కా. రా మాస్టారి కథలు చెప్పే జీవితప్పాఠాలు..

నిర్వహణ: రమా సుందరి బత్తుల

karalogo

నిర్వహణ: రమాసుందరి బత్తుల

 

సమాజ గమనంలోని అంతర సూత్రాలు, దాని పొరల్లోని నిత్యయుద్ధాలను సూక్ష్మంగా గ్రహించగలిగిన వ్యక్తి, తన గ్రహింపును వీలైనంత సరళంగా పాఠకులకు అర్ధం చేయించగలిగితే అతడే జనం గుర్తు పెట్టుకొనే సాహితీకారుడు అవుతాడు. ఇక్కడ రచయిత బతికిన కాలాన్ని పరిగణనలోకి తీసుకోకపోతే తప్పు నిర్ధారణ చేసినట్లవుతుంది. ఆ కాలంలో, ఆ ప్రాంతాన్ని ఆవహించిన సంక్షోభాలు, రణాలు అతని వ్యక్తిత్వం మీద, రచనల మీద తప్పక ప్రభావం చూపుతాయి.

మధ్యతరగతి బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన కాళీపట్నం రామారావు మాష్టారి సాహితీ ప్రయాణం ఆ పరిమితిని శైశవ దశలోనే దాటి సామాజికోద్రేకాలను అద్దుకొంటూ సాగి, ఆనాడు ఉత్తరాంధ్రలోని కొనసాగుతున్న ఉద్యమాలకు అనుసంధానమయ్యి పరిపక్వతను సంతరించుకొంది.

“మధ్యతరగతి మానసిక రుగ్మతలను ఎక్కువ చేసి చూపించిన” కధలుగా ఆయనే స్వయంగా చెప్పుకొన్న 48-55 మధ్య కధల్లో కూడా అంతర్లీనంగా ప్రాభవం కోల్పోతున్న బ్రాహ్మణ మధ్య తరగతి కుటుంబాల బంధాలను శాసిస్తున్న ఆర్ధిక సంబంధాల విశ్లేషణ ఉంది. ఈ కాలంలో ఈయన రాసిన “పెంపకపు  మమకారం”, “అభిమానాలు” లాంటి కధలలో ఆయన బీజ రూపంలో తడిమిన అంశాలు తరువాత కాలంలో ఆయన రాసిన కధల్లో వేయి ఊడల మహా వృక్షాల్లాగా విజృంభించాయి.

62-72 మధ్య కాలంలో ఉత్తరాంధ్రలో వచ్చిన ఉడుకు రామారావు గారి కలాన్ని పదును పెట్టినట్లుగా తోస్తుంది. ఉద్యమాలు ఈ కలాన్ని ఆవహించాయా లేక ఇలాంటి కధలు ఉద్యమాలను ఉత్తేజపరిచాయా అన్నంతగా పెనవేసుకొని ఆయన సాహిత్యప్రయాణం సాగినట్లు అనిపిస్తుంది. ఈ కాలంలో ఈయన రాసిన కధల్లో గాఢత బాగా చిక్కబడింది. వ్యక్తి నుండి వ్యవస్థకు ఈయన సాహిత్య ప్రయాణం ఈ కాలంలోనే జరిగింది. ‘ఆదివారం’, ‘చావు’, ‘ఆర్తి’, ‘కుట్ర’, ‘శాంతి’, ‘జీవధార’, ‘భయం’, ‘నో రూమ్’ కధలు ఈ కాలంలోనే వెలువడ్డాయి.

రామారావుగారి కధల్లో ఎక్కువ కధల ముగింపులు పరిష్కారాన్ని ప్రత్యక్షంగా సూచించవు. పరిష్కారం చెప్పక పోయినా సమాజంలో ఉన్న దరిద్రం, ఆకలి ఇంకా చాలా సామాజిక రుగ్మతల పట్ల ద్వేషాన్ని కలిగించే పని చేయటం ప్రజా సాహిత్యకారుల కనీస కర్తవ్యం. కధలకు ఉండాల్సిన ఈ సామాజిక ప్రయోజనం కారాగారి చివరి కధల్లో వంద శాతం నెరవేరిందని నిర్ద్వంద్వం గా చెప్పవచ్చు. తమవి కాని జీవితాల్లోకి వెళ్ళి కధను పండించటం అంత చిన్న విషయమేమీ కాదు. రచయితలు డీక్లాసిఫై అవ్వాలని ఆ నాడు విరసం ఇచ్చిన పిలుపును స్వాగతించారు రామారావుగారు.

