చరిత్ర అద్దంలో ‘హిందుత్వ’

Kalluri Bhaskaram-pic-a.prabhakar rao (5)నేను ఇంతకు ముందు కూడా పలు సందర్భాలలో చెప్పాను…

వేల సంవత్సరాల గతం– కాలమూ, ప్రాంతమూ విధించిన హద్దులను దాటుకుంటూ మనం ఊహించని రీతిలో వర్తమానంలోకి ప్రవహిస్తూ ఉంటుంది. యూదుల గతం ఇందుకు ఇంకొక ఉదాహరణ.

యూదులు పురాచరిత్రలో/చరిత్రలో కనీసం మూడువేల అయిదువందల సంవత్సరాలుగా కనిపిస్తున్నారు. విశేషమేమిటంటే, వారు అంత సుదూరగతంలో ప్రపంచానికి అందించిన ఒక భావన, ఈ క్షణాన మనదేశంలో ఒక వర్గం నోట ఒక విలక్షణమైన వాదం వినిపించడానికి కారణమవుతోంది. ఆ వర్గం, హిందుత్వవాదులు. ఇది ఒకవిధంగా సున్నితమూ, వివాదాస్పద అంశమే కానీ, యూదుల గురించి చెప్పడానికి పూర్వరంగంలో ఆ అంశంలోకి వెళ్ళడం అనివార్యమవుతోంది. ఈ వ్యాసాలు అన్నింటిలో పాటిస్తున్నట్టే, చారిత్రక తటస్థతను పాటిస్తూ అందులోకి వెడతాను.

‘హిందూ’ అనేది ఒక ‘మతం’ కాదని పలు సందర్భాలలో హిందుత్వ సిద్ధాంత వాదులు నొక్కి చెప్పడం చూస్తూ ఉంటాం. హిందూ అనేది ‘ఒక జీవనవిధానం’ అని వారు అంటుంటారు. ఈమేరకు సుప్రీం కోర్టు ఇచ్చిన ఒక తీర్పును కూడా ఉటంకిస్తూ ఉంటారు. మతంగా కాకుండా, ఒక జీవనవిధానంగా ఉండడం ప్రపంచం మొత్తం మీద హిందువుల ప్రత్యేకతగా వారు ఉద్ఘాటిస్తూ ఉంటారు. ఈవిధంగా వారికి సంబంధించినంతవరకు ‘మతం’ అనే మాటకు, ‘జీవనవిధానం’ అనే మాట ప్రత్యామ్నాయపదంగా మారింది.

అయితే, చారిత్రక దృష్టితో చూసినప్పుడు, తమది ‘మతం’ కాదని వారు అనడంలో కొంత నిజం ఉంది, కొంత నిజం కానిది ఉంది. మతం అనే మాటను విశాలార్థంలో తీసుకున్నప్పుడు ఒకానొక ఆధ్యాత్మిక విశ్వాసాన్నీ, ఆరాధనా పద్ధతినీ అనుసరించేది ప్రతిదీ ఒక మతమే. ఆవిధంగా హిందూకు పూర్వరూపమైన వైదికం కూడా ఒక మతమే. బౌద్ధ, జైనాలను కూడా మతమనే అంటాం. అయితే, ఇవి క్రీస్తుపూర్వ కాలానికి చెందిన మతాలు. క్రీస్తుశకానికి దగ్గరగా, లేదా క్రీస్తుశకంలోకీ వస్తే, క్రైస్తవం, ఇస్లాం అనే రెండు మతాలు, ‘మతం’ అనే మాటను విశాలార్థం నుంచి తప్పించి; నేడు మన ఊహలో ఉన్న రూఢ్యర్థాన్ని లేదా పరిమితార్థాన్ని ఆ మాటకు ఇచ్చాయి. ఆ మతాల స్వభావం అందుకు అవకాశమిచ్చింది. ఎలాగంటే, అవి ఏకేశ్వర మతాలు! ఆ మతాలకు ఒక ప్రామాణిక పవిత్ర గ్రంథం ఉంటుంది.

ఇక్కడ యూదుల ప్రమేయం ఏమిటంటే, ఈ ఏకేశ్వర భావనను, పవిత్రగ్రంథ భావనను ప్రపంచానికి అందించినది వారే. అది కూడా క్రీస్తుపూర్వ కాలంలోనే. ఆవిధంగా మతం అనే మాటకు నేటి రూఢ్యర్థం యూదుల వల్ల వచ్చింది. క్రీస్తుపూర్వ కాలంలో వారు ప్రారంభించిన ఆ ప్రక్రియ క్రైస్తవంతోనూ, ఇస్లాంతోనూ ఒక కొలిక్కి వచ్చింది. అంతకంటే విశేషంగా అదే ప్రక్రియ, కాలాన్ని క్రీస్తుపూర్వంగానూ, క్రీస్తుశకంగానూ విభజించి కాలగణనానికి ఒక కొండగుర్తునూ ఇచ్చింది.

కనుక, ‘ఏకేశ్వర భావన కలిగి, ఒక ప్రామాణిక పవిత్రగ్రంథం ఉన్నదే మతం’ అనే రూఢ్యర్థంలో తీసుకున్నప్పుడు, తమది మతం కాదన్న హిందుత్వ వాదుల వాదనలో నిజం ఉంది. అలా కాకుండా, మతం అనే మాటను క్రీస్తుపూర్వపు విశాలార్థంలో తీసుకున్నప్పుడు వైదికమతంలానూ, బౌద్ధమతంలానూ హిందుత్వ కూడా ఒక మతమే అవుతుంది. ‘హిందూ’ అనేది ఒక మతం కాదనడంవల్ల ఇప్పుడు ఎలాంటి విచిత్ర పరిస్థితి ఏర్పడిందంటే, దానిని గుర్తించడానికి ఒక సరైన మాట లేకుండా పోయింది. చివరికి ‘హిందు’, ‘హిందుత్వ’అనే మాటలతో సరిపెట్టవలసివస్తోంది.

