విశ్వ రూపం

Kadha-Saranga-2-300x268

మిట్ట మధ్యాన్నం ! అమెరికన్ సమ్మర్ లు కూడా వేడిగా మారిపోతున్నాయి. రెండున్నర గంటలు కారులో కూచుని, అందులో ఒక అరగంట కోడి కునుకు తీసి జీ పీఎస్ సూచనల ప్రకారం ఆ ఇంటిముందు దిగేసరికి ఒక్కసారి వేడి గాలి మొహానికి కొట్టింది.

అప్పటికే అగుపించిన మేరకు బాక్ యార్డ్ లో ఒక టెంట్, ఒక గుంపు టీనేజి అమ్మాయిలూ , అబ్బాయిలు అటూ ఇటూ తిరుగుతూ కొందరు , చిన్న గుడ్డ సంచులు ఒక రంధ్రం ఉన్న చెక్క పైకి పదిఅడుగుల దూరం నుండి విసురుతూ కొందరు కళ్ళబడ్డారు. కారు దిగుతూనే మూడేళ్ళ మా చిన్నవాడు వాడి దారి వాడు వెతుక్కున్నాడు , త్రో చేస్తున్న ఆ లేట్ టీన్స్ అబ్బాయిలతో చేరిపోయాడు. కాళ్ళు సవరదీసేసుకు ముందుకు అడుగులేసేసరికి అప్పటికే ముందుకు వెళ్ళిపోయారు మిగతా వారు. నెమ్మదిగా వారి వెనకే వెళ్లి టెంట్ లోకి వెళ్ళే సరికి కళ్ళకు చీకట్లు వచ్చేసాయి. షార్ట్ వేసుకుని అబ్బాయిలో ,యుక్తవయస్కులో అంచనా వేసుకోలేని వాళ్ళు ఒకరిద్దరు వెనకాల డోర్ నుండి ట్రేలు తీసుకు వచ్చి టెంట్ లో అమరుస్తున్నారు. అల్యూమినియం ట్రే నిండా నిండు ఎర్రని ఎరుపుతో సవాల్ చేస్తూ పుచ్చకాయ ముక్కలు.

చల్లటి ముక్కలు ఒకటి రెండు తిన్నాక ప్రాణం లేచి వచ్చినట్టనిపి౦చి౦ది. ఆ టెంట్ లో ఓ పక్కన గ్రాడ్యుయేషన్ అయిన అమ్మాయి ఆల్బమ్స్ మెడల్స్, అచీవ్ మె౦ట్స్ సర్టిఫికెట్స్ మొదలైన స్కూల్ రికార్డ్స్ అమర్చి ఉన్నాయి. మరో పక్క పిల్లలకు స్నాక్స్ , అప్పుడే తెచ్చిపెట్టిన పుచ్చకాయ ముక్కలతోపాటు , కింద మంచు ముక్కలు వేసి పైన కిచెన్ రాప్ వేసిన ఫ్రూట్ సాలడ్. అప్పటికే పిల్లలంతా అక్కడికి చేరిపోయారు. స్ట్రా బెర్రీలు కరుగుతున చాక్లెట్లో ముంచి టూత్పిక్స్ తో పట్టుకుని తింటూ, స్పాంజ్ బాబ్స్ చాక్లేట్లో రోల్చేసి రెండు చిప్స్ మధ్య పెట్టి తింటూ …

అప్పటికే గ్రూప్స్ గ్రూప్స్ గా కనిపిస్తున్నారు చిన్నాపెద్దా. అమెరికన్లు ఒకవైపు మరోవైపున చీరల మెరుపులతో,కొత్తగా కొనుక్కున్న నగలు ప్రదర్శి౦చుకోవాలన్న తపనతో మధ్య మధ్య వాటిని సవరించు కు౦టూ మాట్లాడుతున్న భారతనారీ రత్నాలు … ఇవీ స్థూలంగా .

మరింత పరిశీలనగా చూస్తే పక్కనే మరో పెద్ద టెంట్ –అందులో బల్లలు కుర్చీలు వేసి ఉన్నాయి. అప్పటికే ఒకరిద్దరు వెళ్లి అక్కడ కూచుని ఉన్నారు,

పిల్లలవైపు దృష్టి సారిస్తే , ఎవరో వారిని విభజి౦చినట్టుగా అయిదేళ్ళ లోపు అమ్మాయిలూ ఒకవైపున లాన్లో ఆడుతున్నారు. మరో వంక అయిదారేళ్ళ నుండి పదిపదకొండేళ్ళ పిల్లలు అటూ ఇటూ తిరుగుతూ తింటూ పరుగులు తీస్తూ ఉన్నారు.

