ఎగిరే పావురమా! -8

egire-pavuramaa8-bannermadhav

‘అట్లతద్ది’ అనగానే రాములు గుర్తొచ్చి దిగులుగా అనిపించింది.

‘ఈ చిన్నారి ఆడపిల్లకి నా అట్లతద్ది బహుమానం’ అంటూ నాకు జడలల్లి ముస్తాబు చేసేది రాములు. సొంత అక్కలా ప్రేమగా చూసుకునేదని గుర్తొచ్చింది.
రోజూలానే పావురాళ్ళు వచ్చి అరుగుల ముందు నిలిబడ్డాయి. రాముల్ని మరింత జ్ఞాపకం చేసేలా పాలనురుగు లాంటి తెల్లని గువ్వలు రెండొచ్చాయి. నాలుగు పిడికిళ్ళ గింజలు వేసి, వాటిని గమనిస్తూ పూల పని ముగించాను.
పూలబుట్టలు కమలమ్మకి అప్పజెప్పి, కుంకుమ పొట్లాలు కడుతూ కూడా రాములు గురించే ఆలోచిస్తున్నాను.
**
పావురాళ్ళు గింజలు తిని ఎగిరిపోడం కూడా గమనించలేదు. జనం రాడం ఈ పొద్దు కాస్త తక్కువగానే ఉంది.
చదువుదామని పుస్తకం చేతిలోకి తీసుకొన్నా మనసెట్టలేక పోతున్నా.

“గాయత్రీ, ఏమి సంగతి? చదువు మీద శ్రద్ధ తగ్గిందా? పుస్తకం ముందు పెట్టుకుని పరధ్యానంగా ఉన్నట్టున్నావు? లేక అట్లతద్ది రోజున రాముల్ని తలుచుకుంటున్నావా?” అంటున్న ఉమమ్మ గొంతు దగ్గరగానే వినిపించింది.
ఆమె వచ్చినట్టు కూడా నేను గమనించలేదు.
పర్సులోనుంచి చాక్లెట్టు తీసిచ్చి నా పక్కనే కూచుందామె.

“నాక్కూడా రాములు ఎంతగానో గుర్తొస్తుంది. పాపం ఆమె జీవనం ఎలా ఉందో అక్కడ,” అంది ఉమమ్మ రాముల్ని తలుచుకొని.

“నువ్వు మాత్రం శ్రద్ధ పెట్టి చదువు. లెక్కల్లో మంచి మార్కులే వస్తాయి నీకు. మిగతా సబ్జెక్ట్స్ లోనూ మెరుగ్గా రావాలి. పరీక్షలకి నిన్ను సిద్ధం చేసే సమీక్ష పుస్తకాలు పంపిస్తానన్నారు మాస్టారు. పరీక్షలకి మూడు రోజుల సమయమే ఉంది. ఇవాళ నాకు సెలవేగా! పుస్తకాలు అందితే సాయంత్రం తెచ్చిస్తాను,” అంది ఆప్యాయంగా ఆమె.

ఆమె వంక చూసి నవ్వాను…
నా భుజం మీద తడుతూ, “పోతే, మరో సంగతి,” అందామె.
”డాక్టర్ మల్లిక్ గుడికి ఫోను చేసారట. నీ ‘ఊతకర్రలు’ ప్రత్యేకంగా రేపు ఒక మనిషి చేత పంపిస్తున్నామని మనకి చెప్పమన్నారట. ఎలాగు రేపు ఆదివారం. వివరాలు కనుక్కొని అదే సమయానికి నేనూ వస్తాను. మొత్తానికి చాలా సంతోషంగా ఉందిరా,” అని కాసేపు నాతో పాటు పావురాళ్ళని గమనిస్తూ, కబుర్లు చెప్పింది ఉమమ్మ.
**
పనయ్యాక తన వంతు గుడి రాబడులు పంతులుగారికి అప్పజెప్పి, బత్తెం అందుకొని నాతో పాటే ఇంటి దారి పట్టాడు తాత.
ఎప్పటిలా బండిలో వరకు నాకు సాయం చెయ్యడానికి వచ్చిన కమలమ్మ, నా చేతికర్ర, చక్రాల పీట కూడా బండిలో పెట్టాక, ఉన్నట్టుండి నా పక్కన తానూ ఎక్కి కూచుంది.

