దత్త పుత్రిక ద్రౌపది?

Kalluri Bhaskaram-pic-a.prabhakar rao (5)

ద్రోణుడు తనకు చేసిన అవమానానికి ప్రతీకారం తీర్చుకోడానికి ద్రుపదుడు రెండు రకాల ఆలోచనలు చేశాడు. మొదటిది, ద్రోణుని చంపగల కొడుకును పొందడం. రెండవది, అర్జునునికి భార్య కాగల కూతురుని పొందడం.

మొదటి కోరికలో కేవలం ప్రతీకార సంబంధమైన భావోద్వేగం ఉంటే, రెండో కోరికలో ముందుచూపు కలిగిన రాజకీయవ్యూహం ఉంది. అర్జునుని వరించగల కూతురిని పొందడం అంటే, పాండవులతో బంధుత్వం ద్వారా వారిని ద్రోణుడికి వ్యతిరేకంగా తనవైపు తిప్పుకోవడమే.

ద్రుపదుడి రెండు కోరికలనూ మనుష్యధర్మం నుంచి లేదా మనుష్య స్వభావం నుంచి అర్థం చేసుకుందాం. సహజపద్ధతిలో భార్య ద్వారా కొడుకును, కూతురిని కని ద్రోణుడిపై ప్రతీకారం తీర్చుకోవాలని అతడు అనుకుని ఉండకపోవచ్చు. ఎందుకంటే, సహజపద్ధతిలో కనే సంతానం సరిగ్గా ఒక కొడుకు, ఒక కూతురే అవుతారని ఎలా చెబుతాం? ఒకవేళ అయినా, ఆ కొడుకు ద్రోణుని చంపగలిగినవాడూ, కూతురు అర్జునుని వరించగలిగినదీ అవుతారన్న నమ్మకం ఏమిటి? ఆవిధంగా అది చీకట్లో రాయి విసరడం లాంటిది. దానికితోడు, వారు పుట్టి, పెరిగి తన ప్రతీకార సాధనకు ఉపయోగపడడం అనేది ఎంతో ఓపికతో నిరీక్షించవలసిన దీర్ఘకాలిక ప్రణాళిక కూడా.

ప్రతీకారేచ్ఛతో ఉన్న ద్రుపదుడు అంత అనిశ్చితమైన దీర్ఘకాలిక ప్రణాళిక అమలుజరిగే వరకూ వేచి చూడడం కష్టం. ఇంకో కోణం నుంచి చూస్తే, నిజానికి ద్రుపదుడు అంతకాలం వేచి చూడాల్సిన అవసరం కూడా లేదు. రాజు తన రాజ్యంలో, లేదా తన గణంలో ఉన్న జనం అందరికీ తండ్రి లాంటివాడే కనుక; ద్రోణుని చంపగల శౌర్యసాహసాలు ఉన్న ప్రతి యువకుడూ ద్రుపదుడికి కొడుకే అవుతాడు. అలాగే అర్జునుని వరించగల ప్రతి అమ్మాయీ కూతురే అవుతుంది. ఒకవేళ తన రాజ్యంలో లేదా తన గణంలో అలాంటివారు లేనప్పుడు అతను దత్తు చేసుకోవచ్చు.

ఈ సందర్భంలో దత్తు గురించి కొంచెం వివరంగా తెలుసుకోవడం ఆసక్తికరంగా ఉంటుంది. దత్తు గణసమాజకాలంనుంచీ వస్తున్న ప్రక్రియ. మోర్గాన్ తన ‘పురాతన సమాజం’లో వివరించిన ప్రకారం అమెరికా ఆదివాసులలో దత్తత స్వీకారం ఇలా ఉంటుంది:

దత్తు చేసుకుని కొత్తవారిని సభ్యులుగా తీసుకునే హక్కు గణానికి ఉంటుంది. యుద్ధంలో పట్టుబడిన వారిని చంపెయ్యడమో, లేదా దయదలచి ఏదైనా గణంలోకి దత్తు తీసుకోవడమో చేసేవారు. దత్తులకు కూడా గణ హక్కులన్నీ లభిస్తాయి. వారిని సొంత మనుషులుగానే చూస్తారు. అన్న, తమ్ముడు, అక్క, చెల్లెలు, తల్లి, తండ్రి వగైరా వరసలే వారికి ఆపాదిస్తారు. మొదట్లో, అనాగరిక యుగం తొలి దశలో యుద్ధ ఖైదీలను బానిసలుగా చేసుకునేవారు. మలి దశలో ఉన్న ఆదివాసులలో బానిసలు లేరు. అంటే, యుద్ధ ఖైదీలను దత్తు చేసుకునేవారన్న మాట.

దత్తు తతంగంలో భాగంగా, జనం రెండు వరసల్లో ఒకరి ఎదురుగా ఒకరు నిలబడతారు. వారి చేతుల్లో కర్ర, లేదా కొరడా లాంటివి ఉంటాయి. దత్తు కాబోయేవారు ఆ రెండు వరసల మధ్య నడుస్తూ వారితో దెబ్బలు తింటారు. దీనిని గాంట్ లెట్ (gauntlet) అంటారు. పట్టుబడిన ఖైదీలనో, లేదా ఇతర గణాలకు చెందినవారినో ఇలా దత్తు చేసుకుని, వారికి గణంలో చనిపోయినవారి స్థానమిచ్చి సంఖ్యను భర్తీ చేసుకుంటారు. గణంలో సభ్యుల సంఖ్య తగ్గిపోతున్నప్పుడు ఇలా సంఖ్య పెంచుకుంటారు. అయితే ఇటువంటివి చాలా అరుదుగా జరుగుతాయి. ఒక దశలో సెనెకాలలో డేగ గణం వారి సంఖ్య తగ్గిపోయి అది అంతరించేలా ఉన్నప్పుడు తోడేలు గణం నుంచి పెద్ద సంఖ్యలో జనాన్ని దత్తు చేసుకున్నారు. ఇందుకు రెండు గణాలూ సమ్మతించాయి. ఇరాక్యూలలో తెగసమితి సమావేశంలో దత్తు జరుగుతుంది. అది ఇంచుమించు మతకర్మ రూపం తీసుకుంటుంది.

సమితి సమావేశమయ్యాక, దత్తు చేసుకోబోతున్న వ్యక్తి ఏ గణం వాడో, అతని పేరేమిటో, అతను ఎలాంటివాడో, అతన్ని ఎందుకు దత్తు చేసుకుంటున్నారో, అతనికి పెట్టబోయే పేరు ఏమిటో సమితి నాయకులలో ఒకరు చెబుతారు. ఆ తర్వాత ఇద్దరు నాయకులు అతని రెండు చేతులూ పట్టుకుని దత్తత పాట పాడుతూ సమావేశభవనంలో ఈ చివరినుంచి ఆ చివరివరకూ నడుస్తారు. మిగతా జనం ప్రతి చరణం చివరా పల్లవి ఎత్తుకుంటారు. పాట చరణాలు అన్నీ పూర్తయ్యేవరకూ అలా సమావేశభవనంలో ఈ చివరినుంచి ఆ చివరి వరకూ మూడు చుట్లు చూడతారు. దాంతో దత్తు పూర్తవుతుంది.

ఒక్కోసారి ఇతరులను అభిమాన సూచకంగా దత్తు చేసుకోవడమూ జరుగుతుంటుంది. సెనెకాలలో డేగగణం వారు తనను అలాగే దత్తు తీసుకున్నారని మోర్గాన్ అంటారు.

