ఐలమ్మని మరిచిపోతే క్షమించదు తెలంగాణా!

"ఐలమ్మ..ఐ లవ్ యూ..." ఐలమ్మతో కొత్తతరం ప్రతినిధి సెలవు (ఫోటో: కందుకూరి రమేష్ బాబు)

kaifiyath

sangisetti- bharath bhushan photo

తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో మొక్కవోని ధైర్యాన్ని, సాహసాన్ని ప్రదర్శించిన ధీర వనిత చాకలి (చిట్యాల) ఐలమ్మ. 40 వేల ఎకరాల విసునూరు దేశ్‌ముఖ్‌ రేపాక వేంకట రామచంద్రారెడ్డి దౌర్జన్యాన్ని ధైర్యంగా ఎదుర్కొంది. ఏమాత్రం సొంత భూ వసతి లేని ఐలమ్మ 40 ఊర్లపై అజమాయిషీ చలాయించే ఆసామి వెన్నులో వణుకు పుట్టించింది. 1942లో విసునూరులో దేశ్‌ముఖ్‌ హైదరాబాద్‌లో తప్ప తెలంగాణలో మరెక్కడా లేని విధంగా అప్పుడే రెండు లక్షల రూపాయలు వెచ్చించి అధునాతనమైన భవంతిని / గడీని కట్టించిండు. దీనికి అప్పటి హైదరాబాద్‌ ఇంజనీర్‌ వల్లూరి బసవరాజు సూపర్‌వైజర్‌గా వ్యవహరించాడంటే ఆ భవన ప్రాధాన్యతను, ఆయన ఆర్థిక స్థితిని అంచనా వేయొచ్చు. ఈ వల్లూరి బసవరాజు ఆంధ్రమహాసభల్లో పాల్గొనడమే గాకుండా హైదరాబాద్‌, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లో మంత్రిగా పనిచేశాడు. అలాంటి విసునూరు దేశ్‌ముఖ్‌ని ఎదిరించి నిలిచింది. ఈమె కుటుంబ సభ్యులు ‘సంఘం’ (ఆంధ్రమహాసభ` కమ్యూనిస్టులు)లో ప్రధాన బాధ్యులుగా ఉండేవారు. దీంతో వారితో మాట్లాడేందుకు వచ్చిన ఆరుట్ల రామచంద్రారెడ్డి, డి.సుబ్బారావులను చంపడానికి విసునూరు గుండాలు విఫల యత్నం చేసిండ్రు. వాళ్ల ప్రయత్న విఫలం కావడం కూడా ఐలమ్మ మీద మరింత పగ పెంచుకోవడానికి కారణమయింది.

1944లో భువనగిరి ఆంధ్రమహాసభ ఆధ్వర్యంలో ప్రజాచైతన్యానికి పటిష్ట పునాదులు పడ్డ నాటి నుంచి 1946 జూలై నాలుగున దొడ్డికొమురయ్య (కడవెండి) అమరత్వం వరకు అప్పటి నల్లగొండ జిల్లా లోని జనగామ తాలూకాలో అన్ని గ్రామాలు ఉద్యమానికి ఊపిరి పోశాయి. ఉద్యమ దివిటీలయ్యాయి. పాలకుర్తి, విసునూరు, కడవెండి, కామారెడ్డి గూడెం, దేవరుప్పలలు పోరాట కేంద్రాలుగా విలసిల్లాయి. పాలకుర్తిలో చాకలి (చిట్యాల) ఐలమ్మ, ఆమె భర్త నర్సింహ్మ, కొడుకులు, సోమయ్య, లచ్చయ్యలు అందరూ ఉద్యమానికి బాసటగా నిలిచారు. ఆంధ్రమహాసభ నేతృత్వంలో ప్రజాచైతన్యం కోసం చిన్న సభలు, సమావేశాలు ఏర్పాటు చేయడం, పాటలు పాడడం, బుర్రకథలు, ఒగ్గుకథలు చెప్పడం పరిపాటి. పాలకుర్తిలో ఆంధ్రమహాసభ బృందం సభ ఏర్పాటు చేసి, బుర్రకథ చెబుతుండగా విసునూరు దేశ్‌ముఖ్‌ గుండాలు మిస్కీన్‌ అలీ, గుమాస్త, అబ్బాస్‌ అలీ, వుత్తాలం రామిరెడ్డి, వనమాల వెంకడు తదితరులు అడ్డుకోవడానికి ప్రయత్నించారు.

అయితే ప్రజలు వారికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసి తప్పతాగిఉన్న గుండాలకు తగిన శాస్తి చేసి పంపిండ్రు. దీంతో విసునూరు దేశ్‌ముఖ్‌ ప్రేరణతో పోలీసులు వనమాల వెంకడిపై హత్యాయత్నం చేసిండ్రనే నేరం ఆరోపిస్తూ చిట్యాల ఐలమ్మ భర్త నర్సింహ్మను ఆయన ఇద్దరి కొడుకుల్ని అరెస్టు చేసి జైలుకు పంపిండ్రు. జనగామ మున్సిఫ్‌ కోర్టు, మెదక్‌ సెషన్స్‌ కోర్టుల్లో విచారణ జరిగింది. విచారణ ఏడాది కాలంపాటూ సాగింది. నర్సింహ్మతో పాటు హత్యాయత్నం కేసు ఎదుర్కొంటున్న 12మందీ ఆ కాలమంతా జైళ్లలోనే మగ్గిపోయారు. బెయిలుకు కూడా నోచుకోలేదు.

