అక్కా చెల్లెళ్ళు

The-Two-Princesses-glass-mask-topeng-kaca-22689515-493-519
ఒకప్పుడు స్కాట్లండ్ లో ఒక రాజు కి వెల్వెట్ చీక్ అని ఒక ముద్దులొలికే కూతురు ఉండేది. చిన్నప్పుడే ఆమె తల్లి చనిపోయింది. తండ్రి కి తనంటే చాలా ప్రేమ. తనకీ ఏమైనా అయితే రాకుమారికి ఎవరూ దిక్కు ఉండరని భయపడి రాజు కొన్నాళ్ళకి ఒక మధ్యవయసు వితంతువుని పెళ్ళి చేసుకున్నాడు. ఆమె కూడా ఒక రాజ కుటుంబానికి చెందినదే. ఆమెకీ కాథరీన్ అని ఒక కూతురు ఉంది.ఇద్దరు అమ్మాయిలూ ఒకరికి ఒకరు తోడుగా ఉంటారని రాజు ఆశపడ్డాడు. అలాగే వాళ్ళిద్దరూ ఒకరి పట్ల ఒకరు చాలా ప్రేమగా ఉండేవాళ్ళు.
అయితే కొత్త రాణి బుద్ధి మాత్రం మంచిది కాదు. వెల్వెట్ చీక్ ఎదిగే కొద్దీ ఎంతో అందంగా తయరయింది. తన కూతురుకన్న ఆమె అందంగా ఉందనీ ఆమెకి గొప్ప సంబంధం వస్తుందనీ రాణి అసూయపడింది. ఆ అందాన్ని ఎలాగయినా పాడు చేయాలనుకుంది. ఒక రోజు చీకటి పడేవేళ దుప్పటి ముసుగు వేసుకుని కోళ్ళని పెంచే ముసలావిడ దగ్గరికి వెళ్ళింది. ఆమె కి మంత్రాలూ మాయలూ వచ్చని రాణి వంటి కొందరికే తెలుసు. అంతా విని మంత్రగత్తె ” పొద్దున్నే ఏమీ తినకుండా రాకుమారిని నా దగ్గరికి పంపించు . పని జరుగుతుంది ” అని మంత్రగత్తె చెప్పింది. మర్నాడు పొద్దునే వెల్వెట్ చీక్ ని పిలిచి ఫలానా ఆవిడ దగ్గర్నుంచి కోడిగుడ్లు తీసుకురమ్మని అడిగింది. ” ఏమీ తినకుండా ఉదయపు గాలిలో తిరిగితే ఆడపిల్లల బుగ్గలు ఎఱ్ఱగా అవుతాయి , కాబట్టి అలాగే వెళ్ళు ” అనిసలహా ఇచ్చింది. కానీ ఎందుకు అలా చెప్పిందా అని అనుమానం వచ్చీ ఆకలేసీ వెల్వెట్ చీక్ ఒక పెద్ద కేక్ ముక్క తిన్నాకే బయల్దేరింది. వెళ్ళి గుడ్లు కావాలని ముసలావిడని అడిగింది. ” అదిగో, ఆ కుండ మీద మూత తీస్తే ఉన్నాయమ్మా, తీసుకో ” అంది ఆమె. అలాగే కుండ మూత తీసి గుడ్లు పట్టుకువెళ్ళింది వెల్వెట్ చీక్. ఆమెకి ఏమీ కానందుకు మంత్రగత్తె ఆశ్చర్యపడింది , రాణి కి చాలా కోపం వచ్చింది. మరుసటి రోజు వంటిల్లు తాళం పెట్టించి ఏ ఆహారమూ వెల్వెట్ చీక్ కి అందకుండా చేసింది. ఖాళీ కడుపుతో వెళ్ళిన రాకుమారికి దారివెంట బఠాణీ లు కోస్తున్న పల్లెజనం కనిపించారు. ఆకలికి ఆగలేక గుప్పెడు గింజలు అడిగి తినేసింది. ఈ సారి కూడా మంత్రగత్తె మాయ పనిచేయలేదు.
ఇలా కాదనుకుని మూడో రోజు రాణి తనే సవతి కూతురుని తీసుకువెళ్ళింది. ఏమీ తినే అవకాశమే రాకుమారికి దొరకలేదు. ఈ సారి కోడిగుడ్లు ఉన్న కుండ మూత తీసేసరికి వెల్వెట్ చీక్ చక్కటి ముఖం మాయమై గొర్రె తల వచ్చేసింది. రాణి అతి సంతోషంతో అంతఃపురానికి వెళ్ళిపోయింది. రాకుమారి కన్నీరు మున్నీరుగా ఏడుస్తూ ముఖాన్ని జేబురుమాలుతో కప్పుకుని వెళ్ళింది. ఆమెని చూసి కాథరీన్ కి విపరీతంగా బాధేసింది. తన సొంత తల్లి మీద చెప్పలేనంత కోపం వచ్చింది. ” మనం ఇక్కడ ఇంకొక్క క్షణం కూడా ఉండద్దు . మా అమ్మ నిన్నింకేం చేస్తుందో ఏమో ” అని వెల్వెట్ చీక్ ని గబగబా బయల్దేరదీసింది.