ఆశ – దురాశ

MythiliScaled

అనగనగా ఒక ఊర్లో ఇద్దరు అన్నదమ్ములు. హాన్స్ పెద్దవాడు, క్లాస్ చిన్నవాడు. హాన్స్ అదృష్టం బాగుండి ఎక్కువ డబ్బు సంపాదించగలిగాడు. క్లాస్ ఏం చేసినా కలిసిరాలేదు. రాను రాను క్లాస్ కి తిండి దొరకటమే కష్టమయిపోయింది. అన్న దగ్గరికి వెళ్ళి , సంగతి చెప్పి, కొంచెం డబ్బు- అప్పుగానైనా సరే, ఇమ్మని అడిగాడు. హాన్స్ ససేమిరా వీల్లేదన్నాడు.

 

” నేనేమీ రాసులు పోసుకు కూర్చోలేదు ఊరికే ఇవ్వటానికి. నీకు అప్పు ఇస్తే వెనక్కి వస్తుందా ! ఎక్కడో  కాసులు బఠాణీ గింజల్లాగా దొర్లుతున్నాయట, వెళ్ళి వెతుక్కో ”

సరేననుకుని  క్లాస్ బయలుదేరాడు. వెళ్ళే ముందర దగ్గర్లో ఉన్న అడవిలో ఒక హేజెల్ చెట్టు కొమ్మని విరిచి చేతికర్రగా తయారు చేసుకున్నాడు. ఆ చెట్టు నిజానికి మంత్రపు చెట్టు. ఆ కర్ర ఎక్కడెక్కడ నిధులూ నిక్షేపాలూ ఉన్నాయో చూపించగలదు. అదేమీ క్లాస్ కి తెలియనే తెలియదు.

అతను ఏ కష్టమూ లేనట్లే కులాసాగా ఈలవేసుకుంటూ ప్రయాణించి ఒక పట్టణం చేరుకున్నాడు. అక్కడి సంతలో పని కావలసినవాళ్ళంతా బార్లు తీరి ఉన్నారు. వాళ్ళతోబాటు తను కూడా నాలుగు ఎండు గడ్డి పోచలు నములుతూ నిలుచున్నాడు. అలా గడ్డి నోట్లో పెట్టుకుని ఉంటే పని చేసేందుకు సిద్ధంగా ఉన్నారని అక్కడి అర్థం.

అంతలో అక్కడికి ఒక వంగిపోయిన ముసలివాడు వచ్చాడు. పైకి అలా కనిపించడు కానీ చాలా విషయాలు తెలుసు అతనికి, ముఖ్యంగా మంత్రాలూ తంత్రాలూ. క్లాస్ చేతి కర్రకి మహిమ ఉందని చూసీ చూడగానే కనిపెట్టాడు. కాసేపు అటూ ఇటూ తచ్చాడి క్లాస్ దగ్గరికి వచ్చాడు .

” అయితే, పనిలో చేరాలనుకుంటున్నావా ? ” అడిగాడు.

క్లాస్ ” మరే. లేకపోతే ఇలా గడ్డి నములుతూ ఎందుకుంటానూ ?”

మాటలు మొదలయ్యాయి. అటూ ఇటూ బేరాలు సాగి సాగి చివరికి వారానికి ఏడు పెన్నీల జీతానికి క్లాస్ ముసలివాడి దగ్గర పనిచేసేందుకు ఖరారైంది. క్లాస్ ని వెంటబెట్టుకుని కొంత దూరం నడిచాక ముసలివాడు ఆ కర్ర ఎక్కడనుంచి తెచ్చుకున్నావని అడిగాడు.

” ఎక్కడోలెండి ” అన్నాడు క్లాస్.

pepper-and-salt

 

” ఎక్కడో గుర్తు చేసుకోగలవా ?” ముసలివాడు అడిగాడు.

 

” అబ్బే, కష్టం ” క్లాస్ పెదవి విరిచాడు.

 

” ఇదిగో, ఒక వెండినాణెం. ఇప్పుడు ?”

