ఆయన వ్యక్తిత్వమే ఆయన బొమ్మ!

bapu-laughing

బాపుగారితో దాదాపు ముప్ఫై ఆరేళ్ళ స్నేహం. చిత్రకారుడిగా, దర్శకుడిగానే కాకుండా వ్యక్తిగా ఆయనతో చాలా దగ్గిరగా మెలిగే అవకాశం నిజంగా అదృష్టమే. ఎందుకంటే, బాపు గారు చాలా private person. అంత తేలిక కాదు, ఆయన మిత్రబృందంలో చేరడం! పని మాత్రమే లోకంగా బతుకుతూ అతితక్కువగా బయట కనిపించే వ్యక్తి ఆయన. అలాగే, అతి తక్కువ మాట్లాడే తత్వం ఆయనది. అలాంటప్పుడు బాపు సన్నిహితులలో వొకడిగా చేరడం, ఆ స్నేహం దాదాపు నలభయ్యేళ్ళ పైబడి నిలబడడం ఆహ్లాదకరంగా అనిపిస్తుంది.

1978- బాపుగారితో మొదటి సారి కలిసాను. అదీ ‘నవోదయ’ రామమోహన రావు గారూ, ఆంధ్రజ్యోతి నండూరి రామమోహన రావు గార్ల వల్ల- ముళ్ళపూడి రమణ గారికీ నండూరి వారికీ బంధుత్వం కూడా వుంది. అయితే, వాళ్ళ స్నేహాలకీ, మా ఇద్దరి స్నేహానికీ కొంత తేడా వుంది.

మొదటి నించీ నేనేదో మహాపండితుడినని – అది నిజమైనా కాకపోయినా సరే- ఒక అభిప్రాయమేదో ఆయనకీ వుండడం వల్ల మా ఇద్దరి మధ్య అపారమైన గౌరవ భావంతో కూడిన స్నేహం వుండేది. వ్యక్తిగా ఎంతవరకు సన్నిహితంగా వుండాలో అంత వరకూ వుండే వాళ్ళం. నేనేం రాసినా – అది వచనం కానీ, పాట కానీ- ఆయనకీ ఇష్టంగా వుండేది.

మొదటి సారి నాతో సినిమాకి రాయించింది ఆయనే. 1980లో ఆయన నా చేత మొదటి సారి సినిమా పాట రాయించారు, “కృష్ణావతారం” సినిమాకి- “చిన్ని చిన్ని నవ్వు, చిట్టి చిట్టి తామర పువ్వు,” అనే ఆ పాటని బాలు, శైలజ పాడారు.

అప్పటి నించీ నిన్న మొన్నటి “శ్రీరామరాజ్యం” దాకా బాపుగారి ప్రతి సినిమాతో నాకు ఏదో ఒక విధంగా అనుబంధం వుంది. నాకు బాగా గుర్తుండే జ్ఞాపకాలు బాపూ రమణల “మిస్టర్ పెళ్ళాం”తో ముడిపడి వున్నాయి.

చిత్రకళ అంటే ఎంత ప్రేమో ఆయనకీ చలనచిత్ర కళ అన్నా అంతే ప్రేమ! సినిమాలో దృశ్యాలూ, సన్నివేశాల విషయంలో ఆయన ఎంత ఆలోచన పెట్టే వారో గుర్తుకు తెచ్చుకుంటే, అది ఆయన వ్యకిత్వంలోని విశేషంగానే కనిపిస్తుంది. ఇప్పుడు మనలో చాలా మందికి తెలియనిది ఏమిటంటే, ఆయన మొదట్లో గొప్ప ఫోటోగ్రాఫర్. ఆ ఫోటోగ్రఫీ ప్రావీణ్యమే ఆయన్ని సినిమా వైపు తీసుకువచ్చిందని నాకు అనిపిస్తుంది. ఆయన ప్రతి సినిమాలో ఆ ఫోటోగ్రఫీ కన్ను చాలా అందంగా, ఆహ్లాదకరంగా కనిపిస్తుంది.

అలాగే, ఆయన సినిమా సృజనాత్మకత ఆయనలోని చిత్రకారుడి తత్వాన్ని కూడా చెప్తుంది.