chakali ilamma

ఇదే అదనుగా గ్రహించి విసునూరు దేశ్‌ముఖ్‌ ఐలమ్మ పంటని స్వాధీనం చేసుకుందామని ప్రయత్నం చేసిండు. అయితే ఈ పంటకు నిర్మాల, కడవెండి, సీతారాంపురానికి చెందిన ఆంధ్రమహాసభ కార్యకర్తలు కాపలాగా నిలిచారు. మూడ్నాలుగు నెలలపాటు కాపలా ఉన్న వీరందరికి ఊరోళ్లందరి నుంచి బువ్వడుక్కొచ్చి పెట్టింది. అయితే వీళ్లు కాపాల మానుకున్న వెంటనే దొర గుండాలొచ్చిండ్రు. ‘‘..యింటికి నిప్పువెట్టిండ్రు. యేదుం సద్దలు వోస్కపోయిండ్రు. యెనుమందుం పెసర్లు వోస్క పోయిండ్రు. నువ్వులు గానుగ్గట్టించుకుంటమని తెచ్చి పోసుకున్న నువ్వులు వోస్క పోయిండ్రు. యిట్లనే మెరుక… నువ్వులు వోసుక పోయిండ్రు. యిగ నేతి పట్వలైతె, వాల్లక్కన్నే పోయిండ్రు గద పటువలు యింతింత పటువలు పక్కున పల్లగొట్టిండ్రు. గిట్లనే మెరుక. పెల్లలకు పెల్లలే తీస్కపోయిండ్రు. తినుకుంట తీస్కపోయిండ్రు. పెల్లలకు పెల్లలే తీస్కపోయిండ్రు. బండ్లుగట్టించి అవి. వోస్క పోయిండ్రు. వూల్లె యింటికి నిప్పువెట్టిండ్రు’’. అని తన బాధంతా ‘స్త్రీ శక్తి సంఘటన’ కార్యకర్తలతో చెప్పుకుంది. ఈ విషయాలన్నీ మనకు తెలియన మనచరిత్ర పుస్తకంలో రికార్డయ్యాయి.

ఐలమ్మకు అండగా భీమిరెడ్డి నరసింహారెడ్డి, నల్లు ప్రతాపరెడ్డి, కె. రామచంద్రారెడ్డిలు తమ దళాలతో సహా విసునూరులో మకాం వేసిండ్రు. తర్వాతి కాలంలో ఈ నాయకుల్ని అరెస్టు చేసి పోలీసు స్టేషన్‌, విసునూరు దొర గడీ కూడా అయిన భవనంలో అమానుషంగా హింసించారు. సహచరుల అరెస్టు వార్త తెలుసుకొని విసునూరుకు వస్తున్న ఆరుట్ల రామచంద్రారెడ్డిపై గుండాలు దాడిచేసి, బట్టలు కూడా గుంజుక పోయిండ్రు. రామచంద్రారెడ్డి బమ్మెర గ్రామం పోయి నర్సింగరావు సహాయంతో బయటపడిరడ్రు. ఈ విషయాన్ని హైదరాబాద్‌లో రావి నారాయణరెడ్డి అన్ని వివరాలతో డైరెక్టర్‌ జనరల్‌ అండర్సన్‌కు ఫిర్యాదు చేసినా ఫలితం లేకుండా పోయింది. ఈ ‘పాలకుర్తి’ సంఘటన మొత్తం సాయుధ పోరాటంలో అనేక కొత్త ఎత్తుగడలకు, వ్యూహాలకు కారణమయింది. దీనికంతటికీ కేంద్ర బిందువు ఐలమ్మ. ఆమె పోరాటం, త్యాగం.

“ఐలమ్మా, ..ఐ లవ్ యూ…” ఐలమ్మతో కొత్తతరం ప్రతినిధి, చిత్రకారిణి “సెలవు” (ఫోటో: కందుకూరి రమేష్ బాబు)

తెలంగాణ సాయుధ పోరాటానికి ప్రతిరూపంగా నిలిచిన మట్టిమనిషి, మొక్కవోని ధైర్యంతో నిర్బంధాన్ని ఎదుర్కొన్న సాహసి చిట్యాల ఐలమ్మ. భూమికోసం, భుక్తి కోసం, భూస్వాముల, దొరల పీడనల నుంచి విముక్తి కోసం ఐలమ్మ కుటుంబం మొత్తం రక్తం ధారవోసింది. తాను, తన భర్త, కొడుకులు కష్టపడి పండిరచిన పంటను విసునూరు దేశ్‌మఖ్‌ తరలించుకు పోదామని ప్రయత్నిస్తే ‘సంగం’ అండతో అడ్డుకుంది. తరతరాలుగా తమ కుటుంబం సాగు చేసుకుంటున్న నాలుగెకరాల భూమి ఐలమ్మ కుటుంబం ఆస్తి. (మల్లంపల్లి దేశ్‌ముఖ్‌ (కరణం) నుంచి కౌలుకు తీసుకున్నది) వెట్టిచాకిరి వ్యతిరేకంగా సంగం నేతృత్వంలో ప్రచార కార్యక్రమాలు ఊపందుకోవడంతో ఆ బాధను అనుభవిస్తున్న ఐలమ్మ కుటుంబం కూడా సంగంలో చేరి వాటి కార్యకలాపాల్లో పాలుపంచుకున్నారు.