తాతతో మాట్లాడాలంటూ, నన్ను అడ్డం జరగమంది.
“అన్నా, ఇయ్యాల నేను గాయత్రిని అయ్యప్ప గుడికి తీసుకెళ్ళి రేత్రికి మీ కొట్టాంలో దింపేస్తాలే. ఆ గుడి సుట్టూతా పూదోటలు, మయూరాలు, వందరకాల పక్షులు ఉంటాయంటన్నా.
గాయత్రి పాపం ఏనాడు సూసుండదు. నువ్వేమో తీసుకెళ్ళకపోతివి. సరదాగా మరి ఎళ్ళి రామా? అయినా నువ్వు మాత్రం కాదంటావా?” గబగబా తాతకి చెప్పేసి, రిక్షాని పోనీమ్మంది.

“ఇదిగో, సత్యమన్నా ఎండాకాలం కదా! తొమ్మిదింటి వరకు బోలెడంత ఎలుతురుగా ఉంటాది. నువ్వేమీ బెంగెట్టుకోకే,” అంటూ వెళ్ళిపోతున్న రిక్షా నుండి తాతకి వినపడేలా మళ్ళీ బిగ్గరగా అరిచి మరీ చెప్పింది.

ఆమె అకస్మాత్తు చేష్టకి తాత, నేను కూడా ఆశ్చర్యపోయి, ఏమనాలో తోచకుండా అయ్యాము. కమలమ్మ ఆ మధ్య నాతో ఈ విషయం గురించి చెప్పినట్టు గుర్తే కాని ఇలా ఉన్నట్టుండి నన్ను బయలుదేరదీస్తదని అనుకోలేదు.
**
కమలమ్మ అన్నట్టు అయ్యప్పసామి గుడి ఎంతో కన్నులపండువగా ఉంది. వీలున్నంత మటుకు నన్ను గుడి చుట్టూతా తోటలో రిక్షాలోనే తిప్పాడు గోవిందు.
చాలాకాలంగా అదంతా గులాబి తోటలంట. రకరకాల పక్షులకి, నెమళ్ళకి నెలవుట. తోటలు, పక్షులని చూడ్డానికి జనం ఎప్పుడూ వచ్చేవారంట.
రెండేళ్ళ క్రితం కేరళ వర్తకులు కొందరు ఈ తోటలు కొన్నాకే, తోట మధ్యగా అయ్యప్ప స్వామి గుడి కట్టారని వివరించాడు గోవిందు.

తోటల చుట్టూ పిల్లలు సైకిళ్ళ మీద కూడా తిరుగుతున్నారు.
ఆ ప్రదేశమంతా చాలా విశాలమైన ఏర్పాటుగా ఉంది.
రంగురంగుల గులాబీలు అంత దగ్గర నుంచి చూడ్డం బాగుంది. కాసేపు నా అవిటితనం కూడా మరిచిపోయేటంత బాగా అన్పించింది. నెమళ్ళ గురించి, పక్షుల గురించి గోవిందు, తనకి తెలిసింది చెప్పాడు.

అంతా తిరిగి చూసాక, ఆవరణ బయట తోటలో కూచున్నాము. చుట్టూ జనం. అందరూ తీరిగ్గా చిరుతిళ్ళు తింటూ కబుర్లు చెప్పుకుంటున్నారు.

