అడగవలసిన వరం

2the_fairies_vale

MythiliScaled

అనగనగా ఒక పెద్ద తోట. తోట నిండా రంగురంగుల పూలమొక్కలూ నీడ ఇచ్చే పళ్ళ చెట్లూ – చల్లటి జలయంత్రాలు, కలువలు విచ్చే కొలనులు. తోట మధ్యలో చక్కటివిశాలమైన ఇల్లు. అందులో ఒక ఫెయిరీ ఉండేది. చాలా దయ గలది, సరదాగానూ ఉండేది. అప్పటి పద్ధతి ప్రకారం చుట్టు పక్కల రాజ్యాలనుంచి రాకుమారులనీ రాకుమార్తెలనీ వాళ్ళు ఇంకా బాగా చిన్నవాళ్ళుగా ఉండగానే ఆమె దగ్గరికి పంపించేవారు. వాళ్ళందరికీ తన పక్కన ఉండటమే ఎంతో బావుండేది. హాయిగా ఆడుకుంటూ చదువుకుంటూ వాళ్ళు పెరిగి పెద్దయేవారు. బయటి ప్రపంచం లోకి వాళ్ళు వెళ్ళే ముందర ఆ ఫెయిరీ ఒక్కొక్కరికీ వాళ్ళు అడిగినవరాన్ని ఇచ్చేది.

వాళ్ళలో సిల్వియా అనే రాకుమారి మంచి చురుకైన పిల్ల. పైకి చెప్పకపోయినా ఫెయిరీకి మనసులో సిల్వియా అంటే ప్రత్యేకమైన ఇష్టం ఉండేది. సిల్వియా వాళ్ళ రాజ్యానికి వెళ్ళే సమయం వచ్చింది. ఈ లోపు , ఇదివరకు తనతో ఉండి వెళ్ళిన రాకుమార్తెలు కొందరు ఏం చేస్తున్నారో ఎలా ఉన్నారో తెలుసుకోవాలని ఫెయిరీకి అనిపించింది. ఆమె సిల్వియా తో అంది-” ఐరిస్ అని ఒక రాకుమారి ఉంది. తన దగ్గర రెండు నెలలు ఉండు. నిన్ను ఆమె బాగా చూసుకుంటుంది. ఆ తర్వాత వెనక్కి వచ్చి తన గురించి ఏమనిపించిందో నాకు చెప్పు ”

సిల్వియా కి వెళ్ళటం ఏమంత ఇష్టం లేదు , కానీ ఫెయిరీ అడిగింది కదా అని ఒప్పుకుంది. రెండు నెలలు గడిచాక ఫెయిరీ ఒక సీతాకోకచిలకల రథాన్ని ఐరిస్ రాజ్యానికి పంపింది. సిల్వియా ” అమ్మయ్య ” అనుకుని అందులోకి దూకి వచ్చేసింది. ఫెయిరీ అడిగింది ” ఇప్పుడు చెప్పు మరి, ఏమనుకుంటున్నావు నువ్వు ? ”

” ఐరిస్ రాకుమారికి మిరుమిట్లుగొలిపే అందాన్ని మీరు వరంగా ఇచ్చారు. తను మీ గురించి మంచిగానే చెబుతూ ఉంటుంది కానీ అంత అందం మీ వల్లనే వచ్చిందని ఎక్కడా ఎవరికీ చెప్పనే చెప్పదు. ముందు ఆమెని చూసి నాకూ కళ్ళు చెదిరిపోయాయి . కానీ – అందంగా కనిపిస్తే చాలు, ఇంకేమీ చేయక్కర్లేదని అనుకుంటోందని అర్థమైంది. సంగీతం, పుస్తకాలు , స్నేహితులు – ఎవరూ అక్కర్లేదు, తనని తను అద్దం లో చూసుకుంటూ రోజంతా గడిపేస్తుంది. పాపం ! నేను అక్కడ ఉండగానే ఆమెకి తీవ్రంగా జబ్బు చేసింది. పూర్తిగా కోలుకుంది గానీ ఇదివరకటి అందం లేదు. తనని తనే అసహ్యించుకునేంత దిగులుపడిపోయింది. దయచేసి తన అందాన్ని తిరిగి ఇప్పించమని మీకు నన్ను చెప్పమంది. నాకూ నిజంగా అది అవసరమేనేమో అనిపిస్తోంది. ఎందుకంటే అందంగా ఉన్నప్పుడు తన ప్రవర్తన బాగానే అనిపించేది. మనసుని , తెలివిని అసలు ఉపయోగించటం ఇన్నాళ్ళూ మానేసింది కదా, ఆమె లోపాలు ఇప్పుడు కొట్టొచ్చినట్లు కనిపించి – ఎవరూ భరించలేకపోతున్నారు . తనకి ఇదంతా అర్థమైనట్లే ఉంది. అందుకే మీ సహాయం అడుగుతోంది. మళ్ళీ తనని ఇదివరకులా చేసేయచ్చు కదా ”

