మన వర్తమానాన్ని గుర్తు తెచ్చే రోమన్ గతం

images0OYXY65E

Kalluri Bhaskaram-pic-a.prabhakar rao (5)

విషయం ఎక్కడినుంచి ఎక్కడిదాకా వెళ్ళిందో చూడండి….

దృష్టద్యుమ్న, ద్రౌపదల జన్మవృత్తాంతం చెప్పుకుంటూ, మాంత్రిక వాస్తవికతలోకి వెళ్ళి, అక్కడినుంచి, ఋగ్వేదంలో చెప్పిన పణులు ఫొనీషియన్లే కావచ్చునన్న కోశాంబీ ఊహను పట్టుకుని, వారితోపాటు యూదుల గురించి చెప్పుకోబోయి, అంతలో బహురూప, ఏకరూప ఆస్తికతల చర్చలోకి వెళ్ళి, రోమన్ల దగ్గరికి వచ్చాం!!!

ఓసారి వెనక్కి వెళ్ళి తొలి అడుగు ఎక్కడ వేశామో గుర్తుచేసుకోవాల్సినంతగా విషయం ఇన్ని దారులుగా చీలిపోవడం ఇదే మొదటిసారేమో! అయినా తప్పదు. నిండా మునిగాక చలేమిటి!?

ఆర్యులుగా చెప్పుకునే నోర్డిక్ జాతులవారు తరిమేస్తే, ఆసియా మైనర్(నేటి టర్కీ, దాని చుట్టుపక్కల ప్రాంతం)కు పశ్చిమంగా ఉన్న ఏజియన్లు తలోవైపుకీ చెదిరిపోయారనీ, వారిలో ఒకరైన ఎట్రూస్కన్లు ఇటలీ మధ్యభాగంలోని అడవుల్లోకి వచ్చి స్థిరపడ్డారనీ ఇంతకుముందు చెప్పుకున్నాం. ఆర్య తెగలు అక్కడికి కూడా చొచ్చుకువచ్చే నాటికి ఎట్రూస్కన్లు బలపడి రాజ్యాన్ని స్థాపించుకున్నారు.

అలా ఇటలీలోకి చొచ్చుకు వెళ్ళిన ఆర్య తెగల్లో రోమన్లు ఒకరు. వారు లాటిన్ మాట్లాడేవారు. ఎట్రూస్కన్లు ఆర్య తెగలను చాలాకాలంపాటు అణచి ఉంచారు. పురాతన కాలనిర్ణయం ప్రకారం రోమ్ నగరం క్రీ.పూ. 753లో అవతరించింది. చరిత్రకు తెలిసే నాటికి అది ఒక చిన్న వర్తక నగరం. అప్పటికి యాభై ఏళ్ల క్రితమే ఫొనీషియన్లు ఉత్తర ఆఫ్రికాలో కార్తేజ్ అనే నగరాన్ని నిర్మించుకున్నారు. పది లక్షల మంది జనాభాతో కార్తేజ్ ప్రపంచంలోనే మొట్టమొదటి అతి పెద్ద నగరం. భవిష్యత్తులో రోమ్ కూ, కార్తేజ్ కూ మధ్య ‘ప్యూనిక్ యుద్ధా’ల పేరుతో మూడు యుద్ధాలు జరిగి కార్తేజ్ రేఖాపటం మీద అదృశ్యం కాబోతోంది.

క్రీ.పూ 6వ శతాబ్ది నాటికి రోమన్లు పుంజుకుని ఎట్రూస్కన్ల రాజ్యాన్ని కూల్చేసి రోమ్ ను కులీనుల ఆధిపత్యంలో రిపబ్లిక్ గా మార్చారు. కులీన కుటుంబాలను ‘పేట్రీసియన్ల’నీ, సామాన్య ప్రజానీకాన్ని ‘ప్లెబియన్ల’నీ అనేవారు. ఇక్కడ కొంచెం ఆగి క్రీ.పూ. 6వ శతాబ్ది గురించి కొంత చెప్పుకోవాలి.