గుడి బయట హోటలు నుండి వడ, దోస తెప్పించింది కమలమ్మ.
చేతుల నిండా తిండి పొట్లాలతో వచ్చిన గోవిందు, వాటిని మాకాడిచ్చి, క్షణాల్లో వస్తానంటూ మళ్ళీ వెళ్లాడు.
“ఏం మర్చిపోయాడో! అంటూ నెమ్మదిగా ఆ పొట్లాలు ఒక్కోటి విప్పడం మొదలెట్టింది కమలమ్మ.

ఇంతలోనే, “గులాబీలు కోయకూడదు కానీ,” అంటూ చేతుల్లో సంపెంగలతో త్వరగానే వచ్చాడు గోవిందు.

“పూల కోసం ఎల్లావా? మన గాయత్రికేనా? బాగుండాయి. ఆ పూలు ఆడ పక్కనెట్టి…ముందైతే, ఇవన్నీ వేడిగుండగానే తిను,” అంటూ ముగ్గురి మధ్యా పంచింది కమలమ్మ.

నోట్లో ముద్దెట్టబోతూ, క్షణమాగింది. తినబోతున్న గోవిందు చేయి పట్టుకుంది.
“అరేయ్ తమ్ముడు, గోవిందు, గుడి ముందు కూకొని ఈ అమ్మాయి ఎదురుగా నీకో మంచి మాట సెబుతున్నా ఇయ్యాల. అదేమంటే, ఎప్పటికీ మన గాయత్రికి నువ్వు సాయంగా ఉండాలి.
దాని వైపు ఓ కన్నేసి ఉండాలి మనం. బయటకి తీసుకెళ్ళాలి, సంతోషపెట్టాలి,” క్షణమాగి మా ఇద్దరివంకా చూసింది…

“ఎందుకంటే, ఆ పిల్ల అచ్చట ముచ్చట తీర్చే ఓపిక దాని తాతకి లేదు. ఇప్పటికే ఎన్నో మార్లు జబ్బు పడ్డాడు పాపం ఆ ముసలాడు,” అంటూ పెదవి విరిచింది కమలమ్మ.
నేనేమనాలో తోచలేదు.

“పాపం! గంగిగోవు లాంటిది గాయత్రి. ఎంత ప్రేమ? ఎంత త్యాగం? ఐదేళ్ల వయసునుండి కొలువు చేసి ముసలి తాతకి ఆసరా అయ్యింది. ఆ కొట్టాం కూడా దాని సంపాదనే అంటే నమ్ము.
అసుమంటి పిల్లకి సాయంగా ఉంటే దేవుడు చల్లంగా చూస్తాడు నిన్ను,”, “ఏరా తెలిసిందా?” అడిగింది గోవిందు నెత్తిన మొట్టి.
గోవిందు అయోమయంగా చూసాడామెని.

నా గురించి, నాకే తెలియని సంగతులు ఆమె నుండి వినడం వింతగుండి, చికాకుగా అనిపించింది.

“అసలీ అమ్మాయి ఓర్పు, జాలి, పనితనం నాకెంతో నచ్చాయి.
ఎవడు కట్టుకుంటాడో గాని అదృష్టమంతుడే. ప్రేమగా ఉండిపోతాది,” నా గురించే మళ్ళీ కమలమ్మ.
ఇక తినండి అంది అతని చేయి వదిలేసి….
‘అవసరం లేని ఆమె మాటలు’ విననట్టే తలొంచుకుని తింటున్నాను.
ఇంకాసేపటికి గోవిందు చేత బయట నుండి కాఫీ తెప్పించింది.

illustration 8

“గాయత్రీ, ఇప్పుడు నీకేమో నాకు తెలిసిన అట్లతద్ది కథ సెబుతాను,” అని మొదలెట్టింది కమలమ్మ. “అసలు మా ఊళ్ళల్లో అట్లతద్దినాడు తెల్లవారుఝామున లేస్తారు. అన్నం, గోంగూర పచ్చడి, పెరుగుతో కడుపునిండా తింటారు. ‘అట్లతద్దోయ్, ఆరట్లోయ్ – ముద్దపప్పు మూడట్లోయ్’ అంటూ అరుస్తూ ఇరుగు పొరుగు స్నేహితులతో కలిసి ఆడతారు,” చెప్పడం ఆపి కాస్త కాఫీ తాగింది.