ఫెయిరీ అంది ” అనుకుంటూనే ఉన్నాను ఇలా అవుతుందని. కాని ఏమీ చేయలేనమ్మా, నా వరం ఒక్కసారే పనిచేస్తుంది ”

కొంతకాలం సిల్వియాకి తోటలో, ఇంట్లో ,సంతోషంగా గడిచిపోయింది. అప్పుడు మళ్ళీ ఫెయిరీ సిల్వియాని డాఫ్నె అనే ఇంకొక రాకుమారి దగ్గరికి సీతాకోకచిలకల రథం మీద పంపించింది . వెళ్ళి ఎన్నో రోజులు కాకముందే సిల్వియా వెనక్కి వచ్చేస్తానని కబురు చేసింది. అటుగా ఎగురుతున్న ఒక తూనీగని బ్రతిమాలి చెప్పి పంపింది. ఫెయిరీకి జాలేసి సరే , రమ్మంది. ” అబ్బబ్బా..ఎలాంటి చోటికి పంపారండీ నన్నూ ” అని నసపెట్టింది సిల్వియా.

” ఏం? ఎందుకు అలా ? డాఫ్నె కి నేను మాటకారితనాన్ని వరంగా ఇచ్చానని జ్ఞాపకం. అవునా ?”

2the_fairies_vale

” అవునండీ, అవును. ఆమె బాగా మాట్లాడుతుంది, ఆ మాటయితే నిజమే. భాషని నేర్పుగా ఉపయోగిస్తుంది. మరి , ఆ మాటలు కాసేపైనా ఆపితేనా ? ముందర వినటానికి బాగానే ఉంటుంది కాని వినీ వినీ అలిసిపోతాం . అందరినీ ఒకచోట చేర్చి రోజుకి నాలుగుసార్లు ఉపన్యాసాలు ఇస్తుంది ఒక్కోసారీ రెండు గంటలు. రాకుమారి కాబట్టి అప్పటికి దొరికిపోయినవాళ్ళంతా కిమ్మనకుండా వింటూ ఉంటారు ఆ సమావేశాలు అవుతూనే మళ్ళీ ఏదో ఒకదాని గురించి చెప్పటం మొదలు. చెప్పేందుకు అసలేమీ లేనప్పుడూ అంతే. అక్కడనుంచి వచ్చేస్తుంటే ఎంత హాయిగా ఉందో చెప్పలేను అసలు ! ”

సిల్వియా చిరాకు కి ఫెయిరీకి నవ్వొచ్చింది. కొద్ది రోజులు కోలుకోనిచ్చి మళ్ళీ పంపింది. ఈ సారి సింథియా అనే రాకుమారి దగ్గరికి. మూడు నెలలు అక్కడ ఉండి ఈసారి కొంచెం నయంగానే తిరిగి వచ్చింది సిల్వియా. ఆ రాకుమారికి ఎవరినైనా సరే ఆనందంగా ఉంచగల వరాన్ని ఫెయిరీ ఇచ్చి ఉంది.

సిల్వియా ఇలా అంది ” ముందు నేను అనుకున్నానూ, ఆమె చాలా సంతోషంగా ఉందని. ఏవైపుకి వెళ్ళినా తనని అంతా ఇష్టపడుతున్నారు. తనకేం కావాలంటే అది ఇస్తున్నారు. నాకూ అలాంటి వరమే మీరు ఇస్తే బావుంటుందనుకున్నాను కూడా ” ఫెయిరీ అడిగింది ” ఇప్పుడు నీ మనసు మార్చుకున్నావా ఏమిటి ?”

సిల్వియా ” అవునండీ. సింథియా తో ఉండే కొద్దీ తను నిజానికి అంత సంతోషంగా లేదేమోననిపించింది. అందరినీ మెప్పించాలని ప్రయత్నించటం లో నిజాయితీగా ఉండటం మర్చిపోయినట్లుంది. తన ప్రవర్తన నిజమో అబద్ధమో తనకే తెలియదనుకుంటాను. అవతలి వాళ్ళు ఎలా ఉన్నా, ఎలాంటివాళ్ళైనా ఒకేలాగా ఉంటుంది. తనని నిజంగా ప్రేమించినవాళ్ళకి నిరుత్సాహంగా ఉంటోంది ” అని జవాబు ఇచ్చింది.

uh51577157-1

ఫెయిరీ అంది ” బాగా కనిపెట్టావు. కొన్నాళ్ళు విశ్రాంతి తీసుకో ”
తనకేం కావాలని అడగాలో సిల్వియా ఆలోచించుకోవటం మొదలుపెట్టింది. వాళ్ళ సొంత రాజ్యానికి తనూ త్వరలో వెళ్ళిపోవాలి.

