అన్నదమ్ములు

Three_Brothers_1828
ఒకప్పుడు ఒకాయనకి ముగ్గురు కొడుకులు ఉండేవారు. ఆయనకి వాళ్ళు ఉంటున్న ఇల్లు తప్ప వేరే ఆస్తి ఏమీ లేదు. ఇల్లు కాస్త పెద్దదే.ఆయనకి ముగ్గురు కొడుకులమీదా సమానమైన ప్రేమ. తన తర్వాత ఇల్లు ఎవరికి వచ్చేలా చేయాలో తేల్చుకోలేకపోయాడు. అమ్మేసి డబ్బుని సమంగా పంచవచ్చు, అయితే కొన్ని తరాలనుంచీ తమ కుటుంబానికి చెందినది కాబట్టి ఇంటిని అమ్మేందుకు ఆయనకి ఇష్టం లేదు. చివరికి ఒకరోజు ముగ్గురినీ పిలిచి ఆయన ఇలా అన్నాడు
” మీరు బయటి ప్రపంచం లోకి వెళ్ళి తలా ఏదో ఒక విద్యో, వృత్తో, వ్యాపారమో నేర్చుకోండి. మూడేళ్ళ తర్వాత ఎవరు వాళ్ళు నేర్చుకున్నదానిలో ఎక్కువ ప్రావీణ్యం సాధిస్తారో వారికి ఇల్లు రాసి ఇస్తాను ”
కొడుకులకి ఆ ఆలోచన నచ్చింది. పెద్దవాడు కమ్మరి పని నేర్చుకుందామనుకున్నాడు. రెండోవాడు మంగలి అవాలనుకున్నాడు. మూడోవాడు కత్తిసాము నేర్చుకుందామని. అందరూ బయలుదేరి వెళ్ళారు.

MythiliScaled
అదృష్టం కొద్దీ ముగ్గురికీ మంచి గురువులు దొరికారు. ఎవరికి వారు ఆ విద్యలు చివరంటా నేర్చుకుని మంచి పనితనం సంపాదించారు. ఎంతో నిపుణుడు కావటాన కమ్మరికి రాజు గారి గుర్రాలకి నాడాలు తొడిగే అవకాశం వచ్చింది. ” ఇల్లు నాకే వస్తుంది. సందేహం లేదు ” అనుకుంటుండేవాడు.
మంగలి దేశంలో గొప్ప సంపన్నులకీ పెద్ద అధికారులకీ క్షవరం చేయగలిగేవాడు. అతనూ తనే పోటీలో నెగ్గుతాననే అనుకున్నాడు. కత్తి సాము నేర్వబోయినవాడికి గట్టి దెబ్బలే తగిలేవి. అయితే వాటిని ఓర్చుకునేవాడు . ” ఈ దెబ్బకి భయపడిపోతే ఇల్లు ఎలా దక్కుతుంది ? ” అని తనకి తాను చెప్పుకుంటూ ఉండేవాడు.
feature_1.jpg2
అలా మూడేళ్ళూ గడిచాయి. ముగ్గురూ ఇంటికి తిరిగి వెళ్ళి తీరిగ్గా కూర్చుని తమ విద్యలని ఎలా చూపెడదామా అని మాట్లాడుకుంటున్నారు. అంతలో దూరం నుంచి ఒక కుందేలు వస్తూ కనిపించింది ”మంచి సమయానికి వచ్చావు ” అని మంగలి సబ్బూ నీళ్ళూ సిద్ధంగా పెట్టుకుని ఆ కుందేలు పరుగున వాళ్ళని దాటి వెళ్ళే లోగా దాని మీసాలని పూర్తిగాగొరిగేశాడు. దాని ఒంటి మీద ఒక్క గాటు పడలేదు, ఒక్క వెంట్రుక చెదరలేదు. ఒక్క క్షణం కూడా ఆగలేదు. ఎలా వచ్చిందో అలాగే వెళ్ళిపోయింది.
” భేష్ ! చాలా బాగా చేశావు నాయనా ! తక్కిన ఇద్దరూ నిన్ను మించకపోతే ఇల్లు నీదే ” అని తండ్రి అన్నాడు.
కాసేపటికి ఆ దారి వెంట ఒకరు వేగంగా రథాన్ని నడుపుకుంటూ వస్తున్నారు. ” నాన్నా, చూడు. ఏం చే స్తానో ” అంటూ కమ్మరి ఆ రథం వెనకాల పరుగెత్తాడు. నాలుగు గుర్రాల గిట్టలకీ ఉన్న నాడాలు తొలగించి, రథం వేగం ఏ మాత్రం తగ్గకుండానే మళ్ళీ నాలుగు గుర్రాల పదహారు కాళ్ళ గిట్టలకీ కొత్త నాడా లు తొడిగేశాడు. నడిపేవాడికి ఇదంతా జరిగిందనే తెలియలేదు.
grand12
” చాలా తెలివిగలవాడివిరా నువ్వు. నీ తమ్ముడికి తెలిసినంతా నీ విద్య నీకూ తెలుసు. ఎవరు గొప్పవారో చెప్పలేకపోతున్నాను ” అన్నాడు తండ్రి.
మూడోవాడు ” నేనూ కాస్త చూపించనీ నాన్నా ” అంటుండగానే వాన కురవటం మొదలైంది. అతను కత్తి దూసివిసవిసా తన తలమీద తిప్పటం మొదలుపెట్టాడు. అది ఎంత వేగంగా చేయగలిగాడంటే ఒక్క చినుకు కూడా అతని మీద పడలేదు. వాన అంతకంతకూ పెద్దదయింది. చివరికి తగ్గుముఖం పట్టింది. అంతసేపూ అతను ఇంకా ఇంకా వేగంగా కత్తి తిప్పుతూనే ఉన్నాడు. వాన వెలిశాక, అప్పటిదాకా ఇంట్లో ఉంటే ఎంత పొడిగా ఉండవచ్చో అంత పొడిగా ఉన్నాడు.
అబ్బురంగా చూస్తూ ఉన్న తండ్రి అన్నాడు ” నువ్వే ముగ్గురిలో గొప్ప విద్య చూపావు. ఇల్లు నీకే ఇస్తున్నాను ”
అన్నలిద్దరూ కూడా అతని నేర్పు ఎక్కువదని ఒప్పుకున్నారు. అతన్ని మనస్ఫూర్తిగా మెచ్చుకున్నారు. అంతకుముందువరకూ ఏది జరగాలని కోరుకున్నాడో తీరా అది జరిగాక మూడోవాడికి అంత బాగా అనిపించలేదు. . అతను చెప్పాడు ” అన్నయ్యలూ, మీరు ఎక్కడికీ వెళ్ళద్దు. అందరం ఇక్కడే ఉందాం ”
వాళ్ళు ఉండిపోయారు. తమ వృత్తులలో చాలా నైపుణ్యం ఉన్నవారు కనుక ముగ్గురూ చాలా డబ్బు గడించగలిగారు. పెళ్ళిళ్ళు చేసుకుని పిల్లా పాపా కలిగాక ఆ ఇంటిమీదే మరో రెండు అంతస్థులు వేసుకుని జీవితాంతం సుఖసంతోషాలతో గడిపారు.