 

” ఊ..సరేలెండి. గుర్తొస్తున్నట్టే ఉంది ”

 

ముసలివాడు పసుపచ్చని నీళ్ళు ఉన్న ఒక సీసాని తెచ్చి క్లాస్ తో అన్నాడు ” ఆ  కొమ్మ ఎక్కడ విరిచావో  ఆ మొదట్లో ఇదిగో, దీన్ని  ఒంపెయ్యి. అక్కడినుంచి ఏడు ఆకుపచ్చటి పాములు వస్తాయి. నిన్ను ఏమీ చేయవు, వాటిదారిన వాటిని పోనీ. ఆ తర్వాత ఆ విరిగిన  కొమ్మ నుంచి కొత్త ఆకులు మొలుస్తాయి. ఒక్కటీ వదలకుండా అన్నీ కోసి ఈ సీసాలో వేసుకురా. అప్పుడు నీకు ఇంకో వెండినాణెం ఇస్తాను ”

అదేమంత బరువుపనిగా తోచలేదు క్లాస్ కి. ఇంత అన్నం పెడితే తినేసి బయల్దేరిపోయాడు.

ఆ హేజెల్ చెట్టు పెద్ద శ్రమ లేకుండానే దొరికింది. ముసలివాడు చెప్పినట్లే చేశాడు. అలాగే ఆకుపచ్చపాములు వచ్చి వెళ్ళిపోయాయి. ఆ తర్వాత మొలుచుకొచ్చిన ఆకులు మటుకు   విడ్డూరంగా ఉన్నాయి. అంచుల్లో వెండిలాగా మెరుస్తున్న అటువంటి ఆకులని అదివరకు  ఏ చెట్టు మీదా అలాంటివాటిని క్లాస్ చూసిఉండలేదు

 

అవి మంత్రపు ఆకులు. వాటిని నిళ్ళలో మరిగించి ఆ కషాయం తాగితే పక్షులూ జంతువులు అన్నిటి మాటలూ అర్థమవుతాయి. అన్నీ కోసి సీసాలో వేసుకుని ముసలివాడి దగ్గరికి తెచ్చాడు. అతను చెప్పినట్లు చితుకులు పోగు చేసి పొయ్యి వెలిగించాడు. బాగా పెద్ద మంట వచ్చాక దానిమీద కుండ లో నీళ్ళు పెట్టి అవి తెర్లుతూ ఉన్నప్పుడు ఆకులన్నీ ఒకేసారి వేశాడు. ఈ లోపు ముసలివాడికోసం ఎవరో వచ్చారు. కుండలోంచి చాలా మంచి వాసనలు వచ్చాయి. క్లాస్ కి నోరూరి ఒక చెంచా అందులో ముంచి నోట్లో వేసుకున్నాడు. గొప్ప రుచిగా ఉంది కషాయం.   కషాయం లో మహిమ అంతా  క్లాస్ ముంచిన చెంచా కి అంటుకుని క్లాస్ నోట్లోకి వెళ్ళిపోయింది. ముసలివాడికి గదిలోకి వస్తూనే ఆ విషయం తెలిసిపోయింది. క్లాస్ ని తెగతిట్టాడు. క్లాస్ కి ఏమీ అర్థం కాలేదు. పొరబాటున ఆ కాస్తా రుచి చూశాననీ క్షమించమనీ  వేడుకున్నాడు. ముసలివాడి కోపం అంతకంతకూ ఎక్కువైపోయింది.

 

” అది తాగావుగా. ఇదీ తీసుకో ” అని క్లాస్  మీదికి వేడి కషాయాన్ని విసిరికొట్టాడు. క్లాస్ చటుక్కున వెనక్కి తప్పుకుని మొహం కాలిపోకుండా కాపాడుకోగలిగాడు. ఇక అక్కడుంటే ముసలివాడు ఏం చేస్తాడోనని భయపడి వీధిలోకి పారిపోయాడు. అక్కడ ఒక కోడిపెట్టా కోడిపుంజూ కబుర్లు చెప్పుకుంటున్నాయి. క్లాస్ కి అవన్నీ తెలిసిపోతున్నాయి. అతను రావటం చూసి

కోడి పెట్ట ” ఇడుగో, కొత్త నౌకరు వెళ్ళిపోతున్నాడు ”

కోడి పుంజు ” వెళ్తే వెళ్ళాడు గానీ అసలైనదాన్ని వెనకాలే వదిలేశాడే ”

 

” దేన్ని ?”