క్రీ.పూ. 6వ శతాబ్ది ప్రపంచ చరిత్రలోనే ఒక ముఖ్యమైన శతాబ్దం. ఈ శతాబ్ది గురించి హెచ్. జి. వెల్స్ ఇలా రాస్తారు:

క్రీ.పూ. 6వ శతాబ్దితో ప్రారంభించి తదుపరి శతాబ్దాలలో ప్రతిచోటా పురాతన సంప్రదాయాలు కుప్పకూలిపోయాయి. నైతికత, మేధో విచారణ(intellectual inquiry) సంబంధమైన సరికొత్త స్ఫూర్తి జనంలో అంకురించింది. ఆ స్ఫూర్తి ఆ తదుపరి కాలంలోనూ మానవాళి పురోగమనం అంతటా అంటిపెట్టుకునే ఉంది. చదవడం, రాయడం అనేవి అంతవరకు పురోహితుల గుప్తసంపదగా ఉంటూ వచ్చాయి. కానీ ఇప్పుడవి ఇతరులకూ అందుబాటులోకి వచ్చాయి. కాకపోతే, గుప్పెడు మంది పాలక తరగతికి, సంపన్నులకే పరిమితమయ్యాయి. గుర్రం ప్రయాణసాధనంగా వినియోగంలోకి రావడం, రోడ్ల నిర్మాణం జరగడంతో రాకపోకలు పెరిగాయి. వర్తక లావాదేవీలను మరింత సులభతరం, సరళం చేస్తూ నాణేల రూపంలో డబ్బు వినిమయం అడుగుపెట్టింది.

ఈ నేపథ్యంలో బలపడిన రోమ్, మానవాళి చరిత్రలోనే మహత్తరమైన ఈ పరిణామ క్రమాన్ని మరింత ముందుకు తీసుకెళ్లింది.

ఇక్కడే రేఖామాత్రంగా ఒక అంశాన్ని స్పృశించి ముందుకు వెడతాను. పురాతన నాగరికతల అంతటా ప్రసరించినట్టే క్రీ.పూ. 6వ శతాబ్ది ప్రభావం మనదేశం మీదా ప్రసరించింది. బౌద్ధ, జైనాలు అప్పుడే పుట్టాయి. అయితే, పాశ్చాత్య సమాజంలో ఆ ప్రభావం ఒక క్రమగతిలో అభివృద్ధి చెందుతూ తార్కికాంతానికి చేరుకుంటున్నట్టు కనిపిస్తే, మన దేశంలో మాత్రం అది స్తంభించడమే కాకుండా తిరోగమనం పట్టినట్టు అనిపిస్తుంది. ఆ స్తంభన నేటి 21వ శతాబ్ది నాటికి కూడా అలాగే ఉందనిపిస్తుంది. కనీసం మత, తాత్విక రంగాలకు పరిమితమై చెప్పుకున్నా భారత్ ఇంకా క్రీస్తుశకంలోకి రాలేదన్న నా సూత్రీకరణకు ఇది కూడా ఒక దోహదాంశం కావచ్చు. ప్రస్తుతానికి మరీ లోతులోకి వెళ్లకుండా ఈ ప్రస్తావనను ఇక్కడితో వదిలేస్తాను.

రోమ్ అనేక కొత్త పోకడలకు ప్రారంభాన్ని ఇచ్చింది. అనేక విషయాలలో చరిత్రను తిరగరాసింది. మత,తాత్విక రంగాలలో అవి ఎలాంటివో చెప్పుకునే ముందు లౌకిక రంగంలో ఏం చేసిందో చెప్పుకుందాం:

రోమ్ కు ముందు పురాతన నాగరికతలలో పరిపాలనా రూపం భిన్నంగా ఉండేది. ఒక వీరుడు లేదా విజేత ఒక నగరరాజ్యాన్ని పాలించేవాడు. ఆ నగరం ఒక గుడి కేంద్రంగా అభివృద్ధి చెందినదయ్యుండేది. ఆ గుళ్ళో ఒక వ్యవసాయదేవత కొలువై యుండేది. ఇందుకు భిన్నంగా రోమన్లది మొదట్లో వ్యక్తికేంద్రిత పాలన కాక, పౌర కేంద్రిత పాలన. ఆర్యులు అప్పటికింకా గణతంత్ర(రిపబ్లిక్) వ్యవస్థలోనే ఉన్నారు. ఆవిధంగా చరిత్రలోనే మొదటిసారిగా ఆర్యుల గణతంత్ర విధానంలో విశాలప్రాంతాన్ని ఏలినవారు రోమన్లు!