దత్తు తీసుకోవడం అనేది ఇప్పుడు ఒక వ్యక్తిగత విషయంగానో, సేవాభావంతో ముడిపడిందిగానో మారిపోయింది. ఉదాహరణకు, పిల్లలు లేనివారు ఎవరినైనా ఇష్టమైతే దత్తు చేసుకోవచ్చు, లేదా మానేయచ్చు. అలాగే కొందరు అనాథలను దత్తు చేసుకుంటారు. రాజకీయనాయకులు, ఆయా స్వచ్ఛంద సంస్థలవారు గ్రామాలనో, వెనకబడిన జిల్లాలనో దత్తు చేసుకుంటున్నామని చెబుతుంటారు. కానీ, గణసమాజంలో ఒక దశలో దత్తత అవసరంగానూ, అనివార్యంగానూ మారిపోయింది. సమాజనిర్మాణంలో భాగం అయింది. అది గణం నుంచి ప్రజలకు, లేదా పౌరులకు మారుతున్న దశ. గ్రీకులలో ఆ దశ గురించి మోర్గాన్ చర్చించారు.

మనం క్రూరమైన చట్టాలను ‘డ్రాకోనియన్’ చట్టాలు అంటాం. డ్రాకో(క్రీ.పూ. 624) అనే వ్యక్తి గ్రీకు తెగలలోని అధీనియన్ల కోసం చేసిన కఠిన చట్టాల కారణంగా ఆ పేరు వచ్చింది. అంటే, అప్పటికి గణం తాలూకు ఆచారాలు, అలవాట్ల స్థానే లిఖిత శాసనాలు తయారు చేసుకోవలసిన స్థాయికి గ్రీకులు పెరిగారన్నమాట. చట్టాల అవసరమైతే కలిగింది కానీ అప్పటికి చట్టాలు చేసే నేర్పు మాత్రం పట్టుబడలేదు. ఆ తర్వాత ధెసియస్(ఇతని తేదీ తెలియదు), సోలోన్(క్రీ.పూ. 594), క్లీస్తెనెస్(క్రీ.పూ. 509) అనే ముగ్గురు ఈ పరివర్తనలో ముఖ్యపాత్ర పోషించారు. క్లీస్తెనెస్ నాటికి ఈ పరివర్తన ఒక కొలిక్కి వచ్చింది. నేటికీ నాగరికదేశాల్లో కొనసాగుతున్న ప్రజాస్వామిక పరిపాలనా వ్యవస్థకు రూపునిచ్చినది ఇతనే. అత్తికా అనే ప్రాంతాన్ని ఇతను నూరు ‘డెమో’(పట్టణం)లుగా విభజించాడు. ఆ పట్టణంలో ఉన్నపౌరులు అందరూ డెమోలు. వారు తమ పేర్లను, ఆస్తుల వివరాలను నమోదు చేసుకోవాలి. అప్పుడే వారికి పౌరహక్కులు లభిస్తాయి. డెమోలకు స్థానిక స్వపరిపాలనాధికారం ఉంటుంది. వీరొక ‘డెమార్క్’ ను ఎన్నుకుంటారు. ఈ డెమో అన్న మాటనుంచే డెమోక్రసీ అనే మాట వచ్చింది.

చూడండి…మనం గణం నుంచి పౌరుల దగ్గరకు వచ్చేశాం. ఇలా నాలుగు వాక్యాలలో చెప్పేసుకున్నాం కానీ, ఈ పరివర్తన జరగడానికి కొన్ని శతాబ్దాలు పట్టింది. అందుకు ఎంతో తెలివీ, అనుభవమూ అవసరమయ్యాయి. ఒక్క మాటలో చెప్పాలంటే, గణవ్యవస్థ అనే తల్లిని శిథిలం చేసి ఈ పౌరవ్యవస్థ అనే శిశువు పుట్టింది.