టీనేజ్ పిల్లలు ఒక వంక ఏ మూలో సర్దుకుని కబుర్లాడుతున్నారు.లేట్ టీన్స్ అమ్మాయిలు ఎవరికి వారు అయితే ఐశ్వర్యా రాయ్ ల మనో లేకపోతె చిట్టి పొట్టి బట్టలు కేవలం తొడల పైనుండి బొడ్డుకి౦ద వరకు, మళ్ళీ పైన సగం వీపు ముందు కాస్త కప్పే టాప్స్ తో ఎంజిలిన జోలీ గానో, ఎమ్మా స్టోన్ గానో రా౦ప్ మీద నడిచినట్టు కాట్ వాక్ చేస్తూ మధ్య మధ్య తమ పైన ఎన్ని చూపులున్నాయో లెక్కేసుకుంటున్నారు.

కొంచం పెద్ద పిల్లలు ఉన్న వారు ఒక చోట , కొత్తగా పెళ్ళైన పడుచు పిల్లలు ఒక వంక ఎవరికి తగ్గ కంపెనీ వారు వెతుక్కున్నారు.

పార్టీ కి వచ్చిన విజిటింగ్ పేరెంట్స్ నాలాగే ఎవరితో ఏం మాట్లాడాలో తెలియని అయోమయంలో ఉన్నారు.

ఒక విహంగ వీక్షణం పూర్తయాక, ఒకసారి లోపలికి వెళ్లి హోస్ట్ తో పలకరింపులయాక మళ్ళీ బయటకు వచ్చి పిల్లవాడిని వెతికితే టీనేజ్ దాటి చదువులు ముగించే దశలో ఉన్న అబ్బాయిలు వాలీ బాల్ ఆడుతుంటే వారి మధ్యన ఉన్నాడు.

రెండో టెంట్ లోకి వెళ్లి తిండి సంగతేదో చూద్దామనుకున్నాం. ఓపక్కన వెజిటేరియన్ మరోపక్క నాన్ వెజిటేరియన్ రెంటి మధ్యనా స్నాక్స్ ఉన్నాయి.

రోటీలు, చోలే, దద్ధోజనం , ఒక ట్రేలో ఉప్మా , ఫ్రైడ్ రైస్ , పాస్తా ,స్నాక్స్ గా బొబ్బట్లు , లడ్డూలు చెక్కలు, సమోసాలు , కారప్పూస అయిదారు రకాల నాన్ వెజ్ వంటలు .

ఒక సమోసా ,ఒక బొబ్బట్టు తిని నీళ్ళు తాగి టెంట్ లో కాస్త చల్లగా అనిపించడంతో అక్కడే కూచున్నాను. ఆ పక్కన టేబుల్ దగ్గర అంతా అమెరికన్సే. పాస్తాతో పాటు సమోసాలు , బొబ్బట్లు , ఫ్రైడ్ రైస్ లాటివీ తింటున్నారు. వెనకవైపున ముగ్గురు ఆడవాళ్ళు, చీరకట్టుతో చూస్తేనే తెలిసిపోతోంది తెలుగుతనం, వచ్చి కూచున్నారు ప్లేట్లలో కావలసినవి వడ్డించుకుని. ఉండీ ఉండీ వాళ్ళ మాటలు చెవిన పడుతూనే ఉన్నాయి.

“ ఈ చోలే కంటే ఏదైనా కూర చేస్తే బావుండేది. ఏ గుత్తి వంకాయో ..”

“అవును అయితే చోలే అయితే తెలుగు వాళ్ళూ, నార్త్ ఇండియన్స్ ముఖ్యంగా పిల్లలు అందరూ ఇష్టపడతారనుకున్నారేమో “

“అవును , మా పిల్లలు నార్త్ ఇండియన్ ఫుడ్ బాగానే ఇష్టపడతారు , బయటకు వెళ్తే వాళ్ళు తినేవి అవేగా అయినా ఇంట్లోనూట్రై చేస్తాను,అయినా మా పాప మాత్రం స్టిక్ టు పప్పన్నం అమ్మా అంటుంది. “ నవ్వులు.