గణతంత్రం అన్నప్పుడు మోర్గాన్ ను కూడా కలిపి చెప్పుకుంటే తప్ప రోమన్ల గురించి పూర్తిగా చెప్పుకున్నట్టు కాదు. ఆధునిక చరిత్ర శిక్షణకు చెందిన హెచ్. జి. వెల్స్ లాంటి చరిత్రకారులు సాధారణంగా ఆ కోణంలోకి వెళ్లరు. అసలు విషయానికి మరింత దూరమైపోతాం కనుక మనమూ ఇప్పుడు అందులోకి వెళ్లలేం. అదలా ఉంచితే, చరిత్రకారులు రోమన్ విస్తరణను నాలుగు దశలుగా వర్గీకరించారు. మొదటిది, క్రీ.పూ. 390తో రోమ్ ను గాల్స్ ఆక్రమించుకోవడంతో మొదలై, క్రీ.పూ. 240లో తొలి ప్యూనిక్ యుద్ధంతో ముగుస్తుంది. ఆ దశను ‘ఏకీకరణ గణతంత్రం (Assimilative Republic) అన్నారు. అంతకుముందు చాలా కాలంనుంచీ కులీనులకు, సామాన్యులకూ మధ్య కొనసాగుతున్న ఘర్షణ ఈ దశకు చేరే నాటికి తగ్గుముఖం పట్టి ఒక రాజీ ఏర్పడింది. ఈ దశలో మరీ సంపన్నులూ లేరు, మరీ పేదలూ లేరు. ఇది స్వేచ్చా స్వాతంత్ర్యాలు కలిగిన రైతుల గణతంత్రం. ఈ రైతులు వ్యవసాయం చేస్తూనే అవసరమైనప్పుడు సైనిక విధులు నిర్వర్తించేవారు. ఈ దశలో రోమ్ కేవలం ఇరవై చదరపు మైళ్ళ విస్తీరణం కలిగిన చిన్న నగరం. అదే పరిపాలనా కేంద్రం. రోమన్లు జయించిన నగరాలలోని పౌరులకు కూడా వోటు హక్కు ఉండేది. వాటిలో కొన్నింటికి స్వయంపాలన స్వేచ్చ ఉండేది. అలాగే వర్తక స్వేచ్చ, రోమన్లతో వివాహసంబంధం కల్పించుకునే స్వేచ్ఛ ఉండేవి. రోమన్లు కీలక ప్రాంతాలలోనూ, వలసలలోనూ పౌరస్థావరాలను ఏర్పాటు చేసేవారు. ఈ విధానాల ఫలితంగా ఓడిపోయిన నగరాలలోని పౌరులు కూడా క్రమంగా రోమన్లుగా మారిపోయారు. పెద్ద యెత్తున రోడ్ల నిర్మాణం జరిగింది. మొత్తం ఇటలీ అంతటా లాటినీకరణ జరిగింది. క్రీ.పూ. 89 నాటికి ఇటలీలోని స్వతంత్రపౌరులు అందరూ రోమ్ నగరపౌరులుగా గుర్తింపు పొందుతున్నారు. విశేషమేమిటంటే, రోమన్ గణతంత్రం ఎంత దూరం విస్తరించినా సరే, విస్తరించిన మేరా అది ఒక పెద్ద నగరం మాత్రమే. క్రీ. శ, 212 నాటికి రోమన్ గణతంత్రంలోని సుదూర ప్రాంతంలో ఉన్న ప్రతి స్వంతంత్ర పౌరుడితో సహా అందరికీ రోమ్ నగరంలో పౌరసత్వం ఉంది. అంటే వాళ్ళు అవసరమైనప్పుడు రోమ్ నగరానికి వెళ్ళి అక్కడి టౌన్ హాల్ లో జరిగే వోటింగ్ లో పాల్గొనవచ్చు. అయితే, ఒక షరతు… వాళ్ళు అక్కడికి వెళ్లగలిగి ఉండాలి!

ఇది రాస్తున్నప్పుడు, మన దేశంలో కూడా, అప్పటికి గణతంత్రదశలో ఉన్న ఆర్యుల విస్తరణ సరిగ్గా ఇలాగే జరిగిందా అని నాకు అనిపిస్తోంది. కొన్ని పోలికలూ గుర్తుకొస్తున్నాయి. మరో సందర్భానికి దానిని వాయిదా వేద్దాం.

