అంతే ఉండదు. అగ్నిసాక్షిగా స్నేహాలు, పరిణయాల గురించి చెప్పనే అవసరం లేదు. రామాయణంలో రాముడు, వానరరాజు సుగ్రీవుడు అగ్నిసాక్షిగా స్నేహం చేస్తారు. ఇంతకు ముందు చెప్పుకున్న అంగారపర్ణుని కథలో, పాండవుల వెంట అగ్నిహోత్రమూ, పురోహితుడూ లేకపోవడంతో వారిని క్షత్రియులుగా గుర్తించలేకపోయానని అంగారపర్ణుడు అంటాడు. కురుక్షేత్ర యుద్ధ శిబిరాలలో కూడా బ్రాహ్మణ, క్షత్రియవీరులు రోజూ ఉదయమే అగ్నికార్యం చేసేవారని భైరప్ప తన ‘పర్వ’ నవలలో రాశారు. ఆర్యులు బళ్ళమీద అగ్నిహోత్రాన్ని పెట్టుకుని మరీ కైబర్-బొలాన్ కనుమల మీదుగా భారతదేశంలోకి అడుగుపెట్టారని శ్రీపాద అమృత డాంగే రాశారు.

ఎలాగూ మోర్గాన్ ను ప్రస్తావించుకున్నాం కనుక, కాస్త పక్కదారి పడుతున్నట్టు అనిపించినా సరే ఒక అంశాన్ని మీతో పంచుకోవాలన్న ఉత్సాహం కలుగుతోంది,
కొన్నేళ్ళ క్రితం టీవీలో ప్రసారమైన ఒక తమిళ డబ్బింగ్ సినిమా నాలో ఎంతో ఆసక్తిని రేపింది. దాని పేరు ‘అఖండుడు’. విక్రమ్ అందులో హీరో. అదేదో ఆర్ట్ సినిమా అనుకుంటారేమో, కాదు. నూటికి నూరు పాళ్ళు కమర్షియల్ మసాలా దట్టించిన సినిమా. అందులో నన్ను ఆకర్షించినవి రెండు: మొదటిది, బంగారం పని చేసే ఒక విశ్వబ్రాహ్మణుని కుటుంబనేపథ్యంతో ఆ సినిమా కథ అల్లడం. హీరో ఆ కుటుంబానికి చెందినవాడు. ఆ కుటుంబ వాతావరణాన్ని, వారి సెంటిమెంట్లతో సహా అతి సహజంగా దర్శకుడు రవి కుమార్ కళ్ళకు కట్టించాడు. నేను గమనించినంతవరకు తమిళ సినిమాలు అన్నింటిలో ఈ నేటివిటీ టచ్ తప్పనిసరిగా ఉంటుంది. తెలుగు సినిమాలలో అది కనిపించదు. సరే, ఇది సినిమాలకు సంబంధించిన చర్చ కాదు కనుక వదిలేద్దాం.

ఇక నన్ను ఆకర్షించిన రెండో విషయానికి వస్తాను. హీరో జనాన్ని కాల్చుకుతినే ఒక రాజకీయనాయకుని చంపేస్తాడు. అతన్ని జైల్లో పెట్టి విచారణ ప్రారంభిస్తారు. అతను హత్య చేసిన సంగతిని పోలీసులు నిరూపించలేకపోతారు. దాంతో అతన్ని విడుదల చేస్తారు. విడుదలై అతను ఇంటికి వచ్చిన వెంటనే ఇంటి ముందు పీట వేసి దానిమీద అతనిని కూర్చోబెట్టి తల్లి, తండ్రి అతని తలకు చమురు పెడతారు. తర్వాత తల్లి అతనికి అభ్యంగన స్నానం చేయిస్తుంది.