ఇంతకీ సారాంశం ఏమిటంటే, హిందూ అనేది మతం కాదని అనడంలో హిందుత్వ సిద్ధాంత వాదులు చెప్పకనే చెబుతున్నది, అది క్రైస్తవం లానూ, ఇస్లాంలానూ ఒక పవిత్ర గ్రంథం కలిగిన ఏకేశ్వరమతం కాదనే! అయితే ఆ మాట వారు స్పష్టంగా అనడం లేదు. హిందూ ఏకేశ్వరమతం కానప్పుడు సహజంగానే అది ‘బహుళేశ్వర మతం’ అవుతుంది. అప్పుడది ఏకేశ్వర, బహుళేశ్వర మత చర్చగా పరిణమిస్తుంది. కానీ, హిందుత్వ సిద్ధాంతవాదులు హిందూ అనేది బహుళేశ్వర మతం అని కూడా స్పష్టంగా అనడం లేదు. హిందూకు సంబంధించి మతం అనే భావననే తీసుకురావడానికి వారు ఇష్టపడడం లేదు. దానికి ప్రత్యామ్నాయంగా హిందూ ‘ఒక జీవన విధానం’ అనే మాటను ప్రచారంలోకి తెస్తున్నారు.

దానికి ఒక స్పష్టమైన నేపథ్యం ఉంది. అది, ‘మతతత్వం వర్సెస్ లౌకికవాదం’ అనే పేరిట చాలాకాలంగా జరుగుతున్న రాజకీయ చర్చ. తమది మతతత్వం అంటూ లౌకిక వాదులు అదే పనిగా దాడి చేస్తున్నారు కనుక, హిందూ ‘ఒక మతం’ అనే భావననే తోసిపుచ్చడం హిందుత్వ వాదులకు ఒకానొక వ్యూహంగా మారింది. మతం అనే భావననే నిరాకరించడమంటే, మతాలకు సంబంధించిన చరిత్రను, చర్చను కూడా నిరాకరించడమే. అప్పుడీ చర్చ మొత్తం అకడెమిక్ చర్చకు ఏమాత్రం సందివ్వని రాజకీయ వ్యూహాత్మక చర్చగా పరిణమిస్తుంది. ఇప్పుడు జరుగుతున్నది అదే.

హిందూ ‘ఒక జీవన విధానం’ అన్నప్పుడు కూడా దానికి ఒక స్పష్టమైన నిర్వచనం సాధ్యమా అన్న ప్రశ్న వస్తుంది. ప్రపంచంలోని ఏ ఇతర సమాజాలలోనూ, సంస్కృతులలోనూ లేని విలక్షణ జీవనవిధానం హిందువులకు మాత్రమే ఉందని– రెండు రెళ్ళు నాలుగు అన్నంత స్పష్టంగా నిరూపించనప్పుడు ఆ మాట కూడా బ్రహ్మపదార్థం లాంటి ఒక అనిర్వచనీయ భావనగానే మిగిలిపోతుంది.

 

***

చరిత్రలోకి వెడితే భిన్నదృశ్యం కనిపిస్తుంది. ‘ఒక మతం కాకపోవడం, ఒక జీవన విధానం కావడం’ అనేది హిందువుల ప్రత్యేకత అన్న వాదాన్ని మాటవరసకు అంగీకరిస్తే, అది ఒకప్పుడు దాదాపు ప్రపంచమంతటా ఉన్న ప్రత్యేకతే. ఒకింత వివరంగా చెప్పుకుంటే, ఆ ప్రత్యేకత ఇలా ఉంటుంది:

ఒకప్పుడు జనం ఒక దేవినో, దేవుడినో కాకుండా అనేకమంది దేవీ, దేవతలను పూజించేవారు. ఇది ‘బహుళ దైవారాధన’. దీనిని ఒకవిధమైన ‘ఆస్తిక ప్రజాస్వామ్యం’ అనచ్చు. వేరే దేవీ, దేవతలను పూజించేవారు ఒక ప్రాంతాన్ని జయించినప్పుడు ఆ ప్రాంతంలోని దేవీ, దేవతలను కూడా సాధారణంగా సొంతం చేసుకునేవారు. అంటే, విజేతలు, విజితులు (ఓడిపోయినవారు) ఒకరి దేవీ, దేవతలను ఒకరు ఇచ్చి పుచ్చుకుంటూ ఆస్తికరంగంలో పాలు, నీళ్లలా కలసిపోయేవారు. ఆ విధంగా దేవీదేవతల సంఖ్య కూడా పెరిగేది. జనం కలసిపోయి చుట్టరికాలు కల్పించుకున్నట్టే, దేవీ, దేవతల మధ్య కూడా చుట్టరికాలు ఏర్పడేవి. ఈ ప్రక్రియను చరిత్రకారులు ‘థియోక్రేసియా’అన్నారు. ఒకప్పుడు దాదాపు ప్రపంచమంతటా, ఇప్పటికీ మనదేశంలోనూ జరుగుతూ వచ్చిన ఈ ప్రక్రియను హెచ్.జి. వెల్స్ (A Short History of the World) చాలా ఆసక్తికరంగా వివరించారు. అలాగే, రాజులను, చక్రవర్తులను దైవాంశ సంభూతులుగా కొలుస్తూ వాళ్ళకు గుడి కట్టడం కూడా ఉండేది.

దీనంతటినీ వ్యవహార సౌలభ్యం కోసం ‘బహురూప ఆస్తికత’ అనీ, దీనికి భిన్నమైనదానిని ‘ఏకరూప ఆస్తికత’ అనీ అందాం.

పైన చెప్పిన ‘బహురూప ఆస్తికత’ స్థానంలో క్రమంగా ‘ఏకరూప ఆస్తికత’ అడుగుపెట్టింది. ఏకరూప ఆస్తికత అడుగుపెట్టి బలపడడాన్నే నేటి మన కాలగణనలో క్రీస్తుశకం పేరిట కొండగుర్తుగా మార్చుకున్నట్టు పైన చెప్పుకున్నాం. ఆవిధంగా బహురూప ఆస్తికత క్రీస్తుపూర్వపు చరిత్ర పుటల్లో మిగిలిపోయింది.