“ ముఖ్యంగా హడావిడిగా వెళ్ళే సమయంలో పావ్ బాజీ బెటర్, ఏముంది అన్నీ ఉడకేసి ఇంత మసాలా వెయ్యడమేగా..”

మళ్ళీ నవ్వులు .

ఆ తరువాత సంభాషణ మరో వైపు మళ్ళింది. నేనూ మరో వైపు దృష్టి సారించాను.

మా చిన్న వాడు ఎక్కడా అని వెతుక్కుంటే ఎవరో చెప్పారు లోపలి వెళ్లి బేస్ మెంట్ కి వెళ్లి ఆడుకు౦టున్నాడని, “ అవును వాడస్సలు వేడి తట్టుకోలేడు” అంటోందివాళ్ళమ్మ. వేడికి బాధపడుతూ పెద్దలు చెయ్యలేని పని పిల్లడు ఎంత సులువుగా చెయ్యగలిగాడా అనిపించింది.

“ మన ఊళ్లోనే అయితే ఎవరైనా తెలిసిన వాళ్ళూ పలకరింపులూ ఉండేవి ఇక్కడ అ౦దరికందరూ కొత్తే , ఎవరితో ఏంమాట్లాడతాము “

రెండు సార్లు టెంట్ లోనికీ బయటకూ తిరిగాక మరిహ వేడి ఎక్కువగా ఉందని కాస్సేపు లోపల కూచుంటే ఏసీగాలికి చల్లగా ఉ౦టు౦దని అంటే లోపలకు వెళ్లాం . అప్పటికే హాల్ కం సిట్టింగ్ రూమ్ లో ఇద్దరు ముగ్గురు కూచుని క్రికెట్ మాచ్ చూస్తున్నారు.

ఖాళీగా ఉన్న సోఫాలో వాలాను.

ఇంటాయన తల్లిలా వుంది వచ్చి పలకరించింది. పరిచయం చేసుకుని “టీ కావాలా ?”అని అడిగారు.

వద్దండి- అంటూ పక్కన చోటు చూపాను

ఇంతకూ ఆవిడ పెరే తెలియదు.

“ మా అబ్బాయి” అంటూ పరిచయం చేసుకున్నారు

నిజమేనేమో అమెరికాలో అమ్మలుగానో అత్తలుగానో ఉంటారు గాని పేరూ ఊరూ అవసరం లేవనిఅనుకున్నాను .

రెండు నిమిషాలైనా కాకముందే ఎవరో ఒకరు రావడం ఆవిడ బొంగరం లా తిరుగుతూ పరామర్శ సరిపోయింది. పిల్లలు అటూ ఇటూ పరుగెడుతున్నారు.కిందకూ పైకీ, లోనికీ బయటికీ. పెద్దలు ఆడా మగా బాత్ రూమ్ అవసరానికి వచ్చి వెళ్తున్నారు. ఇంతలో రెండున్నర మూడేళ్ళున్న పిల్లడు ఒకడు డాడీ అంటూ వెతుక్కుంటూ వచ్చాడు. ఒకరిద్దరు వాడి డాడీ కోసం వెతకడం మొదలెట్టారు.

వాళ్ళమ్మ రాలేదా ?

లేదు ఆవిడ డెలివరీకి వెళ్ళారు హాస్పిటల్ లో ఈ రోజు డిశ్చార్జ్ అన్నారు

వాళ్ళ నాన్న ఒక్కడే వచ్చాడా?

లేదు వెంట అతని మామగారూ ఉన్నారు

ఏ రంగు షర్ట్ వేసుకున్నాడు –లైట్ ఎల్లో టీషర్ట్.

ఇహ ఎల్లో షర్ట్ మనుషులను వెతకడం మొదలైంది. ఆ రోజు ఒకరిద్దరు ఎల్లో షర్ట్ లు వేసుకున్నవాళ్ళు కనిపించారు. కాని వాళ్ళలో ఎవరూ ఆ పిల్ల వాడి తండ్రి కాదు. కనీసం ఆయన మామగారైనా ఎక్కడైనా కనిపిస్తాడేమోనని బాక్ యార్డ్ అంతా వెదికారు. ఉహు !