రోమన్లు తమ ఏలుబడిలో ఉన్న అన్ని నగరాలకు, ప్రాంతాలకు పైన చెప్పిన విధంగా పౌరసత్వాన్ని విస్తరింపజేయడం; రాజ్య విస్తరణలో అంతవరకూ ఎరగని ఒక విశేష ప్రక్రియ. వెనకటి పాలకులు అనుసరిస్తూ వచ్చిన ప్రక్రియను రోమన్లు పూర్తిగా తల కిందులు చేశారు. ఎలాగంటే, వెనకటి పాలకులు ఏ ప్రాంతాన్ని అయినా జయించినప్పుడు వాళ్ళే ఓడిపోయిన జనంలోనూ, వాళ్ళ సంస్కృతిలోనూ, ఆరాధనా పద్ధతులలోనూ కలసిపోయేవారు. ఇందుకు భిన్నంగా రోమన్లు ఓడిపోయిన జనాన్నే తమలోకి, తమ పద్ధతులలోకి కలుపుకున్నారు. ఇది గుర్తుపెట్టుకోవలసిన ముఖ్య వివరం. దీనితో కూడా మన దేశ అనుభవానికి పోలిక ఉంది.

ఇక, మొదటి ప్యూనిక్ యుద్ధం ముగిశాక రోమన్లు తమ విస్తరణలో రెండవ దశలోకి అడుగుపెట్టారు. సీసిలీని జయించడం దీనికి ప్రారంభం. సిసిలీ మంచి సారవంతమైన నేల. అక్కడి జనం చెమటోడ్చి పనిచేసేవారు. దాంతో ఆ ప్రాంతం రోమ్ ను మరింత సంపన్నం చేయగల అవకాశం కనిపించింది. దాంతో, దానిని రోమన్ ప్రజల ‘ఎస్టేట్’ గా ప్రకటించారు. కులీనులలో, సామాన్యులలో కూడా మంచి పలుకుబడి, స్థోమత ఉన్నవారు సిసిలీ అందించే సంపదలో పెద్ద వాటా కొల్లగొట్టారు. ఈ అనుభవం మనకు ఈనాడు బాగా తెలిసిన వలసవాదాన్ని గుర్తుచేస్తుంది. ఇదే సమయంలో యుద్ధాలు పెద్ద సంఖ్యలో బానిసలనూ అందించాయి. బానిసల ప్రవేశంతో వ్యవసాయోత్పత్తి బాగా పెరిగింది. ఎస్టేట్లు, బానిసవ్యవస్థ గణతంత్ర స్వభావాన్ని మార్చాయి. ఈ పరిణామక్రమంలో చితికిపోయింది సామాన్యులు. వారు వ్యవసాయం చేస్తూనే సైనికవిధులు నిర్వర్తించేవారని చెప్పుకున్నాం. వారు యుద్ధాలనుంచి తిరిగి వచ్చేసరికి వ్యవసాయం మూలపడి ఉండేది. వ్యవసాయోత్పత్తిలో వాళ్ళు బానిసలతో పోటీ పడాల్సివచ్చేది. ఆ క్రమంలో వారు రుణగ్రస్తులయ్యేవారు. సిసిలీ రోమ్ చేతుల్లోకి వెళ్ళినట్టే సామాన్య రైతులు వడ్డీ వ్యాపారుల చేతుల్లోకి వెళ్లారు. అంతకు ముందు ఈ సైనిక రైతులు ప్రభుత్వంలో వాటా కోసం రెండువందల ఏళ్ళు పోరాడారు. ఆ తర్వాత వందేళ్లపాటు ప్రభుత్వంలో వాటాతోపాటు అన్ని హక్కులూ అనుభవించారు. మొదటి ప్యూనిక్ యుద్ధం వాటన్నింటినీ హరించివేసి పరిస్థితిని మొదటికి తెచ్చింది. దీనిని సాహసిక సంపన్నుల గణతంత్రం (Republic of Adventurous Rich Men) అన్నారు.

ఇక్కడ కూడా పురాకాలం నుంచి చరిత్రకాలం వరకూ మన దేశం పొందిన అనుభవాలతో పోలికలు నాకు గుర్తుకొస్తున్నాయి…