ఇక్కడే ఇంకో తమాషా ఉంది. రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా ప్రజాస్వామ్యం వైపు వెళ్లిన, లేదా వెళ్లాలని భావిస్తున్న ప్రపంచం; ఆస్తికరంగంలో మాత్రం (మనదేశం వంటి మినహాయింపులతో) దానికి భిన్నమైన మార్గంలో, అంటే ఏకరూప ఆస్తికతలోకి వెళ్లింది. ప్రజాస్వామ్యానికి పుట్టిల్లుగా తనను చెప్పుకునే పాశ్చాత్యక్రైస్తవ ప్రపంచం ఆస్తికంగా మాత్రం ఏకరూపతకు మళ్ళడం విచిత్రంగా ఉంటుంది. ఆ ఏకరూప ఆస్తికతను పురోగామిరూపంగా కూడా అది విశ్వసించింది. అందుకే తన వలసగా మార్చుకున్న భారత్ తో సహా అనేక దేశాలను క్రైస్తవీకరించే ప్రయత్నాలకు పాశ్చాత్యప్రపంచం మద్దతు ఇచ్చింది. కానీ అది బెడిసికొట్టడంతో వెనకడుగు వేసిన ఉదాహరణలూ ఉన్నాయి. చర్చితో పోరాడిన చరిత్ర కూడా తనకు ఉంది కనుక మతాన్నీ, రాజకీయాన్నీ అది విడదీసింది. తను ఆస్తికరంగంలో ఏకరూపతకు మళ్లినా రాజకీయంగా బాహుళ్యంవైపు, అంటే ప్రజాస్వామ్యంవైపు మొగ్గింది కనుక, అందులో భాగంగా భిన్న ఆస్తిక విశ్వాసాల ఉనికిని సూత్రప్రాయంగానైనా అది గుర్తిస్తుంది.

ఇస్లాం ప్రపంచానికి వస్తే, పాశ్చాత్యప్రపంచంలా అది ఏకరూప ఆస్తికతలోకి మళ్లినా, రాజకీయ ప్రజాస్వామ్యానికి పూర్తిగా మళ్లలేదు. కాలగణనం నుంచి చెప్పుకుంటే ఈ రెండు ప్రపంచాల మధ్యా ఉన్న ఒక పోలిక- క్రీస్తుపూర్వ కాలానికి చెందిన బహురూప ఆస్తిక నుంచి, క్రీస్తుశకానికి చెందిన ఏకరూప ఆస్తికతలోకి అవి రెండూ అడుగుపెట్టడం.

మనదేశానిది పూర్తిగా భిన్నమైన అనుభవం. మనం మొదటినుంచీ, ఇప్పటివరకూ కూడా భిన్న మతాలు, పంథాలు, ఆరాధనాపద్ధతుల రూపంలోని బహురూప ఆస్తికతలోనే ఉన్నాం. ఇందుకు మనదేశ భౌగోళిక పరిస్థితులు కూడా కొంత దోహదం చేశాయని కోశాంబీ సూత్రీకరణ. అలాగని మన దేశంలో అక్కడక్కడైనా ఏకరూప ఆస్తికతను విధించడానికి ప్రయత్నం జరగలేదని కాదు. క్రీస్తుపూర్వకాలంలో బౌద్ధం అనే ఉదాహరణ ఒకటి కనిపిస్తుంది. అయితే, బౌద్ధం స్వతస్సిద్ధంగా క్షీణించడం వల్ల నేటి హిందూకు పూర్వ రూపమైన వైదిక లేదా సనాతనమతం దాని స్థానంలోకి విస్తరించిందా, లేక బౌద్ధాన్ని అణగదొక్కి విస్తరించిందా అన్న ప్రశ్నకు అవకాశం ఉంది. అందులోకి నేను మరి అంత లోతుగా వెళ్లలేదు కనుక ప్రస్తుతానికి దానిని ప్రశ్నగానే వదిలేస్తాను. మనదేశంలో అక్కడక్కడ ఏకరూప ఆస్తికత విధించడానికి జరిగిన ఇతర ప్రయత్నాలు క్రీస్తుశకంలోకే వస్తాయి. వీరశైవ, వైష్ణవ మతాలు మొదలుకుని బ్రిటిష్ కాలంలో బ్రహ్మ సమాజం తదితర ఏకేశ్వర మతాలవరకూ ఇందుకు ఉదాహరణలుగా చెప్పుకోవచ్చు. ఇవి ఏకరూప ఆస్తికతకు చెందిన క్రైస్తవ, ఇస్లాంల వరవడిలో పుట్టినవి.

బహురూప ఆస్తికత నుంచి ఏకరూప ఆస్తికతకు మళ్లడం అనేది అంత సునాయాసంగా ఏమీ జరగలేదు. అందులో ఎంతో పీడన, హింస ఉన్నాయి. పాశ్చాత్య ప్రపంచమూ, ఆ తర్వాత ఇస్లామూ బహురూప ఆస్తికతను పనిగట్టుకుని తుడిచిపెట్టి మరీ క్రీస్తుశకంలోకి అడుగుపెట్టాయి. ఈ కోణంనుంచి (ఇంకా మరికొన్ని కోణాలనుంచి కూడా) చూసినప్పుడు మనదేశం ఇంకా క్రీస్తుశకంలోకి రానే లేదు. ఈ విషయాన్ని నేను ఇంతకుముందు కూడా ఒకటి రెండు సందర్భాలలో ప్రస్తావించాను.

విచిత్రం ఏమిటంటే, క్రైస్తవ, ఇస్లాం మతాలలా తమది ఒక ‘మతం’ కాదనీ, ‘జీవనవిధాన’మనీ హిందుత్వ సిద్ధాంత వాదులు అంటూనే; మళ్ళీ ఆ మతాలనే వరవడిగా తీసుకుంటూ ఆ ‘జీవనవిధానా’న్నే ‘ఏకరూప జీవనవిధానం’గా మార్చడానికి ప్రయత్నిస్తున్నారు. ఇదే సందర్భంలో ఇంకొకటి కూడా చేస్తున్నారు. అది, క్రీస్తు పూర్వదశనుంచీ ఈ దేశంలో ఉన్న ఒకవిధమైన ఆస్తిక ప్రజాస్వామ్యాన్నీ, నేటి రాజకీయ ప్రజాస్వామ్యాన్నీ కలగాపులగం చేయడం! ఈ దేశం మొదటినుంచీ ప్రజాస్వామ్యదేశమే(రాజకీయంగా, సామాజికంగా కూడా) నని విస్తృతార్థంలో నొక్కి చెబుతూ, దానికి ఆస్తిక ప్రజాస్వామ్యాన్ని ఉదాహరణగా చూపిస్తున్నారు.