ఆ సన్నివేశాన్ని చూసినప్పుడు అందులో నాకు లీలగా గణసమాజం తాలూకు అవశేషం తోచింది కానీ అదేమిటన్నది తెలియలేదు. ఆ తర్వాత మోర్గాన్ ‘పురాతన సమాజం’ లో రాసిన వాక్యాలు చదవగానే ఆశ్చర్యపోయాను. గ్రీకు గణసమాజంలోని ఫ్రాట్రే(ఇది మనం చెప్పుకున్న వ్రాతం లాంటిది), తెగ, జాతి గురించిన ప్రకరణంలో ఐస్కలస్ అనే అతను రాసిన ‘యూమెనాయిడ్స్’ అనే రచనను మోర్గాన్ ప్రస్తావించాడు. అందులో ఒరెస్టస్ అనే అతను తల్లిని చంపుతాడు. అతనికి శిక్ష పడకుండా చూడడానికి అతని ఫ్రాట్రే ప్రయత్నిస్తుంది. ఒక వ్యక్తి విరోధి గణానికి చెందిన ఎవరిపైన అయినా ప్రతీకారం తీర్చుకుంటే, అతనిని శిక్షనుంచి తప్పించే బాధ్యత అతని గణానిది, లేదా ఫ్రాట్రేదే. అది గణసమాజ నీతి.

‘ఒకవేళ ఒరెస్టస్ శిక్ష తప్పించుకుంటే అతని మీద ప్రోక్షించడానికి, అంటే శుద్ధిస్నానం చేయించడానికి ఫ్రాట్రే వద్ద నీళ్ళు సిద్ధంగా ఉన్నాయా?’ అని ఎరిన్సిస్ అనే వ్యక్తి ఆ సందర్భంలో అడుగుతాడు.

ఐస్కలస్ రాసిన ఆ ‘యూమెనాయిడ్స్’ అనే ఆ రచన ఏమిటో, ఒరెస్టస్ తల్లిని ఎందుకో చంపాడో తెలుసుకోడానికి ఇంటర్నెట్ గాలించాను. దొరకలేదు. కానీ, ప్రస్తుత సందర్భానికి ఎరిన్సిన్ అడిగిన ప్రశ్న ఒక్కటి చాలు. శిక్ష తప్పించుకున్న నేరస్తుని శుద్ధిస్నానం చేయించాలని అది చెబుతోంది. ఇరవయ్యొకొటో శతాబ్దిలోని ఒక తమిళ సినిమా దానినే చూపిస్తోంది. అంటే, గ్రీకు గణసమాజానికే కాకుండా బహుశా మొత్తం గణసమాజాలు అన్నింటికీ చెందిన ఒక పురాతన ఆచారాన్ని ఆ సినిమా వెల్లడిస్తోంది. గణసమాజపు ఆచారాల గురించిన పూర్తి అవగాహనతో ఆ సినిమా దర్శకుడు ఆ సన్నివేశాన్ని చిత్ర్రించి ఉండకపోవచ్చు. అప్పటినుంచీ ఇప్పటివరకూ కొనసాగుతున్న ఆ ఆచారాన్ని అతను సమాజం నుంచే తీసుకుని ఉండవచ్చు. అయినా ఆ చూపును అభినందించాల్సిందే.

గణసమాజ లక్షణాలు తమిళులలో మరింత ఎక్కువ పదిలంగా ఉన్నాయని రాంభట్ల కూడా అంటారు. ఎక్కువా, తక్కువా అన్నది అలా ఉంచితే, మన దేశం లాంటి తూర్పు దేశాలలోనే కాక, పాశ్చాత్య సమాజాలలోనూ అవి కొనసాగుతూనే ఉన్నాయి. ఈ సందర్భంలో ఒక మాట అంటే షాకింగ్ గా ఉండచ్చు. భాషలో, నుడికారంలో, పెళ్లిళ్లు, శ్రాద్ధాల వంటి తతంగాలలో వేదకాలపు గణ సమాజలక్షణాలను మనం నిలుపుకున్నట్టే; పాశ్చాత్యులు కూడా కొన్నింటిలో నిలుపుకున్నారు. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే, పాశ్చాత్యుల ఆయా సందర్భాలలో పాటించే ఆచారాలను, అలవాట్లను గమనిస్తే; మనతో సమానంగా వారు కూడా వేదకాలపు సంస్కృతిని పంచుకుంటున్నారని అర్థమవుతుంది. సంస్కృతుల మధ్య మనం గీసుకునే గీతలు చెరిగిపోవడం కళ్ళకు కడుతుంది.

ఈ పోలికలకు సంబంధించి ఇప్పుడు మరీ ఎక్కువ వివరాలలోకి వెళ్ళను. ఒకటి చెప్పాలంటే, ‘బార్బెక్యూ’. అది వేదకాలం నుంచీ కొనసాగుతున్న సాముదాయిక విందు కార్యక్రమం. దానిని ‘శూలమాంసం’గా రాంభట్ల పేర్కొన్నారు.

