యజ్ఞమూ…మాంత్రిక వాస్తవికతా…

Kalluri Bhaskaram-pic-a.prabhakar rao (5)

యాజుడు ద్రుపద దంపతుల చేత పుత్రకామేష్టి చేయించాడని అన్నప్పుడు…

నా కిక్కడ జార్జి థాంప్సన్ ను తీసుకు రావలసిన అవసరం తప్పనిసరిగా కనిపిస్తోంది. నిజానికి ఆయన్ను తీసుకురావడం ఇంత అలవోకగా జరగాల్సింది కాదు. కానీ ఆయనను పూర్తి స్థాయిలో ప్రవేశపెట్టాలంటే అందుకు చాలా వ్యాసాలు తీసుకుంటాయి. అదే ఒక పెద్ద గ్రంథం అవుతుంది. అలాగని పూర్తిగా వాయిదా వేసే అవకాశమూ కనిపించడం లేదు. కనుక థాంప్సన్ అనే సముద్రంలోకి దూకడం అనివార్యమవుతోంది. త్వరగానే పైకి తేలడానికి ప్రయత్నిస్తాను.

నేను చాలా ఏళ్ల క్రితం మాంత్రిక వాస్తవికత (Magical Realism) మీద థాంప్సన్ రాసిన ఒక చిన్న పుస్తకం చదివాను. ఎంత థ్రిల్లయ్యానో చెప్పలేను. నృత్యం, కవిత్వం, సంగీతం, నాటకం మొదట ఒకటిగా ఎలా ఉండేవో, క్రమంగా ఎలా విడిపోయాయో అందులో ఆయన రాశారు. నేను థ్రిల్ అవడానికి అదొక కారణమైతే, మన సంస్కృత, దేశీయ నాటకాలు, ఇతర దృశ్య రూపాలు, జానపద కళల పరిణామ క్రమానికి కూడా ఆయన పరిశీలన యథాతథంగా అన్వయించేలా ఉండడం అంతకంటే పెద్ద కారణం. థాంప్సన్ తనకు బాగా తెలిసిన గ్రీకు, ఇతర యూరోపియన్ సంప్రదాయాల గురించే రాశారు తప్ప మన సంప్రదాయం ఆయనకు అంత బాగా తెలుసునని చెప్పలేం. కానీ ఆ పుస్తకం అద్దంలో మన సంప్రదాయాన్ని కూడా చూసుకోవచ్చు.

STUDIES IN ANCIENT GREEK SOCIETY

ఆ పుస్తకం నా దగ్గరనుంచి ఎలా మాయమైందో తెలియదు. దాని కోసం ఎంతో గాలించాను. దొరకలేదు. నెట్ లో వెతికాను. కనిపించలేదు. మరింత గట్టిగా శోధిస్తే కనిపించేదేమో తెలియదు. ఈ లోపల ఆయన రాసిన మరో పుస్తకం దొరికింది. దాని పేరు, STUDIES IN ANCIENT GREEK SOCIETY-THE PREHISTORIC AGEAN. రాంభట్ల గారు ఒకటి, రెండు విషయాలలో జార్జి థాంప్సన్ పేరు ప్రస్తావించడంతో వాటి గురించి ఉంటుందనే కుతూహలంతో ఆ పుస్తకం తెప్పించుకున్నాను. కానీ రాంభట్ల పేర్కొన్న సమాచారం అందులో దొరకలేదు. ఆయనకు సోర్సు చెప్పే అలవాటు లేకపోవడం ఓ సమస్య. కానీ పై పుస్తకంలో నేను పోగొట్టుకున్న పుస్తకంలోని విషయాలు కొంతవరకు ఉన్నాయి.