క్రీస్తుపూర్వ దశకు చెందిన బహురూప ఆస్తికతలో ఇప్పటికీ అధికారికంగా కొనసాగుతున్న దేశం ఒక్క మనదేశం తప్ప ఈ క్షణాన నాకు ఇంకొకటి స్ఫురించడం లేదు. క్రీస్తుపూర్వ కాలంలో బహురూప ఆస్తికతనుంచి తనను కాపాడుకోడానికి ఏకరూప ఆస్తికత ఎంతో పెనుగులాడవలసివచ్చింది. అజ్ఞాతజీవితం కూడా గడపవలసివచ్చింది. అలాంటిది, చరిత్ర తిరగబడి, ఏకరూప ఆస్తికత దాడిని కాచుకుంటూ నేడు బహురూప ఆస్తికత బిక్కు బిక్కు మంటూ గడుపుతోంది.

నేటి సువిశాల ఏకరూప ఆస్తిక సాగరంలో బహురూప ఆస్తికతను కాపాడుకుంటున్న ఒంటరి దీవి మనదేశం!

***

మన దేశంలో బహురూప ఆస్తికత ప్రత్యక్ష సత్యం కనుక మరీ ఎక్కువ ఉదాహరణలు ఇచ్చుకోవలసిన అవసరం లేదు. ఇక్కడ ప్రతి కులానికీ, ప్రతి తెగకూ, ప్రతి ప్రాంతానికీ తమవైన దేవీ, దేవతలు ఉన్నారు. తమవైన పూజాప్రక్రియలు ఉన్నాయి. ఒక్క అమ్మవారి పూజల్నే తీసుకుంటే అందులో ఉండే వైవిధ్యం అంతాఇంతా కాదు. కొన్ని కులాల పూజల్లో జాతరలు, జంతుబలులు, గరగ నృత్యాలు, శరీరాన్ని హింసించుకోవడం మొదలైనవి ఉంటే; కొన్ని కులాల పూజల్లో సాత్విక నైవేద్యాలు, అష్టోత్తరశతనామాలు, సహస్రనామాలు, అభిషేకాలు, కుంకుమ పూజలు మొదలైనవి ఉంటాయి.

ఈ సందర్భంలో ఆది శంకరాచార్య గురించి ప్రస్తావించుకోవడం అవసరం. ప్రామాణిక చరిత్రకు తెలిసినంతవరకు మనదేశంలో తొలి మత సంస్కర్త ఆయనే. స్థూలంగా చెప్పుకుంటే, యజ్ఞాలు, జంతుబలులు ప్రాధాన్యం వహించే ఒకనాటి వైదిక మతాన్ని, దేవాలయాల వైపు, దేవతారాధన వైపు తిప్పడం ద్వారా ఆయన సంస్కరించడానికి ప్రయత్నించినట్టు కనిపిస్తుంది. మరోవైపు, జానపద పూజా పద్ధతులనూ, విశ్వాసాలనూ కూడా ఆయన చక్కదిద్దడానికి చూశారు. నేడు క్షుద్రపూజలుగా చెప్పుకునే కొన్ని రకాల ఉగ్రపూజా పద్ధతులను సాత్వికం చేయడం ఆది శంకరాచార్య ప్రధాన సంస్కరణగా కనిపిస్తుంది. ‘పంచాయతనం’ పేరుతో దేవీ దేవతల సంఖ్యను పరిమితం చేయడానికైతే ఆయన చూశారు కానీ, బహురూప అస్తికతను పూర్తిగా ఏకరూప ఆస్తికతగా మాత్రం మార్చలేదు. మన దేశస్వభావమూ, స్థితిగతుల దృష్ట్యా మధ్యేమార్గంగా ఆయన పంచాయతన పూజ రూపంలో బహు దేవతా సంఖ్యను అయిదుగురు దేవీ దేవతలకు పరిమితం చేసి ఉండవచ్చు. ఆ అయిదుగురు దేవీ, దేవతలు: అంబిక, సూర్యుడు, గణపతి, కుమారస్వామి, విష్ణువు. దాంతోపాటు పూజా విధానాన్ని సరళమూ, సాత్వికమూ చేశారు. అయితే శంకరాచార్యులవారి ప్రయోగాలు పూర్తిగా విజయవంతమయ్యాయని చెప్పలేం.

శంకరాచార్య కాలం గురించే వివాదం ఉంది. ఆయన క్రీస్తు శకానికే చెందినవారన్న వాదాన్ని పరిగణనలోకి తీసుకుంటే, ఏకరూప ఆస్తికత దిశగా ఆయన ఆలోచన చేశారా అనిపిస్తుంది. తాత్విక స్థాయిలో ఆయన అభివృద్ధి చేసిన అద్వైత సిద్ధాంతంలో దాని ఛాయలు కనబడవచ్చు. పూజా విధానం మేరకు పంచాయతనానికి పరిమితమయ్యారు.

శంకరాచార్యులవారి గురించి ఈ నాలుగు మాటలూ ప్రస్తుతాంశానికి అవసరమైన మేరకు చెప్పినవే కానీ, ఇది సమగ్ర, పరిశీలనా కాదు, అందుకు ఇది సందర్భమూ కాదు.

***

క్రీస్తు పూర్వకాలానికి చెందిన బహురూప ఆస్తికత ఏకరూప ఆస్తికతలోకి పయనించి క్రీస్తుశకాన్ని అవతరింపజేయడం రోమన్ సామ్రాజ్యకాలంలో జరిగింది. హెచ్, జి. వెల్స్ చిత్రించిన ఆ పరిణామక్రమాన్ని తెలుసుకోవడం ఆసక్తికరంగా ఉంటుంది.

అది తర్వాత…

Download PDF

16 Comments

  • శర్మ says:

    ఒక ప్రామాణిక గ్రంధమంటూ లేకపోతే అట్టిమతాన్ని ధర్మమనాలని ఎవరన్నారు?

    హిందువులకి ప్రామాణికం వేదం (ఆ వేదం నాలుగు భాగాలుగా ఉంది). ఉపనిషత్తులూ, పురాణాలు వాటిపై కామెంటరీనేతప్ప వేదంతో విభేదించవు అని హిందూ ప్రవచనకారులు చెబుతుంటారు. మరి అప్పుడు హిందువులకికూడా ఒక ప్రామాణిక మూలం ఉన్నట్లేకదా. అలాంటప్పుడు హిందూమతం మాత్రం మతం కాకుండా ఎలా పోతుంది.?