ఇక చిత్రరచనకి సంబంధించినంత వరకూ అంత స్వతంత్ర భావన వున్న తెలుగు చిత్రకారుడిని నా అనుభవంలో చూడలేదు. ఆంద్ర దేశంలో చిత్రకళ చరిత్రలో బాపుకి ముందూ బాపు తరవాత అన్న యుగవిభజన చేయాల్సి వుంటుంది. ఈ చరిత్రలో నూరింట ఎనభై వంతుల ఖ్యాతి బాపుగారికే దక్కుతుంది. ఎందుకంటే, అది ఆధునిక కథ కానివ్వండి, ప్రబంధ కథ కానివ్వండి. ఆ కథా హృదయాన్ని పట్టుకోవడంలో బాపు రేఖ అపూర్వం.

22fr_Bapu_panel_jp_1372569g

రచయిత ఏ కాలం వాడైనా సరే, ఆ రచయిత ఉద్దేశించిన భావాన్ని అందుకోవడమే కాకుండా దాని మీద వ్యాఖ్యానంలా వుంటుంది బాపు బొమ్మ. ఆ విధంగా రచన వుద్దేశాన్ని ఇనుమడింపచేసే శక్తి ఆయనకి వుంది. అందుకే, పత్రికల్లో కాని, పుస్తకాల కవర్ పేజీలుగా కాని బాపు బొమ్మ వుందంటే అది ఒక గౌరవంగా భావించే సాంప్రదాయం తెలుగు సంస్కృతిలో ఏర్పడింది. “అమరావతి కథల”కి బాపు వేసిన బొమ్మలు నాకు మహా ఇష్టం. ఆ కథలు వస్తున్నప్పుడు కథల కోసం ఎదురు చూపు ఒక ఎత్తు, బాపు బొమ్మ కోసం నిరీక్షణ ఇంకో ఎత్తు. ఆ ఎదురు చూపు చాలా ఇష్టంగా వుండేది నాకు.

కవిత్వంలో మనం సొంత గొంతు అంటూ వుంటామే, చిత్ర రచనలో అలాంటిది create చేసుకున్నారు బాపు. ఆయనదే అయిన సొంత రేఖ. బొమ్మ కింద సంతకం వేరే అక్కర్లేని సొంత రేఖ. దానికి కారణం- ఆయనకి రేఖల మీద అధికారం మాత్రమే కాదు, ఆయనలోని స్వతంత్రమైన భావుకత. అది ఆయన గీసిన బొమ్మలలోనే కాదు, రాసే అక్షరాల్లోనూ కనిపిస్తుంది. అది కూడా ఆయన వ్యక్తిత్వంలోంచి వచ్చిందే అనుకుంటాను. బాపు చిత్రకళా రీతి అనేదొకటి ఏర్పడడంలో ఆ రేఖల వ్యక్తిత్వంతో పాటు, ఆయనా సొంత స్వతంత్ర వ్యక్తిత్వమూ సమాన పాళ్ళలో వుంటాయని అనుకుంటాను. ఒక్క మాటలో చెప్పాలంటే, చిత్రకళకి బాపు జీవరేఖ వంటి వాడు. ఆయన ఇప్పుడు లేకపోయినా, ఆ జీవరేఖ జీవించే వుంటుంది.

Bapu20bomma20athiva

మళ్ళీ ఆయన వ్యక్తిత్వం గురించే మాట్లాడాలని అనిపిస్తోంది నాకు. ఎందుకంటే, నన్ను ఆయనతో బాగా కట్టిపడేసింది అదే కాబట్టి! చాలా కచ్చితంగా వుండే మనిషి. మనిషైన వాడు ఎక్కడున్నా మనిషిగానే వుండాలని నమ్మిన వాడు. ఎంత స్పష్టత వుండేదో ఆయనకి! చాలా మందిలో లోపలి జీవితానికీ, బయటి జీవితానికీ మధ్య confusion వుంటుంది. లోపల ఒక రకంగా, బయట ఒక రకంగా వుండడం బాపు వల్ల కాదు. తన పని పట్ల అంత భక్తి భావం వున్న మనిషిని కూడా నేను ఇప్పటిదాకా చూడలేదు. “బహుమతులూ పురస్కారాలూ కాదు, work మిగలాలి” అనే వారు. ఎక్కువగా బహిరంగ ప్రకటనలు చేయడం ఆయన మనస్తత్వానికి విరుద్ధం. ఒక అవార్డు సన్మాన సభలో చివరికి ఆయన్ని మాట్లాడమని అడిగారు. ఆయన కచ్చితంగా రెండు మాటలే మాట్లాడి, కూర్చున్నారు. ఒక మాట: ఈ సన్మానానికి కృతజ్ఞతలు. రెండో మాట: ఈ పురస్కారానికి కూడా కృతజ్ఞతలు. అంతే!