ఇందులో THE ART OF POETRY పేరుతో ఒక అధ్యాయం ఉంది. దాని ప్రారంభంలోనే నాకు ఇంకో ఆశ్చర్యం. కవిత్వం పుట్టుక, దాని స్వభావాల గురించి చెప్పడం ఈ అధ్యాయంలోని విషయమనీ, దానిని ఒక సైంటిఫిక్ అంశంగా తను చర్చించబోతున్నాననీ ఆయన అంటారు. కవిత్వాన్ని కవిత్వం కోసమే ఆస్వాదించి ఆనందించేవారికి ఈ రకమైన పరిశీలన అంత సమంజసంగానూ, ఆకర్షణీయంగానూ కనిపించకపోవచ్చనీ, కానీ నిజానికి శాస్త్రీయదృక్పథం నుంచి కవిత్వాన్ని అధ్యయనం చేయడంలో మరింత ఎక్కువ ఆనందం ఉంటుందనీ అంటారు. ఇక్కడ ఆశ్చర్యం దేనికంటే, ఈ వాక్యాలు చదవడానికి చాలా ముందే, 1992లో, ‘కవిత్వంలో వస్తు రూపాలు’ అనే శీర్షికతో నేను రాసిన వ్యాస ప్రారంభం ఇలా ఉంటుంది: ‘ఆధునిక కవిత్వంలో వస్తురూప పరిణామం గురించి చెప్పుకోవడం అంటే బతికి ఉండగానే పోస్ట్ మార్టం చేసినట్టు కొంత బాధగానే ఉంటుంది. అయినా చరిత్రకు అదేమీ ఉండదు.’ george derwent thompson

నా ‘కాలికస్పృహ-మరికొన్ని సాహిత్యవ్యాసాలు’ పుస్తకం (2006)లో ఈ వ్యాసం ఉంది. కవిత్వాన్ని లేబరేటరీలో బల్ల మీద పెట్టి ఏ వాక్యానికి ఆ వాక్యాన్ని, ఏ పదానికి ఆ పదాన్ని విరిచి చూసి ఒక శాస్త్రవేత్తలా పరిశీలించాలనే ఒక ‘అకవిత్వ’ దాహం నాలో కలుగుతూ ఉంటుంది. థాంప్సన్ వాక్యాలకూ, నా వాక్యాలకూ పోలిక ఉండడమే నా ఆశ్చర్యానికి కారణం.

థాంప్సన్ ఈ అధ్యాయంలో పురామానవ పరిణామ కోణం నుంచి కవిత్వ పరిణామక్రమాన్ని చర్చించడం నాకు ప్రధాన ఆకర్షణ. గ్రీకు కవిత్వపు పురాచరిత్ర వెలుగులో ఈ పరిశీలన చేస్తున్నప్పటికీ గ్రీకు కవిత్వానికే పరిమితం కాననీ, ఆదిమజాతులకు చెందిన పాటలు, నృత్యాలతో పాటు; ఇప్పుడు అందరికీ బాగా తెలిసిన ఇంగ్లీష్ కవిత్వాన్ని, ఆధునిక యూరోపియన్ కవిత్వ పరిణామంలో ఇప్పటికీ వెనకటి దశే కొనసాగుతున్న ఐరిష్ కవిత్వాన్ని కూడా ఉపయోగించుకుంటాననీ ఆయన అంటారు. ఆయన చెప్పకపోయినా ఈ పరిశీలన మన కవిత్వ పరిణామక్రమానికీ యథాతథంగా అన్వయిస్తుంది.

ఆయన పరిశీలన ఇంకా ఇలా ఉంటుంది:

ఆధునిక ఇంగ్లీష్ కవిత్వానికీ, గ్రీకు కవిత్వానికీ ముఖ్యమైన తేడా, గ్రీకు కవిత్వం సంగీతబద్ధంగా ఉండడం. గ్రీసులో పురాకాలంలో శుద్ధవాద్యసంగీతం లేదు. వాద్యసంగీతం విధిగా కవిత్వాన్ని అంటిపెట్టుకుని ఉండేది. ఐరిష్ కవిత్వం కూడా అంతే. ఇదేదో అనుమానప్రమాణంతో అంటున్న మాట కాదు. ఇది ఇప్పటికీ ఐరిష్ కవిత్వంలో ఒక సజీవ వాస్తవం. ఈ సందర్భంలో ఐరిష్ కవిత్వంతో థాంప్సన్ ప్రత్యక్షఅనుభవాన్ని ఆయన మాటల్లోనే చెప్పుకుందాం:

“ఎంతో కాలంగా నాకు అచ్చులో తెలిసిన కొన్ని ఐరిష్ కవితలను మొదటిసారి ఒక నిపుణుడైన రైతు గాయకుడు సంప్రదాయ పద్ధతిలో గానం చేస్తుంటే విన్నాను. ఆ సందర్భాన్ని నేను ఎప్పటికీ మరచిపోలేను. అది నాకు పూర్తిగా సరికొత్త అనుభవం. ఐరిష్ కవిత్వానికి ఇంకొక లక్షణం ఉంది. ఇంగ్లీష్ ప్రజలు చాలా మంది దృష్టిలో ఇంగ్లీష్ కవిత్వం మూసేసిన పుస్తకం. కవిత్వం మీద ఆసక్తి ఉన్నవారిలో కూడా కవిత్వం అనేది వారి నిత్యజీవితంలోకి పెద్దగానూ, ప్రగాఢంగానూ ప్రవహించే విషయం కాదు. ఐరిష్ మాట్లాడే రైతాంగం విషయం ఇందుకు భిన్నం. వారి దృష్టిలో కవిత్వానికి పుస్తకంతో పనిలేదు. వాళ్ళలో చాలామంది ఇటీవలి వరకు నిరక్షరాస్యులు. కవిత్వం వాళ్ళ పెదవుల మీద ఉంటుంది. ప్రతి ఒక్కరూ కవిత్వాన్ని ప్రేమిస్తారు. వారి దైనందిన సంభాషణలో కూడా కవిత్వం ఉరకలెత్తుతూ ఉంటుంది. ఏదైనా ఒక ముఖ్యమైన ఘటన జరిగినప్పుడు దానిపై అప్పటికప్పుడు పాట కట్టి తమ అనుభూతిని ప్రకటించుకుంటారు. ఇటీవలివరకు అనేక ఐరిష్ గ్రామాలలో శిక్షణ పొందిన సాంప్రదాయిక గాయకుడు ఒక్కరైనా ఉండేవారు. ఆశువుగా కవిత్వం చెప్పే నేర్పు వారికి ఉంటుంది. ఆ క్షణంలో పొందిన ఉత్తేజాన్ని బట్టి అతను చెప్పే కవిత్వం, నేటి ఆధునిక ఇంగ్లీష్ కవిత్వం కన్నా కూడా ఎక్కువ వివరణాత్మకంగా ఉంటుంది.

నాకు బాగా తెలిసిన ఒక గ్రామంలో ఒక ప్రసిద్ధ కవి ఉండేవాడు. ఆయన చనిపోయి నలభై ఏళ్లయింది. ఆయన కవితలన్నీ చాలావరకూ ఆశువుగానూ, సందర్భానుసారంగానూ చెప్పినవే. ఆయన గురించి ఆయన కుటుంబ సభ్యులు ఒక విషయం చెప్పారు. ఆయన చనిపోయిన రోజు రాత్రి కూడా మంచం మీద పడుకుని మోచేతి మీద తల పెట్టుకుని ప్రవాహంలా కవిత్వం చెబుతూనే ఉన్నారట.

ఈయన తన వెనకటి తరానికి చెందిన కవి వద్ద శిక్షణ పొందిన వృత్తి కవీ, అసాధారణ ప్రజ్ఞావంతుడు అయితే కావచ్చు కానీ, మిగిలినవారికీ, ఇలాంటి వృత్తి కవులకు మధ్య మరీ అంత మందమైన గీత గీయడం కష్టం. స్థాయిలోనే తేడా ఉండచ్చు కానీ అందరూ కవులే. వాళ్ళ సంభాషణ చూస్తుండగానే కవితాత్మకంగా మారిపోతూ ఉంటుంది. “