ఇంతకీ గణవ్యవస్థను శిథిలం చేస్తూ ఈ పరివర్తన ఎందుకు సంభవించిందని ప్రశ్నించుకుంటే, గణ నిర్మాణమూ, గణ స్వభావమూ, గణానికి గల పరిమితులే అందుకు కారణమన్న సమాధానం వస్తుంది. గణం అనేది ఒక వ్యక్తి అనుకుంటే, గణంలో ఉన్నవారు అందరూ ఆ వ్యక్తికి గల వివిధ అవయవాల లాంటివారు. వ్యక్తికి విడిగా అవయవాలకు ఉనికి ఉండదు. అలాగే గణం బయట గణసభ్యులకు ఉనికి ఉండదు. అదసలు ఊహించడానికే సాధ్యం కాని విషయం. చెరువులోని చేపలు గట్టు మీద ఎలా బతకలేవో గణసభ్యులు కూడా గణం వెలుపల బతకలేరు.

కానీ, పైన చెప్పిన సోలోన్ (క్రీ.పూ. 594)కు ముందు గ్రీకు తెగలలో పెద్ద సంక్షోభం తలెత్తింది. గణదశలో ఉన్న జనం తప్పనిసరై ఉన్న చోటు వదిలి దూరప్రాంతాలకు పోవలసివచ్చింది. వ్యక్తులలోని సాహసప్రవృత్తి, వర్తక వాణిజ్యాలు, యుద్ధాలు మొదలైనవి ఇందుకు కారణమయ్యాయి. దాంతో వీరికి సొంత గణాలతో సంబంధాలు తెగిపోయాయి. మరో గణంతో సంబంధం ఏర్పడలేదు. ఆ విధంగా వీరు ఏ గణంతోనూ సంబంధం లేకుండా త్రిశంకు స్థితిలో ఉండిపోవలసివచ్చింది. క్రమంగా వీరి సంతానం కూడా పెరిగింది. ఏ గణంతోనూ సంబంధం లేకపోవడం అంటే ప్రభుత్వ పరిధిలోకి రాకపోవడమే. ప్రభుత్వ పరిధిలోకి రాని వారికి గుర్తింపు, గౌరవం కాదు సరికదా, ఉపాధి హక్కు, మత హక్కు, సహజవనరులలో భాగస్వామ్యంతో సహా ఏమీ ఉండవు. అది చావుతో సమానం. దీనికి పరిష్కారం, ఆయా గణాలవారు దయదల్చి వీరిని తమలో చేర్చుకోవడం. అక్కడ వచ్చింది దత్తతకు ప్రాధాన్యత.

గణాలకు గణాలు (లేదా కుటుంబాలకు కుటుంబాలు) తరలి వస్తే, ఒక గణంగా వారిని తెగలలోకి చేర్చుకోవచ్చు. వ్యక్తులుగా వస్తేనే అది కష్టమవుతుంది. అప్పుడు వారిని దత్తు చేసుకోవడమే మార్గం. అందులో కూడా మళ్ళీ తేడాలు ఉన్నాయి. పేరు ప్రతిష్టలు, ఆస్తి ఉన్నవారికి దత్తత ద్వారా గణంలో సభ్యత్వం తేలిగ్గా లభించవచ్చు. కానీ పేదలకు అది కష్టమవుతుంది. గ్రీసులో క్రమంగా అలాంటి వారి సంఖ్య పెరిగిపోయింది. అది పెద్ద సంక్షోభానికి దారి తీసింది. ఆ సంక్షోభాన్ని పరిష్కరించుకునే ప్రయత్నంలోనే గణవ్యవస్థ నుంచి పౌరవ్యవస్థకు పయనించడం సంభవించింది. అప్పటి ఆ ప్రయోగాలే నేటి ప్రజాస్వామికనిర్మాణాలకు మాతృకలయ్యాయి. నేటి పార్లమెంటు ఎగువసభ, దిగువసభ మొదలైనవి ఆ ప్రయోగాలనుంచి పుట్టినవే.