72 తరువాత ఆయన కధలు రాయటం మానేశారు. (92 లో సంకల్పం కధ రాశారు) ఎందుకు రాయలేదు అన్న ప్రశ్నకు ఒక దగ్గర “వూరికే కధ రాయటం ఎంతసేపు? కానీ ప్రయోజనం ఏమిటి? అని ప్రశ్నించుకొంటే అలవోకగా రాయలేక పోతున్నాను” అన్నారు. పదుల్లో గొప్ప కధలు రాసిన వ్యక్తికి కలం సాగక పోవటానికి చాలా సహేతుకమైన సందిగ్ధత ఇది. ప్రయోజనం లేని బఠానీ కధలు రాయలేక పోవటం వలన, వర్తమాన సమాజంలోని రాజకీయ సంక్లిష్టతను సరిగ్గా అర్ధం చేసుకోలేక పోవటం వలన .. ప్రజల కోసం నిజాయితీగా రాయాలనుకొన్న రచయితలు అందరూ ఎక్కడో అక్కడ ఆగిపోయే పరిస్థితే సహజమే అయినప్పటికీ ఈ విరామం సుధీర్ఘం. అయితే ఆయన కాలం కంటే కూడా ముందుకు వెళ్ళి తన చుట్టూ ఆవహించిన సమాజాన్ని అంచనా వేయగలిగారు అనిపిస్తుంది. చూసిన సంఘటనల నుండి తనకు గల స్థిరమైన ప్రాపంచిక దృక్పధం వలన కలిగే చైతన్యం.. ఆ చైతన్యం అంతస్సారంగా స్రవించిన కధలివి. పాత్రల నమూనాల్లోనూ, సంఘటనల్లోనూ, ఆలోచనా రీతుల్లోనూ, వైరుధ్యాల్లోనూ, ఘర్షణలలోనూ ఆయన కలం ఇప్పటి పరిస్థితులకు సారూప్యత ఉన్న సృజనను అందించింది. అది ఆనాటి తరానికే కాదు, ఈ తరం చదువరుల వ్యక్తిత్వ నిర్మాణానికి కూడా రక్తమాంసాలు ఇచ్చిందని అనటానికి ఏ మాత్రం సందేహించనవసరం లేదు. తరువాత ఇంకొన్ని తరాల రచనల మీద ఈయన ముద్ర గాఢంగా పడింది.

రామారావు గారి కధలకు పరిచయం రాయమని నేను అడిగిన ప్రతి రచయిత, రచయిత్రి వెంటనే సంతోషంగా ఒప్పుకొన్నారు. కాళీపట్నం రామారావు గారి కధలకు ఇప్పుడు మళ్ళీ పరిచయం అవసరమా అనే ప్రశ్న సహజం. ఈ నవంబర్ లో తొంభైయ్యవ పుట్టిన రోజు జరుపుకొంటున్న కా.రా గారి కధలను మళ్ళీ ఒక సారి మననం చేసుకోవడం పాత తరానికి సంతోషకరంగానూ, కొత్త తరానికి ఉపయుక్తంగానూ ఉంటుందని భావిస్తూ ఈ శీర్షిక మొదలు పెడుతున్నాము. నేటికీ సమకాలీనం, సార్వజనీయం అయిన ఈ కధాంశాలను ఈ తరం పాఠకులకు అందించే ముందు సీనియర్ రచయిత(త్రు)లు ‘ఆ పాత మధురాల’ నెమరివేత, కొత్త రచయిత(త్రు)లు కారాగారి తాత్వికతను అర్ధం చేసుకొన్న ఇష్టం.. కలగలిపి పాఠకులకు అందించాలనేదే ఈ ప్రయత్నం.

ramasundari

ఎడిటర్ నోట్

ఈ శీర్షికని నిర్వహిస్తున్నందుకు రమాసుందరి గారికి ‘సారంగ’ కృతజ్ఞతలు. ఈ శీర్షికకి మీ  వ్యాసాలు నేరుగా రమాసుందరి గారికి manavi.battula303@gmail.com పంపండి. ఒక కాపీ సారంగ ఈమెయిలు కి కూడా పెట్టండి.

Download PDF

16 Comments

  • kurmanath says:

    ఇది చాలా మంచి ప్రయత్నం. సారంగ టీం కీ, రమ గారికీ అభినందనలు. చాలా గొప్ప కథకులలో ఒకరు మాష్టారు. ఆర్తి, కుట్ర, యజ్ఞం లాటి కథలు జీవితంలోని హింసని చాల గొప్పగా చిత్రీకరిస్తాయి. కొత్త తరానికి, ముఖ్యంగా ఆన్ లైన్ లోనే పుట్టిన కొత్త సాహిత్య తరానికి ఇది చాలా ఉపయోగకరం.

    సంకల్పం ఆయన చివరి కదా కాదండీ. అది రాసిన చాలా కాలం తర్వాత ‘అన్నేమ్మనాయురాలు’ అనే కథ రాసారు. ఇది శ్రీకాకుళ సాహితి వారు వేసిన సంకలనంలో వుంది. ఒక అర్ధంలో సంకల్పం చివరి కధే. అన్నేమ్మ నాయురాలు కాదా పూర్తిగా వాచ్యం అయిపోయి, అసంపర్నూం అయిపోయి నాలాటి కొందరు అభిమానుల్ని నిరాశపరిచింది.