జర్మన్ జానపద కథ
సేకరణ -Andrew Lang

అనువాదం: మైథిలి అబ్బరాజు

Download PDF

9 Comments

 • కథ బాగుంది. ఇందులో కత్తిని వేగంగా తిప్పి ఒక్కచినుకు కూడా తనమీద పడకుండా చూసుకున్న వాడి కథ లాంటిదే మహాభారతం లో సహదేవుడి మీద ఉందిట. మా చిన్నప్పుడు మాకు మా అమ్మ చెప్పేది ఆ కథని!

 • alluri gouri lakshmi says:

  చక్కని సందేశం ఉన్న కధ…అందరికీ ఒక ఇల్లు చాలు కదా !..బావుంది madam !

 • alla srinivasarao says:

  చాల బావుంది. కలసి వుంటే – కలదు సుఖం అనే విషయాన్ని సందేశం రూపం లో అందించారు. ఉమ్మడి కుటుంబాలు – సుఖ జీవన సంకేతాలు కదండీ.

 • sraj42u says:

  thankyou

 • Hanumantha Rao K says:

  ఇంటి కోసం ముగ్గురు అన్నదమ్ములు తమ తమ విద్య లలో అరె తేరారు. తండ్రి ఉద్దేశ్యము కూడా అదే అయి వుంటుంది. విద్య కౌశలము తో పాటుగా అందరమూ కలసి ఉండాలనే గొప్ప ఆలోచన కలిగివున్న మూడోవ వాడే నిజముగా అర్హుడు

 • sitaram says:

  katha chala besugga undi. Manchi neethi telipay katha. Annadammula Sayogyata ga untay chala bavundi. iday ummadi kutumbam.

 • r.ratnakar reddy says:

  కథ బాగుంది ..

 • r.ratnakar reddy says:

  పాత కతలు బొర్ కొట్టినయి.ఈ కత ఎవరికైనా చెప్పడానికి పనికస్తుంది.సందేశం నచ్చింది..

 • Suresh says:

  భలే ఉందండి. ఇలాంటి చందమామ కథలు మా జనరేషన్ తో నే ఆగిపోయినట్లున్నాయి. ఇవ్వన్నీ కలిపి ఒక పుస్తకంలా అచ్చు వేయిస్తే…ఈ జనరేషన్ కి ఒక కానుక ఇచ్చినట్లు అవుతుంది.

ఒక వ్యాఖ్యను

Your email address will not be published. Required fields are marked *

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)