అమెరికాలో ఇళ్లముందు బార్బెక్యూ పొయ్యిలు ఇప్పటికీ కనిపిస్తాయి. దగ్గరలోని అడవుల్లోకో, తోటల్లోకో వెళ్ళి బార్బెక్యూ చేసుకోవడం కనిపిస్తుంది. Margaret Mitchell రాసిన ఐతిహాసిక నవల (1936) GONE WITH THE WIND 1860ల నాటి అమెరికా అంతర్యుద్ధాన్ని, దాని అనంతర పరిస్థితులను చిత్రిస్తుంది.

అందులోని నాయిక స్కార్లెట్ బార్బెక్యూకు వెళ్ళినప్పుడే తను కోరుకున్న యువకుని నుంచి ప్రేమ తిరస్కారానికి గురవుతుంది.

రచయిత్రి ఇలా రాస్తుంది:

They crossed the river and the carriage mounted the hill. Even before Twelve Oaks came into view Scarlett saw a haze of smoke hanging hazily in the tops of the tall trees and smelled the mingled savory odors of burning hickory logs and roasting pork and mutton.
The barbecue pits, which had been slowly burning since last night, would now be long troughs of rose-wood embers, with the meats turning on spits above them and the juices trickling down and hissing into the coals.

మాంసభోజన ప్రియులనే కాక, మద్యప్రియులను కూడా అలరించే సందర్భం బార్బెక్యూ. యవ్వనారంభంలో ఉన్న యువతీ, యువకుల్లో ప్రేమలూ, మోహాలూ పురివిప్పి నర్తించే సందర్భం కూడా. ‘న్యూ వరల్డ్’ గా చెప్పుకునే అమెరికాలో అతి పురాతనమైన వేదకాలపు ఒక ఆనవాయితీ ఇప్పటికీ కొనసాగుతున్న ఆ దృశ్యం ఒక్కసారిగా మనల్ని వేల సంవత్సరాల గతంలోకి తీసుకువెళ్లి ఆశ్చర్యచకితం చేస్తుంది. యూరోపియన్ల ద్వారానే ఈ ఆనవాయితీ అమెరికాకు బదిలీ అయిన సంగతి తెలుస్తూనే ఉంది. అదలా ఉంచితే, యూరోపియన్లకు వేదకాలపు సంస్కృతితో సంబంధముందనని తెలిసినప్పుడు మరింత ఆశ్చర్యం కలుగుతుంది.

వేదకాలపు జనానికి కూడా రకరకాల అగ్నులతో పరిచయముంది. వాటికి వారు పేర్లు పెట్టారు. ఉదాహరణకు, అగ్నిపర్వతాలనుంచి వెలువడే అగ్ని ‘పర్వతీయాగ్ని’. అగ్నిపర్వతం నుంచి ప్రవహించే లావా ‘సరస్వతీయాగ్ని’. నేల నెర్రెలలోంచి వెలువడే అగ్ని ‘మహీయాగ్ని’. అడవుల్లో రాజుకునే అగ్ని ‘వానస్పత్యాగ్ని’. పిడుగుపాటు వల్ల పుట్టే అగ్ని ‘వైద్యుతాగ్ని’. తాత్కాలికంగా బస చేసిన చోట వేసే నెగడు ‘వాసతేయాగ్ని’.

వీటిలో వాసతేయాగ్ని మినహా మిగిలినవి ప్రకృతి సిద్ధంగా సంభవించే అగ్నులు కాగా; జనం వినియోగించే అగ్నిని మళ్ళీ మూడు రకాలుగా విభజించారు. వాటిలో మొదటిది గార్హస్పత్యాగ్ని. ఇది గృహస్థులు ఇంట్లో ప్రతిష్టించుకునే అగ్ని. రెండవది, ఆహవనీయాగ్ని. వసంతారంభంలో ఊరి బయట వెలిగే అగ్ని ఇది. మూడవది దక్షిణాగ్ని. దీనికే ‘విష్టరాగ్ని’ అని కూడా పేరు. ‘విష్’ అంటే మహాజనం అని అర్థం. ఇది సాముదాయిక అగ్ని అన్నమాట. ఈ మూడింటికీ త్రేతాగ్నులని పేరు.