ఇక్కడొకసారి రోమన్ గణతంత్ర సభల గురించి చూద్దాం. ఇప్పుడు మన ప్రజాస్వామ్యంలో ఉన్నట్టే అప్పుడు కూడా రెండు సభల వ్యవస్థ ఉండేది. మొదటిదీ, ముఖ్యమైనదీ సెనేట్. ఇందులో కులీనులు, ఆయా రంగాలకు చెందిన ప్రముఖులు సభ్యులుగా ఉండేవారు. ఇది స్వభావంలో నేటి అమెరికన్ సెనేట్ కు కన్నా బ్రిటిష్ హౌస్ ఆఫ్ లార్డ్స్ కు దగ్గరగా ఉంటుంది. ప్యూనిక్ యుద్ధాలనుంచీ మూడువందల సంవత్సరాలపాటు సెనేటే రోమన్ల రాజకీయ చింతనకు, క్రియాశీలతకు కేంద్రంగా ఉండేది. ఇక రెండవ సభ అసెంబ్లీ. సూత్రరీత్యా రోమ్ లోని పౌరులందరూ ఇందులో సభ్యులే. రోమ్ కేవలం ఇరవై చదరపు మైళ్ళ విస్తీర్ణంతో ఉన్న తొలి రోజుల్లో ఈ సభ సమావేశాలు తగిన హాజరుతో అర్థవంతంగా జరిగేవేమో. కానీ, రోమ్ ఇటలీ సరిహద్దులను కూడా దాటిపోయి విస్తరించిన తర్వాత ఈ సభ దాదాపు తంతుగానూ, అలంకారప్రాయంగానూ మారిపోయింది. కొమ్ము బూరాలు ఊది ఈ సభ సమావేశమవుతున్నట్టు ప్రకటించేవారు. పని పాటలు లేనివాళ్లతోనూ, అల్లరిచిల్లరి వాళ్లతోనూ సభ నిండిపోయేది. అదే క్రీ.పూ. నాలుగవ శతాబ్దిలో అయితే సెనేట్ మీద అసెంబ్లీ తగుమేరకు అంకుశంలా పనిచేసేది. సామాన్య ప్రజానీకం తమ హక్కులను ఉద్ఘాటించుకోడానికి అందులో తగినంత ప్రాతినిద్యం ఉండేది. ప్యూనిక్ యుద్ధాలు ముగిసే నాటికి ఈ సభపై ప్రజల నియంత్రణ అదృశ్యమైపోయింది. దాంతో గుప్పెడుమంది ప్రముఖులది ఇష్టారాజ్యమైంది.

రెండో ప్యూనిక్ యుద్ధం ముగిసేనాటికి సామాన్యుడి పరిస్థితి మరింత దిగజారిపోయింది. ఒక్కోసారి ఉన్న వ్యవసాయభూమినీ కోల్పోయి మరింత పేదరికంలోకి జారిపోయాడు. రాజకీయ అధికారం, ప్రాతినిధ్యం లోపించడంతో సమ్మె, తిరుగుబాటు రూపంలో వారు తమ నిరసనను చాటుకోవలసి వచ్చింది. ఎస్టేట్లను రద్దుచేయాలనీ, తమ భూముల్ని తిరిగి తమకు ఇవ్వాలనీ రుణాలను పూర్తిగా కానీ, పాక్షికంగా కానీ మాఫీ చేయాలని కోరుతూ చేసిన ఈ సమ్మెలూ, తిరుగుబాట్లూ ఫలించకపోగా అణచివేతను మరింత తీవ్రం చేశాయి. మరోవైపు, క్రీ.పూ. 73లో స్పార్టకస్ నాయకత్వంలో బానిసలు తిరగబడ్డారు. వాళ్ళలో కొందరు గ్లాడియేటర్లుగా పోరాటశిక్షణ పొందినవారు కనుక ఈ తిరుగుబాటు కొంత ప్రభావం చూపినా రెండేళ్లలో దానిని అత్యంత క్రూరంగా అణచివేశారు. స్పార్టకస్ ను ఓడించడంలో క్రాసస్ అనే సేనాని ప్రముఖ పాత్ర పోషించాడు. రోమ్ కు దక్షిణంగా ఉన్న అప్పియన్ వే అనే రహదారి పొడవునా ఆరువేలమంది స్పార్టకస్ అనుయాయులను కొరతవేసి చంపారు.

images0OYXY65E

పైన చెప్పిన రైతుల సంక్షోభంలో కూడా వర్తమాన భారతీయ ప్రతిబింబాన్ని స్పష్టంగా చూడచ్చు….’ఎస్టేట్లు’, రైతులు భూముల్ని కోల్పోవడం నేటి ‘సెజ్’ లనూ, భూసేకరణ రూపంలో నేటి భారతీయ రైతులు కోల్పోతున్న భూముల్ని గుర్తుచేయచ్చు. అలాగే వ్యవసాయంలో పోటీని ఎదుర్కోలేక చితికిపోతున్న నేటి రైతులూ, వాళ్ళ రుణ మాఫీ డిమాండ్లూ, ఆమేరకు ప్రభుత్వాల హామీలూ వగైరాలు కూడా.

