పేద్రో పారమొ-2

pedro1-1

“నేను ఎదువిజస్ ద్యాడని. రా లోపలికి.”

ఆమె నాకోసం ఎదురు చూస్తున్నట్టుగా ఉంది. అంతా సిద్ధంగా ఉంది అని చెప్పి, నన్ను వెంట రమ్మని సైగ చేస్తూ వరసగా ఖాళీగా కనిపిస్తున్న చీకటి గదులగుండా తీసుకు వెళ్ళింది. కానీ అవి ఖాళీవి కాదు. ఆ చీకటికీ, వెన్నంటే వస్తున్న సన్నపాటి వెలుగుకీ అలవాటు పడ్డాక రెండు వైపులా కనిపించిన నీడలు చూశాక భారీ ఆకారాల మధ్య సన్నటి దారిగుండా వెళుతున్నట్లు తెలిసింది.
“ఏమిటివన్నీ?” అడిగాను.
“చిల్లరమల్లర సామాన్లు” ఆమె చెప్పింది. మా ఇంటి నిండా వాళ్ళూ వీళ్ళూ వదిలేసి వెళ్ళినవే. జనాలు వెళ్ళిపోతూ వాళ్ల వస్తువులన్నీ ఇక్కడ పెట్టుకున్నారు కానీ తిరిగి తీసుకువెళ్ళడానికి ఒక్కరూ రాలేదు. నీకోసం అట్టిపెట్టిన గది ఈ వెనకాల ఉంది. ఎవరయినా వస్తారేమోనని శుభ్రం చేసి ఉంచుతాను. అయితే నువ్వు ఆమె కొడుకువా?”
“ఎవరి కొడుకుని?” నేను అడిగాను.
“డలొరీటాస్ వాళ్ళ అబ్బాయివి కాదూ?”
“అవును. కానీ నీకెలా తెలుసు?”
“నువ్వొస్తావని చెప్పిందామె. నిజానికి ఇవాళే చెప్పింది. ఈ రోజే నువ్వొస్తావని.”
“ఎవరు చెప్పారు నీకు? మా అమ్మా?”
“అవును. మీ అమ్మే.”
ఏమనుకోవాలో నాకు తెలియలేదు. ఏమనుకోవడానికీ నాకు సమయమీయలేదు ఎదువిజస్.
“ఇదే నీ గది,” చెప్పిందామె.
ఆ గదికి వేరే వాకిళ్ళేమీ లేవు మేమొచ్చింది తప్పించి. ఆమె కొవ్వొత్తి వెలిగించింది. గదంతా ఖాళీగా ఉన్నట్టు తెలిసింది.
“పడుకోవడానికి ఏమీ లేదు,” చెప్పాను.
“దాని సంగతి వదిలెయ్. ప్రయాణం చేసి అలసిపోయి ఉన్నావు, అలసటకంటే మంచి పక్క ఉండదు. పొద్దున్నే నీకు మంచం ఏర్పాటు చేస్తాను. అన్నీ క్షణంలో ఏర్పాటు చేయగలనని అనుకుంటే ఎలా? కొంచెం ముందుగా చెప్పాలా? ఇంతకుముదు మీ అమ్మ చెప్పిందాకా నాకు కబురే లేకపోయె!”
“మా అమ్మా? మా అమ్మ చనిపోయింది.” చెప్పాను.
“ఓహో అందుకా ఆమె గొంతు అంత పీలగా వినిపిస్తూంది ఎంతో దూరం నుంచి వచ్చినట్టు! ఇప్పుడర్థమవుతూంది. ఇంతకీ ఎప్పుడు చనిపోయింది?”
“వారం క్రితం.”
“పాపం పిచ్చిది. నేనామెను వదిలేశాననుకుని ఉంటుంది. కలిసి చనిపోదామని ప్రమాణం చేసుకున్నాము. చేతిలో చేయి వేసుకుని చివరి ప్రయాణంలో ఏదయినా అవసరం పడినా లేక ఏదన్నా చిక్కు వచ్చిపడినా ఒకరికొకరం ధైర్యం చెప్పుకుంటూ. మేం ప్రాణస్నేహితులం. నాగురించి ఆమె చెప్పలేదా ఎప్పుడూ?”
“లేదు. అసల్లేదు.”