చివరిసారిగా ఫిలిడా రాకుమారి దగ్గరికి పంపింది ఫెయిరీ. సిల్వియా అభిప్రాయం గురించి కుతూహలంగా ఎదురు చూసింది. అది ఇలా ఉంది .

” ఫిలిడా నన్ను ఆప్యాయంగా పలకరించింది. . తనకి మీరు అందరినీ నవ్వించగల శక్తిని ఇచ్చారు కదా. నాకూ ఆ హాస్యం తెగ నచ్చేసింది. ఆమెతో వారం రోజులు ఇట్టే గడిచిపోయాయి. అంతకన్న ఇంకేం కావాలీ అనిపించింది. కానీ అందరినీ సంతోషపెట్టగలగటం లాగే ఇది కూడా పూర్తిగా తృప్తి ఇవ్వదని తోచింది. అస్తమానమూ హాస్యం ఉట్టిపడేలా మాట్లాడటం అయ్యే పని కాదు . అందుకేనో ఏమో, .ఫిలిడా ఒక్కోసారి ఎవరైనా ఏడుస్తున్నా బాధపడుతున్నా కూడా వాళ్ళని వెటకారం చేసి పక్కవాళ్ళని నవ్వించటానికి చూస్తుంది. తప్పు కదండీ ! ”

ఫెయిరీ సిల్వియా చెప్పింది నిజమేనని ఒప్పుకుంది. ఆమెని బాగా పెంచానని మనసులో సంతోషించింది.

చివరికి సిల్వియా తనకి కావలసిన వరాన్ని అడిగే రోజు వచ్చింది. స్నేహితులూ స్నేహితురాళ్ళూ అంతా గుమిగూడారు. ఏం కోరుకుంటావూ అని ఫెయిరీ ప్రశ్న వేసింది.
సిల్వియా ఒక్క క్షణం ఆలోచించి అడిగింది- ” ప్రశాంతమైన హృదయం ! ” .

” అలాగే, ఇచ్చాను. ” అంది ఫెయిరీ.

అది నిజంగా అపురూపమైన వరం. సిల్వియాకి తృప్తినీ సుఖాన్నీ తెచ్చిపెట్టింది. చిన్న చిన్న కష్టాలు అందరికిలాగే తనకీ వచ్చాయి. కాని వాటినుంచి త్వరగా తేరుకోగలిగేది. తనతో ఉన్నవాళ్ళకి కూడా తేలికగా, శాంతంగా అనిపించేది. తగిన రాకుమారుడిని పెళ్ళాడి సిల్వియా చాలా కాలం నిశ్చింతగా జీవించింది.

 

 French fairy tale , by the Comte de Caylus (1692–1765).
సేకరణ- Andrew Lang

అనువాదం: మైథిలి అబ్బరాజు

mythili

Download PDF

8 Comments

 • suresh says:

  సీతాకోకచిలుక రధం,,,ఆ ఊహ ఎంత అందంగా ఉందో, మీ కథ అంతే అందంగా ఉంది. ఇప్పుడే నిదుర లేచి, ఈ కథ చదివాను….ఫెయిరీ, ఈ కథ చదివేవారికి కొంత ప్రశాంతత వచ్చేలా వరమేమైనా ఇచ్చిందా అని అనిపించింది.

  • మైథిలి అబ్బరాజు says:

   థాంక్ యూ సురేష్ ..ఇస్తుందనుకుంటాను :)

 • Rekha Jyothi says:

  Its Wonderful Mam, and glad to share my 9 years old son’s response at this story 1. సిల్వియా పేరు భలే నచ్చింది ( ప్రతి డౌట్ ని ఆ పేరు పలుకుతూ అడిగాడు )
  2. ఆ తోటను వర్ణించిన లైన్స్ మాత్రం తనేచదువుకున్నాడు ( కూడుకొని కూడుకొని )
  3. సీతాకోక చిలుకల రథం , తూనీగతో మెసేజ్ పంపడం ( కళ్ళు పెద్దవి చేసి విన్నాడు )
  4. ఈ కధ లో ఒక్క అబ్బాయి కూడా లేడట
  ( Feeling weight less .. after completing ) Thanks a lot for sharing Mam.

 • Prasuna says:

  భలే ఉంది మాడం కథ.

 • BHUVANACHANDRA says:

  Dr మైధిలి గారూ చాలా బాగుంది ….మళ్ళీ బాల్యం లోకి పయనం ……………………………

 • మైథిలి అబ్బరాజు says:

  చాలా సంతోషం సర్ !!!!!!!!!!

Leave a Reply to మైథిలి అబ్బరాజు Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)