ఇప్పటినుంచీ రోమ్ విస్తరణలో మూడవ దశ మొదలైంది. దానిని సైనిక నాయకుల గణతంత్రం(Republic of the Military Commanders) అన్నారు. ఇదెలా జరిగిందంటే, రెండో ప్యూనిక్ యుద్ధానికి ముందువరకు రైతులే సైనిక విధులు నిర్వర్తించేవారు. తమ స్తోమతను బట్టి ఆశ్వికదళంలోనో, పదాతి దళంలోనో చేరి యుద్ధం చేసేవారు. సమీపంలో జరిగే యుద్ధాలకు ఈ ఏర్పాటు సరిపోయేది. కానీ రోమ్ విస్తరిస్తూ దూర దూర ప్రాంతాలలో యుద్ధాలు చేయవలసివచ్చినప్పుడు ఈ సేన సరిపోలేదు. దానికితోడు, బానిసల సంఖ్య, ఎస్టేట్లు పెరిగిపోయి తమ అస్తిత్వాన్ని, ఆత్మగౌరవాన్ని దెబ్బ తీయడంతో రోమ్ కోసం యుద్ధం చేయాలన్న ఉత్సాహం కూడా రైతుల్లో క్షీణించింది. దాంతో, కిరాయి సేనను సమకూర్చుకోవలసిన అవసరం తలెత్తింది. సామాన్యప్రజల్లోంచి వచ్చిన మారియెస్ అనే సేనాని ఆ దిశగా మొట్టమొదటి అడుగువేశాడు.

ఉత్తర ఆఫ్రికాలోని పరిస్థితులు అందుకు కారణమయ్యాయి. రోమన్లు కార్తేజ్ ను కుప్పకూల్చాక జుగర్తా అనే అతను అక్కడ ఒక అర్థఆటవిక రాజ్యాన్ని నెలకొల్పి రోమ్ ను ముప్పుతిప్పలు పెట్టాడు. అతన్ని అణగదొక్కే బాధ్యతను రోమన్ సెనేట్ మారియెస్ కు అప్పగించింది. ఆ ప్రయత్నంలో మారియెస్ కిరాయి సేనను సమకూర్చుకుని, శిక్షణ ఇచ్చి జుగార్తాపై విజయం సాధించాడు. ఆ తర్వాత అసలు కథ మొదలైంది. తన కిరాయి సేన అండతో మారియెస్ ఏకు మేకయ్యాడు. సెనేట్ తో సహా రోమ్ లోని ఏ శక్తీ అతన్ని దారికి తేలేకపోయాయి. కులీన వర్గానికి చెంది, జుగర్తాపై యుద్ధంలో మారియెస్ కింద పనిచేసిన శుల్లా అనే సేనానికి మారియెస్ ను అణిచే బాధ్యతను అప్పగించారు. వాళ్ళిద్దరికీ జరిగిన యుద్ధాలలో రెండువైపులా అనేకమంది రాజకీయప్రత్యర్థులను ఊచకోత కోశారు. వేలాదిమందికి మరణశిక్ష అమలు చేశారు. ఎస్టేట్లను అమ్మేశారు. ఒక పక్క వీరిద్దరి అంతర్యుద్ధం, మరోపక్క స్పార్టకస్ తిరుగుబాటు రోమ్ ను సైనిక గణతంత్రం వైపు బలమైన అడుగులు వేయించాయి. లుకల్లస్, పాంపే ‘ది గ్రేట్’, క్రాసస్, జూలియెస్ సీజర్ మొదలైన మహా సేనానుల పేర్లు తెరమీదికి వచ్చాయి. లుకల్లస్ ఆసియా మైనర్ ను జయించి, ఆర్మేనియాలోకి కూడా చొచ్చుకు వెళ్ళి, అంతులేని ప్రైవేట్ సంపదతో విశ్రాంతజీవితం గడిపాడు. స్పార్టకస్ తిరుగుబాటును అణిచేసిన క్రాసస్ పర్షియా మీద దాడి చేసి అక్కడి పార్థియన్ల చేతిలో ఓడిపోయి హతుడయ్యాడు. ఆ తర్వాత పాంపే, సీజర్ల మధ్య శత్రుత్వానికి తెరలేచింది. కాస్పియన్ సముద్రం వరకూ విస్తరించిన రోమన్ అధికారాన్ని పటిష్టం చేయడంలో పాంపే ప్రధాన పాత్ర పోషించాడు. గాల్ (ఇప్పుడు ఫ్రాన్స్, బెల్జియెం లు ఉన్న ప్రాంతం) మీద జెర్మన్ల దాడిని తిప్పికొట్టి, దానిని రోమన్ అధికారం కిందికి తెచ్చిన సేనానిగా సీజర్ ప్రసిద్ధిలోకి వచ్చాడు. అతను బ్రిటన్ లోకి కూడా రెండుసార్లు చొచ్చుకు వెళ్ళాడు కానీ దాని స్వాధీనానికి ప్రయత్నించలేదు.