” ఆ హేజెల్ కర్రని. ”

 

” అవునవును. రత్నాలని రాళ్ళనుకుని పారేసుకుంటూ ఉంటారు ”

 

క్లాస్ వెనక్కి వెళ్ళి జాగ్రత్తగా ముసలివాడి ఇంట్లో దూరి  ఆ కర్ర ని తెచ్చేసుకున్నాడు. అది ఎందుకు పనికొస్తుందో తెలియకపోయినా భద్రంగా పట్టు కున్నాడు. ఒక చెట్టుకింద  నిద్రపోయేముందర చొక్కాలో దూర్చుకుని పడుకున్నాడు.

 

నిద్ర పట్టబోతుండగా చెట్టు మీదినుంచి రెండు గుడ్లగూబలు మాట్లాడు మాట్లాడుకుంటున్నాయి.

 

” ఆ హేజెల్ కొమ్మ తో ఏం చేయచ్చో క్లాస్ కి తెలీదు కదా పాపం ”

 

” ఏం చేయచ్చు ?”

” వాళ్ళ ఊళ్ళో హార్ ఆక్సెల్ అనే అతని ఇల్లు ఉంది కదా , ఆ వెనక కొండమీద  మూడు నిలువుల ఎత్తున పెద్ద బండ రాయి ఉంది. ఆ కర్ర తో దాని మీద కొడితే బోలెడంత వెండీ బంగారమూ దొరుకుతా యి ”

 

” ఓహో ” అనుకుని క్లాస్ అప్పటికప్పుడు ఇంటిదారి పట్టాడు.

 

హాన్స్ చూశాడు. ” మళ్ళీ వచ్చావేం ? డబ్బు గడించావా ?” అని వెటకారం చేశాడు. క్లాస్ పట్టించుకోలేదు.

కాస్త చీకటి పడనిచ్చి ఆ కొండ దగ్గరికి వెళ్ళాడు. గుడ్లగూబలు చెప్పినట్లే ఆ కొండ మీద మూడు నిలువుల ఎత్తు  బండరాయి ఉంది. కర్రతో దానిమీద కొట్టేసరికి అది తలుపులాగా తెరుచుకుంది. మెట్లుదిగితే కింద పెద్ద చావడి [ హాల్ ]ఉంది. దాని గోడలకి పేర్చి ధాన్యం  బస్తాల లాగా  చాలా ఉన్నాయి. . దగ్గరికి వెళ్ళి చూస్తే నిండా వెండి బంగారాలు.

 

ఆ చావడి చివరన  రాతి అరుగు మీద హుక్కా తాగుతూ  ఒక మరుగుజ్జు మనిషి కూర్చుని ఉన్నాడు. అతని గడ్డం పొడుగ్గా నేల మీద జీరాడుతూ ఉంది.

” ఎలా వచ్చావు క్లాస్ ఇక్కడికి ” అని అతన్ని పేరుపెట్టి పిలిచి ఏం కావాలని అడిగాడు.

క్లాస్ బెరుగ్గా, వినయంగా ” కొంచెం డబ్బు తీసుకోవచ్చా అండీ ? ” అని అడిగాడు.

‘ నీకు కావలసినంత తీసుకో.అసలైనదాన్ని మటుకు మర్చిపోకు ” అన్నాడు మరుగుజ్జు మనిషి.

క్లాస్ జేబుల నిండుగా వెండీ బంగారు నాణాలు నింపుకుని మరుగుజ్జు మనిషికి కృతజ్ఞతలు చెప్పుకుని మూసిన తలుపు మీద కర్రతో కొడితే అది తెరుచుకుంది. ఇవతలికి వచ్చేశాడు.కర్రని జాగ్రత్తగా తెచ్చేసుకున్నాడు. బండరాయి ఎప్పటిలా మూసుకుపోయింది.

 

ఆ తర్వాత  అప్పుడప్పుడూ కొండ దగ్గరికి వెళ్ళి జేబుల్లో నాణాలు తెచ్చుకుంటూ ఉండేవాడు. సంచి పట్టుకెళ్ళి నింపుకోవచ్చునని అతనికి తట్టలేదు. క్లాస్ పెద్దగా పనేమీ చేయకపోయినా అతనికి బాగా జరిగిపోతూ ఉండటం హాన్స్ కి ఆశ్చర్యం కలిగించింది .

