ఇంకా మొదలు కానిది

vimala

ఏదో ఒకటి అట్లా మొదలెట్టేసాక
అది ఎన్నటికీ ముగియనట్లు
ఇంకేదో అసలైంది కొత్తగా మెదలెట్టడమన్నది
ఎన్నటికీ మొదలెట్టనట్లు
ఏదో నిత్యం మరిచిపోయినట్లు
అదేమిటో ఎన్నటికీ జ్నాపకం రానట్లు
రాటకు కట్టేసిన గానుగెద్దులా
అట్లా, అక్కడక్కడే నన్ను నేను తొక్కుంటూ
తలవంచుకు తారట్లాడుతున్నట్లు
దిగులు దిగులుగా తండ్లాడుతున్నట్లు

నాలోపలి నదిలో మునిగి
ఈతరాక ఉక్కిరిబిక్కిరవుతున్నట్లు
కన్నీళ్ళు రానిన దు:ఖం ఏదో లోలోన గుక్కపట్టి
కడుపులో సుడిగుండమై తిరిగినట్లు
పగ్గాలు తెంచుకోవడం, వదిలేయాల్సిన వాటిని
అట్లా వదిలేయడం ఎన్నటికీ తెలియనట్లు
పుస్తకం మూసినంత సులువుగా
అక్కడో గుర్తుపెట్టి, జీవితాన్ని మూసేయలేనట్లు
పేజీలన్నీ ప్రశాంతంగానో, అశాంతిగానో
మళ్ళీ నాకునేనో, మరెవరో తెరిచేదాకా నిద్దరోయినట్లు

మనశ్శరీరాల మహా శూన్యంలోకి ఆత్రంగా
ఎక్కడెక్కడి నుండో వెతుక్కొని
కాసిన్ని నవ్వుల్నీ, నక్షత్రాల్నీ
ఆకుపచ్చ వనాల్నీ, పక్షుల రాగాల్నీ
కొంచెం ప్రేమనీ, ఉక్రోషాల్నీ
ఆగ్రహాన్నీ, అసహాయ ఆర్తనాదాల్నీ వంపుకున్నట్లు
అయినా లోనంతా ఖాళీ ఖాళీగానే వున్నట్లు
నిజానికి మెదలెట్టాల్సిందేదో మెదలెట్టకుండానే,
మరేదో ముగియకుండానే మధ్యలోనే ఆగిపోయినట్లు

అట్లా అందరిలానే అనంతకాలంలో
లిప్తపాటు మెరిసి మాయమైపోయినట్లు
అట్లా అందరిలానే మహాసముద్రపు ఒడ్డున
చిన్న ఇసుక రేణువులా మిగిలిపోయినట్లు
ఏదో కొంచం మిగిల్చి, ఎవరెవరికో పంచివెళ్లాలన్న
చివరాఖరి కోర్కెలేమీ లేనట్లు
ఇదంతా ఇట్లా ఎప్పటికి తెలిసేట్లు?

మృత్యువు కళ్లపై సుతిమెత్తటి పెదవుల్ని ఆన్చి
ముద్దుపెట్టుకునే ఆ ఆఖరి క్షణాల్లోనా?
మెల్లిగా ముడుచుకుంటున్న కనురెప్పల మడతల్లోంచి
జీవనసత్యమేదో సుతారంగా పక్షిఈకలా ఎగిరిపోయేప్పుడా?

అప్పుడైనా నిజంగా మనం మెదలెట్టాల్సినవేవో
చిరకాల పరిచిత స్వప్నంలా లోనుండి బయటకు నడిచి వస్తాయా?

అట్లా ఆఖరిసారిగా ఆగిపోయిన అరమూసిన మనిషి కళ్ళలో
ఇంకా పూర్తికాని పద్యమేదో నిలిచిపోయినట్లు
మొదలు కాని స్వప్నాలేవో మరెవరినో వెతుక్కుంటూ వెళ్ళిపోయినట్లు…..

-విమల

Download PDF

7 Comments

 • N.RAJANI says:

  vimalakka bagundi muddu pettukune aakhari kshanaallo aa line nijame kadaa maraninchina kshanam nunchi batakadam prarambham avutundi.

 • మీ కవితలో నన్ను వెదుక్కొన్నాను. చాలా నచ్చింది. ధన్యవాదాలు.

 • gsrammohan says:

  పవర్‌ ఫుల్‌ పోయెమ్‌. ఆ తండ్లాటను తప్పించుకోవడం అంత సులభం కాదు.

 • venkatrao says:

  వదిలేయాల్సిన వాటిని
  అట్లా వదిలేయడం ఎన్నటికీ తెలియనట్లు….ఆ తండ్లాటను తప్పించుకోవడం అంత సులభం కాదు.

 • ‘మనశ్శరీరాల మహాశూన్యం’ వ్యక్తీకరణ కొత్తగా, బాగున్నట్లుగా ఉంది. కానీ అర్థమే తెలీకుండా ఉంది. మనసూ, శరీరమూ కలిస్తే మహాశూన్యమనా? లేక రెండూ కూడా విడివిడిగా మహాశూన్యమనా?

 • sai Padma says:

  పుస్తకం మూసినంత సులువుగా
  అక్కడో గుర్తుపెట్టి, జీవితాన్ని మూసేయలేనట్లు….
  గొప్ప భావన ..గొప్ప కవిత విమల గారూ .!
  ఇది తెగేది కాదు గానీ.. దుఖపు అపశ్రుతి తప్పనిసరై తప్పించుకోవాలేమో ..!

 • “….నాలోపలి నదిలో మునిగి
  ఈతరాక ఉక్కిరిబిక్కిరవుతున్నట్లు
  కన్నీళ్ళు రానిన దు:ఖం ఏదో లోలోన గుక్కపట్టి
  కడుపులో సుడిగుండమై తిరిగినట్లు
  పగ్గాలు తెంచుకోవడం, వదిలేయాల్సిన వాటిని
  అట్లా వదిలేయడం ఎన్నటికీ తెలియనట్లు…”

  చాలా బావుంది, విమల గారూ..

ఒక వ్యాఖ్యను

Your email address will not be published. Required fields are marked *

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)