ఇదంతా జరుగుతున్న క్రీ.పూ. మొదటి శతాబ్ది మధ్యనాటికి కూడా రోమన్ సెనేట్ నామమాత్రంగా నైనా అధికార కేంద్రంగా కొనసాగుతూనే ఉంది. ఆయా పదవుల్లో నియామకాలు దాని ద్వారానే జరుగుతున్నాయి. అందులోని సభ్యులు గణతంత్ర సంప్రదాయాలను, చట్టాలను పరిరక్షించడానికి పంటిబిగువు పోరాటం చేస్తూనే ఉన్నారు. వాళ్లలో ప్రసిద్ధమైన పేరు-సిసిరో. అయితే, రైతులు చితికిపోవడంతో పౌరసత్వస్ఫూర్తి అంతరించి పోయింది. క్రాసస్ జీవించి ఉన్నప్పుడు అతనూ, పాంపే, సీజర్ ‘త్రిమూర్తులు’గా అవతరించి, సెనేట్ ను నామ మాత్రం చేసి, రోమ్ సామ్రాజ్యాన్ని మూడు ముక్కలుగా పంచుకుని శాసిస్తూ వచ్చారు. క్రాసస్ మరణించిన తర్వాత పాంపే, సీజర్ రంగం మీద మిగిలారు. వారిద్దరి ఘర్షణలో పాంపే సెనేట్ పక్షం వహించి, చట్ట ఉల్లంఘనకు పాల్పడ్డాడన్న ఆరోపణతో సీజర్ ను విచారణకు రప్పించేలా ఉత్తర్వులు జారీ చేయించాడు.

నాటి నిబంధనల ప్రకారం, ఏ సేనానీ తన అధికార పరిధిలోని ప్రాంతాన్ని దాటి ముందుకు రావడానికి వీల్లేదు. సీజర్ అధికార ప్రాంతానికీ, ఇటలీకీ మధ్య సరిహద్దు రుబికాన్ అనే ప్రదేశం. ‘విజయమో వీర స్వర్గమో’ అన్న నినాదంతో సీజర్ ఆ హద్దును దాటి పాంపే మీదికి, రోమ్ మీదికి యుద్ధానికి (క్రీ.పూ. 45లో) వెళ్ళాడు. ఆ యుద్ధంలో విజయం సాధించాడు. సైనిక సంక్షోభ సమయాల్లో ‘నియంత’ను ఎన్నుకుని అతనికి అపరిమిత అధికారాలిచ్చే సంప్రదాయం అప్పటికే రోమ్ లో ఉండేది. దానిని అనుసరించి పదేళ్ళ కాలపరిమితికి సీజర్ ను నియంతగా ఎన్నుకున్నారు. అయితే ఆ తర్వాత సీజర్ దానిని శాశ్వత నియామకంగా మార్పించుకున్నాడు. రోమన్లు ఎంతో అసహ్యించుకునే ‘రాజు’ అనే మాట కూడా ఆ సందర్భంలో వినిపించింది. రాజు కావడానికి సీజర్ ఒప్పుకోకపోయినా, సింహాసనాన్నీ, రాజదండాన్నీ మాత్రం స్వీకరించాడు. ఆ తర్వాత అతను ఈజిప్టు వెళ్ళి గ్రీకు టోలెమీ వంశానికి చెందిన ఆఖరి ఏలిక అయిన క్లియోపాత్రా ప్రేమలో పడ్డాడు. ఈజిప్టులో రాజును, లేదా రాణిని అక్షరాలా దైవంగానే కొలుస్తారు కనుక సీజర్ ఆ భావనను రోమ్ కు వెంటబెట్టుకుని వచ్చాడు. ఒక దేవాలయాన్ని నిర్మించి అందులో సీజర్ విగ్రహాన్ని ప్రతిష్టించి ‘అజేయుడైన దేవుడు’ అని రాయించిన ఒక శిలాఫలకాన్ని అక్కడ ఉంచారు. ఆరిపోతున్న దీపం లాంటి రోమ్ గణతంత్రస్ఫూర్తి ఒక్కసారిగా నిరసన రూపంలో భగ్గుమంది. సెనేట్ లో సరిగ్గా పాంపే విగ్రహం పాదాల దగ్గరే సీజర్ ను కత్తితో పొడిచి హత్య చేశారు. సీజర్ తోనే రోమ్ తన విస్తరణలో నాలుగవ దశ అయిన ‘సామ్రాజ్య’దశ (Empire) వైపు తొలి అడుగులు వేసింది.

