‘అరె దేఖో భాయి – చంద్రుడు కూడ జైల్లోనే ఉన్నాడు!’

varavara.psd-1

మొదటిసారి 1973 అక్టోబర్ లో ఆంతరంగిక భద్రతా చట్టం కింద అరెస్టయినపుడు వరంగల్ జైల్లోనే ఉన్నందువల్లనో, నేను రోజూ కాలేజికి పోతూ వస్తూ చూసే జైలు అయినందువల్లనో, నేనూహించుకున్నంత భయంకరంగానూ, ఇరుకుగానూ, మురికిగానూ జైలు లేనందువల్లనో, నాకేకాదు, నన్ను వారంలో కనీసం రెండుసార్లు కలవడానికి వచ్చే నా సహచరి హేమలతకు కూడ, ‘మీకిక్కడ కష్టంగా ఉందా’ అని అడగాలనిపించలేదు.

రెండవసారి, 1974 మే 18న అరెస్టయిన తీరే భయం గొలిపేదిగా ఉంది. ఉధృతంగా రైల్వే సమ్మె జరుగుతున్నది. అందులో కాజీపేట – డోర్నకల్ లైనంతా సమ్మె వెనుక సూరపనేని జనార్దన్ నాయకత్వంలోని విప్లవ విద్యార్థులు, రైల్వే కార్మికులు, విప్లవోద్యమాన్ని బలపరిచే అన్ని ప్రజాసంఘాలు, విరసం ఉన్నాయి. మా ఇంట్లో ‘జైళ్లు రైళ్లను నడపగలవా?’ కరపత్రాలు ఉన్నాయి. అప్పటికే సృజన ఆ శీర్షికతో ఒక రైల్వే కార్మికుని కవిత ప్రచురించి, అదే శీర్షికతో సంపాదకీయం రాసిన మేడే సంచిక వెలువడింది. కనుక అరెస్టు రైల్వే సమ్మె గురించే అనుకున్నాం.

మరొకవైపు మా మూడవ పాప పుట్టి ఇరవై రోజులయింది. తల్లి 104 డిగ్రీల జ్వరంతో మంచంపై ఉంది. నన్ను కాజీపేట పోలీసు లాకప్ లో పెట్టి, ఆ ఊళ్లో టీచర్ గా పనిచేస్తున్న మా రాగవులన్నయ్య అన్నంతెస్తే ఇవ్వడానికి నిరాకరించి ఎస్ ఐ ఆయననూ నన్నూ బండబూతులు తిట్టాడు. అంతకుముందే ఎస్పీ నన్ను అరెస్టు చేసి తన ఇంటికి తీసుకరమ్మని, షార్ట్స్ వేసుకొని, చేతిలో హంటర్ తో, రెండు ఆల్సేషియన్ కుక్కలను పెట్టుకొని, నన్ను నిలబెట్టి చాల అవమానకరంగా మాట్లాడి ఉన్నాడు. అక్కడినుంచి ఆ రాత్రే ఇంకో ముక్కు మొహం తెలియని మనిషితో కలిపి హైదరాబాదు సిసిఎస్ కు తెచ్చారు. మే 20వ తేదీన సికిందరాబాదు పదవ మెజిస్ట్రీట్ కోర్టులో మా ఇద్దరినే కాకుండా సిసిఎస్ లో మాతోపాటు కలిపి ఉంచిన చెరబండరాజు, ఎంటి ఖాన్, ఎం రంగనాథంలను, తిరుపతి నుంచి తెచ్చిన త్రిపురనేని మధుసూదనరావును హాజరుపరచినప్పుడు గానీ తెలియలేదు – మామీదనే కాదు కెవి రమణారెడ్డితో పాటు కొండపల్లి సీతారామయ్య, కెజి సత్యమూర్తి మొదలైన వారితో కలిపి మామీద సికిందరాబాదు కుట్రకేసు పెట్టారని, నాతో తెచ్చిన వ్యక్తి పేరు గోపాల రెడ్డి – ఊరు రామాయంపేట అని. కెవి రమణారెడ్డి గారు అప్పుడు మద్రాసులో ఉన్నారు గనుక అరెస్టు కాలేదు.

కోర్టు నుంచి ముషీరాబాదు జైలుగా పిలవబడే సికిందరాబాదు జైలుకు పంపించారు. మొదటిసారి వలె ఇది ముందస్తు డిటెన్షన్ కాదు. కనుక రాజకీయ ఖైదీలకుండే వసతులుండవు. పైగా బెయిల్ పిటిషన్ వేస్తే జస్టిస్ చెన్నకేశవరెడ్డి అనే హైకోర్టు జడ్జి ‘వీళ్లమీద ఉరిశిక్షలు వేయదగిన, లేదా ప్రవాసం పంపించదగిన రాజద్రోహం, చట్టబద్ధంగా ఏర్పడిన ప్రభుత్వాన్ని సాయుధంగా కూల్చే నేరపూరిత కుట్ర, రాజ్యంపై యుద్ధం, పేలే ఆయుధాలు కలిగి ఉండడం, హత్య, హత్యాప్రయత్నం వంటి సెక్షన్లు ఉన్నాయి గనుక ఇవ్వన’ని బెయిల్ నిరాకరించాడు. పత్రికలు ఇవి ప్రముఖంగా ప్రచురించాయి. సహజంగానే ఉద్యోగం నుంచి సస్పెండ్ చేసారు.