దత్తత గురించి చెప్పుకుంటూ చాలా దూరం వచ్చేశాం. మళ్ళీ అందులోకి వెళ్ళేముందు మరో రెండు ఆసక్తికర విషయాలు చెప్పుకోవాలి. గ్రీకు సమాజం గణదశనుంచి పౌరదశకు మళ్లడంలో గణసంబంధ ఆచారాలు, అలవాట్ల స్థానే కొత్త శాసనాలు తయారుచేసుకోవలసి వచ్చిందని పైన చెప్పుకున్నాం. ఆధునిక భారతదేశంలో మన అనుభవం కూడా ఇలాంటిదే. వివిధ ప్రాంతాలు, భాషలు, ఆచారాలు, అలవాట్లు ఉన్న ఈ దేశప్రజలను ఒక జాతిగా నిర్మించే ప్రయత్నంలో మన దగ్గరా ఇలాంటి శాసన నిర్మాణం జరిగింది, ఇంకా జరుగుతోంది. వ్యక్తిగత చట్టాల(పర్సనల్ లా)స్థానే ఉమ్మడి పౌర స్మృతిని నొక్కి చెప్పడం ఒక ఉదాహరణ.

రెండోది, గణదశనుంచి పౌరదశకు మళ్లడంలో గ్రీకుల అనుభవాన్ని మనకూ వర్తింపజేసుకోవచ్చు. అందులో మరింత ఆసక్తికరం ఏమిటంటే, మన వర్ణ, లేదా కులవ్యవస్థ చరిత్రనూ దాని నుంచి మనం పునర్నిర్మించుకోవచ్చు.

ఇప్పుడు మళ్ళీ దత్తతకు వస్తే…

సోర్సు చెప్పలేదు కానీ రాంభట్లగారు (జనకథ) అరుంధతీ, వశిష్టుల వివాహం గురించి ఒక ముచ్చట చెప్పుకుంటూ వచ్చారు. దాని సారాంశం ఇలా ఉంటుంది:

సప్తర్షి మండలంలో వశిష్టుని పక్కనే ఉన్న అరుంధతీ నక్షత్రాన్ని కొత్త దంపతులకు చూపిస్తారని మనకు తెలుసు. ఈ ఆచారం ఎప్పటినుంచి వస్తున్నదో తెలియదు. అరుంధతీ వశిష్టులు తమ తమ గణాలలో జంట మనువు కట్టి, జీవితాంతం ఆ మనువుకు కట్టుబడి ఉన్న తొలి జంట అన్న సంగతిని అది సూచిస్తూ ఉండచ్చు. ఆవిధంగా వారు ఆదర్శ దంపతులయ్యారు.

అయితే, ఆ మనువు సాధ్యం కావడానికి పూర్వరంగంలో పెద్ద కసరత్తు జరిగింది. ఎందుకంటే, వారిద్దరి గణాలూ అప్పటికి ఇంకా గణవివాహదశలో ఉన్నాయి. జంట మనువులతో వాటికి పరిచయం లేదు. అయినాసరే, ఒకరి మీద ఒకరు మనసు పడిన అరుంధతీ, వశిష్టులు జంట మనువు ఆడాలనుకున్నారు. అందుకు రెండు గణాలవారూ అనుమతించాలి. మామూలుగా అయితే అనుమతి అంత తేలిక కాదు. కానీ అప్పటికే కొన్ని తెలిసిన వ్రాతాల(మనువుకు యోగ్యమైన కొన్ని గణాలు కలసి వ్రాతంగా ఏర్పడతాయి)వారు జంట మనువుల్లోకి అడుగుపెట్టారు. పులస్త్య, పులహవ్రాతాలు వాటిలో ఉన్నాయి. కనుక అరుంధతీ, వశిష్టుల గణాలవారు కాస్త మెత్తబడ్డారు. అయితే, గణధర్మాన్ని భంగపరచి ఆ మనువును సాధ్యం చేయడం ఎలా?