నలుగురిలోకీ దూసుకుంటే వచ్చే ధోరణి కూడా కాదు, మహా సిగ్గరి ఆయన! మామూలుగా స్నేహితుల మధ్య మాట్లాడేటప్పుడు కూడా ఆయన తక్కువే మాట్లాడే వారు. ఆయనకీ చాలా ఇష్టమైన విషయాలు: సాహిత్యం, కార్టూన్లు. ఈ రెండు విషయాల గురించే ఎక్కువ మాట్లాడే వారు. విస్తృతంగా చదివేవారు. ఆ చదివిన రచయితల గురించి మాట్లాడేవారు. కార్టూన్లు బాగా follow అయ్యేవారు. వాటి గురించి మాట్లాడే వారు. ఎంత మాట్లాడినా ఆయన వ్యక్తిగా చాలా private అని తెలిసిపోయేది.

చాలా ఆహ్లాదకరమైన జీవితం ఆయనది. మంచి స్నేహం ఆయనది. ఇప్పుడు ఆయన లేకపోయినా జీవరేఖలాంటి ఆయన చిత్రాలతో పాటు ఆ రెండూ మిగిలి వుంటాయి నాలో!

-ఇంద్రగంటి శ్రీకాంత శర్మ

indraganti

 

 

 

 

 

బాపు శ్రీరాముని చేరి యున్నారు!

మల్లాది వారన్నట్టు –“ఆయనకేం ఆయన సకల నిక్షేపరాయుడు”. బాపుగారు సర్వ సకల నిక్షేపరాయుడు. తెలుగువాళ్ళకింత బొమ్మపెట్టిన వాడు. బాపు చేతి బొమ్మ రుచి చూసిన తరవాత ఇంకే మహాబొమ్మా రుచించదని నిశ్శబ్దంగా వేలాది ఆయన బొమ్మలే కదా చెబుతాయి.

భావకవిత్వంలో కృష్ణ శాస్త్రి ఏం చేసేరో, ఆధునిక కవితకి శ్రీశ్రీ ఏం చేసేరో, ఆధునిక వచనానికి చెలం ఏం చేసేరో అది, దాన్ని మించిందీ బాపుగారు బొమ్మకి చేసేరు. మహనీయం, శాశ్వతం అనుకునే అరుదైన తెలుగు శిల్పాల్లాగే బాపు బొమ్మలు చిరాయువులు కదా!

బాపు గారికి ముందే కాదు, ఆ తరవాతా ఇప్పటి వరకూ ఎవరూ లేరు. దాదాపు శూన్యం గదా! రష్యా, సోవియట్ యూనియన్, అమెరికా, సరే- చైనా, జపాన్లలో illustrations వేసే వారు ఆధునికులు ఒకరికి మించి ఒకరున్నారు. పిల్లలకీ, పెద్దల పుస్తకాలకీ ఆ దేశాల్లో దిక్కులేని తనం లేదు. ఎటొచ్చీ, దురదృష్టవశాత్తూ తెలుగువారిలో బాపు తప్ప అలా బొమ్మలు వేసి గాని, బాపుని మించిన వారు గాని లేకపోవడం బాధాకరం. కళ్ళతో కన్నీరేం చెప్పుకోగలదు చెప్పండి.

1291730404_929e3ce233

మహాద్భుతాలు బాపు వలె వెళ్లిపోవాల్సిందేనా మరి?

తెలుగుజాతికి నిశ్శబ్ద విప్లవం, పటుతర ఘన సౌందర్యం ఇక మహాభినిష్క్రమణం చేసేయి- బాపు గారి రూపంతో.

మనం ఏం చేయగలం.. ఒక్క నమస్కరించడం తప్ప!

స్వామీ, శ్రీరామా, నీకు నిజముగా జయము కలిగెను. ఎట్లన, బాపు నిన్ను చేరియున్నారు గదా!?