ఆమె గొర్రె ముఖాన్ని పట్టు శాలువాతో కప్పి ఆమె చేయిపట్టుకుని కాథరీన్ రాజధాని నుంచి బయటపడింది . కొన్ని రోజులకి సరిపడా ఆహారం మూట కట్టుకున్నారు. ఎవరూ చూడని చోట్ల ఏ గడ్డివాముల లోనో రాత్రులు నిద్ర పోయేవారు
నడిచి నడిచి రెండు రాజ్యాల అవతల ఉన్న పట్టణానికి వెళ్ళేసరికి తెచ్చుకున్న ఆహారం అయిపోయింది. ఒక పెంకుటింటి ముందు ఆగారు. ” ఈ రాత్రికి ఇక్కడ ఉండనివ్వమ నీ, కాస్త భోజనం పెట్టమ నీ అడుగుదాం. రేపు ఏదైనా పని చూసుకోవచ్చు ” అని కాథరీన్ అంది. వెల్వెట్ చీక్ ” నా ముఖాన్ని చూసి ఇంట్లోవాళ్ళు భయపడరా ? నా చెల్లెలివని నిన్నూ దూరంగా ఉంచాలనే చూస్తారేమో ” అంది.
” నీ ముఖం అలా ఉంటుందని ఎవరికి తెలుస్తుందేమిటి ? నువ్వు మాట్లాడకు. ఆ శాలువా గట్టిగా బిగించుకో. అంతా నేను చూసుకుంటాను ” అని ధైర్యం గల కాథరీన్ జవాబు ఇచ్చింది.అలాగే తలుపు తట్టి వెళ్ళి తన అక్కకి జబ్బుగా ఉందనీ , తీవ్రమైన తలనొప్పితో బాధపడుతోందనీ ఆ రాత్రికి తల దాచుకోనివ్వమనీ అడిగింది. ఆ ఇల్లు ఒక పేదరాసి పెద్దమ్మది. కాథరీన్ నెమ్మదిగా ఉండటం, మృదువుగా మాట్లాడటం గమనించి
” అయితే ఒంట్లో బాగాలేని వాళ్ళని చూసుకోవటం నీకు బాగా తెలుసా ? ” అనిపేదరాసి పెద్దమ్మ అడిగింది. ” ఓ , బాగా తెలుసుగా ” అని కాథరీన్ బొంకింది.
విషయం ఏమిటంటే ఆ రాజ్యపు రాజు గారి పెద్ద కొడుకు ఒక వింత వ్యాధితో బాధపడుతున్నాడు. అతని మతి సరిగా ఉండటం లేదు. రాత్రి వేళల్లో మరీ అలజడిగా ఉంటాడు. అతన్ని ఎవరో ఒకరు కనిపెట్టుకుని ఉండాల్సి వస్తూంది. ఎవరూ ఆ పనిని సక్రమంగా చేయలేకపోతున్నారు. రాజకుమారుడు పొద్దున లేచేసరికి దెబ్బలు తగిలించుకుని ఉంటున్నాడు.
The-Two-Sisters-xx-James-Sant
పేదరాసి పెద్దమ్మకి కాథరీన్ సమర్థురాలిగా అనిపించి మర్నాడు పొద్దున్నే రాజుకి ఆ మాట చేరవేసింది. ఆయనా కాథరీన్ తో మాట్లాడి తృప్తి పడి ఆ పనిని అప్పజెప్పాడు. రాజకుమారుడు క్షేమంగా ఉంటే సంచీడు వెండి నాణాలు బహుమతి ఇస్తానని చెప్పాడు. ఎవరితోనూ సంబంధం లేకుండా విడిగా ఒక గదిని అడిగి తీసుకుని అక్కని అందులో ఉంచి అని కాథరీన్ రాజకుమారుడి గదికి వెళ్ళింది.