rulfo

హువాన్ రుల్ఫో

“వింతగా ఉంది. మేమప్పుడు చిన్నపిల్లలమనుకో. ఆమెకి అప్పుడే పెళ్ళయింది. ఒకరంటే ఒకరికి చాలా ఇష్టమూ, ప్రేమా. ఆమె ఎంతో చక్కగా ఉండేది, ఆఁ.. ఎంత చూడ ముచ్చటగా ఉండేదంటే ఆమెను ప్రేమించే వారు చాలా సంతోషపడేంత. ఎవరయినా ఆమెను ప్రేమించాలని కోరుకుంటారు. అయితే నాకంటే ముందే పోయిందన్నమాట. సరే, తొందరలోనే ఆమెను అందుకుంటాలే. స్వర్గమెంత దూరమో నాకంటే ఎవరికీ తెలియదు. అడ్డదారులూ తెలుసు నాకు. కిటుకేమిటంటే దేవుడి దయవల్ల వాడు తలిచినప్పుడు కాకుండా నువు కావాలనుకున్నప్పుడు పోవడం. లేకపోతే నీకు రోజులు మూడకముందే తీసుకెళ్ళమని వాడిని బలవంతపెట్టడం. మనమేదో పాత నేస్తాలమయినట్టు ఇట్లా మాట్లాడుతున్నానేమిటాని అనుకోకు, నువు నా సొంతబిడ్డ లాంటి వాడివే. అవును, వేయి సార్లు చెప్పాను: ‘డలోరిస్ వాళ్ల అబ్బాయి నా కొడుకయి ఉండాల్సింది!’ అని. ఎందుకో ఇంకెప్పుడన్నా చెబుతా. నేనిప్పుడు చెప్పదలుచుకున్నదల్లా మీ అమ్మను పైకెళ్ళే దారిలో ఎక్కడో అందుకుంటాను.”
ఆమెకి తిక్కేమోనని అనుమానమేసింది. కానీ అప్పటికే నేనేమీ ఆలోచించడం లేదు. నేనేదో సుదూర లోకంలో ఉన్నట్టు అనిపించింది. ఆ ప్రవాహంలో నన్ను నేను కొట్టుకుపోనిచ్చాను. మరింత బలహీనమవుతున్న నా శరీరం పూర్తిగా లొంగిపోయింది; ముళ్ళన్నీ జారిపోయి ఎవరయినా బొమ్మలాగా పిండేయగలిగేట్టు.
“నేనలసిపోయాను” చెప్పాను.
“రా వచ్చి కాస్త తిని పడుకో. ఒక ముద్ద. ఉన్నదేదో అదే.”
“వస్తా. తర్వాత వస్తా.”

కప్పు మీద పెంకుల్నుంచి జారుతున్న వాన నీళ్ళు పంచలోని ఇసుకలో గుంటలు చేస్తున్నాయి.

చుక్! చుక్! మళ్ళీ ఇంకో చుక్!

ఇటుకల మధ్య చిక్కుకుని గాలికి ఊగుతూ నృత్యం చేస్తున్న లారెల్ ఆకు మీద నీటి చుక్కలు పడుతుంటే. తుఫాను వెలిసింది. ఉండుండి వీస్తున్న పిల్లగాలి దానిమ్మ చెట్టు కొమ్మల్ని ఊపి మెరిసే చుక్కలని కింద చిమ్ముతూంది. అవి నేలలోకి ఇంకుతూ కాంతిని కోల్పోతున్నాయి. ఇంకా గూళ్ళలో ముడుచుకుని ఉన్న కోళ్ళు ఒక్కసారిగా రెక్కలు విసురుకుంటూ పంచలోకి వచ్చాయి తలలూపుకుంటూ వానకి బయటపడ్డ పురుగుల్ని ఏరుకుతింటూ. మబ్బులు చెదురుతుంటే సూర్యుడూ బయటికిచ్చాడు రాళ్ళ మీద మెరుస్తూ, కాంతి వలయాల్ని పరుస్తూ, నేలనుంచి నీటిని పీలుస్తూ, పిల్లగాలికి ఊగే ఆకులపై మెరుస్తూ.
“అంతసేపు ఏం చేస్తున్నావురా దొడ్లో?”
“ఏం లేదమ్మా!”
“అట్లాగే కూచో! పామొచ్చి పీకుతుంది!”
“సరేనమ్మా!”
నీ గురించే ఆలోచిస్తున్నా సుజానా. పచ్చటి కొండల గురించీ. గాలులు వీచే కాలంలో మనం ఎగరేసిన గాలిపటాల గురించీ. కింద ఊరినుంచి జనసందోహపు చప్పుళ్ళు వినిపించేవి; మనం ఎక్కడో కొండ మీద గాలికి అనువుగా దారం వదులుతూ. “సాయం చేయి సుజానా!” మెత్తటి చేతులు నా చేతులపై బిగుసుకుంటూ. “ఇంకొంచెం దారం వదులు.”
గాలి మనల్ని నవ్వించింది; గాలికి మన చేతివేళ్ళ మధ్యనుండి జారిపోతున్న దారం వెంబడి మన కళ్ళు పరుగెత్తి చివరికి చిటుక్కున తెగి ఏ పిట్ట రెక్కలకో తగులుకున్నట్టు. ఆ కాగితపు పిట్ట దాని తోక వెంబడే అంతెత్తునుండి గిరికీలు కొట్టుకుంటూ, మొగ్గలు వేస్తూ పచ్చటి నేలలోకి మాయమవుతుంది.
నీ పెదాలు తడిగా ఉన్నాయి మంచు ముద్దు పెట్టుకున్నట్టు.
“ఒరేయ్, నీకు చెప్పానా ఆ దొడ్లోంచి బయటికి రమ్మని!”
“సరేనమ్మా! వస్తున్నాను.”
నీగురించి ఆలోచిస్తున్నాను. నీ నీలాల కళ్ళతో నువు నన్నే చూస్తున్న సమయాల గురించి.
అతను తల పైకెత్తి వాకిట్లో వాళ్ళమ్మను చూశాడు.
“ఇంతసేపు ఏమిటి లోపల? ఏం చేస్తున్నావక్కడ?”
“ఆలోచిస్తున్నాను.”
“ఇక్కడే కుదిరిందా? దొడ్లో ఇంతసేపు ఉండటం మంచిది కాదు. ఇంకా చేయాల్సిన పనులు కూడా ఉన్నాయాయె. పోయి మొక్కజొన్నలు వొలవడానికి మీ నాయనమ్మకు సాయం చేయొచ్చుగా?”
“వెళ్తున్నానమ్మా. వెళుతున్నా.”