ఈ స్థితిలో నన్ను మొదటిసారి చూడడానికే నా సహచరి నలభై రోజుల తర్వాత రాగలిగింది. అందుకని మొదటి ప్రశ్న ‘ఇక్కడ కష్టంగా ఉందా?’ అని. నేనేమో వసతి, సౌకర్యాలు పట్టనంత విప్లవ సహచర సాంగత్యంలో ఉన్నాను. సాహిత్యం, రాజకీయాలు, చర్చోపచర్చలు జరిపి, పాడి, హాస్యాలాడుకొని విప్లవ స్వప్నాల్లో మునిగిపోతాం. రోజులెట్లా గడిచిపోతున్నాయో తెలియడం లేదన్నాను. ‘అయితే మీకిక్కడ సుఖంగా ఉందా?’ అని అడిగింది. రెండు నెలల పసిపాపను వేసుకొని బస్సులో పడివచ్చిన తన అసహాయ నిష్ఠురం అందులో ఉంది. ఆరోజు 1974 జూన్ 27 రాత్రి రాసిన కవిత ఇది.

ఇందులోని ‘కవిమిత్రుడు’ మేమంతా ఖాన్ సాబ్ గా పిలుచుకునే ఎంటి ఖాన్. కుటుంబాలతో ఇంటర్వ్యూలు జరిగిన రాత్రి ఖైదీలెవరైనా అన్యమనస్కంగా తమ ప్రపంచంలో ఉంటుంటారు. ఆ రాత్రి నిద్రపట్టదు. అది తెలిసిన పెద్దమనసు ఖాన్ సాబ్ ది. మనసు మళ్లించడానికి, ఆహ్లాదపరచడానికి ‘అరె దేఖో భాయి – చంద్రుడు కూడ జైల్లోనే ఉన్నాడు. మనం నయం. ఆయనైతే ముళ్లతీగల్లో చిక్కుకొని ఉన్నాడు’ అని తేలికపరచే ప్రయత్నం చేసాడు. జైళ్ల లైవ్ వైర్ల (ప్రాణాంతక తీగెల) మీద శాంతి కపోతాలు చిక్కుపడతాయి. నిద్రకూ ఆశ్రయానికీ వెలియైన పేద పోలీసులు జైళ్లను కాపలా కాస్తుంటారు. అయినా గంటగంటకూ ఆవులిస్తూ ‘సబ్ ఠీక్ హై’ అని ఒంటరి సెంట్రీ ప్రకటిస్తుంటాడు.

–          వరవరరావు

-సెప్టెంబర్ 1, 2014

Download PDF

2 Comments

  • bhasker.koorapati says:

    వి వి గారు ముషిరాబాద్ జైలు లో ఉన్న రోజుల్లో నేను ఉద్యోగం నిమిత్తం ఆ జైలు మీదుగా బస్సు లో వెలుతుండెవాడిని. ముషిరాబాద్ స్టాప్ లో బస్సు ఆగినపుడు జైలు వంక నాచూపులు యాదృచ్చికంగా అటుగా మల్లేవి. అప్పుడు నేను తనతో కరచాలనం చేసినట్టూ,మాట్లాడుతున్నట్టూ ఫీల్ అయి ఇంక ఆ రోజు చాలా తేలికగా గడిచిపోయేది. సర్ కూడా మాతోబాటు హైద్. లోనే ఉన్నాడన్న భరోసా ఎంతో ఊరట నిచ్చేది.
    అదే విషయాన్ని ఓ చిన్న ఉత్తరంగా హనంకొండకు రాస్తే హేమక్క వాళ్ళు ఇంట్లో చదివి కళ్ళు తడి అయ్యాయని విన్నాను. వి వి గారి నవ్వు మొహమే నాకు ఎప్పుడూ గుర్తుకు వస్తుంది. అందుకే అంత నిబ్బరంగా కష్టాల్ని తట్టుకోగలుగుతున్నాడు అనిపిస్తుంది. సర్ వచనం కూడా తన కవితలకు మల్లేనే హృదయాన్ని తాకుతుంది.తన మాటలు పదును,
    ఇంత మంచి శీర్షకను పెట్టి సర్, మరియు సంపాదకలు వి వి గారి హృదయ స్పందలను వినిపిస్తున్నందుకు అభినందనలు. సర్ పోస్ట్స్, కవితలు చాలా ఆర్ద్రంగా ఉన్నాయ్.
    –భాస్కర్ కూరపాటి.

  • krishnudu says:

    మీకిక్కడ కష్టంగా ఉందా? ముళ్లతీగల మధ్య చంద్రుడిని చూసేంత సుఖంగా ఉంది. నాలుగు గోడల మధ్య గీతాలాపన చేసేంత ఆనందంగా ఉంది. మౌన సందేశం వినిపిస్తున్న మల్లెల్ని ఆస్వాదిస్తున్నంత ఆహ్లాదంగా ఉంది. ధ్వనిస్తున్న సంకెళ్లలో కూడా ఆశను వినేంత విప్లవ విశ్వాసం ఉంది. అదే వి.వి.

ఒక వ్యాఖ్యను

Your email address will not be published. Required fields are marked *

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)