నేనూ వింటూ, మధ్యలో, అలవాటు లేని కాఫీ తాగాను.
“బాగుందా?” అడిగింది. ‘ఔనని’ తలాడించాను.
మళ్ళీ చెప్పడం మొదలెట్టింది.
“అమ్మవారికి మొక్కులు మొక్కి, తొమ్మిది అట్లు నైవేద్యంగా పెట్టి, తొమ్మిది అట్లు వాయనాలిచ్చి, తొమ్మిది పువ్వుల ముడితో చేతికి తోరం కట్టుకుంటే, మంచి మొగుడొస్తాడంట,” అని, “ఇవన్నీ నేను కథలుగా ఇన్నవే. ఏనాడు సెయ్యలేదు,” అంటూ పెద్దగా పగలబడి నవ్వింది.

“అక్కా ఏందే ఆ పిచ్చి నవ్వు? అందరూ మననే సూత్తుండారు. ఇక ఆపవే,” గొడవ పడ్డాడు గోవిందు.
తినడం ముగించి ఇంటి దారి పట్టాము. గుడి ముందు అమ్ముతున్న గోరింటాకు ముంత ఒకటి కొనిచ్చింది నాకు.
“ఈ యాత్ర, దోస భోజనం, నీకు మా ‘అట్లతద్ది’ బహుమానమనుకో,” అంటూ మళ్ళీ పెద్దగా నవ్వింది కమలమ్మ.¬¬
**
నేను కొట్టాం కాడ రిక్షా దిగేప్పటికి వాకిట్లో తాత, పిన్ని ఉన్నారు. కమలమ్మ నాతో పాటు లోనికొచ్చి కొట్టమంతా తిరిగి చూసింది.
“ఇదిగో అన్నా, గాయత్రిని సంపెంగ పూలతో సహా క్షేమంగా తిప్పి తెచ్చాము. ఇంతటి ఆనందాన్ని ఎప్పుడూ సూడలేదు ఆ పిల్ల. గాయత్రిని అడుగు సత్యమన్నా. ఆచ్చర్యంలో, ఆనందంలో మునిగి తేలిందనుకో.
ఇయ్యాల ‘అట్లతద్ది’ కూడానాయే. బయటే తిని మరీ వచ్చాము. నేను మళ్ళీ వస్తాలే,” అని బయటికి నడిచింది.

కాళ్ళు చేతులు కడుక్కొని, బట్టలు మార్చి, నేను పడక మీద చేరాను.
నిద్రపోయే ముందు తాత వచ్చి పుస్తకాల సంచి నా తల కాడెట్టాడు. “నీ కోసం ఇవి సమీక్ష పుస్తకాలంట, ఉమమ్మ చెప్పమంది. రేపు రెండింటికే నీ కాడికి వస్తానందమ్మా. నీ ‘ఊతకర్రలు’ కూడా వస్తాయటగా! ఇక నిదరపోరా,” అని తల నిమిరి వెళ్లాడు.

‘నాకు పుస్తకాలివ్వడానికి, నేనెళ్ళాక మళ్ళీ వచ్చిందన్నమాట ఉమమ్మ’ అనుకుంటూ ఆ కాస్త వెలుతురులోనే పుస్తకాలు తిరగేశాను. ఉత్సాహంగా అనిపించింది.
**
తెల్లారక మునుపే దూరంగా చంద్రం పిన్ని మాటలు వినబడ్డాయి. కళ్ళు నులుముకొని అటుగా చూశాను. వాకిట్లో కాళ్ళు చాపి కూర్చుని తాత టీ తాగుతున్నాడు. పిన్ని తాత పాదాలకి నూనె రాసి కాళ్ళు పడుతుంది.