విష్టరాగ్నిని ఆరకుండా కాపాడే బాధ్యత కన్యలది. అందుకే వారిని విష్టరాగ్నికన్యలు అన్నారు. అగ్ని ఆరాధకులైన పారసీకులకు విష్టరాగ్ని దేవాలయాలు ఉంటాయి. విశేషమేమిటంటే, యూరప్ లో ఇటలీలో కూడా విష్టరాగ్ని దేవాలయాలు ఉండేవి. ఈ అగ్నిని కాపాడే కన్యలను వారు ‘విష్టాల్ వర్జిన్స్’ అన్నారు. ఈ విష్టాల్ శబ్దంలోని విష్ అనే మాట వేదకాలపు సంస్కృతంతో యూరప్ కు ఉన్న సంబంధాన్ని సూచిస్తుంది.

Sir James Frazer రాసిన The Golden Bough ప్రకారం, ఇటలీలో నేమి అనేచోట డయానా అనే దేవతను పూజిస్తారు. ఆమెకే ‘విష్టా’ అని కూడా పేరు. ఆమెకు జరిపే పూజా తతంగంలో అగ్నికి ఎక్కువ ప్రాముఖ్యం ఉంటుంది. ఏటా ఆగస్టు 13న ఆ దేవతకు ఉత్సవం జరుగుతుంది. అది వేసవి సమయం. ఆ దేవాలయం ఉన్న తోపు అంతటా స్త్రీలు దీపాలు వెలిగిస్తారు. చర్చిలో కొవ్వుత్తులు వెలిగించే ఆనవాయితీకి ఇదే మూలం కావచ్చు. ఆ రోజున ఇళ్ళలో కూడా అగ్నిహోత్రం దగ్గర పూజా తంతు జరుపుతారు. డయానా దేవతకు ఉన్న విష్టా అనే పేరు, ఆమె ఆలయంలో నిరంతరం పవిత్రాగ్ని వెలుగుతూ ఉండడాన్ని సూచిస్తుంది. దేవాలయానికి ఈశాన్యంగా గుండ్రని నిర్మాణం ఉంటుంది. డయానాను విష్టా రూపంలో ఇక్కడ పూజిస్తారు. ఇక్కడి పవిత్రాగ్నిని విష్టాల్ వర్జిన్స్ ఆరకుండా కాపాడుతూ ఉంటారు. ఇది అనాది కాలం నుంచీ నిన్న మొన్నటివరకూ ఉన్న ఆచారం.

యూరప్ ఉత్తరభాగమైన లేప్లాండ్ లో విష్టరాగ్ని కన్యలు నేడు కూడా కనిపిస్తారని రాంభట్ల అంటారు. అది ధ్రువప్రాంతానికి దగ్గరగా ఉంటుంది కనుక, రాత్రులు కనిపించని దీర్ఘవసంతం ఉంటుంది. వసంతారంభానికి ముందు ఇళ్లలోని అగ్నిని, అంటే గార్హస్పత్యాగ్నిని ఆర్పేస్తారు. ఆ తర్వాత కన్యలు అరణి మథించి నూతనాగ్నిని చేస్తారు. అదే విష్టరాగ్ని. ఊళ్ళో అంతా ఆ అగ్నిని తీసుకువెళ్లి గార్హస్పత్యాగ్నిని వెలిగించుకుంటారు. ఇక ఊరి బయట ఆహవనీయాగ్ని వెలిగినంతకాలం కన్యలు గాంధర్వ సంబంధాలు పాటిస్తారు. అందువల్ల వాళ్ళ కన్యాత్వానికి భంగం కలగదు. వసంతంలో అంతా ఆరుబయటే భోజనాలూ, విహారాలు సాగించే ఆ కాలాన్నే వేదాలు యజ్ఞ ఋతువు అన్నాయని రాంభట్ల వివరణ. మంచుపడే ప్రదేశాలలో ఆరుబయట సాగించే ఆ జీవనంలో భాగమే బార్బెక్యూ కూడా. మన దగ్గర కూడా కార్తీక మాసంలో వనభోజనాలు ఉన్నాయి.