రాజకుమారుడు చూసేందుకు చాలా బావున్నాడు. ఏదో జ్వరం తగిలినవాడిలాగా ఉద్రేకంగా కనిపించాడు. అర్థరాత్రి పన్నెండు గంటలకి కాథరీన్ కి కునుకు పట్టబోతుండగా , ఉన్నట్లుండి అతను లేచి మంచి బట్టలు వేసుకుని మెట్లు దిగి వెళ్తున్నాడు. ఆమె అతన్ని వెంబడించింది. అతను సరాసరి గుర్రాల సాలలోకి వెళ్ళి ఒక గుర్రానికి కళ్ళెం తగిలించి ఎక్కగానే ఆమె కూడా చప్పుడు చేయకుండా వెనక ఎక్కి కూర్చుంది. అడవిలోంచి వాళ్ళు ప్రయాణిస్తూ ఉండగా చుట్టూ విరగకాసిన హేజెల్ నట్ చెట్లు ఉన్నాయి. చేతికి అందినన్ని కాయలు కోసి గౌన్ జేబులలో దాచుకుంది కాథరీన్. పోగా పోగా ఒక విశాలమైన మైదానం వచ్చింది. మధ్యలో ఒక చిన్న కొండ. అక్కడ రాకుమారుడు గుర్రం దిగి, ” తెరుచుకో, ద్వారమా. రాకుమారుడినీ అతని గుర్రాన్నీ లోపలికి వెళ్ళనీ ” అని చిన్న గొంతుతో మంత్రం చదువుతున్నట్లు అన్నాడు.” ఆ వెనకే నన్ను కూడా ” అని గొణిగింది కాథరీన్. సరిగ్గా వాళ్ళు పట్టేంతగా కొండలో తలుపు తెరుచుకుంది. లోపలికి వెళ్ళగానే మూసుకుపోయింది.
ఆ లోపల ఒక పెద్ద చావడి. రంగు రంగుల కొవ్వొత్తుల తో వెలిగిపోతోంది. మధ్యలో అద్భుత సౌందర్యవతులు కొందరు నాట్యపు దుస్తు లలో ముస్తాబయి ఉన్నారు. జుట్టులో వెల్వెట్ పూల, గులాబీల కిరీటాలు పెట్టుకున్నారు. అదే వయసుగల అందమైన యువకులు కూడా చుట్టూ ఉన్నారు. వింతయిన సంగీతం వినిపిస్తోంది. వాళ్ళంతా ఎల్ఫ్ లు, దేవతలలో ఒక జాతి అది . రాజకుమారుడినిచూడగానే వాళ్ళలో ఒక యువతి పరిగెత్తుకుంటూ ఎదురు వచ్చింది. ఒక్కసారిగా అతని బద్ధకం, మగత , మాయమైనాయి. ఉత్సాహంగా నవ్వుతూ ఆమెతో అతను నాట్యం చేశాడు. అందరూ జంటలుగా నర్తించటం మొదలుపెట్టారు. ఒక మూలగా మసక చీకటిలో దాక్కున్న కాథరీన్ ని ఎవరూ గమనించినట్లు లేదు. అంతలో ఒక చిన్న పాప ఒక బంగారు బెత్తం తో ఆడుకుంటూ ఆమె ఉన్న చోటికి వచ్చింది. కాథరీన్ కి ముద్దొచ్చి పలకరించబోయింది. ఆ పక్కగా నాట్యం చేస్తూ వెళుతున్న ఒక అమ్మాయి తనతో ఉన్న అబ్బాయితో ఇలా అంది ” ఆ బెత్తంతో మూడుసార్లు తడితే కాథరీన్ అక్క ముఖం మామూలుగా అయిపోతుంది ” కాథరీన్ కి గొప్ప సంతోషం, ఆదుర్దా. మెల్లిగా తన జేబుల్లోంచి హేజెల్ నట్ కాయలు తీసి ఆ పాప ఉన్న వైపుకి దొర్లించింది. పాపకి ఆసక్తి పుట్టి చేతిలో బంగారు బెత్తాన్ని పక్కనపెట్టి కాయలు తీసుకుంది. నింపాదిగా కొద్ది కొద్ది నట్స్ ని అక్కడ వదుల్తూ పాప దృష్టి మరలించి కాథరీన్ బెత్తాన్ని అందుకుని జేబులో దాచుకుంది. సరిగ్గా అప్పుడే నాట్యం ముగిసింది. రాకుమారుడు తప్ప అంతా మాయమయ్యారు. అతను హడావిడిగా వెనక్కి మరలాడు. కాథరీన్ జాగ్రత్తగా వెనకాల ఎక్కి కూర్చుంది. వాళ్ళిద్దరూ మళ్ళీ అతని గదిలోకి ప్రవేశించారు.తెలతెలవారేదాకా అక్కడే ఉండి కాథరీన్ అక్క ఉన్న చోటికి వెళ్ళింది. పాపం, గొర్రె మొహం వేసుకుని వెల్వెట్ చీక్ నిద్రపోతోంది. బంగారు బెత్తం తో మూడుసార్లు తట్టేసరికి ఆమె ఎప్పటిలా అందంగా అయిపోయింది. అక్కచెల్లెళ్ళు ఇద్దరూ ఆనందంతో కన్నీళ్ళు పెట్టుకున్నారు.
fairy ball