    ఇస్లామిక్ దేశాల్లోని ఇస్లామేతరులు (క్రైస్తవులు) కొన్ని సిలామిక్ ఆచారాలని పాటిస్తుంటారు. అప్పుడు ఇస్లాం కూడా జీవన విధానమేకదా? క్రైస్తవంలోకూడా, హిందూ మతంలో ఉన్నట్లే ఎన్నో శాఖలున్నాయి. వాటిమధ్య ఉన్న సంబంధాలు, ఉమ్మడి నమ్మకాలూకూడా హిందూమతంలోని వివిధ శాఖల మధ్య ఉన్నట్లే ఉంటాయి. క్రైస్తవం మాత్రం ఒక జీవన విధానమే.

    హిందూమతానికీ, అబ్రహామిక్ మతాలకీ తేడా ఏమైనా ఉందంటే హిందూ మతం polytheistic, అబ్రహామిక్ మతాలు monotheistic అయ్యుండడం మాత్రమే. ఆ మతాల ప్రాబల్యం ఎక్కువగా ఉన్నరాజ్యాలలో అవికూడా జీవనవిధానాలే.

    • kalluri bhaskaram says:

      వేదం ప్రమాణమే కావచ్చునండీ. దాంతోపాటు రామాయణం, భాగవతం, భగవద్గీతా తక్కువ ప్రమాణాలు ఏమీ కావు. ప్రశ్నల్లా ‘ఒకే ప్రమాణాన్ని’ ఒక పద్ధతిగా, ఉద్దేశపూర్వకంగా అందరికీ విధించారా అన్నదే. హైందవ అనుభవానికి, క్రైస్తవ, ఇస్లాం అనుభవానికీ ఇక్కడే ఉంది తేడా. మధ్యలో ప్రవహించిన చరిత్రను దృష్టిలో పెట్టుకోకుండా క్రైస్తవ, ఇస్లాం లకు వర్తించే కొలమానాలను యథాతథంగా ముందు కాలానికి అన్వయించడం కృత్రిమం అవుతుంది కానీ శాస్త్రీయం కాబోదు.

      ఇక జీవన విధానం విషయానికి వస్తే, మీరన్నట్టు హిందువులకు ఉన్నట్టే; క్రైస్తవులకు, ఇస్లామీయులకు కూడా వారి వారి జీవన విధానాలు ఉన్నప్పుడు, హిందుత్వ వాదులు అంటున్నట్టే మాది కూడా ఒక జీవన విధానం అని వారు కూడా చెప్పుకోవచ్చు. అప్పుడది తమది ప్రత్యేక జీవన విధానమని చెప్పే హిందుత్వ వాదనను నీరుగార్చివేస్తుంది. అదీగాక ఆచారాలు పాటించడమే జీవన విధానం అన్నప్పుడు ప్రపంచవ్యాప్తంగా చాలా ఆచారాల మధ్య పోలిక ఉంది. కనుక ఒక్కొక్క మతం వారి జీవన విధానం ఒక్కొక్క విధంగా ఉంటుందనడం కుదరదు.

      • pavan santhosh surampudi says:

        //వేదం ప్రమాణమే అండీ దానితో పాటు భగవద్గీతా, రామాయణాలు తక్కువ ప్రమాణాలు ఏమీ కావు.//
        ప్రతి పౌరాణికుడు స్పష్టంగా చెప్పే మాట ఏమిటంటే వేదమే ప్రమాణం. వాదంతో విభేదించనంత వరకే ఏ ఇతరమైన దానికైనా ప్రామాణ్యం. కనీసం సూత్రప్రాయంగానైనా ఇంత స్పష్టంగా ఉన్నప్పుడు మరోలా ఎలా అనగలుగుతాము. పోనీ సూత్రప్రాయమే తప్ప ఆచరణలో లేదంటే. ఇస్లాం, క్రైస్తవం వంటి మతాలలో కూడా ఖురాన్, బైబిల్ సూత్రప్రాయపు ప్రామాణ్యమె. ఖురాన్ విరుద్ధమైన ఎన్నో ఆచారాలు ముస్లిములలో కనిపిస్తాయి. దానికేమంటారు.

    • శర్మ says:

      క్షమించాలి.

      మాదికూడా జీవన విధానమేనన్న వాదం నేనింతవరకూ వినలేదు. ఈ విషయంలో నేను విన్న వాదాలు రెండురకాలు (మన సుప్రీం కోర్టువారు) 1) హిందూఇజము మతం కాదు ఒక జీవన విధానమనడం హిందూయిజాన్ని అవమానించడంతప్ప మరొకటికాదు. 2) హిందూయిజాన్ని మాత్రమే “మతం కాదు జీవన విధాన”మనడం హిందూమతపు విశిష్టత. అయితే ఈ రెండు రకాల వ్యాఖ్యానాలు చేస్తున్న వ్యక్తులకీ ‘జీవన విధానం’ అనే పదం నిర్వచనంపైని పొరబాటు అభిప్రాయాలున్నాయన్నది నావ్యాఖ్య సారాంశం.

      @pavan santhosh surampudi: శృతితో విభేదించిన స్మృతిని బుట్టదాఖలుచెయ్యవచ్చని, అసలలా స్మృతి, శృతితో విబేధించడం అసంభవమనీ నాకు రామాయణంపై ఒక ప్రవచనకారుడు నలభైరోజులపాటు చేసిన ప్రవచనాలు విన్నకే అర్ధమయ్యింది. (రామాయణము కనీసం స్మృతికూడా కాదు. అదొక స్మృతిని అనుసరించు పురాణము.) హిందువులకు ప్రామాణికము వేదం. మిగిలినవన్నీ mere derivatives, explanations and interpretations. ప్రామాణికమైన set of rules/traditions ఉన్నదంతా మతమే ఐతే, హిందూయిజమూ మతమే!

  • Lalitha P says:

    “నేటి సువిశాల ఏక రూప ఆస్తిక సాగరంలో బహురూప ఆస్తికతను కాపాడుకుంటున్న ఒంటరి దీవి మన దేశం” చాలా సూటిగా రాసిన వ్యాసమిది. మీ శీర్షిక ఆసక్తికరంగా ఉంటోంది.