గ్యాస్ పొయ్యిలు వచ్చిన ఈ రోజుల్లో సంగతి ఏమో కానీ, కట్టెలు, బొగ్గులు వాడిన రోజుల్లో శ్రోత్రియ కుటుంబాలలోనూ, ఎంతో కొంత మడీ, ఆచారం పాటించే కుటుంబాలలోనూ పురుడు, మైల వంటివి సంభవించినప్పుడు శుద్ధి తర్వాత పొరుగింటి నుంచి నిప్పు తెచ్చుకుని పొయ్యి వెలిగించుకునేవారు. ఆచారాలు వేల సంవత్సరాల కాలం వెంబడి ఎలా ప్రవహిస్తాయో తెలిపే ఇలాంటి ఉదాహరణలకు అంతేలేదు. కాలాన్నే కాదు, దేశాలను, ప్రాంతాలను కూడా అవి జయిస్తాయి. Sir James Frazer వివిధ దేశాలు, ప్రాంతాలలోని అగ్ని సంబంధ ఆచారాల గురించి మరెంతో సమాచారం ఇచ్చారు. అవన్నీ దాదాపు యావత్ప్రపంచం ఒకే సంస్కృతిని పంచుకున్న సంగతిని వెల్లడిస్తాయి.

వచ్చే వారం మరికొన్ని విశేషాలు…

 

  -కల్లూరి భాస్కరం

Download PDF

12 Comments

  • SP Jagadeesh says:

    మీ వ్యాసం ఎన్నో కొత్త విషయాల్ని తెలియజేసింది. కృతజ్ఞతలు. వేద కాలం నాటి ఎన్నో ఆచార వ్యవహారాలు ప్రపంచంలో ఇంచుమించు ఎన్నో నాగరికతలని ప్రభావితం చేసిందనేది కాదనలేని సత్యం. ఎవరికయినా శుభాకాంక్షలు చెప్పే సందర్భంలో వాడే wish అనే పదం యొక్క మూలాల్ని గుర్తించడానికి మీ వ్యాసం సహకరించింది.

    • kalluri bhaskaram says:

      థాంక్స్ జగదీష్ గారూ…శుభాకాంక్షల సందర్భంలో వాడే విష్ అనే పదం మూలాల్ని గుర్తించడానికి నా వ్యాసం సహకరించిందనడం ఆసక్తి కలిగించింది. అదెలాగో తెలుసుకోవాలనిపించింది. మీకు వీలైతే…

  • మంగు శివ రామ ప్రసాద్ says:

    భాస్కరంగారు నమస్కారం:
    విష్టరాగ్ని కన్యలు– విస్టాల్ వర్జిన్స్, త్రేతాగ్నులు, అగ్నికి సంబందించిన ప్రాచీన ఆచారాలు వాటి విశ్వజనీనత గురించిన ఆసక్తికరమైన సమాచారాన్ని అందించిన్నందుకు కృతజ్ఞతలు. దీనికి సంబంధించిన విషయ సేకరణ, మరిన్ని విశేషాలు మీ దగ్గర ఉన్నట్లయితే దయచేసి నాకు ఈమేల్ ద్వారా పంపగలిగితే మీకు ఋణపడి ఉంటాను.

    మంగు శివ రామ ప్రసాద్ (సెల్: 9866664964) , విశాఖపట్నం.
    Email: sivaramprasad.24@gmail.com

    • kalluri bhaskaram says:

      శివరామ ప్రసాద్ గారూ…నమస్కారం

      మీ ఆసక్తిని అభినందిస్తూ, ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అయితే మీరు కోరినట్టు నా దగ్గర ఉన్న సమాచారాన్ని మీకు ఎలా మెయిల్ చేయాలో మాత్రం నాకు తెలియడం లేదు. జోక్ గా అంటున్నాను, ఏమీ అనుకోకండి… ‘ సముద్రాన్ని చెంబులోకి తీసుకుని కాస్త ప్యాక్ చేసి పంపిస్తారా’ అన్నట్టుగా మీ కోరిక ధ్వనించింది. మరేం లేదు, practically not possible అని చెప్పడమే నా ఉద్దేశం. మీ లాంటి ఆసక్తిగల పాఠకులను దృష్టిలో ఉంచుకుని ఈ వ్యాసాల క్రమంలోనే సమాచారాన్ని అందించడానికి ప్రయత్నిస్తాను.