-శివాజీ

sivaji

 

 

 

 

 

బాపు రమణీయం … 

పంటి బిగువున నవ్వు
కొంటె చూపులు రువ్వు 
అందమంటే నువ్వు  
ఓ బాపు బొమ్మా

తాను గీచిన బొమ్మ
చూడ నవ్వులు దొర్లు
తెరలు తెరలుగ పొర్లు
ఓ బాపు బొమ్మా
 
మాడ గట్టిన బొప్పి
మొగుడికెయ్యదు నొప్పి
మోటు సరసం తప్పి
ఓ బాపు బొమ్మా

ముత్యమంతయు పసుపు 
మొగుడు పెళ్ళాం వలపు
జడను విసిరిన మెరుపు 
ఓ బాపు బొమ్మా

రామ గాధను తరచి 
రంగు రంగుల మలచి 
మాదు కన్నుల విడచి 
ఓ బాపు బొమ్మా

రాముడన్నను తీపి
హనుమ చెంతను చూపి
మనసులన్నియు దోచి
ఓ బాపు బొమ్మా


బాపు గీచిన గీత
రమణ రాసిన రాత
కలిసెనెప్పుడు జత
ఓ బాపు బొమ్మా


బాపు రమణలు పేరు
వేరు వేరుగ లేరు
స్నేహమంటే మీరు
ఓ బాపు బొమ్మా


… … …


భార్యా భర్తల బంధం
స్నేహ వారధి అందం 
అనుక్షణ సామాజిక హితం 
బాపు రమణల గ్రంధం

సంపూర్ణ రామాయణం
బాపు రమణల విన్నాణం
కాంచ కన్నుల కమనీయం
ఇంటింట స్మరణీయం …

బాపు రమణీయం …
-ఎన్. ఎం రావు బండి.
~~

 బుడుగు

పాతతమిళ సినిమా పాట ఒకటుంది:

గాలి వీచినందుకు జెండా (కొమ్మ) కదిలిందా? జెండా (కొమ్మ) కదిలినందుకు గాలి వీచిందా?

అని.

అలాగే “బుడుగు, చిచ్చుల పిడుగు” లో ————

బాపు గీతలకి ముళ్ళపూడి వ్రాసాడా? లేక ముళ్ళపూడి వ్రాతలకి బాపు గీసాడా?

ఆప్పట్లో మన ఇంట్లోకి “ఆంధ్ర పత్రిక” రాగానే అయ్యేవి కలహాలు నేను ముందు చదవాలంటే నేను ముందని చిన్న పెద్దా తారతమ్యాలు లేకుండా!

తీరా చూస్తే ఆ కథలో ఓ పెద్దపొడిచేసిన యే హీరో లేడు, అందాలు చిందిస్తూ ఆపసోపాలు పడ్తున్న హీరొయినూ లేదు; అందరినీ ఇబ్బంది పెడ్తున్న విలన్ గాడూ అస్సలే లేడు -యువతకోసం;

పాతాళ లోకమూ, దెయ్యలూ, భూతాలూ, మాంత్రికుడూ వగైరా లేవు-పిల్లల కోసం;

రామాయణ-భాగవత, భారతాల కథలూ గాని ఏ వేదాంత సూక్తులూ లేవు- పెద్దవాళ్ళ కోసం;

థనం ఎటుల కూడ బెట్ట వలెను? ఏ రాజకీయుడు ఏమి(అ)రాచ కార్యాలు వెలగ బెట్టెను? అన్నవీ లేవు-నాన్న గార్ల కోసం;

అప్పడాలూ, అరిసెలూ, అల్లికలూ వీటి గురించి ప్రసక్తే లేదు-మన అమ్మల కోసం.

ఇక ఇవన్నీ లేకుండా ————–

మన మమూలు మధ్య తరగతి ఇళ్ళళ్ళోనూ మన చుట్టు ప్రక్కలే వుండే వాళ్ళనీ ఎంచి మనల్ని కడుపుబ్బ నవ్వించేలా చేసారు వారిరివురూ.

మన జీవితాలలో:

మనం పదమూడో ఎక్కం అనే రాక్షసుడిని చూడ లేదూ?

మన అమ్మా నాన్నలు “రాథా గోపాళం” లా అప్పుడపుడూ పిడివాదాల తో ముచ్చటగా కలసిమెలసి వుండడం చూళ్ళేదూ?