అప్పుడు అరుంధతి గణదాయీలు (గణంలో పెద్దరికం వహించే మహిళలను గణదాయీలంటారు. తద్దినం మంత్రాలలో ఇప్పటికీ ‘దాయీ’ అనే ఈ వైదిక పరిభాషాపదం వినిపిస్తుంది. విశేషమేమిటంటే, గ్రీకు పురాణాలలోనూ ఈ పదం ఉంది. ఉదాహరణకు, హోమర్ దాయీలనే మాట) ఒక ఉపాయాన్ని కనిపెట్టారు. అది, జంట మనువు ఉన్న వ్రాతాలవారికి అరుంధతి, వశిష్టులను దత్తత ఇవ్వడం. అందుకు ఇద్దరి గణాల వారూ అనుమతించారు. అరుంధతిని దత్తత తీసుకోడానికి పులస్త్యవ్రాతం లోని ఒక గణం వారు, వశిష్టుని దత్తత తీసుకోడానికి పులహ వ్రాతంలోని ఒక గణం వారు అంగీకరించారు. ఆ విధంగా వారిద్దరూ జంట మనువు ఆడారు. ఇందులో చెప్పుకోవలసిన విశేషాలు ఇంకా ఉన్నాయి కానీ, అది మరెప్పుడైనా.

ఇప్పుడు కూడా దత్తత స్వీకారాలు జరుగుతూ ఉండచ్చు కానీ అవి పెళ్లిళ్ళలా, బంధుమిత్రుల సమక్షంలో, శాస్త్రోక్తంగా జరుగుతున్న దాఖలాలు కనిపించవు. శాస్త్రోక్తంగా జరిపించగల పురోహితులు ఉన్నారో లేరో కూడా తెలియదు. నేను ఇంతవరకు శాస్త్రోక్తంగా జరిగిన దత్తత స్వీకారం ఒకే ఒకటి చూశాను. అది కూడా నా చిన్నతనంలో. మా పెద్దమ్మగారి అబ్బాయిని దత్తు ఇచ్చారు. కొవ్వూరు(ప.గో. జిల్లా)లో, అటూ ఇటూ ఉన్న బంధుమిత్రుల సమక్షంలో ఆ కార్యక్రమం భారీగా జరిగింది. అది మూడు రోజుల తంతు. నాకది లీలగా మాత్రమే గుర్తుంది కానీ, ఆ తర్వాత ఆ తతంగానికి సంబంధించిన వివరాలు తెలిసాక; ఆ మూడు రోజుల్లోనూ మా పెద్దమ్మ వైపు వాళ్ళలో ఎంతో దుఃఖమూ, విషాదమూ గూడు కట్టుకుని ఉండేవా అనిపిస్తూ ఉంటుంది. దత్తత ఇస్తున్న అబ్బాయి మరణించడం, అతనికి అంత్యక్రియలు జరిగిపోవడం, ఆ తర్వాత దత్తత తల్లిదండ్రులకు అతను మళ్ళీ పుట్టడం ఆ మూడురోజుల తంతులోనూ మంత్రపూర్వకంగా జరిగిపోతాయి.

mbx_xtra_draupadi_by_nisachar-d56baz1

పరిశోధిస్తే ఈ దత్తత స్వీకార ప్రక్రియలో గణసమాజపు ఆనవాళ్ళు కచ్చితంగా దొరుకుతాయి. పైన చెప్పుకున్న అమెరికా ఆదివాసులు, గ్రీకులు జరిపిన దత్తత తంతుకు, శాస్త్రోక్తమైన మన తంతుకు మధ్య బహుశా పోలికలూ కనిపిస్తాయి. వేల సంవత్సరాలుగా తరం వెంట తరానికి ప్రవహిస్తున్న ప్రపంచ వారసత్వం అది.