  • Manjari Lakshmi says:

    “ఐస్కలస్ రాసిన ఆ ‘యూమెనాయిడ్స్’ అనే ఆ రచన ఏమిటో, ఒరెస్టస్ తల్లిని ఎందుకో చంపాడో తెలుసుకోడానికి ఇంటర్నెట్ గాలించాను. దొరకలేదు. ” – ఫ్రెడరిక్ ఎంగెల్స్ రాసిన `కుటుంబము – స్వంత ఆస్తి రాజ్యముల ఆవిర్భావం’ అనే పుస్తకానికి ముందు మాటగా ఎంగెల్స్ రాసిన దాంట్లో కొంచెం ఇలాగే ఉన్నది ఒకటి నేను చదివాను. ఐస్కలస్ రాసిన ‘యూమెనాయిడ్స్’ అనే రచన అని మాత్రము అందులో లేదు. అయితే క్షీణిస్తున్న తల్లి హక్కుకు, విజయవంతంగా పైకి వస్తున్న తండ్రి హక్కుకు మధ్య వీరయుగంలో సాగిన పోరాటాన్ని ఎస్కిలస్ తన ఓరెస్టయాలో అద్భుతంగా చిత్రించాడని బాహోఫెన్ చూపించాడని రాసి ఉంది దానిలో. అందులో దీని గురించి రాసింది క్రింద ఇస్తున్నాను:
    “తన ప్రియుడైన ఏగిస్టస్ కోసం క్లిటెమ్నెస్ట్రా అపుడే ట్రోజన్ యుధ్ధం నుండి ఇంటికి తిరిగి వచ్చిన తన మగడు ఆగమేమ్నన్‌ను చంపివేసింది. అయితే ఆగమేమ్నన్ వల్ల ఆమెకు కలిగిన కొడుకు ఓరెస్టెస్ తన తల్లిని చంపి తన తండ్రిని చంపినందుకు ప్రతీకారం తీర్చుకున్నాడు. ఆ పని చేసినందుకు ఎరీనిలు(ఉగ్రదేవతలు) అతనిని తరమడం ప్రారంభించాయి. తల్లి హక్కును కాపాడుతున్న భయంకర దేవతలవి, వాటి ఉద్దేశ్యంలో మాతృహత్య మహా నీచమైన అపరాధం. దానికి ప్రాయశ్చిత్తం కూడా లేదు. ఐతే అశరీరవాణి ద్వారా ఓరెస్టెస్‌ను రెచ్చగొట్టి హత్య చేయించిన అపోలో, మధ్యవర్తిగా నియమితమైన ఎథీనాలు(ఈ ఇరువురు తండ్రి హక్కుపై ఆధారపడిన నూతన వ్యవస్థకు ప్రాతినిధ్యం వహించే దేవతలు) అతడిని రక్షించారు. ఎథీనా ఉభయ పక్షాలవారి వాదనలను వింటుంది. ఓరెస్టెస్ ఏరీనిలకు మధ్య సాగిన వాదోపవాదాలు వింటే అసలు తగాదా క్లుప్తంగా అర్ధమవుతుంది. క్లిటెమ్నేస్ట్రా రొండు అపరాధాలు చేసిందని ఓరెస్టెస్ అంటాడు. ఆమె తన భర్తను చంపింది. ఆ విధంగా అతని తండ్రిని కూడా చంపింది. అలాంటపుడు తనకంటే ఎక్కువ నేరస్థురాలైన క్లిటెమ్నేస్ట్రాను వదిలి ఎరీనాలు తనవెంట పడ్డారెందుకు అని ప్రశ్నిస్తాడు. దానికిచ్చిన సమాధానం అబ్బురపరిచేది.”ఆమెకు ఆమె చంపినవానికీ రక్తసంబంధం లేదు” దీని అర్ధం ఏమిటి? రక్త సంబంధీకుడు కానివానిని చంపినపుడు, ఆ హతుడు హంతకురాలికి మగడే అయినప్పటికీ అది క్షమార్హం. కనుకనే ఆ విషయాన్ని ఎరినీలు పట్టించుకోరు. రక్త సంబంధీకుల మధ్య జరిగిన హత్యలకు ప్రతీకారం చేయడమే వారి పని. అందునా తల్లి హక్కు ప్రకారం మాతృహత్య మహానీచం. ఆ సమయంలో ఒరేస్టేస్ తరుఫున అపోలో కలగచేసుకుంటాడు. ఈ సమస్యపై తమ అభిప్రాయాన్ని ఇవ్వవలసిందిగా కోరుతూ అరియోపాజిటెస్‌లను (ఎథీనియన్ జ్యూరీలు) ఎథీనా పిలుస్తుంది. జ్యూరీలలో విడిచిపెట్టాలనే వాళ్ళు, శిక్షించాలనే వాళ్ళు సమాన సంఖ్య అయ్యారు. న్యాయాధికారిణిగా ఎథీనా తన ఓటును ఒరెస్టెస్‌కు అనుకూలంగా ఇచ్చింది. అతడిని వదిలివేశారు ఆ విధంగా తల్లి హక్కును తండ్రి హక్కు దిగతొక్కేసింది. “తరువాతి తరం దేవతలు” అంటూ ఎవరినైతే ఎరినీలు వర్ణించారో వారే ఎరినీలను జయించారు. చివరగా కొత్త వ్యవస్థ సేవల నిమిత్తం కొత్త ఉద్యోగాలు చేపట్టేలా ఎరినీ దేవతలను ఒప్పించారు. – ఓరెస్టెయాకు బాహోఫెన్ చేసిన ఈ వ్యాఖ్య వినూత్నమైనదే అయినప్పటికీ పూర్తిగా సరైనదే. ఆయన పుస్తకంలోకెల్లా ఈ ఘట్టం శ్రేష్టమైనదీ చాలా అందమైనదీను. కాని బాహోఫెన్ కూడా ఎస్కిలస్‌లాగే ఎరినిస్, అపోలో, ఎథీనాల అస్తిత్వాన్ని విశ్వసించాడు.” (పేజీ 11-12నుంచి)
    ఈ ఫ్రెడరిక్ ఎంగెల్స్ రాసిన `కుటుంబము – స్వంత ఆస్తి రాజ్యముల ఆవిర్భావం’ అనే పుస్తకంలోని విషయాలను ఆధారంగా చేసుకొనే రంగనాయకమ్మగారు తన `రామాయణ విషవృక్షం’ పుస్తకంలోని పీఠికను రాసారు అని అంటారు.