 

ఒక రోజు తమ్ముడి దగ్గరికి వెళ్ళి గుచ్చి గుచ్చి అడిగాడు. ముందు ఏమీ చెప్పదలచుకోకపోయినా అన్నకి సాయం చేద్దామని క్లాస్ కి అనిపించింది. అంతా వివరంగా చెప్పాడు. తనకున్నది ఇద్దరమూ పంచుకుందామని అన్నాడు. అయితే హాన్స్ అలా తృప్తి పడే రకం కాదు. మోయగలిగినన్ని సంచులూ హేజెల్ కర్రా తీసుకుని బయల్దేరాడు.

 

మరుగుజ్జు మనిషి ఏం కావాలని అడిగితే ఆ సంచుల నిండుగా బంగారం కావాలన్నాడు.

 

” సరే, నీ ఇష్టం. అసలైనదాన్ని మటుకు మర్చిపోకు ” అని హెచ్చరించాడు.

 

ఆత్రంగా సంచులన్నీ నింపి ఒక్కొక్కటే తలుపు దగ్గరికి చేరవేశాడు. హేజెల్ కర్రని అక్కడే వదిలేశాడు. ఎంత నెట్టినా  తలుపు తెరుచుకోకపోతే అప్పుడు హాన్స్ కి కర్ర సంగతి గుర్తొచ్చింది. మరుగుజ్జు అప్పటికి దాన్ని తీసేసుకున్నాడు.

 

” నువ్వు ఎంత అడిగినా దీన్ని ఇవ్వను. నువ్వూ ఇక్కడే పడిఉండాల్సిందే ” అన్నాడు మరుగుజ్జు. అక్కడ తిండీ నీళ్ళూ ఉండవని కూడా చెప్పాడు.

 

హాన్స్ భయపడిపోయి పదే పదే  బ్రతిమాలాక అతను మాత్రం బయటికి వెళ్ళేందుకు మరుగుజ్జు తలుపు తెరిచాడు. బంగారునాణాల సంచులు ఒక్కటి కూడా తీసుకెళ్ళటానికి మరుగుజ్జు ఒప్పుకోలేదు. ప్రాణం దక్కిందే చాలనుకుని హాన్స్ బయటపడ్డాడు.

 

తమ్ముడి దగ్గరికి వెళ్ళి కర్రని పోగొట్టినందుకు క్షమించమని కాళ్ళా వేళ్ళా పడ్డాడు. క్లాస్ ముందు కొంచెం బాధపడినా కావలసినంత సంపద ఉంది కనుక అన్నని ఓదార్చాడు. క్లాస్ తన దగ్గరి డబ్బులో సగం ఇస్తానని అన్నా హాన్స్ కి సిగ్గనిపించి  తీసుకోలేదు. తనకున్నది చాలన్నాడు.

ఆ తర్వాత అన్నదమ్ములిద్దరూ బ్రతికినంతకాలం అన్యోన్యంగా జీవించారు.

 

[ Howard Pyle సేకరించి,తిరగరాసి, బొమ్మలు గీసి ప్రచురించిన fairy tales  సంకలనం Pepper and Salt నుంచి                   స్వేచ్ఛానువాదం: మైథిలి అబ్బరాజు  ]

mythili

 

 

 

 

.

Download PDF

6 Comments

  • Rekha jyothi says:

    మైథిలీ మామ్, చాలా చాలా బావుంది ఆసాంతం. మొదటి నుంచీ చివరి వరకూ ఫుల్ స్టాపుల దగ్గరకూడా ఆగాలనిపించకుండా భలే వుంది మామ్ , ముగింపు లో కధను సుఖాంతం చేసే ఓ సున్నితమైన మీ వాక్యం ఎప్పటిలానే !!
    Beautiful Mam

  • G.S.Lakshmi says:

    భలే వుందండీ కథ..

  • y.padmaja says:

    హెజెల్ కర్ర ఆకులూ కషాయం …. పిల్లలను ఆకట్టుకొనేలా కథ చాలా బావుంది

Leave a Reply to Mythili Abbaraju Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)