  • N Venugopal says:

    భాస్కరం గారూ,

    ఎప్పటి లాగే చాల లోతైన చర్చకు అవకాశం ఉన్న ఆసక్తికరమైన కందిరీగల తుట్టెను కదిపారు. ఆస్తికత అని మీరు దైవ సంబంధంగా (ఆరాధనా, పూజా, ఆచారవ్యవహార సంబంధంగా) అంటున్నదాన్ని నిజానికి అస్తిత్వం అనవచ్చునేమో. ఇది బహుళ అస్తిత్వాల సమాజం గనుక బహుళ ఆస్తికతకు అవకాశం ఉంది. ఎప్పుడైనా ఆధిపత్య వర్గాలకు ఏకైక అస్తిత్వం కావాలి. మోనోకల్చర్, ఒకే దుస్తులు తొడిగే ఒకే తిండి తినే, ఒకే భాష మాట్లాడే, ఒకే ఆరాధనా పద్ధతి ఉండే మనుషులను పాలించడం సులభం. వారిని పాలనా అవసరాల కోసం విభజించడం వేరే కథ. ఈ మోనో కల్చరైజేషన్ పెట్టుబడిదారీ విధానమూ చేసింది, హిందూత్వ చేయడానికి ప్రయత్నించింది, ప్రయత్నిస్తున్నది. అందుకే హిందుత్వకూ, సామ్రాజ్యవాదానికీ లంకె కుదిరింది. అగ్నిహోత్రావధానులకీ వలస న్యాయవ్యవస్థకూ కుదిరినట్టు. మోడీకీ అమెరికాకూ కుదిరినట్టు. కాని ఈ దేశం/సమాజం భౌగోళికంగానూ, చారిత్రకంగానూ, సాంస్కృతికంగానూ ఎన్నడూ ఏకరూపంలో లేదు గనుక, అసలు సిక్కింను కూడ కబళించి ఇందిరా ప్రియదర్శిని పాలించినంత విశాలమైన “భారతదేశం” అనబడే ఖండం రాజకీయంగానూ ఎన్నడూ ఏకరూపంలో లేదు గనుక ఇక్కడ భిన్నత్వంలో ఏకత్వం అని ఎంత చెప్పినా భిన్నత్వానిదే పైచేయి. బహుళ అస్తిత్వాలే నియమం. లద్దాఖ్ నుంచి లక్ష దీవుల దాకా, కాండ్లా నుంచి కోహిమా దాకా కట్టు, బొట్టు, తిండి, మాట, వాతావరణం, గృహనిర్మాణం అన్నీ భిన్నమే. చివరికి అన్ని చోట్లా ఉన్న కులాలు కూడ వాటి మధ్య సంబంధాలలో, అంతరాలలో భిన్నమే. నిచ్చెనమెట్లలో ఒక చివర బ్రాహ్మణులు, మరొక చివర “అస్పృశ్యులు” ఉండడం మినహా ఏకత్వం ఏమీ లేదు. ఇక రాజకీయ ఐక్యత చూద్దామా అంటే పాత రాజవంశాలు వింధ్య దాటి రానేలేదు. మొఘల్ లు వచ్చి సుబేదార్లను ఏర్పాటు చేసి అటు వెళ్లగానే ఇటు వీళ్లు స్వాతంత్ర్యం ప్రకటించుకున్నారు. అతి పెద్ద భారతదేశాన్ని ఏర్పాటు చేసిన బ్రిటిష్ వలసవాదం నలభై శాతాన్ని వదిలేసింది. వాళ్లందరికన్న ఎక్కువ విశాలమైన భారతదేశాన్ని పాలించినవాడు నెహ్రూ. ఆయన కన్న ఎక్కువ ప్రాంతాన్ని పాలించినది ఆయన కూతురు. ఈ రాజకీయ చిత్రపటాన్ని ఆర్థిక సంబంధాలతో, ఉత్పత్తి సంబంధాలతో కలగలిపి చూసినప్పుడు ఇంకా విచిత్రాలు కనబడతాయి. ఇవాళ్టికీ దేశమంతా ఒకే మోనోకల్చర్ ఆర్థిక వ్యవస్థ రూపొందలేదు. బహుశా మన సమాజ వైచిత్రికి, వైవిధ్యానికి, సంక్లిష్టతకు మూలాలు ఈ బహుళత్వంలో, బహుళ అస్తిత్వంలో ఉన్నాయేమో. బహు ఆస్తికతకు కూడ కారణం అదేనేమో…..

    • Lalitha P says:

      అంతర్జాతీయ పెట్టుబడిదారీ విధానం, ప్రపంచీకరణ వల్లే, మన్మోహన్ కీ అమెరికాకీ కుదిరినట్టు మోడీకీ అమెరికాకీ కుదిరింది. అది తప్పనిసరి పెళ్లి. హిందూత్వవాదుల స్వదేశీ విధానానికీ మోడీకీ ఎక్కడ కుదురుతుంది? హిందూత్వవాదుల అస్తిత్వపు గొడవ అంతా ఒకే అస్తిత్వం, పూజా విధానం ఉంటే ఈ మతాన్ని కూడా అంతరించకుండా మిగతా మతాల్లాగా కాపాడుకోవచ్చనే. అందుకే శ్రీరాముడినీ, హనుమంతుడినీ హిందూమతాన్ని మోసే పెద్ద స్తంభాలుగా నిలబెట్టి, హిందూమతాన్ని కూడా ఏకరూప ఆస్తికత్వ దశకు తేవాలని చూస్తున్నారు.