ఇది గిట్టని విసునూర్‌ దేశ్‌ముఖ్‌ ఐలమ్మ భూమిపై కన్నేసి వాటిని కాజేయాలని ప్రయత్నించిండు. విసునూరు పోలీసులు ఐలమ్మ ఇంటిమీద దాడి చేసి కొడుకుని అరెస్టు చేసి చిత్రవధ చేయడమే గాకుండా ఇంట్లో ఉన్న సామాన్లన్నింటిని పలగొట్టి మొత్తం ఇంటికే నిప్పుపెట్టిండ్రు. న్యాయం కోసం ఆమె హైదరాబాద్‌లో ఉన్న అధికారుల్ని కలిసి విన్నపాలు జేసుకుంది. ఎక్కడికైనా మొక్కవోని ధైర్యంతో వొక్కతే పోయి వచ్చేది. ఆమె ప్రాణానికి హాని ఉన్నప్పటికీ బేఖాతరు చేస్తూ న్యాయం కోసం జనగాం నుంచి హైదరాబాద్‌ వరకు అధికారులను కలిసింది.

పోలీసు దెబ్బలకు భర్త కాల్జేయ్యి పనిజెయ్యకుంటయ్యి తర్వాత చనిపోయిండు. ఐలమ్మకు మొత్తం అయిదుగురు కొడుకులు ఒక బిడ్డ. పచ్చి బాలింతగా ఉన్న బిడ్డపై దొరల తాబేదార్లు అత్యాచారానికి ఒడిగట్టిండ్రు. అలాగే ఉద్యమంలో పాల్గొన్న ఒక కొడుకు అమరుడయ్యిండు. అయినా ధైర్యం కూడగట్టుకొని సంఘానికి అండగా నిలిచింది. ఈమెకు అండగా ఆరుట్ల లక్ష్మీనరసింహారెడ్డి, ఆరుట్ల కమలాదేవి నిలిచిండ్రు. కమలాదేవిపై కూడా ఇదే విషయంలో కోర్టులో కేసు దాఖలు కావడంతో ఇద్దరు కలిసే పేషీలకు హాజరయ్యేది.

1900 ఆ ప్రాంతంలో వరంగల్‌ జిల్లా రాయపర్తి మండలం కిష్టాపురంలో పుట్టిన చిట్యాల (చాకలి) ఐలమ్మ పేరుమీద సంగం వాళ్లు పాటలు రాసిండ్రు. పాడిరడ్రు. ఉయ్యాల పదం పాడిరడ్రు. ఆమెను బాలనాగమ్మ అని వర్ణించిండ్రు. భూమి కోసం, భుక్తి కోసం, వెట్టిచాకిరి నుంచి విముక్తి కోసం, పంట కోసం, పదుగురి బాగు కోసం, సంగం రాజ్జెం కోసం తమ సమస్తాన్ని ధారవోసిన ఐలమ్మ త్యాగం అనితర సాధ్యం. జీవిత కాలంలోనే భర్తను ముగ్గురు కొడుకుల్ని పోగొట్టుకున్న ఐలమ్మ 1985 సెప్టెంబర్‌ పదిన తనువు చాలించింది.

ఐలమ్మ పోరాటం గురించి గానీ, ఆమెపై దొరలు చేసిన పాశవిక దాడుల గురించి గానీ నేటి యువతరానికి అంతగా తెలియదు. ఆమె గురించి పాఠ్యపుస్తకాల్లో ఎక్కడా ప్రస్తావన ఉండదు. నిస్వార్థ త్యాగానికి ప్రతీక అయిన ఆమె ప్రతిమకు టాంక్‌బండ్‌పై స్థానం దక్కలేదు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలోనైనా ఆమె పోరాటానికి, త్యాగానికి గుర్తింపు, గౌరవం దక్కాలి.

(సెప్టెంబర్ 10, ఐలమ్మ వర్ధంతి)

-సంగిశెట్టి శ్రీనివాస్‌

Download PDF

16 Comments

  • Satyanarayana Rapolu says:

    అభినందనలు సంగిశెట్టి శ్రీనివాస్! వ్యాసాన్ని కొద్ది పాటి ఎడిట్ చేసి బడి పిల్లలకు పాఠంగా పెట్టవచ్చు. అయిలమ్మ విగ్రహాన్ని హుసేన్ సాగర్ కట్ట మీద పెట్ట వలసిందే! టాంక్ బండ్ వంటి హూణాంధ్రుల పదాలు హైదరాబాద్ ఆత్మను మరుగు పరచినై. హుసేన్ సాగర్ కట్ట, తలాబ్ కట్ట వంటి తౌరక్య తెలుగు పదాలు వాడుదం.