  • ‘అన్నెమ్మ నాయురాలు ‘ కధను నేను ఆయన జీవితంలో ఒక అనుభవంగా గుర్తుపెట్టుకొన్నాను. ఎలా ఉన్నా అదే ఆయన చివరి కధ (ఇప్పటి వరకు) అవుతుంది. పొరపాటుకు క్షమాపణలు.

  • రమణమూర్తి says:

    మంచి ప్రయత్నం, రమాసుందరి గారూ! శుభాకాంక్షలు!

  • raghava says:

    ఆసక్తి గా ఎదురు చూస్తూ….

  • Sadlapalle Chidambara Reddy says:

    కారా గారిని మళ్లీ మాముందుకు తెస్తున్నందుకు ధన్యవాదాలు.నాకథలు చదివినపుడల్లా-సీమపల్లెల జీవితాల్ని మాండలికంలో నవలగా రాయమనివారు ఫోన్ చేసి చెప్పడం జరిగింది.ఒకట్రెండు సార్లు ప్రయత్నించి నే చెప్పాల్సిన సమస్యలకు పాత్రలను సృస్టించలేక మానుకొన్నాను కూడా..ఈతరానికి వారిరచనలు చాలా అవసరం .

  • Jagadeeshwar Reddy Gorusu says:

    మంచి ప్రయత్నం . అయితే ఈ కారా మాష్టారు కథల పరిచయం నవంబర్ మొదటివారం లో వస్తే బాగుండేది . పరిచయానికి అన్వర్ బొమ్మ చాలా బాగుంది . బొమ్మ చూడ గానే (పక్కన కారా గారి బొమ్మ లేకపోయినా సరే ) వెంటనే యజ్ఞం కథ తో పాటు కారా మాష్టారు కళ్ళముందు నిలుస్తారు. అది అన్వర్ గొప్పదనం. కథ కయినా, కవిత కయినా , పరిచయం , వ్యాసం … దేనికయినా మంచి బొమ్మ అనేది బంగారానికి తావి అబ్బడమే. ఇప్పుడు మనకున్న అతి కొద్ది మంది ( కథలకు బొమ్మలేసే) చిత్రకారుల్లో అన్వర్ ముందువరసలో ఉంటారు … అభినందనలు అన్వర్ .

  • నిజంగా ఇది అవసరమైన ప్రయత్నం. ఆ రోజునాటికి పుస్తక రూపంలో వస్తే ఇంకా బాగుంటుంది. సుమారుగా ఏడు దశాబ్ధాల తెలుగు కథా ప్రయాణం మనముందు ఉంటుంది. అభినందనలతో..

  • Radha says:

    మనం మరోసారి మన పాత తరం రచయితలందరి కథలూ చదువుకోవలసిన అవసరం వచ్చింది. ఇది అభినందనీయమైన, అవసరమైన ప్రయత్నం… నేను ఆ ఉద్దేశం తోనే కొడవటిగంటి కథలు పరిచయం చేయాలని సారంగ పాఠకులకు రెండు కథలు పరిచయం చేశాను. కొన్ని పత్రికలు సమీక్షలు లాంటివేమీ లేకుండా కథలని పబ్లిష్ చేస్తున్నారు. అయితే అప్పట్లో వారు రాసిన కథలని మనం ఎలా మన జీవితాలకి అన్వయించుకుంటున్నాం, మన దృష్టి కోణం ఆ కథల పట్ల ఎలా ఉంది అని తెలుసుకోవడానికి విశ్లేషణలు అవసరం. ఈ ప్రయత్నాన్ని చేపట్టిన రమాసుందరి గారికి, సారంగ పత్రికకి అభినందనలు, ధన్యవాదాలు.

  • ఈ ప్రయత్నాలు అందరి సహకారం అవసరం.

  • హింస, భయం, ఆదివారం, శాంతి, జీవధార, ఆర్తి, చావు, యజ్ఞం, సంకల్పం కధలకు ఇప్పటికే పరిచయాలు రాస్తున్నారు. కుట్ర, పెంచిన మమకారం, అభిమానాలు మొదలైన కధలకు పరిచయాలు రాయటానికి ఎవరైనా ముందుకు రావాలి.

  • Radha says:

    రమాసుందరి గారూ, నన్ను ‘పెంచిన మమకారం’ కి రాయమన్నారుగా…. చదువుతున్నాను. రాసి పంపిస్తాను మీకు.
    ఈ అవకాశం నాకు కల్పించినందుకు ధన్యవాదాలు.

  • రాధగారు, మీరు ప్రొసీడ్ అవ్వండి.

  • lakshmi.p.s. says:

    మీ ప్రయత్నం శ్లాఘనీయమ్

  • S. Narayanaswamy says:

    ఆసక్తికరమైన ప్రయత్నమండీ. ఇలాగే క్లాసిక్సన్నిటినీ కొత్త దృశ్టితో మళ్ళి మళ్ళీ రీ ఇమాజిన్ చేసుకోవలసిన అవసరం ఉంది.

Leave a Reply to lakshmi.p.s. Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)