ఆ తర్వాత పదమూడేళ్లకు సీజర్ దగ్గరి బంధువు ఆక్టేవియన్ సీజర్, మార్క్ ఆంటోనీ అనే ప్రత్యర్థిపై విజయం సాధించి రోమ్ పై ఆధిపత్యాన్ని సాధించాడు. అయితే అతను దేవుడిగా, రాజుగా ఉండడానికే కాదు సరికదా, నియంతగా ఉండడానికి కూడా ఒప్పుకోలేదు. సెనేట్ ప్రతిపత్తిని, ప్రజల స్వేచ్చా, స్వాతంత్ర్యాలను అతను పునరుద్ధరించాడు. అందుకు కృతజ్ఞతగా సెనేట్ అతనిని రాజు అనకపోయినా దానికి సమానమైన ‘ప్రిన్సెపెస్’, ‘అగస్టస్’ అనే బిరుదులతో గౌరవించింది. అగస్టస్ సీజర్ తొలి రోమన్ చక్రవర్తి అయ్యాడు.

అగస్టస్ వల్ల సెనేట్ తిరిగి ఊపిరి పోసుకున్నట్టు కనిపించినా అది తాత్కాలికమే అయింది. క్రమంగా రోమన్ చరిత్రలోంచి సెనేట్ అదృశ్యమైపోయింది. దాని స్థానాన్ని చక్రవర్తి, అతని అధికారులూ భర్తీ చేశారు. క్రమంగా రోమ్ విస్తరణా ఆగిపోయింది.

***

రోమ్ సైనిక నియంతృత్వానికి మళ్లిన తీరులో బహుశా పాకిస్తాన్ అనుభవం గుర్తుకువస్తూ ఉండచ్చు…

అదలా ఉంచితే, ‘ఈ రోమ్ చరిత్ర అంతా మాకు చెప్పాలా, మేము పుస్తకాలలో చదువుకోలేమా’ అని పాఠకులలో కొందరైనా అనుకుంటూ ఉంటారన్న శంక ఇది రాస్తున్నంతసేపూ నన్ను వేధిస్తూనే ఉంది. అయితే, ఒక ఊరటా లేకపోలేదు. అదేమిటంటే, రోమ్ పరిణామాల అద్దంలో భారతదేశ ప్రతిఫలనం గురించి మధ్య మధ్య సూచిస్తూ రావడం! అలాగే ఒకనాటి గణతంత్రం విచ్ఛిన్నమై ఏకవ్యక్తి పాలనకు దారి ఇచ్చిన క్రమాన్నీ ఇందులో స్పష్టంగా చూడచ్చు. ఇవి నా భవిష్య వ్యాసాలలో ఉపయోగించుకోదగిన ముఖ్యమైన మార్కింగులూ కావచ్చు.

 

 

 

 

 

 

 

 

Download PDF

3 Comments

  • చరిత్రలో చదువుకున్నా మీరు చెబుతున్న తీరులో పరిణామ క్రమాన్ని తెలుసుకోవడం చాలా బాగుంది.
    చాలా అద్భుతంగా వుండి మీ తర్వాతి వ్యాసం ఎప్పుడొస్తుందా అని ఎదురుచూస్తున్నాను.

  • kalluri bhaskaram says:

    థాంక్స్ ప్రసాద్ గారూ…

  • Dileep.M says:

    Please tag this article to ~ కల్లూరి భాస్కరం . It is required to find all the posts of this author.

ఒక వ్యాఖ్యను

Your email address will not be published. Required fields are marked *

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)