      మోనోకల్చర్ ఆర్ధిక వ్యవస్థ రూపొందకుండా ఇంకా ఉండిపోయిన ఉత్తరప్రదేశ్, బీహార్ వంటి పెద్ద రాష్ట్రాల్లో ఇంకా చాలా వరకూ ఫ్యూడలిజం ఉండిపోయినా, గుజరాత్, ఆంధ్ర వంటి రాష్ట్రాల్లో పెట్టుబడి ప్రవహిస్తూవున్నా, కేరళలో హక్కుల చైతన్యం పెరిగినా, బెంగాల్ లో భూసంస్కరణలు జరిగినా బహుళ అస్తిత్వం కంటే ఇంగ్లిష్ వాళ్ళు అందించిన చదువు, నక్సలైట్, కమ్యునిస్ట్ ఉద్యమాల intervention తో వచ్చే చైతన్యస్థాయి … ఇవి ఉండటం, లేకపోవటం లాంటివే ఎక్కువ పాత్ర పోషించి ఉంటాయనిపిస్తుంది. మన దేశపు బహుళ అస్తిత్వం నుండి వచ్చే బహుళ ఆస్తికత అని వేణుగోపాల్ గారు చెప్పేది ఒక్కో ప్రాంతంలో ఒక్కో దేవత గురించి అనుకుంటే, భాస్కరంగారు చెప్పేది క్రీస్తు పూర్వదశకు చెందిన బహురూప ఆస్తికత, తరువాత వచ్చిన ఏకరూప ఆస్తికత. ఇవి ప్రపంచవ్యాప్తం. ఏ ఆచారాలూ ఎక్కడా కూడా పూర్తిగా విడిగా మనలేదనీ, ప్రపంచం అంతటా అన్ని నాగరికతల్లో మనుషులు ఇంచుమించు ఒకేలా పూజిస్తూ బ్రతికేవారనీ సూత్రీకరిస్తూ, ఉదాహరిస్తూ, జాతీయవాదాలను వ్యతిరేకిస్తూ సాగుతున్నాయి భాస్కరం గారి వ్యాసాలు. హిందూత్వ అనే మాట అంటే అందరూ నిగ్రహం కోల్పోతున్న ఈ రోజుల్లో వచ్చిన ఈ వ్యాసం చాలా సమగ్రమైన, నిగ్రహంతో కూడిన పరిశీలన. ఇక క్రీస్తుపూర్వ దశకు చెందిన ఈ బహురూప ఆస్తికత ఇలా మన దేశంలో నిలిచి ఉండటానికి భాస్కరం గారు వెదికే సామాజిక, ఆర్ధిక, మతపరమైన కారణాలు ఏమిటో చూడాలని కుతూహలంగా ఉంది.

  • kalluri bhaskaram says:

    థాంక్స్ వేణుగోపాల్ గారూ…మీ స్పందన నా వ్యాసానికి మరింత లోతు నిచ్చింది. మీరన్నట్టు బహుళ ఆస్తికత్వం బహుళ అస్తిత్వంలో భాగమే. అన్ని రంగాలలోనూ ఏకశిలా(మోనో) నిర్మాణాన్ని తీసుకొచ్చే ప్రయత్నం కూడా కాలమూ, ప్రాంతమూ విధించిన అన్ని రకాల హద్దులనూ దాటుకుని వర్తమానంలోకి ప్రవహిస్తోంది. ఆ ప్రయత్నంలో చేతులు కాల్చుకుని, తల బొప్పి కట్టి వెనకడుగు వేసిన అనుభవాలు గతకాలంలోనూ ఉన్నాయి, ఇప్పుడూ ఉంటున్నాయి. కానీ పెనుగులాట కొనసాగుతూనే ఉంది. నా ఉద్దేశంలో ఇంకా క్రీస్తుపూర్వ దశను దాటని మనదేశం ఈ క్షణాన ఈ పెనుగులాటకు ఒక ప్రధాన వేదికగా ఉంది. ఇది ఎలా పరిణమిస్తుందో చూడవలసిందే. “బహుశా మన సమాజ వైచిత్రికి, వైవిధ్యానికి, సంక్లిష్టతకు మూలాలు ఈ బహుళత్వంలో, బహుళ అస్తిత్వంలో ఉన్నాయేమో. బహు ఆస్తికతకు కూడ కారణం అదేనేమో…..” అన్న మీ ఊహలో నిజం ఉంది. ఈ సమాజ వైచిత్రి, వైవిధ్యం(వైరుధ్యం కూడా), సంక్లిష్టతలు ఎలాంటివో అర్థం చేసుకోలేకపోవడం ఇంకొక సమస్య. అర్థం చేసుకోడానికి చరిత్ర లోకి వెళ్లడమే మార్గమని నా ఉద్దేశం.

  • kalluri bhaskaram says:

    ఈ శీర్షికను మీరు ఫాలో అవుతున్నందుకు చాలా థాంక్స్ లలితగారూ… నా ఉద్దేశంలో, వైవిధ్యాలే కాక అనేక వైరుధ్యాలు, రహస్యాలు, అపరిష్కృతాలతో సహా కాలంలో ఘనీభవించిన స్థితిలో ఏ హిరణ్యాక్షుడో చాప చుట్టేసిన భూమినే మనం భారతదేశం అంటున్నాం. ఇలాంటి భారతదేశాన్ని నా బుద్ధితో నేను అర్థం చేసుకునే క్రమంలోనే ఈ వ్యాసాలు. ఈ ప్రయత్నంలో పురాచరిత్ర నుంచి వర్తమానంలోకి రావాలని నా ప్రణాళిక. పురాచరిత్ర మీద మొదటినుంచీ ఉన్న ఆసక్తి నాకిందులో మంచి ఉపకరణం అయింది. వర్తమానంలోకి వస్తున్న కొద్దీ మీరు ప్రస్తావించిన అంశాలు చర్చలోకి రావచ్చు. వీలైనంత త్వరగా వర్తమానంలోకి రావాలనీ ఉంది. ఇప్పటికే అప్పుడప్పుడు కొన్ని సూచనలు ఇస్తూనే వచ్చాను. ఈ వ్యాసాలకు నేను నిర్దేశించుకున్న స్వభావం పరిధిలో, నా అవగాహన పరిధిలో ఆ చర్చ ఎలాంటి రూపం తీసుకుంటుందో చూడాలి. మీ వంటి ఆలోచనాపరులు ఇచ్చే ఫీడ్ బ్యాక్ నా ఆలోచనా స్పష్టతకు ఎంతైనా సాయపడుతుంది.