  • P Mohan says:

    ఐలమ్మపై మంచి వ్యాసం. కాని సంగిసెట్టి పొంతనలేని కంపు రాతలతోనే పేచి.
    తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం గురించి ఆయన గతవారం చేసిన వ్యాఖ్యలకు ఈ వ్యాసానికి పోతన లేదు..
    ఆయన మాటలు..
    ………… ఆరోజులు మీరన్నట్లుగా మూడు పువ్వులు ఆరు కాయలుగా లేదు. కాని ఇవ్వాల్టి కన్నా గొప్పగానే ఉండింది. అందరికి చెయ్యడానికి పని తినడానికి తిండి దొరికింది. ‘నిజాం పరిపాలన నుంచి విముక్తికోసం ప్రజలు చేసిన సాయుధ పోరాటం’ అని చెబుతున్న దాంట్లో ఎంత మంది తెలంగాణ ప్రజలు పాల్గొన్నారు.అప్పటి మొత్తం 9 తెలంగాణా జిల్లాల్లో రెండున్నర జిల్లాల రైతులు మాత్రమే ఇందులో పాల్గొన్నారు అనే విషయాన్ని కూడా పరిగణన లోకి తీసుకోవాలి. (అలా చెప్పడమంటే ఆ పోరాటాన్ని తక్కువ చేయడం ఎంత మాత్రం కాదు)……..

    నోటితో పొగుడుతూ నొసటితో వెక్కిరింపు. అది తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం కాదని, రెండున్నర జిల్లాల రైతుల పోరాటం మాత్రమేనని, మిగత జిల్లాల్లో రైతులు దొరలా బతికారని సంగిసెట్టి ఇకముందు రాయాలి, ఆయన తన మాటకు కట్టుబడి వుంటే.
    ఐలమ్మ ఆత్మకు శాంతి కలుగుగాక…..

  • srinivas sangishetty says:

    మోహన్ గారు నేను పోయిన వారం రాసిన దానికి కట్టుబడి ఉన్న. దొరల దౌర్జన్యాలకు నిజాం అతి తక్కువ శాతం కారకుడు. కాని దొరలూ, దేష్ముఖ్లే ప్రధాన దోపిదీదార్లు. “మిగత జిల్లాల్లో రైతులు దొరలా బతికారని సంగిసెట్టి ఇకముందు రాయాలి” అని శాసిస్తే చెల్లదు సోదరా! migataa జిల్లాల్లో ఉద్యమం ఆ రెండున్నర జిల్లాల్లో ఉన్నంత తీవ్రంగా లేదని ఒప్పుకోవడం, ఒప్పుకోక పోవడం మీ విజ్ఞతకే వదిలేస్తున్నా…

    • kv ramana says:

      నిజాం పాలనలో అయితే ” దొరల దౌర్జన్యాలకు నిజాం అతి తక్కువ శాతం కారకుడు, దొరలు, దేష్ముఖ్లు ప్రధాన దోపీడీదారులు.”. అదే ఆంధ్రా వాళ్ళ దగ్గరికి వస్తే, తెలంగాణమీద పడి దౌర్జన్యంగా అన్నివిధాలా దోచుకున్నది మాత్రం ‘ఆంధ్రావలస పాలకులు’. మీ అభిప్రాయం ప్రకారం అందులో దొరలు, దేష్ముఖ్లు, వాళ్ళ వారసుల పాత్ర ఏమీ లేదు. పాపం, ఆంధ్రా వలసపాలనలో వాళ్ళంతా ఏమైపోయారో మరి? వాళ్ళు దోపిడీ, దౌర్జన్యాలు మానేసి హఠాత్తుగా బుద్ధిమంతులై పోయి, ఆంధ్రా వలసపాలననుంచి తెలంగాణాను విడిపించే ఉద్యమ నాయకులు అయిపోయి ఉంటారు. నిజాం కు ఒక నీతి, ఆంధ్రా పాలకులకు ఒక నీతా? ఇదేం పద్ధతి శ్రీనివాస్ గారు. ఇప్పుడు దొరల వారసుల పాలనే కదా తెచ్చుకున్నారు? ఇప్పుడు ఆంధ్రా మీద తుపాకి పెట్టిన ఈ దొరలు రేపు తెలంగాణ ప్రజల మీదే తుపాకి పెడతారు. చూస్తూ ఉండండి.

  • P Mohan says:

    మీ వాదనతో ఏకీభవించను. నిజాం రోజులు ఇవ్వాల్టి కన్నా గొప్పగానే ఉండినాయని, అందరికి చెయ్యడానికి పని తినడానికి తిండి దొరికిందని మీరే రాశారు. దొరల దౌర్జన్యాలు ఉన్నాయని, దొరలూ, దేష్ముఖ్లే ప్రధాన దోపిదీదార్లనీ రాశారు. అంటే,.. చెయ్యడానికి పని, తినడానికి తిండి దొరికి(వెట్టిచాకిరి,గంజినీల్ల్లు!), దొరల దౌర్జన్యాలు, దోపిడీ ఉన్నా అవి మంచి రోజులేనన్నమాట. ఇప్పుడూ దొరల దౌర్జన్యాలు, దోపిడీ రూపం మారి సారంలో కొనసాగుతున్నా జనం బతుకులు నాటి బతుకులతో పోలిస్తే సాపేక్షికంగా బాగానే ఉన్నాయ్. ఒప్పుకోవడం, ఒప్పుకోక పోవదాన్ని నేను కూడా మీ విజ్ఞతకే వదిలేస్తున్నా…
    నిజాం జనామోద పాలకుడైతే జనాన్ని పీడిస్తున్న దొరలని కట్టడి చేసి ఉండేవాడు, సీమలో బ్రిటిష్ వాళ్ళు పాలెగాల్లకి పగ్గాలు వేసినట్లు. వాళ్ళు తమ ప్రయోజనాలకోసమే చేసినా పల్లె భూములపై గుత్తాధిపత్యాన్ని సదలించగలిగారు. రైత్వారీ లాంటివి తెచ్చారు..నిజాం వెన్నెముక లేని వాడు. బ్రిటిష్ వాళ్లకు భయపడ్డాడు. అందుకే రాజీ, రెసిడెన్సీ.. పైగా దొరలతోను రాజి. పన్నులు, కూలీలను సరఫరా చేసేది వాళ్లేగా.
    గుజరాత్లో మోడీ కూడా మైనారిటీలను నేరుగా వెళ్లి కత్తి పట్టుకుని ఊచకోత కోయలేదు. పైనుంచి నడిపాడు. మతపిచ్చిగాల్లె జానాన్ని చంపారని, మోడీ నిజాంలా తక్కువ కారకుడని అంటే అతితెలివి ప్రదర్శించడమే. ఆసియా,ఆఫ్రికా, లాటిన్ దేశాలాను దోచుకున్న వ్యాపారులకు విక్టోరియా రాణి, ఫ్రెంచ్, స్పానిష్, డచ్ రాజులు అలా దోచుకోమని, పీదించమని చెప్పలేదు. దోచుకున్న సొమ్ములో భారీ వాటాలు పుచ్చేసుకుని, సైన్యమిచ్చి, నిరంకుశ చట్టాలు తెచ్చి కొమ్ము కాశారు. నిజాం కూడా అంతే. ఇతర సంస్తానాదీశులూ అంతే.
    నేను మీలా చరిత్ర పరిశోధకున్ని కాను. కాని కైఫీయతుల్లో, పుస్తకాల్లో ఉన్నవన్నీ నిజాలు కావనే ఇంగిత జ్ఞానం నాకు కొంతైన ఉందనుకుంటున్నా. చరిత్ర నిప్పు. ఎర్రదనం కనిపించక పోయినా ముట్టుకుంటే భగ్గుమంతుంటుంది. దానికి మసిపూయాలనుకేవాళ్ళు కాలిపోతారు..

    .

  • ari sitaramayya says:

    “దొరల దౌర్జన్యాలకు నిజాం అతి తక్కువ శాతం కారకుడు. కాని దొరలూ, దేష్ముఖ్లే ప్రధాన దోపిదీదార్లు.”

    శ్రీనివాస్ గారూ,
    Telangana people’s struggle and its lessons అని సుందరయ్య గారు ఒక పుస్తకం రాశారు. దాంట్లో ఆయన హైదరాబాద్ రాష్టంలో మొత్తం 530 లక్షల ఎకరాల భూమి ఉంది, అందులో పది శాతం భూమి మీద వచ్చే ఆదాయం నిజాం కుటుంబం ఖర్చులకు మాత్రమే వాడుకునేవాడు, అరవై శాతం దివానీ వ్యవస్థ అధీనంలో ఉండేది, ముఫై శాతం జాగీర్దారుల కింద ఉండేది అని రాశారు. ఈ జాగీర్దారుల అధీనంలో ఉన్న ప్రాంతాల పరిస్థితి మరీ దారుణంగా ఉండేది.

    జాగీర్దారీ వ్యవస్థ ఉన్న భాగంలో ఒక్కొక ప్రాంతానికీ వేలం పాట వేసేవారు. ఎవరు ఎక్కువ శిస్తు కడతామంటే వారికి (జాగీర్దారులకు) ఆ ప్రాతం మీద అధికారం ఇచ్చేవారు. నిజాంకు కట్టే శిస్తు కంటే ఎక్కువ కలెక్ట్ చేస్తే అది జాగీర్దారుకి మిగిలేది. జాగీర్దారులు రెవిన్యూ అధికారులుగా మాత్రమే కాకుండా దొరల్లా తయారయి వారి అధీనంలో ఉన్న గ్రామాల్లో బ్రతకటం కష్టం అయ్యేట్లు చేశారు. ఇది ఎవరివల్ల జరిగిందంటారు? 1940 దశకంలో నిజాం కంటే ధనవంతుడు ప్రపంచం లో మరెక్కడా లేడు అని రాసింది టైమ్ మాగజైన్. ఆ ధనం రెవిన్యూ ఫార్మింగ్ వల్ల వచ్చిందే. అసలు దోపిడీదారు నిజాం. అతని ఏజంట్లే జాగీర్దారులు.

    ఐలమ్మ కు గుడికట్టినా, విగ్రహం వేసినా మంచిదే. కాని ఐలమ్మ జీవితం వెనుక చలన సూత్రాలు అర్థం చేసుకోకుండా విగ్రహాలు వేసి ప్రయోజనం లేదు. ఐలమ్మ ఒక్కతే కాదు. ఐలమ్మ లాంటి వారు వేలకు వేలమంది మీరు భజన చేసే నిజాం గారి రాష్ట్రంలో బతికారు.