 

“నాయనమ్మా! జొన్నలు వొలవడానికి నీకు తోడొచ్చా.”

“ఆ పని అయిందిలే గానీ ఇంకా చాకొలేట్ నూరాలి.ఎక్కడికి పోయావు నువ్వు? గాలివాన వచ్చినప్పుడు నీకోసం వెతికాము.”
“నేను వెనక పంచలో ఉన్నా.”
“అక్కడేం చేస్తున్నావు? జపం చేస్తున్నావా?”
“లేదు నాయనమ్మా. ఊరికే వానని చూస్తున్నా.”
అతని నాయనమ్మ సగం పసుపూ, సగం బూడిద రంగులో ఉన్న కళ్ళతో అతని వంక చూసింది చదివేయగలిగినట్టు.
“సరే, పోయి మిల్లు శుభ్రం చేయి.”
మబ్బులపై వందల అడుగుల ఎత్తున, అన్నిటికీ ఎంతెంతో ఎత్తున నువు దాగున్నావు సుజానా. బ్రహ్మాండం ఆవల, ఏ దైవ కటాక్షం వెనకో దాగున్నావు. నేను తాకలేని, చూడలేని చోట, నా మాటైనా నీదరికి చేరని చోట.
“మిల్లు పనికిరాదు నాయనమ్మా. గ్రైండరు పగిలిపోయింది”
” ఆ మికయేలా మళ్ళీ అందులో జొన్నలేసినట్టుంది. ఎన్ని సార్లు చెప్పినా దాని అలవాటు మానిపించలేము. ఇప్పుడింకేం చేస్తాం!.”
“కొత్తది కొనొచ్చుగా? ఇది ఎటూ పాతబడి అరిగిపోయిందిగదా!”
“నిజమే. మీతాత ఖననానికయిన ఖర్చుతోటీ, చర్చికి డబ్బులు కట్టాల్సివచ్చీ చేతిలో పైసా లేదు. సరేలే, ఏదో ఒకటి మానుకుని అన్నా కొత్తది కొందాంలే. నువు ఆ దోన ఈనెస్ వీయల్పాండో దగ్గరికి పోయి అక్టోబర్ దాకా ఖాతా పెట్టుకోమని చెప్పు. కోతలయ్యాక చెల్లు వేద్దాం.”
“సరే నాయనమ్మా.”
“ఎటూ పోతున్నావుగా, పనిలో పని జల్లెడా, కత్తెరా అరువు తీసుకురా. గడ్డి ఆవజాన పెరిగిపోతూ ఉంది. వదిలేస్తే మన వొంటిమీదికి కూడా పాకుతుంది. ఆ పాత పెద్ద ఇల్లయితే ఏమీ అనకపోదును. ఈ ఇంటికి మారినప్పుడు మీతాత చూసుకున్నాడదంతా. అంతా ఆ దేవుడి లీల. అన్నీ మనం అనుకున్నట్టు జరుగుతాయా? దోన ఈనెస్ కి చెప్పు కోతలు కాగానే బాకీ అంతా తీరుస్తామని.”
“సరే నాయనమ్మా.”
హమ్మింగ్ పిట్టలు. వాటి కాలమిది. విరగబూసిన మల్లె పొదలో వాటి రెక్కల చప్పుడు విన్నాడతను.
పవిత్ర హృదయం బొమ్మ పెట్టిన అలమరదగ్గర ఆగి చూస్తే ఇరవై నాలుగు సెంటావోలు కనిపించాయి. నాలుగు సెంటావోలు వదిలేసి ఒక వెయింటె తీసుకున్నాడు.
అతను వెళ్ళబోతుంటే అతని తల్లి ఆపింది.
“ఎక్కడికి వెళుతున్నావు?”
“దోన ఈనెస్ వీయల్పాండో వాళ్ల ఇంటికి, కొత్త మిల్లు కొనడానికి. మనది పాడయిపోయింది.”
“ఒక మీటర్ సిల్క్ గుడ్డ పట్టుకురా, ఇట్లాంటిది,” అని ఒక ముక్క ఇచ్చింది. “మన ఖాతాలో రాసుకోమను.”
“సరేనమ్మా.”
“వచ్చేప్పుడు నాకు యాస్పిరిన్ తీసుకురా. హాల్లో పూలకుండీలో డబ్బులుంటాయి చూడు.”
అతనికి ఒక పేసో కనిపించింది. వెయింటె వదిలేసి పెద్ద నాణెం తీసుకున్నాడు. “ఇప్పుడు ఏదయినా కనిపిస్తే సరిపోయేంత డబ్బుంది” అనుకున్నాడు.
“పేద్రో,” జనాలు పిలిచారతన్ని. “వోయ్ పేద్రో!”
అతను వినిపించుకోలేదు. అతను చాలా చాలా దూరం వెళ్ళిపోయాడు.