ఈ సందర్భంలో థాంప్సన్ మరొకరి గురించిన ముచ్చట కూడా చెప్పారు. ఓ రోజు సాయంత్రం అట్లాంటిక్ సముద్ర తీరంలో ఉన్నఆ గ్రామంలో ఆయన పచార్లు చేస్తూ ఆ ఊరి బావి దగ్గరకు వెళ్లారు. అక్కడ ఒక తెలిసినామె కనిపించింది. ఆమె ఒక వృద్ధ రైతుమహిళ. అప్పుడే బొక్కెనలో నీళ్ళు నింపుకుని సముద్రం వైపు తదేకంగా చూస్తూ నిలబడి ఉంది. ఆమె భర్త చనిపోయాడు. ఏడుగురు కొడుకులు. ఏడుగురూ ‘కట్టకట్టుకుని’ (ఆమె అభివ్యక్తి) మసాచూసెట్స్ లోని స్ప్రింగ్ ఫీల్డ్ కు వెళ్ళిపోయారు. కొద్ది రోజుల క్రితమే ఒక కొడుకు దగ్గరనుంచి ఆమెకు ఉత్తరం వచ్చింది. ‘ఈ చివరి రోజుల్లో మా దగ్గర సుఖంగా ఉందుగాని, వచ్చేయి, నువ్వు సరే నంటే ప్రయాణానికి డబ్బు పంపిస్తా’మని దాని సారాంశం. ఈ విషయం ఆమె థాంప్సన్ తో చెప్పింది. ఆ తర్వాత; కొండలు, బండలు ఎక్కుతూ; ఎగుడు దిగుడు పచ్చిక బీళ్ళ మీద నడుస్తూ జీవితంలో తను పడిన కష్టాల గురించి, తను పోగొట్టుకున్న కోళ్ళ గురించి, పొగచూరిన చీకటి గుయ్యారం లాంటి తన చిన్న ఇంటి గురించి వర్ణించుకుంటూ వచ్చింది. ఆ తర్వాత అమెరికా గురించి మాట్లాడడం మొదలు పెట్టింది. ఆమె ఊహలో అమెరికా అంటే బంగారపు దేశం. అక్కడ కాలిబాటల మీద కూడా బంగారం దొరుకుతుందట. ఆ తర్వాత కార్క్ నగరానికి రైలు ప్రయాణం గురించి, అట్లాంటిక్ దాటడం గురించి మాట్లాడింది. ఆపైన తన శరీరం ఐరిష్ మట్టిలోనే కలసి పోవాలన్న తన కోరిక గురించి చెప్పింది. ఆమె మాట్లాడుతున్న కొద్దీ ఉత్తేజితురాలు కావడం ప్రారంభించింది. ఆమె భాష క్రమంగా మరింత ప్రవాహగుణాన్ని సంతరించుకోసాగింది. అది మరింత ఆలంకారికతను, లయాత్మకతను, శ్రావ్యతనూ పుంజుకుంటూ వచ్చింది. ఆమె దేహం స్వాప్నికమైన ఒక ఊయెలలో ఊగిపోతున్నట్టు అనిపించింది. ఆ తర్వాత ఆమె బొక్కెన తీసుకుని నవ్వుతూ గుడ్ నైట్ చెప్పి వెళ్లిపోయింది. తను కవినన్న భావన ఏ కోశానా లేని ఈ నిరక్షరాస్య వృద్ధ మహిళ మాటల్లో కవిత్వానికి ఉండే అన్ని లక్షణాలూ ఉన్నాయని థాంప్సన్ అంటారు. ఇది ఒక ‘పూనకం’(inspired) అంటాడాయన. కవిని పూనకం పట్టినవాడని అనడంలో అర్థమేమిటో తెలుసుకోవాలంటే, ఈనాటికీ ఆదిమజాతుల పెదాలపై నర్తించే ఆదిమకవిత్వంలోకి తొంగి చూడాలంటారు. అయితే, వాళ్ళ సమాజం గురించి కొంతైనా తెలుసుకుంటే తప్ప వారి కవిత్వం అర్థం కాదు.

 

***

ఆధునికతలోకి, లిఖిత కవిత్వంలోకి చాలా ముందే అడుగుపెట్టిన యూరప్ అనుభవం నుంచి చూసినప్పుడు, ఐరిష్ ప్రజల్లో (వారూ యూరొపియన్లే అయినప్పటికీ) వెనకటి ఆశుకవిత్వ సంప్రదాయం కొనసాగుతూ ఉండడం థాంప్సన్ కు సరికొత్త అనుభూతిని కలిగించి ఉండవచ్చుకానీ, అది మనకు అంత ఆశ్చర్యకరం కాదు. మన దేశంలో ఆశుకవిత్వంతో సహా వివిధ సాంప్రదాయిక ప్రక్రియలు ఇప్పటికీ అంతో ఇంతో ఉన్నాయి.