  • kv ramana says:

    ఒక చరిత్ర పుస్తకంలో చదివాను. గోల్కొండ నవాబుల కాలంలో మహారాష్ట్ర నుంచి బందిపోటు దొంగలు వచ్చి హైదరాబాద్ మీద పడి వీధుల్లో కనిపించిన వాళ్ళను అందరినీ చంపేసి, ఇళ్ళల్లోకి చొరబడి దోచుకుని వెళ్ళి పోయేవారు. నవాబులు వాళ్ళను ఎదుర్కోలేక పోయారు. ఇలా దాడులు చేయవద్దని వాళ్ళను బతిమాలి, టోల్ వసూలు చేసుకునే అధికారం వాళ్ళకు ఇచ్చి రాజీ చేసుకున్నారు. కానీ తెలంగాణ వాళ్ళకు మరాఠీ ప్రజలు మంచివాళ్లు , ఆంధ్రావాళ్లు చెడ్డవాళ్లు అయ్యారు. నిజామూ ఇప్పుడు చాలా మంచి వాడిలా కనిపిస్తున్నాడు. తెలంగాణ వచ్చాక ఇక ద్వేషభావం తగ్గుతుందని, అన్నదమ్ముల్లా ప్రేమతో కాకపోయినా మిగిలిన పొరుగు రాష్ట్రాల వాళ్లలా ఎవరి బతుకులు వాళ్ళు బతుకుతారనీ అనుకున్నారు. కానీ సంగిశెట్టి శ్రీనివాస్ గారి వ్యాసాలు తెలంగాణ ఉద్యమం అప్పుడు ఉన్నంత ద్వేషాన్ని ఆంధ్రావాళ్ళ మీద వెళ్లగక్కుతున్నాయి. ఆ అవసరం లేదు. అది వాళ్ళ ఆరోగ్యాన్నే దెబ్బ తీస్తుంది తప్ప, ఎలాంటి ఉపయోగం ఉండదు. సంగిశెట్టి గారు ఆత్మ పరిశీలన చేసుకోవాలి. చరిత్ర రాయండి కానీ అందులో నిజామును పొగడడం లాంటి విపరీతాలను, ఆంధ్రాపట్ల ద్వేషాన్ని కలపకండి.

  • సాహితి says:

    ప్రాంతీయ ద్వేషం వాస్తవాలను వక్రీకరిస్తున్నట్లుంది!

  • srinivas sangishetty says:

    రమణ గారు…
    1. నిజాం సర్ఫెఖాస్ భూములని కబ్జా చెసుకొని, అమ్ముకొని, దానం చెసి ఆంధ్రా ప్రభుత్వాలు తెలంగాణ ఆస్తులని దిగ మింగాయి. ఇది వాస్తవం. ఇందులో ఆ ప్రాంత ప్రజలకు అంతగా సంబంధము లేదు. కాని పాలకులకు కచ్చితంగా సంబందముంది. అదే విషయము రాస్తే అంత రేషమెందుకు? ఈ దొరల వారసుల పాలన కూడా ఎక్కువ కాలం సాగదు. బహుజన తెలంగాన కొసాం మా కొట్లాట సాగుతనే ఉంటది. .
    2. నిజాం చేసిన మంచి పనికి ఆయన్ని బాద్యుడిని చేస్తే మీకెందుకంత బాధ. 1911-1948 మధ్య కాలములో ఏడో నిజాం పాలన సాగింది. అందులో చివరి నాలుగెళ్ళు ఆయన చెయాల్సిన పనులు సక్రమంగ చేయనందుకు నిందించాల్సిందే. కాని ఆయన్ని ఒక ముస్లింగా మత ద్రుక్కొణం నుంచి చూడడం తప్పు.
    3. నాకు ఎవరి మీదా ద్వెషం లెదు.యథార్ధవాది లోక విరోధి అన్నది తెలిసిందే.
    ఇగ సితారామయ్య గారికి….
    1. నిజాం కుటుంబ ఆస్తిలో ఒకతైనా పంజగుట్ట స్థళాన్ని నింస్ దవాఖనాకు ఫ్రీగా ఇచ్చిండు.
    2. అంధ్రా విష్వవిద్యాలయముతో పాటుగా అనేక సంస్థలకు దానాలు జెసిందు. అజంతా, ఎల్లొరా కట్టదాల పరిరక్షణకు యూ.కే నుంచి నిపుణులను పిలిపించిందు. తిరుపతి గుడికి మాన్యాలు ఇచ్చిందు. భందార్ఖర్ సంస్థ వారు భారతాన్ని ముద్రించేందుకు అర్థిక సహకారాన్ని అందించిండు. ఆయాన జేసిన పనుల్లో ఇవి కొన్ని.
    ంఈరు సుందరయ్య పుస్తకముతో పాటుగా sheela raj రాసిన Medievalism to modernism బుక్ చదువాలే!

    • kv ramana says:

      “ఇందులో ఆ ప్రాంత ప్రజలకు అంతగా సంబంధం లేదు”. ఇది కత్తితో గాయం చేసి దాని మీద తేనె పూసే మాట. మీరు ఆంధ్రా ప్రజలను కూడా టార్గెట్ చేశారు. ఈ విషయం అందరికీ తెలుసు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కావడానికి వ్యతిరేకత లేని ఆంధ్రావాళ్లను కూడా మీరు నొప్పించారు. ఆంధ్ర భాషను చులకన చేశారు. తమదే అసలు తెలుగు అన్నారు. ఆంధ్ర కవులను, రచయితలను అవమానించారు. ఆంధ్రవాళ్ళకు లేని గొప్ప సంస్కృతి మాకు ఉందన్నారు. ఈ చరిత్ర అంతా పత్రికల్లో రికార్డ్ అయింది. దాన్ని చెరపలేరు. 58 ఏళ్ల తర్వాత రాష్ట్రావిభజన ద్వారా తమ పరిస్తితి మళ్ళీ మొదటికి వచ్చిందని, తమకు రాజధాని కూడా లేదని, హైదరాబాద్ ను తెలివి తక్కువగా నమ్ముకుని సొంత ప్రాంతాన్ని బాగుచేసుకోలేకపోయామని, అనుకుంటూ ఏం చేయాలో తెలియని స్థితిలో ఆంధ్రాప్రజలు ఇన్నాళ్ళు పెద్దగా పట్టించుకోలేదు. వాళ్ళు రాజధాని ఏర్పాటుచేసుకుని కాస్త కుదుటపడిన తర్వాత వాళ్ళూ గొంతు విప్పుతారు. ఆంధ్రవాళ్లవైపు తప్పులు లేవని కాదు. రజాకార్ ఉద్యమం అప్పుడు ఆంధ్రప్రాంతానికి వలస వచ్చిన తెలంగాణ వాళ్ళ విషయంలో కొంతమంది ఆంధ్రా ప్రజలు అన్యాయంగా నడుచుకున్నారు. అది తప్పని ఒప్పుకునే ఆంధ్రావాళ్ళకు కూడా అసహ్యం కలిగించే అంత అన్యాయంగా మీరు ప్రవర్తించారు. విభజన తర్వాత ఇది ఆగిపోయినా బాగుండేది. మీరు ఇంకా పొడిగిస్తున్నారు. ఇస్రాయెల్-పాలస్తీనాలగా ఈ ప్రాంతాన్ని మారుస్తున్నారు. శ్రీనివాస్ గారు, చదువుకున్న వ్యక్తిగా కాస్త బాధ్యతగా ఆలోచించండి. మీది ఒన్ సైడ్ చరిత్ర.

  • P Mohan says:

    ఇది నిజాం, ఆంధ్రా పాలకులపై పొగడ్తలు, తెగద్తల వివాదం కాదు. ప్రాపంచిక దృక్పథానికి సంబంధించిన విషయం. సంగిసెట్టి దారి తప్పారు. చరిత్రలో పన్నులు గుంజని పాలకుడు ఎవడూ లేడు. గుంజకపోతే పాలకుడే కాదు. నిజాం సముద్రమంత పన్నులు గుంజి కాకిరేట్టంత బిచ్చం వేయడాన్ని సంగిసెట్టి స్తుతించడం కంపరం పుట్టిస్తోంది. ఆ మాటకొస్తే పరాయి పాలకులైన తెల్లదొరలు వాళ్ళ ప్రయోజనం కోసమే అయినా బళ్ళు, రైళ్ళు, కరువులో గంజి కేంద్రాలు, పుస్తకాలు.. సతి నిషేధం లాంటివాటికి మనం రోజూ చెక్క భజన చేయాలి. కాని అది మానసిక అనారోగ్యం. ఆ దొరలు గుంజిన మన సంపదలో వాళ్ళు వేసిన బిచ్చం నలుసంత.

    1940లలొ నిజాం ఆస్తి ఇప్పటి లెక్కల ప్రకారం రెండు లక్షల కోట్ల రూపాయలు. 1947లొ దేశ వార్షిక ఆదాయం అందులో సగం. నిజాంను మత కోణంలో చూడ్డం తప్పే. కాని అతని అధికార యంత్రాంగంలో కీలక పదవులన్నీ ముస్లింలకే ఇవ్వడాన్ని గమనంలో తీసుకోవాలి. పాలితులు అన్య మతం వాళ్ళు కనుక నిజాం కొన్ని కనీస అవసరాలు తీర్చాలి. లేకపోతె జనం తిరగబడి తరిమేస్తారు. దేశంలో నిజాంకు మించి “ప్రజా సేవ” చేసిన సంస్తానాల పాలకులున్నారు. మైసూరులో 1881లొ దేశంలోనే తొలి Representative అసెంబ్లీ ఏర్పడింది. 1905లొ వీధి కరెంటు వచ్చింది. Indian Institute of సైన్స్ వడయార్లు పెట్టిందే. 1940లలొ అప్పటి వడయార్ ఆస్తి ఇప్పటి లెక్కల ప్రకారం 3 లక్షల కోట్లని గమనించాలి. బరోడా, Travencore ఇంకా ఇలాంటి రాజ్యాలు నిజాంకు మించి సంస్కరణలు తెచ్చాయి. (అనవసరమైనా ఒక విషయం.. రాజా రవివర్మను ఆదరించింది ఈ సంస్తానాలే. హైదరాబాద్లో తన దర్శనం కోసం వారాల తరబడి వేచివున్న వర్మను కనీసం పలకరించని కుసంస్కారి నిజాం తండ్రి ) ఈ పాలకులు చేసిన సేవలన్నీ రెక్కలు ముక్కలు చేసుకుని జనం సృష్టించిన సంపదను లాక్కుని విదిల్చినవే కాని వాళ్ళ కష్టార్జితంతో చేసినవి కాదు.