మన ఆగడాలని మరచి అక్కున చేర్చుకున్న మన “బామ్మ”లూ,

ఇక “బుడుగు బాబాయి” పోకిరీ(షోకిల్లా)గాళ్ళూ, ముసిముసి నవ్వుల “రెండు జెళ్ళ సీత”లూ,

అందరిళ్ళళ్ళో తల దూర్చే “లావు పాటి పక్కింటి పిన్ని గారు”లూ,

మన నాన్నల “విగ్గు లేని యముడి” లాటి బాస్సులూ,

అగుపడ్డప్పుడల్లా ‘ఓ అయిదో పదో సర్దవోయ్’ అని అందరినీ అప్పడిగే అప్పారావులూ,

చీమిడి ముక్కుతో ఎప్పుడూ అమ్మ కొంగు పట్టుకొని చిన్నగా సన్నగా నసలు పెట్టే సీగానపెసూనాంబలూ,

అందరికన్నా మరీ “బుడుగు” లా కాకపోయినా అల్లరితో తల్లి తండ్రులకి బెదుర్లు పుట్టించే చిన్నారులూ,

వీళ్ళందరూ మనకి పరిచయమే కానీ మనం ఎవ్వరమూ వ్రాయలేక పోయాం, గీయలేకపోయాం వాళ్ళలా!!

అదండీ వారివురీ కథా అండ్ కమామీషూ!!

శ్రీమతి కుమారి సామినేని

Download PDF

4 Comments

  • బాపు గీత చెరిగిపోని ఆత్మీయ సంతకం ఈ తెలుగు నేలపై.. వారికి నిండైన నివాళి ఈ రెండు వ్యాసాలూ..

  • Dr.R.Sumanlata says:

    ఇంకా మధ్యాహ్నమే ఆరుద్ర గారిని తలుచుకున్నాను.ఇంతలో తెలుగు రాతను గీతలతో మార్చిన, కొంటె బొమ్మలనూ కొన్నితరాలవారి గుండెల్లో మహా సీరియస్ గా రాతిమీద గీతల్లా చెక్కిన బాపూ గారిని ఇలా గుర్తు చేసుకోవటం చాలా-చాలా బాధగా ఉండటం అన్నది తెలుగువారిగా ఎంతో సహజం. జ్యోతి కృష్ణ సంచికను
    ఎంతో అపురూపంగా ఈనాటికీ దాచుకుని చూసుకుంటాను.బాపు,ఆరుద్ర,ముళ్ళపూడి -అలా తలుచుకుంటే మైమఱపే!బహుశా పై లోకాల్లో ముగ్గురూ హాయిగా రాసుకుంటూ,గీసుకుంటూ అక్కడివారికి మానవులెంత మహానీయులో విడమరుస్తారేమో!

  • వంగూరి చిట్టెన్ రాజు says:

    గురువు గారూ,

    మీకు జ్జాపకం ఉందో లేదో. 1998 లో మొట్ట మొదటి అమెరికా తెలుగు సాహితీ సదస్సు సందర్భంగా బాపు గారిని ప్రధాన అతిథిగా వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా తరఫున ఆహ్వానిస్తే ఆయన మీ పేరు చెప్పి తన బదులు మిమ్మల్ని ఆహ్వానించడం సమజంసం అని సూచించి , మనిద్దరికీ పరిచయం చేశారు. అదే మీరు మొదటి సారి అమెరికా రావడం. ఆయన ధర్మమా అని ఇప్పటికీ మన అనుబంధం అలాగే కొనసాగుతోంది….అంతా ఆయన దయ. మీ అనురాగం.

    మంచి జ్జాపకాలు పంచుకున్న్నారు. మీరు తల్చుకుంటే బాపు-రమణ ల గరించి ఒక సమగ్రమైన పుస్తకం వ్రాయగలరు. అలా వ్రాస్తారనే ఆశిస్తున్నాను.

  • >>తెలుగువాళ్ళకింత బొమ్మపెట్టిన వాడు.
    భావకవిత్వంలో కృష్ణ శాస్త్రి ఏం చేసేరో, ఆధునిక కవితకి శ్రీశ్రీ ఏం చేసేరో, ఆధునిక వచనానికి చెలం ఏం చేసేరో అది, దాన్ని మించిందీ బాపుగారు బొమ్మకి చేసేరు. <<
    సరిగ్గా చెప్పారు. తెలుగు జీవితాల్లోంచి బాపూ ని తీసేస్తే కొంతమేర ఒక శూన్యం నిలిచిపోతుంది.

ఒక వ్యాఖ్యను

Your email address will not be published. Required fields are marked *

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)