“ఏమోనే చంద్రమ్మా, ఆ కమలమ్మ తీరు నాకు నచ్చలేదు.
ఆమె గుణం ఎలాటిదో చిన్నతల్లికి వివరంగా చెప్పడం ఎలాగో తెలీడం లేదనుకో.
బిడ్డ పతనానికి దారి తీయకుండా ఉంటే అంతే చాలు.
బిడ్డకి సత్యదూరమైన విషయాలు చెబుతా వుండాది.
ఆ కమలమ్మ తీరు, మాటల గారిడీ చూస్తుంటే చిన్నదాని మనసు పాడు చేస్తుందేమో అని భయంగానే ఉంది,” అన్నాడు తాత.

“అంతే కాదే చంద్రం. జబ్బుపడి నేను పనికెళ్ళనప్పుడు, గుడి ఊడ్చే పని ఆమెకి ఎక్కువయింది కదా. అందుగ్గాను పంతులుగారు అదనంగా ఇచ్చేది కాక మరో యాభై రూపాయలు నన్నివ్వమని అడిగింది. పూజారయ్య వరకు వెళ్ళింది విషయం,” అన్నాడు హైరానాగా తాత.

“ఆమె డబ్బు మనిషని తెలిసిందే కదన్నా..మాంసాలు, నీసులు తినడం, ఆదివారాలు కల్లు తాగడానికే డబ్బంతా ఖర్చు పెడతారులా ఉంది గోవిందు, కమలమ్మ కూడా.
అప్పుడెప్పుడో, ఆటో కోసం అర్జీ పెట్టాడాబ్బాయి.!…రెండు వేలు బ్యాంకులో సూపెడితే వెంటనే ఆటోరిక్షా ఇస్తామని ఆఫీసు కబురెట్టినా జవాబివ్వడంట,” అంటూ తైలం సీసా అందుకొని లోనికొచ్చింది పిన్ని.
**
వాళ్ళిద్దరికీ కమలమ్మంటే ఇష్టం లేదని అర్ధమయ్యింది.
‘కమలమ్మంటే నాకూ అంతగా ఇష్టం లేదు. మాటతీరు కూడా బాగోదు.
కాని నాకు బయటి నుండి జిలేబీలు తెచ్చిపెడుతుంది.
ఎప్పుడూ నేను అందంగా ఉన్నానంటుంది.
నిన్న చిత్రమైన పక్షుల్ని, అందమైన గులాబీ తోటల్ని చూపెట్టింది. ఇడ్లి, దోస తినిపించింది. ఊరంతా తిప్పుతానంది. నాకు సాయంగా ఉంటామంది. నయాపైసా ఖర్చు లేకుండా గోవిందు ఎన్నో మంచి స్థలాలు చూపెడతాడంది.
ఇంకా, నా అవిటితనం పోవాలని చాలా కోరుకుంటుంది. సినిమాలు కూడా చూపిస్తానంది’ అనుకుంటూ పడక మీద నుంచి లేచాను.
**
ఆదివారం మధ్యానం ఒంటిగంట దాటింది.
గుడిలో భక్తుల రద్దీ సద్దుమణిగాక, గోవిందు పాకకి బయలుదేరి పోయింది కమలమ్మ.

నాతో పాటే కాస్త పొంగలి ప్రసాదం తినేసి కూరగాయల బడ్డీ వైపెడుతున్న తాతకి, కారు దిగి గుడి ఆవరణలోకి వస్తున్న డాక్టరు మల్లిక్ ఎదురు పడ్డారు.
నేను కూచున్న కాడినుండి డాక్టరుగారి వెంట ఓ పెద్దావిడ కూడా రావడం అగుబడుతుంది. వారి వెనకాలే మరో స్త్రీ, చేతుల్లో పొడవాటి ప్యాకేజీతో డ్రైవర్ కూడా ఉన్నారు.

(ఇంకా ఉంది)

Download PDF

ఒక వ్యాఖ్యను

Your email address will not be published. Required fields are marked *

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)