    సంగిసెట్టి ఆంధ్రా పాలకులను, పనిలో పనిగా అక్కడి ప్రజలను తక్కువ చేసి చూపడానికే నిజాం కంపు శవాన్ని మోస్తున్నారు. తెలంగాణా ప్రజలను తప్పు దారి పట్టిస్తున్నారు. ఆంధ్రా దోపిడీదారులను తిట్టడానికి గజ దోపిడీదారును, వాడు విదిల్చిన ఎంగిలి మెతుకులను పారవశ్యంగా నెత్తి కెత్తుకుంటున్నారు.

  • ari sitaramayya says:

    “నిజాం కుటుంబ ఆస్తిలో ఒకతైనా పంజగుట్ట స్థళాన్ని నింస్ దవాఖనాకు ఫ్రీగా ఇచ్చిండు.”

    నిజంగా? అయితే దానకర్ణుడే! మరి తెలియక అడుగుతాను, ఆ ఆస్తి నిజాం కుటుంబానికి ఎలా వచ్చింది?

    ఈ కుటుంబం వారు ఇప్పటి ఉజ్బెకిస్తాన్ ప్రాంతం నుంచి వచ్చి అవకాశం రావటంతో దక్కన్ ప్రాంతాన్ని ఆక్రమించుకున్నారు. బలవంతంగా తీసుకున్న ప్రాంతంలో రెండెకరాలు ఫ్రీగా ఇచ్చారా? మరి దానిక్కూడా నిజాం ఇన్స్టిటూట్ అనే ఉందిగా పేరు. మరి ఫ్రీగా ఇచ్చింది ఎవరికీ?

    చరిత్రను పాలకుల వైపు నుంచీ రాయొచ్చు, ప్రజల వైపు నుంచీ రాయొచ్చు, గందరగోళంగానూ రాయొచ్చు. హైదరాబాద్ రాష్టంలో దాదాపు ముఫై లక్షల ఎకరాల భూమినుంచి వచ్చే ఆదాయాన్ని స్వంత కుటుంబ ఖర్చులకు వాడుకున్న పరదేశీ పాలకుల వంశీయులు మీకు దానకర్ణుల్లాగా కనిపిస్తున్నారా? ఇలాంటి దోపిడీ పాలకులవల్లే ఐలమ్మలు అలా బతికారు. దోపిడీ దారులకు భజనలు చేస్తూ ఐలమ్మకు విగ్రహం వెయ్యాలనటం చరిత్ర అంటే ఏంటో తెలియని గందరగోళం.

  • Manjari Lakshmi says:

    సంగిసెట్టి శ్రీనివాస్ గారికి సమాధానంగా పెట్టిన అందరి వ్యాఖ్యలు చాలా బాగున్నాయి. బాగా రాశారు.

  • buchi reddy gangula says:

    నిజాం ను మెచ్చు కోవడం — చెన్నా రెడ్డి ని మెచ్చు కోవడం లా ఉంది —నిజాం పాలనా లోనే — అగ్రకులాలు — అన్ని రకాల దోపిడిలు — దాచుకోవ డాలు — జరిపి –దొరలూ -దేశ్ముఖ్ లు -ల్యాండ్ లార్డ్ లు — జమిందారులు —లా పుట్టుకొచ్చి —-
    అసలు అగ్రకులాలు దోచుకోనిది ఎన్నడు —
    దొరలూ — అగ్రకులాల వాళ్ళు — నాడు — నేడు అవకాశ వాదులే —-ఏ ఎండ కు అ గొడుగు
    పట్టగలరు — మాటలు మార్చ గలరు — జెండాలు మార్చ గలరు — వీళ్ళకు కావలిసింది — ఆధిపత్యం– రాజరికం — డబ్బు సంపాదన —అప్పుడు ?–యిప్పుడు? ఎప్పుడు ?-కాదా
    అమెరికా అయినా అమలాపురం అయినా మారింది అంటూ ఏమి లేదు —
    బాబు hero– జగన్ — పొన్నాల — దయాకర్ రావు లు నాయకులు ??రాజకీయ
    ఒనుమాలు తెలియని చిరు –పవన్ లు —రాట్నం తిప్పే నేతలు ???అసలు విగ్రహాల కు
    విలువ అంటూ ఉందా ??దోచుకొన్న వై -ఎస్ – ర గారికి —ప్రతి ఊళ్ళో విగ్రహం –అవసరమా —తెలంగాణా ఉద్యమాన్ని ముంచిన చెన్నా రెడ్డి కి vigraham–??ఎంతకాలం యి దొరల — బాబు ల పాలనా ??బాబు తర్వాత లోకేష్ ???యి ఫమిల్య్ పాలనా లు ఎంతకాలం ఫ్రెండ్స్ —–మార్పు raavaali- దళిత లు పాలనా రావాలి ——నేటి విద్య విధానం లో marpulu– బూసంస్కరణలు — అమలు cheyaali- ఆర్థిక వత్యాసాలు తొలిగి పోవాలి —-కుల మత పట్టింపులు పోవాలి
    యిక విడి పోవడం లో తప్పు లే దు — అ తీరుని కలిపించింది రాజకీయ నాయకులు — ప్రజల ను తప్పు బట్టడం న్యాయం కాదు —vidipoyaam– కలిసి బ్రతుకుదాం —–మోహన్ గారు — మిగిత ఫ్రెండ్స్ ఒపినిఒన్స్ తో ఎకిబవిస్తాను —–

    —————— బుచ్చి రెడ్డి గంగుల

Leave a Reply to ari sitaramayya Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)