 

రాత్రి మళ్ళీ వాన మొదలయింది.

చాలాసేపు అతను జలజల పారే వాన నీటి శబ్దం వింటూ పడుకున్నాడు. ఎప్పుడో నిద్రపట్టి ఉండాలి. లేచేప్పటికి అతనికి చప్పుడులేని జల్లు పడటమే వినిపించింది.
కిటికీ అద్దాలపైన పొగమంచు అలుముకుని వానచినుకులు కన్నీటి దారం కడుతూ జారుతున్నాయి….మెరుపు కాంతిలో వెలుగుతున్న ఆ ధారల్ని చూచాను. ప్రతి నిశ్వాసమూ నిట్టూర్పు అవుతూంది. ప్రతి ఆలోచనా నీగురించే కలుగుతుంది, సుజానా.
వాన గాలిగా మారింది. అతనికి వినిపిస్తూంది “..పాపాలకు క్షమాపణా, దేహానికి పునరుథ్థానం. తథాస్తు.” అది ఇంటి లోలోపల ఆడవాళ్ళు జపమాల చివరి పూసను లెక్కిస్తున్న చోట. వాళ్ళు పూజలనించి లేచారు, కోళ్ళను గూళ్ళలో పెట్టారు, తలుపులకు గొళ్ళెలు పెట్టారు, దీపాలార్పారు.
ఇప్పుడు రాత్రి వెలుగు మాత్రమే ఉంది. వాన కీచురాళ్ళ సొదలా బుస పెడుతూ ఉంది.
“నువ్వొచ్చి జపమాల పట్టుకుని కూచోలేదు ఎందుకని? మీ తాత కోసం నొవేనా (ప్రత్యేక ప్రార్థన) చేస్తున్నాము.”
చేతిలో కొవ్వొత్తి పట్టుకుని వాకిట్లో వాళ్ళమ్మ నిలుచుని ఉంది. ఆమె పొడవాటి వంకరటింకర నీడ కప్పుమీదికి పాకుతూంది. పైన వాసాలు దాన్ని తెగగొడుతూ ఉన్నాయి.
“నాకు దిగులుగా ఉంది.” చెప్పాడు.
ఆమె అటు తిరిగింది. కొవ్వొత్తిని మలిపింది. తలుపు మూస్తూనే ఆమె వెక్కి వెక్కి ఏడవడం మొదలయింది. వాన చప్పుడుతో కలిసిన దాన్ని అతను చాలాసేపు వింటూ ఉండిపోయాడు.
చర్చి గంట గంటలు కొట్టింది, గంట తర్వాత గంట, గంట తర్వాత గంటా, కాలం కుంచించుకుపోతున్నట్టుగా.