దానిని అలా ఉంచితే కవిత్వం ఒక ప్రత్యేకమైన వాక్కు అంటారు థాంప్సన్. కవిత్వం పుట్టుక గురించి తెలుసుకోవాలంటే వాక్కు ఎలా పుట్టిందో తెలుసుకోవాలి. వాక్కు ఎలా పుట్టిందో తెలుసుకోవడమంటే మనిషి ఎలా పరిణామం చెందాడో తెలుసుకోవడమే. మరీ ఎక్కువ వివరాల్లోకి వెళ్ళకుండా, వాక్కుకు, కవిత్వానికి పరిమితమై చెప్పుకుంటే, వాక్కు అనేది సామూహికశ్రమలో భాగంగా పుట్టింది. శ్రమ చేసేటప్పుడు కండరాల కదలికకు అది సాయపడుతుంది. ఆవిధంగా శ్రమలో భాగమైన వాక్కును శ్రమకు కారణంగా, లేదా చోదకంగా మనిషి అర్థం చేసుకున్నాడు. ఇంకో మాటలో చెప్పాలంటే, ఇప్పుడు మనం మాట అనుకుంటున్నది, అతని దృష్టిలో కేవలం మాట కాదు, మంత్రం! ప్రపంచవ్యాప్తంగా ఆదిమసమాజాలు అన్నీ నోటి నుంచి వెలువడిన మాటకు ఒకే విధమైన మాంత్రికతను ఆపాదించుకున్నాయి.

శ్రమ సాంకేతికత అభివృద్ధి చెందిన కొద్దీ, శ్రమలో గొంతు పాత్ర తగ్గిపొతూ వచ్చింది. వ్యక్తులు సమూహంగానే కాక విడివిడిగా కూడా పనిచేసే స్థాయికి ఎదిగారు. అయితే సామూహిక ప్రక్రియ వెంటనే అదృశ్యం కాలేదు. అది, ఒక అసలు కార్యాన్ని ప్రారంభించబోయే ముందు ప్రదర్శించే రిహార్సల్ రూపంలో మిగిలింది. ఇంతకు ముందు అసలు కార్యంలో భాగమైన సామూహిక కదలికలే ఒక నృత్యరూపంలో రిహార్సల్స్ గా మారాయి. ఈ మూకాభినయనృత్యం ( mimetic dance) ఇప్పటికీ ఆదిమజాతులలో ఉంది. అయితే, నృత్యంలో వాచికాభినయం ఉన్న చోట, ఆ వాచికం మాంత్రిక రూపం తీసుకుంది. అందుకే అన్ని భాషలలొనూ రెండు రకాల వాగ్రూపాలు కనిపిస్తాయి. మొదటిది, నిత్యజీవితంలో మాట్లాడుకునే సాధారణ వాక్కు. రెండవది, కవితాత్మకమైన వాక్కు. క్రతువు, అద్భుతత్వం, లయాత్మకత, మాంత్రికతలతో కూడిన సామూహిక చర్యలకు తోడ్పడే సాంద్రత ఈ కవితాత్మకమైన వాక్కులో ఉంటుంది.

ఈ విధంగా చూసినప్పుడు సాధారణ వాక్కు కంటే కవితాత్మక వాక్కే ప్రాథమికం అని తేలుతుంది. అందుకే ఇప్పటికీ ఆదిమ సమాజాలలో కవితాత్మక వాక్కు, సాధారణ వాక్కుల మధ్య తేడా పూర్తిగా ఏర్పడలేదు. ఐరిష్ ప్రజల దైనందిన సంభాషణ కూడా కవితాత్మకంగా ఉంటుందని అనడంలో మనకిది కనిపిస్తుంది. ఆదిమ సమాజాలలో దైనందిన సంభాషణ కూడా కవితాత్మకం అయినప్పుడు వారి కవిత్వం మాంత్రికం అవుతుంది. వాళ్లకు తెలిసిన కవిత్వ రూపం పాట ఒక్కటే. ఆ పాట ఏదో ఒక శారీరకమైన చర్యను అంటిపెట్టుకుని ఉంటుంది. వారి పాట, ఏ పనీ లేని తీరిక సమయంలో పాడుకునేది కాదు. పనిలో భాగంగా పాడుకునేది. వారికి పని-పాట వేరువేరు కావు. రెండూ ఒకటే. వారు పని ద్వారా ఏ భౌతిక ప్రయోజనాన్ని ఆశిస్తారో పాట ద్వారా కూడా అదే భౌతిక ప్రయోజనాన్ని ఆశిస్తారు. ఒక్క మాటలో చెప్పాలంటే, బాహ్య వాస్తవికతను మార్చి దానినుంచి తమకు అనుకూలమైన ఫలితాలను పొందడానికి, మాంత్రిక స్వభావం కలిగిన పాట రూపంలో బాహ్య వాస్తవికత మీద భ్రాంతి వాస్తవికతను ప్రయోగిస్తారు.