    • kalluri bhaskaram says:

      మంచి సమాచారం ఇచ్చినందుకు ధన్యవాదాలు మంజరి లక్ష్మిగారూ…

      అలవాటు పడని విదేశీ పేర్లు, స్పెల్లింగులు తికమక పెడతాయి. నిజానికి Robert Graves రాసిన The Greek Myths కొన్నేళ్ళ క్రితం చదివాను. మన పురాణ కథలకు, వాటికి ఉన్న పోలికలను కూడా గమనించాను. అందులో ఇలాంటి కథలు చాలా ఉన్నాయి. మీరు రాసింది చూసిన తర్వాత ఇది గుర్తొచ్చింది.

      మీరు పేర్కొన్న బాహోఫెన్, నేను కిందటి వ్యాసంలో పేర్కొన్న జెర్మన్ శాస్త్రవేత్త బాకోఫెన్నే. మన తాపీ ధర్మారావుగారి లానే ఆయన కూడా పెళ్లి, దాని పుట్టుపూర్వోత్తరాలపై విలువైన గ్రంథం రాశారు.

      మీరు రాసిందాల్లో ఇంకో ఆసక్తికరమైన అంశం ఉంది. అది-ఒరెస్టస్ అన్నట్టు, అతని తల్లి తన భర్తనే కాక తన(ఒరెస్టస్) తండ్రిని చంపడం అనే రెండు నేరాలు చేసినా ఆమెకు శిక్షలేదు. తల్లిని చంపినందుకు అతను మాత్రం శిక్షార్హుడు అవుతాడు. అది విచిత్రంగా ఉన్న మాట నిజమే కానీ బహుశా అందులో గణసమాజపు న్యాయసూత్రం ఇమిడి ఉంది. గణ సమాజంలో రక్తబంధువులను చంపడమే తీవ్రమైన నేరం. భార్యా, భర్తలు రక్త బంధువులు కారు. అదీ ఇక్కడి తర్కం. అలాగే తల్లి హక్కు నుంచి తండ్రి హక్కుకు మళ్లే దశను కూడా ఈ కథ చెబుతోంది.