రాజు, ముఖ్య సేవికా రాజకుమారుడు రాత్రి ఎలా గడిపాడని కాథరీన్ ని అడిగారు. ” చాలా బాగా గడిపారు ” అని చెప్పింది ఆమె. కొండలోపలి ఎల్ఫ్ యువతులు అతన్ని మంత్రించారనీ దాని సంగతేదో చూడాలనీ మనసులో అనుకుంది . అప్పుడే అక్కడికి తన తలనొప్పి తగ్గిందని అంటూ వెల్వెట్ చీక్ వచ్చింది. రాజు కాథరీన్ మాటలకి చాలా సంతోషించి ఆమె ఖచ్చితంగా నమ్మదగినదని అనుకున్నాడు. వెల్వెట్ చీక్ రూపాన్ని కూడా ఆయన మెచ్చుకుని ఆమె అక్కడే ఉండి పూలు కట్టటం లాంటి సున్నితమైన పనేదో ఒకటి చేయచ్చునని సూచించాడు. రెండో రోజు రాత్రి కూడా కాథరీన్ రాకుమారుడిని కనిపెట్టుకుని ఉంది. అంతా మొదటి రోజు జరిగినట్లే జరిగింది. నాట్యం జరుగుతూ ఉండగా నిన్నటిలాగే ఇంకొక చిన్న పాప వచ్చింది. తన చేతిలో చిన్న కేక్ ఉంది. మళ్ళీ ఒక ఎల్ఫ్ యువతి ఆ పక్కనుంచీ వెళుతూ ” ఆ కేక్ ని మూడు సార్లుగా తింటే రాజకుమారుడి శాపం పోతుంది ” అని తన జతగాడితో చెప్పింది. ఈ పాపనీ హేజెల్ నట్ లతో ఆకర్షించి తను కేక్ ని పక్కన పెట్టగానే తీసుకుని దాచుకుంది. నాట్యం పూర్తయింది.
రాజ భవనానికి తిరిగి వెళ్ళాక రాకుమారుడు ఎప్పటిలా పక్క మీద పడుకున్నాడు. అయితే కాథరీన్ చేతిలో కేక్ ని అతను గమనించాడు. ” నాకు అది తినాలని ఉంది ” అని మత్తుగా అన్నాడు. ఒక్క ముక్క పెట్టేసరికి ముఖం తేటగా అయింది. . ” ఇంకొకసారి ” అడిగాడు. ఈ సారి తినేసరికి లేచి కూర్చోగలిగాడు. మూడో ముక్క తింటూనే లేచి నడిచి తండ్రిని కలుసుకునేందుకు వెళ్ళాడు. రాజు ఆనందం లో మునిగిపోయి కాథరీన్ కి పదే పదే ధన్యవాదాలు చెప్పాడు. ఈ పెద్దకొడుకే తన తర్వాత రాజు అవుతాడు. తన కొడుకుని అంత బాగా చూసుకున్న ఆమె రాబోయే కాలం లో మంచి రాణిగా ప్రజలని కాపాడగలదని ఆయనకి అనిపించింది. ఇద్దరినీ వాళ్ళ ఇష్టం అడిగి పెళ్ళి ఏర్పాటు చేశాడు.
ఆ ముందురోజే, రాజుగారి చిన్న కొడుకు వెల్వెట్ చీక్ ని చూసీ చూడగానే ప్రేమించాడు. వాళ్ళిద్దరి పెళ్ళీ కుదిరిపోయింది. అప్పుడు అమ్మాయిలు ఇద్దరూ వాళ్ళ అసలు కథ చెప్పారు. వాళ్ళ అమ్మా నాన్నా పెళ్ళికి వచ్చారు. వాళ్ళ నాన్న వెల్వెట్ చీక్ ని మళ్ళీ చూడగలిగినందుకు చాలా సంతోషించి కాథరీన్ ని దగ్గరికి తీసుకుని తలమీద ముద్దు పెట్టుకున్నాడు.. ఆయన అనుకున్నట్లే వాళ్ళిద్దరూ ఒకరికొకరు తోడుగా ఉన్నారు.
ఈ రాజ్యం వాళ్ళ రాజ్యం కంటే చాలా పెద్దది. ఈ రాజుగారు ఇంకా ధనవంతుడు. అందుకని కాథరీన్ కి పట్టిన అదృష్టానికి వాళ్ళ అమ్మ మురిసిపోయింది. వెల్వెట్ చీక్ మీద ద్వేషాన్ని మరచిపోయి ఆమెని క్షమించమని అడిగింది. వెంటనే కాదుగానీ, కాలక్రమాన ఆమెని ఇద్దరు కూతుళ్ళూ మన్నించారు. అందరూ సుఖంగా ఉన్నారు.
స్కాట్లండ్ జానపదకథ , By Elizabeth Grierson