 

అదీ విషయం!

ఈ సందర్భంలో మావొరీలు (న్యూజీలాండ్) జరిపే పొటాటో నృత్యాన్ని థాంప్సన్ ప్రస్తావించారు. ఆడపిల్లలు ఆలుగడ్డలు పండించే పొలానికి వెళ్లి పంట ఎదుగుదలకు అవసరమైన తూర్పు గాలి వీస్తున్నట్టు, వర్షం పడుతున్నట్టు, పంట మొలకెత్తి పెరుగుతున్నట్టు తమ శరీరపు కదలికల ద్వారా సూచిస్తూ పాట పాడుతూ నృత్యం చేస్తారు. అంటే వాస్తవంగా తాము కోరుకునేది ఊహాత్మకంగా సాధిస్తారు. వాస్తవికమైన క్రియకు భ్రాంతిపూర్వక క్రియను జోడించడమే మాంత్రికత.

యాజుడు జరిపించిన పుత్రకామేష్టి గురించి చెప్పుకుంటున్న ప్రస్తుత సందర్భంలో పైన చెప్పుకున్న ప్రతి వివరమూ గుర్తుపెట్టుకోవలసినవే. రిహార్సల్స్ రూపంలో జరిపేది సామూహిక నృత్యమే కానవసరం లేదు. సామూహికంగా జరిపే ఏ చర్య అయినా కావచ్చు. యజ్ఞం, యాగం, ఇష్టి వగైరాలు కూడా సామూహిక చర్యలే. ఒక వాస్తవిక ప్రయోజనం కోసం బాహ్య వాస్తవికతపై భ్రాంతి వాస్తవికతను ప్రయోగించడమే వాటి ఉద్దేశం. అసలు యుద్ధంలో విజయం సాధించడానికి ముందు యాగం జరుపుతారు. అది యుద్ధానికి రిహార్సల్స్. అందులో విజయాన్ని భ్రాంతి పూర్వకంగా ముందే సాధిస్తారు. ఆ భ్రాంతి పూర్వక విజయం అసలు విజయాన్ని కట్ట బెడుతుందని నమ్మకం. ఇంకో ఉదాహరణ చూడండి…వర్షాలు పడనప్పుడు సహస్రఘటాభిషేకం చేస్తారు. అంటే ఆ జల పుష్కలత్వం గురించిన భ్రాంతి వాస్తవికత, వాస్తవికమైన జల పుష్కలత్వాన్ని ఇస్తుందని నమ్మకం. యజ్ఞంలో నెయ్యి, ధాన్యాలు వగైరాలే కాదు, పట్టుబట్టలు మొదలైనవి కూడా ఆహుతి చేస్తారు. అందువల్ల పుష్కలమైన పాడితోపాటు, అన్ని రకాల సంపదలూ లభిస్తాయని నమ్మకం. ఒక విత్తనం ఒక పెద్ద పండ్ల మొక్కను ఎలా ఇస్తోందో, అలాగే ఒక ఆహుతి అనంతమైన సంపదను ఇస్తుందని భావించారు.

మహాభారతంలో ఇటువంటి మాంత్రిక వాస్తవికతకు అద్దం పట్టిన ఘట్టాలలో సర్పయాగం; ద్రౌపదీ, ధృష్టద్యుమ్నుల జననం ఉన్నాయి.

మిగతా విశేషాలు వచ్చేవారం…

–కల్లూరి భాస్కరం

Download PDF

ఒక వ్యాఖ్యను

Your email address will not be published. Required fields are marked *

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)