  • ari sitaramayya says:

    చాలా ఆసక్తికరమైన వ్యాసాలూ రాస్తున్నారు. అభినందనలు.
    ఒకదానికొకటి చాలా దూరంగా ఉంటున్న గణ సమాజాల్లో ఒకే విధమైన ఆచారం ఉంటే ‘దాదాపు యావత్ప్రపంచం ఒకే సంస్కృతిని పంచుకున్న’ ట్లు కాదేమో. గణ సమాజాల్లో గాలీ, నిప్పు, నీరూ గురించి ఒకే రకమైన అభిప్రాయాలు ఏర్పడటం అంత ఆశ్చర్యకరమైన విషయం కాదేమో. సాంప్రదాయ సారూప్యానికీ సంస్కృతిని పంచుకోవటానికీ చాలా తేడా ఉందేమోనని నా అనుమానం.

  • kalluri bhaskaram says:

    ధన్యవాదాలు సీతారామయ్య గారూ…గాలి, నీరు, నిప్పు గురించే కాక చాలా విషయాల్లో ప్రపంచం ఒకే రకమైన భావాలను, సామాజిక నిర్మాణాలను వగైరాలను కూడా పంచుకోవడం కనిపిస్తుంది. నా వ్యాసాల్లో ఇందుకు చాలా ఉదాహరణలు ఇచ్చాను. ఇక ముందు కూడా ఇవ్వచ్చు. “సాంప్రదాయ సారూప్యానికీ సంస్కృతిని పంచుకోవటానికీ చాలా తేడా ఉందేమోనని నా అనుమానం.” అన్న మీ అభిప్రాయంపై ఇంకొంచెం వివరణ అవసరమేమో!

  • jagadeeshwar reddy says:

    భాస్కరం గారి ఆర్టికల్ కి బొమ్మ కి సంబంధం ఉందో లేదో కానీ బొమ్మ చాలా చాలా బాగుంది . జనమేజయుడి సర్పయాగం బొమ్మ ఇంత గొప్పది గతం లో చూడలేదు – గొరుసు

  • సర్, కొన్ని సందేహాలు , ( మీ వ్యాసానికి పూర్తిగా సంబంధించినవి కాకపోవచ్చు ఇవి)
    వేదకాలం అనేది ఏ కాలాన్ని సూచిస్తుంది,.
    వేదాలలో సంస్కృతం పూర్తిగా అభివృధ్ది చెందినదిగానే కనిపిస్తుందా,.
    రామాయణం, మహాభారతం ఇవి ఏ కాలానికి చెందివుండవచ్చు.,
    వీటికి సంబంధించిన ప్రధానమైన ఆధారాలు ఏమిటి.,
    మీకు వీలైతే తెలియచేస్తారని ఆశిస్తాను,.

  • kalluri bhaskaram says:

    భాస్కర్ కొండ్రెడ్డి గారూ…

    వేదకాలం ఏది అన్నప్పుడు రెండు రకాల సమాధానాలు ఉన్నాయి. మొదటిది విశ్వాసానికి సంబంధించినది. దాని ప్రకారం వేదాలకు ఒక కాలం, ఒక కర్త అంటూ లేరు. అవి వాటంతట అవే వినిపించాయి. అందుకే వాటిని శ్రుతులు(వినిపించినవి) అంటారు. రెండవది, భౌతిక ఆధారాల ప్రకారం నిర్ణయించినది. దాని ప్రకారం వేదాలు ఇప్పటికి 4 వేల సంవత్సరాల లోపు కాలానికి చెందినవి.

    వేద సంస్కృతానికి, కావ్య సంస్కృతానికి తేడా ఉంది. వేదసంస్కృతం కావ్య సంస్కృతానికి పూర్వ రూపం. వేద సంస్కృతాన్ని అర్థం చేసుకోడానికి ప్రత్యేక శిక్షణ ఉండాలి.

    రామాయణ, భారతాల కాలం విషయంలో కూడా చాలావరకు పైన వేదాలకు చెప్పిందే వర్తిస్తుంది. కాలనిర్ణయం అనేది వివాదాస్పదమైన ప్రత్యేకాంశం. అందులోకి వెళ్లకుండా పురాకాలంలో భాగంగా వాటిని చూడవచ్చు. పురా వాగ్మయం నిర్దిష్టంగా చరిత్ర కాకపోవచ్చు కానీ వాటిలో చరిత్రాంశాలు ప్రతిఫలిస్తాయి.

Leave a Reply to kalluri bhaskaram Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)