మర్చిపోయి వెళ్లిపోయారేమో, లేదా భార్యను డిశ్చార్జ్ చేసి ఇంటికి తెచ్చేందుకు వెళ్ళారేమో, అయినా ఇలా ఎవరికీ చెప్పకుండా ఎక్కడికి వెళ్లి ఉంటారు ? ఇంకా అదృష్టం ఏమిటంటే ఆ పిల్లవాడు డాడీ డాడీ అని అడుగుతున్నాడే తప్ప ఏడవటం లేదు. ఒకరిద్దరు ఆ పిల్లవాడిని చెయ్యి పట్టుకుని వంతుల వారీగా యార్డ్ అంతా తిప్పుతున్నారు.

ఎప్పటిదో సంఘటన గుర్తుకు వచ్చింది. ఆ రోజు ఆఫీస్ లో పనిచేసే రాజి నిశ్చితార్ధం, ఆఫీస్ లో అందరినీ రమ్మని ఆహ్వానించింది. సాయంత్రం వచ్చినా ఫర్వాలేదనేసరికి ఆరింటికి అందరం కలిసి వెళ్లాంఒక అరగంట మాటామంతీ ముగిసాక భోజనాల సమయంలో అడిగింది రాజీ “కళ్యాణీ పిల్లవాడిని తీసుకు రాలేదేం ?”

అప్పటికి గానీ కళ్యాణికి గుర్తు రాలేదు ఆఫీస్ పక్కన డే కేర్ సెంటర్ లో ఉంచిన కొడుకుని ఎప్పటిలా ఆరింటికల్లా పిక్ చేసుకోలేదని, అప్పటికే ఏడున్నర దాటి౦ది, హడావిడి పడుతూ వెళ్ళింది.

ఈ అయిడియా ఏదో బాగుంది కదా , ఎక్కడ ఏదైనా పార్టీ జరుగుతు౦టే పిల్లలనక్కడ ఓ అయిదారు గంటలు వదిలేసి స్వంత పనులు చేసుకోవచ్చు

కాస్త నీడగా ఉందని వచ్చి , బయట అప్పటికే హాట్ పాట్ లో ఉంచిన టీ కప్పులోకి వంచుకుని పక్కన ఉన్న గార్డెన్ స్వింగ్ లో ఒక చోటు ఖాళీ గా ఉండటం తో వెళ్లి కూర్చున్నాను

ఇంకా కనిపించని పిల్లవాడి తండ్రి కోసం గాలింపులు ఫోన్లు ప్రయత్నిస్తూనే ఉన్నారు.

ఎదురుగా ఇటుక గట్టు మీద ఇద్దరు ముగ్గురు అమ్మాయిలు ( స్కూల్ కి వెళ్ళే పిల్లలున్న తల్లులు ) పిల్లల చదువు గురించి చర్చి౦చుకు౦టున్నారు .

“ఆ స్కూల్ బాగానే ఉంది కాని పేరెంట్స్ ని ఇన్వాల్వ్ చెయ్యరు , అందుకే ఇక్కడ వేసాము “

“స్కూల్ ఏదైతేనేం మనం కాస్త కేర్ తీసుకుంటే , అందుకే ఈ కుమాన్ క్లాస్ లు చాలా ఉపయోగంగా ఉంటాయి”

“ నిజానికి ఈ స్కూల్ బావు౦దనే ఇక్కడికి మారాము “

వాళ్ళు చర్చి౦చుకునేది నిండా ఆరేడేళ్ళు లేని పసి వాళ్ళ గురించి.

“ మీ పిల్లలను ఏం చేద్దామనుకు౦టున్నారు? ఒబమాగానా , బిల్ గెట్ అవ్వాలా ? అమెరికన్ ప్రసిడెంటా అని అడుగుదామనిపి౦చి౦ది.

అసలు వీళ్ళు ఎవరైనా వాళ్ళ అమ్మానాన్నలు కలలు కన్న విధంగా ఉన్నారా? అనికూడా అనుకున్నాను.

ఈ లోగా పక్కన ఉన్న వాళ్ళు లేచి వెళ్ళిపోయారు.

ఎదురుగానో మరో ఇద్దరు వేరే వాళ్ళు వచ్చి కూచున్నారు .విసుగొచ్చినప్పుడల్లా టెంట్ లోకి వెళ్లి ఎదో ఒకటి తిని వస్తున్నారు.