ఇంకొకటి ఏమిటంటే, గణ సమాజంలో మతకర్మలు, లౌకిక కర్మలు అనే తేడా లేదు. ప్రతిదీ మతకర్మే. మంత్రపూర్వకంగా జరగవలసిందే. ఇప్పుడా కోణంలోకి వెడితే ఇప్పట్లో పైకి తేలడం కష్టం.

ఇంతకీ విషయమేమిటంటే, ద్రోణుని చంపగల కొడుకును, అర్జునుని వరించగల కూతురుని ద్రుపదుడు మంత్ర పూర్వకంగా దత్తు తీసుకుని ఉండచ్చు. పెండ్యాల వేంకట సుబ్రహ్మణ్య శాస్త్రిగారి అభిప్రాయం, ధృష్టద్యుమ్నుడు, ద్రౌపది దత్త సంతానమనే.

కథలోకి వెడితే…

ద్రోణునిపై ప్రతీకారానికి నిర్ణయించుకున్న ద్రుపదుడు ప్రతిరోజూ బ్రాహ్మణుల నివాసాలకు వెడుతూ వారిని ప్రసన్నం చేసుకోవడం ప్రారంభించాడు. అలాగే ఒకరోజున గంగాతీరంలో వానప్రస్థంలో ఉన్న కాశ్యపగోత్రీకులైన యాజుడు, ఉపయాజుడు అనే ఇద్దరు సోదరులను దర్శించుకున్నాడు. వారిద్దరిలోనూ తపోమహిమలో అధికుడైన ఉపయాజుని మరింతగా ఉపాసించి,‘సత్పుత్రుడు కలిగేలా నాచేత క్రతువు చేయించు. నన్ను కృతార్థుణ్ణి చేయి. నీకు లక్ష గోవులను ఇస్తాను’ అన్నాడు.

‘నాకు సంపద మీద కోరిక లేదు. ఆ కోరిక ఉన్న వారి దగ్గరకు వెళ్ళు’ అని ఉపయాజుడు అన్నాడు. అయినాసరే, ద్రుపదుడు ఒక ఏడాదిపాటు పట్టుదలగా అతన్ని ప్రార్థించాడు. మెత్తబడిన ఉపయాజుడు,‘ఓసారి మా అన్న ఈ వనంలో వెడుతుండగా నేల మీద ఒక పండు కనిపించింది. అది శుచా, అశుచా అనేది చూడకుండా ఆ పండు తీసుకున్నాడు. అలాగే ఫలం కోరుకునేవాడు, దానిని అంటిపెట్టుకుని ఉన్న దోషాలను పట్టించుకోడు. కనుక నువ్వు వెళ్ళి మా అన్న యాజుని ఆశ్రయించు. అతడు నీ కోరిక తీర్చగలడు’ అన్నాడు.

వెంటనే ద్రుపదుడు వెళ్ళి యాజుని కలసుకున్నాడు. అతను వేదవేత్త, తపశ్శాలి అయినప్పటికీ ఉంఛవృత్తితోనూ, భిక్షాటనతోనూ కుటుంబభారాన్ని మోస్తున్నాడు. ద్రుపదుడు ఉపయాజుని కోరినట్టే అతన్ని కూడా కోరి, లక్ష గోవులు ఇస్తానన్నాడు.

యాజుడు ఒప్పుకున్నాడు. నువ్వు కోరుకున్న కొడుకూ, కూతురూ పుడతారు అంటూ హామీ ఇచ్చి యజ్ఞానికి అవసరమైన సామగ్రిని సమకూర్చుకుని, తమ్ముడు ఉపయాజుడు సహాయకుడుగా ద్రుపద, కోకిలాదేవిల చేత పుత్రకామేష్టి చేయించాడు.

మిగతా విశేషాలు తర్వాత…

( కల్లూరి భాస్కరం )

 

 

 

 

 

Download PDF

ఒక వ్యాఖ్యను

Your email address will not be published. Required fields are marked *

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)