 

“అవునవును. నేను నీ తల్లిని కావడం కొద్దిలో తప్పిపోయింది. ఆమె దాని గురించి నీకు ఏమీ చెప్పలేదా?”

“లేదు, ఆమె నాకన్నీ మంచి కబుర్లే చెప్పింది. నీ గురించి నేను కంచర గాడిదలతని ద్వారా వినడమే. నాకిక్కడికి దారి తనే చూపించించాడు. అబుందియో అతని పేరు.”
“మంచివాడే ఆ అబుందియో. అయితే అతనికి నేనింకా గుర్తున్నానన్న మాట. మా ఇంటికి పంపిన ప్రతి గిరాకీకి ఏదో కొంచెం ఇచ్చేదాన్ని. ఇద్దరికీ బేరం బాగా కుదిరింది. ఇప్పుడు తలుచుకుంటే బాధే కానీ, రోజులు మారిపోయాయి. ఊరు పాడయినకాడి నుంచీ కబురు తెచ్చేవారే లేరు. అయితే అతను చెప్పాడా నీకు నా దగ్గరికి పొమ్మని?”
“అవును, నీకోసం చూడమని చెప్పాడు.”
“దానికి అతనికెప్పుడూ ఋణపడి ఉంటాను. అతను మంచివాడు, నమ్మకస్తుడు. అతనే ఊళ్ళోకి తపాలా తెస్తుండేవాడు, చెవిటి వాడయ్యాక కూడా. అది జరిగిన పాడు రోజు నాకింకా గుర్తుంది. అందరికీ అతనంటే ఇష్టం కనక అందరూ బాధపడ్డారు. మాకు ఉత్తరాలు తెచ్చి ఇచ్చి మావి తీసుకుపోయేవాడు. అవతలి ప్రపంచంలో ఏం జరుగుతుందో మాకు ఎప్పుడూ చెపుతూండేవాడు, తప్పకుండా వాళ్ళకి మేమెట్లా ఉన్నామో చెపుతూ ఉండే ఉండాలి. వొట్టి కబుర్ల పోగు. ఆ తర్వాత మాత్రం కాదులే. అప్పుడు మాట్లాడడమే మానేశాడు. అతను వినని మాటలూ, గాలిలో ఆవిరయ్యే మాటలూ, రుచి తగలని మాటలూ చెప్పేం లాభమనేవాడు.నీటి పాముల్ని బెదరగొట్టడానికి మేము వదిలిన రాకెట్ అతని తలకి మరీ దగ్గరగా పోయినప్పుడు జరిగిందదంతా. మాట పడిపోకపోయినా ఆ రోజు నుంచీ అతను నోరు విప్పలేదు. ఒక్కమాట మాత్రం చెప్పుకోవాలి, అందుమూలాన అతను చెడ్డవాడయిందేమీ లేదు.”
“నేను మాట్లాడినతనికి బాగానే వినిపిస్తుంది”
“అయితే అతనయి ఉండడు. అదీకాక, అబుందియో చనిపోయాడు. చచ్చిపోయాడనే నా నమ్మకం. అర్థమయిందా, అందువల్ల అది అతనయి ఉండడు.”
“నువు చెప్పింది నిజమే అయ్యుండొచ్చు.”
“సరే, ఇక మీ అమ్మ సంగతికొస్తే ఇందాక చెపుతున్నట్టు….”
ఆ నస వింటూ, నా ముందున్న ఆమెని పరిశీలించాను. జీవితంలో ఎన్నో కష్టాలు చవిచూసినట్లుంది. మొహం పారదర్శకంగా నెత్తురంతా తోడేసినట్టూ, చేతులు ముడుచుకుపోయి ముడతలుపడీ ఉన్నాయి. కళ్ళు లోపలికిపోయి కనపడటమే లేదు. ఆమె కుచ్చులు పెట్టిన పాతకాలపు తెల్ల డ్రస్ వేసుకుని మెడలో దారానికి “పాపులకు రక్ష” అని రాసున్న మరియా సంతీసిమా పతకం ధరించి ఉంది.

(సశేషం)

(మళ్ళీ వచ్చే గురువారం)

Download PDF

ఒక వ్యాఖ్యను

Your email address will not be published. Required fields are marked *

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)