పిల్లలు మీదగ్గరే ఉంటారా ?తండ్రి దగ్గరకు వెళ్తారా ? ఎవరిదో ప్రశ్న..

దగ్గరలోనే తను ఉండేది ‘ఒక వారం ఇక్కడా ఒక వారం అక్కడా

తలెత్తి చూసాను , నడి వయస్కు రాలు లేట్ నలభైల్లో ఉంటుండ వచ్చు. ఇందాక వాళ్ళ పిల్లల గురించి చెప్తుంటే విన్నాను అమ్మాయి స్టాన్ఫర్డ్ కి వెళ్తో౦దనీ అబ్బాయి హైస్కూల్లో ఉన్నాడనీ.తరువాత తెలిసింది పెళ్ళైన పదహారేళ్ళకు గొడవల వల్ల భార్యా భర్తలు విడిపోయారు అని.

“ నేనిక్కడ కూచో వచ్చా ?”

ఎదురుగా ఒక నడివయసు స్త్రీ అరవైలు దాటి ఉంటుంది. అమెరికన్ అనిపించలేదు జుట్టు నల్లగా ఉంది.

ఇంగ్లీష్ లో మాట్లాడే సరికి ఆవిడ సంభాషణ కొనసాగించింది.

రుమేనియన్ అట. భర్తతో పాతికేళ్ళ క్రితం విడాకులు తీసుకు౦దట.. భారతీయ మిత్రుల గురించి రుమేనియన్లూ భారతీయులకూ సారూప్యత గురించీ మాట్లాడింది.

వీళ్ళూ వాళ్ళూ చుట్టాలట తెలుసా అని అడిగింది.

అవును మనుషులంతా ఒకరికొకరు చుట్టాలే అన్నాను.

పిల్లవాడి తండ్రి వచ్చినట్టున్నాడు, అదిగో ఎల్లో షర్ట్ అన్నారెవరో ..

“అవును అతనే తండ్రి కావచ్చు , అల్లాగే అగుపిస్తున్నాడు “ ఈలోగా అతను బాక్ యార్డ్ లోకి రాగానే పిల్లవాడు డాడీ అంటూ పరుగెత్తుకు వెళ్ళాడు . ఎవ్వరూ అతన్ని ఒక్కమాటా అడగలేదు.

ఈ లోగా ఫోన్ లో వెతికి నా మనవడు అంటూ పదహారేళ్ళ వాడి ఫోటో ఒకటి చూపింది పక్కనున్నావిడ.

మళ్ళీ పెళ్లి చేసుకోలేదా అని అడిగాను .

మొహం వికారంగా పెట్టి –లేదు మా అమ్మా చిన్నప్పుడే మొగుడు వదిలేసినా మళ్ళీ పెళ్లి చేసుకోలేదు ,ఒక కూతురు, చాలు –మళ్ళీ పెళ్లి వైపు మనసుపోలేదంది.

ఇంకా ఎండ పొడ నీరే౦డలోకి జారుతోంది.. ఎక్కడివక్కడ సర్దేసి ఒక్కొక్కళ్ళూ సెలవు తీసుకు౦టున్నారు . ఇంటాయన తల్లితో చెప్పి బయల్దేరదామని వెళ్లాను , పక్కన మరో ముసలావిడ కన్నీళ్ళతో ఈవిడతో మాట్లాడుతోంది

“ ముగ్గురికి ముగ్గురూ ఒక రాజీకి రారు ఆస్తుల సంగతి తేల్చారు . నేను ఏమైనా అయితే పాలి వాళ్ళు ఆక్రమి౦చుకు౦టారు .”

తిరిగి వస్తూ కారులో అనుకున్నాను

ఈ చిన్న పార్టీలో ఒక విశ్వరూపాన్ని చూసాను కదా., భాష ఏదైనా వేషం ఏదైనా దేశం ఏదైనా మనిషి విశ్వరూపం ఒకటే కదా అని .

– స్వాతీ శ్రీపాదswathi

 

 

 

Download PDF

1 Comment

  • Rajesh Yalla says:

    katha chaala baavundi svaati gaaroo! vibhinnamaina manastatvaalanoo, manushulanoo kaasepatlone chaalaa baagaa aavishkarinchaaru.

Leave a Reply to Rajesh Yalla Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)