  • kalluribhaskaram says:

    “ప్రతి పౌరాణికుడు స్పష్టంగా చెప్పే మాట ఏమిటంటే వేదమే ప్రమాణం. వాదంతో విభేదించనంత వరకే ఏ ఇతరమైన దానికైనా ప్రామాణ్యం.” అంటే బహుళ ప్రామాణ్యమే కదా. నేను అన్నది కూడా అదే. ఒకే ప్రమాణ గ్రంథం అన్న కాన్సెప్టు, దానిని ఇతరులపై ఒక పద్దతిగా విధించాలన్న ఆలోచనకు బదులు ఆస్తిక రంగంలో ఇచ్చి పుచ్చుకునే బాహుళ్య చింతన మన దేశంతో సహా పురాతన సమాజాలు అన్నిటా ఉండేది. బాహుళ్యాన్ని ఒప్పు కోవడం, ఒప్పుకోక పోవడం లోనే క్రీస్తు పూర్వ, క్రీస్తు అనంతర మతాల తేడా. ఆస్తిక రంగంలో ఈ మధ్యలో సంభవించిన అనేక పరిణామాలను, అవి తెచ్చిన గుణాత్మక పరివర్తనను దృష్టిలో ఉంచుకున్నప్పుడు క్రీస్తు అనంతర మతాల మూసలో క్రీస్తు పూర్వ మతాలను ఇరికించాలన్న ఆలోచన రాదు.
    “ఇస్లాం, క్రైస్తవం వంటి మతాలలో కూడా ఖురాన్, బైబిల్ సూత్రప్రాయపు ప్రామాణ్యమె. ఖురాన్ విరుద్ధమైన ఎన్నో ఆచారాలు ముస్లిములలో కనిపిస్తాయి.” అంత మాత్రాన ఈ మతాలకు ఉన్న ప్రత్యెక నిర్మాణ స్వభావం పోదు. మనదేశంలో ఏకేశ్వర మతాల ఒరవడిలో పుట్టిన వీరశైవ, వైష్ణవమతాలు ఉన్నాయి. మొదట్లో ఇవి తీవ్ర స్థాయిలో ఇతర దైవాలను ఏమాత్రం సహించని రీతిలోతమ మతాన్ని ప్రచారం చేసుకున్నాయి. కానీ ఇప్పుడవి అంత తీవ్రవైఖరితో లేవు. శైవ, వైష్ణవేతరులతో వివాహ సంబంధాలు కూడా జరుపుకుంటున్నాయి. అంతమాత్రాన ఏకేశ్వరమతాలన్న వాటి గుర్తింపు మాసిపోదు.

  • ఈ కాలానికి చాలా ఉపయోగపడే వ్యాసాలూ ఇవి. అందరు చదివితే బాగుంటుంది.

  • Thirupalu says:

    మొదట పురాణాలు కట్టుకధలు రాస్తున్నట్లు అనిపించాయి కాని, చాలా హేతుబద్దమైనా వ్యాసాలూ.

  • kalluri bhaskaram says:

    ‘హిందుత్వ’ ఒక మతం కాదు, జీవనవిధానం’-అనే మాట నా చిన్నప్పటినుంచీ వింటున్నాను. ఆ మేరకు సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును తరచూ నొక్కి చెప్పడం ఇప్పుడూ చూస్తున్నాను. శర్మగారి స్పందన చూసేవరకూ ఆ విషయంలో కూడా భిన్నాభిప్రాయాలు, లేదా అస్పష్టత ఉన్నాయని తోచలేదు. కనుక స్పష్టత కోసం సుప్రీం కోర్టు ఏం చెప్పిందో ఇక్కడ ఇస్తున్నాను.

    ‘Youth Awaaj ‘ అనే పత్రికలో సైఫ్ ఖాన్ అనే రచయిత సుప్రీమ్ కోర్టు తీర్పును ఇలా ప్రస్తావించారు:

    If one asks a Hindutva apologist to explain as to how is Hindutva a way of life, they proceed to quote another abstract of this judgement which states, “Unlike other religions in the world, the Hindu religion does not claim any one prophet, it does not worship any one God, it does not subscribe to any one dogma, it does not believe in any one philosophic concept, it does not follow any one set of religious rites or performances, in fact, it does not appear to satisfy the narrow traditional features of any religion or creed. It may broadly be described as a way of life and nothing more.” They would go on to explain as to how Hinduism is not merely based on the teachings of one book, one prophet or one religious institution like the Church and this is the point where they falters since they were asked to explain as to how is ‘Hindutva’ a way of life not ‘Hinduism’.

    ప్రముఖ న్యాయవాది రామ్ జెత్మలానీ ‘The Sunday Gaurdian’ లో 1995లో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును ప్రస్తావిస్తూ ‘Hindutva is a secular way of life’ అనే వ్యాసంలో ఇలా రాశారు:

    Indeed, Encyclopaedia Britannica accepts that “Hinduism” is a blanket term covering several religions and does not refer to a single religion. “…Hinduism is both a civilisation and a congregation of religions; it has neither a beginning, nor a founder, nor a central authority, hierarchy or organisation. It is the glorious catholicity of Hinduism that one can be a believer in one God, or multiplicity of Gods or even none at all. Hinduism does not expel much less crucify alleged non believers. Every attempt at a specific definition of Hinduism has proved unsatisfactory in one way or another. …Hinduism is not a revealed religion and, therefore, has neither a founder nor definite teachings or common system of doctrines … It has no organisation, no dogma or accepted creeds. There is no authority with recognised jurisdiction. A man, therefore, could neglect any one of the prescribed duties of his group and still be regarded as a good Hindu.”

    “Ordinarily, Hindutva is understood as a way of life or a state of mind and is not to be equated with or understood as religious Hindu fundamentalism… it is a fallacy and an error of law to proceed on the assumption… that the use of words Hindutva or Hinduism per se depicts an attitude hostile to all persons practising any religion other than the Hindu religion…” These are not my words, but of the Supreme Court judgement of 1995 on Hindutva.

    అదనంగా చారిత్రక దృష్టితో నేను అన్నది ఏమిటంటే, హిందూ గురించి ఇచ్చిన ఈ వివరణ క్రీసుపూర్వ ఆస్తికతకు వర్తిస్తుందనే. క్రీస్తు పూర్వం నాటి విశాలార్థంలో హిందూ కూడా మతమే అవుతుందని నేను అన్నాను. క్రైస్తవం, ఇస్లాం వంటి క్రీస్తు శక మతాలతో మతం అనే మాట విశాలార్థం నుంచి తప్పుకుని నేటి సంకుచితార్థాన్ని తెచ్చుకుందని అన్నాను.

ఒక వ్యాఖ్యను

Your email address will not be published. Required fields are marked *

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)