Download PDF

7 Comments

  • RAMACHANDRA MURTHY RALLABHANDI says:

    రియల్లీ ఇత్స్ గుడ్ స్టొరీ, ఫ్రొం ఫస్ట్ వర్డ్ తో లాస్ట్ వర్డ్ ఇట్ ఇస్ వేరి వేరి ఇంటరెస్టింగ్. నౌ ఒంవర్డ్స్ ఆం దెచిదెద్ తో రీడ్ ఠెసె స్టోరీస్ ఫ్రొం ఠిస్ సైట్.

    తనక్ ఉ

  • Rekha Jyothi says:

    ఇంత మంచి స్నేహితుల్లాంటి అక్కా చెల్లెళ్ళ కధ చాలా బావుంది మామ్, ఎప్పటిలాగే మొదటి పారాలో విశ్లేషణ ఎంతో బావుంది , ఆసాంతం వెల్వెట్ చీక్ కోసం కాథరిన్ ఆలోచనలు కదులుతూ ఉండడం చాలా బాగా డ్రైవ్ అయ్యింది. ఈ కధను చెప్పేసి ఆనంద పడేందుకు waiting for a ‘ Weekend kids gathering ‘, Thank u Mam.

  • BHUVANACHANDRA says:

    ఎంత బాగుందో ….థాంక్స్ మైధిలి గారూ ……మరో బాల్యాన్ని ఇస్తున్నారు

  • padmaja says:

    గుడ్ అండ్ ఇంటరెస్టింగ్ స్టొరీ….children like very much

  • padmaja says:

    చాల బావుంది మైధిలి గారు ….చందమామ ,బాలమిత్రలు లేని లోటును తీరుస్తున్నారు.

  • Radha says:

    డాక్టర్ గారూ, కథ చాలా బావుళ్ళా… కొత్తగా ఉందొకటి, చాలా ట్విస్ట్ లు కూడా ఉన్నాయి. ఇలా ఉన్న కథలు పిల్లలకి భలే నచ్చితే పెద్దలకి ‘ఆహా ఊహించలేకనే పోయామే’ అనిపిస్తుంది….. తర్వాత వారం కోసం ఎదురుచూస్తూ…

  • మైథిలి అబ్బరాజు says:

    ధన్యవాదాలు రామచంద్ర మూర్తి గారూ, రేఖా జ్యోతి , పద్మజ గారూ, పద్మజ గారూ , భువన చంద్ర గారూ ! రాధ గారూ…చాలా బావుళ్ళా :) నేనొక ఇరవై ఐదు శాతం నెల్లూరు దాన్ని , సంతోషమండి ..

ఒక వ్యాఖ్యను

Your email address will not be published. Required fields are marked *

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)